– బి.నర్సన్‌

‌వాకాటి పాండురంగరావు స్మారక దీపావళి కథల పోటీకి ఎంపికైనది

శాంతి భర్త చనిపోయాడు.

పిడుగులాంటి వార్త, సురేష్‌ ‌ఫోన్లో చెప్పింది విన్నాక ఆఫీసులో పనేం చేయలేకపోయాడు శేఖర్‌. ‌ముసురుకున్న విషాదపు చీకట్లలోంచి దారి వెతుక్కుంటూ ఇంటికి చేరు కున్నాడు. ఇంట్లో ఈ బాధను ఎవరితోనూ పంచు కోలేడు. పిల్లలు స్కూల్‌ ‌నుంచి వచ్చి హోమ్‌ ‌వర్క్ ‌మీద పడ్డారు. టీ ఇచ్చిన భార్య విమల తీరిగ్గా టీవీ ముందు కూచుంది. మనసంతా గందరగోళంగా ఉంది. ఇంట్లో ఉండలేక బాల్కనీలోకి వచ్చి కిందికి చూస్తున్నాడు. వాహనాల రణగొణ శబ్దాలు కలతను మరింత పెంచుతున్నాయి. లోనకెళ్లి డ్రెస్‌ ‌వేసుకొని బయటపడుతుండగా విమల చూసింది. ఎప్పుడూ చెప్పకుండా వెళ్లని మనిషికిప్పుడేమైంది అనుకుంటూ ‘ఎక్కడికండీ?’ అంది.

‘ఇప్పుడే వస్తాను’ అని పొడి పొడి మాటలంటూ గడప దాటాడు.

ఇంటికి కొద్ది దూరంలో ఉన్న మునిసిపల్‌ ‌పార్కులో కూచొని ‘ఎంత ఘోరం జరిగిపోయిందీ..’ అనుకుంటూ తల పట్టుకున్నాడు. శేఖర్‌ అక్కయ్య పేరు మాలతి. ఆమె భర్త అన్న కూతురే శాంతి. వరుసకు కూతురే అయినా శాంతికి మాలతి దగ్గర అంతకన్నా ఎక్కువ చనువు. తల్లి ఎంత చేసినా శేఖర్‌కు అక్కయ్య, బావలే అసలు బలం. తండ్రి నీడలేని శేఖర్‌ను మాలతి భర్త సొంత తమ్ముడిలా చేరదీసి చదివించాడు. శేఖర్‌ను చదువుకొనే రోజుల్లో వాళ్లు అన్ని విధాలా ఆదుకోకపోతే తను ఇలా ఉద్యోగంలో ఉండడం సాధ్యపడేది కాదు. ఇంత అనుబంధమున్నా శాంతి భర్త చనిపోయాడని మాలతి శేఖర్‌కు చెప్పలేదు. చనిపోయి అప్పటికే నాలుగు రోజులైందన్నాడు సురేష్‌. ‌జేబులోంచి ఫోన్‌ ‌తీసి మాలతి నెంబరుకు కలిపాడు. రింగవుతున్నా అటువైపు ఫోను ఎత్తలేదు. రెండో ప్రయత్నం ఫలించింది.

‘అక్కయ్యా..శాంతి భర్త చనిపోయాడా..’

‘ఊ…’

‘నాల్రోజులయిందట.. నాకొక్కమాట చెప్ప లేదు..’

‘ఏం చెప్పాలిరా.. నీవే దాని బతుకు నాశనం చేశావని శవం ముందే నిన్ను శాపనార్థాలు పెడుతూ శోకం పెట్టిందది. నీ వల్ల నలుగురిలో మా పరువు పోయింది..’ అని, మరింత నిష్ఠురంగా మాట్లాడు తూనే ఫోను మధ్యలోనే కట్‌ ‌చేసింది.

మళ్లీ ఫోను కలపడానికి శేఖర్‌కు మనసొప్పలేదు.

అంతా తనవల్లే అన్న మాటలు ఆయన్ని దహించి వేస్తున్నాయి. గట్టిగా అరవడమో, ఏడవడమో చేస్తేగాని ఆ మంట చల్లారదు. అరిచేందుకు, ఏడ్చేం దుకు ఆయనకు తగిన స్థావరమే లేదు. విమలకు చెబితే  దీనికింత బాధపడడమేమిటని అనుకుం టుంది. ఇక్కడ కూచొని అంత బాధ పడేకన్నా ఓసారి వెళ్లి కలిసి రావచ్చు కదా అని సలహా ఇవ్వొచ్చు. ఆమెకు ఈ విషయం తెలియద్దు అనుకుంటూ చీకటి పడే దాక తడుస్తున్న కళ్లను తుడుచుకుంటూ అక్కడే కూచున్నాడు.

శాంతి తనను కోరుకుంది నిజమే కాని ఆనాడు శేఖర్‌కు జీవితంపై ఉన్న భయంతో అడుగు ముందుకు పడలేదు. అలా ఆమెతో కలిసి ఏడడు గులు వేయలేకపోయాడు. తనకు శాంతి అంటే ఇష్టమో కాదో అనే ప్రశ్నకు అవకాశమే లేని రోజుల్లో ఆమె మాత్రం ఇంటర్‌ ‌చదివే నాటి నుండే ‘నేను శేఖర్‌ ‌మామయ్యనే పెళ్లి చేసుకుంటాను’ అని సిగ్గులొలకబోస్తూ తుర్రుమనేది. ఏదో తుంటరి పిల్ల అనుకునేవాళ్లు. శేఖర్‌ అక్క మాలతితో ఆమెకున్న అనుబంధంతో మా పెళ్లి అయితీరుతుంది అన్న భరోసా కూడా ఆ మాట వెనుక ఉండొచ్చు.

చిన్నప్పుడే తండ్రి చనిపోయినా తల్లి ఎంతో కష్ట పడి శేఖర్‌ను చదివించింది. డిగ్రీ చివరి సంవత్స రంలో ఉన్న ఆయన చదువు ఎప్పుడైపోతుందా.. ఉద్యోగం సంపాదించి తల్లికి విశ్రాంతిని ఎప్పుడిస్తానా అని ఆరాటపడుతున్నాడు. తెలిసిన వారి సలహా తీసుకుంటూ కనబడ్డ ఉద్యోగానికల్లా తనవంతు ప్రయత్నం చేస్తున్నాడు. అప్పుడే ఇంకా రూపం దాల్చని ఆశల వెంట శేఖర్‌ ‌పరుగుతీస్తున్న కీలక సమయంలో అక్కా బావలు తెచ్చిన పెళ్లి ప్రస్తావన తన ముందు పెద్ద పర్వతం అడ్డు నిలిచినట్ల నిపించింది.

ఓ రోజు శేఖర్‌ అక్క, బావ ఇద్దరు ఇంటి కొచ్చారు. మామూలుగానైతే మాలతి ఒంటరిగానే వస్తుంది.

భోజనాలయ్యాక తల్లీ కొడుకులను ఉద్దేశించి  ‘శాంతి పెళ్లి చేద్దామంటున్నాడు మా అన్నయ్య..’ అన్నాడు మాలతి భర్త.

శేఖర్‌ ‌తల్లి ముఖం చూశాడు. ఏమీ తెలియ దన్నట్లు ఆమె ముఖం పెట్టింది.

నువ్వంటే నువ్వు మాట్లాడమని ఇద్దరి మధ్య చూపుల తోపులాట.

ఆ ఒత్తిడి తట్టుకోలేక ‘చేయండి..’ అన్నాడు శేఖర్‌.

ఆ ‌మాటకు తలెత్తి శేఖర్‌ ‌వైపు చూస్తూ ‘శాంతి చిన్నప్పటినుంచి నిన్నే తన మొగుడిగా  అనుకుంటోంది. అది నీకు, నాకు అందరికి తెలిసిందే.. మీకు చెప్పి పెళ్లి పనులు మొదలు పెట్టుకుందామని..’ అని ఆగాడాయన ఇదీ వచ్చిన కార్యమన్నట్లు.

శేఖర్‌ ‌గొంతు తడారిపోయింది.

మెల్లగా ఒక్కొక్క అక్షరం బయటపెడుతున్నట్లు ‘నాకిప్పుడు పెళ్లి చేసుకోవాలని లేదు.. చదువయిపోయింది.. ముందు బతకడానికి ఓ ఉద్యోగం సంపాదించుకోవాలి’ అన్నాడు.

శేఖర్‌ ‌తన మాట కాదంటాడా.. ఇలా వెళ్లి ఖాయం చేసుకొని అలా వచ్చేయడమే అనుకున్న వాళ్లకు ఈ మాట మింగుడుపడలేదు.

‘అట్లా గాలిమాట మాట్లాడితే ఎట్లా.. శాంతి తర్వాత అన్నయ్యకు ఇంకో ఇద్దరమ్మాయిలున్నారు.. ఆయన తొందరపడుతున్నాడు..శాంతి భారం నీదేరా’ అంటూ మాట బిగించాడు ఇంటల్లుడు.

శాంతి, శేఖర్ల పెళ్లి వల్ల దగ్గరి అమ్మాయి తన పుట్టినింటికి వస్తుంది. మెట్టినింట్లో తన గౌరవం పెరుగుతుంది.. ఇది మాలతి ఆశ.

కొడుకు మాటల్లో వాస్తవముంది గాని కూతురు, అల్లుడి మనసుల్ని బాధపెట్టడం ఇష్టం లేదు ఆ  తల్లికి. అన్ని తెలిసిన శేఖర్‌ ‌మాట్లాడుతుంటే తానెలా కల్పించుకోవాలో తెలియడం లేదావిడకు.

ఇంత మౌనభారం మోయలేన న్నట్లు గాలి ఉక్కిరిబిక్కిరి అవుతోంది.

తానే మాట్లాడాలి అనుకున్న శేఖర్‌ ‌నోరు విప్పి ‘ఎంత కాలమైనా ఉద్యోగం వచ్చాకే పెళ్లి చేసుకోవాలని ఏనాడో అనుకున్నాను. అమ్మనే పోషించలేని స్థితిలో ఉన్న నేను మరో మనిషితో అమ్మకెలా మరింత భారం కావాలి.’ అని కొంత కచ్చి తంగా..కొంత ప్రాధేయపూర్వకంగా అన్నాడు.

‘పెళ్లి చేసుకొని నీ ప్రయత్నం నువ్వు చేసుకో.. నీ మీద ఏ ఖర్చు పడకుండా మేం చూసుకుంటాం’ అంది మాలతి, భర్త వైపు తన మాట ఎలా వుంది అన్నట్లు చూస్తూ.

అక్క మాట అన్నంత తేలికగా వ్యవహారముండదు. ఎన్ని సార్లని, ఎంత కాలమని వారి ముందు చేయి చాచాలి.. భార్య ముందు తనకేమైనా పరువు ఉంటుందా.. వారి హామీ వంద అబద్ధాల్లో ఒకటి కాకూడదనే గ్యారెంటీ ఏమిటి.. ఇలా సాగుతోంది శేఖర్‌ ఆలోచన.

ఎంత ఎదురుచూసినా శేఖర్‌ ‌నుండి ఎలాంటి బదులు రాలేదు.

విసిగిపోయిన మాలతి తల్లి వైపు తిరిగి ‘వాడి మాటనే

నీ మాటనా.. మాట్లాడవేంది..’ అంది విసుగ్గా.

కూతురు, అల్లుడిని బాధ పెట్టాలని లేదావిడకు.

‘మన పిల్లనే కదరా.. నాతో పాటు ఉంటుంది.. నీకు ఉద్యోగం వచ్చేదాకా రూపాయి కూడా అడగను’ అంది కొడుకుతో ఒప్పుకోరా అన్నట్లు.

తల్లిపై పడే భారం శేఖర్‌కు తెలుసు. బంధుత్వం చెడుతుందని భయంతో అంటుంది కాని.. మూడో మనిషికి ఇంట్లో చోటే లేదిప్పుడు. కొద్దిగా సడలినా జీవితం చేతికందకుండా పోతుంది.. ఇదీ శేఖర్‌ ‌మనసు చెబుతున్న మాట.

‘ఉద్యోగం రానీయమ్మా.. శాంతినే చేసుకుం టాను’ అన్నాడు తల్లితో, అందరికి అదే మాట అన్నట్లు.

‘ఏడాదో, రెండేళ్లో కచ్చితమైన టైం చెబితే మాటకర్థం ఉంటుంది కాని ఇదేం తిక్క సమా ధానంరా..’ అంది మాలతి. కాస్త అధికారంగా, కాస్త బేలగా ఉంది ఆమె మాట.

పొట్టి లాగులతో చుట్టూ తిరిగిన పిల్లాడు తన మాటని ఖాతరు చేయకపోవడం తల తీసేసినట్లుంది మాలతి భర్తకు. ఇంకొక్క క్షణం కూడా వారి ముందు ఉండబుద్ధి కాలేదాయనకు.

‘ఈయన్ని నమ్ముకుంటే నడిగంగలో ముంచాడు. మీ తమ్ముడు కాదంటే పెళ్లి జరగదా.. ఇంకా సంబంధాలే లేవా..’ అంటూ సరసర ఇంట్లోంచి బయటికి నడిచాడు. గబగబ వెనకాలే వెళ్లింది మాలతి.

శేఖర్‌ ‌మాటలకు నొచ్చుకోవడమే కాకుండా పెళ్లి చేసి చూపిస్తాం అన్నట్లు నెల రోజుల్లోనే శాంతి పెళ్లి జరిపించారు. శేఖర్‌ ఇం‌టికి పోస్టులో పెళ్లి పత్రిక వచ్చినా మొహం చెల్లక పోలేకపోయారు. తన నిర్ణయం శాంతిని ఎంత క్షోభ పెట్టిందో అని అను కున్నప్పుడల్లా శేఖర్‌ ‌మనసు బరువెక్కేది. జీవితంలో తనను క్షమించదని బాధ కలిగేది.

రెండేళ్ల విశ్వ ప్రయత్నం తర్వాత  శేఖర్‌కు ఓ ఆఫీసు అసిస్టెంట్‌ ఉద్యోగం చేతికొచ్చింది. పెళ్లి సంబంధాలు రావడంతో ఒకదాన్ని ఖాయం చేసుకు న్నారు. తల్లితో కలిసి శేఖర్‌.. అక్కబావల దగ్గరికెళ్లి వారి కాళ్లకు దండం పెట్టి మొదటి ఆహ్వాన పత్రిక చేతిలో పెట్టాడు. అన్నీ మరిచిపోయి వాళ్లు ఇంటి పెద్దలుగా దగ్గరుండి పెళ్లి జరిపించారు.

అప్పుడప్పుడు బంధువుల ఫంక్షన్లలో శాంతి శేఖర్‌ ‌కంట పడేది, కాని ఆయన వైపు చూసేది కాదు. వెంట ఓ పిల్లాడు ఉండేవాడు కాని భర్త కనబడేవాడు కాదు. కాంట్రాక్టర్‌ ‌దగ్గర లెక్కలు చూసుకుంటాడట. తీరిక దొరకదని తెలిసింది. చివరకు ఆయన శేఖర్‌ ‌కంటపడకుండానే కన్ను మూశాడు.

చనిపోయిన వార్త తెలిసి రెండు రోజులయింది. ఊర్లో ఉన్న తల్లికి ఫోన్‌ ‌చేసి చెబితే అంతా మరిచి పోయినట్లు ‘ఎవరి కర్మకు ఎవరు బాధ్యులు’ అంటూ తేలిగ్గా మాట్లాడింది. శేఖర్‌కు మాత్రం జరగాల్సింది జరిగిపోయింది అనుకునేలా మనసు స్థిమితపడడం లేదు. విషాదవార్త చెప్పిన సురేష్‌కు ఫోన్‌ ‌కలిపాడు.

‘చెప్పరా..’ అన్నాడాయన మాములు ధోరణిలో.

వెంటనే చెప్పలేక కొద్దిసేపాగి ‘నాకు శాంతిని కలవాలనుంది’ అన్నాడు. ‘అసలు ఈ పరిస్థితిలో ఆమె నీ ముఖం చూస్తుందా..’

‘ఏదో నువ్వే ఓ దారి చూడరా..’

‘సరే.. సాయంత్రం ఫోన్‌ ‌చేస్తా..’ అని ఫోన్‌ ‌పెట్టేశాడు సురేష్‌.

ఇం‌ట్లో టీపాయ్‌ ‌మీదున్న ఫోన్‌ ‌రింగయ్యింది. తాగుతున్న టీ కప్పు పక్కన పెట్టి ఫోన్‌ ‌తీసుకోని గబగబా బాల్కనీలోకి వెళ్లాడు.

‘ఆయనగారి ఓదార్పు తనకక్కర లేదందిరా..’ అని ఒకే వాక్యం చెప్పాడు సురేష్‌.

‌లోపలికొచ్చి సోఫాలో వెనక్కి ఒరిగి కళ్లు మూసు కున్నాడు.

ఇంట్లో ఒకరి శీతోష్ణస్థితులు ఇంకొకరికి తెలియకుండా దాయడం కష్టం. అది భార్యాభర్తల మధ్యనయితే అసాధ్యమే. భర్త వింత వాలకం విమల గమనిస్తూనే ఉంది. ఎక్కడికండీ అన్నప్పుడు ఇప్పుడే వస్తా అని విషయం చెప్పకుండా బయటికి వెళ్లినప్పుడే ఏదో జరగరానిది జరిగిందని ఆమె గ్రహించింది. ఫోను మాట్లాడాక సగంలో వదలిన టీ కప్పును మరచి సోఫాలో వాలిపోవడం ఆమెను ఆందోళనకు గురి చేస్తోంది. ఆఫీసులో ఏమైనా తప్పు జరిగిందేమో అనే వైపు పోయిందామె మనసు. ‘రెండ్రోజులుగా గాబరా గాబరాగా ఉంటున్నారు.. ఏం జరిగింది..’ అని అడిగింది బెడ్‌ ‌రూములో.

ఏం లేదన్నట్లు తల ఊపాడు.

‘లేదు..ఏదో జరిగింది..ఆఫీసులో ఏమైనా..’

‘ఛీ..అలాంటిదేమి లేదు..’ అని ఆమె మాటను ఆపేశాడు.

మధ్యలో విమల ఏదేదో ఊహించుకోవడంతో కొత్త సమస్యలు తెచ్చుకున్నట్లు అనిపించింది ఆయనకు.

అబద్ధాలు చెప్పేకన్నా నిజం చెప్పడమే మేలు అనుకొని శాంతి వృత్తాంతమంతా విమలకు చెప్పే శాడు.

ఇప్పుడు సమస్యలో విమల మూడో కేంద్రమైంది. తానూ ఆలోచనలో పడింది. శాంతి విషయంలో ఆయన బాధపడడంలో తప్పేమీ కనబడలేదు. అయితే అది పెరిగి పెద్దదై తన కుటుంబంపై ప్రభావం పడవచ్చనే బెంగ ఆమెలో మొదలైంది. కాలం తనను శాంతి స్థానంలో కూచోబెట్టిందని, ఆమె కష్టాలను చూస్తూ కూచోవద్దని విమలకు అనిపించింది.

శాంతిని ఊరడించాలని కోరుకుంటున్న భర్త తొందరపడి ఏం చేసినా నలుగురిలో తప్పే అవు తుంది. అటు ఆమెను మరింత ఇబ్బందుల్లోకి తోసిన వారమవుతాము. తమ ముగ్గురి అవసరమొక్కటే శాంతి జీవితం శాంతంగా సాగాలనే. దీనికి తానే ఓ దారి వెతకాలని ఆలోచిస్తున్న విమలకు తన మామయ్య సుకుమార్‌ ‌గుర్తుకొచ్చాడు. నిజానికి విమల భర్తగా ఆయన్నే కోరుకుంది. అయితే ఆయన ఓ బీమా కంపెనీలో పనిచేస్తూ సంఘాలు, సమ్మెలు అంటూ అరెస్టులు, కేసుల మధ్య బతికేవాడు. సజావుగా ఉద్యోగం చేసుకుంటేనే మా అమ్మాయి నిస్తామని విమల తండ్రి కరాఖండీగా చెప్పాడు. ససేమిరా వాటిని వీడనంటూ సుకుమార్‌ ‌కూడా అదే స్థాయిలో బదులిచ్చాడు. అలా విమల శేఖర్‌ ఇం‌టిదయింది.

పెళ్లీడు దాటిన సుకుమార్‌ ఈ ‌మధ్య  ‘ఎవరినైనా చూడవే.. విడో అయినా ఫర్వాలేదు… చేసుకుంటాను’ అంటూ విమలను అడుగుతున్నాడు. కాలం చల్ల బడ్డాక ఒక్కో అడుగు వేయచ్చు అనుకుంది.

టిఫిన్‌ ‌వడ్డిస్తూ భర్తతో ‘ఎల్లుండి ఆదివారం.. శాంతి దగ్గరికి వెళ్దామా..’ అంది.

‘నా ఓదార్పు వద్దని అంత కచ్చితంగా చెప్పాక..’ ఎలా వెళ్లేది అన్నట్లు ముఖం పెట్టాడు.

‘రెండు చేతులతో కాదండీ.. నాలుగు చేతులతో ఓదార్చుదాం.. సరిపోకుంటే ఇంకో రెండు చేతులు జోడిద్దాం’ అంది. ‘థాంక్యూ సో మచ్‌.. ‌విమలా..’ అంటూ తింటున్న చేతులతో ఆమె చేతులనం దుకున్నాడు.

About Author

By editor

Twitter
Instagram