ఒక చట్టం లేదా ఐపీసీలో ఒక సెక్షన్‌ ‌దుర్వినియోగమవుతున్నాయన్న ఆరోపణతో వాటిని తొలగించలేం. ఒక చట్టాన్ని ఎవరైనా సవాలు చేస్తే, దానిని న్యాయస్థానాలు కొట్టివేసే వరకు అవి అమలులో ఉన్నట్టే అంటున్నారు పట్నా హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎల్‌. ‌నరసింహారెడ్డి. నిజానికి 124ఎ ను రద్దు చేయడం లేదా సమీక్షించడం అనే పక్రియలు పూర్తి కాకుండానే, ఈ వ్యవహారం ముగింపు సమీప భవిష్యత్తులో కనిపించకపోయినా దాని అమలు మీద సుప్రీం కోర్టు స్టే విధించడం సరికాదని జస్టిస్‌ ‌నరసింహారెడ్డి నిష్కర్షగా చెప్పారు. ఆ చర్య పెద్ద తప్పిదమని, తీవ్ర పరిణామాలకు దారి తీసేదేనని కూడా స్పష్టం చేశారు. ఈ స్టేతో సుప్రీంకోర్టు గతంలో తాను ఇచ్చిన తీర్పులను తానే ఉల్లంఘించినట్టయిందని కూడా అభిప్రాయపడ్డారు. రద్దు లేదా పునస్సమీక్ష అనివార్యం కాబట్టి, ఆ స్థానంలో వచ్చే కొత్త సెక్షన్‌ ‌దుర్వినియోగం కాకుండా ఉండేలా రూపొందించడమే ప్రధానమని ఆయన సూచించారు. భారత శిక్షా స్మృతిలోని 124ఎ గురించి దేశమంతా చర్చ జరుగుతున్న తరుణంలో జాగృతి ఆ న్యాయ నిపుణునితో మాటా మంతి జరిపింది. ముఖ్యాంశాలు:

ఇవాళ యావద్భారత దేశం దృష్టిని తన వైపు తిప్పుకున్న ఒక అంశం- భారత శిక్షా స్మృతిలోని రాజద్రోహం విభాగం. దాని మీద జరిగే పునరా లోచన. లేదా పూర్తి రద్దు. అసలు ఈ విభాగం ఏమిటి? ఎందుకొచ్చింది? బ్రిటిష్‌ ‌వాళ్ల ప్రమేయం ఎంత? కొనసాగింపునకు ఉన్న పరిస్థితులు ఏమిటి?

రాజద్రోహం అనే దానిని ఎలాంటి దేశంలోనైనా, ఏ రకమైన వ్యవస్థలో అయినా కూడా నేరంగానే పరిగణిస్తారు. అది రాచరికం కావచ్చు. ప్రజాస్వామిక వ్యవస్థ కావచ్చు. లేదా వెనుకబడిన దేశాలలోనూ కావచ్చు. రాజద్రోహం నేరమే. అంతేకాదు, దేశం పరాయివాళ్ల అధీనంలో ఉన్నప్పుడు, విముక్తం చేయడానికి, ఆ పరాయి ప్రభుత్వాన్ని పడగొట్టే కార్యక్రమాలు ఏం జరిగినా కూడా వాటిని సైతం రాజద్రోహంగానే పరిగణిస్తారు. ఈ నేరానికి శిక్ష తీవ్రంగానే ఉంటుంది. ఎందుకంటే రాచరిక వ్యవస్థను కాపాడుకోవాలన్నా, ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని కూలదోసే ప్రయత్నం జరిగినప్పుడు వాటిని ఎదుర్కోవాలన్నా రాజద్రోహాన్ని తీవ్ర నేరంగా పరిగణించడం, అంతే తీవ్రంగా శిక్షించడం తప్పనిసరి. ఇది బ్రిటిష్‌ ‌పాలనా కాలంలో ఏర్పడిన చట్టం. ఇవాళ్టికీ కొనసాగుతున్నది.

రాజద్రోహం సెక్షన్‌ ‌కేవలం పరాయి పాలన సమయంలోనే ఉంటుందనుకోవడం పొరపాటు. ఇప్పటికీ చాలా ప్రజాస్వామికదేశాల్లోను, స్వాతంత్య్రం తెచ్చుకున్న దేశాల్లోను రాజద్రోహం/సెక్షన్‌ ‌కనిపిస్తూనే ఉన్నాయి. అమెరికాలో కూడా ఉంది. పాత చట్టాన్ని కొద్దిగా మార్చినా గాని రాజద్రోహం సెక్షన్‌ ‌బ్రిటన్‌లో కూడా ఉంది. రాజద్రోహానికి పాల్పడితే అంత సులభంగా ఎక్కడా వదిలిపెట్టరు. ఇక రాజద్రోహం, ప్రజల యాటిట్యూడ్‌ ‌గురించి మాట్లాడుకోవాలంటే- ఒక్కొక్కసారి అది ఆ దేశ ప్రజల చారిత్రక అవసరం కూడా అవుతుంది. అలాగే ఇలాంటి చట్టం చేయడం కూడా ప్రభుత్వాలకు అనివార్యమవుతుంది. ఎందుకంటే ప్రభుత్వాలను ప్రజలు ఎన్నుకుంటారు. దాని విధానాలు, పాలన ఇష్టం లేకుంటే వాటిని ఓటుతో ఓడిస్తారు. ఓటును విశ్వసించని వాళ్లు- తీవ్రవాదులే కావచ్చు, లేక తీవ్రమైన అభిప్రాయా లున్న వాళ్లే కావచ్చు. కొద్దిమంది మేము వ్యవస్థనే మార్చేస్తాం, మొత్తం దేశాన్ని అతలాకుతలం చేస్తాం, వ్యవస్థలన్నింటిని నాశనం చేస్తామంటే ఏ వ్యవస్థా చూస్తూ ఊరుకోదు. అది మెజారిటీ ప్రజాభిప్రాయాన్ని తిరగతోడడమే. ప్రజాభిప్రాయాన్ని ధిక్కరించి, మీ ప్రజాభిప్రాయం, ప్రజాస్వామ్యం మాకు అవసరం లేదు, మా మాటే నెగ్గాలని శాసిస్తే నడవదు కదా! కొన్ని కోట్ల మంది ప్రజలున్న దేశంలో భిన్నత్వంలో ఏకత్వమున్న దేశంలో వంద లేకుంటే వెయ్యి మంది ఓ అభిప్రాయానికి వచ్చి ఈ తరహా ప్రభుత్వం మనకు వద్దు. ఈ వ్యవస్థ వద్దు అంటే, ఈ పార్టీ మాత్రం వద్దు, ఇలాంటి వ్యక్తులు అసలే వద్దు అంటే నడవదు.

124ఎ ను రద్దు చేయాలనీ, పునస్సమీక్షించా లనీ గతంలోను చాలా మంది చాలా సందర్భాలలో కోరారు. ఇప్పుడు ఇంత తీవ్రంగా ఎందుకు ఈ డిమాండ్‌ ‌ముందుకు వచ్చింది?

రాజద్రోహ నేరం ఇప్పుడు అవసరమా? వలస పాలన నాటి అవశేషం అని ప్రశ్నించడం, విమర్శిం చడం, దానిని సమీక్షించమంటూ కోర్టుకు వెళ్లడం ఇవన్నీ చట్టబద్ధమే. కాదనలేం. కొంచెం లోతుగా వెళ్లినట్లయితే కొన్ని వాస్తవాలు బోధపడతాయి. మనకు స్వాతంత్య్రం వచ్చింది. కానీ ఒక బలిష్టమైన దేశీయ వ్యవస్థను మనం ఏర్పరచుకోలేదు. కొందరి దయాదాక్షిణ్యాల మీద ఉండిపోయాం. ఈశాన్య భారతాన్ని ఒకరికి వదిలిపెట్టేశాం. గిరిజన జాతుల అభివృద్ధి పేరుతో ఇతరులెవ్వరిని అటు పోనియ్య కుండా కేవలం క్రిస్టియన్‌ ‌మైనారిటీస్‌కి స్వేచ్ఛగా ఈశాన్య భారత రాష్ట్రాలను అప్పగించాం. వాళ్లు అక్కడి వారందరిని మార్చేసారు. ఇంకో వ్యవస్థను ఇంకో సిద్ధాంతం వారికి వదిలిపెట్టాం. స్వాతంత్య్ర పోరాటంలో ఖిలాఫత్‌ ఉద్యమాన్ని కలపడం మరొకటి. మనమే మన స్వాతంత్య్రం కోసం కొట్టుమిట్టాడుతూ, మధ్యలో ఖలిఫా పునరుద్ధరణ అని పెట్టుకున్నాం. దేశంలో మతపరమైన విభజన వచ్చింది. ఎవరు తమకంటూ ప్రత్యేక భాగాన్ని పొందగలిగారో వాళ్లు అది పొంది, మిగతా దాంట్లో కూడా భాగం ఉండాలనుకున్నారు. అంటే ఇది మాది.. మనది అనడమే. ఇంకా చెప్పాలంటే, పాకిస్తాన్‌, ‌బంగ్లాదేశ్‌లు మావి. భారతదేశం మనది. విద్యారంగాన్ని మొదటి ఆ 30, 40 సంవత్సరాలు పెద్ద లోపంతో నిర్వహించారు. మనకు వక్రీకరించిన చరిత్రే చెప్పారు. భారతదేశానికి ఒక అస్తిత్వం లేదు అనేదే ఆ చరిత్ర సారాంశం. కేవలం మొగలుల నుంచి, బ్రిటిష్‌ ‌జాతీయుల నుంచే మనం నేర్చు కున్నామన్న అభిప్రాయాన్ని మన పిల్లలకి నూరి పోసే పక్రియ ప్రబలింది. ఈ మధ్యకాలంలో మన చరిత్ర ఏదో తెలుసుకునే అవకాశం కలుగుతున్నది. మన పూర్వ చరిత్ర గురించి గొప్ప అభిప్రాయం ఏర్పరిచే వాతావరణం వచ్చింది. ప్రశ్నించడం మొదలయింది. ఈ దేశాన్ని ఎందుకు బలహీనపరచాలని అనుకుంటు న్నావు అని నిలదీసేసరికి వాళ్లకి బాధ.

124ఎ రద్దుతో వ్యవస్థ ముందడుగు వేస్తుందా?

124ఎ బ్రిటిష్‌ ‌హయాంలో వచ్చింది. తరువాత వచ్చిన స్వతంత్ర ప్రభుత్వాలు ఏం చేశాయి? ఈ నిబంధనను కొనసాగించాయి. మనది ప్రజాస్వామ్యం కదా, ఇక్కడ అందరికి ఒకే రకమైన స్వేచ్ఛ ఉండాలి అంటూ ప్రత్యేకంగా ఆలోచించలేదు. ఇంకా, రాజద్రోహ చట్టం ఉండగానే టాడా అని, మీసా అని, ఉపా అని వచ్చాయి. ఎమర్జెన్సీ (1975)లో ప్రభుత్వం ఎంతదూరం పోయింది? సుప్రీంకోర్టులో అడిగారు. ఎమర్జెన్సీ అమలులో ఉన్నది కాబట్టి, ‘ఏ’ అనే వ్యక్తిని అరెస్టు చేయవలసి ఉంది అనుకుందాం. ‘ఏ’ బదులు ‘బి’ని పట్టుకొస్తారు. ఆయనకు రక్షణేది? కోర్టుకు పోయే సదుపాయాన్ని సస్పెండ్‌ ‌చేసి పడేశారు. అప్పుడు అటార్నీ జనరల్‌ ‌నిరున్‌డే జవాబు చెప్పారు కోర్టులో. రాజ్యాంగం సస్పెండ్‌ అయ్యింది కాబట్టి, ఒక వ్యక్తిని పొరపాటుగా చంపినా అడిగే వ్యవస్థ లేదు, అని. అప్పుడు ఈ 124ఎ మీద గొంతెత్తిన వాళ్లెవ్వరూ లేరు. ఎంతో కొంత భారత దేశం కోసం పోరాడుతున్న, స్వతంత్రంగా ఆలోచించ గలిగే శక్తి ఉన్న అటల్‌ ‌బిహారి వాజ్‌పేయి వంటి వాళ్లందరిని లోపల వేశారు. అంతేతప్ప భారతదేశ సమగ్రతను దెబ్బ తీసేవాళ్లను శిక్షించాలి, లేకుంటే వాళ్ల చర్యలను అరికట్టాలన్న తపన ఆనాటి ప్రభుత్వాలకు ఏనాడూ కలగలేదు. ఇప్పుడు భారత భద్రత, మనుగడకు సంబంధించిన పట్టింపు సాధారణ పౌరులలో వచ్చింది.

భావ ప్రకటన స్వేచ్ఛ పేరుతో ప్రజాస్వామ్యం ముసుగులో ఇదంతా ముందుకు తీసుకువచ్చారు. నిజానికి వీటిలో ఏది కీలకం? దేశం సమగ్రత? భద్రతా? ఎవరి ఇష్టం వచ్చినట్టు వారు భాష్యాలు చెప్పే భావ ప్రకటన స్వేచ్ఛా? భావ ప్రకటనా స్వేచ్ఛకీ, దేశ భద్రతకీ నడుమ ఎలాంటి సమతౌల్యం ఉండాలి?

ఈ మధ్య భారతదేశాన్ని ముక్కలు చేస్తానని షర్జిల్‌ ఇమామ్‌ అనేవాడు బాహాటంగానే ప్రకటించాడు. అలాంటి ప్రకటన చేసినవాడు కాకపోతే ఆ చట్టం కిందకు ఇంకెవడు వస్తాడు? భారతదేశం సంగతి ఒక్కసారి పక్కన పెడదాం. చైనా లాంటి కమ్యూనిస్టు దేశాలైనా, బ్రిటన్‌ ‌లాంటి ప్రజాస్వామిక దేశాలైనా, అమెరికా వంటి స్వేచ్ఛా సమాజమైనా అలాంటి భాష మాట్లాడితే ఊరుకుంటాయా? ప్రభుత్వం పట్ల, దేశం పట్ల ఇంత వ్యతిరేకతతో వచ్చే ప్రకటనలు దేశ ఉనికికే ప్రమాదమని ఎవరైనా భావిస్తారు.

ఇక భావ ప్రకటన స్వేచ్ఛ అనేది ఎప్పుడూ కొన్ని కట్టుబాట్లకూ, షరతులకూ లోబడే ఉంటుంది. నీ స్వేచ్ఛ ఎంతవరకు? దేశ సమగ్రతకు భంగం తేనంత వరకు. కానీ స్వేచ్ఛ పేరుతో మిగిలిన వారిని అల్లరి పాలు చేయడం, వ్యవస్థలను నాశనం చేయడం కొత్తకాదు. స్వేచ్ఛ అనేది ఎప్పుడు ఎక్కడా హద్దులు లేకుండా ఉండదు. నువ్వు రోడ్‌ ‌మీద వెళ్తుంటావు. స్వేచ్ఛ ఉందని రైట్‌, ‌లెఫ్ట్ ‌పాటించనంటే ఎన్ని ఆక్సిడెంట్లు కావాలి? ఒక పద్ధతి పాటిస్తేనే సాఫీగా జరిగిపోతుంది. అదే స్వేచ్ఛకి భంగమని భాష్యం చెబితే, ఎవరూ సమర్థించరు. అది స్వేచ్ఛ కాదు.

సుప్రీంకోర్టు లాయర్‌ ‌కె.టి.ఎస్‌. ‌తులసి ఓసారి అన్నారు. దేశాన్ని తిట్టడం, దేశం విడిపోవాలనడం రాజద్రోహం కాదన్నారు. హింసాత్మక చర్య ఉంటేనే అది రాజద్రోహం అన్నారు. దేశాన్ని తిట్టడం, ప్రభుత్వం మీద ద్వేషం పుట్టించడం హింసకు బీజం వేసేవే కదా!

అలాంటివి బాధ్యతరాహిత్యమైన ప్రకటనలే అనాలి. ఒక వ్యవస్థని విమర్శించవచ్చు. ఆ హక్కు ఉంది. విమర్శ లేకపోతే అసలు వ్యవస్థే నడవదు, ప్రజాస్వామ్యంలో. కానీ వ్యవస్థలో కొన్ని అవాంఛ నీయ పర్యవసనాలు జరుగుతుంటాయి. వాటి గురించి గళమెత్తే బాధ్యత అందరిది. ఉదాహరణకి- ఫలానా సుంకం విధించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వపరంగా అది సమంజసమే కావచ్చు. కాని దానివల్ల ప్రజలకు కలిగే ఇబ్బంది మాటేమిటి? దాని పర్యవసనాలు ఏమిటి? వీటిని ఎత్తి చూపే బాధ్యత, హక్కు ప్రజలకి ఉంది.

విచిత్రమేమిటంటే ఇవాళ 124ఎకు వ్యతిరేకంగా వాదిస్తున్నవారంతా ఆనాటి ప్రభుత్వాలు దీనికంటే కఠినమైన చట్టాలు వచ్చినప్పుడు ఏం చేశారు? అన్‌లా ఫుల్‌ ఆక్టివిటిస్‌ అం‌డ్‌ ‌పివ్రెన్షన్‌ ‌యాక్ట్ (‌యూఏపీఏ) ఉన్నది. తరువాత ఇందాక చెప్పిన టాడా (టెర్రరిస్టు అండ్‌ ‌డిజరెప్టివ్‌ ‌యాక్టివిటీస్‌ (‌ప్రివెన్షన్‌) ‌యాక్ట్) ‌తీసుకొచ్చారు. ఎమర్జెన్సీలో మీసా (మెయింటినెన్స్ ఇం‌టర్నల్‌ ‌సెక్యూరిటీ యాక్ట్) ‌ప్రయోగించారు. ఇవన్నీ 124ఎ కన్నా కఠినమైనవి. 124ఎలో అయినా ట్రయల్‌ ‌కండక్ట్ ‌చెయ్యాలి. తర్వాత సాక్ష్యాలు అన్నింటిని పెట్టి, చేసిన నేరం రాజద్రోహం కింద వస్తే శిక్ష పడుతుంది. మిగిలిన వాటిలో ట్రయల్‌ అక్కర్లేదు. మీరు ఇంట్లో ఉన్నా పట్టుకుపోవచ్చు. ఈ చట్టాలని కొందరు సవాలు చేశారు. కొన్ని కొన్ని కాలగర్భంలో కలిపోయాయి. కొన్నిటిని గవర్నమెంట్‌ ‌రద్దు చేసింది. కొన్నింటి మీద కోర్టులే ప్రతికూల వ్యాఖ్యలు చేశాయి. 498 ఏ అని భారత శిక్షాస్మృతిలో ఉంది. వరకట్న వేధింపులకు సంబంధించింది. దీనిని దుర్వినియోగం చేస్తున్నారని సుప్రీంకోర్టే చెప్పింది. ఏదో సంస్థ ఒక చట్టం దుర్వినియోగమవుతున్నదని అభిప్రాయపడినంత మాత్రాన దానిని రద్దు చేయరు. దుర్వినియోగం పేరుతోనే ఒక చట్టాన్ని రద్దు చేయలేం. చట్టమే కాదు, ఒక వస్తువు, ఒక వ్యవస్థ దుర్వినియోగం అయినంత మాత్రాన రద్దు చేయలేరు. అది దుర్వినియోగం కాకుండా చూడాలి.

కేదార్‌నాథ్‌ ‌కేసు ఏమిటి?

1961లో 124ఎను సవాలు చేశారు. కేదార్‌ ‌నాథ్‌ ‌కేసు అదే. 124ఎతో భావ ప్రకటనా స్వేచ్ఛకు ఇది భంగమని వాదించారు. అయినా సుప్రీంకోర్టు దానిని రాజ్యాంగబద్ధ సెక్షన్‌గానే పరిగణించింది. 19(2) భావ ప్రకటనా స్వేచ్ఛకు పూచీ, హామీ ఇస్తున్నదని చెప్పింది. టాడాను 1993లో పి.యు. సి.ఎల్‌. (‌పీపుల్స్ ‌యూనియన్‌ ‌ఫర్‌ ‌సివిల్‌ ‌లిబర్టీస్‌) ‌సవాలు చేసింది. ఆ చట్టం దుర్వినియోగమవు తున్నదనే ఆ సంస్థ ఆరోపణ. రాజ్యాంగ విరుద్ధం కానంతవరకు అది చట్టబద్ధమేనని సుప్రీంకోర్టు చెప్పింది. దేశ రక్షణకు అవసరమైన చట్టాలు చేయాలని పార్లమెంటు భావిస్తుంది. అది రాజ్యాంగం ఇచ్చిన హక్కు. ఆ చట్టం రాజ్యాంగంలోని ఫలానా పరిచ్ఛేదానికి వ్యతిరేకంగా ఉన్నది అని భావిస్తేనే తొలగిస్తారు. అంతే తప్ప మా అభిప్రాయం మేరకు రద్దు చేయాలని కొందరు వత్తిడి చేస్తే సాగదు. చట్టాలు కూడా ప్రజలకు, దేశానికి రక్షణ కోసం ఉండాలి. దేశాన్ని ఇష్టం వచ్చినట్లు తిట్టు, దాన్ని ముక్కలు చేయి, నాశనం చేయి, కించపరుచూ, అవమానించు అన్నది ఏ చట్టం ఒప్పుకోదు.

ఇప్పుడున్న పరిస్థితుల్లో 124ఎ సెక్షన్‌ ‌మీద స్టే విధిస్తే ఎలాంటి పరిణామాలు జరుగుతాయని మనం ఊహించవచ్చు?

నిజమే స్టే ఇచ్చారు. ఒక విషయం చెబుతాను. టాడా రాజ్యాంగబద్ధతను సవాలు చేసినప్పుడు కూడా ఇదే ప్రశ్న వచ్చింది. సుప్రీంకోర్టు తుది తీర్పు వెలువరించే వరకు ఆ చట్టం వినియోగం మీద స్టే విధించమని వాళ్లు అడిగారు. అసలు సెటిల్డ్ ‌ప్రిన్సిపుల్‌ ఆఫ్‌ ‌లా ఏమిటి? పార్లమెంట్‌ ‌చేసినదే అయినా, ఒక ప్రొవిజన్‌ ఆఫ్‌ ‌లాను సవాలు చేసినప్పుడు, సుప్రీంకోర్టు గానీ, హైకోర్టు గానీ దానిని కొట్టేసేవరకు అది (ప్రొవిజన్‌) ‌చట్టబద్ధమే. ఈ క్రమాన్ని నిరోధించే వ్యవస్థ ఉండదు. దీనిని నిరాకరించడం సాధ్యం కాదు. కాబట్టి ఇప్పుడు సుప్రీంకోర్టు 124ఎ మీద ఇచ్చిన స్టే గతంలో తానే ఇచ్చిన తీర్పులకు వ్యతిరేకం. సుప్రీంకోర్టులో ఒక అలజడి వంటిది. ఇంతవరకు ఈ విషయంలో పాటిస్తూ వస్తున్న నిబంధనలను ఒక్క దెబ్బతో కొట్టిపారేశారు. మొన్ననే చూశాం కదా! యాసిన్‌ ‌మాలిక్‌ అనేవాడి ఒప్పుకోలు. తన మీద చేసిన నేరారోపణలను అతడు తిరస్కరించలేదు. అంటే ఒప్పుకున్నాడు. కానీ ఈ దశలో ఏ అర్బన్‌ ‌నక్సలైటో వెళ్లి అతడికి శిక్ష విధించగలిగే చట్టాలు దుర్వినియోగ మవుతున్నాయనో, సరైనవి కాదనో వాదిస్తే ఎలా ఉంటుంది? ఏమైనా ఈ స్టే వ్యవహారం భవిష్యత్తులో తీవ్ర చర్చకు దారితీసేదే.

న్యాయవ్యవస్థ లక్ష్మణరేఖ దాటరాదని కేంద్రం అభిప్రాయపడుతున్నా కూడా 124ఎ విధింపు మీద స్టే ఇచ్చారు. విచారణ ఎదుర్కొంటున్నవాళ్లు కోర్టులను ఆశ్రయించవచ్చునని కూడా అత్యున్నత న్యాయస్థానం అవకాశం ఇచ్చింది.

ఇది సుప్రీంకోర్టు తన తీర్పును తానే గౌరవించుకోని వింత పరిస్థితి. స్టే వరకు వారు చేసింది తప్పు. అసలు దేశంలో రాజద్రోహ కార్యకలాపాలు కొనసాగాలని కోరుకుంటున్నవాడే స్టే కోరతాడని అంటాన్నేను. ఇది చరిత్రాత్మకం అంటూ, ఇంకా ఘనమైన పరిణామమంటూ కొందరు ఉద్విగ్నంగా మాట్లాడుతూ ఉండవచ్చు. కానీ గతంలో ఇదే సుప్రీంకోర్టు ఏమన్నదో కూలంకషంగా చూడమనండి! అక్కడి దాకా అక్కరలేదు. ఒక జీవోను తీసుకోండి. దాన్ని సవాలు చేస్తే, కోర్టు కొట్టేసే వరకు అది చట్టబద్ధమే. అంటే కోర్టు అది చెల్లుబాటు కాదు అని చెప్పేవరకు ఆ చట్టం ఉనికిలోనే ఉంటుంది. దాని శక్తి దానికి ఉంటుంది. ఈ స్టేతో తీవ్ర పరిణామాలు ఉండవని చెప్పలేం. రేపు ఒక కేసు కింది కోర్టులో విచారణకు వస్తుంది. దాని సంగతి ఏమిటి? ఈ దేశాన్ని సర్వనాశనం చేస్తాం, తుపాకులతో దండెత్తి వస్తాం అంటూ విధ్వంసం సృష్టించినవాడి కేసు అనుకుందాం. మొత్తం రికార్డు ఉంది. మొత్తం సాక్ష్యాలు కూడా ఉన్నాయి. అప్పుడు వాడికి ఏ చట్టం కింద శిక్ష విధిస్తారు? కాబట్టి ఇది చాలా ప్రమాదకర ధోరణి. పర్యవసానాలు, పరిణామాలు అనూహ్యంగా ఉంటాయి. ఇప్పుడు 124ఎ రద్దు ప్రయత్నాలను స్వాగతిస్తున్నవారిలో ఎవరైనా ఈ సెక్షన్‌ ‌కింద విచారణలో ఉన్నవారిలో అంతా నిర్దోషులేనని చెప్పగలరా? ఇది జనరల్‌ ‌లిటిగేషన్‌. ‌దేశం మొత్తానికి వర్తిస్తుంది. కాబట్టి బెయిల్‌ ‌కావాలనుకున్నవాడు బెయిల్‌ ‌కోసం దరఖాస్తు చేస్తే, అతడికి ఇస్తారు.

రాజద్రోహం కింద కేసులు సహజంగా ఉంటాయి అనుకున్నప్పుడు, ఏదో రూపంలో కొందరు దానికి పాల్పడే అవకాశమే ఎక్కువ కాబట్టి, 124ఎ రద్దు/ పునఃపరిశీలన అనంతరం రాబోయే చట్టం ఎలా ఉండాలి?

దుర్వినియోగం కాకుండా ఉండడమే ప్రధానం. ఆ విధంగా కొత్త సెక్షన్‌ ఉం‌డాలి. ఇప్పుడు ఎలా ఉంది? దుర్వినియోగం చేసేదీ వాళ్లే. దుర్వినియోగ మవుతున్నదంటూ ఫిర్యాదు చేసేదీ వాళ్లే. ఇది మరీ ప్రమాదం. నిన్న కాక మొన్న మహారాష్ట్రలో హనుమాన్‌ ‌చాలీసా చదువుతాం అన్నందుకే 124ఎ కింద కేసు పెట్టారు. ఆ సెక్షన్‌ ‌పెట్టిన వాడినే నిజానికి శిక్షించాలి. మందలించాలి. ఇలా ఎందుకు చేశావని నిలదీయాలి. అది చేయకుండా చాలీసా చదువు తామన్న వాళ్ల మీద కేసు పెట్టి లోపల వేయడం ఏమిటి? కాబట్టి ఇప్పటికే కొందరు సూచించారు. పోలీసు సూపరింటెండెంట్‌ ‌స్థాయి కలిగిన అధికారి పరిశీలన తరువాతే రాజద్రోహం కేసు నమోదు చేయాలి. అలాగే ఒక స్వతంత్ర వ్యవస్థతో ఈ కేసుల నమోదును పర్యవేక్షించే ఏర్పాటు చేయవచ్చు. ఎలాగంటే ప్రివెంటివ్‌ ‌డిటెన్షన్‌ ‌చేసినప్పుడు ఆ కేసు మొదట ఒక కమిటీ పరిశీలిస్తుంది. ఆ కమిటీ ఆమోదించాలి. లేదా ఒక నిపుణుల సంఘం ద్వారా నిర్వహించాలి. దుర్వినియోగం కాకుండా ఉండడానికి ఎన్ని జాగ్రత్తలు అవసరమో అన్నీ తీసుకోవాలి.

రాజద్రోహం కేసు, దేశభద్రతల మధ్య సమతౌల్యం చూడాలని సుప్రీంకోర్టు అభిప్రాయ పడుతున్నట్టు వార్తలలో వచ్చింది. రాజద్రోహం సెక్షన్‌ ‌తొలగిస్తారు అనగానే చాలామందికి వచ్చిన ప్రశ్న- మరి ఈ దేశభద్రత మాటేమిటి? తొమ్మిది దశాబ్దాల పాటు ఎన్నో త్యాగాలు చేస్తే వచ్చిన స్వాతంత్య్రానికి, సాధించుకున్న రాజకీయ ఏకత్వానికి రక్షణ ఏది అన్నదే. పరిస్థితులు అలాగే ఉన్నాయి. ఈ దేశాన్ని విభజిస్తాం అనేవాళ్లు కొందరు. మత రాజ్యం నినాదాలు మరొకవైపు. పరిష్కారం ఏమిటి?

ఒక జాతి స్వేచ్ఛ, ఒక దేశ ఐక్యత, సమగ్రత కేవలం చట్టాలతోనే సాధ్యమవుతుందని అనుకో కూడదు. లర్న్‌డ్‌హ్యాండ్‌ అని న్యూయార్క్ ‌హైకోర్టు న్యాయమూర్తి. న్యాయశాస్త్ర తత్త్వవేత్తగా పేరుంది. గొప్ప రచయిత కూడా. ఆయన స్పిరిట్‌ ఆఫ్‌ ‌లిబర్టీ అని ఒక పుస్తకం రాశాడు. ఈ విషయం గురించి ప్రస్తావించారాయన. ఆ భావన వ్యక్తులలోను, వ్యవస్థలోను కూడా ఉండాలి అన్నారాయన. అప్పుడు మాత్రమే స్వేచ్ఛ అనండి, స్వాతంత్య్రం అనండి భద్రంగా ఉంటాయి. వీటి గురించి న్యాయ స్థానాలో, చట్టాలో శాసిస్తూ ఉన్నంత మాత్రాన అవి నిలబడవు. దేశ భద్రత అనేది ప్రభుత్వంతో పాటు, ప్రతి పౌరుడు కూడా తన బాధ్యతగా భావించు కోవాలి. ఈ భావనే చట్టాల కంటే దేశానికి ఎక్కువ రక్షణ కల్పిస్తుందం టాడు లర్న్‌డ్‌హ్యాండ్‌. ‌చట్టాలు చేసే పని చట్టాలు చేస్తాయి. ప్రజలలో ఈ భావన, ప్రభుత్వానికి ఉండ వలసిన నిబద్ధత కూడా అంతే అవసరం.

By editor

Twitter
Instagram