– గోపరాజు విశ్వేశ్వరప్రసాద్‌

21‌వ శతాబ్దం మీద ప్రపంచ జనాభా పెట్టుకున్న సానుకూల కల్పనకు భిన్నంగా భూగోళం మీద పరిణామాలు చకచకా జరిగిపోతున్నాయి. భారత్‌కు ఇరుగు పొరుగు దేశాల సంక్షోభం ఇంకొంచెం ముదిరింది. శ్రీలంక కనీవినీ ఎరుగనంతటి సంఘర్షణకు లోనవుతున్నది. పాకిస్తాన్‌, అఫ్ఘానిస్తాన్‌ ‌మధ్య ఘర్షణ కొత్త తీరాలకు పయనిస్తున్నది. మరొక పక్క రష్యా-ఉక్రెయిన్‌ ‌యుద్ధం ప్రపంచాన్ని వేరొక కోణం నుంచి భయపెడుతున్నది. మూడో ప్రపంచ యుద్ధ భయం, అణ్వాయుధాల ప్రయోగం భీతి ఆ భయానికి కారణాలు. భారత్‌ ‌తన పరపతితో  ఆ యుద్ధాన్ని నివారించవచ్చునన్న అభిప్రాయం కూడా ఉంది. కరోనా సృష్టించిన సామాజిక, ఆర్థిక సంక్షోభం నుంచి ప్రపంచం బయటపడడానికి కొన్ని దశాబ్దాలు పడుతుందని తెలిసినప్పటికి కొత్త సమస్యలు భూగోళాన్ని చుట్టుముడుతున్నాయి. ఇలాంటి సమయంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ మూడు రోజులు (మే 2-4) ఐరోపా దేశాలలో  పర్యటించారు. జర్మనీ, డెన్మార్క్, ‌ఫ్రాన్స్‌లలో ఆయనకు ఘనస్వాగతం లభించింది. భారత్‌ ‌రష్యాకు అనుకూలమన్న ప్రపంచ దేశాల అభిప్రాయం భ్రమ అని తేల్చి వచ్చారు. నిజానికి భారత శాంతి ప్రియత్వాన్ని చాటే దూతగానే ఈ క్లిష్ట సమయంలో మోదీ పర్యటన ముగిసింది.

సహజంగా ఒక దేశాధినేత విదేశీ పర్యటన ప్రభావం ఆ రెండు దేశాల మీదే ఉంటుంది. ఆ పర్యటన వల్ల ఉభయులకూ కలిగే ప్రయోజనాలపైనే ఆసక్తి ఉంటుంది. పర్యటన వల్ల ఉభయ దేశాల సంబంధాలు మరింతగా మెరుగు పడాలని, చిన్నపాటి అపోహలు, అనుమానాలు ఏమైనా ఉంటే తొలగిపోవాలని ఇరువురు అధినేతలు ఆకాంక్షిస్తారు. మూడో దేశం గురించి, ఇతర దేశాల గురించీ ప్రత్యేక సందర్భాలలో తప్ప ప్రస్తావన ఉండదు. కానీ మారిన అంతర్జాతీయ పరిస్థితుల్లో రెండు దేశాల స్నేహ సంబంధాలు ఎంత కాదనుకున్నా మూడో దేశంపై, ఆయా పొరుగు దేశాలపై ఎంతో కొంత కనిపిస్తు న్నాయి. అందువల్ల సమకాలీన పరిస్థితుల్లో, అంతర్జాతీయ వ్యవహారాలు అత్యంత సున్నితంగా, బహు పెళుసుగా మారిన తరుణంలో భారత్‌ ‌వంటి శాంతి కాముక, వేగంగా ఎదుగుతున్న, ప్రపంచ రాజకీయాలపై ఎంతో కొంత ప్రభావం చూపగల దేశాధినేత పర్యటన సహజంగా అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. తాజాగా రష్యా- ఉక్రెయిన్‌ ‌యుద్ధం నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ మూడు యూరప్‌ ‌దేశాల పర్యటనను అమెరికా సహా యావత్‌ ఐరోపా సమాజం, చైనా, రష్యా వంటి శక్తిమంతమైన దేశాలు సునిశితంగా గమనించాయి. కత్తిమీద సాములాంటి ప్రస్తుత అంతర్జాతీయ పరిస్థితుల్లో భారత ప్రధాని ఏ విధంగా వ్యవహరిస్తారన్న ఆసక్తి నెలకొంది. మోదీ పరిణతితో, చాకచక్యంతో వ్యవహరించి భారత వాదనను బలంగా వినిపించి అందరి మన్ననలూ పొందారు. అంతర్జాతీయ యవనికపై భారత కీర్తి ప్రతిష్టలను మరోసారి ఘనంగా చాటారు. మూడు దేశాల పర్యటనలో మోదీ క్షణం తీరిక లేకుండా గడిపారు. మొత్తం 65 గంటలపాటు మూడు ఐరోపా దేశాలలో గడిపారు. ఈ సమయంలో ఏడు దేశాలకు చెందిన 8 మంది ప్రపంచ నేతలతో సమావేశ మయ్యారు. వారితో అనేక ద్వైపాక్షిక, అంతర్జాతీయ అంశాలపై మాట్లాడారు. మొత్తం 25 సమావేశాల్లో పాల్గొన్నారు. 50 మంది ప్రముఖ వ్యాపార వేత్తలతో వివిధ అంశాలపై చర్చించారు.

 మే 2 నుంచి మూడురోజుల పాటు ప్రధాని మోదీ యూరప్‌లో పర్యటించారు. ఈ ఏడాది మోదీ తొలి విదేశీ పర్యటన ఇదే కావడం విశేషం. కరోనా కారణంగా కొంతకాలంగా ప్రధాని విదేశీ పర్యటన లకు దూరంగా ఉంటున్నారు. యూరప్‌ ‌పర్యటనలో భాగంగా మోదీ తొలుత జర్మనీ, డెన్మార్క్, ‌ఫ్రాన్స్ ‌సందర్శించారు. డెన్మార్క్‌ను మినహాయిస్తే మిగిలిన రెండు దేశాలు ఐరోపా సమాజంలో అత్యంత కీలకమైనవి. ఇందులో ఫ్రాన్స్ ఐరాస భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం గల దేశం. తాజాగా ఆ దేశం నుంచి రఫేల్‌ ‌యుద్ధ విమానాలను మనం దిగుమతి చేసుకుంటున్నాం. జర్మనీ శక్తిమంతమైన దేశం. రష్యా-ఉక్రెయిన్‌ ‌యుద్ధం నేపథ్యంలో భారత్‌ ‌పట్ల కొన్ని దేశాల్లో నెలకొన్న అపోహలు, అనుమానా లకు తెర దించేందుకు మోదీ ఈ పర్యటనను చక్కగా ఉపయోగించుకున్నారు. సంక్లిష్ట సమయంలో భారత్‌ ‌వాణిని బలంగా, ప్రభావవంతంగా వినిపించారు. యుద్ధం నేపథ్యంలో యావత్‌ ఐరోపా సమాజం రష్యాను దునుమాడుతోంది. ఆ దేశాలు ఉక్రెయిన్‌కు అన్నివిధాలా అండగా నిలబడ్డాయి. అంతర్జాతీయ సమాజం అంతా రష్యాను వ్యతిరేకించాలనీ కోరు కుంటున్నాయి. ఈ యుద్ధంలో భారత్‌ ‌తటస్థంగా వ్యవహరించింది. అటు రష్యా, ఇటు ఉక్రెయిన్‌ ‌రెండూ తనకు కావలసిన దేశాలేనని, యుద్ధాన్ని విరమించి చర్చలతో సమస్య పరిష్కరించుకోవాలని భారత్‌ ‌మొదటి నుంచీ చెబుతోంది. యుద్ధానికి సంబంధించి రష్యా తీరును భారత్‌ ‌ఖండించలేదన్న గుర్రుతో అగ్రరాజ్యం ఉంది. ఈ విషయాన్ని అమెరికా అధినేత పరోక్షంగా ప్రస్తావించారు. పైకి గట్టిగా చెప్పనప్పటికీ ఐరోపా సమాజానిదీ అదే అభిప్రాయం. ఈ నేపథ్యంలో మూడు యూరప్‌ ‌దేశాలను మోదీ ఎలా ఒప్పించ గలరన్న ఆసక్తి అటు అంతర్జాతీయంగా, ఇటు దేశీయంగా నెలకొంది. అందరి అంచనాలను మించి మోదీ ఈ పర్యటనను విజయవంతంగా పూర్తి చేశారు. అపోహలు, అనుమానాలను తొలగించారు. భారత వైఖరిని అర్థం చేసుకునేలా ఆయా దేశాల అధినేతలతో మాట్లాడారు.

మూడు దేశాల పర్యటనలో భాగంగా మోదీ తొలుత ఐరోపాలో శక్తిమంతమైన దేశం జర్మనీని సందర్శించారు. ఆ దేశ ఛాన్సలర్‌ ఒలాఫ్‌ ‌షోల్జ్‌తో భేటీ అయ్యారు. జర్మనీలో ఛాన్సలర్‌ ‌పదవి మన దేశంలో ప్రధాని పదవితో సమానమైనది. రష్యా, ఉక్రెయిన్‌ ‌యుద్ధాన్ని ప్రధానంగా ప్రస్తావించిన మోదీ ఇది విజేతల్లేని యుద్ధమని వ్యాఖ్యానించడం ద్వారా తాము ఎవరి పక్షం కాదని తేల్చిచెప్పారు. అందరూ అనుకుంటున్నట్లు రష్యా తమకు మిత్ర దేశమైనప్పటికీ యుద్ధం ఎవరికీ మేలు చేయదని, చర్చలు, దౌత్య పద్ధతుల్లో ముందుకు సాగాలని ఉభయులకూ సూచించారు. అమాయక పౌరుల హననాన్ని తక్షణం ఆపాలని, ఒక దేశ సమగ్రత, సార్వభౌమత్వాన్ని గౌరవించాలని, శాంతి సామరస్యాన్ని కాపాడాలని అభిప్రాయపడ్డారు. రష్యా తమకు సుదీర్ఘ కాలంగా మిత్ర దేశమైనప్పటికీ యుద్ధాన్ని సమర్థించలేమని తేల్చి చెప్పడం ద్వారా భారత్‌ ‌శాంతి ప్రియత్వాన్ని బలంగా చాటారు. ఉక్రెయిన్‌ ‌కూడా తమకు ఎంతో ముఖ్యమైన దేశమని వెల్లడించారు. ఇక ఉభయ దేశాల సంబంధాలు మరింతగా మెరుగుపడాలని జర్మనీ ఛాన్సలర్‌తో చర్చల సందర్భంగా మోదీ ఆకాంక్షించారు. అంతర్జాతీయ అంశాలు తమ రెండు దేశాల సంబంధాలను ఎంతమాత్రం ప్రభావితం చేయలేవని చెప్పారు. ప్రతి విషయాన్ని ఉభయ దేశాల కోణంలోనే చూస్తామని పేర్కొనడం ద్వారా జర్మనీ అభినందనలు అందుకున్నారు. అంతకుముందు రాజధాని బెర్లిన్‌లోని ఫెడరల్‌ ‌ఛాన్సలరీ వద్దకు చేరుకున్న మోదీకి ఒలాఫ్‌ ‌ఘన స్వాగతం పలికారు. గత ఏడాది డిసెంబరులో దేశాధినేతగా బాధ్యతలు చేపట్టిన తరవాత ఒలాఫ్‌ను మోదీ కలవడం ఇదే ప్రథమం. అంతకుముందు ఆరో దఫా అంతర్‌ ‌ప్రభుత్వ సంప్రదింపుల సమావేశానికి కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌, ‌విదేశాంగ మంత్రి జైశంకర్‌, ‌జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ ‌తోభాల్‌ ‌హాజరయ్యారు. జర్మనీ విదేశాంగ• మంత్రి అనలేనా బెయిర్‌ ‌బాంక్‌తో జైశంకర్‌ ‌సమావేశమై అనేక అంశాలపై సమీక్ష జరిపారు. రష్యా-ఉక్రెయన్‌ ‌యుద్ధంతోపాటు ఇండో – పసిఫిక్‌ ‌ప్రాంతంలో పరిస్థితులపై చర్చించారు. తమ దేశంలో జరగనున్న జీ-7 సదస్సుకు మోదీని జర్మనీ అధినేత ఆహ్వానించారు.

అంతకుముందు పర్యావరణ పరిరక్షణ, జీవవైవిధ్యం తదితర అంశాలపై ఉభయ దేశాలు సంయుక్త ప్రకటనను విడుదల చేశాయి. అటవీ విస్తీర్ణం పెంపులో సహకారానికి సంబంధించిన అవగాహనపై రెండు దేశాల పర్యావరణ మంత్రులు వర్చువల్‌ ‌విధానంలో ఆమోదం తెలిపారు. 2030 నాటికి భారత్‌ ‌సాధించాల్సిన పర్యావరణ లక్ష్యాలకు గాను రూ. 80 వేల కోట్ల సాయాన్ని అదనంగా అందజేయనున్నట్లు జర్మనీ ప్రకటించింది. ఈ మొత్తాల్లో 50 శాతం నిధులను పునరుత్పాదకత ఇంధనాలకు కేటాయిస్తారు. వ్యవసాయం, పర్యావరణం, ప్రకృతి వనరుల సుస్థిర నిర్వహణకు సంబంధించి సుమారు రూ.2412 కోట్ల రుణాలను భారత్‌కు అందించే ఒప్పందంపై ఉభయ దేశాలు సంతకాలు చేశాయి.

మొదట బెర్లిన్‌ ‌విమానాశ్రయానికి చేరుకున్న మోదీకి ఘన స్వాగతం లభించింది. పెద్దసంఖ్యలో అక్కడికి చేరుకున్న ప్రవాస భారతీయులు మోదీకి ఘన స్వాగతం పలికారు. అక్కడి బ్రాండెన్‌బర్గ్ ‌గేటు వద్ద భారీస్థాయిలో స్వాగత ఏర్పాట్లు చేశారు. సంప్రదాయ నృత్యాలు, సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించారు. ఈ సందర్భంగా అక్కడికి వచ్చిన ఇద్దరు చిన్నారులు మోదీ మనసు గెలుచుకున్నారు. అశుతోష్‌ అనే బాలుడు దేశభక్తి గీతాన్ని శ్రావ్యంగా ఆలపించి మోదీ ప్రశంసలు అందుకున్నాడు. మన్య అనే చిన్నారి బాలిక తాను గీసిన మోదీ చిత్రపటాన్ని  బహూకరించింది. ఆ బాలికతో ఫొటో దిగిన మోదీ ఆమె చిత్రపటంపై ఆటోగ్రాఫ్‌ ‌చేసి ఇచ్చారు.

పర్యటనలో భాగంగా డెన్మార్క్ ‌లో అడుగుపెట్టిన మోదీకి రాజధాని కోపెన్‌ ‌హగన్‌లో ఘన స్వాగతం లభించింది. ఆ దేశ ప్రధాని ఫ్రెడెరిక్సన్‌తో సమావేశ మయ్యారు. ఈ సందర్భంగా ఆమెతో అనేక ద్వైపాక్షిక, అంతర్జాతీయ అంశాలపై చర్చించారు. ఉభయ దేశాలు అనేక అంశాల్లో కలసి పని చేయాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. వ్యాపారవేత్తల సమావేశంలో మాట్లాడిన మోదీ భారత్‌ అవకాశాల స్వర్గమని, దానిని వాడుకుని లబ్ధి పొందాలని సూచించారు. తమ దేశంలో కొనసాగుతున్న సంస్కరణలు హరిత సాంకేతికతలు, శీతల గిడ్డంగులు, షిప్పింగ్‌, ‌పోర్టులు, శుద్ధ ఇంధనం వంటి రంగాల్లో పెట్టుబడులకు అవకాశాలు కల్పిస్తున్నాయని చెప్పారు. ఆధునిక మౌలికవసతుల కల్పనకు ఉద్దేశించిన పీఎం-గతిశక్తి పథకం గురించి సోదాహరణంగా వివరించారు. సామాజిక మాధ్యమాల్లో ప్రచారంలో ఉన్న ఫియర్‌ ఆఫ్‌ ‌మిస్సింగ్‌ అవుట్‌ (‌చేజారుతుందనే భయం) గురించి వివరించారు. గతంలోనూ ఉభయదేశాలు అనేక అంశాల్లో కలసి పనిచేశాయని గుర్తు చేశారు. దీనిని మరింత ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. భారత్‌లోని సరళతర వ్యాపార విధానాలు వాణిజ్య సంస్థలకు ఎంతో ఉపయుక్తమని తెలిపారు. డానిష్‌ ‌పరిశ్రమల సమాఖ్య నిర్వహించిన మరో సమావేశంలోనూ మోదీ ప్రసంగించారు. ఇందులో ఆ దేశ ప్రధాని, యువరాజు ఫెడెరిక్‌ ‌తదితరులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఉభయ దేశాల హరిత వ్యూహ భాగస్వామ్యాన్ని సమీక్షించారు. ఇరుదేశాల బంధం మరింత బలపడాల్సి ఉందన్నారు.

 అంతకుముందు ఆ దేశ ప్రధానితో జరిగిన సమావేశంలో అనేక ద్వైపాక్షిక అంశాలపై చర్చించారు. అంతర్జాతీయ అంశాలూ వారి మధ్య చర్చకు వచ్చాయి. ఇందులో రష్యా-ఉక్రెయిన్‌ ‌యుద్ధం అంశం అత్యంత కీలకమైనది. భారత్‌ – ‌రష్యా బంధం కొత్తేమీ కాదని, ఇది అందరికీ తెలిసిన విషయమేనని, అంతమాత్రాన తాము రష్యాను సమర్థిస్తున్నట్లు, ఉక్రెయిన్‌కు దూరమైనట్లు భావించరాదని స్పష్టం చేశారు. ఉభయ దేశాలూ తమకు సన్నిహిత మిత్రదేశాలేనని పేర్కొన్నారు. యుద్ధం వల్ల ఎవరూ సాధించేది ఏమీ లేదని భారత్‌ ‌భావిస్తోంది. మేము ఎప్పుడూ శాంతిపక్షమే. యుద్ధం వల్ల చమురు ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఆహారం, ఎరువుల కొరత ఏర్పడుతోంది. దీని ప్రభావం ఏ ఒక్క దేశానికో పరిమితం కాదు. యావత్‌ అం‌తర్జాతీయ సమాజం ఎంతో కొంత ప్రభావితం కాక తప్పదు. అందువల్ల సమస్యలను ఇరుదేశాలు చర్చల ద్వారా పరిష్కరించుకోవాలన్నదే భారత విధానమని ఈ సందర్భంగా వివరించారు. మోదీ వాదనను డెన్మార్క్ ‌ప్రధాని శ్రద్ధగా ఆలకించడం విశేషం. పర్యావరణానికి సంబంధించి భారత వైఖరిని మోదీ ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు. ఇతర దేశాలతో పోల్చుకుంటే పర్యావరణానికి భారత్‌ ‌కలిగిస్తున్న హాని ఎంతో తక్కువని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. సహజ సిద్ధ వాతావరణాన్ని పరిరక్షించుకునేందుకు 2070 నాటికి నెట్‌ ‌జీరో ఉద్గారాల స్థాయిని చేరుకునేందుకు భారత్‌ ‌కట్టుబడి ఉందని పేర్కొన్నారు. వస్తువులను ఒక్కసారి వాడి చెత్తలోకి విసిరే ధోరణికి స్వస్తి పలకాలన్నారు. పర్యావరణ అనుకూల జీవనశైలిని ప్రతి ఒక్కరూ అలవరచుకోవలని కోరారు. అంతకుముందు ప్రవాస భారతీయుల సమావేశంలోనూ మోదీ మాట్లాడారు. ప్రవాస భారతీయులు దేశ ప్రతిష్టను ఇనుమడింప చేయలని కోరారు. వారిని చూసి తాను గర్విస్తున్నా నన్నారు. డెన్మార్క్ ‌పర్యటనలో భాగంగా భారత్‌ – ‌నార్డిక్‌ ‌సదస్సులో మోదీ పాల్గొన్నారు. సదస్సు సందర్భంగా డెన్మార్క్, ‌నార్వే, ఫిన్లాండ్‌, ‌స్వీడన్‌ ‌దేశాధినేతలతో భేటీ అయ్యారు. వారితో ద్వైపాక్షిక, అంతర్జాతీయ అంశాలపై చర్చలు జరిపారు. 2018లో జరిగిన తొలి భారత-నార్డిక్‌ ‌సదస్సులో తీసుకున్న నిర్ణయాల అమలు తీరును ఈ సందర్భంగా మోదీ వారితో సమీక్షించారు. భారత్‌తో ఈ దేశాలు మరింత బలపడాల్సిన అవశ్యకత ఉందని పేర్కొన్నారు.

 అంతకుముందు బెర్లిన్‌ ‌నుంచి కోపెన్‌హగన్‌ ‌చేరకున్న మోదీకి ఘన స్వాగతం లభించింది. ప్రధాని మెటె ఫ్రెడెరిక్సన్‌ ‌స్వయంగా విమానాశ్రయానికి వచ్చి మోదీని సాదరంగా స్వాగతించడం విశేషం. తన అధికార నివాసం ‘మ్యారియన్‌ ‌బోగ్‌’‌లో ఆయనకు ఆతిథ్యమిచ్చారు. మ్యారియన్‌ ‌బోగ్‌ను 18వ శతాబ్దంలో  నిర్మించారు. ఎత్తయిన ప్రదేశంలో, చుట్టూ విశాలమైన పచ్చిక మైదానాలు, జలాశయాలు, ఎత్తైన చెట్లతో ఆహ్లాదకరంగా ఉంటుంది. చర్చల అనంతరం ఇరు దేశాల అధినేతలు ఆ పరిసరాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా మోదీ బహుకరించిన రామదర్బార్‌ ‌పెయింటింగ్‌ను తన అధికారిక నివాసంలో ఫ్రెడెరిక్సన్‌ ‌ప్రత్యేకంగా అలంకరించారు.


‌యూరప్‌ – ‌నాడు, నేడు

భారత్‌-‌యూరోపియన్‌ ‌యూనియన్‌ ‌మధ్య సంబంధాలు ఇప్పటివి కాదు. నిజానికి ఆ సంబంధాలలో కొన్ని ఎగుడు దిగుళ్లు ఉన్నాయి. నెహ్రూ ప్రధానిగా ఉండగానే 1960లో యూనియన్‌ ఏర్పాటుకు బీజం పడింది. దీనిని ఆయన కేపిటలిస్ట్ ‌క్లబ్‌గా భావించారు. 1957 నాటి యూరోపియన్‌ ఎకనమిక్‌ ‌కమ్యూనిటి విషయంలో కూడా నెహ్రూ వలస సంస్కృతి ఉందనే అనుకున్నారు. రోమ్‌ ఒప్పందం ప్రకారం ఆ కమ్యూనిటి ఆవిర్భవించింది. అయితే టిటో, నాజర్‌లతో కలసి అలీనోద్యమానికి ప్రథమ ప్రధాని శ్రీకారం చుట్టారు. కానీ ఈ వ్యవస్థల ప్రస్థానం ఏమిటి అనేది ఇవాళ్టి రాజకీయ చరిత్రకారులు విశ్లేషించవలసి ఉంటుంది. అలీనోద్యమం చరిత్ర పుటల నుంచి అదృశ్యమైపోయింది. కానీ యూరోపియన్‌ ఎకనమిక్‌ ‌కమ్యూనిటి మాత్రం దినదినాభివృద్ధి సాధించింది. అదే ఈ రోజు యూరోపియన్‌ ‌యూనియన్‌గా ప్రపంచం ముందు నిలిచింది. ఇది కూడా ఒడిదుడుకులను ఎదుర్కొంటూనే ఉంది. నెహ్రూ ఉద్దేశం ప్రకారం భారత ఆర్థిక వ్యవస్థకూ, విదేశాంగ విధానంతోను యూరోపియన్‌ ‌యూనియన్‌కు సరిపడదు. ఆ క్రమంలోనే భారత విదేశాంగ విధానం రెండు దేశాల చుట్టూ ప్రధానంగా కేంద్రీకృతం కావలసి వచ్చింది. ఒకటి పొరుగున ఉన్న పాకిస్తాన్‌తో సంబంధాలు. ఇవి పూర్తిగా వ్యతిరేక దిశలో నడిచాయి. మరొక దేశం సోవియెట్‌ ‌రష్యా. ఆ దేశంతో మన సంబంధాలు ఎంతో ఫలవంతం సాగాయి. కశ్మీర్‌ ‌విషయంలో సోవియెట్‌ ‌రష్యా భారత్‌కు చాలా మేలు చేసింది. రష్యా నుంచి భారత్‌కు రక్షణ సామగ్రి దిగుమతి అయ్యేది. భారత విదేశాంగ విధానం వరకు పెద్ద పరిణామం అసలు నెహ్రూ విదేశాంగ విధానాన్ని బీజేపీ నుంచి వచ్చిన నరేంద్ర మోదీ అమలు చేయడం లేదు. నేటి ఐరోపా దేశాలు భారత్‌ ‌సౌభాత్రానికి అవసరమని మోదీ చెబుతున్నారు.


మూడు రోజుల యూరప్‌ ‌పర్యటనలో భాగంగా మోదీ చివరిగా ఫ్రాన్స్ ‌సందర్శించారు. యూరోపి యన్‌ ‌యూనియన్‌లో ఫ్రాన్స్ ‌కీలకదేశం. ఐరాస భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం గల దేశం. భద్రతామండలిలో భారత్‌కు శాశ్వత సభ్యత్వానికి సంబంధించి బేషరతుగా మద్దతు ప్రకటించింది. తొలి నుంచీ ప్యారిస్‌తో న్యూఢిల్లీ సంబంధాలు సజావుగానే ఉన్నాయి. తాజాగా ఫ్రాన్స్ ‌నుంచి రఫేల్‌ ‌యుద్ధ విమానాలను భారత్‌ ‌దిగుమతి చేసుకుంటున్న విషయం తెలిసిందే. ఫ్రాన్స్ అధ్యక్షుడిగా మెక్రాన్‌ ఇటీవల రెండోసారి ఎన్నికైన అనంతరం ఆయనతో మోదీ భేటీ కావడం ఇదే తొలిసారి. రెండోసారి ఇమ్మాన్యుయల్‌ ‌మెక్రాన్‌ అధ్యక్షుడైన సందర్భంగా మోదీ ఆయనను అభినందించారు. ఉభయ దేశాల అధినేతలు అనేక ద్వైపాక్షిక, అంతర్జాతీయ అంశాలపై సమీక్ష జరిపారు. రష్యా-ఉక్రెయిన్‌ ‌యుద్ధానికి సంబంధించి భారత్‌ ‌వైఖరిని, పరిమితులను మోదీ సోదాహరణంగా వివరించారు. పూర్వ సోవియట్‌ ‌యూనియన్‌ ‌నుంచి విడిపోయిన తరవాత ఉక్రెయిన్‌తో తమకు సన్నిహిత సంబంధాలున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. రష్యా, ఉక్రెయిన్‌ ‌యుద్ధంలో రష్యాను ఫ్రాన్స్ ‌తప్పుపట్టిన సంగతి తెలిసిందే. అదే సమయంలో ఉక్రెయిన్‌కు అన్నివిధాలా అండగా ఉన్న విషయం గమనార్హం. ఈ నేపథ్యంలో భారత్‌ ‌పాత్ర గురించి మోదీ సవివరంగా ప్రస్తావించారు. యుద్ధం వల్ల ఆహార కొరత, ఎరువుల కొరత ఏర్పడుతుందని ఇది ఎవరికీ మంచిది కాదని అభిప్రాయపడ్డారు. ఇక యుద్ధాన్ని పక్కనపెడితే ఉభయ దేశాల మధ్య సంబంధాలు కొత్త పుంతలు తొక్కాల్సిన ఆవశ్యకత గురించి చర్చించారు. ఉభయ దేశాల సంబంధాలు ప్రపంచ శాంతికి, సుసంపన్నతకు బాటలు వేయాలని ఇరు దేశాల అధినేతుల ఆకాంక్షించారు. కరోనా సమయం లోనూ రఫేల్‌ ‌యుద్ధ విమానాలను నిర్ణీత గడువులోగా అందించిన విషయాన్ని మెక్రాన్‌ ‌వివరించారు. రక్షణ రంగంలో మరింత సహకారం అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఆయన చెప్పారు. ఆత్మనిర్భర్‌ ‌కార్యక్రమం కింద భారత్‌ ‌రక్షణ ఉత్పత్తుల తయారీ చేపట్టడం కీలకమైన ముందడుగుగా మోదీ పేర్కొన్నారు. ఆధునిక రక్షణ సాంకేతికతలతో పాటు అంతరిక్ష పరిశోధనలు, సముద్ర వాతావరణ ఆర్థికవ్యవస్థ, పౌర అణు కార్యక్రమం, సౌర విద్యుత్‌, ‌రెండు దేశాల ప్రజల మధ్య సత్సంబంధాలు తదితర అంశాలపై మోదీ, మెక్రాన్‌ ‌సుదీర్ఘంగా చర్చించారు. భారత్‌లో పర్యటించవలసిందిగా మెక్రాన్‌ను మోదీ ఆహ్వానించారు. ఫ్రాన్స్ అధ్యక్ష ఎన్నికల సందర్భంగా పుదుచ్చేరి ప్రాంతంలో ఇప్పటికీ ఓటింగ్‌ ‌జరుగు తుంటుంది. ఇటీవల కూడా జరిగింది. ఇండో- పసిఫిక్‌ ‌ప్రాంతంలో శాంతి, సుస్థిరత సాధన ప్రయత్నాలను మరింత ముందుకు తీసుకువెళ్లాలని ఇరుదేశాల అధినేతలు నిర్ణయించుకున్నారు. ఇరుదేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత విస్తరించుకోవాలని అభిప్రాయపడ్డారు. భారత్‌ ‌శాంతి, శ్రేయస్సుకు ఐరోపా భాగస్వామ్యం అత్యంత కీలకమని, అందువల్ల ఆయా దేశాలతో సత్సంబంధాలు తమకు అత్యంత ముఖ్యమని మోదీ పేర్కొన్నారు. ప్రస్తుతం అంతర్జాతీయంగా అనేక సవాళ్లు ఎదురవుతున్నాయని, వీటిని సమష్టిగా అధిగమించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. భారత్‌ది వసుదైక కుటుంబ భావన అని, ఇతరులను దెబ్బతీసి, నష్టపరచి ఎదగాలని ఎంతమాత్రం కోరుకోదని పేర్కొన్నారు. భారత్‌ ఏనాడూ తన స్వార్థం చూసుకోలేదని, సర్వమానవాళి హితానికే ప్రాధాన్యం ఇస్తూ ముందుకు సాగిందని, మన్ముందు కూడా ఇదే పంథాలో సాగుతుందని స్పష్టం చేశారు. వాతావరణ మార్పులు, సుస్థిర ప్రగతి వంటి అంశాల్లో భారత్‌ ‌తన వాణిని ఎప్పుడూ బలంగా వినిపిస్తుందని తెలిపారు. మన శ్రమ మన కోసం మాత్రమే కాదు, మన ప్రగతితో సర్వ మానవాళి శ్రేయస్సుతో ముడిపడి ఉందని మోదీ వివరించారు. అంతర్జాతీయంగా సంక్లిష్ట పరిస్థితులు నెలకొన్న కీలక తరుణంలో మోదీ యూరప్‌ ‌పర్యటన విజయవంతమైంది. రష్యాకు భారత్‌ అనుకూలమన్న కొన్ని దేశాల భావనను పటాపంచలు చేశారు. రష్యాతో స్నేహం ఉన్నంత మాత్రాన ఉక్రెయిన్‌కు భారత్‌ ‌వ్యతిరేకం కాదన్న విషయాన్ని అంతర్జాతీయ సమాజం గుర్తించాలంటూ భారత్‌ ‌వాణిని బలంగా వినిపించారు. తద్వారా దేశ విదేశాల్లో ప్రజల అభిమానాన్ని, ఆదరణను, మన్ననలు అందుకున్నారు. అంతర్జాతీయంగా భారత ప్రతిష్టలను ఇనుమడింపజేశారు.

వ్యాసకర్త: సీనియర్‌ ‌జర్నలిస్ట్

By editor

Twitter
Instagram