భారతీయ జనతాపార్టీ అధిష్ఠానం తెలంగాణపై ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. సందర్భం వచ్చినప్పుడల్లా ఆ సందేశం ఇస్తోంది. ఈ కోణంలో నిర్ణయాలు తీసుకుంటోంది, అమలు చేస్తోంది. ఫలితంగా రాష్ట్రంలోని కాషాయ దళంలోనూ ఉత్సాహం పెరిగింది. దీంతో, అధికారపీఠంపై ఆశలు చిగురిస్తున్నాయి. ఇప్పటి నుంచే కృషి చేస్తే వచ్చే ఏడాది జరగనున్న ఎన్నికలను ఎదుర్కోవడం పెద్ద కష్టమేమీ కాదన్న విశ్వాసం పార్టీలో బలపడుతోంది.

కొద్దిరోజులుగా బీజేపీ అధిష్టానం తీసు కుంటున్న నిర్ణయాలు, చేపడుతున్న కార్యక్రమాలు గమనిస్తే రాష్ట్రంలో ఎలాగైనా కాషాయ జెండా ఎగురేయాలన్న లక్ష్యాన్ని నిర్దేశించుకుందన్న భావ నలు బలపడుతున్నాయి. తరచూ ఆ పార్టీ అగ్రనేతలు రాష్ట్రంలో పర్యటించడమే కాదు, ఇక్కడి నేతలకు ఢిల్లీలో ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని ప్రత్యేకంగా నిర్వహించారు. ఇప్పుడు బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు కూడా హైదరాబాద్‌నే వేదికగా ఎంచుకున్నారు. తాజాగా జీహెచ్‌ఎం‌సీలో బీజేపీ కార్పొరేటర్లకు, పార్టీ ముఖ్య నాయకులకు మోదీ నుంచి ఆహ్వానం అందింది. రాష్ట్ర రాజకీయాల్లో ఈ పరిణామాలపై విస్తృతంగా చర్చ జరుగుతోంది.

తెలంగాణలో పాగా వేసేదాకా ఈ ఆపరేషన్‌ ‌కొనసాగుతుందని అంచనా వేస్తున్నారు. భారతీయ జనతా పార్టీలో ముగ్గురు ముఖ్యనేతలు గడిచిన ఒకే నెలలో తెలంగాణలో పర్యటించారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌ ‌షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ (జగత్‌ ‌ప్రకాశ్‌) ‌నడ్డా వేర్వేరుగా రాష్ట్రంలో పర్యటించారు. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్‌ ‌రెండో విడత ప్రజా సంగ్రామ పాదయాత్ర ప్రారంభోత్సవ కార్యక్రమం గత నెల 5న పాలమూరులో జరిగింది. ఈ సభకు జేపీ నడ్డా హాజరయ్యారు. ఆ తర్వాత మే 14న రంగారెడ్డి జిల్లా తుక్కుగుడలో బండి సంజయ్‌ ‌ప్రజా సంగ్రామ పాదయాత్ర ముంగిపు సభ నిర్వహించారు. ఆ సభలో అమిత్‌షా పాల్గొన్నారు. ఇక, అదే నెలలో 26న హైదరాబాద్‌లోని ఇండియన్‌ ‌స్కూల్‌ ఆఫ్‌ ‌బిజినెస్‌ (ఐఎస్‌బీ) వార్షికోత్సవ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ హాజరయ్యారు. అధికారిక కార్యక్రమమే అయినా, తాను దిగిన బేగంపేట ఎయిర్‌పోర్టులోనే భారీ స్థాయిలో బహిరంగ సభ నిర్వహించారు. పూర్తిస్థాయి పార్టీ కార్యక్రమంగా ప్రసంగించారు. తెలంగాణలో కేసీఆర్‌ ‌కుటుంబం పైనా, టీఆర్‌ఎస్‌ ‌పాలనపైనా నిప్పులు చెరిగారు. ఈ ముగ్గురు నేతలు కూడా తాము పాల్గొన్న సభల్లో ముఖ్యంగా కేసీఆర్‌నే లక్ష్యంగా చేసుకున్నారు. కార్యకర్తల్లో ఉత్సాహం నింపారు.

పార్టీలోని ముగ్గురు ప్రధాన నాయకులు ఒకే నెలలో తెలంగాణలో పర్యటించడమంటే మాటలు కాదు. పైగా.. ప్రతీ సభనూ రాష్ట్ర నేతలు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. తమ అగ్రనేతల సభలు విజయవంతం అయ్యేలా కృషి చేశారు. హస్తిన నుంచి వచ్చిన అగ్రనేతలు కూడా ఏమాత్రం అంచ నాలు తగ్గకుండా అధికారమే లక్ష్యంగా, టీఆర్‌ఎస్‌ ‌పాలనను ఎండగట్టారు.

2014 జూన్‌ ‌రెండో తేదీన తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించింది. ఈ చారిత్రక సంఘట నకు ఎనిమిదేళ్లు నిండాయి. ఇప్పటివరకు ఎప్పుడూ బీజేపీ జాతీయ నాయకత్వం అధికారికంగా ఈ వేడుకలను నిర్వహించలేదు. కానీ, ఈ ఏడాది మాత్రం దేశ రాజధాని ఢిల్లీలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించింది. కేంద్ర సాంస్కృ తిక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన అధికారిక కార్యక్రమంలో కేంద్ర హోం మంత్రి అమిత్‌షా ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ నిర్ణయం వెనుక కూడా బీజేపీ తెలంగాణలో ముద్ర వేసుకునే వ్యూహం ఉందని స్పష్టమయింది. ఇలాంటి కార్యక్రమాలు, సభలతో పార్టీ శ్రేణుల్లో ఓవైపు జోష్‌ ‌నింపుతూనే మరో కీలక నిర్ణయం తీసుకుంది బీజేపీ అధిష్టానం. తెలంగాణకు చెందిన మాజీ ఎమ్మెల్యే, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసిన బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్‌ ‌లక్ష్మణ్‌కు రాజ్యసభ సభ్యునిగా అవకాశం కల్పించింది. ఉత్తరప్రదేశ్‌ ‌కోటాలో డాక్టర్‌ ‌లక్ష్మణ్‌ను ఈ అవకాశం వరించింది. ఈ ఎంపిక వెనక కూడా అదే వ్యూహం ఉందంటున్నారు.

ఇక, హైదరాబాద్‌లో మరో భారీ సమావేశానికి కూడా భారతీయ జనతాపార్టీ సిద్ధమయింది. పార్టీకి అతిముఖ్యమైన జాతీయ కార్యవర్గ సమావేశాలను ఈసారి తెలంగాణలో నిర్వహించేందుకు నిర్ణయం తీసుకుంది. వచ్చే నెల అంటే జూలై 2,3 తేదీల్లో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు హైదరా బాద్‌లో జరగనున్నాయి. హైటెక్‌ ‌సిటీలో ఈ సమా వేశాలు నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సమావేశాల్లో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి అమిత్‌షా హైదరాబాద్‌ ‌వస్తారు. రెండు రోజుల పాటు ఇక్కడే బస చేస్తారు. ఈ సభలకు బీజేపీకి చెందిన కేంద్ర మంత్రులందరూ తరలి రానున్నారు. అంతేకాదు, దేశంలోని 18 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, 300 మందికి పైగా కీలక నేతలు పాల్గొంటారు. అంటే, రెండు రోజులపాటు హైదరాబాద్‌ ‌కాషాయమయం కానుంది. సమావేశాల ఏర్పాట్ల కోసం ఇప్పటికే కసరత్తు మొదలయింది.

వాస్తవానికి దక్షిణాదిపై బీజేపీ చాలాకాలం నుంచి దృష్టి పెట్టింది. అయినా, ఆశించిన ఫలితాలు రావడం లేదు. ఒక్క కర్ణాటకలో మాత్రం అధికారం చేజిక్కించుకుంది. అయితే, అక్కడ కూడా అతితక్కువ మెజారిటీతోనే అధికారాన్ని సొంతం చేసుకుంది. వచ్చే ఏడాది కర్ణాటకలో ఎన్నికలు జరుగుతాయి. అక్కడ ఈసారి కాంగ్రెస్‌ ‌నుంచి గట్టి పోటీ ఉంటుం దన్న సంకేతాలు వస్తున్నాయి. కేరళ, తమిళనాడులో మాత్రం బీజేపీకి ఇప్పట్లో అధికారంలోకి వచ్చే అవకాశాలు లేవు. ఆంధప్రదేశ్‌లోనూ ఇదే పరిస్థితి. కానీ, తెలంగాణలో మాత్రం పార్టీ బలపడుతోంది. దీంతో ఈ రాష్ట్రంపైనే బీజేపీ ఆశలు పెట్టుకుంది. అందుకే అధికారమే లక్ష్యంగా పావులు కదుపుతూ, ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేస్తోందని తెలుస్తోంది. తెలంగాణలో ఏ చిన్న సందర్భం ఉన్నా బీజేపీ పెద్దలు వాలిపోతున్నారు. ఏ చిన్న అవకాశం దొరికినా టీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వ పాలనను ఎండగడుతూ ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. తెలంగాణ ప్రజ లను ఆకర్షించే పలు కార్యక్రమాలు చేపడుతున్నారు. ‘పోరాడి సాధించుకున్న రాష్ట్రం ఓ కుటుంబం చేతుల్లో బందీగా ఉంది. ఆ కుటుంబం నుంచి రాష్ట్రాన్ని, ప్రజలను కాపాడుతాం’ అంటూ ప్రజల్లోకి వెళ్తున్నారు.

కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచే బీజేపీ అధిష్టానం తెలంగాణపై దృష్టిపెట్టింది. అయితే, ఈ స్థాయిలో దూకుడుగా వ్యవహరించలేదు. ఆచితూచి పరిస్థితులను అంచనా వేసింది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అనూహ్యంగా వెనుకబడి పోయింది. 2014లో బీజేపీకి ఐదుగురు ఎమ్మెల్యేలు ఉండగా.. 2018 నాటికి ఆ సంఖ్య ఒక్కరికే పరిమితమయింది. గోషామహల్‌ ‌నుంచి రాజాసింగ్‌ ఒక్కరే గెలుపొందారు. ఆ సమయంలో బీజేపీ నైరాశ్యంలో మునిగినప్పటికీ, 2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మాత్రం అనూహ్యంగా పుంజుకుంది. టీఆర్‌ఎస్‌కు ఝలక్‌ ఇచ్చింది. నాలుగు లోక్‌సభ సీట్లను గెలుచుకొని సత్తా చాటింది. 2018లో ఎమ్మెల్యేలుగా ఓడిపోయిన వాళ్లు మరుసటి సంవత్సరం ఎంపీలుగా గెలిచారు. ఆ విజయం బీజేపీకి టానిక్‌లా పని చేసింది. అప్పటినుంచి అధిష్టానం, ఇటు రాష్ట్ర నాయకత్వం దూకుడు పెంచాయి. దుబ్బాక ఉప ఎన్నికలో రఘునందన్‌ ‌రావు గెలుపొందడం, హుజురాబాద్‌ ఉప ఎన్నికలో ఈటల రాజేం దర్‌ ‌గెలవడం పార్టీలో ఉత్సాహం నింపాయి. అలాగే, గ్రేటర్‌ ‌హైదరా బాద్‌ ‌మున్సిపల్‌ ‌కార్పొ రేషన్‌ ఎన్నికల్లోనూ అధి కార టీఆర్‌ఎస్‌కు బీజేపీ చుక్కలు చూపించింది. ఈ పరిణామాల నేప థ్యంలో భారతీయ జనతా పార్టీకి తెలంగాణలో పాగా వేస్తామన్న నమ్మకం కుదిరిందని విశ్లేషకులు చెబుతున్నారు. అందుకే అప్పటినుంచీ ఏ చిన్న అవకాశం లభించినా తెలంగాణపై ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారని చెబుతున్నారు. టీఆర్‌ఎస్‌కు తామే ప్రత్యామ్నాయ మని చెబుతున్న బీజేపీ.. ఈసారి ఎలాగైనా అధికారం సాధించాలనే కసితో పనిచేస్తోంది. వచ్చే నెలలో జరగనున్న జాతీయ కార్యవర్గ సమావేశాల తర్వాత రాష్ట్రంలో బీజేపీ రాజకీయం మరింత దూకుడుగా ఉంటుందని.. బెంగాల్‌ ‌తరహా పరిణామాలు కనిపిస్తాయని అంటున్నారు. ఇక, ఇప్పటికే రెండు దఫాలుగా ప్రజా సంగ్రామ యాత్ర పేరుతో పాదయాత్ర చేసిన పార్టీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్‌.. ఇప్పుడు మూడో దశ ప్రజా సంగ్రామ పాదయాత్రకు కూడా సిద్ధమవుతున్నారు.

– సుజాత గోపగోని, 6302164068,  సీనియర్‌ ‌జర్నలిస్ట్

About Author

By editor

Twitter
Instagram