తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌మళ్లీ జాతీయ రాజకీయాల గురించి చర్చను లేవనెత్తారు. అయితే, ఈ సారి మాత్రం ఆయన వ్యూహంలో ఓ ప్రత్యేకత కనిపించింది. ఇన్నాళ్లు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ లక్ష్యంగా విమర్శలు కురిపించడం, ఆయా రాష్ట్రాల్లో బీజేపీయేతర పార్టీల ముఖ్యనేతలతో భేటీలు కావడం వంటివి చేశారు. సందర్భం దొరికినప్పుడల్లా, అవకాశం చిక్కినప్పుడల్లా బీజేపీపైనా, ప్రధాని నరేంద్రమోదీపైనా విమర్శల వర్షం కురిపించారు. ఇప్పుడు మాత్రం ఏకంగా జాతీయ పార్టీ ఏర్పాటుకు సంబంధించి సంకేతాలు ఇచ్చారు. అంతేకాదు, కొన్ని అనూహ్యమైన, ఆసక్తికర పరిణామాలను కూడా సృష్టించారు.

వాస్తవానికి దాదాపు ఐదారేళ్ల నుంచే కేసీఆర్‌ ‌జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పుతానంటూ, థర్డ్ ‌ఫ్రంట్‌ అం‌టూ హడావిడి చేస్తున్నారు. కానీ, ఎప్పుడూ దానిని సీరియస్‌గా తీసుకున్న దాఖలాలు కనిపించ లేదు. అప్పుడప్పుడూ ఈ అంశంపై మాట్లాడటం, బహిరంగ సభల్లో ప్రస్తావించడం, కొన్నిసార్లు ఆయా రాష్ట్రాలకు వెళ్లి బీజేపీయేతర పార్టీల నేతలను, రాష్ట్ర ప్రభుత్వాల అధినేతలను కలవడానికే పరిమిత మయ్యారు. మొన్నటికి మొన్న కూడా ఉత్తర భారత పర్యటన, కర్ణాటక, మహారాష్ట్ర యాత్ర పేరిట కేసీఆర్‌ ‌హల్‌చల్‌ ‌చేశారు. ఉత్తరాది టూర్‌ను అర్ధాంతరంగా ముగించుకున్నారు. షెడ్యూల్‌ను మార్చుకొని హైదరాబాద్‌ ‌నుంచి కర్ణాటక వెళ్లి వచ్చారు. అయితే, ఈ పర్యటనలో కేసీఆర్‌ ఓ ఆసక్తికర ప్రకటన చేశారు. త్వరలోనే సంచలన ప్రకటన ఉంటుందని రాజకీ యంగా చర్చను లేవనెత్తారు. ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు చూస్తే కేసీఆర్‌ ‌చేయదలచుకున్న సంచలన ప్రకటన ఇదే అయి ఉంటుందని విశ్లేషకులు అంచనాకు వచ్చారు.

ఇటీవల మంత్రులు, ముఖ్యనేతలతో ప్రగతి భవన్‌లో భేటీ అయిన కేసీఆర్‌.. ‌చాలాసేపు మంతనాలు సాగించారు. ఐదు గంటలకు పైగా సాగిన ఆ సమావేశంలోనే జాతీయ పార్టీ అంశానికి సంబంధించిన చర్చను లేవనెత్తారు. అంతేకాదు, ఆ సమావేశంలో పాల్గొన్న వాళ్ల అభిప్రాయాలు అడిగారు. తర్వాత అయినా అభిప్రాయాలు వెల్లడించాలని సూచించారు. అయితే, కొత్తగా పార్టీ పెట్టే బదులు తెలంగాణ రాష్ట్ర సమితినే జాతీయ పార్టీగా ప్రకటించవచ్చన్న ప్రతిపాదన వచ్చింది. కానీ, టీఆర్‌ఎస్‌కు సంబంధం లేకుండా కొత్త పార్టీని స్థాపించాల్సిన అవసరం ఉందని సీఎం కేసీఆర్‌ అభిప్రాయపడ్డట్లు తెలిసింది. దేశంలో బీజేపీ పాలనలో నష్టాలు జరుగుతున్నాయని, ఆ పార్టీ వల్ల ప్రయోజనం లేదని విమర్శించిన కేసీఆర్‌.. ‌విపక్ష హోదాలో కాంగ్రెస్‌ ‌పార్టీ కూడా బీజేపీని నిలువ రించడంలో విఫలమైందని అభిప్రాయపడ్డారు. అందుకే దేశ ప్రజల కోసం ప్రత్యామ్నాయ రాజకీయ పార్టీ ఏర్పాటు చేసే పరిస్థితి ఏర్పడిందని వ్యాఖ్యా నించారు. వివిధ పార్టీలను ఏకంచేసి రాష్ట్రపతి ఎన్నికలో ఎన్డీయే అభ్యర్థిని ఓడించడం ద్వారా బీజేపీకి గుణపాఠం చెప్పవచ్చని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అభిప్రాయపడ్డారు.

జాతీయ స్థాయిలో నెలకొల్పనున్న కొత్త పార్టీకి జై భారత్‌, ‌నయాభారత్‌, ‌భారత్‌ ‌రాష్ట్రీయ సమితి వంటి పేర్లు ఎలా ఉంటాయన్న అంశంపై చర్చ జరిగింది. పార్టీ పేరు, జెండా, ఎజెండా వంటి అంశాల కూర్పును గురించి కూడా కేసీఆర్‌ ‌నేతల అభిప్రాయాలు కోరారు. ఒకవేళ కొత్త పార్టీ పెడితే పేరు మాత్రం టీఆర్‌ఎస్‌కు సామీప్యంగా ఉండేలా.. భారత్‌ ‌రాష్ట్రీయ సమితి (బీఆర్‌ఎస్‌) ‌ఖరారు చేయవచ్చన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కేసీఆర్‌ ‌కూడా ఈ పేరుకే మొగ్గుచూపినట్లు సమాచారం. అంతేకాదు, ఈ పార్టీని దేశ రాజధాని ఢిల్లీలో ప్రకటించాలన్న ఆలోచనను కూడా నేతలతో పంచుకున్నారు ఆయన.

తెలంగాణపై ప్రత్యేక దృష్టి సారించిన భారతీయ జనతాపార్టీ అధిష్టానం వచ్చే నెల మొదటివారంలో జాతీయ కార్యవర్గ సమావేశాలను హైదరాబాద్‌లో నిర్వహించేందుకు ప్రణాళిక రూపొందించింది. ఆ సమావేశాలు బీజేపీకి దక్షిణాదిలో ప్రాధాన్యాన్ని పెంచేలా జరగనున్నాయి. దేశం నలుమూలల నుంచీ భారతీయ జనతాపార్టీ ముఖ్యనేతలు ఈ సమావేశా నికి తరలివస్తారు. అంతేకాదు.. బీజేపీకి చెందిన కేంద్రమంత్రులు అందరూ ఈ సమావేశాల్లో పాల్గొంటారు. అంటే సమావేశాలు జరిగే మూడు రోజుల పాటు హైదరాబాద్‌ ‌కాషాయమయం అయిపోతుందన్నమాట. అయితే, ఇదే సందర్భంలో కేసీఆర్‌ ‌కొత్త వ్యూహం అమలు చేయనున్నట్లుగా విశ్లేషకులు చెబుతున్నారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరగకముందే.. ఈ నెలాఖరులోనే ఢిల్లీ వెళ్లి జాతీయ పార్టీగా భారత్‌ ‌రాష్ట్రీయ సమితిని ప్రకటించే అవకాశాలున్నాయని చెబుతున్నారు. కేసీఆర్‌, ‌టీఆర్‌ఎస్‌ ‌శ్రేణులు ఈ మేరకు లీకులు ఇస్తున్నప్పటికీ.. గతంలో మాదిరిగానే కొన్నాళ్లు హడావిడి చేసేందుకు మాత్రమే ఈ ప్రచారం చేయించారన్న చర్చ కూడా జోరుగానే సాగుతోంది.

 జాతీయ పార్టీ ఏర్పాటు కసరత్తులో మునిగి పోయిన కేసీఆర్‌ ఎం‌తవరకు విజయం సాధించ వచ్చు? అన్న చర్చ దేశవ్యాప్తంగా జరుగుతోంది. తెలంగాణలో ఉద్యమ నేపథ్యం, ప్రజల భావోద్వే గాలు, పార్టీ ఆవశ్యకత, ప్రత్యేక రాష్ట్రం ఆకాంక్ష, ఈ ఆకాంక్ష కోసం పోటీగా మరే పార్టీ లేకపోవడం వంటి అనేక అంశాలు టీఆర్‌ఎస్‌కు కలిసివచ్చాయి. అందుకే కొత్త రాష్ట్రం ఆవిర్భావం తర్వాత ఒకటి కాదు, రెండుసార్లు తెలంగాణ రాష్ట్రసమితి అధికారాన్ని చేజిక్కించుకుంది. కానీ, జాతీయ స్థాయిలో అలాకాదు. ప్రజల ఆలోచనతీరు భిన్నంగా ఉంటుంది. విభిన్న మనస్తత్వాలు, వేర్వేరు ఆకాంక్షలు, అనేక అభిప్రాయ భేదాలు ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయి. తెలంగాణ ప్రజలను ఎన్నికల వేళ ‘లోకల్‌’ అన్న సెంటిమెంట్‌ ‌మాయలో పడేసే కేసీఆర్‌, ‌మిగతా రాష్ట్రాల ప్రజలను తనకు అనుకూలంగా మార్చుకోవడం అంత సులభం కాదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. కేసీఆర్‌ ‌జాతీయ స్థాయిలో విజయం సాధించడం నల్లేరు మీద నడక కాదన్న విశ్లేషణలు సాగుతున్నాయి.

నిజానికి కేసీఆర్‌ ‌ప్రాంతీయ పార్టీల కూటమి పేరుతో తొలినుంచీ ప్రకటనలు చేస్తున్నారు. దాదాపు ఐదారేళ్లుగా ఈ తంతు కొనసాగుతోంది. ఫెడరల్‌ ‌ఫ్రంట్‌ అం‌టూ ఆ కూటమికి నామకరణం కూడా చేసేశారు. అనేక సార్లు సభల్లో, సమావేశాల్లో ఫెడరల్‌ ‌ఫ్రంట్‌ ‌గురించిన ప్రస్తావన చేశారు. కానీ, ఇప్పుడు హఠాత్తుగా జాతీయ స్థాయిలోనూ సొంత కుంపటి నయమని కేసీఆర్‌ ‌భావించడం వెనుక పరిణామా లను కూడా గమనించాల్సిన అవసరం ఉంది. ఇన్నాళ్లుగా ఉద్ధండులు అనుకున్న, బీజేపీకి చుక్కలు చూపిస్తారనుకున్న, జాతీయస్థాయిలో చక్రం తిప్పగలుగుతారనుకున్న ఆయా రాష్ట్రాలకు చెందిన అనేకమందిని కేసీఆర్‌ ‌కలిశారు. ప్రత్యేకంగా భేటీ అయ్యారు. కానీ, ఇప్పటివరకు ఆయన కలిసిన వాళ్లలో కొందరు అసలు ఫెడరల్‌ ‌ఫ్రంట్‌ అనే అంశమే తమ మధ్య చర్చకు రాలేదని, కేసీఆర్‌ ‌జాతీయ రాజకీయాల గురించి చర్చించలేదని కూడా ప్రకటించిన సందర్భాలున్నాయి. అంటే, కేసీఆర్‌ ‌తొలుత ప్రతిపాదించినట్లు ఫెడరల్‌ ‌ఫ్రంట్‌, ‌ప్రాంతీయ పార్టీల కూటమి అసాధ్యం అనుకున్నట్లు అర్థమవుతోంది. అన్ని పార్టీలు ఒకే తాటిపైకి రావడం, ఒకే ఆశయం, లక్ష్యం కోసం పోరాడటం ఆచరణలో సాధ్యం కాదన్న ఆలోచనకు ఆయన వచ్చారని స్పష్టంగా తెలుస్తోంది. అంతేకాదు, తెలంగాణ ప్రజల ఆలోచనలకు, ఇతర ప్రాంతాలలో ప్రజల ఆలోచనలకు చాలా భిన్నత్వం ఉంటుందని, రాష్ట్ర ప్రజలు తెలంగాణ సెంటిమెంటుతో కేసీఆర్‌కు పట్టం కట్టారని, మిగతా రాష్ట్రాల ప్రజలు అంతగా కేసీఆర్‌ను ఆదరించకపోవచ్చన్న చర్చ కూడా రాజకీయాల్లో సాగుతోంది. అందుకే పార్టీలను ఏకం చేసేకన్నా, తానే పార్టీ పెడితే తన పార్టీ కోసం, తన కోసం, తన ఆశయం కోసం, తన ఆలోచన విధానం కోసం కార్యాచరణ రూపొందించుకోవచ్చన్న భావన తోనే కేసీఆర్‌ ‌బీఆర్‌ఎస్‌ ‌నిర్ణయానికి మొగ్గుచూపినట్లు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మరో విషయం ఏమంటే, ఆయా ప్రాంతీయ పార్టీల నేతల ముందు కేసీఆర్‌ ‌తనకు తానుగా రూపొందించుకున్న ఎజెండా, ప్రతిపాదనలు, లక్ష్యాలపై ఏకాభిప్రాయం కుదరలేదని కూడా తెలుస్తోంది.

టీఆర్‌ఎస్‌ ‌వర్గాల నుంచి వస్తున్న సమాచారం ప్రకారం కేసీఆర్‌ ‌కొత్త జాతీయ పార్టీకి కార్యవర్గాన్ని ఏర్పాటుచేసే విషయం మీద దృష్టి సారించా రని చెబుతున్నారు. పార్టీలకు అతీతంగా పలువురితో రహ స్యంగా భేటీ కావడం, మేధావు లను ఆహ్వానించి.. జాతీయ కార్యవర్గం కూర్పు గురించి సమాలోచనలు సాగిస్తున్నారని అంటున్నారు. రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్‌ ‌కిషోర్‌ (‌పీకే) సలహాలతో జాతీయ రాజకీయా లలో కీలక భూమిక పోషించేలా వ్యూహాలు రచిస్తున్నట్లుగా చెబుతున్నారు.

కేసీఆర్‌ ‌జాతీయ పార్టీ వ్యూహం వెనక మరో ఆలోచన కూడా ఉందంటున్నారు, విశ్లేషకులు. తన కుమారుడు కేటీఆర్‌ (‌కల్వకుంట్ల తారక రామారావు)ను సీఎం చేయడం కోసమే కేసీఆర్‌ ‌జాతీయ రాజకీయాలపై దృష్టి పెట్టారని చెబుతున్నారు. గతంలోనూ చాలాసార్లు కేటీఆర్‌కు ముఖ్య మంత్రి పీఠం అప్పగిస్తారన్న ప్రచారం జరిగింది. కానీ, ఎప్పటి కప్పుడు ఆ ప్రతిపాదనకు అడ్డుకట్ట పడుతోంది. ఇప్పుడు జాతీయ పార్టీ ఏర్పాటు చేసి, కేసీఆర్‌ ‌ఢిల్లీ బాట పడితే.. అనివార్యంగా కేటీఆర్‌ను సీఎం చేయవచ్చని, అప్పుడు రాజకీయంగా వచ్చే విమర్శలకు, ప్రతిపక్షాల ఆరోపణలకు కౌంటర్‌ ఇవ్వవచ్చన్నది కేసీఆర్‌ ‌వ్యూహంగా చెబుతున్నారు.

రాష్ట్రంలో ప్రతిపక్షాలు ఇప్పుడు చాలా దూకుడుగా వ్యవహరిస్తున్నాయి. బీజేపీ తరచూ టీఆర్‌ఎస్‌కు వెన్నులో వణుకు పుట్టించే విజయాలను సొంతం చేసుకుంటోంది. క్షేత్రస్థాయిలోనూ గతంలో కన్నా ఇప్పుడు ఆ పార్టీ బలపడిందన్న సంకేతాలు కేసీఆర్‌కు కూడా అందాయి. సంజయ్‌ ‌పాదయాత్ర, ప్రధానమంత్రి సహా, అగ్రనేతలందరూ సందర్భం వచ్చినప్పుడల్లా తెలంగాణలో పర్యటించడం వంటి పరిణామాలు టీఆర్‌ఎస్‌కు ప్రతికూలంగా మారాయి. కాంగ్రెస్‌ ‌పార్టీ కూడా అధికార టీఆర్‌ఎస్‌ ‌వైఫల్యాలపై గతంలో కన్నా ఇప్పుడు గట్టిగా స్పందిస్తోంది. ఈ పరిణామాలతో టీఆర్‌ఎస్‌ ‌భవితవ్యం గురించి ఆలోచించాల్సిందే అంటున్నారు విశ్లేషకులు. ముందు ఇల్లు చక్కదిద్దుకొని- అంటే తెలంగాణలో పరిస్థితులు బాగు చేసుకొని, కేసీఆర్‌ ‌జాతీయ రాజకీయాల నినాదం ఎత్తుకుంటే బాగుంటుందని చెబుతున్నారు.

– సుజాత గోపగోని, సీనియర్‌ ‌జర్నలిస్ట్

About Author

By editor

Twitter
Instagram