అనుకున్నది సాధించడం, అందుకు కుటుంబ సంబంధాలనైనా పణంగా పెట్టడం, జైలు శిక్షను తృణప్రాయంగా భావించడం ఆయన నైజం. పర పాలనలో సుషుప్తిలో ఉన్న జాతిని తన ఉపన్యాసాల ద్వారా జాగృత పరచడం ఈయన అభిమతం. తమతమ ఆశయాలను సాకారం చేసుకున్న ఆ ఇద్దరే… ఆత్మకూరి గోవిందా చార్యులు, చెరుకువాడ వెంకట నరసింహం.

పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధునిగా, ఆంధ్ర, ఆంగ్ల సంస్కృత భాషా పండితునిగా, పలుగ్రంథ రచయితగా, పత్రికా సంపాదకునిగా, శాసనసభ్యుడిగా, దళితజనోద్ధార కునిగా సుప్రసిద్ధుడైన ఆత్మకూరి గోవిందాచార్యులు తాడేపల్లిగూడెం తాలూకా అగ్రహారం గోపవరంలో 1895లో సంపన్న వైష్ణవ కుటుంబంలో వెంకట కృష్ణమాచార్యులు, సుభద్ర దంపతులకు జన్మించారు.

జిల్లాలో స్వాతంత్య్రోద్యమం త్రిమూర్తులుగా పిలిచే గోవిందా, గోపాలా, నారాయణ (ఆత్మకూరి గోవిందాచార్యులు, కొవ్వలి గోపాలరావు, దండు నారాయణరాజు) ఆధ్వర్యంలో నడిచింది. దండు నారాయణరాజుతో కలసి 1920లో కలకత్తా, నాగపూర్‌లో జరిగిన అఖిల భారత కాంగ్రెస్‌ ‌సమావేశాలకు హాజరై సహాయనిరాకరణ ఉద్యమానికి మద్దతుగా జిల్లా ప్రజల తరపున వాణిని విని పించారు.

గాంధీజీ స్వాతంత్య్ర సమరశంఖారావంతో ఉపాధ్యాయ ట్రైనింగు కోర్సును మధ్యలో వదిలి 1920 అక్టోబరు 13న ఆత్మకూరి జాతివిమోచ నోద్యమంలో ప్రవేశించారు.ఏలూరులో గాంధీ జాతీయ విద్యాలయం (1921) స్థాపకులలో వీరూ ఒకరు. ఏలూరులో ఖాదీ ఉత్పత్తి కేంద్రాన్ని నెలకొల్పారు. జిల్లాలో అనేక గ్రంథాలయాల స్థాపనకు, వాటి మనుగడకు కృషి చేశారు. జిల్లాలో స్కౌట్‌ ‌శిక్షణ ఉద్యమాన్ని తీర్చిదిద్ది యువతలో జాతీయ భావాలను నింపారు. దళితజనోద్ధరణ లక్ష్యంలో కుటుంబ సమస్యలు ఎదురైనా చలించలేదు. జోసఫ్‌ అనే దళిత బాలుడిని (1923) తమ ఇంటి వద్దనే ఉంచుకుని విద్యావసతులు చేకూర్చగా, అది నచ్చని భార్య విడాకులు ఇచ్చినా చలించని దృఢసంకల్పుడు ఆచార్యుల వారు.

జాతీయభావాల వ్యాప్తికి, ప్రజాభిప్రాయాన్ని కూడగట్టటానికి పత్రికల అవసరాన్ని గుర్తించి గాంధీ జాతీయ విద్యాలయంలో స్వీయ సంపాదకత్వంలో ‘సత్యాగ్రహి’ (1923) అనే వారపత్రికను స్థాపించారు. కొన్నాళ్లకు ప్రభుత్వం ఆ ముద్రణా లయంపై దాడి చేయించింది. అక్కడి పరికరాలను స్వాధీనం చేసుకుని, అపరాధం క్రింద దానిని జప్తు చేసినట్లు ప్రకటించింది. అనేక సంవత్సరాలు స్వాతంత్య్ర ఉద్యమ భావాలు వెదజిమ్మిన పత్రిక చరిత్ర అలా ముగిసిపోయింది.

సహాయ నిరాకరణ ఉద్యమంలో భాగంగా- ప్రభుత్వానికి ఎలాంటి పన్నులు చెల్లించరాదని దండు నారాయణరాజు, ముష్టి లక్ష్మీనారాయణ తదితర నాయకులతో కలసి భీమవరం తాలూకాలో ప్రచారం చేశారు. విజయవంతమైన ఈ ఉద్యమాన్ని గాంధీజీ ‘భీమవరం రెండవ బార్డోలీ’గా అభివర్ణించారు. ఆత్మకూరి కార్యకలాపాలకు ఆగ్రహించిన ప్రభుత్వం ఆయనపై నిఘా పెట్టింది. పన్నుల నిరాకరణను ప్రబోధించే పత్రాలు కలిగి ఉన్న ఆయనను 1922 జనవరి 30న ఏలూరు రైల్వే స్టేషనులో పోలీసులు అరెస్టు చేయగా, మెజిస్ట్రేట్‌ ఏడాది కఠిన జైలు శిక్ష విధించారు. అదే ఏడాది జూలైలో ఆయన కీళ్ల నొప్పులు, క్షయవ్యాధితో తీవ్ర అనారోగ్యం పాలుకావడతో ముందుగానే జైలు నుంచి విడుదల చేశారు. కోలుకున్న తరువాత గాంధీజీ సిద్ధాంతాల నిర్మాణ కార్యక్రమాలపై నిరంతరం కృషి చేశారు.

ఖద్దరు ప్రచారంలో భాగంగా మహాత్మాగాంధీ 1929 ఏప్రిల్‌ 23 ‌నుంచి 28వ తేదీ వరకు జిల్లాలో పర్యటించగా దండు నారాయణరాజు తదితర మిత్రులతో ఘన స్వాగతం పలికి, పర్యటన ఆసాంతం గాంధీజీ కారుకు దారిచూపుతూ ముందు నడిచారు. లాహోరు తీర్మానం ప్రకారం 1930 జనవరి 26న ఏలూరులో పప్రథమంగా స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకున్నారు. గజవల్లి రామచంద్రరావు అధ్యక్షత వహించిన సమావేశంలో బందా వియ్యన్న త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. గోవిందాచార్యులు లాహోరు తీర్మానాన్ని ప్రజలకు చదివి వినిపించారు. అదే ఏడాది మార్చి 21న అహ్మదాబాద్‌లో జరిగిన అఖిల భారత కాంగ్రెస్‌ ‌సమావేశానికి హాజరైన ఆయన మార్చి 28న ఏలూరులో తన అధ్యక్షతన కాంగ్రెస్‌ ‌సభను నిర్వహించారు. అహ్మదాబాద్‌ ‌సమావేశ విశేషాలను వివరిస్తూ ‘మహాత్ముడు ఉప్పు శాసనోల్లంఘనకై దండికి బయలుదేరారు. ఆయన స్ఫూర్తితో మార్చి 31న ఏలూరు నుండి మట్లపాలెం బయలుదేరే ఉప్పు శాసనోల్లంఘన సత్యాగ్రహ దళంలో పెద్ద సంఖ్యంలో ప్రజలు పాల్గొనాలి’ అని పిలుపునిచ్చారు.

ఆత్మకూరి, దండు నేతృత్వంలో శాసనోల్లంఘన దళం జయజయ ధ్వానాలతో మట్లపాలెం బయలు దేరింది.అనారోగ్యంతో, కీళ్ల నొప్పులతో ఉన్నా గోవిందాచార్యులు సత్యాగ్రహులను ఉత్సాహపరుస్తూ ముందుకు నడిపారు. శాసనోల్లంఘన ఆరోపణపై గోవిందాచార్యులను మరోసారి (1932 జనవరి 7) అరెస్టు చేయగా, ఏలూరు సబ్‌ ‌మెజిస్ట్రేట్‌ ఆయనకు ఎనిమిది నెలలు కఠిన జైలు శిక్ష విధించారు. ఆయనకు అనారోగ్యం తిరగబెట్టడంతో వి.వరదరాజులనాయుడు వంటి మిత్రుల విన్నపం మేరకు ప్రభుత్వం మార్చి 1న విడుదల చేసింది.

గాంధీజీ 1940 అక్టోబరు 17న ప్రారంభించిన వ్యక్తి సత్యాగ్రహ స్ఫూర్తితో ఆయన అనుమతిపై అదే ఏడాది డిసెంబర్‌ 10‌వ తేదీన పిప్పరలో ఆ తరహా కార్యక్రమాన్ని ప్రారంభించారు. ‘ప్రపంచయుద్ధంలో బ్రిటీష్‌ ‌ప్రభుత్వానికి సైనికులను పంపడం కానీ, ధన సహాయం కాని చేయరాదు. సహాయ నిరాకరణను అహింసా పద్ధతులలో పకడ్బందీగా ఆచరించాలి’ అని ఉత్తేజిత ప్రసంగాలు ఇవ్వడంతో ప్రభుత్వం వెంటనే అరెస్టు చేసి 9 నెలలు సాధారణ కారాగార శిక్ష 200 రూపాయలు జరిమానా విధించి వెల్లూరు జైలుకు తరలించింది. అక్కడి నుంచి విడుదల అనంతరం నెల్లూరు జిల్లా పల్లిపాడు సత్యాగ్రహ శిబిరంలో ఒక సంవత్సరం గడిపారు. తీవ్ర అనారోగ్య పరిస్థితిలోనూ క్విట్‌ ఇం‌డియా ఉద్యమానికి (1942) సహక రించారు.

ఆంధప్రదేశ్‌ ‌కాంగ్రెస్‌ ‌కమిటీ సభ్యునిగా, అఖిల భారత కాంగ్రెస్‌ ‌కమిటీ సభ్యునిగా చిరకాలం విశిష్టసేవలు అందించారు ఆత్మకూరి. మదరాసు లెజిస్లేటివ్‌ ‌సభ్యునిగా(1940-1952), పశ్చిమ గోదావరిజిల్లా బోర్డు మెంబరుగా ఆరేళ్లు వ్యవహరిం చారు. లండన్‌ ‘‌రాయల్‌ ఏషియాటిక్‌ ‌సొసైటీ’ సభ్యుడిగా విద్యా రంగంలో నాణ్యతా ప్రమాణాల కల్పనకు కారకులయ్యారు.

‘భారతదేశ ఆర్థిక చరిత్ర’ అనే గ్రంథాన్ని రెండు సంపుటాలుగా 1934లో ప్రచురించారు. ‘భారత రాజ్యాంగము’ అనే గ్రంథాన్ని 3 సంపుటాలుగా రచించారు. ‘మహాత్మా గాంధీ జీవితం’ అనే గ్రంథాన్ని వెలువరించారు. వీరి ఆధ్యాత్మిక రచనలు ‘గోవింద రామాయణము’, ‘ఉత్తర రామచరిత్ర’ ప్రసిద్ధ గ్రంథాలు. స్వాతంత్య్ర సమరయోధుడిగా, ఆధ్యాత్మిక వేత్తగా ఘనకీర్తినొందిన ఆత్మకూరి గోవిందాచార్యులు తమ 78వ ఏట (1973 డిసెంబర్‌ 9) ‌కీర్తి కాయులయ్యారు.

మహావక్త ‘చెరుకువాడ’

గంగాఝరి వంటి ఉపన్యాస పటిమతో పర ప్రభుత్వంపై విమర్శల వర్షాన్ని కురిపించి, తెలుగు వారిలో జాతీయ భావాన్ని, స్వేచ్ఛా పిపా••ను రగిల్చిన మహావక్త ‘ఆంధ్ర డెమొస్తనీస్‌’ ‌చెరుకువాడ వెంకట నరసింహం. కృష్ణా జిల్లా దివి తాలూకా, ఘంటసాల గ్రామంలో మార్చి 1, 1887న సీతారామయ్య, లక్ష్మీనరసమ్మ దంపతులకు జన్మించిన ఆయన ప్రాథమిక విద్య మేనమామల ఇంట (యార్లగడ్డలో) సాగింది. బందరులో మెట్రిక్యులేషన్‌ ‌చదివి మద్రాసు విశ్వ విద్యాలయ స్థాయిలో ప్రథమశ్రేణిలో ఉత్తీర్ణు లయ్యారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా న్యాయశాస్త్ర చదువుకు స్వస్తి చెప్పారు. 1907లో జవారు పేట పాఠశాలలో కొద్ది కాలంలో ఉపాధ్యాయునిగా పనిచేశారు. గుంటూరు నుంచి వెలువడిన ‘దేశాభి మాని’ పత్రికలో (1908-09), మరికొంత కాలం ‘కృష్ణా పత్రిక’లో ఉప సంపాదకునిగా పనిచేశారు. గుడివాడ తాలుకా, కౌతవరంలో ‘ఆంధ్రలక్ష్మి జాతీయ విద్యాలయం’ (1910-18) స్థాపించి ప్రధానోపాధ్యా యునిగా అనేక మంది ఉత్తమ విద్యార్థులను, దేశభక్తులను తయారుచేశారు. 1919లో బందరు జాతీయ కళాశాలలో అధ్యాపకునిగా చేరారు. ఆ తరువాత కొంతకాలానికే గాంధీజీ ఇచ్చిన సహాయ నిరాకరణ ఉద్యమానికి నాటి చాలా మంది నాయ కుల మాదిరిగా ప్రభావితులయ్యారు. ఆ ఉద్యమ ప్రచార సారథిగా అనేక జిల్లాలలో పర్యటించారు. 1920 అక్టోబరు 30న తణుకు తాలూకా కాంగ్రెస్‌ ‌ప్రథమ సమావేశంలోను, ఆ మరునాడు నరసాపురం తాలూకా కాంగ్రెస్‌ ‌సమావేశంలోను, ఆ వెంటనే (నవంబరు 1) తణుకు తాలూకా కాంగ్రెస్‌ ‌ద్వితీయ సమావేశంలోను ఉద్వేగంగా ప్రసంగించారు.

ఖద్దరు ప్రచారయాత్రలో భాగంగా బందరులో (1929) గాంధీజీ చేసిన ప్రసంగాన్ని చెరకువాడ చక్కటి తెనుగులో అనువదించి సభికుల మన్ననలు అందుకున్నారు. ఆయన 1930 ఉప్పు సత్యా గ్రహంలో పాల్గొన్నందుకు రాజమండ్రి, నెల్లూరు, కడలూరు జైళ్లలో ఏడాది పాటు కఠిన శిక్షను అనుభవించారు.

1919 చట్ట ప్రకారం జరిగే ఎన్నికల్లో ఎవరూ పోటీ చేయరాదని, ఓటు వేయరాదని పిలుపు నిచ్చారు. ఆయన ప్రబోధం ప్రజల ఆమోదాన్ని పొందింది. జిల్లాలో 5 శాతానికి మించి ఓటింగులో పాల్గొనలేదు. సులభ, సత్వర న్యాయకోసం పంచాయతీ న్యాయస్థానాలు ఏర్పరచుకుని, ప్రభుత్వ కోర్టులను బహిష్కరించాలని ఏలూరులో జరిగిన (1921 జనవరి 1) మహాసభలో పిలుపునిచ్చారు. ఆయన ఉపన్యాసాలు వినటానికి ప్రజలు తండోపతండాలుగా తరలి రావడాన్నిబట్టి వారి వాక్‌ ‌ప్రవాహ వైదుష్యం అర్థ్ధమౌతుంది.

చెరుకువాడ వారి ఉపన్యాస పటిమను ముచ్చటించేటప్పుడు ఒక సంఘటనను ఉదహ రిస్తుంటారు. ఒకనాడు ‘కృష్ణాపత్రిక’ కార్యాలయంలో భోగరాజు పట్టాభి సీతారామయ్య తదితర మిత్రులు సమావేశమైనప్పుడు కౌతా రామశాస్త్రి వారిని ఉద్దేశించి ‘పట్టాభీ! నీవు అసంఖ్యాకంగా అంకెలు క్రోడీకరిస్తూ బ్రహ్మాండంగా ఉపన్యాసం సాగించినా, నేను సమాసాలు గుప్పుతూ కఠిన భాషా ప్రయోగంతో అనర్గళంగా ఉపన్యసించినా, కృష్ణారావు తన సంపాదకీయంలోనూ ప్రసంగించినా ప్రజలకు చేరేది తక్కువ. దీనికంటే మనం మనకు తెలిసిన విషయాలు నరసింహం గారికి చెబితే ఆయన ప్రజల హృదయా లకు హత్తుకొనేటట్లు పిట్టకథలతో, ఉపమానాలతో హాస్యరసాన్ని మిళితం చేస్తూ ఉపన్యసిస్తే ఎక్కువ లాభం ఉంటుంది. దాని వలన ప్రజలకు, దేశానికి ప్రయోజనం కలుగుతుంది’ అన్నారట.

ఉపన్యాస ఝరితోపాటు అద్భుత రచనా పాటవం కలిగిన చెరుకువాడ స్వరాజ్యదర్పణ, శాసనసభలు, మల్లుతాను మహాసభ, అరణ్య రోదనము, హక్కు విడుదల దస్తావేజు, రాజకీయ పంచాంగం అనే గ్రంథాలను రాశారు. చెరకువాడను సమకాలీన సమాజం ‘భీమడింఢిమ’, ‘ఉపన్యాస కేసరి’, ‘ఉపన్యాస చక్రవర్తి’, ‘చెరకురస ప్రవాహం’ బిరుదులతో సత్కరించింది.

పరాయిపాలకులను గడగడలాడించి, జాతీయ ఉద్యమంలో సర్వస్వం త్యాగం చేసిన చెరకువాడ వంటి నేతలు స్వప్రజల మన్ననలు అందుకోలేక పోయారని, అవకాశవాద రాజకీయాలలో ఇమడలేక పోయారని వ్యాఖ్యలు ఉన్నాయి. 1952 ఎన్నికలలో ప్రజాపార్టీ తరఫున బందరు అసెంబ్లీ నియోజక వర్గం నుండి పోటీ చేసి ఓటమిపాలు కావడాన్ని ఇందుకు ఉదహరిస్తారు. కాంగ్రెస్‌ ‌రాజకీయాలలో తలమున కలవుతూ, ఉపన్యాస కేసరిగా తిరిగిన ‘నరసింహం’ గారు ఆర్థిక ఇబ్బందుల్లో పడినప్పుడు ఆయన రాజకీయ శిష్యులు గొట్టిపాటి బ్రహ్మయ్య, నార్ల వెంక టేశ్వరరావు, మోటూరి సత్యనారాయణ మున్నగు వారు కొంత మొత్తం సమీకరించి అందించారు. శేష జీవితంలో మానసిక, ఆర్థిక, ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటూ చెరుకువాడ 1964 జూన్‌ 23‌వ తేదీన తనువు చాలించారు.

– డా. గాదం గోపాలస్వామి, రిటైర్డ్ ‌ప్రిన్సిపాల్‌,

‘‌భారత స్వాతంత్య్రోద్యమంలో పశ్చిమగోదావరి జిల్లా యోధులు’ నుంచి

About Author

By editor

Twitter
Instagram