– ఎం.వి.ఆర్‌. ‌శాస్త్రి

“Since the session of the All India Congress Committee (21st-23rd September) the Congress leaders everyw here, but particularly Vallabhbhai Patel in Bombay and Nehru and Pant in the United Provinces, have been making statements and speeches which can only be intended to provoke or pave the way for mass disorder. They are asserting that the British could be turned out of India within a very short time.. There is nothing secret about the intentions of Nehru and Patel; and as they are, after Gandhi, by far the most influential of the Congress leaders, the others are taking their line from them. In a recent speech in Bombay, Patel said that Congress would demand an immediate and final solution… If such a solution was not forth coming there would follow another struggle”. Nehru said a day earlier that revolution is inevitable.” I believe that the Congress are counting on the I.N.A. as the spear-head of their revolt…

The object of the rising the Congress leaders have in mind would be the expulsion of the British.Whatever the leaders might say publicly, there would be organised attacks on the railways and public buildings, treasuries would be looted and records destroyed. In fact Congressmen would attempt to paralyze the administration, as they did in 1942; they would also attack and possibly murder any officials, British and Indian, on whom they could lay their hands…

[The Transfer Of Power 1942-7, vol.6 pp. 451-452 ]

(సెప్టెంబరు 21-23 ఏఐసీసీ సభ తరవాత ప్రతిచోటా కాంగ్రెసు నాయకులు ముఖ్యంగా బొంబయిలో వల్లభ్‌భాయ్‌ ‌పటేల్‌, ‌యూపీలో నెహ్రూ, పంత్‌లు అల్లకల్లోలాన్ని తెచ్చిపెట్టేలా రెచ్చగొట్టే ప్రకటనలు, ప్రసంగాలు చేస్తున్నారు. అతి త్వరలో బ్రిటిషువారిని ఇండియా నుంచి వెళ్లగొట్టగలమని వారు గట్టిగా చెబుతున్నారు. పటేల్‌, ‌నెహ్రూల ఉద్దేశాలలో రహస్యం ఏమీ లేదు. గాంధి తరవాత అంతటి పలుకుబడి కలిగిన కాంగ్రెసు నాయకులు కాబట్టి మిగతావారూ వారి లైనునే అందిపుచ్చు కున్నారు. తుది పరిష్కారం తక్షణం తేలాలని కాంగ్రెసు డిమాండ్‌ ‌చేస్తుంది. అలాంటి పరిష్కారమేదీ కుదరకపోతే మరో పోరాటం తప్పదు’’ అని పటేల్‌ ఈ ‌మధ్య బొంబయి ప్రసంగంలో హెచ్చరించాడు. దానికి ముందు రోజు నెహ్రూ ‘‘విప్లవం అనివార్యం’’ అన్నాడు. కాంగ్రెసువారు తిరుగుబాటుకు ముందువరసన ఐఎన్‌ఎను పెడతారు.

కాంగ్రెసు నాయకులు తలపెట్టిన అలజడి ధ్యేయం బ్రిటిషు వారిని గెంటివేయటం. నాయకులు పైకి ఏమి చెప్పినప్పటికీ రైల్వేల మీద దాడులు చేయిస్తారు. పబ్లిక్‌ ‌బిల్డింగులు, ట్రెజరీలు లూటీ చేసి రికార్డులు ధ్వంసం చేయిస్తారు. 1942లో చేసినట్టే పరిపాలనను స్తంభింపజేయాలని వారు చూస్తారు. వారి చేతికి చిక్కిన బ్రిటిష్‌, ఇం‌డియన్‌ అధికారుల మీద దాడి చేస్తారు. సాధ్యమైతే చంపుతారు.)

ఎర్రకోటలో ఐఎన్‌ఎ ‌విచారణ నడుస్తున్న సమయాన ఇండియా వైస్రాయి లార్డ్ ‌వేవెల్‌ ‌బ్రిటన్‌ ‌విదేశాంగమంత్రి లార్డ్ ‌పెథిక్‌ ‌లారెన్స్‌కు బ్రిటిష్‌ ‌కేబినేట్‌ ‌ముందు ఉంచమని కోరుతూ 1945 నవంబరు 6న పంపిన టాప్‌ ‌సీక్రెట్‌ ‌మెమొరాండం లోని అతి రహస్య సమాచారమిది. ఇది ఏదో పత్రికల వార్తలు, ఊహాగానాల ఆధారంగా తెలిసీ తెలియని వ్యక్తి ఏర్పరచుకున్న అభిప్రాయం కాదు. ఇండియాలో బ్రిటిష్‌ ‌సామ్రాజ్య రాజప్రతినిధి, రాజ్యాధినేత అయిన వైస్రాయి తన చేతిలోని ఇంటలిజెన్స్, ‌నిఘా వ్యవస్థల ద్వారా, అత్యంత విశ్వసనీయ వర్గాల నుంచి సేకరించిన సమాచారం. స్వయంగా తానే నెహ్రూను పిలిచి మాట్లాడానని పైన ఉటంకించిన సీక్రెట్‌ ‌మెమొరాండంలో వైస్రాయ్‌ ‌వేవెల్‌ ‌పేర్కొన్నాడు.

మహాత్మాగాంధి మొదలుకుని కాంగ్రెస్‌ ‌ముఖ్యు లందరితో సన్నిహిత సంపర్కం కలిగి, జనరల్‌గా వారి బ్రిటిష్‌ అనుకూల వైఖరి బాగా ఎరిగిన లార్డ్ ‌వేవెల్‌కే అర్జెంటుగా లండన్‌కు మొర పెట్టుకోవాలని పించినంత కంగారు పుట్టిందంటే నెహ్రూ, పటేల్‌ ‌వంటి కాంగ్రెస్‌ అ‌గ్రనాయకులు ఐఎన్‌ఎ ‌విచారణల కాలంలో ఎంత దూకుడుగా మాట్లాడి ఉంటారో ఊహించవచ్చు. ఐఎన్‌ఎను ముందు నిలిపి బ్రిటిష్‌ ‌వారిని వెళ్ళగొట్టేందుకు 1942 కంటే తీవ్రస్థాయిలో కాంగ్రెసువారు పోరాటం చేయబోతున్నారు. రైల్వేలైన్లు విచ్చిన్నం చేసి, ప్రభుత్వ భవనాలు ధ్వంసం చేసి, చేతికి చిక్కిన బ్రిటిష్‌ అధికారులను చంపి, ఆర్మీ, పోలీసులను తమ వైపు తిప్పుకొని బ్రిటిష్‌ ‌సర్కారు పుటం ఆర్పాలనుకుంటున్నారు – అని కాంగ్రెస్‌ ‌వారి ప్రతాపం బాగా ఎరిగిన వైస్రాయికే చెమటలు పట్టాయి. విప్లవం తప్పదని నెహ్రూ స్వయంగా ప్రకటించాడు. హింస అనివార్యమని నేరుగా వైస్రాయితోనే అన్నాడు.

 అన్నీ ఎరిగిన బ్రిటిష్‌ ‌రాజ్యవ్యవస్థకే అంతలా కలవరం కలిగినప్పుడు, కాంగ్రెస్‌ అ‌గ్రనాయకుల వీరాలాపాలను చూసి సాయుధసేనల్లో నేవీ రేటింగ్సు వంటి ఉడుకురక్తపు దేశభక్తులు ఉత్సాహపడి ముందుకు దూకడంలో ఆశ్చర్యమేముంది? 1942 కంటే తీవ్రమైన కల్లోలం, విప్లవం, హింస అంటూ దిక్కులదిరేట్టు గర్జించిన వారు తరవాత ఏమైందో, ఎవరు ఎక్కడ ఎలా నొక్కారో తెలియదుగాని సాదుజంతువుల్లా మారారు. కాంగ్రెస్‌ అం‌డ తమకు ఉందన్న భరోసాతో వారిని నమ్ముకుని విప్లవాన్ని మొదలుపెట్టిన సాయుధదళాల వారిని నట్టేట ముంచారు.

 ‘క్విట్‌ఇం‌డియా’ ఉద్యమం నీరుకారిన తరవాత ఏమి చేయాలో తోచక, పోరాటాలు చేసే శక్తి ఉడిగి ఆరిన చిచ్చుబుడ్లలా ఉన్న కాంగ్రెస్‌ ‌కులశేఖరులకు ఐఎన్‌ఎ ‌విచారణల అంశం అయాచిత వరమైంది. ఆ జాతీయసేనను అందరికంటే ఎక్కువగా అక్కున చేర్చుకుని, వారి డిఫెన్సు బాధ్యత ఎవ్వరూ అడగకుండానే తలకెత్తుకుని నేతాజీ పట్ల, ఆయన స్వాతంత్య్ర సైన్యం పట్ల ప్రజల్లో పెల్లుబుకిన సానుభూతిని తమ రాజకీయ ప్రయోజనాలకు వారు అడ్డంగా వాడుకున్నారు. ఐఎన్‌ఎ, ‌నేతాజీ పేర్లు చెప్పుకుని 1946 ఏప్రిల్‌లో సెంట్రల్‌ ‌లెజిస్లేటివ్‌ అసెంబ్లీకి, రాష్ట్రాల చట్టసభలకు జరిగిన ఎన్నికల్లో అత్యధిక స్థానాలను సంపాదించారు. ఓట్ల అక్కర తీరగానే ఐఎన్‌ఎను కూరలో కరివేపాకులా తీసి అవతల పారేశారు.

 ఎర్రకోట విచారణలో ఐఎన్‌ఎ ‌తరఫున వకాల్తా తీసుకున్న కాలంలోనే జవహర్‌లాల్‌ ‌నెహ్రూ ఐఎన్‌ఎ ‌రిలీఫ్‌ ‌కమిటీ అధ్యక్ష హోదాలో కాంగ్రెస్‌ ‌పార్టీ తరపున 1945 చివరిలో సింగపూర్‌ ‌వెళ్ళాడు. అక్కడ ఆగ్నేయాసియా బ్రిటిష్‌ ‌కమాండర్‌ ‌లార్డ్ ‌మౌంట్‌ ‌బాటెన్‌ను మొదటిసారి కలిశాడు. ( కాంగ్రెసు డిఎన్‌ఎ ‌ను సరిగా అర్థంచేసుకోకుండా వారు చేసే ఉత్తుత్తి చప్పుళ్లను సీరియస్‌గా తీసుకుని అనవసరంగా కంగారుపడిన వేవేల్‌ ‌స్థానంలో-నెహ్రూ సహా అందరినీ ఒడుపుగా మేనేజ్‌ ‌చేయగల మౌంట్‌ ‌బాటెన్‌ ఇం‌డియా చివరి వైస్రాయిగా త్వరలో చార్జి తీసుకోనున్నాడు.) సింగపూర్‌లో నేతాజీ కట్టించిన అమరవీరుల స్మారక చిహ్నాన్ని అప్పటికే మౌంట్‌ ‌బాటెన్‌ ‌డైనమైట్లతో ధ్వంసం చేయించాడు. స్థానిక భారతీయుల కోరిక మీద నెహ్రూ ఆ స్మారక చిహ్న స్థలాన్ని దర్శించదలిచాడు. ‘‘వెళితే వెళ్లండి. కాని అక్కడ గౌరవసూచకంగా పుష్పమాలిక లాంటిది ఏదీ ఉంచవద్దు’ అని ఆజ్ఞాపూర్వక సలహా ఇచ్చాడు మౌంట్‌ ‌బాటెన్‌ ‌దొర. ‘చిత్తం’ అన్నాడు నెహ్రూ. పుష్పగుచ్చమైనా పెట్టకుండానే అక్కడ మొగం చూపించి తిరిగివచ్చాడు. దానికి అక్కడి భారతీయులు నొచ్చుకున్నారు. వారి సెంటిమెంటు కంటే దొర మెహర్బానీ మిన్న అని భావిభారత ప్రధాని తలచాడు.

 ఝాన్సీరాణి రెజిమెంటు వీరనారి కెప్టెన్‌ ‌లక్ష్మి గుర్తున్నది కదా? బర్మాలో నిర్బంధంలో ఉన్న ఆమెను 1946 మార్చిలో రహస్యంగా విమానంలో కోల్‌కతా తీసుకువెళ్లి ‘నిన్ను విడిచిపెడుతున్నాము పొ’మ్మన్నారు. విమానాశ్రయంలో టాక్సీ ఎక్కి ఒంటరిగా వెళుతుంటే టాక్సీ డ్రైవరు ఆమెను గుర్తుపట్టి మీరే కదూ ఝాన్సీ రాణి అని అడిగాడు. యావద్భారతం నేతాజీ, ఐఎన్‌ఎ ‌వీరగాథలకు పరవశించి పోతున్నది అని ఆ సామాన్యుడు అన్నాడు. కాని నెహ్రూ లాంటి అసామాన్యులకు మాత్రం అలాంటి వీరులు పట్టలేదు. ఐఎన్‌ఎ ‌మీద కనీస కనికరం కూడా కలగలేదు.

‘‘కాంగ్రెస్‌ ‌లీడర్లు మమ్మల్ని ఏదో బాలస్కౌట్ల లాగా చూశారు. ‘మిమ్మల్ని మేము కాపాడాం కదా. ఇక బుద్ధిగా ఉండండి. మీరు మేము చెప్పినట్టు నడవాలి. మా సేవ చేయాలి’ అన్నట్టుండేది వారి వరస. నేను, ప్రేమ్‌ (‌లక్ష్మి ప్రేమించి పెళ్ళాడిన ఐఎన్‌ఎ ‌సహచరుడు ప్రేమ్‌ ‌సెహగల్‌. ఎ‌ర్రకోటలో విచారించబడిన ముగ్గురిలో ఒకడు.) కలిసి ఒకసారి నెహ్రూను కలిసాం. ఆయన మా మీద అభిమానం చూపాడు. ‘నేను మీకు చాలానే చేయాలను కుంటున్నాను. ఓపికపట్టి గమ్మునుండండి. యుసీ బ్రిటిషు వాళ్ళు మనకు హాండోవర్‌ ‌చేయబోతున్నారు. ఇప్పుడు నన్ను డిస్టర్బ్ ‌చెయ్యవద్దు. అన్నీ సర్దుకున్నాక మీ సంగతి చూస్తాను ‘ అన్నాడు ఆ మహానుభావుడు.’’ గ్రంథకర్త పీటర్‌వార్డ్ ‌ఫేకు లక్ష్మీ సెహగల్‌ ‌స్వయంగా చెప్పిన ముచ్చట ఇది.

[The Forgotten Army, Peter Ward Fay, p.505]

పోరాటం చేసిన వారికి పోరాటం విలువ తెలుస్తుంది. స్వాతంత్య్రయోధులకు స్వాతంత్య్రం విలువ అర్థమవుతుంది. కాంగ్రెసువారు పోరాటాల బాట వదిలి, మంతనాల దారిపట్టి బ్రిటిషువారి నుంచి అధికారాన్ని అందిపుచ్చుకున్నవారు. కారు తాళాలు కొడుక్కి తండ్రి హాండ్‌ ఓవర్‌ ‌చేసినట్టు అధికారపు తాళం చెవులు తెల్లదొరలు పోతూపోతూ కాంగ్రెసువారికి హాండ్‌ ఓవర్‌ ‌చేశారు. 1947లో వచ్చింది నిజమైన స్వాతంత్య్రం కాదు. అప్పుడు జరిగింది అధికారపు బదలాయింపు (Transfer of Power) మాత్రమే. ఆ సంగతి నొక్కి చెప్పటానికే కాబోలు 1942-47 నడుమ బ్రిటన్‌, ఇం‌డియాల మధ్య రాజ్యాంగ సంబంధాలకు సంబంధించి బ్రిటిషు సర్కారు వెలువరించిన 12 భాగాల అధికారిక పత్రాల సంపుటికి The Transfer of Power 1942-7అని చక్కని పేరు పెట్టారు!

అధికారాన్ని తమ మీదికి బదలాయించుకున్న వారికి ఆ అధికారాన్ని పూర్వపు రీతిలో పూర్వ ప్రమాణాల ప్రకారం వినియోగించవలసిన బాధ్యత ఉంటుంది. 1946 సెప్టెంబరు 2న అధికార స్వీకార సమయంలో ఆరవ జార్జి మహారాజా వారికి, ఆయన వారసులకు, ఉత్తరాధికారులకు నిజమైన విశ్వాసంతో, విధేయతతో సేవించగలమని (‘‘to bear true faith and allegiance to King Emperor George VI and his heirs and successors’’) చేసిన ప్రమాణానికి నెహ్రూ నాయకత్వంలోని ఇంటరిమ్‌ ‌ప్రభుత్వం భేషుగ్గా కట్టుబడింది. ఇంగ్లిషుదొరలకు ఉత్తరాధికారులు కాబట్టి పూర్వ అధికారుల కళ్లతోనే కాంగ్రెసు పాలకులు దేశాన్ని చూశారు. బ్రిటిషు దొరతనానికి నేతాజీ, ఐఎన్‌ఎ అం‌టే గిట్టదు కాబట్టి దానికి విధేయమైన కాంగ్రెసు దొరతనం కూడా నేతాజీ పట్ల, ఐఎన్‌ఎ ‌పట్ల ప్రశస్తమైన శత్రుభావం చూపింది. దేశ స్వాతంత్య్రం కోసం ఐఎన్‌ఎ ‌చేసిన త్యాగాలు, పడిన కష్టాలు బ్రిటిషువారి వారసుల కంటికి సహజంగానే ఆనలేదు. బ్రిటిషు ప్రభుత్వానికి ఎదురు తిరిగి, క్రమశిక్షణ ఉల్లంఘించి తిరుగుబాటు చేయటం వారికి క్షమించరాని మహాపరాధంగా తోచింది.

 పరాధీన జాతికి చెందిన సైన్యానికి విధేయత ప్రమాణాన్ని ఉల్లంఘించి, సర్కారుపై తిరగబడి స్వాతంత్య్రం కోసం పోరాడే హక్కు ఉంటుందని ఐఎన్‌ఎ ‌విచారణల సమయంలో అంతర్జాతీయ న్యాయ సూత్రాలను ఉటంకిస్తూ బల్లగుద్ది వాదించిన కాంగ్రెస్‌ ‌నేతాశ్రీలకు నిజాయతీ, చిత్తశుద్ధి అనేవి ఏ కోశాన అయినా ఉంటే ఏమి చేయాలి? స్వాతంత్య్రం కోసం అష్టకష్టాలు పడి, ప్రాణాలకు తెగించి, ధైర్యంగా పోరాడిన ఐఎన్‌ఎను నిజమైన జాతీయ సైన్యంగా గుర్తించి, స్వతంత్ర భారత మిలిటరీలో తగిన గుర్తింపు ఇవ్వవద్దా? ఆ స్వాతంత్య్రయోధులకు ఇండియన్‌ ఆర్మీలో పూర్వం ఉండిన దానికంటే ఎక్కువ హోదా ఇచ్చి, జీతభత్యాలు ఉదారంగా పెంచి వారు చూపిన శౌర్య పరాక్రమాలకు సముచిత రీతిలో కృతజ్ఞత తెలపవద్దా? మరి కాంగ్రెస్‌ ‌నాయకులు ఏమి చేశారు? ప్రమోషన్లు, ప్రోత్సాహకాల మాట దేవుడెరుగు. ఐఎన్‌ఎ ‌వారిని తిరిగి భారత సైన్యంలోకి తీసుకోవటానికే వారికి మనసొప్పలేదు.

స్వతంత్ర భారత ప్రథమ ప్రధాని అయ్యాక జవహర్‌లాల్‌ ‌నెహ్రూ 1948లో ఒక రోజు జనరల్‌ ‌జేఎన్‌ ‌చౌదురి, జనరల్‌ శ్రీ‌నగేష్‌, ‌రక్షణ శాఖ అధికారి రావులతో సమావేశమయ్యాడు. ఐఎన్‌ఎ ‌వారిని తిరిగి సైనిక కొలువులో చేర్చుకోవాలా వద్దా అన్నది చర్చనీయాంశం. ఐఎన్‌ఎ ‌వాళ్లు ఆర్మీ నుంచి వెళ్లి పోయారు. ఆర్మీమీదే పోరాడారు. కాబట్టి వారిని వెనక్కి తీసుకోవటం కరెక్ట్ ‌కాదు. విజ్ఞత కాదు. దానివల్ల సైన్యం మీద విచ్చిన్నకర ప్రభావం కచ్చితంగా పడుతుంది అన్నారు (జాగ్రత్తగా ఎంపిక చేయబడిన) ముగ్గురూ ముక్తకంఠంతో.

నెహ్రూగారు మెజారిటీ అభిప్రాయాన్ని గౌరవించే గొప్ప ప్రజాస్వామ్య వాది కదా? ‘‘I disagree with your reasons. But I agree with your conclusions’’ (మీరు చెప్పిన కారణాలతో నేను విభేదిస్తున్నాను. కాని మీ అభిప్రాయంతో ఏకీభవిస్తున్నాను) అని సొగసుగా పలికాడు. ‘‘ఐఎన్‌ఎ ‌వారిని ఆర్మీ సర్వీసులోకి తిరిగి తీసుకునేది లేదు. దీనికి కారణం రాజకీయపరమైనది కాదు. సర్వీసులో పెద్ద బ్రేక్‌ ‌వచ్చింది కాబట్టి మానసిక, వాస్తవిక అంశాలను పరిగణనలోకి తీసుకునే ఈ నిర్ణయం చేశాం.’’ అని 1948 మార్చి 28న ప్రధానమంత్రి నెహ్రూ పార్లమెంటులో ప్రకటించాడు. రెండో ప్రపంచ యుద్ధంలో ఐఎన్‌ఎ ఇం‌డియన్‌ ‌సోల్జర్లతో భీకరంగా పోరాడి ఎంతోమందిని చంపింది కాబట్టి వారిని తిరిగి భారత సైన్యంలో చేర్చుకోవటం భావ్యం కాదు అని కూడా నెహ్రూ పండితుడు పలికాడు.

[The Man India Missed The Most, Bhuvan Lall, p. 374]

అంటే భారత సైన్యం అనేది బ్రిటిషు సర్కారుకు విధేయమైనది. బ్రిటిషు సర్కారుకు నమ్మకంగా కట్టుబడి కిరాయి సైనికుల్లా పనిచేసిన వారికి మాత్రమే అది హక్కు భుక్తమైనది. భారత దేశ స్వాతంత్య్రం కోసం అయినా సరే ఆ కిరాయి సైనికుల మీద పోరాడటం, వారిని చంపటం మహానేరం. అటువంటి నేరగాళ్ల ‘ఇండియన్‌ ‌నేషనల్‌ ఆర్మీ’ని ఇండియన్‌ ఆర్మీలోకి ఎంతమాత్రం అనుమతించ కూడదు. ఇదీ బ్రిటిషువారి ఉత్తరాధికారి అయిన నెహ్రూగారి స్వామిభక్తి పూర్వక (అ)ధర్మ నిర్ణయం.

పాకిస్తాన్‌కు తరలిపోయిన హబిబుర్‌ ‌రహమాన్‌ను అక్కడి ప్రభుత్వం నెత్తిన పెట్టుకుని పాక్‌సైన్యంలో పెద్ద హోదా ఇచ్చింది. ప్రెసిడెంట్‌ ఆయుబ్‌ఖాన్‌ అతడికి మంచి ప్రాధాన్యం ఇచ్చాడు. బ్రిగేడియర్‌గా రిటైర్‌ అయ్యాక కూడా రహమాన్‌కు సివిల్‌ ‌పదవులు లభించాయి. ఇండియాలో నిలిచిపోయిన అతడి సహచరులు మాత్రం దేశానికి అందించిన సైనిక సేవకు ప్రతిఫలంగా భారత సైన్యం నుంచి బహిష్కృతులై ఉసూరుమన్నారు.

 నిజానికి హబీబుర్‌ ‌రహమాన్‌ ‌పాకిస్తాన్‌కు తరలిపోయింది జిన్నా మీద భక్తితో కాదు. వేరే దారి లేక. ఐఎన్‌ఏలో పాకిస్తాన్‌కు సంక్రమించిన ప్రాంతాలకు చెందినవారు తమకు భారతదేశంలో ఉండి భారతదేశానికి సేవ చేసే అవకాశం ఇవ్వ వలసిందని మహమ్మద్‌ ‌జమాన్‌ ‌కియానీ, హబీబుర్‌ ‌రహమాన్‌ల నాయకత్వంలో నెహ్రూను సామూ హికంగా అభ్యర్థించారు. ఆ మహానుభావుడు వారి కోరికను కొనగోటితో తోసిపుచ్చాడు. వద్దు మీరు పాకిస్తాన్నే మీ దేశంగా భావించి దానికే సేవ చేయండని నెహ్రూ వారికి ఉచిత సలహా ఇచ్చాడు. ఈ సంగతి 2000 జూన్‌14 ‌న ‘దైనిక్‌ ‌జాగరణ్‌’ ‌పత్రిక ప్రచురించిన ఇంటర్వ్యూలో ఝాన్సీ రాణి రెజిమెంట్‌ ‌నాయిక లక్ష్మీ సెహగల్‌ ‌వెల్లడించింది.

స్వాతంత్య్రం కోసం వీరోచితంగా పోరాడి ఎనలేని త్యాగాలు చేసిన ఆజాద్‌ ‌హింద్‌ ‌ఫౌజ్‌ ‌వీర సైనికులకు స్వతంత్ర భారత సైన్యంలో సూదిమోపిన స్థలాన్ని కూడా నెహ్రూ ప్రభుత్వం అనుమతించలేదు. ఆఖరికి స్వాతంత్య్ర యోధులుగా గుర్తింపునకు కూడా 1972 వరకూ ఐఎన్‌ఎవారు నోచుకొనలేదు. ఆఫీసులలో గాని, ఆర్మీ మెస్సులలో, కాంటీన్లలో గాని, క్వార్టర్‌ ‌గార్డులలో గాని, యూనిట్‌ ‌లైన్లు, రిక్రియేషన్‌ ‌రూముల్లో, బహిరంగ స్థలాల్లోగాని నేతాజీ చిత్రపటాన్ని ప్రదర్శించటానికి వీల్లేదని 1949 ఫిబ్రవరి 11న సర్కారు ఉత్తర్వు చేసింది. నేతాజీకి, ఐఎన్‌ఎకి సంబంధించిన ముఖ్య దినాలను వేడుకగా చేసుకోవటం అసలే కూడదంది. ఆకాశవాణి ప్రసంగాలలో ఐఎన్‌ఎ, ‌నేతాజీల ఊసు ఎక్కడా ఎత్తకూడదని వక్తలను అధికారులు కట్టడి చేసేవారు.

నేతాజీ త్యాగం, అద్భుత పరాక్రమం వల్ల, వేలాది ఐఎన్‌ఎ ‌దేశభక్తుల శౌర్యం వల్ల సిద్ధించిన స్వాతం త్య్రాన్ని, దానివల్ల వచ్చిన అధికారాన్నేమో తేరగా అనుభవిస్తారు. ఆ స్వాతంత్య్రానికి కారణభూతులైన వీర సైనికులకు సముచిత గౌరవం, ప్రోత్సాహం ఇచ్చే విషయంలోనేమో పక్కా బ్రిటిష్‌ ఏజెంట్లలా వ్యవహరిస్తారు. కాంగ్రెస్‌ ‌ప్రభువుల కృతఘ్నతను తెగనాడటానికి మాటలు చాలవు. అందుకే ఇండియన్‌ ‌నేషనల్‌ ఆర్మీని Ignored National Armyగా అభివర్ణించాడు పైన పేర్కొన్న గ్రంథకర్త భువన్‌లాల్‌. ‘One man sowed and others reaped after him’ (ఒకరు విత్తనాలు వేశారు. వేరొకరు పంట కోసుకున్నారు.) అని బాధపడ్డాడు బర్మా పూర్వ ప్రధాని బామా.

ఏమీ చేయకపోతే ఏడ్చిపోతారుకదా? అందుకని దయగల నెహ్రూ కన్సొలేషన్‌ ‌కింద తనకు విధేయత ప్రకటించిన కొందరు ఐఎన్‌ఎవారికి విదేశీ కొలువు ఇచ్చాడు. ఆబిద్‌ ‌హసన్‌ను డెన్మార్క్‌కు, మెహబూబ్‌ అహ్మద్‌ను కెనడాకు, సిరిల్‌ ‌జాన్‌ ‌స్ట్రేసీని నెదర్లాండ్స్‌కు, ఎన్‌ఏ ‌రాఘవన్‌ను స్విట్జర్లాండ్‌కు రాయబారులుగా పంపాడు. మొత్తానికి ఎవరూ ఇండియాలో ఉండకుండా జాగ్రత్తపడ్డాడు. షా నవాజ్‌ఖాన్‌ ‌కాంగ్రెస్‌ ‌పార్టీలో చేరాడు. కేంద్రంలో మంత్రి కూడా అయ్యాడు. అలాగే మేజర్‌ ‌జనరల్‌ ‌భోంస్లే కూడా.

 1949లో విఖ్యాత చరిత్రకారుడు ప్రతుల్‌ ‌చంద్రగుప్తా ఐఎన్‌ఎ ‌చరిత్ర రాయటానికి ఆధికారికంగా నియమితుడయ్యాడు. 950 గవర్నమెంటు ఫైళ్లను శోధింఛి, ఎక్కడెక్కడి ఐఎన్‌ఎ ‌వారితోనూ మాట్లాడి మూడేళ్లు కష్టపడి INA In Military Operation పేర అతడు 490 పేజీల రాతప్రతి దాఖలు చేశాడు. ఏ అదృశ్య శక్తి అడ్డుపడిందో గాని అది ప్రచురణకు నోచుకోలేదు. రక్షణ శాఖ అటక మీద దాని స్వారస్యాన్ని చెదలు ఎప్పుడో ఆస్వాదించి ఉంటాయి.

 నేతాజీ పేరు, ఐఎన్‌ఎ ఊసు భారత సైన్యంలో ఎక్కడా కనపడకూడదని నెహ్రూ సర్కారు ప్రశస్తమైన కట్టడి చేసింది. సర్కారుకు విశ్వాసం లేకపోయినా ప్రజలు ఆజాద్‌ ‌హింద్‌ ‌ఫౌజ్‌ను మరవలేదు. నేతాజీ పట్ల భక్తిభావంతో నగరాలలో బస్సులు, ట్రాము బండ్లలో చాలామంది కండక్టర్లు ఐఎన్‌ఎ ‌వారి దగ్గర చార్జీలు తీసుకునేవారు కాదు. రెస్టారెంట్లు, హోటళ్లలో వారి దగ్గర బిల్లు వసూలు చేసే వారుకాదు. మణిపూర్లోని మొయిరాంగ్‌లో ఐఎన్‌ఎ ‌భారత భూభాగంపై సగర్వంగా త్రివర్ణపతాకం ఎగరేసిన చోట నేతాజీ స్ఫూర్తికి, ఐఎన్‌ఎ ‌శక్తికి దృష్టాంతంగా ఇప్పటికీ ఒక స్మారక చిహ్నం ఉన్నది. భారతదేశంలో నగరాలు, పట్టణాల్లోనే కాదు మారుమూల గ్రామాల్లో కూడా నేతాజీ విగ్రహం, ఆయన పేరిట ఒక కూడలి లేకుండా ఉండవు.

చివరగా ఒక ముచ్చట. ఇంఫాల్‌ ‌యుద్ధంలో ఓడిపోయాక ఒకరోజు సుభాస్‌ ‌చంద్రబోస్‌ను కల్నల్‌ ‌గురుబఁ్‌ ‌సింగ్‌ ‌ధిల్లాన్‌ ఓ ‌చిలిపి ప్రశ్న వేశాడు:

‘‘అద్భుతమేదో జరిగి పరిస్థితి మనకు అనుకూ లమై మనం విజయవంతంగా దిల్లీ చేరి ఎర్రకోటలో విక్టరీ పెరేడ్‌ ‌పెడతామనుకోండి. మహాత్మాగాంధీగారు పూర్వం దక్షిణాఫ్రికాలో వలె మిలిటరీ యూనిఫాం, టాప్‌ ‌బూట్లు ధరించి మన సైనిక వందనం అందుకోవటానికి అక్కడికి వస్తారా?’’

తన హాస్య చతురతకు నాయకుడు నవ్వుతాడని ధిల్లాన్‌ అనుకున్నాడు. కాని నేతాజీ సీరియస్‌గా ఒక చూపు చూసి ‘‘నో! నెవ్వర్‌! ‌బాపూజీ మొదట ప్రపంచ సంస్కర్త. ఆ తరవాతే భారతీయ నాయకుడు. అదీ భారతదేశంలో పుట్టిన కారణం చేత. అహింసా తత్వాన్ని ప్రపంచానికి ప్రభోదించటం ఆయన జీవిత పరమార్థం. ఆయన దానిని ఎప్పటికీ విడనాడడు.’’ అన్నాడు. మళ్లీ ఒక క్షణం ఆగి ‘‘బాపూజీ కావాలను కుంటే నాకు వ్యతిరేకంగా రేడియోలో మాట్లాడగలడు. కాని ఆయన ఎప్పుడూ ఆ పని చేయలేదు. మౌనంగా ఉండటమే ఆయన మనకు చేసిన గొప్ప సహాయం’’ అని కృతజ్ఞత వ్యక్తపరిచాడు.

‘‘మరి ఒకవేళ మనం గెలిస్తే జవహర్‌లాల్‌ ‌నెహ్రూగారి స్పందన ఎలా ఉంటుంది?’’ అని అడిగాడు ధిల్లాన్‌.

‘‘‌పండిట్జీ?! ఆయనకు హింస, అహింసల జంజాటం లేదు. మనం గెలిచినా ఓడినా ఆయన మనల్ని స్వాగతించవచ్చు. లేదా వ్యతిరేకించనూ వచ్చు. ఆ సమయానికి తనకు ఏది మంచిది అనుకుంటే అది చేసే రకం ఆయన’’ అని నెహ్రూ నైజాన్ని ఒక్క ముక్కలో చెప్పాడు బోస్‌.

‘‘ఇప్పుడు నేను వెనక్కి తిరిగి చూస్తే ఆ మనిషి అంతరంగాన్ని నేతాజీ ఎంత చక్కగా పోల్చుకున్నాడా అని ఆశ్చర్యం వేస్తుంది. మేము ఓడిపోయినప్పటికీ జవహర్‌లాల్‌ ‌నెహ్రూ మమ్మల్ని రిసీవ్‌ ‌చేసుకోవటానికి ఎర్రకోటకు వచ్చాడు. బారిస్టర్‌ ‌గౌను తొడుక్కుని మిలిటరీ కోర్టులో మా డిఫెన్సుకు కాంగ్రెసు నియ మించిన న్యాయదిగ్దంతుల సరసన కూచున్నాడు. తనకు అవసరం అనుకున్నప్పుడు మమ్మల్ని ఆకాశానికి ఎత్తాడు. ఆయన పేరిట మేము నెహ్రూ బ్రిగేడ్‌ ‌నడిపాం. అయినా ఆయనకు కనికరం లేదు. అధికారం చేతికందాక మాతో అవసరం లేదను కున్నాడు. ఇక మా సంగతి పట్టించుకోలేదు. నెహ్రూకు ప్రిన్సిపుల్స్‌తో పనిలేదు. ఎంత సేపూ పవరు మీదే యావ.’’ అంటాడు తన ఆత్మకథ (From My Bones)లో జిఎస్‌ ‌ధిల్లాన్‌. (‌పే. 223-224)

 మిగతా వచ్చేవారం

About Author

By editor

Twitter
Instagram