భారతదేశంలో ధర్మానికి ప్రతీక విక్రమార్క సింహాసనం. ప్రజారంజక పాలకులు మాత్రమే అధిష్టించగలరు. కొరవి గోపరాజు అనే కవి ఈ సింహాసనం నేపథ్యంతో ‘సింహాసన ద్వాత్రింశిక’ కథాకావ్యం రాశాడు. ద్వాత్రింశిక అంటే 32 సాలభంజికలు (బొమ్మలు). అవి ఆ సింహాసనాన్ని అధిష్ఠించే మార్గంలో ఉన్నాయి. దానిని అధిష్టించిన విక్రమార్కుని గురించి, ఆయన ధర్మ పరిపాలన గురించి అవి కథలు చెపుతాయి. అదొక రమ్యామృత కథా తరంగిణి. అన్ని కథలు ప్రజా సంక్షేమమే ఇతివృత్తంగా సాగుతాయి. ప్రజల సంక్షేమం కోసం విక్రమార్కుడు ప్రాణాలను తృణప్రాయంగా సమర్పించడా నికి సిద్ధపడతాడు, సాధిస్తాడు. అలాంటి సింహాసనాన్ని భోజరాజు అధిష్టించ పూనుకున్నప్పుడు సాలభంజికలు చెప్పిన కథలే ఇవన్నీ.
తెలుగులో కేతన ‘దశకుమార చరిత్ర’ రచించి కథాకావ్యాలకు శ్రీకారం చుట్టాడు. అది సంస్కృత మహాకవి దండి కావ్యానికి అనువాదం. మంచెన కేయూర బాహుచరిత్ర కూడా ఈ కోవలోనిదే. మూడవది కథా సరిత్సాగరం. అనంతామాత్యుడు భోజరాజీయం రాశాడు. వీటి తరువాత తెలుగువారికి అందిన కథా కావ్యం కొరవి గోపరాజు ‘సింహాసన ద్వాత్రింశిక’. ఇది సంస్కృత విక్రమార్క చరిత్రకు అనువాదమే. అయినా గోపరాజు సందర్భానుసారంగా కొన్ని కొత్త కథలు చేర్చినాడు. పుత్తేటి రామభద్రకవి సకల కథా సారసంగ్రహము, వెన్నెలకంటి అన్నయ్య షోడషకుమార చరిత్ర, కూచిరాజు ఎర్రన భేతాళ పంచవింశతి, పాలవేకరి కదిరీపతి శుక సప్తతి, అయ్యలరాజు నారాయణామాత్యుడు హంస వింశతి, ఎర్రన సకల కథా నిధానము ఈ కోవలోనివే.
గోపరాజు కొరవి గ్రామవాసి. అదే ఇంటిపేరుగా స్థిరపడింది. ఈ వంశ మూల పురుషుడు వెన్నా మాత్యుడు. ఈయన చందవోలును రాజధానిగా చేసుకొని తెలుగుదేశాన్ని ఏలిన వెలనాటి పృథీశ్వరాజుకు ప్రధానమంత్రి. గోపరాజు తండ్రి కసవరాజు, తల్లి కామాంబిక. కసవరాజు వేముగల్లు పాలకుడు మల్ల నరేంద్రునకు మంత్రిగా ఉన్నాడని గోపరాజు వివరించాడు.
ఇందులోని 21వ కథలో భువనగిరి (నల్గొండ) ఓరుగల్లు (వరంగల్లు), గోదావరీ నది, కాళేశ్వరం (అదిలాబాదు) ధర్మపురి (కరీంనగర్‌ను)ల వర్ణనలు ఉన్నాయి. కాబట్టి గోపరాజు నేటి కరీంనగర్, వరంగల్ జిల్లా ప్రాంతంవాడు కావచ్చునని అంచనా. వీరి కాం మీద కూడా భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. గోపరాజు అష్ట భాషా కోవిదుడని పండితుల అభిప్రాయం. దానిలో సత్యం ఉంది. సంస్కృతం, షట్ ప్రాకృతాలు, తెలుగు కలిపితే అష్ట భాషలు. ఆయన సంస్కాృతాంధ్రాలలో చక్కటి పాండిత్యం గలవాడనడంలోను సందేహం లేదు. ప్రాకృత భాషా పాండిత్యం ఉందని చెప్పడానికి ఆయనొక పద్యంలో ప్రాకృత పదాలు వాడడమే నిదర్శనం.
ఉజ్జయిని రాజధానిగా మాళవను భర్తృహరి పరిపాలించేవాడు. భార్య అనంగసేన దుష్ప్రవర్తనకు విసిగి, తమ్ముడ•• విక్రమార్కునకు పట్టం గట్టి అడవులకు వెళ్లిపోయాడు. విక్రముడు రాజై తన సాహస కృత్యాలతో భేతాళుని వశం చేసుకొని ప్రజారంజకంగా రాజ్యమేలాడు. ఇతడు స్వర్గానికి కూడా వెళ్లి రంభా ఊర్వశుల వివాదం తీర్చి, ఇంద్రుని చేత దివ్య సింహాసనం పొందాడు. చిరకాలం పాలించి ప్రతిష్టానపురంలోని రెండున్నర సంవత్సరాల కన్యకు పుట్టిన శాలివాహనుని చేతిలో మరణించాడు. దివ్యవాణి ఆదేశాలతో మంత్రులు విక్రమార్కుని సింహాసనాన్ని భూస్థాపితం చేసి, ఆ భూమినొక బ్రాహ్మణుడికి దానమిచ్చారు. ఇతడి వంశీయుడొకడు ఆ భూమిలో జొన్న, శనగ పైరు వేసి సరిగ్గా సింహాసనమున్న దిబ్బ మీదే మంచె నిర్మించి పొలానికి కాపలా కాసేవాడు.
ఒకరోజు భోజరాజు సైన్యంతో వచ్చాడు. విప్రుడు మంచెపై ఉన్నప్పుడు సేనను ఆహ్వానిస్తున్నాడు. దిగితే తిట్ల దండకం అందుకుంటున్నాడు. ఇది గమనించి భోజరాజు ఆ భూమిని కొని మంచె ఉన్న చోట త్రవ్వించగా సింహాసనం బయటపడింది. కానీ ఎంత ప్రయత్నించినా అది పైకి రాలేదు. మంత్రి ఆలోచనతో శాంతులు జరిపిన అనంతరం వచ్చింది. ఇక్కడే నందభూపాలుడు బహుశ్రుతుడు అనే మంత్రి వలన బ్రహ్మ హత్యాపాతకం నుంచి తప్పించుకొన్న కథ చెబుతాడు రచయిత (ససేమీరా కథ).
ఈ కథలలో నాటి సేద్యం, సామాజిక జీవన వర్ణన కూడా ఉంటాయి. విక్రమార్కుని ఉద్యానవనంలోని మామిడి, అశోక, వకుళ, పున్నాగ, జంబూ వృక్షాల గురించి ఒక్కొక్క పద్యం, చింతచెట్టు గురించి 8 పద్యాలు చమత్కారంగా రాశాడు (3-145). వస్త్ర విశేషాల ప్రస్తావన గమనిస్తే విక్రమార్కుని అంతఃపుర స్త్రీలు నానా విధాలైన వస్త్రాలు ధరించారనీ, వాటి పేర్లతో సహా చెప్పాడు. అప్పుడు ఉన్న 49 పట్టు, నూలు చీరల ప్రస్తావన కూడా చేశాడు. పాల్కురికి సోమనాథుడు బసవ పురాణంలో ఏకంగా 56 పట్టు-నూలు చీరలను పేర్కొన్నాడు. వాటిలో కొన్నిటిని గోపరాజు కూడా పేర్కొన్నాడు. ఈ ఉభయుల రాతలను బట్టి కాకతీయ రాజ్యంలో చేనేత పరిశ్రమ ఉచ్ఛస్థితిలో ఉండేదని తలచవచ్చు. ఆనాడు రాణులు నఖ శిఖ పర్యంతం 14 విధాలైన ఆభరణములను ధరించినట్లు కూడా గోపరాజు చెప్పాడు (3-188). రాజ్యం, రాజు ఈ ప్రస్తావన కూడా తెచ్చాడు.రాజ కర్తవ్యాలను ఈ సీస పద్యంలో చెప్పాడు.
‘‘దుర్గ రక్షణమును, దుష్ట శిక్షణమును
శిష్ట పాలనమును సేయవలయు
వర్ణధర్మములను వనములు గుళ్లును
జల జాకరంబులు నిలుపవలయు
గృషియు, వాణిజ్యంబు గృహ జీవధనములు
నాయుర్ వ్యయంబులు నరయవలయు’’
(4-83) అన్నాడు.
దుర్గరక్షణ, దుష్టశిక్షణ, శిష్టపాలన వంటివన్నీ సరే. నీళ్లు నిలువ చేసి వ్యవసాయానికి సహకరించ మన్నాడు. వాణిజ్యం ద్వారా గృహ జీవితాన్ని కొన సాగించాలని చెప్పడం విశేషం. ఖర్చులు తగ్గించు కోమని చెప్పడం మరీ విశేషం.
ఆనాటి మల్లయుద్ధ ప్రస్తావన కూడా ఉంది. కలహ కంటక, ఏకాంగ వీరుడు అనే ఇద్దరు భటులు పంతంతో తలపడతారు. ఇక్కడే ద్వంద్వ యుద్ధ పద్ధతులు, నియమాలు, మల్లుల వస్త్రధారణ, 9 విధాలైన పట్లు వివరించాడు (7-45, 64).
గోపరాజు మంచి, దుశ్శకునాల గురించి పుష్కలంగానే చెప్పాడు. అవి ఇప్పటికీ చాలామంది పాటిస్తున్నవే కూడా. స్త్రీలకు సంబంధించి కొక్కోకంలో చెప్పిన నాలుగు జాతులు పద్మినీ, చిత్తినీ, శంఖినీ, హస్తినీ లక్షణాలను ఆయన కూడా వివరించాడు (1-214). భర్తృహరి భార్యావంచితుడై స్త్రీల చంచలత్వాన్ని అసహ్యించుకొనే ఘట్టాన్ని (1-98, 99, 100) వివరించాడు.
ఇంకొన్ని కథలు చూద్దాం. మొదటి కథలో రంభా ఊర్వశుల నర్తన నైపుణ్యం తెలుసుకోవడానికి ఇంద్రుడు విక్రమార్కుని పిలిపిస్తాడు. ఆ పోటీలో గెలిచిన వారిని తరువాత విశ్వామిత్రుని తపోభంగం కోసం పంపుతాడు కూడా. ఇది విక్రమార్కుని విద్వత్తును తెలిపే కథ. అందుకే మహిమాన్విత సింహాసనాన్ని బహుమతిగా పొందాడు. నాల్గవ కథ స్త్రీ రక్షణకు సంబంధించినది. మధురానగరం దగ్గర ప్రతి రాత్రి ఒక స్త్రీని బాధిస్తున్న రాక్షసుడి చంపి, స్త్రీల సంక్షేమానికి కృషి చేశాడు. 11వ కథ స్త్రీ వ్యామోహం గురించి చెబుతుంది. విశాలా నగరంలో నందుడనే రాజు గొప్ప పరాక్రమ వంతుడు. కానీ భార్యా వ్యామోహం. భార్య భానుమతిని విడిచి నిమిషం కూడా ఉండలేడు. సింహాసనం మీద కూడా ఆమెతో కలిసి మాత్రమే కూర్చునే వాడు. మహా పాతకాలు చేసినవారు జలనిధి సంజాత ధనుష్కోటి దగ్గర స్నానమాచరిస్తే పాప పరిష్కారమవుతుందని తెలియజెప్పాడు రచయిత.
27వ సాలభంజిక చెప్పే కథలో జూదం గురించి చెప్పాడు. చతురంగం, పాచికలు, పులిజూదం వంటి ఆటల వివరాలు ఉన్నాయి (10-87). చోరకళను గూర్చి రాస్తూ చోరులు ఎలాంటి వేషంతో ఉంటారో, వెంట ఏయే వస్తువులు పట్టుకుని వెళతా వివరించాడు (10-117). గణకుల ప్రస్తావన కూడా ఉంది. గణకుని విధులు- ఆదాయ- వ్యయాల లెక్కలు, రాయకూడని విధానాలు కూడా విపులంగా వివరించాడు. కోశాల దగ్గర ఉండే గణికులు రాసిన లెక్కలను, రాతలను ప్రభువే స్వయంగా పరిశీలించాలంటాడు గోపరాజు. ఈ గణికులే కరణాలట (1-99, 101). సేవకుని విధులు, ఉత్తమ భృత్య లక్షణాలు, దుష్ట సేవక లక్షణాలు కూడా గుర్తు చేశాడు (11-106). చేపలవేట, డేగల వేట వివరాలూ ఉన్నాయి. ఆ కాలంలో ఏయే పక్షులను వేటాడేవారో, వాటిలో ముఖ్య జాతులేవో చెప్పాడు (1-238).
గోపరాజు చక్కని పాండిత్యం గలవాడు కనుకనే అతని ప్రయోగాలను సుప్రసిద్ధ వ్యాకరణ కర్త పరవస్తు చిన్నయ్యసూరి తీసుకున్నారు. ఇది ‘తెనుగున దేటగా కథలు తెల్పిన గావ్యము’ (1-32). గోపరాజు తన కావ్యాన్ని హరునకు, హరికి సమర్పించాడు. ఇతనికి పూర్వం తిక్కనాదులు తమ తమ కృతులను హరిహర నాథునకు సమర్పించారు. ఇతడు హరిహరులను వేరుగా, కావ్యారంభమున శివుని ఆ తరువాత కేశవుని నుతించాడు. అవతారికలో సింహాసన ద్వాత్రింశిక ‘కథా కథన మూలకారణమైన అంబికారమణుండును, మత్ కవితా సంపత్తి సంధాయకుండగు లక్ష్మీనాయకుండును గావ్య నాయకులుగా’ నియమించాడు.
కాకినాడ ఆంధ్ర సాహిత్య పరిషత్తు పుస్తక భాండాగారంలో ద్వాత్రింశిక రెండు ప్రతులు ఉన్నాయి. ఒకటి తాళపత్ర పతి, రెండవది మద్రాసులోని ప్రాచ్య లిఖిత పుస్తక భాండాగారంలో ఉన్న ప్రతుల నుండి పాఠాలు గ్రహించి రాయించిన కాగితపు ప్రతి. ఇవిగాక పోతాప్రెగడ బ్రహ్మానందరావు పంతులు కడ లభించిన వ్రాత ప్రతిని 1936లో ప్రథమ భాగాన్ని, 1960లో మళ్లీ ప్రథమ భాగమే ద్వితీయ ముద్రణకు నోచుకున్నది. సింహాసన త్రింశిక ‘స్వతంత్రకావ్యము కాదు. ఇది సంస్కృత గ్రంథానికి తెలుగు సేత అని కవియే చెప్పినాడు (1-35). వెంపరాల సూర్యనారాయణశాస్త్రి ప్రథమ ముద్రణ పీఠికలో ‘దీనికి మూలము కథా సరిత్సాగరము. ఆ సాగరము నుండి ఈ రత్నము నెత్తి చక్కగా సానబట్టి ఆంధ్ర సరస్వతికి, బూజ యొనర్చిన మహాకవి గోపరాజు’ అని ప్రశంసించారు. కాగా, అచ్చువేసిన మూలమొకటి- విక్రమార్క చరిత్రం ఉంది. కానీ అందులో కథల వరుస ఇందులో కానరాదు అని కూడా వెంపరాల చెప్పారు.
మూలం:
1) సింహాసన ద్వాత్రింశిక/ కొరవి గోపరాజు ప్రణీతము/ పరిష్కర్త : గడియారం రామకృష్ణ శర్మ.
2) సింహాసన ద్వాత్రింశిక (ద్వితీయభాగము)/ కొఱవి గోపరాజ కవికృతము 1933.
డా. కాశింశెట్టి సత్యనారాయణ
విశ్రాంత ఆచార్యుడు