‘‌ప్రమా’ అనే సంస్కృత పదానికి బాగా తెలుసుకున్నది, యదార్థ జ్ఞానము అని అర్థం. ‘ప్రమా’ ఉన్న కారణంగా దానిని ప్రమాణం అని పిలుస్తారు. తర్కశాస్త్రం కొన్ని ప్రమాణాలపై ఆధారపడి కార్యకారణాలను విశ్లేషించే ప్రయత్నం చేస్తుంది. పాశ్చాత్యుల తార్కిక చింతనలో మనోభావనలకే అధిక ప్రాధాన్యం ఉంది.

సాంఖ్యయోగము, వేదాంతశాస్త్రం ప్రకారం… ఇంద్రియాల ద్వారా శబ్దాది విషయాలనే ధ్యానిస్తున్నప్పుడు…. అంతఃకరణం విషయాకార వృత్తిని ధరిస్తుంది. అప్పుడు అంతఃకరణలో ఒక అసంగ పురుషుని ప్రతిబింబం ఏర్పడుతుంది. ఆ ప్రతిబింబంపై తన ప్రతిబింబంతో సమానంగా తాదాత్మ్యాభిమానం ఏర్పడినప్పుడు విషయోప భోగాలపై అభిమానం పుడుతుంది.

ఇది ఎలాగంటే… స్ఫటికంపై ఎర్రని జపాకు సుమం పడినప్పుడు స్ఫటికం తన స్వనిష్ఠను వదులుకుని… ఎర్రని రూపాన్ని ధరిస్తుంది. అలాగే వృత్తితో కూడిన అంతఃకరణంలోని విషయాకారతయే ప్రతిబింబంలో ద్యోతకం అవుతుంది. అందువల్లనే ప్రతిబింబం కూడా ఎర్రని రంగు పూసుకుంటుంది. దానితో తాదాత్మ్యాభిమానం చేత బింబం కూడా తనను తాను ఎర్రనిదానను అని అనుకుంటుంది.

దర్పణం పైన ఉన్న మకిలి కారణంగా దర్పణంలోని ప్రతిబింబంలో కూడా మలినం ఉన్నట్లుగా కనిపిస్తుంది. ప్రతిబింబంతో ఏర్పడిన తాదాత్మ్యాభి మానం కలిగిన వారైనందువల్ల, ‘నా ముఖంపై మాలిన్యం ఉంది’ అని భావించి… బింబసమానులైన వారు కూడా చింతాగ్రస్తులవుతారు. అదే విధంగా విషయాలపై ఉపరక్తమై అంతఃకరణంలో పురుషుని ప్రతిబింబం ఉంటుంది. అట్టి ప్రతిబింబంతో తాదాత్మ్యాభ్యాసం (అభేదాభ్యాసం) కారణంగా బింబంలో కూడా విషయపరాగాల పట్ల అభిమానం కలుగుతుంది. ఈ విధంగా అసంగము, స్వయం ప్రకాశము అయిన చైతన్యం నుంచి విషయ పరాగం ద్వారా విషయాల ప్రకాశం కలుగుతుంది.

బర్కిలీ (1685-1753) అభిప్రాయంలో, ఉష్ణతతో సమానంగా రూపం, సంస్థానం, గురుత్వం మొదలైనవన్నీ మనస్సులోని భావాలే. అందువల్ల రూపాదులలో కూడా అవి ఉష్ణత కంటే ఏ మాత్రం భిన్నమైనవి కాకపోవడం వల్ల ఏ విశేషమూ లేదు. ఇదే విధంగా వస్తువు గుణాత్మ కమే. గుణాలలో నిలిచిపోవడం సాధ్యం కాకపోవడం వల్ల వస్తువు వస్తువుగానే ఉండిపో తుంది. అందువల్ల గుణవిజ్ఞానం కంటే అతీతమై నది ఏదీ లేదు. భారతీయమైన వేదాంతం ప్రకారం కూడా వస్తుస్థితి ఇటువంటిదే.

శబ్దం, స్పర్శ, రూపం, రసం, గంధం మొద లైన గుణాల అభావం చేత పృధ్వీతత్త్వం కొద్దిగా భావనామాత్రంగానే ఉండిపోతుంది. పరమేశ్వ రుడు జ్ఞానమయుడు కావడం చేత వ్యవహారంలో అన్ని వస్తువులకు యధాయోగ్యమైన ఉపయోగం కలుగుతుంది. కానీ విచారము చేత వాటితో బాధితుడు అవుతాడు. అనగా అనేక ఆలోచనలు కలుగుతుంటాయి. అందువల్ల అవిచార, స్పృహణీయం కాని ఆనందం కూడా వేరుగా ఉంది. ఈశ్వరుని కల్పనా విషయాలు ‘వ్యావహారికం’ అని, ‘ధారణావిషయం’ అని పిలుస్తారు. మనం కల్పించుకున్న పదార్థాలు ‘ప్రాతిభాసికాలు’, ‘కల్పనామాత్రాలు’గా ఉంటాయి. ఇదే భేదం. బ్రహ్మము కంటే భిన్నమైనవన్నీ దృష్టి-సృష్టి మాత్రమైనవి మాత్రమే.

భౌతికవాదులు పరమేశ్వరుడిని కానీ… చేతనయే స్వతంత్రమైనది అని కానీ అంగీకరిం చరు. అందువల్ల వారి దృష్టికి ఆస్తికవాదుల దర్శనాలు బాధాకరమైనవి అవుతాయి. వారి అభిప్రాయంలో విజ్ఞాన సిద్ధమైన పదార్థానికి కూడా అస్తిత్వం ఉంది. మనసు లేదా చేతన అనేది పదార్థాలలోని గుణం మాత్రమే.

కాంట్‌ (‌సా.శ. 1724-1804) ఒక తాత్త్వికుడు, గణిత శాస్త్రవేత్త. ఆయన రాసిన ‘ప్రకృతి ఇతివృత్తం’, ‘ఊర్ధ్వలోక సిద్ధాంతం’ అనే పుస్తకాలు ప్రసిద్ధమయ్యాయి. హ్యూమ్‌ ‌ప్రతిపాదిం చిన అజ్ఞేయతత్వం నుండి విజ్ఞాన శాస్త్రాన్ని రక్షించి, ధర్మాన్ని కూడా కాంట్‌ ‌కాపాడాడు.

కాంట్‌ ‌సిద్ధాంతం ప్రకారం అన్ని వస్తువులూ పారమార్ధిక -ప్రాతిభాసిక అనే రెండు రూపాల్లో ఉంటాయి. అందువల్ల, సాధారణ వ్యక్తికి వస్తువు తాలూకు అసలు స్వరూపాన్ని తెలుసుకునే అవకాశం లేదు. మనసు ఎప్పుడూ కొన్ని కారణాలతో సంలగ్నమై ఉంటుంది. వాటితో కలిసిన మనసు ద్వారానే మనం వస్తువులను అవి ఉన్నదానికంటే భిన్నమైన రూపాలతో దర్శిస్తున్నాం. ఉదాహరణకు నీలం కళ్లజోడుతో చూసే కళ్లకు అన్ని వస్తువులూ నీలంగా కనిపిస్తాయి. అలాగే ఏవో కొన్ని ‘కారణాల’తో అనుసంధానమైన మనస్సు ద్వారా దేశ కాలాదులలో వ్యాపించి ఉన్న వాటిని వస్తువులుగా గుర్తిస్తున్నాం. అనుభూతిలో వాటికి వస్తువులనే ప్రసిద్ధి కలుగుతుంది. కానీ దానికంటే ముందు రూపాదులు లేని వస్తువులే ఉండి ఉంటాయి.

సమస్త కార్యకలాపాలు సంకల్పం మీదనే ఆధారపడి ఉంటాయి. తర్కం, గణితం వంటి శాస్త్రనియమాలు కూడా సంకల్పాత్మకమైనవే. ఉదాహరణకు రెండు, మూడు కలిపితే ఐదు అవుతుంది. ఇది గణిత నియమం. కార్యం ఎప్పుడూ సకారణమే అయి ఉంటుంది. మామిడి పండు మామిడిచెట్టు నుంచే వస్తుంది. తనకంటే భిన్నమైన చెట్టునుంచి మామిడి వచ్చే అవకాశం లేదు అని తర్కశాస్త్రం చెబుతోంది. ఈ భావనలన్నీ మనసుకు సంబంధించినవే… ఎందుకంటే ఎవరికైనా మనసు ఎలా నిర్మాణమై ఉంటే… దాని ప్రకారమే ఆలోచనలు కూడా ఉంటాయి. మనోరీతుల వలెనే విషయాల పట్ల కలిగే ఆలో చనా ధోరణులు కూడా భిన్నంగా ఉంటాయి. మన ధారణల ప్రకారమే మన ప్రపంచం ఉంటుంది. అయితే, మన విచార ధారల వల్ల వస్తు వ్యవహారాలు కూడా ప్రభావితం చెందుతాయని చెప్పడానికి ఎంత మాత్రమూ వీల్లేదు.

హిందీమూలం : కరపాత్రీ స్వామి

అనువక్త : నేతి సూర్యనారాయణశర్మ

About Author

By editor

Twitter
YOUTUBE