ఆధునికాంధ్ర సాహిత్యంలో విశ్వనాథవారి కిన్నెరసాని పాటలు విశిష్ట స్థానాన్ని సంపాదించుకున్నాయి. కిన్నెరసాని గేయకావ్యంలో విశ్వనాథవారు జడ ప్రకృతిగా ఉన్న కొండను మానవీకరించి మానవత్వాన్ని పూయించి పరిమళింపజేశారు.
విశ్వనాథవారి తండ్రి శోభనాద్రి భద్రాచలం దగ్గర కాటాపురంలో కొంత పొలం కొని వ్యవసాయం చేసేవారు. ఆ ఊరు వెళ్లటానికి రాళ్లవాగును, కిన్నెరసాని వాగును దాటవలసి వచ్చేది. ఒకసారి వేసవిలో (1923)లో విశ్వనాథవారు తండ్రితో కాటాపురం వెళ్లినపుడు కిన్నెరసాని వాగును చూశారు. అక్కడున్న కొండ, కొండను ఒరుసుకొని ప్రవహిస్తున్న కిన్నెరసాని ఆయన దృష్టిని ఆకర్షించాయి. భావుకుడైన ఆ మహాకవి మనస్సులో కిన్నెరసాని గేయకావ్యంగా ఆవిష్కృతమైంది.ఆయన కిన్నెరసాని పాటలను ఎనిమిది శీర్షికలుగా వర్గీకరించారు.
1.కిన్నెర పుట్టుక 2. కిన్నెర నడకలు 3.కిన్నెర నృత్యం 4. కిన్నెర సంగీతం 5.కడలి పొంగు 6. కిన్నెర దుఃఖం 7. గోదావరి సంగమం 8. కిన్నెర వైభవం.
కిన్నెరసాని పాటల ఖండికలన్నింటిలో కట్టలు తెంచుకొని ప్రవహించింది. ఈ గేయకావ్యాన్ని విశ్వనాథవారు వసంత రుతువర్ణనతో ప్రారం భించటం ఒక ప్రత్యేకత. ఆ రుతు వర్ణనల్లో ప్రజల ఆచార వ్యవహారాలు, జీవన విధానం గొప్పగా వర్ణిం చారు.
ప్రత్యేకించి వర్షరుతువులో రైతులు పడే బాధలు, జంతువులు పడే కష్టాలు ఎంతో సహజ సిద్ధంగా వర్ణించారు. ఆయన రుతువర్ణనలను గూర్చి ‘‘నా చిన్ననాట మాయూరిలోని ప్రకృతి శోభ గ్రంథముల నుంచి రాసితి’’నని చెప్పారు. ఆయన ఊరిలోనే రుతువులన్నీ జమకూడినట్లు అద్భుతంగా వర్ణించారు.
విశ్వనాథవారి పద్య కావ్యాలు ప్రౌఢ సమాస భూయిష్ఠంగా నారికేళపాకంలో ఉండేవి. ఆయన రచనలు సాధారణ పాఠకులకు దురవగాహన అనే ప్రచారం ఉండేది. అందువల్ల ఆయన సామాన్య పాఠకులకు దృష్టిలో పెట్టుకొని గేయ కావ్యాలు రాశారు.
అప్పటికే ప్రముఖ ఆధునిక కవులైన గురజాడ అప్పారావు, రాయప్రోలు సుబ్బారావు, గరిమెళ్ల సత్యనారాయణ, బసవరాజు అప్పారావు, నండూరి సుబ్బారావు, దువ్వూరి రామిరెడ్డి వంటివారు గేయ రచనలు చేశారు. విశ్వనాథవారు గురజాడవారి ముత్యాల సరాలు వరవడిలో తనదైన శైలిలో కొత్త గేయ ఛందస్సుతో కిన్నెరసాని పాటలు, కోకిలమ్మ పెండ్లి, ‘భ్రమరగీతాలు’ వంటివి రాసి సామాన్య సహృదయ పాఠకుల మన్ననలందుకున్నారు.
ఆంగ్లభాషలో Personification అనే పక్రియను తెలుగులో మానవీకరణ అంటారు. విశ్వనాథవారు కిన్నెరసాని పాటలు తొలి పలుకుల్లో ‘‘తెలుగు కన్నెలకు వలే కిన్నెరసాని ఉద్విగ్నహృదయ’’ అంటూ పరిచయం చేస్తాడు. ఆమె మహాపతివ్రత. ఆమె భర్త ప్రేమమూర్తీ. అయినా అటు తల్లినీ, ఇటు భార్యను ఒప్పించలేక, నొప్పించలేక నిస్సహాయుడై ఉంటాడు. కిన్నెర అత్త ప్రతి విషయానికీ, ఆమెపై నింద వేసి తీరని వేదన కలిగిస్తుంది. భర్త తనను ఓదారుస్తాడనే ఆశతో ఎదురుచూసి నిరాశతో అడవుల వెంట పరుగులు తీస్తుంది.
‘‘ఇంత కోపమేమిటికే
యింత పంత మేమిటికే
ఇంతలు జగమున పతులకు
ఇంతులుసేయుదురటవే ఓహో (పుట5)
పై నాలుగు పాదాల్లో కవి ఆదిప్రాసను పాటించారు. పూర్ణ బిందు పూర్వక తకారం ప్రాసాక్షరంగా ఉన్నందున పాదాలు వినసొంపుగా సాగాయి. మూడో పాదంలో తప్ప మిగిలిన పాదాల్లో అంత్యప్రాస కూడా పాటించినందున గేయానికి మరింత శైలీ సౌందర్యం చేకూరింది.
కిన్నెర ఎంతో సుకుమారి అని చెప్పటానికి కవి కిన్నెర భర్తతో పలికించిన పలుకులే సాక్ష్యం.
‘‘రాలపైన తొలినాళుల –
కాలిడగా నోర్వలేవు
రాలనుకొండల గుట్టల
నేలాప్రవహించెదవో ఓహో (పుట 6)
పై పాదాల్లో కవి ప్రత్యేక చమత్కారాన్ని పొందుపరిచాడు. ‘రాళ్లపైన’ అనకుండా ద్విత్వ రహితంగా ‘రాలపైన’ అనడంలో కఠినత్వాన్ని తగ్గించాడు. కొంచెం గట్టిగా ఉన్న రాళ్లమీద కూడా నడవలేని సుకుమారి కిన్నెర అని ఇక్కడ ధ్వనింప జేశారు.
కిన్నెర నిలువునా నీరై వాగుగా ప్రవహిస్తుంది. కిన్నెర భర్త ఆమెను బ్రతిమిలాడుతూ ‘‘నీవు మహాపతిశీలవు కావని, నేనంటినటే! అటులంటిన నాకంఠము కఠారి త్రెంచకపోతినా!’’ అంటాడు. ఆమెకై ఏడ్చియేడ్చి కంఠము సన్నవడి కన్నులు మందగించి చివరకు అతని శరీరం శిలగా మారుతుంది.
‘‘నా ఈ దేహమిదేమో రాయి వొలగుచున్నది’’ అంటాడు.
అంతటితో అతని కథ ముగుస్తుంది.
ఇక కిన్నెర ‘‘కరిగింది కరిగింది కరిగి వరదలై పారింది / తరకల్లు కట్టింది. పరుగులు పెట్టింది’’
ఈ సన్నివేశాన్ని విశ్వనాథవారు ‘కిన్నెర నడకలు’ అనే శీర్షికతో దృశ్యీకరించి గొప్పగా వర్ణించారు.
భర్త లేని కిన్నెర ఎంత అందంగా ఉన్నా లోటులోటే కదా!
‘‘నడవగా నడవగా నాతి కిన్నెరసాని/తొడిమ యూడిన పూవు పడతిగా/ కడ సిగ్గుపడే రాచ/ కన్నెలా తోచింది/ బెడగుపోయిన రత్న పేటిలా తోచింది’’
అప్పుడు పశ్చాత్తాపంతో కిన్నెర తన భర్త రాయిలా మారి పడి ఉన్న చోట పదేపదే తిరిగింది. ఏ ఉపాయంతో తాను మళ్లీ మనిషిని కాగలనని వగచింది. తనను వీడి భర్త ఓర్చుకొనలేడు కాబోలు!
‘‘బ్రతికుండగా ఇంత ప్రణయమ్ము కలదంచు తెలిసితే/ ఇంకెంత చెలిమి వుండేదంటంచు’’అని తలపోసి సొలిసింది. తన భర్తను ‘‘నాకుమల్లే నీవు నదివోలె పారరా! జలముగా ఇద్దరము కలిసిపోదా మురా’’ అంటూ ప్రార్థించింది. తాను ఆ తప్పు మరలా చేయనని, అతని ఆన మీరనని ప్రమాణం చేసింది. కానీ ఫలితం లేకపోయింది. జలదేవతలు వచ్చి ఆమెను పదపదమని బలవంత పెట్టగా జాలుగా పారింది.ఆ సమయంలో ఆమె అందం వర్ణనాతీతం. విశ్వనాథవారు‘ఏమని వర్ణించగలమం’టారు.
‘‘పరికిణీ తొక్కాడు పదియేండ్ల కన్నెలా/
చిన్ని గంతులు వేయు తెల్లని ఆవు పెయ్యలా/
పసిపాప సెలవివారిన బోసి నవ్వులా /
వనదేవతలు ఆమెపై పూలు కుమ్మరించారు
భూదేవతలు ఎదురుపోయి దీవించారు.
వాయు దేవతలు రమ్మని పాటపాడారు.
ఇక మనసును సరిపెట్టుకున్నదేమో!
ప్రకృతి స్వాగతం పలికిందేమో!
ఆమె నడిస్తే అది నృత్యంగా మారింది.
కెరటాల నుర్వు తెరచాలులో/ నీటి పొరజాలులో/
చిటితరంగాలతోనీ / పొటి తరంగాలతో
నటనాలు మొదలెట్టింది. ‘ధణదంగిణాం.. దధోగిణ తక్కిణాం’ మద్దెలల మ్రోతలై అటు మ్రోగి ఇటు మ్రోగి చిరులొల్కు సోనలై సీరులొల్కుసోనలై మృదు తాండవం చేసింది. తెనుగు వాగై పారింది. నెత్తావి తెనుగు పాటలు పాడింది. ఇక ఆ నృత్యానికి సంగీతం తోడైంది.
‘‘అంచ కన్నియ అడవి సాగినయట్లు’’ ఆమె పాట అతి సన్నగిల్లి పోవ పొరలలో చిరుగాలి ఆ పాటను సాగించెను. ఉయ్యాలతో పాటు ఊగించెను.
ఇక్కడ నుండి కిన్నెరకు కష్టాలు మొదలయ్యాయి. విశ్వనాథవారి కల్పనాశక్తి ఎంత మహాద్భుతమో ‘కడలి పొంగు’ అనే అధ్యాయంలో కనిపిస్తుంది.
చిరుగాలి పిల్లలు పోయి సముద్రునికి కిన్నెర అందచందాలను గూర్చి చెప్పాయో, ఆమె అందమే లోకమైపోయి సలపెళసాగాడు. గలగల ఊగాడు. సముద్రునికి గంగ ఇల్లాలు. యమునాది ఇల్లాలు. కిన్నెరవాగును చూసి సముద్రునికీ ఉబలాటం ఎందుకు? నలుగురిలో తిరుగనేర్చినవాడు
‘‘పరగ కామునికై అడలిపోయెనటన్న తన కేమి పరువు’’ పొంగిపోయిన కడలిని చూసి జగాలన్నీ కళవళపడ్డాయి. తన భర్తను వదిలి వచ్చినందుకు కిన్నెర ‘‘ఈ ఏవంపు బ్రతుకు ఏల పొందితివిరా’’ అంటూ ఏడ్చింది.
రాయినీ, పొదనీ అడ్డుగా చేసుకొని దాగేందుకు ప్రయత్నించింది. తాను. చుక్కగా మారినా, మొక్కగా మారినా ఈ వగపు తప్పునేమో అనుకుంది’’ ఆమె ఏడుపు చూసి పులుగులూ, మృగాలూ, గాలులూ చేరవచ్చి ఓదార్చలేక అవి కూడా ఏడ్చాయి. గోదావరి ఈ వార్త విని కన్నీరు కార్చింది. పొంగి వచ్చింది. కెరటాలు చాచి ‘‘రారమ్మనమంది’’. కిన్నెర కూడా గోదావరి కెరటాలకు తన చిన్న అలలను అందిం చింది. గోదావరి గొప్ప గుణాలచాన, గొప్ప వంశపు రాణి. సీతారాముల వియోగాన్ని ఎరిగిన నదీమతల్లి. ఆ తల్లి కిన్నెరపై జాలిపడి ‘‘నీ దుఃఖమెంతదో తల్లీ! నన్ను నాదరువుగానమ్ము చెల్లీ’’! అంటూ చేరబిలిచింది రా! దగ్గరకు రమ్ము తల్లీ! జోదింక నిను కనడు చెల్లీ! నాదు గర్భమున నిన్ను ఆదుకుని ఉంటాను. ‘‘నీదు బొట్టును కడలి కనడు. నీదు సంగతి కడలి వినడు’’ అని అభయమిచ్చింది. కడలి రారాజుతో కాదు సతి భర్తలను కోర. ఆ వాగు పేదరాలు. అది నీకు మేలా?’ అని అందరూ హితవు పలికారు. ఆ తరువాత కడలిరాజు తన ప్రయత్నాన్ని విరమించుకున్నాడు.
కిన్నెర వైభవాన్ని చూడాలంటే ఆమె రుతువు రుతువుకు మానసికంగా, శారీరకంగా లోనైన అనుభూతిని చూడవలసిందె! కావ్యం చివరలో విశ్వనాథవారు ‘‘తెలుగు దైవమ్ము భదాద్రిపై నెలకొన్న రామయ్య. అతని దర్శనం చేసే త్రోవ కాచింది కిన్నె’• అంటాడు.
విశ్వనాథవారి కలం సందర్భాన్ని బట్టి ఒకచోట మందగమనంతో నడుస్తుంది. మరొకచోట పరుగులు తీస్తుంది. ఆపైన నృత్యం చేస్తుంది. చివరకు గమ్యాన్ని చేరి శాంత మనస్కురాలవుతుంది. ‘‘కరుణ, శృంగార, శాంత రసాలు మేళవించిన అద్భుత కావ్యం కిన్నెరసాని పాటలు’’ అని విమర్శకులు పేర్కొన్నారు. ఇందులో శబ్ద ప్రయోగాలన్నీ ఔచిత్యం శోభితాలు. రుతువర్ణలు వర్ణించటంతో విశ్వనాథ వారికి వారే సాటి అనటం అతిశయోక్తి కాదు. శరదృతువును వర్ణిస్తూ ‘‘అంచరెక్కల తోడ నరుగుదెంచో శరత్తు’ పంచలందున తెల్పుపడె కొంచెము సరిత్తు’’ అని వర్ణించినా ప్రకృతి పాఠకుల కళ్లముందు ప్రత్యక్షమవు తుంది.
విశ్వనాథవారి వర్ణనా చాతుర్యం అనితర సాధ్యంగా ఉంటుంది. ఆయన గొప్ప కవి కనకనే అంత గొప్పగా వర్ణనలు చేశారు. ఈ కావ్యంలో ‘‘కదిలింది కదిలింది కదిలింది కదిలింది / కదిలి కిన్నెరసాని ఒవగల్లు పోయింది / సుదతి కిన్నెరసాని సుళ్లుగా తిరిగింది / ముదిత కిన్నెరసాని నురుగుల్లు గ్రక్కింది’’ అంటారు.
కిన్నెర నృత్య భంగిమలను వర్ణిస్తూ ‘‘చిరుతెనెలా / అచ్చరల గొంతులా / గజ్జియల మ్రోతలా కిన్నెరటు మెరసి ఇటు మెరసి గలగలా రవళితో మెల్లగా, కెరటాల జల్లుగా ముసురెత్తెనే’’ అంటారు. ఈ వర్ణనలు పాఠకుల హృదయాలకు హత్తుకొని గొప్ప అనుభూతిని కలిగిస్తాయి. విశ్వనాథవారు ఎక్కడ సభలకు వెళ్లినా శ్రోతలు ఆయనను అర్థించి కిన్నెరసాని పాటలు పాడించుకొనేవారట.
డా।।పి.వి.సుబ్బారావు
రిటైర్డ్ ప్రొఫెసర్