‘జాగృతి’ నిర్వహించిన స్వర్గీయ కొండపాక కిషన్‌రావు స్మారక నవలల పోటీలో ప్రథమ బహుమతి పొందిన రచన

రుద్రయ చూపు గంగాధరుని వైపు.. కలుసు కుంటూ విడిపోతున్నాయి.

వివాహం ఎలాంటి ఆటంకం లేకుండా జరుగుతోంది.

తాళికట్టు శుభ ముహూర్తం సమీపించింది. అందరూ నవ వధూవరులకు ఆశీర్వదించడానికి లేచి నిలబడ్డారు.

గంగాధరుని చూపు రుద్రయ చూపుతో కలిసింది.

మరుక్షణం రుద్రయ ఎగిరి దూకి జైతుగి నడుము దొరక బుచ్చుకుని చురక ఆయన కంఠానికి గురిపెట్టాడు.

లిప్త కాలంలోనే కాకతీయ మెరపుయోధులు అక్కడున్న యాదవ ముఖ్యులపైకి లంఘించి అందరి కంఠాలకు తమ చురకలను ఆనించారు. ఇదంతా క్షణంలో వెయ్యోవంతు కాలంలో జరిగిపోయింది. పెళ్లి మండపం బిర్ర బిగదీసుకుపోయింది. మహిళలు హాహాకారాలు, కేకలతో మేళతాళాలు, వేద పఠనాలు ఆగిపోయాయి.

రుద్రయ కరకు గొంతుక పెళ్లి పందిరి అంతా మారుమ్రోగింది.

‘‘జైతుగి మహారాజా.. మా యువరాజులవారిని వెంటనే బంధవిముక్తులను చెయ్యాలి. కారాగారం నుండి ఘడియల్లో ఇక్కడికి తోడ్కొని రావాలి. లేకుంటే మీకు ఇక్కడే శవ సంస్కారాలు జరిపిస్తా..’’

జైతుగి తలతిప్పి భల్లాలుని వంక చూశాడు. ఆయన చిద్విలాసంగా మీసాన్ని దువ్వాడు. అంటే వీళ్లందరూ కూడబలుక్కుని ఇక్కడికి వచ్చారన్నమాట. సర్వసేనాని జల్లన, ముగ్గురు సంధివిగ్రహీలు, వియ్యం కులు గంగాధరుడు, హేమాద్రి కూడా మౌనంగా చూస్తున్నారు. వారి మౌనంలో ఇది.. ఈ మెరుపు దాడి.. వారందరికి తెలిసే జరిగిందన్నది ప్రస్ఫుటం.

చేసేదేమీ లేక నిర్వికారంగా ఆజ్ఞాపించాడు జైతుగి.

‘‘జల్లనసేనానీ.. అతన్ని బంధవిముక్తుడిని చేసి ఇక్కడకు తీసుకురండి.’’

మరి పది ఘడియలకు కాకతీయ యువరాజు గణపతిదేవుడు మెరపువీరుల మధ్య వివాహమండ పానికి విచ్చేశాడు.

పీలగా.. శరీరమంతా కృశించి, కళ్లలో జీవం నశించి, కేవలం కదిలే ఓ బొమ్మలా కనిపిస్తున్నాడు గణపతి.

తమ యువరాజును చూసుకుని కాకతీయ యోధుల కన్నుల్లో ఉద్వేగం.. ఆనందబాష్పాలు.

రుద్రయ గొంతుక మళ్లీ గర్జించింది. ‘‘గంగాధరా.. చెప్పు. జైత్రపాలుని తల త్రుంచి వేయనా.. అనుజ్ఞ ఇవ్వు..’’

గంగాధరుడు కంగారుగా అరిచాడు. ‘‘రుద్రా.. ఆగాగు. ఇది వేదమంత్రాలు ఘోషిస్తున్న పవిత్ర వివాహవేదిక.

దీనిని రక్తసిక్తం కావించొద్దు. యువరాజుని తీసుకుని నువ్వు వెళ్లిపో. నా కొడుకు వివాహ ప్రశాంతంగా జరగనివ్వు..’’

దేవరసుడు, హేమాద్రి పంత్‌ ‌కూడా రుద్రసేనాని ముందు మోకరిల్లారు చేతులు జోడించి.

జైతుగి ఏమీ చెయ్యలేక హుంకరించాడు, ‘‘ఆనాడే ఈ గణపతిని నరికి పారేసి అనుమకొండ స్వాధీనం చేసుకుని రావాల్సింది. తప్పు చేశాను..’’

‘‘ఇప్పుడు మేమా తప్పు చెయ్యం జైత్రపాలా. శత్రుశేషం లేకుండా దేవగిరినంతా అగ్నిప్రీతం చేసి వెళతాం..’’

యుద్ధావేశంతో ఊగిపోతున్నాడు రుద్రయ. ఆయన కంఠధ్వనికి సహ్యాద్రి పర్వతాలు కంపిస్తు న్నాయి.

అప్పుడు బల్లాలుడు స్పందించాడు, ‘‘రుద్రసేనా.. మహారాజులవారిని విడిచి పుచ్చు. ఇది వివాహ వేడుక. అందునా బ్రాహ్మణ పెళ్లి. ఇక్కడ కత్తులకు చురకలకు ప్రవేశం లేదు. జరిగింది జరిగిపోయింది. కాకతీయుల వీరత్వం మాకు తెలుసు. జైత్రపాలుడు మీపై గెలిచాడు. మహాదేవరాజును సంహరించి యువరాజుని బంధించారు. అలా వారూ విజయులే. కాబట్టి ఇరువురూ ఆవేశాలు వదిలేయండి. సామరస్యంగా సమస్యను పరిష్కరించుకోండి!’’ ఆగాడు.

ఉద్రిక్తత కొంచం తగ్గింది.

తర్వాత సోమలదేవిని దగ్గరకు పిలిచాడు భల్లాలుడు. ఆమె చెయ్యి పట్టుకుని అన్నాడు.

‘‘నాదొక సంధి ప్రతిపాదన. కాకతీయ మహానేత, ఒకప్పటి మా సామంతుడు, మా విశ్వాసపాత్రుడు రుద్రదేవుడు నిర్వహించినదే వివాహ బంధం. కాకతీయ యువరాజు గణపతిదేవునికి, దేవగిరి యువరాణి సోమలదేవికి వివాహం. ఇది నా ప్రతిపాదన. ఇరుపక్షాలు దీనికి అంగీకరించాలని మా మనవి!!’’

ఇందులో కాదు వద్దు అనేవారు జైత్రపాలుడు, చిల్లాదేవి!

ఆయన భార్య వంక చూశాడు. ఆమె ఏమి చెప్పాలో తెలియనట్లు అయోమయంగా చూస్తోంది.

అది చూసిన భల్లాలుడు, ‘‘పురోహితులారా.. ఆ వివాహపీఠానికి ప్రక్క మరొక పీఠం వేయించండి. ఊ.. వెళ్లండి యువరాజా.. పీఠం అలంకరించండి..’’

భావరహితంగా వెళ్లి పెళ్లిపీఠంపై కూర్చున్నాడు గణపతిదేవుడు. అనంతరం రుద్రయ వెనక్కు తగ్గగా జైతుగి, చిల్లదేవి దంపతులు పుత్రిక సోమలను స్వయంగా వేదిక పైపు తీసుకువెళ్లారు.

‘‘ఊ.. మ్రోగించండి భజంత్రీలు..’’

అందరిలో ఉత్సాహం కలిగించి రెండు జంటలకు హైందవ సంప్రదాయంలో పూర్తి స్థాయి వివాహం జరిపించి మంత్రాక్షతలతో దీవించాడు హోయసల భల్లాలదేవ మహారాజు.

ఓ మహా ఉపద్రవానికి పరిష్కారం లభించింది.

ఈ సమస్య పరిష్కారంలో ముఖ్య పాత్రధారులు మూడు రాజ్యాల సంధి విగ్రహీలు కాగా తెర వెనుక మంత్రాంగం నిర్వహించింది భలాల్లదేవ మహారాజు, గంగాధరమంత్రి, రేచర్ల రుద్రయ, హేమాద్రి పంత్‌.

‌దేవగిరిలో యుద్దఖైదీగా ఉన్నకాలంలో గణపతి దేవుని అనుభవాలు ఓ అద్భుత పాఠ్యాంశం.

గెలుపు ఓటములకు పెద్ద తేడా లేదు. గెలుపు అనే అంతిమ దశకు ఓటమి అనేది తొలి దశ. అదే అసలైన పునాది. గణపతి దేవుడు ప్రేమ జీవితంలో ఓడిపోయాడు. అదే పునాదిగా అతని పాలనా జీవితం ప్రారంభమయింది. అంటే కాకతీయ వంశజుల చిరకాల వాంఛ అయిన ఆంధ్ర సామ్రాజ్య స్థాపనకు ఈ ఓటమే పునాది అయింది. తెలుగుజాతి చరిత్రలో ఏకైక సామ్రాజ్యాధినేతగా.. తొలి తెలుగు చక్రవర్తిగా గణపతిదేవుడు పేరు చరిత్రలో చిరస్థాయిగా నిలచిపోయింది. ఈ పునాదిపై ఎన్ని మెట్లు నిర్మించుకుంటూ ఎక్కి ఆయన చక్రవర్తి సింహాసనాన్ని అధిరోహించాడో చూద్దాం!!

                                                                                       *         *         *

మెదటి మెట్టు: కాకతీయ కేతనం

కాకతీయ కేతనం ఆకాశం వైపు పైకెగసి విజయగర్వంతో రెపరెపలాడసాగింది.

ఎత్తి పట్టుకున్నవాడు మహావీరుడు రేచర్ల రుద్రసేనాని. స్కంధావారం నుండి సైనిక పారావారం విజయ సంబరాల మధ్య అనుమకొండ వైపు కదిలింది. కొత్త దంపతులు చిరంజీవి గణపతి దేవుడు, చిరంజీవి లక్ష్మి సౌభాగ్యవతి సోమల దేవిలతో.

వివాహం వేగంగా అప్పటికప్పుడు జరపాల్సి వచ్చినా వివాహానంతర సంబరాలు మాత్రం రాజ్య రాజ్యాలు చెప్పుకునేలాగా జరిపించాడు జైత్రపాలుడు.

ఈ వివాహవార్త విని అనుమకొండలో మిశ్రమ స్పందన కనిపించింది. రాజనగరి మాత్రం హమ్మయ్య అంటూ ఊపిరి పీల్చుకుంది. మహారాజుల భార్యల విషయంలో ఎవ్వరికి ప్రత్యేక పట్టింపులేమీ ఉండవు. ముందు శత్రువుల చేత చిక్కిన తమ భవిష్యత్‌ ‌మహారాజు గణపతిదేవుడు బ్రతికి బయటపడటం.. ఈ జన్మకు చాలు.

కాకతీయ బంధుజనమంతా దేవగిరి తరలి వచ్చింది. గణపతిని చూసుకుని కౌగిలించుకొని తనివితీరా ఏడ్చారు. అమ్మ, పెద్దమ్మ, అప్పచెల్లెళ్లు, తమ్ముళ్లు తదితర పరివారమంతా ఏడ్చి ఏడ్చి తమ గుండె బరువును దించుకున్నారు. అందరూ రేచర్ల రుద్రయకు, గంగాధరమంత్రికి సాగిలపడ్డారు.

కాకతీయ పరివారమంతా కాకతీయ కేతనం సమున్నతంగా నిలబడినందుకు, తమ ఆశాదీపంగా, లోకోత్తరుడుగా రుద్రదేవుడు రూపుదిద్దిన యువరాజు, భావిమహారాజు గణపతిదేవుడు మళ్లీ తన పూర్వ స్థానానికి చేరినందుకు ఆనందబాష్పాలు రాలిస్తే కాకతీయవంశంతో వియ్యమందినందుకు సేవణ వంశం, దేవగిరి రాజ్యం పరవశించాయి.

వివాహానంతర సంబరాలను జైత్రపాలుడు, చిల్లాదేవి నిండు మనసుతో నిర్వహించారు. రెండు రాజ్యాలు నిన్నటివరకు ఒకరి పీకకు మరొకరి ఖడ్గాలను గురిపెట్టిన వైనం మరచి ఈ సంబరాలలో మైమరచి పాల్గోవడం అబ్బురం.

ఇక సామలదేవి.. పెళ్లి కుమార్తె విజయాట్టహాసం చేసింది. రాజనగరి మైదానంలో గణపతి వీరోచిత ప్రవర్తన చూసినప్పుడే ఆమెకు లోలోన అతనిపై ఓ మోహభావం అంకురించింది. అయితే గణపతి అద్భుత మేధస్సు, పాలనకు సంబంధించి అనేక అంశాలపై అతనికున్న పట్టు, వీరత్వం వారినందరినీ ఆకట్టుకున్నాయి. అతడు తమకంటే కాస్త పైస్థాయి రాచరిక వీరుడు అనే భావన రెండు మూడు రోజుల్లోనే వారికి కలిగింది.

ఆడపిల్లల మనసు దోచే అతని శారీరక, రాచరిక వీరత్వం, పరిణీత హాస్య ధోరణి సోమలను కూడా ఆకర్షించింది.

అనేకానేక సంఘటనలు జరిగి జరిగి చిట్టచివరికి ఈ పెళ్లి ప్రతిపాదన పెళ్లి పందిరిలో విన్నప్పుడు ముందు ఆమె రెండు లిప్తలకాలం నివ్వెరపోయింది. వెను వెంటనే అంగీకారంతో కూడిన సిగ్గుతో తలవాల్చింది.

ఇప్పుడు తన ఊహాల్లోని ఆ మహావీరుడు తన భర్తగా తన మెడలో తాళికట్టి శోభనమందిరంలో కళ్లెదుట ఉన్నప్పుడు ఆమె ప్రపంచాన్ని జయించినంత మోహావేశంతో భర్తను చూసింది.

అప్పుడు గుర్తించింది అతని నిర్లిప్తత.

తన లాగా ఉత్సాహంగా.. ఎప్పుడెప్పుడు తన భార్యతో కూడదామా అన్న శృంగార మోహావేశంలో లేడు. ఏదో అలా తల్పంపై కూలబడ్డాడు. ఎటో చూస్తున్నాడు. ఏదో తలపోస్తున్నాడు. దిగులుగా ఉన్నాడు. అప్పట్లో క్రీడా మైదానంలో యౌవనాశ్వంలాంటి యువ గణపతి ఇప్పుడు ఇక్కడ ఈ ఏకాంతంలో దిగులుగా ఉండటం..అందులోనూ పెళ్లికొడుకుగా కూడా. మొదట ఆమె ఆశ్చర్యపోయి నా కొన్నిలిప్తల సమయంలోనే కోలుకుంది. తన భర్త.. కొత్త పెళ్లికొడుకు దిగులుకు కారణం గుర్తించింది.

ఆమెకు నవ్వొచ్చింది. అందగాడైన పురుష సింహం.. తన భర్త.. మరింత ముద్దొచ్చాడు. అతని వైపు కదిలింది.

నిన్నటిదాకా తన ముందు అతడు ఓ యుద్ధఖైది. ఇవ్వాళ తన భర్త. అందుకే కొంచం మొహమాట పడుతున్నాడేమో.. ‘నీ మొహమాటం నేను తొలగిస్తానుగా..’ అనుకుంది చిలిపిగా సోమల.

బ్రతికున్నంతకాలం వారిద్దరి దాంపత్యం ఇలాగే కొనసాగుతుందని వారిద్దరూ అప్పుడు గుర్తించలేదు.

                                                                                       *         *         *

గణపతిదేవుడు, సోమలదేవిల వివాహ సంబరాలలో రెండు రాజ్యాలు.. రెండు రాజ కుటుంబాలు.. రెండు రాచ నగరులు పరవశించి పోతుండగా తను మాత్రం ఒంటరిగా.. దిగులుగా.. తను ఎక్కడైతే ఖైదీగా ఉన్నాడో ఆ రాజ మందిరంలో.. మౌనంగా చేతులు వెనక్కు కట్టుకుని తిరుగుతున్నాడు కొత్త పెళ్లికొడుకు గణపతిదేవుడు.

దేనికోసం.. ఎవరి కోసం..

కవ్వల కోసం! నాగతిస్య కోసం.. కేయూర కోసం..

చెప్పరాని దిగులుతో.. మాటలు లేని దుఖంతో.. కనిపించని ఆప్తుల కోసం.. గడిపిన ఆ కాస్త కాలం.. ఆ కొన్ని అమృతక్షణాలు.. ఆ సన్నివేశాలు.. ఆ మధురిమలు తలచుకుంటే కొద్ది కాలం.. కొన్ని లిప్తల క్షణాల కాలం.. అన్ని మళ్లీ మళ్లీ కళ్లముందు నిద్రలోనూ.. కలల్లోనూ ముందు వెనక కదలాడుతూ.. కనువిందుచేస్తూ.. ఉక్కిరిబిక్కిరి చేస్తూ ఉంటే.. కళ్లు వెదికి వెదికి అలసిపోయాయి. ఎవరిని అడగాలి.. ఏమని అడగాలి..

అప్పుడు తను ఓ యుద్దఖైది.. ఏమి అడిగితే ఏమి జరుగుతుందో తెలియదు.

ఇప్పుడు ఆ ఇంటి అల్లుడు.. ఏమి అడిగితే ఏమి జరుగుతుందో తెలియదు.

భారంగా ఓ కుడ్యానికి తలవాల్చి కళ్లు మూసుకున్నాడు.

కవ్వలా.. ఎందుకు నా జీవితంలోకి వచ్చావ్‌.. ఎం‌దుకు దూరమయ్యావ్‌.. ఎవరు నిన్ను చంపారు. నీ వాళ్లా నా వాళ్లా.. ఎందుకు..? తప్పెవరిది.. నీదా నాదా..?

నా ఆత్మీయుడు.. నావాడు నాగతిస్య!! నా కోసమే నియోగించారట.. ఏమయ్యాడు?? చంపేశారా.. ఏమిటి వాడు చేసిన తప్పు? నన్ను పెళ్లి మండపానికి పంపడమే వాడి తప్పయ్యిందా.. ఆ రోజే మావాళ్లు మెరుపుదాడి చేయడం కాకతాళీయమా..? ఆ దేవుడు నా మొహాన రాసిన రాతా..?

జరిగిన సంఘటనలతో దిమ్మెరబోయిన గణపతి పెద్దలు చెప్పినట్లల్లా చేశాడు. పెళ్లి మండపానికి తీసుకుపోతే వెళ్లాడు. బట్టలు మార్చుకోమంటే మార్చుకున్నాడు. పెళ్లిపీటలపై కూర్చోమంటే కూర్చు న్నాడు. ఈ అమ్మాయికి తాళి కట్టమంటే కట్టాడు.

అంతా మౌనం మౌనం.. లోలోపల బిగ్గరగా రోదన. గుక్కలు పట్టి ఏడుపు.. ఎవరు వింటారు.. ఎవరి గుండెల్లో తలపెట్టి చెప్పుకోవాలి.. ఇవన్నీ ఎవరికి కావాలి?!

ఏమైయ్యింది అసలు! ఇది క్షణికమై శాశ్వతమైన దివ్యానుభవం! జీవితంలో ఏమి జరిగినా ఎందరు యువతులు తన జీవితంలోకి వచ్చినా.. ఎన్ని యుద్ధాలు చేసినా.. ఎన్ని రాజ్యాలు గెలిచినా.. భార్య అనే ఈ స్త్రీతో ఎన్నో రాత్రులు గడిపినా, పిల్లలు పుట్టినా.. వాళ్లు పెద్దవాళ్లై.. తను ముసలివాడు అయినా.. రేపో మాపో చచ్చే క్షణాలు వచ్చినా.. యముని మహిషపు లోహగంటలు చెవుల వద్ద  మ్రోగుతున్నా.. ఈమెను.. ఈ తన జీవితంలోకి ప్రవేశించి మనసునంతా ఆక్రమించిన ఆ స్త్రీ మూర్తిని మరచిపోగలడా..?

‘‘జయము జయము యువరాజా.. యువరాణి సోమలదేవమ్మగారు తమరిని భోజనశాలకు తీసుకుపోవలసినదిగా ఆదేశించారు..’’

వెనగ్గా వినపడిన మాటలతో ఆలోచనలు ఆగిపోయాయి.

తల ఎత్తి చూశాడు గణపతి. అప్పటికే గతంలో అతన్ని ఉంచిన రాజప్రాసాదపు కారాగారం లాంటి గది, అవతలగా కవ్వలతో మనసులు పంచుకున్న గది, దూరంగా క్రీడామందిరం, వ్యాయామశాల.. అన్ని దాటుతూ చాలా దూరం వచ్చేశాడు.

వెనుదిరిగి వార్త తెచ్చిన భటుడ్ని చూశాడు. తలవంచి నిలబడి ఉన్నాడు.

చటుక్కున ఆడిగాడు, ‘‘నాగతిస్య.. నాగతిస్య అనే దీప రక్షకుడు.. దీపాలకు నూనె పోసేవాడు తెలుసా నీకు?!’’

వాడు తలెత్తలేదు. కాసేపు మౌనంగా ఉన్నాడు. మౌనమే.. మాట లేదు.

ఆశతో మళ్లీ అడిగాడు. వాడు ఉలిక్కిపడి తల అడ్డంగా ఊపాడు.

నిరాశగా వెనుదిరిగాడు. వెనగ్గా భటుడు..

పదడుగులు నడిచాక.. ఆశ చావక మళ్లీ అడిగాడు. వాడు తల వంచుకున్నాడు.

మరో పదడుగులు నడిచాక అడిగాడు, ‘‘నీ పేరేవిటి??’’

వాడు రెండు లిప్తలు తటపాయించి అన్నాడు, ‘‘పరిచారికుడు యువరాజా..’’

తల ఎత్తడం లేదు. ఏమీ చేయలేక నడుస్తున్నాడు. వాడు వెనుకనుండి ముందుకు వచ్చాడు. దారి చూపు తున్నట్లు నడుస్తున్నాడు. రాజప్రాసాదం లోపలికి అడుగుపెడుతూ వాడు మరో వైపు చూసి గణపతి కళ్లలోకి చూశాడు.

వాడేదో కళ్లతో చెబుతున్నట్లు గుర్తించి గణపతి నివ్వెరపోయాడు.

ఆ పరిచారకుడు తల వాల్చుతూ మరో వైపు చూపుతున్నట్లుగా గణపతి కళ్లలోకి చూశాడు. వాడు ఏదో చెబుతున్నట్లు గుర్తించిన గణపతి అటుగా తలతిప్పి చూశాడు. అక్కడ నిలబడి ఉన్న ఓ మనిషి ఇటే చూస్తున్నాడు.

కొయ్యబారిపోయాడు గణపతి. ఆ మనిషి సేవణ యువరాజు సింఘణదేవుడు.. తన బావమరిది. కాబోయే దేవగిరి మహారాజు. తన కదలికలు జాగ్రత్తగా పరిశీలిస్తున్నాడంటే.. తనతో ఇప్పుడు బావగారూ అని స్నేహంగా ఉన్నా తర్వాతి కాలంలో తనకు జీవితాంతం పక్కలో బల్లెం కావచ్చునన్నభావన లిప్తలో వెయ్యోవంతు కాలంలో మెరిసింది!

                                                                                       *         *         *

మరి కొన్ని రోజుల తర్వాత ఓ శుభముహూర్తాన కాకతీయ మహాపరివారం అనుమకొండ వైపుగా కదిలింది.

దాదాపు రెండేళ్ల తర్వాత స్వంత ఇంటికి బయలుదేరడంతో సైన్యం మహదానందంతో.. ఆటలతో పాటలతో రెచ్చిపోతూ నడుస్తోంది.

కాకతి పారావారానికి ముందు నడుస్తున్న రుద్రసేనాని తమ మహాశ్వంపై  కేతనం ఎత్తి పట్టి కదలగా వెనుక కదిలింది.

దేవగిరి యువరాణిని పరిణయమాడి ఆమెను తన చెంతనే కూర్చోబెట్టుకున్న యువనేత గణపతి దేవుడు అధిరోహించిన మహామత్తగజం సైన్యం మధ్యగా నడుస్తోంది. అంబారీపై కూర్చున్న ఆ అపు రూప యువజంట మొత్తం సైనిక పారావారానికి కనిపిస్తూ కనువిందు చేస్తోంది. నడుస్తున్న సైనికులు అప్పుడప్పుడూ తలతిప్పి తమ యువరాజ దంపతులను చూసుకుంటూ మీసం పై చేయివేసి గర్వంగా రొమ్ము పొంగించి నడుస్తున్నారు.

నిజానికి వివాహమైన యువరాజు ఇంత తక్కువ కాలం అత్తవారింట ఉండడం రాజకుటుంబ వర్గాలలో కాస్త చోద్యమే. సైన్యమే కాదు గణపతి కూడా అక్కడ ఎక్కువ కాలం ఉండడానికి సుముఖత చూపలేదు. ఎప్పుడెప్పుడు అనుమకొండ వెళ్లిపోదామా అని అందరిని తొందరపెట్టాడు. తదనుగుణంగానే కాకతీయ పెద్దలు జైత్రపాలకునితో మంతనాలు జరిపి తిరుగుప్రయాణానికి ముహూర్తం నిర్ణయించారు.

మరి మాసం రోజులకు తమ యువరాజ దంపతులను చూసుకుని అనుమకొండ మురిసి పోయింది.

గణపతి దంపతులను చూసి కన్ను తడవని మనిషి లేడు. సైనికులు తమ కుటుంబాలను చూసుకుని బెంగ తీర్చుకుంటుండగా సాధారణపౌరులు తమ యువరాజ దంపతులను కనులారా చూసుకుని మురిసిపోయారు.

రాజప్రాసాదం ఉద్యోగులు, భటులు.. ఒకరేమిటి అందరూ తడిసిన కన్నులతో ధర్మపత్ని సమేతంగా తిరిగి వచ్చిన తమ యువరాజును చూసుకుని ఆనందంతో పరవశులయ్యారు. ఇక్కడ కూడా అంబరాన్ని అంటుతున్న సంబరాలతో కాకతీయ రాజ్యమంతా.. అనుమకొండ పురమంతా పులకిస్తుంటే మానసికంగా ఒంటరిగా.. దిగులుగా ఒక్కడిగా కొత్త పెళ్లికొడుకు గణపతి..

అక్కడితో పెద్దలు ఆగలేదు.

మరో సుముహూర్తాన గణపతిదేవుడు కాకతీయ మహారాజుగా అభిషక్తుడయ్యాడు.

ఆ సంబరాలు.. హర్షాతిరేకాలు.. వాడవాడలా రాజ్యపు నలుమూలలా పండుగ వాతావరణం అందరిని పుల కాంకితులను చేస్తున్నా నిర్లిప్తంగా ఉన్నవాడు గణపతిదేవుడు.

గణపతి స్థితప్రజ్ఞుడు. సహజంగా చిన్ననాటి నుండి చుట్టూ ఉన్న వాతావరణం.. రుద్రదేవ మహారాజు గారి ప్రత్యేక పెంపకం.. చదువు.. పుంభావ సరస్వతుల సాహచర్యం.. అతన్ని స్థిత ప్రజ్ఞుడ్ని చేశాయి. ఎప్పుడూ తేజరిల్లే

ఉత్సాహంతో చురుకుతో.. మంచిమాటలతో చుట్టూ ఉన్నవారిని ఆహ్లాదంలో ఆనందంలో ఉంచగల ఉపజ్ఞ ఉన్నవాడు.

సాధారణ సమాజంలో.. సాధారణ వ్యక్తిగా జీవించడం ఏ మాత్రం అనుభవం లేదు. కాని ‘రాజుగా నువ్వు పేద ప్రజలను ఆదుకోవాలి. అందరిని సమదృష్టితో చూడాలి. రాజ్యం కోసం.. మనలను నమ్ముకున్న ప్రజల కోసం.. నువ్వు బ్రతకవలసి ఉంటుంది..’ లాంటి సుభాషితాలను, ఉద్బోధలను చిన్ననాటి నుండి విన్నవాడు కావడంతో కష్ట సహిష్ణుత అనేది రాజ్యపాలనలో అవశ్యమన్న భావనతో సహజంగా దేనికీ తొణకని స్థితప్రజ్ఞత్వం ఒంట బట్టింది. అలాంటి ఎదురులేని ఎదుగుదల వయస్సులో హటాత్తుగా యుద్దఖైదీగా చెరసాలలో ఉండటం ఊహాతీతమైన అనుభవం. అప్పుడు కూడా తొణకలేదు. బేలతనం అసలే లేదు.

శత్రువు చెరసాలలో ఉండటం.. అక్కడ జరిగిన సంఘటనలు, తెలియని రాజ తంత్రాలు.. తెలిసిన ఓ ఆడపిల్ల మాధుర్య సాహచర్యం, వయసులో చిన్నపాటి శృంగార భావనలతో కూడిన అమ్మాయి దగ్గరితనం.. ఏవో తెలియని ఏవేవో కబుర్లు.. ముచ్చట్లు.. అతనిని ఓ అద్భుత స్వర్గలోకంలోకి తీసుకుపోయాయి.

కానీ కాని ఆ కాళరాత్రి.. కరాళ రాత్రి.. కవ్వలను ఎవరో చంపివేయడం..

అదే అతన్ని చకితుడ్ని చేసి జీవితాంతం మరచిపోలేని పీడకలను మిగిల్చింది. అయితే స్థితప్రజ్ఞుడు కాబట్టి అతడు తట్టుకున్నాడు. ఎవరికీ అనుమానం కలగని రీతిలో పెద్దలు చెప్పినదల్లా చేశాడు. చివరికి సోమలదేవి కోరుకున్నవిధంగా శృంగారంలో కూడా పాల్గొంటున్నాడు. కారణం అతని మానసిక పరిపక్వత.. స్థిత ప్రజ్ఞత!

అయితే గణపతి ఉదాసీనత.. కదలికల్లో పనుల్లో నిర్లిప్తత.. జీవం లేని నవ్వులు.. మధురత లేని మాటలు.. ఒక్కరు గుర్తించారు.

ఆ ఒక్కరు ఒకరోజు అడిగారు ఒంటరిగా ఉండగా చూసి..

‘‘గణా! ఏమైంది నాన్నా.. ఎందుకు అలా.. కనిపించని ఏదో దిగులు.. ఏదో పోగొట్టుకున్న వాడిలా.. ఏమైంది నాకయినా చెప్పవా తండ్రి..!’’

అంతే. గుండెల్లో హిమాలయాల్లా విస్తరించి కైలాస పర్వత స్థాయికి ఎదిగిన దుఃఖం ఒక్కసారిగా బద్దలయ్యింది.

ఏడ్చాడు. గుండెలవిసేలా ఏడ్చాడు. వెక్కి వెక్కి రోదించాడు. కాని కాని ఒక్కమాట కూడా పెదవి దాటకుండా చూసుకున్నాడు.

(సశేషం)

మత్తి భానుమూర్తి

About Author

By editor

Twitter
YOUTUBE