చరిత్రాత్మకంగా పత్రికలు నిర్వహించవలసి ఉన్న బాధ్యతను అవి నిర్వహించడం లేదని నిర్మొహమాటంగా చెప్పదలుచుకున్నానని చెప్పారు డాక్టర్‌ ‌కేఐ వరప్రసాదరెడ్డి. నేరాలకు సంబంధించిన వార్తా కథనాలు, వార్తలు పదే పదే ప్రచురించడం వల్ల ప్రజలలో ఉండే సున్నితత్వం నశించిపోతున్నదని  ఆవేదన వ్యక్తం చేశారు. అన్నింటికి మించి అధికార పక్షం పత్రికలు ఉంటున్నాయి. విపక్షం వైపు మొగ్గే పత్రికలూ ఉన్నాయి. కానీ ప్రజల పక్షం వహిస్తున్న పత్రికలు ఏవీ, ఎక్కడ అని ప్రశ్నిస్తున్నారు డాక్టర్‌ ‌వరప్రసాదరెడ్డి. మే 8వ తేదీన హైదరాబాద్‌లో జరిగిన దేవర్షి నారద జయంతి కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న డాక్టర్‌ ‌వరప్రసాదరెడ్డి నేటి పత్రికా రంగంలోని కొన్ని పోకడల పట్ల తన ఆవేదనను ప్రసంగం ద్వారా వెల్లడించారు. ఆ ప్రసంగానికి ఇది వ్యాసరూపం.

ప్రపంచం నిద్రపోయాక కూడా సమాజ హితం కోసం తన కర్తవ్యాన్ని నిర్వర్తించే యోధుడు జర్నలిస్టు. దుష్ట రాజకీయాల, అవినీతి పారిశ్రామికవేత్తల చీకటి సామ్రాజ్యాల గుట్టును ప్రజల దృష్టికి తెచ్చి, వారి మీద సమాజానికి ఉన్న భ్రమలు వదిలించే సూరీడు జర్నలిస్టు.

అసాంఘిక శక్తులను నిలువరించే ఆయు ధాలుగా, సమస్యలనే చీకటికోణాలన• ఛేదించే కరదీపికలుగా తన అక్షరాలను మలుస్తాడు పత్రికా రచయిత. నిర్లక్ష్యానికి గురవుతున్నామన్న వేదనలో ఉన్న విద్యార్థిలోకానికీ, నిరాశా నిస్పృహలతో కుంగి పోతున్న రైతన్నలకూ ఆశాజ్యోతుల్లా కనిపించేవారు కూడా జర్నలిస్టులే.

అలాంటి అసాంఘిక శక్తుల గురించీ, రాజకీయ నేరగాళ్ల గురించీ ఇంచుమించు జర్నలిస్టులంతా తమకున్న పరిధిలో ఎంతో కొంత బాగానే అక్షరీకరి స్తున్నారు. కానీ రాజకీయాల విషయంలోనే పచ్చి పోలరైజేషన్‌ ‌రాజ్యమేలుతున్నది. కొందరు అధికార పక్షం జెండా మోస్తుంటే, మరికొందరు ప్రతిపక్షం జెండాను భుజానికెత్తుకున్నారు. ఇది అత్యంత విచారకరం. ఎందుకంటే – ప్రజాపక్షంగా ఎవరూ లేరు. ఇది నిజం! నిజానికి ప్రజలే, వాళ్ల యోగక్షేమాలే జర్నలిస్టులకు ఎజెండా కావాలి.

ప్రజలకేం కావాలో, వారికి ఏవి ఉపయోగ పడతాయో వాటి మీద దృష్టి పెట్టాలని జరల్నిస్టులను అభ్యర్థిస్తున్నాను. రాజకీయాలు, ప్రభుత్వ కార్యకలా పాల మీద మాత్రమే ప్రజల మనుగడ ఆధారపడి ఉండదు. జనజీవనం, దాని భవిష్యత్తు, మనుగడ ప్రధానంగా విద్య, వైద్యం, వాణిజ్యం, పరిశ్రమలు- వీటి చుట్టూ పరిభ్రమిస్తూ ఉంటాయని నా విశ్వాసం. ఈ దేశానికి మూలాధారమైనది వ్యవసాయం. ఆ రంగం సైతం వ్యాపారంతోనే ముడిపడి ఉంది. మార్కెట్‌ను అధ్యయనం చేసి సరైన పంటను వేసుకునే ముందుచూపు, పండిన పంటను అమ్ముకోగలిగిన సామర్థ్యం రైతు అలవర్చుకొన్నపుడు రైతు ఆత్మ హత్యలుండవు. నిరుద్యోగులు, చిరుద్యోగులు, మాజీ ఉద్యోగులు- ఇలాంటి వారి అందరి చూపూ ఉపాధి కల్పనపై, వ్యాపార అవకాశాలపై ఉండాలని నాయక మ్మన్యులు, పత్రికా సంపాదకులు ముక్తకంఠంతో ఘోషించడం, నినదించడం మనం చూస్తూనే ఉన్నాం, వింటూనే ఉన్నాం. అయితే ఆయా నినాదాలూ, ఘోషలకీ తగినట్టు ఆయా రంగాలపై అవగాహన పెంచే సమాచారం, ప్రస్తుత పరిస్థితులపై జరగ వలసిన అధ్యయనం, భవిష్యత్తులో అందే అవ కాశాలపై అంచనా, ఇతర రాష్ట్రాలకూ, దేశాలకూ విస్తరించడానికి ఉన్న సాధ్యాసాధ్యాలు… ఇవేవీ సాధారణ ప్రజలకు అందుబాటులోకి వచ్చే అవ కాశాలు కనిపించడం లేదు. మరి మన పత్రికలలో ఏం కనిపిస్తున్నాయి! నేరాలు, ఘోరాలు, మాన భంగాలు, తల్లి తల నరికిన కొడుకు, భర్తను హతమార్చిన భార్య, కూతురుని చెరిచిన కన్నతండ్రి- ఇవీ! ఇదా మనం ప్రజలకు అందించవలసిన సమాచారం? ఇలాంటి ధోరణి గురించి సరైన దృష్టితోనే ఆలోచిస్తున్నామా? మనకి కావలసినది నిర్మాణాత్మక కథనాలు మాత్రమే. కానీ ఇందులో కొన్ని మినహాయింపులు లేకపోలేదు.

ఆజాదీ కా అమృత్‌ ‌మహోత్సవాలు జరుపు కొంటున్న ప్రస్తుత తరుణంలో, బ్రిటిష్‌వారితో భిన్నమార్గాల్లో ప్రత్యక్ష, పరోక్ష యుద్ధాలు చేసి, అసువులు బాసిన దేశభక్తుల వీరగాధలు, ఉద్యమాల గురించి ఏ మహానుభావుడో, మహానుభావులో రాయగా వాటిని దినదినం ప్రచురించి దేశ ప్రజల మనసులను ఉత్తేజపరుస్తున్నారు. అలాంటి వారికి శిరసాభివందనం.

జనాల్ని చైతన్యవంతం చేసి, వారి వ్యక్తిగత భవిష్యత్తునూ, దేశ భవిష్యత్తునూ తీర్చి దిద్దడమనే వాటి పాత్రను దినపత్రికలు సజావుగా పోషించి నప్పుడు దేశ ఆర్థిక చిత్రపటం రూపురేఖలు మారి పోతాయి. పత్రికలు వాటి ధర్మాన్ని అవి నిర్వర్తించిన ప్పుడు ఇది సాధ్యమే కూడా. కేవలం ఆర్థిక, వాణిజ్య అంశాలతోనే వెలువడుతున్న పత్రికలూ ఉన్నాయి. కానీ అవి నిర్వహించే భూమిక దేశంలో చాలా పరిమితం. ఎందుకంటే, సాధారణంగా అందరూ చదవేది మాతృభాషలో వెలువడే దినపత్రికలే! అది కూడా వాణిజ్యం వంటి ప్రత్యేక అంశాలకు పరిమిత మైన పత్రికలు కాకుండా, అన్ని విషయాలను ప్రచురించే పత్రికలనే చదువుకుంటారు.

ఏమైనా, ప్రజల పట్ల, సమాజం పట్ల పత్రికలు నిర్వర్తించవలసి ఉన్నదీ అని చెప్పే చరిత్రాత్మక బాధ్యతను నేటి దినపత్రికలు పూర్తిగా విస్మరించా యని చెప్పడానికి నేను సందేహించను. అవి కేవలం కుళ్లు రాజకీయాలకు, చిల్లర మల్లర స్థానిక వార్తలకు, ఆకర్షణే ధ్యేయంగా ఉండే ఫీచర్లకు పెద్దపీట వేసి, తక్కిన లోతైన అంశాల్ని పక్కకు నెట్టివేశాయి. ఎన్నికల సమయంలో పత్రిక నిండా అభ్యర్థుల, ప్రత్యర్థుల కథనాలెన్ని నింపినా, చివరకు ఓటింగ్‌ 45 ‌శాతం – 50 శాతం కన్నా ఎందుకు మించడంలేదు? ఎందుకంటే కేవలం రాజకీయాలే పొట్ట నింపవనీ, తమ సమస్యలను పరిష్కరించవనీ ప్రజలకూ తెలుసు.

జిల్లా ఎడిషన్లు చూస్తుంటే ఇంకా బాధ అని పిస్తున్నది. అసలు ఆయా జిల్లాలలో జరిగే వ్యాపారం, వ్యవసాయం, అందుబాటులో ఉన్న విద్యావకాశాలు, వైద్య సదుపాయాలు సేవామూర్తుల కార్యాచరణల గురించిన కథనాలకు వాటిలో చోటే ఉండడం లేదు. గృహిణి మానభంగానికి గురై ఒక కుటంబం విచ్ఛిన్నమైతే అదే పతాక శీర్షిక. పది కుటుంబాలకు అన్నం పెట్టే పరిశ్రమను ప్రారంభిస్తే మాత్రం అసలు వార్తే కాదు. ఊరూరా ఉండే రిపోర్టర్లు ఏం చేస్తున్నారు! ఛోటా మోటా రాజకీయ నాయకుల ప్రకటనలు (సాధారణంగా వాళ్ల అధినాయకుడిని కీర్తిస్తూ) సేకరించి ప్రచురిస్తున్నారు. ప్రభుత్వ కార్యా లయాలలో లంచగొండితనం గురించి వివరణాత్మ కంగా రాస్తారు. అప్పుడపుడు జరిగే ఖాకీల దౌష్ట్యం గురించి విశేషాలు ఉత్కంఠ రేపేటట్టు రాస్తారు. అసలు వీరు సానుకూల దృక్పథం కలిగించే వార్తలు రాయలేరా? ఆ జిల్లాలో కొత్తగా తెరుస్తున్న వ్యాపార సంస్థలు ఏమిటి? లేదా మూతపడుతున్న వ్యాపార సంస్థలు ఎన్ని? ఇలాంటివేమీ వారి కంటికి కనిపించవా?

ఇవాళ్టి పత్రికలలో కనిపించే మరొక వికృత ధోరణి, వీటికి బిజినెస్‌ అం‌టే కేవలం షేర్‌ ‌మార్కెట్‌. ‌పూర్తి పేజీ లేదా అర పేజీ షేర్‌ ‌ధరవరలకే కేటా యించడం కనిపిస్తుంది. అందులో రాసే కాలమిస్టుల పని- ఏ కంపెనీ షేర్‌ ‌కొనాలో సలహా ఇవ్వడం మాత్రమే! కానీ నిజం ఏమిటి? షేర్‌ ‌మార్కెట్ల వల్ల ఉత్పత్తి పెరగదు. ఉపాధి అవకాశాలూ పెరగవు. మధ్యతరగతికి చెందిన ఇన్వెస్టర్లుకు షేర్‌ ‌ధర తెల పడం తప్ప, ఏ పరిశ్రమ, ఏ సంస్థ గురించి కూడా లోతైన అవగాహన కలిగించే ప్రయత్నమే చేయడం లేదు. బిజినెస్‌ ‌కాలమ్‌లలో ఆయా కంపెనీల వార్షిక ఆర్థిక ఫలితాలను వెల్లడించేందుకు ఏర్పాటైన సమా వేశంలో ఆ కంపెనీ అందించిన అంకెనే వార్తలుగా అందిస్తున్నారు.

ఇక, అప్పుడప్పుడు ఏదైనా రంగం గురించి ఓ మాదిరి వ్యాసం కనిపించిందంటే, దాని అర్ధం ఆ రంగానికి సంబంధించిన ఓ ప్రముఖ సంస్థ అతి త్వరలో పబ్లిక్‌ ఇష్యూకు వెళ్తుందని ఊహించు కోవచ్చు. జర్నలిస్టులు ఏ పారిశ్రామికవేత్తనయినా ఇంటర్వ్యూ చేస్తే ఆయన చెప్పినవి తు.చ. తప్ప కుండా ప్రచురించండి. కానీ – అక్కడితో మీ కర్తవ్యం అయిపోయిందని అనుకోకూడదు. వారు చెప్పినవి క్రాస్‌చెక్‌ ‌చేసుకోవాలి. నిజనిర్ధారణ చేసి మీరు పరిశోధించిన నిజ ఫలితాలను వెల్లడిస్తే యిన్వెస్టర్లకు కనువిప్పు కలుగుతుంది. అప్పుడప్పుడు సుదీర్ఘ వ్యాసాలు కూడా కనిపిస్తుంటాయి. కానీ ఆ వ్యాసాలు ఏదో ఇంగ్లిష్‌ ‌పత్రిక నుండి తీసుకొని యథాతథంగా తర్జుమా చేసినవే కానీ, స్వంతంగా విశ్లేషించి రాసినవి కావు. పత్రికలు, కొందరు జర్నలిస్టులు ప్రతిష్టా త్మకంగా చెప్పుకునేది ఇన్వెస్టిగేటివ్‌ ‌జర్నలిజం. కానీ అంతటి ఇన్విస్టిగేటివ్‌ ‌జర్నలిజం అవకాశవాద రాజకీయాలకు, ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతి కథనాలకి మాత్రమే పరిమితం కావడం శోచనీయం.

మరో బాధాకరమైన విషయం గురించి కూడా జర్నలిస్టుల దృష్టికి తీసుకువస్తున్నాను. అదే, వార్తను వార్తగా రాయడం తగ్గిపోతున్న రోజులివి. వార్తను వ్యాఖ్యలుగా మారుస్తున్నారు. ధర్మాసనం వెలు వరించిన తీర్పును కూడా తమ ఊహకు తోచినట్లు వ్యాఖ్యానిస్తున్నారు. ఏది వార్త? ఏది వ్యాఖ్యో తెలియని అయోమయం. మీ విశ్లేషణలకు, వ్యాఖ్యలకు ‘సంపాదకీయం’ అని ఒక కాలమ్‌ ఉం‌ది కదా! కానీ అంతా గుర్తించవలసిన వాస్తవం- ఇలాంటి వ్యాఖ్యలూ, విశ్లేషణాలూ, మార్గదర్శనాలూ, జోస్యాలూ పారిశ్రామికరంగానికి వర్తించవు. ఏదైనా ఒక పరిశ్రమ మీద దృష్టి సారించినప్పడు వాటి గురించి ప్రభుత్వమో సంబంధిత వ్యాపార సంస్థో అందజేసిన గణాంకాలనే పాఠకులకు అందిస్తారు. వాటిని నిశితంగా విశదీకరించడం గానీ వేరే కోణంలో విశ్లేషించడం కానీ జరగడం లేదు. అసలు తమంతట తాము చొరవ తీసుకుని స్వంతంగా విషయ సేకరణ జరిపి, అధ్యయనం చేసి ఒక నిర్ణయానికి జర్నలిస్టులు రావడం లేదు.

ఎంత దురదృష్టమంటే, పన్నులు ఎగ్గొట్టే, కార్మికుల హక్కులు కాలరాసే వ్యాపారస్తుల ఆటలు, బ్యాంకులను ముంచి, రాజకీయ పలుకుబడులును ఉపయోగించి రుణాలు మాఫీ చేయించుకునే బడా బాబుల విన్యాసాలు ఇవాళ్టి జర్నలిస్టులకు పట్టడం లేదు. పన్నులు సరిగ్గా చెల్లించి, కార్మికులను భాగ స్వాములుగా చేసుకొని వారి ఆర్థిక మూలాలను మెరుగుపరుస్తున్న సంస్థల గురించి, దేశ గౌరవాన్ని, సంపదను పెంచుతున్న, శాస్త్ర, సాంకేతిక పురోభి వృద్ధికి కృషి చేస్తున్న పారిశ్రామికవేత్తలను గుర్తించి ‘శభాష్‌’ అం‌టూ ప్రేరణనిచ్చే కథనాలు రాయడానికి జర్నలిస్టులకు మనసు రావడం లేదు.అలా అని వాళ్ల గురించి అసలేమీ రాయడం లేదని అనడం లేదు. అవార్డులు వచ్చినప్పుడు కొంచెం రాస్తారు. లేదా, అరెస్టయినప్పుడు మాత్రమే రాస్తున్నారు. ఇలా రాసేవారిని ‘వార్తాహరులు’ అనాలే తప్ప పాత్రికే యులని పిలవడం సాధ్యంకాదు. ఇవాళ న్యూస్‌ ‌ఛానళ్లు వచ్చాయి. నిమిషాల్లో వార్తలు అందిస్తు న్నాయి. ఇలాంటి తరుణంలో పాఠకులు దినపత్రికల నుండి ఎదురుచూసేది నిఖార్సైన వార్తావ్యాఖ్యానాల కోసమే!

జర్నలిజం సామాజిక బాధ్యతే కాదు, దానిని స్వీకరించిన జర్నలిస్టు చైతన్యంతో కూడా ముడిపడి ఉన్న వృత్తి. ఇలాంటి వృత్తిని సరైన పంథాలో నిర్వ హించాలంటే జర్నలిస్టులకు ఒక సాధన అవసరం. తర్ఫీదు, శిక్షణ అనివార్యం. పత్రికల యాజ మాన్యాలు వాటిని అందించాలి. ఏ విభాగంలోని జర్నలిస్టులకు ఆయా రంగంలోని నిపుణుల చేత ప్రత్యేక శిక్షణ ఇప్పించాలి. అవగాహన, అంచనా సామర్థ్యాలను నిరంతరం అవగాహన చేసుకొనే శక్తిని వారికి సమకూర్చాలి.

మన దేశ పారిశ్రామిక రంగం, భవిష్యత్తులో ఆ రంగం ఎదుర్కొనబోయే పరిణామాలు, ప్రభా వాలను అంచనా వేయగలిగే నైపుణ్యం పాత్రి కేయులకు అత్యవసరం. గ్యాట్‌ ఒప్పందం, క్యోటో సమీకరణం వంటి అంతర్జాతీయ అవగాహనా ఒప్పందాలలోని సున్నితమైన అంశాలను సైతం అవగతం చేసుకుని సందర్భానుసారంగా ప్రజలను చైతన్యవంతులను చేయవలసి ఉంటుంది.

ఎజెండా ఇప్పటికే సుదీర్ఘమయింది. ఇది 100 పేజీల ఎలక్షన్‌ ‌మేనిఫెస్టో మాత్రం కాదు. పత్రికలు ప్రజాపక్షం వహించాలి. ప్రజాహితం కోరాలి. వాస్తవాలు, నిజాయతీతో కూడిన విశ్లేషణల అవసరం ఎంతో చెప్పడానికి ఇవన్నీ కొన్ని సూచనలు. వాటికి పరిష్కారాలు. ఇంతే! సబబుగా ఉన్నాయని అనిపిస్తే ఒక ఔషధంలా తీసుకోండి. సెలవు.

By editor

Twitter
Instagram