జూన్‌ 13.. ‌దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌ ‌పార్టీ శ్రేణులు రోడ్డెక్కాయి. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రదర్శ నలు చేశాయి. పార్టీ కార్యకర్తలు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ‌డైరెక్టరేట్‌ (ఈడీ) కార్యాలయాల దగ్గర నిరసనలకు దిగారు. ‘సత్యమేవ జయతే’ అని రాసి ఉన్న ఫ్లకార్డులు ప్రదర్శించారు. నిషేధాజ్ఞలను లెక్కచేయ కుండా ఆందోళనలు చేపట్టడంతో పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఢిల్లీలో కేసీ వేణుగోపాల్‌, అధీర్‌ ‌రంజన్‌ ‌చౌధరీ, భూపేశ్‌ ‌బఘేల్‌, అశోక్‌ ‌గెహ్లత్‌, ‌దిగ్విజయ్‌ ‌సింగ్‌, ‌ముకుల్‌ ‌వాస్నిక్‌, ‌జైరాం రమేశ్‌ ‌తదితర సీనియర్‌ ‌నాయకులు సహా కొందరిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసులతో జరిగిన ఘర్షణలో చిదంబరంతో సహా కొందరు అగ్రనాయకులు గాయపడ్డారట.

ఇంతకీ ఈ ఆందోళనంతా ఎందుకు జరిగిందో తెలుసా? ఇదేదో ప్రజా సమస్యలపై, ప్రభుత్వ వైఫల్యాలపై కాంగ్రెస్‌ ‌పార్టీ చేస్తున్న పోరాటమని ఎవరైనా అనుకుంటే పప్పులో కాలేసినట్లే. నేషనల్‌ ‌హెరాల్డ్ ‌వార్తాపత్రికకు సంబంధించిన నగదు అక్రమ చెలామణి కేసులో విచారణకోసం హాజరు కావాలంటూ ఈడీ కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీకి, రాహుల్‌గాంధీకి నోటీసులు జారీచేసింది. ఈ కేసులో గతంలోనే జరిగిన విచారణ సందర్భంగా వీరిద్దరూ బెయిల్‌ ‌తీసుకున్నారు. ఆ తర్వాత అప్పటికే పలుమార్లు నోటీసులు ఇచ్చినా వివిధ కారణాలతో ఇద్దరూ విచారణకు వెళ్లలేదు. చివరకు జూన్‌ 13‌న విచారణ ఎదుర్కోక తప్పలేదు. ఈలోగా సోనియా గాంధీకి కరోనా సోకి ఆస్పత్రిలో చికిత్స పొందుతు న్నారు. దీంతో రాహుల్‌ ఈడీ ముందు హాజరుకాక తప్పలేదు. ఈ కేసుకు సంబంధించి ఈడీ ముందు రాహుల్‌ ‌విచారణకు హాజరు కావడం ఇదే తొలిసారి.

చిన్న ఎర వేసి పెద్ద చేపను పట్టడం ఎలాగో! కాంగ్రెస్‌ ‌పాలక కుటుంబం చేసిన పని అలాగే ఉంది. దేశాన్ని అత్యధికకాలం పాలించిన ఈ పార్టీ హయాంలో ఎన్నో అక్రమాలు వెలుగుచూశాయి. లక్షలాది కోట్ల ప్రజాధనం దోచుకున్నారు. కానీ ఇప్పుడు పాలక కుటుంబం ఏకంగా పార్టీ ఆస్తులనే కొల్లగొట్టడం ద్వారా లక్షలాది మంది కార్యకర్తలను, వాటాదారులను మోసం చేసింది. పైకి అంతా సవ్యంగా ఉన్నట్లు కనిపించినా అసలు గుట్టు లోకానికి తెలిసిపోయింది. తప్పు చేసి దొరికిపోయాక ‘ఉల్టా చోర్‌ ‌కొత్వాల్‌కో మారా’ అన్నట్లుగా ఇప్పుడు వ్యవహారం మెడకు చుట్టుకోవడంతో బీజేపీ కుట్ర అని గగ్గోలు పెడుతున్నారు. తమ పార్టీ అగ్రనేతలపై బీజేపీ ప్రభుత్వం అక్రమకేసులు పెట్టి, కక్షసాధింపు చర్యలకు దిగుతోందని కాంగ్రెస్‌ ‌భజనపరులు ఆరోపిస్తున్నారు.

రాహుల్‌ ‌విచారణను కాంగ్రెస్‌ ‌పార్టీ రాజకీయ స్టంట్‌గా మార్చేసింది. విచారణ రోజున కార్యకర్తలు దేశవ్యాప్తంగా ఈడీ కార్యాలయాల ఎదుట నిరసన లకు దిగారు. నష్టాల్లో ఉన్న నేషనల్‌ ‌హెరాల్డ్‌ను పత్రికను ఆదుకునేందుకు కాంగ్రెస్‌ ‌పార్టీ రూ. 90 కోట్లు ఇచ్చిందని సమర్థించుకున్నారు. 2015లో ముగిసిన విచారణను మోదీ సర్కార్‌ ‌మళ్లీ తెరపైకి తీసుకువచ్చిందని, బీజేపీ కుట్రలపై దేశవ్యాప్తంగా పోరాటం చేస్తాం అని అన్నారు. కాంగ్రెస్‌ ‌నిరసనలను బీజేపీ తప్పుపట్టింది. అక్రమాలపై విచారణ జరిపితే ఎందుకు అడ్డుకుంటున్నారని కేంద్రమంత్రి స్మృతి ఇరానీ ప్రశ్నించారు. సోనియా గాంధీ ఆస్తులను రక్షించేందుకే కాంగ్రెస్‌ ఆం‌దోళనలకు పిలుపునిచ్చింద న్నారు. చట్టానికి ఎవరూ అతీతులు కారని, అందులో రాహుల్‌ ‌గాంధీ కూడా ఒకరని నొక్కి చెప్పారు.

ఏమిటీ నేషనల్‌ ‌హెరాల్డ్ ‌కథ

స్వాతంత్య్ర ఉద్యమ సమయంలో బ్రిటిష్‌ ‌వారికి వ్యతిరేకంగా భారతీయుల వాణిని వినిపించేందుకు స్థాపించిన పత్రిక ‘నేషనల్‌ ‌హెరాల్డ్’. 1938‌లో కాంగ్రెస్‌ ‌పార్టీ అప్పటి అధ్యక్షుడు జవహర్‌లాల్‌ ‌నెహ్రూ ఈ పత్రికను ప్రారంభించారు. కోటంరాజు రామారావు తొలి సంపాదకుడిగా బాధ్యతలు నిర్వహించారు. నెహ్రూ ప్రధానిగా బాధ్యతలు చేపట్టే వరకూ పాలకమండలి అధ్యక్షునిగా పనిచేశారు. క్విట్‌ఇం‌డియా ఉద్యమ కాలంలో వచ్చిన ఆంక్షల కారణంగా 1942-45 మధ్య పత్రిక మూతపడింది. 1946లో మళ్లీ ప్రచురణ ప్రారంభించినపుడు మానికొండ చలపతిరావు (ఎంసీ) సంపాదకత్వ బాధ్యత తీసుకున్నారు. అప్పటినుంచి 1978లో మరోసారి మూతపడే వరకు ఎంసీ ఆ స్థానంలో కొనసాగారు. స్వాతంత్య్రానంతరం కాంగ్రెస్‌ అధికార పత్రికగా నేషనల్‌ ‌హెరాల్డ్ ‌మారిపోయింది. ప్రధాని ఇందిరా గాంధీ విధించిన ఎమర్జెన్సీ తర్వాత (1977 -79) కాంగ్రెస్‌ ఒడిదుడుకులు ఎదుర్కొన్నపుడు నేషనల్‌ ‌హెరాల్డ్ ‌మూతపడినా, మళ్లీ ప్రచురణ సాగించింది. 1986లో అప్పుల ఊబిలో కూరుకు పోయి మరోసారి ఆగిపోయే పరిస్థితి వచ్చింది. కానీ అప్పటి ప్రధాని రాజీవ్‌గాంధీ ఆదుకున్నారు. 1998లో లక్నో ఎడిషన్‌ ‌మూతపడింది. కోర్డు ఆదేశం మేరకు తీర్చాల్సిన బకాయిల కోసం కొన్ని ఆస్తులను వేలం వేశారు. ఆ తర్వాత మరో పదేళ్లకు, అంటే ఏప్రిల్‌ 1, 2008‌న ఢిల్లీ ఎడిషన్‌ ‌కూడా ఆగిపోయింది. అప్పుడు కేంద్రంలో కాంగ్రెస్‌ ‌నేతృత్వం లోని యూపీఏ అధికారంలో ఉంది. పత్రికను మళ్లీ తెరిపించాలని ప్రయత్నాలు జరిగినా రాహుల్‌గాంధీ ఆసక్తి చూపించలేదని చెబుతారు.

యంగ్‌ ఇం‌డియన్‌ ‌ముసుగులో కుట్ర

ఏజేఎల్‌ అసోసియేటెడ్‌ ‌జర్నల్‌ ‌లిమిటెడ్‌ ‌సంస్థ ఆధ్వర్యంలో పత్రిక నిర్వహణ కొనసాగింది. ఇందులో 5 వేలమంది స్వాతంత్య్ర సమరయోధులు వాటా దారులు కాగా జవహర్‌లాల్‌ ‌నెహ్రూ ప్రధాన దాతగా ఉన్నారు. దీనికి గాంధీ కుటుంబానికి విశ్వాసపాత్రుడు మోతీలాల్‌ ఓరా చైర్మన్‌. ఈయన కాంగ్రెస్‌ ‌పార్టీకి కోశాధికారి కూడా. రాహుల్‌, ఆస్కార్‌ ‌ఫెర్నాండెజ్‌ ఏజేఎల్‌లో డెరైక్టర్లుగా ఉన్నారు. 2009లో వరుసగా రెండోసారి కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చింది. ఏడాది తర్వాత 2010లో ఏజేఎల్‌ ‌స్థానంలో యంగ్‌ ఇం‌డి యన్‌ ‌లిమిటెడ్‌ (‌వైఐఎల్‌) ‌పేరుతో మరో సంస్థను ప్రారంభించారు. ఇందులో కూడా మోతీలాల్‌ ఓరా, సోనియా గాంధీ, రాహుల్‌ ‌గాంధీ, ఆస్కార్‌ ‌ఫెర్నాండెజ్‌ ఉన్నారు. పత్రికను తిరిగి ప్రచురిస్తామని ఈ మండలి ప్రకటించినా, అది జరగలేదు.

 కాంగ్రెస్‌ ‌పార్టీ 2011లో ఏజేఎల్‌ను యంగ్‌ ఇం‌డియన్‌ ‌లిమిటెడ్‌కు అప్పగించింది. అప్పటికి నేషనల్‌ ‌హెరాల్డ్‌ను నిర్వహించిన ఏజేఎల్‌ ‌రూ. 90 కోట్లు కాంగ్రెస్‌కు బాకీ పడినట్లు చూపించారు. వీటిని తీర్చడానికి కాంగ్రెస్‌ ‌పార్టీ కోశాధికారిగా మోతీలాల్‌ ఓరా రూ. 90.25 కోట్లు అప్పుగా ఇచ్చారు. ఇదే కాకుండా, ఢిల్లీ బహదూర్‌షా జాఫర్‌ ‌మార్గంలో ఉన్న నేషనల్‌ ‌హెరాల్డ్ ‌భవంతినీ, ప్రింటింగ్‌ ‌యంత్రాన్ని అద్దెకు ఇచ్చారు. దాని మీద వచ్చే అద్దెను ఒక ప్రైవేటు సంస్థ వసూలు చేస్తున్నది. నేషనల్‌ ‌హెరాల్డ్‌కు ఢిల్లీ సహా లక్నో, భోపాల్‌, ఇం‌డోర్‌, ‌ముంబై, పంచకులా (చండీగఢ్‌), ‌పాట్నాలలో ఉన్న స్థిరాస్థుల విలువ దాదాపు రూ. 5000 కోట్లు. చివరికి కాంగ్రెస్‌ ‌పార్టీ ఏజేఎల్‌కు తాను ఇచ్చిన రుణాన్ని రద్దుచేసి, ఈ ఆస్తులను యంగ్‌ ఇం‌డియన్‌ ‌లిమిటెడ్‌ ‌పరం చేసింది. 2016లో ఏజేఎల్‌ ‌మూడు భాషల్లో పత్రికలను పునఃప్రారంభించింది.

సుబ్రహ్మణ్యస్వామి కేసుతో మలుపు

నేషనల్‌ ‌హెరాల్డ్ ‌వ్యవహారంలో ఏజేఎల్‌ అప్పులు, ఆస్తులన్నీ యంగ్‌ ఇం‌డియా లిమిటెడ్‌కు దక్కిన వ్యవహారంపై అనుమానాలు మొదలయ్యాయి. క్రమంగా ఈ కుట్ర మొత్తం కీలక మలుపులు తీసుకుంది. నేషనల్‌ ‌హెరాల్డ్ ‌విషయంలో భారీ అవినీతి జరిగిందని ప్రముఖ న్యాయవాది, బీజేపీ సీనియర్‌ ‌నాయకుడు సుబ్రహ్మణ్యస్వామి ఆరోపించారు. ఇందులో కాంగ్రెస్‌ ‌పాలక కుటుంబా నికి, ఇతర నేతలకు ప్రమేయం ఉందని ఆరోపిస్తూ స్వామి 2012లో ఢిల్లీ కోర్టులో పిటిషన్‌ ‌దాఖలు చేశారు. తర్వాత కాలంలో మోతీలాల్‌ ఓరా, ఆస్కార్‌ ‌ఫెర్నాండెజ్‌ ‌మరణించగా ప్రస్తుతం సోనియాగాంధీ, రాహుల్‌గాంధీలు విచారణ ఎదుర్కొంటున్నారు. సోనియా, రాహుల్‌లకు ఈ వ్యవహారంలో ప్రమేయం ఉన్నట్లు ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని పేర్కొంటూ ఢిల్లీ మెట్రోపాలిటన్‌ ‌మేజిస్ట్రేట్‌ ఇద్దరికీ నోటీసులు జారీచేసింది.

ఎన్నో అనుమానాలు

రాహుల్‌ ‌డైరెక్టర్‌గా ఉన్న వైఐఎల్‌ ‌మూలధన పెట్టుబడి రూ. 50 లక్షలు మాత్రమే. కోల్‌కతాకు చెందిన డొటెక్స్ ‌మర్చెండైజ్‌ ‌ప్రైవేట్‌ ‌లిమిటెడ్‌ అనే డొల్ల సంస్థ నుంచి రూ. కోటి రుణం తీసుకుని అందులోంచి రూ.50 లక్షలను కాంగ్రెస్‌కు చెల్లించి నేషనల్‌ ‌హెరాల్డ్‌పై హక్కులు పొందింది వైఐఎల్‌. ఏజేఎల్‌కు చెందిన మూతపడిన మీడియా సంస్థలను, వాటికి ఢిల్లీతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న రూ.2 వేల కోట్లకు పైగా ఉన్న విలువైన ఆస్తులను వైఐఎల్‌ ‌మోసపూరితంగా స్వాధీనం చేసుకుంది. 80 శాతం మంది వాటాదారులు మరణించిన కంపెనీ ఎలా బోర్డు తీర్మానంచేసి మెజారిటీ వాటాలు ఇవ్వగలిగింది?

నేషనల్‌ ‌హెరాల్డ్ ‌నుంచి రావాల్సిన బకాయి రూ.90.25 కోట్లకు గాను వైఐఎల్‌ ‌నుంచి రూ.50 లక్షలు మాత్రమే తీసుకున్న కాంగ్రెస్‌.. ‌మిగతా రుణం రూ.89.75 కోట్లను చెల్లించనవసరం లేకుండానే ఎలా మాఫీ చేసింది. ఏజేఎల్‌లో మిగిలిన వాటా దారులు శాంతిభూషణ్‌, ‌మార్కండేయ కట్జూ తదితరుల అనుమతి లేకుండానే ఆ సంస్థకు చెందిన రూ. వందల కోట్ల ఆస్తులు సోనియా, రాహుల్‌ ‌గాంధీలకు చెందిన వైఐఎల్‌కు ఎలా మళ్లాయి. నేషనల్‌ ‌హెరాల్డ్‌కు కాంగ్రెస్‌ ‌పార్టీ ఇచ్చిన రూ.90.25 కోట్ల అప్పు కూడా అక్రమమే. ఇన్‌కం టాక్స్ ‌చట్టం మేరకు రాజకీయ పార్టీలు ప్రైవేటు కంపెనీకి రుణం ఇవ్వటం చట్టవిరుద్ధం.

నెహ్రూ ఆశయాలకు కుటుంబీకులే తూట్లు

స్వాతంత్య్ర ఉద్యమకాలంలో నెహ్రూ స్థాపించిన పత్రిక స్ఫూర్తిని ఆయన వారసులుగా చెప్పుకునే ‘గాంధీ’లు నీరుగార్చారు. ఆయన స్థాపించిన సంస్థ ఆస్తులను అక్రమమార్గంలో కొల్లగొట్టేందుకు యత్నించారు. జరిగిన పరిణామాలను చూస్తే వీరు నెహ్రూ కలల పత్రికను చిదిమివేయడానికి ఎంత పథకం పన్నారో సులభంగానే అర్థమవుతుంది. యంగ్‌ ఇం‌డియన్‌ ‌లిమిటెడ్‌లో తల్లీకొడుకులకు 76 శాతం వాటా ఉంది. మిగిలింది ఆస్కార్‌ ‌ఫెర్నాండెజ్‌, ‌మోతీలాల్‌ ఓరా పేరుమీద ఉంది. వారిద్దరూ ఇప్పుడు లేరు.

2010 నవంబర్‌లో కంపెనీని పెడితే డిసెంబర్‌లో తల్లీకొడుకులు అసోసియేటెడ్‌ ‌జర్నల్స్ ‌ప్రైవేట్‌ ‌లిమిటెడ్‌ ‌ముందు ఓ ప్రతిపాదన పెట్టారు. కాంగ్రెస్‌ ‌పార్టీ మీ నుంచి తీసుకున్న అప్పును మేం తీరుస్తాం. దానికి బదులు కంపెనీలో వాటాలు ఇవ్వాలన్నదే ఆ ప్రతిపాదన. బోర్డు అందుకు అంగీకరించి 90 కోట్లకు సరిపడా షేర్లను మంజూరు చేసింది. సోనియా, రాహుల్‌ ‌కాంగ్రెస్‌ ‌పార్టీకి రూ. 50 లక్షలు చెల్లించారు. ఇది చాలంటూ మిగిలిన రుణం మాఫీ చేసింది పార్టీ. అంటే రూ. 50 లక్షలకు నేషనల్‌ ‌హెరాల్డ్ ఆస్తులన్నీ తల్లీ కొడుకులకు వచ్చాయన్న మాట.

ఈ వివాదం నుంచి బయటపడతామని సోనియా, రాహుల్‌ ‌మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తు న్నారు. కానీ అదంత సులభం కాదు. కేసును ఎదుర్కోవడానికి కూడా వారు సిద్ధంగా లేరు. దేశాన్ని యాభై ఏళ్లకు పైగా పాలించిన కుటుంబంగా గుర్తింపు పొందిన తాము కోర్టు బోనులో నిలబడడం ఏమిటన్న అహంకారంలో వారు ఉండి ఉండవచ్చు. కానీ చట్టానికి ఎవరూ అతీతులు కాదు.

వాస్తవానికి ఈ కుట్ర వెలుగులోకి వచ్చింది యూపీఏ (కాంగ్రెస్‌) ‌హయాంలోనే. అప్పుడు ప్రధానమంత్రిగా ఉన్నది మన్మోహన్‌సింగ్‌. ‌కానీ ఇదంతా ఇప్పటి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, బీజేపీ కుట్ర అంటూ కాంగ్రెస్‌ ‌పార్టీ ఆరోపిస్తోంది. ఈ వ్యవహారాన్ని పెద్దది చేసిన వ్యక్తి డా. సుబ్రహ్మణ్య స్వామి. ఆయనకు బీజేపీతో ఇప్పుడు సంబంధాలు అంతంత మాత్రమే. సోనియా, రాహుల్‌, ‌కాంగ్రెస్‌ ‌పెద్దలు అనుమానాలు నివృత్తి చేయకుండా ప్రత్యారోపణలు, ఎదురుదాడికి దిగడం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదు.

– క్రాంతి, సీనియర్‌ ‌జర్నలిస్ట్

About Author

By editor

Twitter
Instagram