– డా।। గోపరాజు నారాయణరావు

దేశం చేతులు మారడమా! అర్థం కాలేదు కొండవాళ్లకి. చుట్టుపక్కల గ్రామాల వాళ్లు వెళ్లి చూశారు. వర్షాలు ముమ్మరంగా కురుస్తున్న సమయం. అడవంతా పచ్చగా ఉంది. ఉరుము లేని పిడుగుల్లా రెండు కంపెనీల సిపాయీలు వచ్చి శిబిరాలు వేసుకుని కూర్చున్నారు, ఇందుకూరిపేట, కొత్తపల్లి గ్రామాల సరిహద్దులలో. మబ్బుతో తొందరగా చీకటి పడినట్టుంది. చిన్నగా చినుకులు పడుతున్నాయి. అయినా ఆ దండ్లు ఆ సాయంత్రం కొండ అంచుల మీద కవాతు చేశాయి. ఇక ఈ నేల తమ కాళ్ల కింద ఉందని చెబుతున్న సంగతి ఆ బూట్ల సవ్వడిలో లీలగా వినిపిస్తోంది. అందరి ఒంటి మీద ఒకే రకం బట్టలు. ప్రతి సిపాయీ దగ్గర ఒక ఆయుధం. భుజానికి తుపాకీ లేదా మొలకి కత్తి. కాళ్లకి నల్లటి తోలు తొడుగులు. నెత్తి మీద ఎర్ర రంగు గట్టి కుళ్లాయి. మన్యం అలాంటి దృశ్యం చూడడం అదే మొదటిసారి. గ్రామాలలో ఏదో తెలియని అలజడి. రంపదేశం అప్పటికి పోలీస్‌ ‌స్టేషన్‌ అం‌టే ఎరుగదు. అడవికి ఆంక్షలంటే తెలియని కాలం. చట్టమంటే ఏమిటో వినని కాలం. అందుకే కొత్తపల్లి, ఇందుకూరి పేట అనే రెండు మారు గ్రామాల ప్రజలు జరిగిన పరిణామాలను చూసి చేష్టలుడిగిపోయారు.

ఆ బలగాలు లెఫ్టినెంట్‌ ‌మెక్లియోడ్‌ ‌నాయ కత్వంలో పనిచేస్తున్నాయి. రంప ప్రజల మాటల్లో అతడే దండ్ల పెద్ద దొర. వారం, పదిరోజులు గడిచాయి. కవాతులే కాదు, సిపాయీలు పెడుతున్న ఆంక్షలు కూడా నచ్చలేదు అడవిబిడ్డలకి. వేటాడితే వాటా వీళ్లు ఇవ్వడం కాదు, సిపాయీలు ఇచ్చింది తీసుకోవాలి. ఇస్తే తీసుకోవాలి. ఆవులు కొండవాళ్లవి. పాలు మాత్రం దండుకి. గొర్రెలు పెంచేది వీళ్లు. కోసుకు తినేది వాళ్లు. ఆఖరికి ఆడవాళ్ల మీద కన్నేయడం మొదలయింది.

అక్కడే పుట్టాడు పండు దొర. అతడే మందు కొచ్చాడు. తప్పిపోయిన కూన కోసం అడవంతా గాలించే తల్లి జంతువులా తిరిగాడు, గ్రామాలన్నీ. ఆ రోజు – తెలతెలవారుతోంది. ఆ రెండు గ్రామాల వాళ్లతో పాటు చుట్టుపక్కల కొండ ప్రజలని కూడగట్టి తీసుకువచ్చాడు పండు దొర. అందరి చేతుల్లోను విల్లంబులు ఉన్నాయి. ఇందుకూరిపేట సిపాయీల శిబిరాన్ని చుట్టుముట్టారంతా. దళసరి గుడ్డ శిబిరా లలో సిపాయీలు నిద్రపోతున్నారు. ఇద్దరు మాత్రం శిబిరం ముందు చిన్న మంట వేసుకుని, తాటాకు గొడుగుల కింద కూర్చుని ఏదో మాట్లాడుకుంటు న్నారు. రాత్రికి కాపలా. ఒక్కసారిగా బాణాలు వదిలిపెట్టారు. కాపలా ఉన్నవాళ్లు కూడా లోపలికి పారిపోయారు. అరగంట పాటు జరిగింది శర సంధానం.. ఆపై కొద్దిసేపు అంతా నిశ్శబ్దం. విజయ గర్వంతో వెనుదిరిగింది పండు దొర బలగం. ఆ దెబ్బకి దండు బెదిరిపోతుందని అనుకున్నాడు పండు దొర. అతడి అంచనాకి విరుద్ధంగా ఆ సాయంత్రం వర్షంలో కూడా బట్టలు తడిసిపోకుండా వాటిపైన ఇంకో దళసరి వస్త్రం కట్టుకొచ్చి మరీ కవాతు చేశాయి దండ్లు.

ఆ రోజు కవాతు ఇందుకూరిపేటలో ఆగి పోయింది. మగవాళ్లని గ్రామం మధ్యకి తీసుకు రమ్మని ఆజ్ఞాపించాడు మెక్లియోడ్‌, ‌దండులో పెద్ద దొర. రాత్రి శిబిరం మీద బాణాలు వేసిందెవరని అడిగించాడు బారిక చేత. ఎవరూ నోరు విప్పలేదు. మీద పడి పిడిగుద్దులు గుద్దారు, సైనికులు. తట్టు కోలేకపోయారు వనవాసులు. హాహాకారాలు చేశారు.

ఎవరికి వినిపిస్తాయి?

మూడు నాలుగు గంటలు హింసించి వెళ్లి పోయారు.

పండుదొర గుండె రగిలిపోయింది.

దండ్లు ఊళ్లలోకి రావాలంటే పురుషోత్తమపట్నం అనే చిన్న ఊళ్లోనే ఒక రేవు ఉంది. అది దాటాలి. అందుకోసం పదిహేను పడవలు కూడా పెట్టు కున్నారు. రెండువారాల తరువాత మళ్లీ పండుదొర తన అనుచరులతో వచ్చాడు. రెండుమూడు వందల మంది ఉన్నారు. దండ్లు విడిది చేసిన శిబిరాలు అక్కడికి కొంచెం దూరమే.

చిమ్మచీకటి. గాలి వీస్తోంది. నలుగురి చేతుల్లో కాగడాలు వెలుగుతున్నాయి. అందరి తలల మీద ఎండు కట్టెల మోపులు. శబ్దం చేయకుండా రేవులోకి వచ్చారంతా. మొన్నటిదాకా ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకి నది నిండుగా పారుతోంది. ఆ చీకట్లో చేపల పొలుసులతో ఆకుపచ్చ నక్షత్ర కాంతిలా నది గట్టు మసకమసకగా మెరుస్తోంది. గట్టు మీద కొంచెం దూరం దూరంగా రెండడుగుల ఎత్తు బలమైన గుంజలు. వాటికి తాళ్లతో కట్టేసి ఉన్నాయి పడవలు. తడితడిగా ఉన్న నాటు పడవలు కెరటాలకి చిన్నగా కదులుతున్నాయి. వాటిని నెమ్మదిగా గట్టు మీదకి లాగారు. తెచ్చిన కట్టెలన్నీ ప్రతి పడవలోను సర్దించాడు పండు దొర, నిశ్శబ్దంగా. ఇంకో నలు గురు, వెంట తెచ్చిన మూటలలో నుంచి బూరుగు దూది తీసి ఆ కట్టెల మీద వేశారు, దట్టంగా. తరువాత కాగడాలు చేతబట్టిన వాళ్లు వచ్చి నిప్పు పెట్టారు. వెంటనే అక్కడ నుంచి మాయమయ్యా రంతా. ఒక అరగంట తరువాత గట్టంతా మంటలు, చితులు కాలుతున్నట్టు. వాటి నీడ నదిలో ప్రతి బింబిస్తోంది. చెట్లు, గుబుర్ల చాటునుంచి ఆనందంగా చూస్తున్న అడవిబిడ్డలకి హఠాత్తుగా అలజడి విని పించింది. సిపాయీలంతా బాల్చీలు పట్టుకుని పరుగు పరుగున వస్తున్నారు. అడవిబిడ్డలు అక్కడ నుంచి కూడా మాయమైపోయారు.

దండు నాలుగు రోజులు గ్రామాల దగ్గరకి రాలేక పోయింది. కానీ తరువాతే మొదలయింది వేట. ఎవరి మీద అనుమానం వచ్చినా పట్టుకుని తీసుకు పోతున్నారు. సామాను మోయిస్తున్నారు. బట్టలు ఉతికిస్తున్నారు. ఒళ్లంతా గాయాలతో కొందరు జీవచ్చవాల్లా తిరిగి వస్తున్నారు. కొందరు అసలు మళ్లీ ఇంటి మొహం చూడలేదు.

కొండ ప్రజలు పట్టు వదల్లేదు. దండుని అక్కడ నుంచి తరిమేయాలని అనుకున్నారు. మొదట వృద్ధులు తప్ప మిగిలిన వాళ్లంతా గ్రామాల నుంచి మాయమైపోయారు.

కవాతు చేస్తుంటే చాటు నుంచి బాణాల వర్షం కురిసేది. విల్లంబులతో పోరాడుతున్న కొండ ప్రజలని పెద్దగా శ్రమ పడకుండానే మెక్లియోడ్‌ ‌బలగం దారుణంగా అణచివేసింది.

దండంటే భయం మొదలైంది అప్పుడే..

వెతికి వెతికి పట్టుకుని చావగొట్టేశారు. కొందరిని రాజమండ్రి జైలుకి పంపారు. కకావికలైపోయారు, అడవిబిడ్డలు. ఆ దారుణ హింసకి కొండలు మౌనం దాల్చాయి. అడవి ఏడ్చి ఏడ్చి సొమ్మసిల్లిపోయింది… దాదాపు పదిహేనేళ్లు… ఒళ్లంతా నలగగొట్టినట్టు ఉన్నా, గాథని తలుచుకున్నాక మనసు మాత్రం మువ్వలా ఉంది లింగాలుకి. మనసులోనే అను కున్నాడు, ‘ఈసారి ఏ కత చెబుతాడో రామన్న!?’

‘‘ఏంటే, కాలు కదలడం లేదు? లేచొచ్చానంటే తట్లు తేలిపోతాయి!’’ అని గట్టిగా అరిచాడు కిష్టయ్య. బాస్టియన్‌ ‌లేకపోతే, కిష్టయ్యే ఆ పాత్ర సంపూర్ణంగా, సమర్థంగా పోషిస్తూ ఉంటాడు. అర ఫర్లాంగు దూరంలో పోసిన ఆ పెద్ద ఎర్ర కంకర గుట్ట నుంచి కొంత కొంత తట్టలలో వేసుకుని, తలల మీద పెట్టు కుని పని జరిగే చోటికి తీసుకు వస్తున్నారు ఆడ కూలీలు. ఇరవైమంది వరకు ఉంటారు. అక్కడ గుట్టగా పోస్తున్నారు. ఆ మర్రిచెట్టు కూడా కొట్టే య్యాలని ఓవర్సియర్‌ ‌చెబితే వెంటనే సరే అన్నాడు బాస్టియన్‌. ‌చెట్టెక్కి గొడ్డళ్లతో కొమ్మలు నరికే పనిలో ఉన్నారు, చాలా మంది మగవాళ్లు. ఇద్దరు మనుషులు ఎదురెదురుగా నిలబడి రెండు చేతులు బారజాచి పట్టుకున్నా అందనంత కాండం. ఆ కాండానికి చుట్టూ ఒక గీత గీసినట్టు గొడ్డళ్లతో చుట్టూ నరుకు తున్నారు నాలుగు వైపుల నుంచి నలుగురు. అంతా భయం భయంగా ఉంది. చెట్టు మీదకెళ్లి కొడుతున్న కొమ్మలు ఎక్కడ పడతాయో తెలియడం లేదు. కొన్ని కొమ్మలు మాత్రం పెద్ద శబ్దంతో లోయలోకి పడు తున్నాయి. సాయంత్రానికల్లా అక్కడ చెట్టు కనిపించ కూడదని ఆదేశించాడు బాస్టియన్‌. ఆ ‌చెట్టు మరీ అడ్డమేమీ కాదు. కానీ అక్కడే చిన్న మలుపు రావ డంతో ముందు జాగ్రత్త కోసం కొట్టించేస్తున్నాడు పిళ్లే. పది మంది మగవాళ్లు కొంచెం దూరంలో తవ్విన నేలని చదును చేస్తున్నారు.

*********

డైరీలో పేజీలు తిప్పుతూ ఉంటే ‘తాజంగి’ పేరు కనిపించింది. ఎంత లాలిత్యం పేరులో! లంబసింగి చల్లదనానికి అసలు వనరు అదేనని తెలిశాక డాక్టర్‌ ‌మూర్తి ఈ పేజీ నింపారు, ఆరోజు. ఎక్కడో మొదలు పెడితే ఎక్కడో ఆగింది… తాజంగి, 6-3-1921 డియర్‌ ‌మన్యం డైరీ! ఎంత చల్లదనం! దానికే కొద్దిగా ముక్కు మండుతోంది కూడా. లేత మంచుకి కళ్లు చెమరుస్తున్నాయి. అయినా శరీరం ఆ చల్లదనాన్ని ఆస్వాదించాలంటోంది. ఊటీ గుర్తుకొస్తోంది, ఈ లోయలో నడుస్తుంటే. ఎంత అందం! మంచును అనుభవిస్తున్న మహా వృక్షాల మధ్య కాలి బాట. దారంతా పసుపురంగు పండుటాకులు. ఇక్కడికి లంబసింగి ఐదారు మైళ్లేనట. ఈ లోయ నుంచి వీచే గాలులతోనే లంబసింగి చల్లబడిపోతూ ఉంటుం దట. మండు వేసవి కూడా అక్కడ చిన్న బోతుందని తెలుసు.

రెండు కొండల మధ్య ప్రదేశాన్ని లోయ అంటా రట. నిజమే, సౌందర్యం, పచ్చదనం అనే రెండు కొండలవి. కొండలూ వాటి నిశ్శబ్దం మధ్య ఆ ఊరు బందీ అయి ఉందని అనిపించింది. అన్నీ చిన్న చిన్న గుడిసెలు. నడిచొచ్చే సరికి మధ్యాహ్నం ఒంటిగంట అయింది. అయినా వేకువ చల్లదనం గుర్తుకు వస్తోంది. అదేమిటో, ఇక్కడా అంతే-చాలా ఇళ్లకు గొణేలే దర్శనమిచ్చాయి. మన్యంలో చాలా చోట్ల చూశాం కానీ, ఇక్కడైతే గ్రామంలో ఇళ్లన్నింటికీ తాళాలే. గట్టిగా మాట్లాడితే ఊరికి గొళ్లెం పెట్టారని అనొచ్చు. కానీ, టీకాలు వేయించుకోవడానికీ, ఇంగ్లిష్‌ ‌మందులు తీసుకోవడానికి భయపడి కొండ వాళ్లంతా ఇళ్లకి గొణేలు పెట్టి పారిపోతున్నారన్న మా భ్రమ ఈ లోయలోనే పటాపంచలైంది. అందుకు సహకరించినవాడే లువ్వాబు పండు దొర. భయ పడుతూ భయపడుతూ ఒక పాక వెనుక నుంచి వచ్చాడు పండు దొర. నన్నూ, నా ఇద్దరు సహాయ కులని ఎగాదిగా చూశాడు. సంగతి తెలిసే వరకు ఒక రకమైన అలజడే కనిపించింది అతడి ముఖంలో. ఒక పావుగంట తరువాత కొంచెం మాలిమి అయ్యాడు. మనసు విప్పడం మొదలుపెట్టాడు. ‘‘అక్కడో చెలమ ఉన్నట్టుంది. అక్కడ మాట్లాడు కుందామా?’’ అన్నాన్నేను. ‘‘తుమ్మెదలబొక్క కాడనా?’’ అన్నాడతడు. అదేమిటో తెలియక పోయినా, ‘ఊ’ అన్నాను. అదో చిన్న నీటి పాయ. ఏదో జలపాతం నుంచి వచ్చిన స్వచ్ఛమైన నీరు అందులో ప్రవహిస్తోంది మంద్రంగా. మేం ఉన్న వైపు ఒడ్డు మీద ఒక చోట కనిపించిందా దృశ్యం.

అద్భుతమనిపించింది నాకు. పాతిక, ముప్పయ్‌ ‌చదరపుటడుగుల విస్తీర్ణంలో ఆ కాస్త నేల తడిగా, తాటిపండు రసంతో అలికినట్టు అదే రంగులో జిడ్డుగా ఉంది. సూర్యకిరణాలు ఆ తడి ఎర్రనేల మీద ప్రతిబింబిస్తూ ఉంటే మరీ మరీ అందంగా ఉంది. ఆ లేత ఎండలో ఆ తడి నేలంతా కొంచెం కూడా ఖాళీ మిగల్చకుండా వాలి, సేద తీరుతున్నట్టు ఉన్నాయి- రంగురంగుల గాగలు, మైదానం వాళ్ల పరిభాషలో సీతాకోకచిలుకలు, కొన్ని వందలుం టాయి. చిన్నవీ పెద్దవీ… అడవి సీతాకోకచిలుకలు… రెండు రేకులే ఉండే వందలాది పువ్వులు నెమ్మదిగా విచ్చుకుని, మళ్లీ అంతే నింపాదిగా ముడుచు కుంటున్నట్టున్నాయి వాటి రెక్కలు. మధ్యలో చోటు దొరకని సీతాకోకచిలుకలు అంచున వాలుతుంటే, ఆ చిట్టి చిట్టి నీడలు కూడా స్పష్టంగా పడుతున్నాయి ఆ తడి మీద.

ఆ ప్రదేశాన్నే వాళ్లు తుమ్మెదల బొక్క అని పిలుస్తారట. అలాంటివి అక్కడ చాలా ఉంటాయట. మా సహాయకులలో ఒకడు అన్నాడు, నచ్చెబు తున్నట్టు- ‘‘ఏం బాబూ! మేం మీరు కులాసాగా ఉన్నారో లేదో అడిగి, ఒళ్లు బాగుందో లేదో అడిగి… మీ పేర్లు రాసుకుని వెళ్లిపోతాం. సూదిమందులూ, పిండిమాత్రలూ ఇవ్వం. మీ వాళ్లందర్నీ పిలు. ఇలా గొణేలు పెట్టుకుపోతే ఎలా? మా ఉద్యోగాలు ఉండొద్దా? మీరొద్దంటే టీకాలు మానేస్తాం. డాట్రు గారు మూలికా వైద్యం కూడా చేస్తారు. మీ ఆరోగ్యం పరీక్ష చేసి పోతాం, పిలు!’’ అన్నాడు. అతడి కేసి వింతగా చూశాడు పండు దొర. రెండు నిమిషాల మౌనం తరువాత చెప్పాడు. ‘‘ఇవి తమరొస్తన్నారని తెలిసి, ఈ పూటే పెట్టిన గొణేలు కావు బాబూ!’’ అన్నాడతడు, విరక్తిగా, తాపీగా.

‘‘ఎప్పుడు పెట్టిన గొణేలు?’’ అన్నాడు మా సహాయకుడు. ‘‘మూడు పంటలు కోసుకున్నాం, తర్వాత!’’ అన్నాడాయన. విస్తుపోవడం మా వంతు అయింది. అంటే రెండేళ్ల క్రితమే పెట్టిన గొణేలు. ‘‘ఏదైనా దెయ్యం భయమా?’’ మా సహాయకుడే అడిగాడు. ‘‘అలాంటిదే. దెయ్యం ఏంటి? భూతం!’’ అన్నాడు, కళ్లు పెద్దవి చేసి నటిస్తూ, అప్పుడు చెప్పుకొచ్చాడు…

ఈ గొణేలు పెట్టుకుని వెళ్లిన వాళ్లంతా మన్యంలో రోడ్డు పనులకు వెళ్లిన తొలినాటి బృందంలోని వారే. అటవీ చట్టం వచ్చిన తరువాత అడవిబిడ్డ డొక్కలు ఎండిపోయాయి. ప్రపంచ యుద్ధం పుణ్యమా అని పరిస్థితులు మరీ దారుణంగా మారాయి. అప్పుడే రోడ్ల పని మొదలైంది.

ప్రతి ఊరి మునసబు, ముఠాదారు టముకు వేయించి మరీ జనాన్ని తీసుకెళ్లారు. మునసబు లందరికీ కబురెట్టి శరభన్నపాలెం రప్పించాడట బాస్టియన్‌. ‌రోడ్డు పనికి ఎందరిని పంపాలో చెప్పా డట. బియ్యం ఇస్తారు. రోజుకు ఆరణాల కూలి. కానీ ఎంత మోసం!? కొండజనం కూలి పని ఎరుగని వాళ్లు. అయినా చేశారు. ఆరణాల కూలీ అని చెప్పినా, రెండు అణాలే ఇచ్చారు, కసిరి కసిరి. పనిని బట్టి మనిషికి పద్నాలుగు కుంచాల వరకు బియ్యం అన్నారు. ఎప్పుడూ, ఎవ్వరికీ పూర్తిగా ఇవ్వలేదు. రెండణాలేమిటని నిలదీశారు. మిగిలిన బియ్యం మాటేమిటని అడిగారు. సమ్మె కట్టడం గురించి తెలియకపోయినా బకాయిలు తీర్చే దాకా పని చేసేది లేదని అక్కడే మొండికేశారు. కానీ ప్రభుత్వం అంటే అంత కఠినంగా ఉంటుందని ఊహించలేదు. రోడ్డు పనితో బ్రిటిష్‌ ‌గవర్నమెంట్‌ ‌నిజస్వరూపం ఏమిటో అనుభవానికి వచ్చింది వాళ్లకి. పోలీసులు వచ్చారు. వణికిపోయారు వనవాసులు.

కొండ మీద నుంచి దూకమంటే దూకేస్తారు. కోర్టు గుమ్మం తొక్కమంటే మాత్రం గడగడలాడతారు. మరి పోలీసు! ఇంకా ప్రమాదం. ముందు కొట్లో ఏసి కుమ్ముతాడు. తర్వాత కోర్టుకంటాడు. ఎవరికి చెప్పాపెట్టకుండా పని వదిలి రాత్రికి రాత్రి సొంతూళ్లు వచ్చేశారు. ఆ వెంటనే ఇద్దరు ముగ్గురు పోలీసులు, బాస్టియన్‌, ఆయన మనుషులు ఊళ్ల మీద పడ్డారు. రోడ్డు పనికి రాకపోతే ఏం జరుగుతుందో చూపిం చారు. కొంచెం ఓపికగా కనిపించే ప్రతి గిరిజనుడి పేరు రాసుకున్నారు. ప్రతి ఆడదాని పేరు ఎక్కించుకు వెళ్లారు. రోడ్డు పని మళ్లీ ఎప్పుడు మొదలైనా, టముకుతో తెలుసుకుని హాజరు కావాలి. అప్పటి నుంచి హింస. ఎవరు పనికి రాలేదో వెతికి వెతికి పట్టుకుని కొట్టడం మొదలుపెట్టారు బాస్టియన్‌, అతడి మనుషులు. తను, భార్య, కోడలు, పెద్ద కొడుకు రోడ్డు పనికి వెళ్లారట, పండుదొర ఇంటి నుంచి.

నీ రెండో కొడుకు ఎందుకు రాలేదని కొట్టాడట బాస్టియన్‌. అం‌టే భీతావహం సృష్టించడమే అతని ధ్యేయం. ఇచ్చిన కూలి డబ్బులు, ఒక ముష్టిలా తీసుకోవడం, హింసను భరిస్తూ, ఒళ్లు హూనం చేసుకుంటూ పనిచేయడం. అందుకే ఊళ్లు, తండాలు విడిచి పారిపోతున్నారు…

గొణేలు పెట్టేసి…..

డైరీలో ఆ పేజీ చదవడం పూర్తయింది. ఒక సెగ ఏదో తగిలినట్టుయింది. బాధగా నిట్టూర్చారు డాక్టర్‌ ‌మూర్తి.

(ఇంకా ఉంది)

By editor

Twitter
Instagram