– డా।। గోపరాజు నారాయణరావు

ఈరోజు యారోజు ఏమిటి- పువ్వుల రోజు

లేలే లేల లేలమ్మారో- ఓలే లేల లేల…….

భూమిదేవికి కట్టిన కోక – ఏమిటి పూలకోక?

భూమిదేవికి కట్టిన కోక- బూరుగుపూలకోక!

ముత్తేలమ్మకు కట్టిక కోక – ముషిణిపూల కోక!

మావెలమ్మకు కట్టిన కోక- మామిడిపూల కోక!

సారునమ్మకు కట్టిన కోక – సిర్లిపూల…..

హఠాత్తుగా ఆకాశమంతా పక్షుల కలకలం. దగ్గరలో ఉన్న చెట్ల మీది పక్షులన్నీ ఒక్కసారిగా ఆకాశంలోకి లేచాయి. ఎదుట కనిపిస్తున్న ఆ ఆకుపచ్చ లోయ నుంచి రంగురంగుల పక్షులు అరుస్తూ గుంపులు గుంపులుగా వచ్చి వాటిని కలిశాయి. తన ప్రమేయం లేకుండానే ఉగ్గిరంగి రామన్న నోటి నుంచి పాట ఆగి పోయింది. బాస్టియన్‌, ‌కిష్టయ్యల సంగతి కూడా మరచిపోయి నిలబడి చూస్తున్నారంతా.

కర్ణకఠోరమైన శబ్దంతో గుప్పు గుప్పు మంటూ నల్లటి, దట్టమైన పొగను వదిలి పెడుతూ వచ్చింది, ఆ రోడ్డు రోలర్‌. ‌కొంచెం దూరంగా ఆ పెద్ద పనసచెట్టు కింది నిలబడి ఉన్న కిష్టయ్య చూపించిన చోట నెమ్మదిగా ఆపాడు విలియం. ఎందుకో మరి, ఒక్కసారిగా ఇంజన్‌ ‌రైజ్‌ ‌చేశాడు. ఇంజన్‌ ‌కొసన బండ అంచుతో ముదురు అరటి బోదెలా ఉన్న ఆ నల్లటి పొగ గొట్టం నుంచి భగ్గుమంటూ ఎగ చిమ్మింది పొగ, మరింత ఉధృతంగా. ఆ వెంటనే తెల్లటి ఆవిరి- గొట్టం కిందనే ఉన్న ఇంకో బుడిపె లాంటి భాగం నుంచి. ఆ రెండు శబ్దాలతో ఆ కొండలన్నీ ప్రతిధ్వనించాయి. పనసచెట్టు గుబురు నిండా నల్లటి పొగ ఆకుల మధ్యకు చొరబడింది. గుబురుగా, దళసరిగా ఉండే పనసాకులు కూడా విలవిలలాడుతున్నట్టు వెనక్కి కదిలాయి పొగ దూకుడికి. ఓ ఘాటు వాసన నెమ్మదిగా వ్యాపించింది. ఆకాశంలో పక్షులు మరింత గట్టిగా అరుస్తున్నాయి.

అక్కడికి కొంచెం దూరంగా కూల్చేసిన ఓ చెట్టు కొమ్మకి కట్టేసి ఉన్న ఆ నల్లగుర్రం బెదిరి కళ్లెం నుంచి విడిపించుకోవడానికి గింజుకుంటోంది, అసహనంగా సకిలిస్తూ. అది బాస్టియన్‌ ‌గుర్రం. రంగేమిటో కూడా అంతుపట్టనీయకుండా ప్రతి ఆకునీ ఆవరిస్తూ, శాఖలను ఒరుసుకుంటూ చిటారుకొమ్మ వైపుకి సాగుతోంది నల్లటి పొగ, డేగవేగం కలిగిన ఏదో చీడలా.

రోడ్డు పని కూలీలు చేష్టలుడిగిపోయారు. తొలిసారి తీసుకు వచ్చారు ఆ రోడ్డు పని కోసం ఆ రోలర్‌ని. ఏప్లింగ్‌ అం‌డ్‌ ‌పోర్టర్‌ ‌కంపెనీ కెంట్‌ ఇం‌గ్లండ్‌ ‌సంస్థ తయారుచేసిన స్టీమ్‌ ‌రోడ్‌ ‌రోలర్‌ అది. దాదాపు పన్నెండు అడుగుల ఎత్తు. ఏనుగులాగే ఉంది. ఇంకో పన్నెండు అడుగుల పొడవు. కుంభస్థలం ఉండేచోటే ఉంది పొగగొట్టం. వెనుక రెండు చక్రాలు మనిషి ఎత్తులో. ముందు నాలుగడుగుల ఎత్తు రోలర్‌. ఆకుపచ్చ, బూడిద రంగులలో ఉంది మొత్తం రోలర్‌. ‌విశాఖ మన్యంలో గడచిన నాలుగేళ్లుగా రోడ్డు పనులు సాగుతున్నా ఈ మధ్యనే ఇరవై వేల రూపాయలు పోసి కొత్తగా కొనిపించారు. స్టీరింగ్‌ ‌కిందే ఉంది గుండ్రటి మీటర్‌. ‌దానికి రెండు వైపులా అనుసంధానించి ఉన్నాయి గట్టి రాగి గొట్టాలు, నలుపలకల ఫొటో ఫ్రేమ్‌లా. వెదురు చిగుళ్ల మాదిరిగా ఉన్న మీటలు ఆ గొట్టాలకే అమర్చి ఉన్నాయి. భయపడుతూ భయపడుతూ నిలబడి ఉన్నాడు విలియం చెప్పే మాట కోసం కిష్టయ్య. కొండవాళ్ల పిల్లలు రోలర్‌ ‌దగ్గరగా వెళ్లి చూస్తున్నారు. మహా వింతలా ఉంది. ‘‘ఇంక ఆ బండ రోలరు మనుషులు లాగక్కర్లేదంట!’’ ఒక కూలీ అంటున్నాడు, పక్కనే ఉన్న మరొక కూలీతో. ‘‘మంచి మాట చెప్పావురా! అబ్బబ్బ! గూడలు పడిపోయేవి కదరా, అది లాగితే. అయినా ఇదేంట్రా ఇంతుంది?’’ అతడే ఆశ్చర్యంగా అన్నాడు. నిజమే, మొన్నటి దాకా ఉపయోగించిన బండలాంటి ఆ రోలర్‌ని పగ్గం పట్టుకుని కొండవాలు మీద లాగుతుంటే నరకం కనిపించేది కూలీలకి. కొండవాలు అది. కొండ చెంప అని కూడా అంటారు. ఎగువకే లాగాలి రోలర్‌. ‌చాలా వరకు పైకే. గుండెలు అవిసిపోతుండేవి. ఒక్కొక్కసారి వాలు మరీ ఎక్కువైతే, తాడు ఒడిసి పట్టుకుని, పాదాలు నేలకి తాటించి దిగువకి అంగుళం అంగుళం చూసుకుని వదలేవారు. పద డుగులు వేసే సరికే కాళ్లు చచ్చుపడిపోయినట్టు ఉండేది. ‘‘మనకి పని తగ్గించి, రోడ్లు ఇంకా తొందరగా ఏస్తారంట!’’ మరొక కూలీ అన్నాడు. అప్పుడే రోలర్‌కి మించిన కర్ణకఠోర శబ్దంతో అరి చాడు బాస్టియన్‌. ‌హఠాత్తుగా ఊడిపడ్డాడు. హడలి పోయారు కూలీలు. మరు లిప్తలోనే పని మొదలు పెట్టారు. ‘‘ఏంట్రా దాన్ని చూసేది! ఏంటి చూసేది! ఎక్కడ చిన్న సందు దొరుకుద్దా, పని ఎగ్గొడదామా అనే ఎంత సేపూ! దొంగ నాకొడుకులు. ఎవర్ని చూడు, నీతీ జాతీ లేదు! క్షణం కనిపించకపోతే ఇక అంతే.

మీరు చోద్యం చూస్తావుంటే, పనెవడు చేస్తాడ్రా! బయటోళ్లని ఎందుకు పిల్చుకురావటమని నేనా లోచిస్తా ఉంటే, ఇక్కడ ఇదీ ఈళ్ల వరస. రోజులు గడిచిపోతూంటాయి. గజం రోడ్డు కూడా పడదు. మీ మీద జాలి చూపించకూడదురా!’’ అంటూ భుజం మీదే ఉన్న కొరడా తీసుకుని పరుగున వెళ్లి వాళ్ల మీద ఝళిపించాడు, కర్కశంగా.

కూలీలంతా భయంతో వణికిపోతూ మళ్లీ వాళ్ల వాళ్ల చేతుల్లో పనిని కొనసాగించారు. అప్పటికే ఇద్దరు ముగ్గురు వీపుల మీద, కాళ్ల మీద వెంటనే తట్లు లేచాయి. బాధను అణుచుకుని, అదేమీ పట్టనట్టే పని చేస్తున్నారు వాళ్లు. అయినా గావుకేకలు ఆపలేదు బాస్టియన్‌. ‘‘అప్పగించింది ఇరవై గొలుసుల దూరం ఐదురోజుల గడువు. రెండు రోజులు అయి పోయాయి.

పదడుగులు పడలేదు రోడ్డు. ఒరేయ్‌! ఇప్పుడే చెబుతున్నా… పని పూర్తి కాలేదో… కూలీగీలీ దేవుడెరుగు… తోళ్లు తీసేస్తాను చెత్తనాకొడకల్లారా!’’ ఈ కేకలు విని, వీరంగం చూసి పది నెలల తమ్ముణ్ణి ఎత్తుకుని అక్కడే నిలబడి రోలర్‌ ‌శబ్దాన్ని వింటూ, దాని పొగని వింతగా చూస్తున్న ఆ నాలుగేళ్ల కొండ వాళ్ల పిల్ల బెదిరిపోయి దూరంగా పారిపోయింది, ఆయాస పడుతూ. దాని వెనుకే మరో నలుగు రైదుగురు కొండవాళ్ల పిల్లలు కూడా పరుగెట్టి కొంత దూరం వెళ్లాక ఆయాసంతో చెట్ల వెనక్కి పోయి నిలబడ్డారు, రొప్పుతూ.

‘‘ఏమే! అడవి ముండా! నీకు ఏరే చెప్పాలా బొట్టెట్టి?’’ బాస్టియన్‌ ‌కంటే బిగ్గరగా అన్నాడు కిష్టయ్య. కానీ అక్కడ ఏ ఆడది ఖాళీగా నిలబడి కనిపించడం లేదు. బాస్టియన్‌ని చూసి వీరంగం మొదలుపెట్టాడు వాడు. అలా అన్నాడే కానీ, బాస్టియన్‌కి వింతగానే ఉంది. అడుగులో అడుగు వేసుకుంటూ దగ్గరగా వెళ్లాడు. జంతు ప్రదర్శన శాలలో జంతువును చూసినట్టు చూస్తున్నాడు విలియం, బాస్టియన్‌ ‌కేసి. అప్పటికే రోలర్‌ ‌మీద నుంచి కిందకి దిగిపోయారు విలియం సహాయకులు. ఫైర్‌ ‌మ్యాన్‌ ఒక రాయిని ఎంచుకుని పెట్టుకుంటు న్నాడు నేల మీద. రెండోవాడు క్లీనర్‌, ‌కట్టెల కోసం వెతుకుతున్నాడు అక్కడే. కొండసంత నుంచి వచ్చింది రోలర్‌. అం‌టే డౌనూరు. బండల్లా ఉండే రాక్షస బొగ్గును ముక్కలు చేసి, స్టీరింగ్‌కు ముందు ఉన్న రోలర్‌ ‌కొలిమిలో వేయడం, తరువాత కొన్ని కట్టెలు వేసి వెలిగించడం ఫైర్‌ ‌మ్యాన్‌ ‌పని. మళ్లీ అవసరమైతే బొగ్గు వేస్తాడు.

క్లీనర్‌ ‌గొడ్డలితో ఎండు కట్టెలు చీల్చి ఇస్తాడు. ఈ ఇద్దరూ విశాఖపట్నం వాళ్లే. ‘‘రోలర్‌ ‌నిన్ననే రావాలి కదా!’’ ఆరా తీస్తున్నట్టు అన్నాడు బాస్టియన్‌ ‌రోలర్‌ ‌ముందు భాగాన్ని చూస్తూ. అది తనకి వేసిన ప్రశ్న అన్న సంగతి విలియంకి తెలుసు. అయినా నోరు విప్పకుండా డ్రైవర్‌ ‌సీటులోనే కూర్చుని ఉన్నాడు, కూలీల వైపు చూస్తూ. రెండు నిమిషాలు ఆగి మళ్లీ అదే ప్రశ్న వేశాడు బాస్టియన్‌. ‘‘ఇది గుర్రమో ఏనుగో కాదు. రోలర్‌. ‌కొండదారుల్లో రావడానికి సమయం పడుతుంది.’’ విసురుగా అన్నాడు విలియం. ‘‘ఈ రోలర్‌ ‌వస్తుందని పాత రోలర్‌ ‌పంపేశాను. మూడు రోజులు ఆలస్యం పని!’’ అన్నాడు బాస్టియన్‌. ‘‘ఆ ‌సంగతులన్నీ మీ ఇండియన్‌ ఇం‌జనీరుతో మాట్లాడుకో. ఆయనకి తెలియద్దా, ఎంత సమయం పడుతుందో?’’ సంభాషణంతా ఇంగ్లిషులో జరగడం కొంత మేలు. లేకపోతే బాస్టియన్‌ని లెక్క చేయను అన్నట్టు ఉన్న అతడి ధోరణి ఈ కొండవాళ్లకి కూడా తెలిసిపోయేదే. అయినా తాను ఏమన్నాడని! రోలర్‌ ‌రావలసింది నిన్న అనే కదా! ఎందుకు ఇలా భుగభుగలాడిపోతాడు వీడు అనుకున్నాడు బాస్టియన్‌. అసలు బాస్టియన్‌ ‌వైఖరి చూస్తుంటే అసహ్యంగా ఉంది విలియంకి. ఏమిటీ మనిషి? అనిపిస్తోంది. వీడు ఆఫీసరా, మేస్త్రీనా? అని అప్పటికే పదిసార్లు తనని తాను ప్రశ్నించుకున్నాడు. రుసరుసలాడిపోతున్నాడు బాస్టియన్‌.

అతడికి అర్థంకానిది ఒకటి ఉంది. విలియం రోలర్‌ ‌డ్రైవరే. కానీ ఇంగ్లిష్‌ ‌వాడు. బాస్టియన్‌ ‌డిప్యూటీ తహసీల్దారే. ఇరవై ఏళ్ల నుంచి ఉద్యోగంలో ఉన్నాడు. కానీ అతడు మద్రాసీ. అందుకే విలియంలో ఆ పొగరు. ఏం చేయలేక చుట్టూ చూశాడు. కోపాన్ని దిగమింగుకుందామన్నా సాధ్యం కావడం లేదు. దూరంగా కట్టేసి ఉన్న తన గుర్రం బెదురు తగ్గక ఇంకా కళ్లెం నుంచి విడిపించుకోవాలని గింజు కుంటోంది. ఒక్క అరుపు అరిచాడు. ‘‘ఒరేయ్‌ ‌కిష్టయ్యా!’’ ఏ మూలన ఉన్నాడో, చటుక్కున ప్రత్యక్షమయ్యాడు కిష్టయ్య. ‘‘చూడ్రా! గుర్రానికి నీళ్లు పట్టు. తీసుకెళ్లి కొంచెం దూరంగా కట్టు. బెదరిపోతందిక్కడ! కళ్లు కనపడట్లేదా?’’ ‘‘చిత్తం దొర! ఇప్పుడే ఏరే చోట కట్టేస్తాను.’’ ఒక్క పరుగున వెళ్లాడు కిష్టయ్య. గుర్రాన్ని అక్కడే వదిలి రెండు గంటల క్రితం గప్పీ దొర బంగ్లాకి వెళ్లాడు బాస్టియన్‌. అక్కడికే రమ్మన్నాడు డోలా లచ్చిని.

********

మన్యంలో అడుగు పెట్టినప్పటి నుంచి ఆ డైరీ బుర్రను తొలుస్తూనే ఉంది. నిలవనివ్వడం లేదు. కొంగసింగి గ్రామ మునసబు పంపించిన రెండెడ్ల బండిలో కూర్చున్నారు డాక్టర్‌ ‌మూర్తి. వాళ్ల ఊళ్లో వైద్య పరీక్షలు జరపాలని స్వయంగా వచ్చి కోరితే తన సిబ్బందితో వెళుతున్నారు. చాలా చక్కగా ఉంది వాతావరణం. అప్పుడే సంచిలో నుంచి డైరీ తీసి, ఆ పేజీ చదవడం మొదలు పెట్టారు. గూడెం, 4-3-1921 డియర్‌ ‌మన్యం డైరీ! గూడెం కొండలు ఎంత అద్భుతమో! గూడెం అంటే విశాఖ మన్యంలో ఒక ప్రాంతం. ఊరు కాదు. కాకులు దూరని ఇలాంటి కారడవిలో ఇవాళ ఒక బడిని చూశాను. ఆ బడిలో ఒక కొత్త పాఠం కూడా చదువుకున్నాను. పది ఇంటూ పది అడుగుల తాటాకుల పాక. వెదురు తడకలు కట్టారు చుట్టూ. లోపల ఈతాకు చాపలు పరిచి ఉన్నాయి. అయ్యవారు, అంటే ఉపాధ్యా యుడు కూర్చోడానికి చిన్న ముక్కాలి పీట మాత్రం ఉంది. ఏడుగురో ఎనిమిది మందో విద్యార్థులు. ఐదో తరగతి వరకు ఉంది. ఇక్కడి టీచర్‌ ‌కూడా లక్ష్మయ్యగారు. కూడా అన్నది ఇంటి పేరు. ఆయన ఒక్కరే. నేను చూడలేదు కానీ, ఈ చుట్టు పక్కల ఆయనకి చాలామంచి పేరుంది. పిల్లల్లో తప్ప. పిల్ల లంతా ఆయన తీయించే గుంజీలకి జడిసి పోతున్నారట. ఆయన చెబితేనే నా దగ్గరకి తన మనుమడు రామునాయు డిని తీసుకుని వచ్చాడు సలబు పోతినా యుడు. వయో వృద్ధుడిలా ఉన్నాడు పోతినాయుడు. కుర్రాడికి పన్నెండేళ్లు ఉంటాయి. ఊరు పాకాబు. కడుపులో బల్ల. పొట్ట ఉబ్బి ఉంది. ముఖం పాలిపోయి ఉంది. పోషకాహార లోపం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. నన్ను చూడగానే బిక్కముఖం వేశాడు రామునాయుడు. వాడిని మచ్చిక చేసుకోవడానికి మాటలు మొదలుపెట్టాను. ‘‘ఈ బళ్లోనే చదువుతున్నావా రామునాయుడు?’’ అన్నాను. ‘‘ఔను దొర!’’ అన్నాడు తడబడే మాటతో. ‘‘ఐదో తరగతిలోకి వచ్చావా!’ ‘‘లేదు, ఒకటో తరగతి’’ మేం ముగ్గురం ఆశ్చర్యపోయాం.

‘‘ఇంకా ఒకటో తరగతేనా? ఎందుకు?’’ ‘‘మా అయ్యోరు రెండో తరగతికి పంపడం లేదు.’’ అన్నాడు రామునాయుడు. పరీక్షించడానికి ఉదరం నొక్కుతూ అడిగాను. ‘‘ఏదీ అఆలు చెప్పు వింటాను.’’ ‘‘అ.. ఆ.. ఇ.. ఈ.. ఉ….ఊ…. ఋ… ఋ….’’ అక్కడితో ఆపేశాడు.

నేను ఉదరం నొక్కడం వల్ల ఇబ్బందితో మానేశాడనుకున్నాను. నొక్కడం ఆపేసి అన్నాను, ముఖంలోకి చూస్తూ, ‘‘ఆపకు. చెప్పు!’’ ‘‘ఇంకా ఉన్నాయా…..?’’ చాలా అమాయకంగా అడిగాడు. ‘‘అయ్యోరు అవే చెప్పారు.’’ అన్నాడు రాము నాయుడు, సిగ్గుపడుతూ. సంవత్సరంలో ఆరు మాసాలు చింతంబలీ, మామిడి టెంకల అంబలీ తాగితే పిల్లలకి వచ్చేది చదువు కాదు. చావు! మనసులోనే అనుకున్నాను. ‘‘మాకు చదువు లెందుకంటే, లక్ష్మయ్య అయ్యోరు ఇనడం లేదు బాబు! ఇంటికొచ్చి పిల్లల్ని లాక్కెళ్లిపోతన్నారు’’ అన్నాడు తాత నాయుడు. ‘‘చదువుకుంటే మంచిదే కదయ్యా!’’ అన్నాన్నేను, ఆయుర్వేదం మందులు ఇస్తూ. ‘‘రాము నాయుడు! రోజూ బడికి వెళ్లు. బాగా చదువుకో’’ అన్నాను భుజం తడుతూ మళ్లీ నేనే. ‘‘మా అయ్యోరు గుంజీలు తీయించడం మానేస్తే బడికెల్తాను.’’ తలొంచుకుని అన్నాడు. ‘‘గుంజీలు తీస్తే మంచిదే కదరా! చదువు బాగొస్తది.’’ అన్నాడు తాత నాయుడు. మనవడు నాయుడికి ఉక్రోషం వచ్చేసింది. ‘‘రోడ్డు పనికాడ ఒక్కరోజు గుంజీలు తీస్తే నెల్రోజులు నెప్పులో అంటా కూకున్నావు. రోజూ గుంజీలు తీస్తే ఎలగుంటది?’’ ‘‘అదేమిటి పోతినాయుడు? కాళ్ల నొప్పులుంటే చెప్పు!’’ అన్నాను. ‘‘చలికాలం ఉంటాయి బాబు! అంతే!’’ అన్నాడతడు. అతడి కాళ్లు కూడా పరీక్షిస్తూ నెమ్మదిగా అడిగాను. ‘‘ఏం జరిగింది. రోడ్డు పని ఎలా చేయాలో బాస్టియన్‌ ‌దొర పాఠం చెప్పాడా?’’ అనడిగాను.

అప్పటికి మనుషులు లాగే రోడ్డు రోలరే ఉండే దట. అది లాగే బృందంలో పడేశారట పోతి నాయుడిని. ఒక ఎత్తయిన ప్రదేశం మీద తాడు పట్టుకుని లాగుతుంటే కాళ్లు చచ్చు పడినట్టయి నేల మీద కూలబడిపోయాడట. కిష్టయ్య, అక్కడ మేస్త్రి రామమూర్తి వచ్చారట, కంగారు పడుతూ. ‘‘ఏంట్రా కూకుండిపోయావ్‌!’’ అన్నాడట రామమూర్తి. ‘‘కాళ్లు చచ్చుపడినట్టనిపిస్తంది మేస్త్రి’’ అన్నాడట పోతినాయుడు.

అప్పుడే వచ్చిన బాస్టియన్‌ ‌సంగతి అడిగి, అసలు ఇంత ముసిలి నా కొడుకుని ఎందుకు తెచ్చావని రామమూర్తిని కొట్టినంత పని చేసి, పోతినాయుడిని పంపించెయ్యమని చెప్పాడట. అక్కడ పోతినాయుడు చేసిన తప్పిదం ఒక్కటే- ఆ ముందు రోజు కూలీ అడగడమే.

అందుకే శిక్ష వేశాడు బాస్టియన్‌. ఆ ‌శిక్షతో కాళ్లు కూడా బలపడి గంతులు కూడా వేయొచ్చునని అరిచాడట. పాతిక గుంజీలు. మధ్యలో ఆపితే వీపు చుర్రుమనిపించమని గుర్రాన్ని తోలే చర్నాకోల ఇచ్చి పక్కనే కిష్టయ్యని నిలబెట్టాడట.

పాతిక గుంజీలు… ఆగకుండా…. 57 ఏళ్ల వయసులో… బక్క ప్రాణికి అదీ శిక్ష …..

********

బాధని రోడ్డు పని దగ్గరే వదిలి పెట్టి రాగలగు తున్నారు. కానీ శరీరాన్ని గుంజుతున్న బడలిక వెంటబడి వస్తోంది. గుడిసెల దగ్గరకి వచ్చే సరికి మళ్లీ స్వేచ్ఛా విహంగాలైపోవడం నేర్చుకున్నారు వాళ్లు. ఏదో చెట్టు కొమ్మ మీద నుంచి పక్షి గానం వినిపించినట్టు, ఆ గుడిసెలలో ఎక్కడో ఒక్క చోట నుంచి ఏదో ఒక పాట తటాల్న వినపడుతూ ఉంటుంది. కారణం- అక్కడ బాస్టియన్‌ ఉం‌డడు.

ఆ నెగడు వెలుగులో ఏదో పసరు పిక్క మీద రాసుకుంటున్నాడు ఉగ్గిరంగి రామన్న. తాజంగి నుంచి నలుగురు మనుషుల్ని రోడ్డు పనికి తీసుకు రావాలని హుకుం జారీచేశాడు బాస్టియన్‌. ఎవరూ దొరకలేదు. రామన్న, అతడి భార్య మాత్రం వచ్చారు. ‘నలుగురిని తీసుకురమ్మంటే మీ ఇద్దరే వస్తారా’ అంటూ చేతిలో ఉన్న పచ్చి చెట్టు కొమ్మతో కొట్టాడు బాస్టియన్‌. ‌కమిలిపోయింది శరీరం. నాలుగు రోజులైనా నెప్పి వదలడం లేదు. దానికే ఆ పసరు పూస్తున్నాడు రామన్న. చలి తన ప్రతాపం చూపి స్తోంది. రాత్రి చలీ, గాందూ (మంచు) ఒకదానితో ఒకటి పోటీ పడుతున్నట్టు ఉంది. చింత చెట్టు ఆకుల మీద నుంచి అప్పుడప్పుడు మంచు బిందువులు పడుతున్నాయి, నెగళ్లలో.. రాత్రి కాపలా కోసం ఉన్న నలుగురు యువకులు, ఇంకో పదిహేను మంది ఆ పెద్ద నెగడు చుట్టూ కూర్చుని ఉన్నారు. గారంగి లింగాలు గొంగడి కప్పుకుని వచ్చే నిద్ర ఆపుకుంటూ రామన్న చెప్పే కథ కోసం చూస్తున్నాడు. పాపం, లింగేటి మూగయ్య ఒక్కడే రెండు గోనె పట్టాలు ఒకదాని మీద ఒకటి కప్పుకుని మంటకి ఇంకాస్త దగ్గరగా కూర్చున్నాడు. అతడి వయసు యాభయ్‌ ‌దాటి ఉంటుంది. చూడ్డానికి అరవయ్యేళ్ల మనిషిలా ఉన్నాడు. గూడెం ప్రాంతంలోనే వీరముష్టిపేట గ్రామం నుంచి వచ్చాడు.

(ఇంకా ఉంది)

About Author

By editor

Twitter
Instagram