మా ఇంట్లో పనిచేసే 50 ఏళ్ల రమణి భర్త మద్యానికి బానిస. కాలేజీకి వెళ్లే ఇద్దరాడపిల్లలు, 80 ఏళ్ల తల్లి బాధ్యత. ఈ కుటుంబ భారాన్ని మోయడానికి నాలుగు ఇళ్లల్లో పనిచేసుకుంటోంది. భర్త పైసా ఇవ్వడు. తాగొచ్చి రమణిని, పిల్లల్ని కొట్టి, ఆ నాలుగు డబ్బులు తీసుకుని పోతాడు. తాగుబోతు తండ్రి వలన ఆ ఆడపిల్లలు తలెత్తుకోలేకపోతున్నారు. ఇదంతా చూసి పోరంబోకు కుర్రాళ్ల వెధవ్వేషాలు. నానా యాతనా పడాల్సి వస్తోందమ్మా అంటూ విలపించింది. పోలీసులకు చెప్పినా ఆ మొగుడు భయపడడు. ప్రభుత్వం నడిపే మందుషాపులోనే కొనుక్కుని తాగుతాడు. ఎన్ని చట్టాలున్నా మనిషిలో మార్పు రానిదే ఏం లాభం అంది. ఆమె అన్నమాట నా మనసుని కలిచివేస్తోంది. ఇది కేవలం ఆ ఒక్క కుటుంబం కథ కాదు. నేడు ప్రతి 10 కుటుంబాలలో 5 కుటుంబాలు మద్యం కారణంగా చితికి పోతున్నాయి. అనారోగ్యం, ఆర్థిక బాధలు, ప్రభుత్వ నిర్లక్ష్యంతో వచ్చే నాసిరకం, కల్తీ మద్యం తాగి వేలాది మంది మరణిస్తున్నారు. ఆంధప్రదేశ్‌లో ఇటీవలే జంగారెడ్డిగూడెంలో కల్తీ మద్యం తాగి దాదాపు 20 మందికి పైగా చనిపోయారు. మద్యానికి బానిసైన వ్యక్తి పతన ప్రస్థానం కేవలం అతనికి మాత్రమే పరిమితం అవకుండా అతని కుటుంబం, సమాజం, చివరికి దేశంపై కూడా ప్రభావాన్ని చూపుతుంది.

అలాగే మత్తుమందులు కూడా. ఇటీవల పెదదోర్నాలలో ఇంటర్‌ ‌చదివే అమ్మాయికి మీరావలి (19) అనే అబ్బాయి శీతలపానీయంలో మత్తు మందు కలిపి ఇచ్చి, నగ్న చిత్రాలు తీశాడు. అతని స్నేహితుడు రసూల్‌ (22)  ‌సామజిక మాధ్యమాలలో పోస్ట్ ‌చేశాడు. 17 ఏళ్ల సూరజ్‌ ‌ప్రభుత్వోద్యోగి కొడుకు. ఖరీదైన బైకు, విలాసవంతమైన జీవితం, చేతినిండా డబ్బు, చెడు స్నేహాలు. వెరసి, మాదక ద్రవ్యాలకు బానిసయ్యాడు. మత్తులో అతివేగంగా వాహనం నడిపి కన్నవారికి కడుపుకోత మిగిల్చాడు. భాగ్యనగరంలో పోలీసులు మాదక ద్రవ్యాల ఆరోపణతో 150 మందిని అదుపులోకి తీసుకు న్నారు. అంతా పరువు కలిగిన వాళ్లే.

ఈ మత్తుపదార్ధాల చరిత్ర చూస్తే, 1807 నాటికి చైనాకి ఇంగ్లండ్‌ ‌తేయాకు బాకీ క్రింద ఒక కోటి పది లక్షల పౌండ్లు కట్టాల్సి రాగా, వ్యూహం ప్రకారం చైనాకు, భారత్‌కు నల్లమందు అలవాటు చేసింది బ్రిటిష్‌ ‌ప్రభుత్వం. భారత్‌లో 1930 ప్రాంతంలోనే బలవంతంగా పదిలక్షల ఎకరాలలో నల్లమందు పంట పండించి, 7000 దుకాణాలలో అమ్మి, ఖజానా నింపుకున్నారు. ఒకదశలో నల్లమందును నిషేధించిన చైనా పైన 1839-60 మధ్య రెండు సార్లు యుద్ధాలు (ఓపియం వార్‌) ‌కూడా చేసింది ఇంగ్లండ్‌. అలా మొదలై పాఠశాల విద్యార్థుల వరకూ వ్యాపించింది. యువత జవసత్వాలను నిర్వీర్యం చేస్తూ, ఉన్మాదులుగా తయారు చేస్తున్న ఈ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాను, వాడకాన్ని నియంత్రిం చడంలో ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహిస్తున్నాయి. మరోపక్క విద్రోహశక్తులు మాదకద్రవ్యాలను విక్రయించి, ఆ సొమ్ముతో భారత వ్యతిరేక కార్యక్ర మాలు చేపడుతున్నారు.

నిరుద్యోగ యువత, మత్తుకి బానిసై, తేలికగా వచ్చే సంపాదనకు అలవాటుపడి దొంగతనాలు, దోపిడీలు, హత్యలు వంటి సంఘ వ్యతిరేక కార్య కలాపాలు చేస్తూ పెద్ద సమస్యగా పరిణమించారు. నరేంద్రమోదీ ప్రభుత్వం మత్తు పదార్థాల నియంత్రణ చట్టాలను సవరిస్తూ, కఠిన నిబంధనలు రూపొంది స్తున్నప్పటికీ అక్రమ సంపాదనకు అలవాటుపడ్డ కొందరి అధికారుల అండదండలతో, సమాజంలోని పేరున్న ప్రముఖులు, వారి సంతానం కేసుల్లో చిక్కుకున్నప్పటికి కూడా, శిక్ష పడకుండా తప్పించుకుంటున్నారు.

మద్యపానం, మాదకద్రవ్యాలను నియంత్రించే బాధ్యత ప్రభుత్వానిదా లేక సమాజానిదా? వెంటనే సమాధానం చెప్పలేం. కానీ తరచి చూస్తే ఇద్దరిదీ కూడా. కాలాన్ని బట్టి అబ్కారీ చట్టాలు మారుతు న్నాయి. మద్యంపై సమాజం తీరును బట్టి ప్రభుత్వ నిర్ణయాలు, రాజకీయ వ్యూహాలూ మారుతుంటాయి.

 సామాజిక ఆమోదం

మారుతున్న జీవనశైలి, పెరుగుతున్న ఆదాయపు వనరులు, ప్రపంచీకరణ, అంతర్జాల ప్రభావం, ఉమ్మడి కుటుంబాలు కనుమరుగు కావడం, ఉద్యోగం, వ్యాపారం, స్వేచ్ఛ, సంపాదనే పరమోద్దే శంగా ఉన్న తల్లితండ్రుల దృష్టి,  నేటి  సినిమాలు చాలామందిని మద్యానికి బానిసలను చేస్తున్నాయి. వీటికి తోడు పండుగల•, పుట్టిన రోజుల•, కార్పోరేట్‌ ‌కంపనీ సమావేశాలు, కులాచారం- ఇవి కూడా ఆ అలవాటుకు చాలామందిని చేరువగా తీసుకు పోతున్నాయి. దుకాణాలు, బార్లు, ఫ్యామిలీ రెస్టా రెంట్లు పెరిగాయి. పైగా మద్యపానానికి సామాజిక ఆమోదం  పెరిగింది. మహిళా సమాజంలోకీ  నెమ్మదిగా విస్తరించింది. భారతీయ సంస్కృతీ, సంప్రదాయాలలో మహిళల భాగస్వామ్యం అతి కీలకమైనది. కానీ కొన్ని అసాంఘిక శక్తుల వలన, ఉదారవాదం మాటున భారతీయతపై దాడి చేస్తున్న విద్రోహుల ప్రోద్భలంతో కొంతమంది మహిళలు భారతీయ కుటుంబ వ్యవస్థక• చేటు చేస్తున్నారు. కొన్ని టీవీ సీరియళ్లు కూడా ఇందుకు దోహదం చేస్తున్నాయి.

ఆల్కోపాప్స్‌ను అంటే పండ్లరసం లా ఉండి 4% ఆల్కహాలు ఉన్న రెడీ టు డ్రింక్‌ ‌ద్వారా పాఠశాల, కళాశాల విద్యార్థులు, యువకులు ఎక్కువ మంది బానిసలవుతున్నారు. కర్షక, కార్మిక వర్గాల• ఖరీదైన మద్యం కొనలేవు. దీనితో కల్తీ సరుకు కొంటారు. ఆరోగ్యకరమైన ఆహారం తినలేరు. ఫలితం తీవ్ర అనారోగ్యం. అదుపు తప్పిన మద్యం వినియోగం వల్ల రాజ్యాంగం ప్రసాదించిన ప్రాథమిక హక్కులకు భంగం వాటిల్లుతోంది. ప్రజల జీవన ప్రమాణాలు దెబ్బతింటున్నాయి. మద్యం వ్యాపారులకు, ప్రభుత్వానికి పెద్దమొత్తంలో సొమ్ము సంపాదించి పెట్టవచ్చును కానీ, సమాజాన్ని నష్టం. ప్రజల ఉత్పాదకతను దెబ్బతీస్తుంది. విలువైన మానవ వనరులను బలహీనపరుస్తుంది.

జాతీయ పరిస్థితులు – గుణపాఠాలు

1888-1920 మధ్య కాలంలో బ్రిటిష్‌ ‌ప్రభుత్వం కల్లు, సారా వ్యాపారంతో పాటు విదేశీ మద్యం అమ్మకాలను తమ నియంత్రణలో ఉంచుకుని, ప్రోత్సహించిన కారణంగా అదే ప్రధాన ఆదాయ వనరుగా మారింది. భారతదేశంలో మద్యాన్ని నిషేధించాలన్న డిమాండ్‌ ‌స్వాతంత్య్ర పోరాట కాలంలోనే మొదలైంది. విదేశీ మద్యం వినియోగాన్ని నాటి నాయకులు ఒక మహమ్మారిగానే భావించారు. భారతీయత మీద, భారతీయ సంస్కృతీ, సంప్రదాయాలపై, ఆచార వ్యహారాలపై దాడిగా అభివర్ణించారు. స్వదేశీ, సహాయ నిరాకరణ, శాసనోల్లంఘన ఉద్యమాల్లో మద్యపాన నిషేధం పిలుపు భాగమైంది. దేశ జనాభాలో ఐదో వంతు మద్యం మత్తులో ఉన్నారని స్వయంగా బాబాసాహెబ్‌ అం‌బేడ్కర్‌ ‌చెప్పారు. 1935లో భారత ప్రభుత్వం అబ్కారి వ్యవహారాలను రాష్ట్రాలకు బదలాయించింది. మద్రాసు, బొంబాయి, యునైటెడ్‌ ‌ప్రావిన్యులలో ప్రయోగాత్మకంగా మద్య నిషేధం విధించాయి.

జనతా ప్రభుత్వ ప్రయత్నం

జాతీయ స్థాయిలో మద్యపాన నిషేధం అమలు చేసేందుకు 1977లో ప్రధాని మొరార్జీ దేశాయ్‌ ‌నాయకత్వంలోని జనతా ప్రభుత్వం ఒక ప్రయత్నం చేసింది.  జనతా పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో మాత్రమే నిషేధం అమలైంది. నిషేధం వల్ల రాష్ట్రాలు నష్టపోయే రాబడిని కేంద్రం భరిస్తుందని కూడా మొరార్జీ హామీ ఇచ్చారు. అవినీతి, దొంగవ్యాపారులు, రాజకీయ నేతల అపవిత్ర కూటమి వల్ల ఆ ప్రతిపాదన కూడా వీగిపోయింది. ఎందుకంటే, చివరకు దొంగ మద్యం ఆయుర్వేదిక్‌ ‌మందుల రూపంలో కూడా మార్కెట్లోకి వచ్చింది.

మద్రాసు రాష్ట్రంలో మద్య నిషేధం బిల్లు తీవ్ర వ్యతిరేకత నడుమ ఆమోదం పొందింది. 1943లో నిషేధం ఎత్తి వేశారు. ఆ తర్వాత లక్షద్వీప్‌, ‌గుజరాత్‌, ‌బిహార్‌, ‌నాగాలాండ్‌, ‌మిజోరాం లాంటి రాష్ట్రాలు సంపూర్ణ మద్యపాన నిషేధం అమలు చేశాయి. కేరళ, తమిళనాడు రాష్ట్రాలు పాక్షిక నిషేధ చట్టాలను తీసుకువచ్చాయి. కొన్ని సందర్భాల్లో చట్టాలను సడలించాయి. హరియాణా, అంధప్రదేశ్‌ ‌రాష్ట్రాలు నిషేధ చట్టాన్ని తీసుకువచ్చి, అమలు చేయలేక ఉపసంహరించుకున్నాయి. గుజరాత్‌లో నిషేధం అమలు అవుతోంది. ఇక బిహార్‌లో 2016 నుండి నిషేధం అమలవుతోంది. అది సత్ఫలితాలను ఇస్తోందని కొన్ని సంస్థలు తెలిపాయి.

ఆంధప్రదేశ్‌లో మద్యం -నిషేధం

ఆంధప్రదేశ్‌లో ఎన్టీఆర్‌ ‌హయాంలో ‘వారుణి వాహిని’ ద్వారా సారా అమ్మకాలను ప్రభుత్వమే చేపట్టింది. వారుణివాహిని విధానానికి ప్రభుత్వ సహకారం ఉండడంతో, గ్రామీణ ప్రాంతాలలో కల్లు, సారాయి విరివిగా అమ్మేవారు. 1992లో మహిళల నాయకత్వంలో వచ్చిన సారా వ్యతిరేక ఉద్యమ ప్రభావం రాజకీయాలపై పడింది. సారాయిని సరఫరా చేసేవారి పైన,  విక్రయించే వారిపైన దృష్టి పెట్టి, మహిళలే స్వయంగా పోరాటం నడిపారు. నడపటం ప్రారంభించారు.1995లో సారాయి నిషేధం వచ్చింది.

చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న ప్పుడు మద్యపాన నిషేధాన్ని కొనసాగించడం కష్టత రంగా భావించారు. మద్యం ద్వారా వస్తున్న ఆదా యంపై ఆధారపడాల్సి వచ్చి, 1997లో నిషేదాన్ని ఎత్తివేశారు. నిషేధం ఎత్తివేయడానికి ప్రభుత్వం చెప్పిన కారణం రూ.960 కోట్ల బడ్జెట్‌ ‌లోటు. అదే చంద్రబాబు నాయుడు, తరవాత 1999, 2014లో ముఖ్యమంత్రి అయినప్పటికినీ, మద్యపాన నిషేధం తీసుకు రాలేకపోయారు. ఆయన ప్రభుత్వ హయాము లోనే బడ్డీ కొట్లు కూడ బెల్టు షాపులుగా మారి విచ్చలవిడిగా మద్యం అందుబాటులోకి వచ్చింది.

ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం – మద్యపాన నిషేధం

నవరత్నాలలో ఇచ్చిన హామీలలో అతి ముఖ్య మైనది సంపూర్ణ మద్య పాన నిషేధం. మద్యం నియంత్రణకు కొన్ని చర్యలు చేపట్టామని వైఎస్‌ ‌జగన్‌ ‌ప్రభుత్వం చెబుతున్నా, వాస్తవం వేరేగా ఉంది. పొరుగు రాష్ట్రాల నుండి మద్యం దొంగ రవాణా అవుతోంది. అధికార పార్టీ నేతలు మద్యంతో ప్రజల ప్రాణాలను హరిస్తూ, కుబేరులు అవుతున్నారని పత్రికలు గగ్గోలు పెడుతున్నాయి. చిత్రం ఏమిటంటే, గడిచిన రెండు సంవత్సరాలుగా కొవిడ్‌ ‌ప్రభావం ఉన్నప్పటికీ ఆంధప్రదేశ్‌కు మద్యం పైవచ్చే ఆదాయం పెరిగిందని సాక్షాత్తు ప్రభుత్వమే లెక్కలు చెప్తోంది. చిరకాలంగా పాలకులు, ప్రభుత్వాలు మద్యాన్ని ఒక ఆదాయ వనరులాగానే చూస్తున్నాయి. ఆదాయానికి ఇతర మార్గాలను అన్వేషించలేక పోయాయి. సంక్షేమ పథకాల పేరుతో ఓటు బ్యాంక్‌ ‌రాజకీయాల ద్వారా లబ్ధి పొందుతున్న ప్రాంతీయ పార్టీలు ప్రజల ప్రాణాలతో చెలగాటం మాత్రమే కాదు, రాష్ట్రాల మానవ వనరులను, ప్రభుత్వ ఆస్తులను కూడా నష్టపరుస్తున్నారు.

సామజికపరివర్తన-ఉద్యమ సమయం

చిత్తశుద్ధి ఉన్న ప్రభుత్వాలు ముందు ప్రజలు మద్యపానాన్ని,మత్తుపదార్థాలను తమంతట తాము తగ్గించుకొనే దిశలో కృషి చేయాలి. అలాగే నిషేదం కేవలం ప్రభుత్వ బాధ్యత కాదు. సామాజిక పరివర్తనకు చెందిన అంశం. సమాజంలో ఇంతగా ఆమోదం పొందిన మద్యాన్ని/మత్తు పదార్ధాలని నిషేదించాలంటే నిజాయితీగా, చిత్తశుద్దితో, ఇతర ఆదాయ మార్గాలను అన్వేషించి, అభివృద్దితో సంక్షేమాన్ని అందించినప్పుడు మాత్రమే సాధ్యం. ప్రస్తుత ఏపీ ప్రభుత్వం 2019 అక్టోబర్లో మద్య విమోచన ప్రచార కమిటీలను వేసి, రెండేళ్లలో రూ. 3.5 కోట్ల నిధులను వెచ్చించింది. కానీ ఆ కమిటీ సమాజంలో పెద్దగా మార్పు తెచ్చినట్టు కనిపించడం లేదు. అయినా ఆ కమిటీ చైర్మన్‌ ‌పదవీ కాలాన్ని  పొడిగించారు. డీ అడిక్షన్‌ ‌సెంటర్లను నెలకొల్పి, వాటి ద్వారా ప్రజలలో పెద్ద ఎత్తున అవగాహన కల్పించాలి. సమాజాన్ని మేల్కొల్పే చర్యలు చేపట్టాలి. ప్రస్తుత సమాజంలో కొంతమంది భారతీయ మూలాలను, విలువలను, ఆదర్శాలను, సంస్కృతీ సంప్రదాయా లను, ఆచార వ్యవహారాలను మర్చిపోయారు. దీనితో మద్యం అలవాటు పెరుగుతున్నది.

ఏ దేశానికైనా యువతే బలం. ఏ దేశంలో అయితే యువత ఉన్నత ఆశయాలు, ఆలోచనలు కలిగి అవి కేవలం వారి ఉన్నతికి మాత్రమే పరిమితం కాకుండా సమాజం, దేశ పురోభివృద్దికి ఉపయోగ పడేలా ఉంటాయో ఆ దేశ భవిష్యత్తు గొప్పగా ఉంటుంది. భారత యువత కూడా అటువంటి ఉన్నత లక్ష్యాలను, ఆకాంక్షలను ఏర్పాటు చేసుకుని, ఉజ్వలమైన భవిష్యత్తుకు పునాది వేసుకుంటూ సమాజం కోసం పనిచేస్తారో అప్పుడు మాత్రమే ఈ భరతమాత కోసం, భారతీయుల కోసం, మనందరి కోసం మహనీయులు చేసిన బలిదానాలకు సార్థకత లబిస్తుంది. సమాజానికి పట్టిన మత్తుని వదిలించ డానికి మరో పోరాటం మొదలవ్వాలి. ప్రజలు చైతన్యవంతంగా ఆలోచించి, చిత్తశుద్దితో పనిచేసే ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలి. ప్రజల ఆలోచన, ప్రభుత్వ భాగస్వామ్యంతో సామజిక పరివర్తన ద్వారా మాత్రమే మత్తుపదార్ధాల వినియోగం, మద్యపాన నిషేధం సాధ్యం అవుతుంది. మరి మన ఆంధ్ర రాష్ట్రంలో ఏ మేరకు ఈ ప్రయత్నాలు సఫలం అవుతాయో వేచి చూడాల్సిందే.

 – సాదినేని యామినీశర్మ

About Author

By editor

Twitter
Instagram