అసత్యాలను మళ్లీ మళ్లీ చెబుతూ అవే నిజమనేలా గోబెల్స్ ‌ప్రచారం చేయడంలో సిద్దహస్తులైన కాంగ్రెస్‌ ‌పార్టీ నేతలు ‘నవ్వి పోదురు గాక మాకేటి సిగ్గు’ అనేలా దిగజారారు. వరుసగా మూడు లోక్‌సభ ఎన్నికలతో పాటు పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన కాంగ్రెస్‌ ‌తన పరాజయాలకు సాకులు వెతుకుతూ ప్రజా తీర్పును అపహాస్యం చేస్తోంది. 2019లో ఈవీఎం యంత్రాలపై బురదజల్లిన కాంగ్రెస్‌ 2024 ‌నుండి ‘ఓట్‌ ‌చోరీ’ అంటూ, తాజాగా ‘సర్‌’ ‌పక్రియను తప్పుపడుతోంది. ఎన్నికల్లో వరుసగా ఎదురవుతున్న ఓటములపై ఆత్మవిమర్శ చేసుకోకుండా అక్రమాలంటూ విమర్శిస్తున్న కాంగ్రెస్‌ ‌బృందం వాస్తవాలను స్వీకరించే స్థితిలో లేదు. దేశ ఎన్నికల్లో అక్రమాలు జరుగుతున్నాయంటున్న కాంగ్రెస్‌ అ‌క్రమాల ప్రక్షాళనకు మాత్రం అంగీకరించడం లేదు. దేశవ్యాప్తంగా ప్రజలు ‘కాంగ్రెస్‌ ‌ముక్త్ ‌భారత్‌’ ‌కోరుకుంటుంటే ఆ పార్టీ నేతలు ‘ఆత్మవంచన’ చేసుకుంటూ పరువు తీసుకుంటున్నారు.

భారత ఎన్నికల సంఘం (ఈసీ) ఓటర్ల జాబితాలో ప్రక్షాళన చేపడుతూ ప్రత్యేక సమగ్ర సమీక్ష(ఎస్‌ఐఆర్‌ – ‌సర్‌) ‌కార్యక్రమాన్ని నిర్వహించడం దేశంలో నిత్యం జరిగే పక్రియే. దేశంలో ఇప్పుడే మొదటిసారిగా ‘సర్‌’ ‌చేపడుతున్నట్టు బిహార్‌లో చేపట్టిన ఓటర్ల జాబితా ప్రక్షాళనను తప్పుపడుతూ కాంగ్రెస్‌ ‌నేతృత్వంలో ‘ఇండి’ గ్రూప్‌లోని పార్టీలు హడావుడి చేసినా బీహారీలు వారికి అసెంబ్లీ ఎన్నికల్లో తగిన బుద్ది చెప్పారు. ఎన్నికల్లో ఓటమి తప్పదని ముందే నిర్థారణకు వచ్చిన కాంగ్రెస్‌ ‌సక్రమంగా ఎన్నికలు జరిగితే తమదే గెలుపంటూ సన్నాయి నొక్కులు నొక్కింది. ఎన్నికల ఫలితాల అనంతరం ఓటమిని కప్పిపుచ్చుకునేందుకు ‘సర్‌’‌తోనే తాము ఓడిపోయామని, ఈసీని, కేంద్ర ప్రభుత్వాన్ని తప్పు పడుతూ నిరసనలకు పిలుపివ్వడం ‘ఆడలేక మద్దెల ఓడు’ అన్నట్టుంది. ఎన్నికలకు ముందు ‘సర్‌’ ‌చేపట్టి బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏకు ప్రయోజనం చేకూర్చేలా ఉద్దేశపూర్వకంగా ముస్లిం సామాజిక ఓట్లను తొలగిస్తున్నారని ‘ఇండి’ కూటమి పార్లమెంట్‌లో, దేశ వ్యాప్తంగా నిరసనలు చేపట్టింది. ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు విఫల యత్నం చేసింది.

బుజ్జగింపు రాజకీయాల్లో సిద్ధహస్తులైన హస్తం పార్టీ నేతలు బిహార్‌లో ‘సర్‌’‌పై మొదటి నుండి అసత్యాలు ప్రచారం చేశారు. తొలుత రాష్ట్రంలో కోటి మంది ఓటర్లను తొలగిస్తున్నారని కాంగ్రెస్‌తో పాటు మేధావి వర్గం కూడా ఆరోపించింది. దీనికి ప్రతిస్పందనగా ఆరోపణలను నిరూపిస్తూ అఫిడవిట్లు దాఖలు చేయమని ఈసీ కోరితే రాహుల్‌ ‌గాంధీ, ఆయన బృందం నేతలు ఎవరూ ముందుకు రాలేదు. ‘బట్ట కాల్చి మొహం మీద వేసినట్టు’ నిరాధారణ ప్రకటనలకే పరిమితమయ్యారు. బిహార్‌లో మృతి చెందిన, అక్కడ నివసించని, ఆధారాలు చూపించలేని ఓటర్లను తొలగించిన ఈసీ అర్హులు తిరిగి దరఖాస్తు చేసుకోవడానికి పలు అవకాశాలిచ్చింది. తుది పరిశీలన అనంతరం అనర్హులైన 65 లక్షల మందిని జాబితా నుండి తొలగించడంతో జూన్‌ 4, 2025‌న 7.89 కోట్ల మందిగా ఉన్న ఓటర్ల సంఖ్య సెప్టెంబర్‌ 30, 2025‌నాటికి 7.24 కోట్లకు చేరింది. దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీం కోర్టు ఆదేశాలకు అనుగుణంగా తొలగించిన ఓటర్ల వివరాలను ఈసీ అధికారిక వెబ్‌సైట్‌లో పెట్టారు. బిహార్‌ ‌రాష్ట్రంలో ‘సర్‌’‌కు ముందు జరిగిన 2024 లోక్‌సభ, ‘సర్‌’ అనంతరం 2025 అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను పరీశిలిస్తే ‘ఇండి’ కూటమి ప్రచారం ఎంత అవాస్త వమో తేటతెల్లమవుతోంది. పార్టీలవారీగా పోలైన ఓట్ల శాతాన్ని పోల్చి చూసినప్పుడు బీజేపీకి 2024లో 20.52 శాతం, 2025లో 20.08, జేడీ (యూ)కు 2024లో 18.52, 2025లో 19.25, ఆర్జేడీకి 2024లో 22.14, 2025లో 23, కాంగ్రెస్‌కు 2024లో 9.20, 2025లో 8.71 శాతం ఓట్లు వచ్చాయి. ఈ గణాంకాలను పరిశీలిస్తే ఈ నాలుగు పార్టీల మధ్య రెండు ఎన్నికల్లో వ్యత్యాసం స్వల్పంగానే ఉందనేది వాస్తవం. ‘ఇండి’ గ్రూపు నేతలు ఆరోపిస్తు న్నట్టు బిహార్‌ ‌రాష్ట్రంలో ఉద్దేశపూర్వకంగా, భారీగా ఒక వర్గం వారి ఓట్లు తొలగించినా ప్రధాన మైన నాలుగు పార్టీలకు రెండు ఎన్నికల్లోనూ దాదాపు అవే శాతం ఓట్లు ఎలా వచ్చాయో వారే చెప్పాలి.

రాహుల్‌ ‌గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్‌ ‌పార్టీ రోజురోజుకూ ప్రజాదరణకు దూరమవుతోంది. పేరుకు పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ‌ఖర్గే అయినా పార్టీలో కర్త, కర్మ, క్రియా అన్నీ రాహుల్‌ ‌గాంధీయే. అందుకే ఆ పార్టీ నేతలందరూ రాహుల్‌ ‌గాంధీని ప్రధానమంత్రి చేయడమే తమ లక్ష్యం అని చెబుతుంటారు కానీ మల్లికార్జున్‌ ‌ఖర్గే, ఇతర పేర్లు చెప్పరు. కాబోయే ప్రధాన మంత్రిగా కలలు కంటున్న కాంగ్రెస్‌ ‌యువరాజు రాహుల్‌ ‌గాంధీ ప్రజాదరణలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో ఎక్కడా సరితూగలేకపోతున్నారు. దీంతో ఆయన ఎన్నికల పక్రియపై బురదజల్లడం ప్రారంభించారు. 2019లో ఈవీఎంలలో మోసాలున్నాయన్నారు. న్యాయస్థానం సహా ఆ ఆరోపణలు ఎక్కడా నిలబడక పోవడంతో 2024 నుండి ఓట్‌ ‌చోరీ అంటూ ‘సర్‌’‌ను తప్పుపడుతున్నారు. ఇక్కడే రాహుల్‌ ‌గాంధీ నిలకడ లేని తత్త్వం బయటపడుతోంది. నిరాధార ఆరోపణలు చేయడం, తర్వాత ఆ అంశాలను పక్కదారి పట్టిం చడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్యగా మారింది. ఎన్నికల అక్రమాలపై తాను బాంబులు లాంటి నిజాలను బయటపెడతానని మీడియాలో ప్రచారం చేసుకున్న రాహుల్‌ ‌చివరికి పేలకుండా తుస్సు మనిపించారు.

ఆగస్టు 8, 2025న దేశంలో బీజేపీ ఈసీతో కుమ్మక్కై ‘ఓట్‌ ‌చోరీ’ చేస్తోందని ‘ఆటం బాంబు’ పేరుతో ఆయన తొలుత ఆరోపించారు. ఇందుకు ఉదాహరణగా కర్ణాటకలోని మహాదేవపురం అసెంబ్లీ సెగ్మంట్‌లో లక్ష వరకు దొంగ ఓట్లున్నాయని, వీటితోనే బెంగుళూర్‌ ‌సెంట్రల్‌ ఎం‌పీ స్థానాన్ని బీజేపీ గెలిచింద న్నారు. ఇలాంటి ఉదంతాలు దేశంలో చాలా ఉన్నాయని, బీజేపీ అక్రమంగా ఓటర్లను చేరుస్తుంటే ఈసీ చోద్యం చూస్తోందని, నకిలీ ఓట్లను ఏరివేయడం లేదని ఆరోపణలు చేశారు. తర్వాత నవంబర్‌ 5‌న, బిహార్‌ ఎన్నికల సమయంలో ‘హైడ్రోజన్‌ ‌బాంబు’ పేరుతో ‘హెచ్‌ ‌ఫైల్స్’ ‌విడుదల చేశారు. ఇందులో హరియాణలోని 2 కోట్ల ఓటర్లలో 25 లక్షల ఓటర్లు నకిలీవేనని ఆయన సెలవిచ్చారు. రాహుల్‌ ‌గాంధీ వేసిన ఈ రెండు బాంబులను పరిశీలిస్తే అవన్నీ పసలేని, పేలని ఉత్తుత్తి బాంబులేనని తేలిపో యాయి. ఉదాహరణగా ఆయన చెప్పిన నియోజక వర్గాల్లో కాంగ్రెసే గెలుస్తుందని వాస్తవాలు తెలియజేస్తు న్నాయి. పలు జాతీయ మీడియా సంస్థలు ఆయన చెప్పిన ప్రాంతాల్లో పర్యటిస్తే ఆ ఆరోపణల్లో ఎలాంటి నిజాలు లేవని బయటపడ్డాయి. మరోవైపు ఆరోపణలకు ఆధారాలతో అఫిడవిట్లు దాఖలు చేయాలని భారత ఎన్నికల సంఘం పలుసార్లు సూచించినా దాన్ని పట్టించుకోకుండా విషయాన్ని పక్కదారి పట్టిస్తూ కొత్త అంశాలను ఎత్తుకోవడం రాహుల్‌ ‌గాంధీకి పరిపాటిగా మారింది. ఆయన మాటలను పట్టుకొని కాంగ్రెస్‌ ‌శ్రేణులు నిరసనలు, సంతకాల సేకరణ అంటూ హడావుడి చేస్తున్నారు. ఇక్కడ మరొక ఆసక్తికరమైన అంశం ‘ఓట్‌ ‌చోరీ’పై 5 కోట్ల సంతకాల సేకరణ చేసినట్టు ఆ పార్టీ ప్రకటిం చింది. 2023 లెక్కల ప్రకారం దేశంలో కాంగ్రెస్‌ ‌సభ్యత్వం సంఖ్య ఐదున్నరకోట్ల కంటే అధికమే. రెండే ళ్లలో మరింత పెరిగుంటుంది. వారు ‘ఓట్‌ ‌చోరీ’పై 5కోట్ల సంతకాల సేకరించామని ప్రకటి స్తున్నారంటే ఆ పార్టీ సభ్యత్వం కంటే ఈ సంఖ్య తక్కువే.

ఎన్నికల్లో అక్రమాలంటూ కాంగ్రెస్‌ ‌నేతృత్వంలోని ‘ఇండి’ కూటమి చేస్తున్న ఆరోపణల్లో వారి ద్వంద్వనీతి బయటపడుతోంది. రాహుల్‌ ‌గాంధీ మాటలకు అర్థాలే వేరులే అన్నట్టు ఉంది. ఒక పక్క కర్ణాటక, హరియాణా రాష్ట్రాల్లో ఓట్లను చేర్చారంటూ, మరో పక్క బిహార్‌ ‌రాష్ట్రంలో ఓట్లను తొలగిస్తున్నారంటూ భిన్నమైన వాదనలు చేస్తున్నారు. నకిలీ ఓట్లను తొలగించే ‘సర్‌’ ‌పక్రియను ఎందుకు వ్యతిరేకిస్తున్నారో వారికే తెలియాలి. ‘సర్‌’ ‌ప్రధాన ఉద్దేశం అనర్హులను తొలగించి, అర్హులను చేర్చడమే. నకిలీ ఓట్లతో బీజేపీ గెలుస్తుందంటున్న వారు ‘సర్‌’‌ను ఎందుకు వ్యతిరేకిస్తు న్నారు? నకిలీ ఓట్లను చేరిస్తే ‘సర్‌’ ‌పరిశీలనలో భాగంగా వాటిని తొలగించమని కోరుతూ ఈసీకి సరైన ఆధారాలతో పత్రాలు సమర్పించవచ్చు కదా? ఓటర్ల జాబితా తయారీలో పార్టీలకు కూడా బాధ్యత ఉంటుందనే వాస్తవాన్ని కాంగ్రెస్‌ ‌బృందం కావాలని కప్పిపుచ్చుతోంది. ఓటర్లను చేర్చడంలో, తొలగిం పులో, వాటి పరిశీలనలో పార్టీలకు వెసులుబాటు ఉంటుంది. జాబితాలో నిజంగా తప్పొప్పులుంటే ఈసీ దృష్టికి తీసుకురాకుండా వారు బురద రాజకీయాలు చేస్తున్నారు.

రాజకీయ పార్టీలు స్వప్రయోజనాల కోసం ‘సర్‌’ ‌పక్రియను వ్యతిరేకిస్తున్నా ఎన్నికల సంఘం వెనకడుగు వేయడం లేదు. బిహార్‌లో ఎన్ని అడ్డంకులు ఎదురైనా ఎలాంటి చిక్కులు లేకుండా ‘సర్‌’ ‌పూర్తి చేసిన ఈసీ మరో డజను ప్రాంతాల్లో చేపడుతోంది. వీటిలో 9 రాష్ట్రాలు, 3 కేంద్రపాలిత ప్రాంతాలున్నాయి. ఛత్తీస్‌గఢ్‌, ‌గుజరాత్‌, ‌కేరళ, మధ్యప్రదేశ్‌, ‌రాజస్థాన్‌, ‌తమిళనాడు, ఉత్తరప్రదేశ్‌, ‌పశ్చిమ బెంగాల్‌, ‌గోవా రాష్ట్రాలతో పాటు కేంద్ర పాలిత ప్రాంతాలైన అండమాన్‌ ‌నికోబార్‌, ‌లక్షదీప్‌, ‌పుదుచ్చేరిలో కూడా ఇంటింటికీ తిరిగి ఓటర్ల జాబితాలో ప్రక్షాళన ‘సర్‌’ ‌కార్యక్రమాన్ని ప్రారంభించారు. వీటితో పాటు అస్సాం రాష్ట్రంలో ‘సర్‌’ ‌కాకుండా ‘స్పెషల్‌ ‌రివిజన్‌’ (ఎస్‌ఆర్‌) ‌నమూనాలో ఓటర్ల జాబితాను సవరించనున్నారు. నవంబర్‌, 2025‌లో ప్రారంభించి, ఫిబ్రవరి, 2026లో ఈ పక్రియనంతా పూర్తి చేయాలని ఎన్నికల సంఘం లక్ష్యంగా పెట్టుకుంది.

దశలవారీగా ఎన్నికల సంఘం దేశవ్యాప్తంగా చేపడుతున్న ‘సర్‌’ ‌ను లక్ష్యం చేసుకొని కాంగ్రెస్‌తో పాటు ‘ఇండి’ కూటమిలోని ఇతర పార్టీలు ఈసీపై, బీజేపీపై పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వంపై నిత్యం ఒంటికాలిపై లేచే పశ్చిమ బెంగాల్‌ ‌ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ‘సర్‌’‌ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. రాష్ట్రంలో ‘సర్‌’‌ను చేపట్టనీయం అంటూ హెచ్చరిస్తూ ఆమె స్వయంగా నిరసనలు చేపట్టారు. మరోవైపు తమిళనాడు ముఖ్య మంత్రి స్టాలిన్‌ ‌ప్రస్తుతం రాష్ట్రంలో వాతావరణం అనుకూలంగా లేదని, ఇప్పుడు ‘సర్‌’ ‌చేపట్టవదని కోరారు. కేరళలోని వామపక్ష ప్రభుత్వం, ఛత్తీస్‌గఢ్‌ ‌లోని ‘ఇండి’ ప్రభుత్వం కూడా ఇదే తరహాలో వ్యవహ రిస్తున్నాయి. బుజ్జగింపు రాజకీయాలకు ప్రాధాన్యత ఇచ్చే ఈ పార్టీల బాధంతా సర్‌తో తమకు ఇంతకాలం మద్దతుగా ఉంటున్న అక్రమంగా వలసొచ్చిన ఓటర్లను తొలగిస్తున్నారనే.

‘సర్‌’ ‌పక్రియతో నిజమైన ఓటర్లను తొలగిస్తు న్నారని ప్రతిపక్షాలు చేస్తున్న వాదనలు ఎంత అర్థరహి తంగా ఉన్నాయో ఆయా రాష్ట్రాల్లో కనిపిస్తున్న ఘటనలే నిరూపిస్తున్నాయి. ‘సర్‌’‌తో గందరగోళం నెలకొందని అది సంస్కరణ కాదని, మోపబడిన నేరం అని, ఉద్దేశపూర్వక కుట్ర అని రాహుల్‌ ‌గాంధీ అండ్‌ ‌కంపెనీ వ్యాఖ్యానిస్తుంటే దేశ సరిహద్దు పరిస్థితుల్లో భిన్నమైన వాతావారణం కనిపిస్తోంది. భారత్‌, ‌బాంగ్లాదేశ్‌ ‌మధ్య ఉత్తర 24 పరగణాల జిల్లా హకీంపూర్‌ ‌వద్ద ఉన్న బీఎస్‌ఎఫ్‌ ‌బోర్డర్‌ ‌చెక్‌ ‌పోస్టు వద్ద అక్రమ వలసదారుల రద్దీ కనిపిస్తోంది. ఇంత కాలం నకిలీ ధ్రువపత్రాలతో నెట్టుకొచ్చిన వీరు ‘సర్‌’ ‌పక్రియ చేపట్టడంతో తమ అక్రమ బండారం బయటపడుతుందనే భయంతో ‘మూటామూల్లే సర్దుకొని’ తమ స్వదేశమైన బాంగ్లాదేశ్‌కు తిరిగి వెళ్తున్నారు. నకిలీ పత్రాలుంటే కఠిన శిక్షలు తప్పవనే భయంతో ‘బతికుంటే బలుసాకు తినొచ్చు’ అనుకొని ఇంటిబాట పట్టారు. ఇంతకాలం వారి అక్రమాలకు రక్షణ కవచంగా ఉన్న పార్టీల మాట ఇకపై దేశంలో చెల్లుబాటయ్యే అవకాశాలు ఏ మాత్రం లేకపోవడంతో ‘బతుకు జీవుడా’ అనుకుంటూ మమ్మల్ని పంపించే యండి మహాప్రభో అని ప్రాధేయపడుతూ సరిహద్దు దాటుతున్నారు.

బిహార్‌ ‌ప్రజలు ‘సర్‌’ ‌కు ఆమోదం వేశారని ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నిక ఫలితాలే నిరూపించాయి. తమకు దేశవ్యాప్తంగా ఫలితాలు వ్యతిరేకంగా వస్తుండడంతో, తమకు ఇక దేశంలో రాజకీయ నూకలు చెల్లినట్టేననే భయంతో ‘సర్‌’‌ను చూసి కాంగ్రెస్‌తో పాటు ‘ఇండీ’ కూటమిలోని పార్టీలు వణికిపోతు న్నాయి. ‘కాంగ్రెస్‌ ‌ముక్త్ ‌భారత్‌’ ‌దిశగా దేశ ప్రజలు తీర్పు ఇస్తూ తమ విధానాలను ఛీకొడుతున్నారనే వాస్తవాన్ని గ్రహించకుండా కాంగ్రెస్‌ ‌పార్టీ, దానితో జతకట్టిన ఇతర పార్టీలు ‘సర్‌’‌పై అవాకులు చెవాకులు పేలుతున్నాయి.

– శ్రీపాద

About Author

By editor

Twitter
YOUTUBE