చిరునవ్వు మోము, సునిశిత చూపు కలగలిస్తే మాధవి. ఆ పేరు వినగానే ఇప్పుడు అందరి మదిలోనూ మెదిలేది సెబీ. సెక్యూరిటీస్‌, ఎక్స్ఛేంజ్‌ ‌బోర్డు ఆఫ్‌ ఇం‌డియా. అదే వాణిజ్య నిర్వహణ వ్యవస్థకి నూతన అధినేత్రి మాధవి! సెబీ అంటే కేపిటల్‌ ‌మార్కెటింగ్‌ ‌నియంత్రణ సంస్థగా ఎంత పేరో, కమ్రబద్ధీకరణను అది ఎంతగా సాధిస్తుందో అందరికీ తెలుసు. ఇటువంటి సంస్థకు సరికొత్తగా అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన భారతీయ మహిళామణి. మూడేళ్ల పదవీ కాలంలో ఎంతగానో పురోగతికి కారకురాలవుతారని సారథ్య పగ్గాలు అప్పగించిన కేంద్ర ప్రభుత్వానికీ ఆమె పట్ల ప్రగాఢ నమ్మకం.

సుప్రసిద్ధ బ్యాంకులో సాధారణ ఉద్యోగినిగా చేరిన మాధవి పురీ బచ్‌ ‌చూస్తుండగానే అంచెలంచెల పదోన్నతులను సొంతం చేసుకున్నారు. ఇరవై ఏళ్లుగా అక్కడే పలు తరహా విధులను జయప్రదంగా నిర్వర్తించిన అనుభవశీలికదా మరి! ఆ బ్యాంకు సెక్యూరిటీస్‌కే మేనేజింగ్‌ ‌డైరెక్టర్‌గా, ప్రధాన కార్య నిర్వహణాధికారిణిగా వన్నె తెచ్చిన నారీ శక్తి. ప్రతిష్ఠాత్మక పదవిలో వ్యవహారదక్షగా వనితారత్న నియామకం సహజంగానే మహిళల ఆత్మ విశ్వాసాన్ని శిఖర సమానం చేస్తుంది, చేస్తోంది. నిజానికి సెబీలో మాధవి జైత్రయాత్ర ఏళ్లనాడే మొదలైంది. అందులో సంపూర్తి కాల సభ్యురాలైన మొదటి ముదితగానూ ఆమెదే రికార్డు. ప్రైవేటురంగం నుంచి ఎంపికైన ప్రథమురాలూ తానే. సాంకేతిక వనరుల ప్రధాన సంఘాన్ని నియమించినప్పుడు, ముందస్తుగా నాయకత్వ బరిలోకి దిగిందీ ఆ సాహసికురాలే! మాధవికి నేతృత్వ కిరీటం అనేక దశలు దాటి లభించింది. నియామక కమిటీ అనేక సంప్రదింపులు సాగించాకే, జాబితాలను పక్కాగా రూపొందించాకే, ఆమె పేరు ప్రధాని ఆధ్వర్యంలోని బృందానికి వెళ్లింది. యాభై ఏడేళ్ల మాధవి ఎంపిక అందునా సెబీ మూడున్నర దశాబ్దాల చరిత్రలో ఒక సంచలనమే!

ఆర్థిక విపణిలో ఆనుపానులు తెలుసుకోవడం మాధవికి కొట్టిన పిండి. సూచనలు, సలహాలు సకాల చర్యలతో ముందుకు దూసుకెళ్లడం తొలి నుంచి ఓ క్రీడాకృత్యం. డిగ్రీ పొందాక గుజరాత్‌కు చేరి, బిజినెస్‌ అడ్మినిస్ట్రేషన్‌లో మాస్టర్‌ అయ్యారు. ముందుగా బ్యాంక్‌లో చేరారు 1989లో. అక్కడే ఎగ్జిక్యూటివ్‌ ‌డైరెక్టర్‌ ‌స్థానాన్ని అలంకరించారు. సింగపూర్‌ ‌వంటి విదేశాలకీ వెళ్లి వచ్చారు. కన్సల్టెన్సీ సేవలను విస్తృతం చేయడం, తన వంతుగా సంస్థల వ్యవస్థాపన కూడా సాకారమయ్యేలా చూడటం, చక్కని మైలురాళ్లు. తాను మరువలేని ఎన్నటికీ మరపురాని సందర్భం మటుకు పుష్కరం క్రితం చోటుచేసుకుంది.

 అప్పట్లో ముంబయి (సెబీ ప్రధాన కార్యాల యమూ ఆ మహానగరంలోనే) హోటలు మీద ముష్కరులు తెగబడినప్పుడు, లోపల గదుల్లో చిక్కుకున్న ప్రముఖుల్లో ఆమె కూడా ఉన్నారు. గంటల తరబడి కొనసాగిన భయోద్విగ్న వాతావరణం, అప్పుడు అక్కడి స్థితిగతుల పర్యవసానం ఉగ్రవాదం వికృత నర్తనను కళ్లముందు నిలిపిందని ఇప్పటికీ చెబుతుంటారు. ఎంత క్లిష్టత తాండవించినా, దుర్మార్గం విషకోరలు చాచినా, చెక్కు చెదరక ఎదిరించి గెలవాలన్న జగజ్జెట్టి పట్టు తనలోనూ పెరిగిందంటారు. సామాజిక సమస్యల మీద తక్షణం స్పందించే స్వభావం తనది. ఎప్పుడూ ఆర్థిక విధానాలు, ఒడిదుడుకులు, వాటి విశ్లేషణలు, పెట్టుబడుల తీరు తెన్నులు, నిర్వహణ పద్ధతుల్లో మార్పు చేర్పులు-వీటి గురించే నిపుణుల ఆలోచనలు పరిభ్రమిస్తుంటాయి. మాధవి సైతం అంతే. కాకుంటే, మానసిక మథనం ఎంతలా కొనసాగుతున్నా మరో కోణంలో సమకాలీన అంశాలూ మెదడు నిండా ఆవరించి ఉంటుంటాయి. సమయ సందర్భాల్నిబట్టి కొన్నిసార్లు కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పదంటా రీమె. ‘నా కటువు నైజం సమస్యల సత్వర పరిష్కారానికి దోహదపడితే, అంతకుమించి నేను కోరుకునేది మాత్రం ఇంకేం ఉంటుంది’ అంటుం టారు. ఈ మాటలు చాలవా ఆమె అంతరంగ తరంగాల ధాటిని మనముందు ఉంచడానికి? ఇంతటి పారదర్శకత ఉండబట్టే, అపూర్వ సదవకాశం నేరుగా ఆమెనే వెదుకుతూ వచ్చింది.

ప్రశ్నించడమే అలవాటు

ఏదైనా అనుకుంటే వెంటనే ప్రశ్నించేతత్వం మాధవిలో ఢిల్లీ చదువుల నాటి నుంచే ఉంది. అక్కడే డిగ్రీ చదువుతున్నప్పుడు. రోజులో అత్యధిక భాగం పుస్తకాలు, చర్చలతోనే గడుపుతారు. సమయాను సారంగా ప్రశ్నల్ని సంధించే తన చొరవ సహమిత్రుల్ని ఎన్నోసార్లు అబ్బురపరిచేది. ఎంత సూటిగా అడిగేవారో, ఎదుటివారి సమాధానాల్ని, స్పందనల్ని అంతే శ్రద్ధగా ఆలకించేవారు. ఈ అలవాటే ఘన విజయాలకు పూలబాట పరిచిందని వేరే చెప్పాలా? ఎన్ని కీలక పదవులను అంది పుచుకున్నా, ఎంతెంత ఎత్తుకు ఎదిగినా, అంతగానూ ఒదిగి ఉండటం ఆమె ఘనతల్లో మరొకటి. చైర్‌ ‌పర్సన్‌గా నియామకం కావడమన్నది తన ఒక్కరి గొప్పతనం కాదని, అదంతా సహ ఉద్యోగులకు చెందుతుందని అంటున్న ప్పుడు ఆ స్వరంలో ధ్వనించింది సగర్వమే. ఇంతటి గౌరవ ప్రతిపత్తి దేశంలోనే ప్రథమమని ఆర్థిక నిపుణులు, విశ్లేషకులు వ్యాఖ్యానించడాన్ని శిరసు వంచి స్వీకరించారామె.

ఎప్పటికప్పుడు మారిపోతూ ఊహకైనా అంద నంత వేగాన్ని పుంజుకుంటూ ఉంటాయి మార్కెట్లు. ఎప్పుడు హెచ్చుతాయో, ఇంకెప్పుడు మారతాయో ఎవరి అంచనాలకూ అందేవి కావవి. అటువంటి కీలకస్థితిని గమనించుకుంటూ భావతీవ్రత పరంగా మహిళగా ఆమె ముందుకు వెళ్ళగలరా అనే ప్రశ్న ఎక్కడా వినిపించలేదు. దీనికి ముఖ్య కారణం ఒక్కటే – సవాళ్లను నవ్వుతూ స్వీకరించే మాధవి మనస్తత్వం. ఉక్కిరి బిక్కిరి కలిగించి నిలువునా ముంచెత్తే పరిణా మాలను ఎంతవరకు నిభాయించగలరన్న మాటా ఎటు నుంచీ ఎదురవలేదు. మునుపటి బాధ్యుల వయస్కులతో పోలిస్తే, ఈమె పిన్న వయస్కురాలు. అందరినీ ఆశ్చర్యచకితం చేసేంత సమయోచిత ప్రజ్ఞ ఆ నిపుణురాలి నిండు గుణం. మూలసంస్థ ఉపశాఖలు దేశ రాజధాని నగరంతోపాటు పశ్చిమ బెంగాల్‌, ‌తమిళనాడు, గుజరాత్‌లలో నెలకొన్నాయి. చిరకాంగా అధ్యక్షునిగా ఉంటున్నవారి తదుపరి స్థానం మాధవిదే. ఇప్పటికే బాధ్యతలను స్వీకరించిన ఆమె ప్రతిరోజూ తనకు అమూల్యమేనంటారు. విధి నిర్వహణ తప్ప తన మదిలో మరి ఏ విధమైన ఆలోచనలకీ తావు ఉండదని ఘంటాపథంగా చెప్తుంటారు. అదీ ఆమె నిబద్ధత, చిత్తశుద్ధి.

ఇంకెంతో చురుకైపాత్ర

ప్రత్యేక చట్ట నిబంధనల ప్రకారం ఏర్పాటైన సెబీ భారత ఆర్థిక మంత్రిత్వశాఖ పరిధిలోనిదే. అనుబంధ ఏజెన్సీలుగా నాలుగు-అధికార బాధ్యతలు నిర్వహిస్తూ వస్తున్నాయి. ప్రాంతీయ కార్యాలయాలకు తోడు మరో మూడు రాష్ట్రాల్లో స్థానిక విభాగా లున్నాయి. పలు నిధులు, చిట్‌ఫండ్‌-‌సహకార సంస్థలు, వాటితోపాటు ఉమ్మడి పెట్టుబడి వ్యవహా రాలన్నీ మూల వ్యవస్థ అధీనంలో ఉంటుంటాయి. 1988 మొదలు ఇప్పటిదాకా తొమ్మిదిమంది అధ్యక్షులుగా వ్యవహరించారు. పదోవారుగా మాధవి ఏకైక మహిళా నేతగా చరిత్ర కర్త. సెక్యూరిటీల్లో పెట్టుబడిదారుల ప్రయోజనాలను పరిరక్షించడం, అన్ని విధాలా తోడు నిలవడం సంస్థ ప్రధాన కర్తవ్యం. విపణుల అభివృద్ధి, పలురీతుల్లో నియంత్రణ, అవసరాలకు దీటుగా స్పందించడం తదితర బాధ్యతలు. కొంత పాక్షికంగానైన శాసన, కార్య నిర్వాహక, న్యాయసంబంధిత అధికారాలను సెబీ నిర్వహిస్తుంది. ఆర్థికపరమైన మధ్యవర్తుల ఖాతాల వివరాలను ఎలాగూ తనిఖీలు చేస్తూనే ఉంటుంది. అనేక సంఘాల సహాయ సహకారాలతో విస్తృత రీతిన వ్యవహరిస్తుంది. ఎటువంటి పరిస్థితు ల్లోనూ సంస్కరణలను ప్రవేశపెట్టి విజయ వంతంగా అమలు చేయడంపైనే దృష్టిసారిస్తా మంటున్నారు నూతన అధ్యక్షు రాలు. నియమ నిబంధనల నిర్మాణంలో మరింత చురుకైన పాత్ర వహిస్తామని భరోసా నిస్తున్నారు. తమ వ్యవస్థ ప్రయోజకత్వం, ప్రాధాన్యం ఆర్థికమాంద్య వేళల్లో ఎంతైనా ప్రస్ఫుట మవుతుందని చెబుతు న్నారు. అది వాస్తవమన్నది ఆయా సందర్భాల్లో రుజువవుతూనే వచ్చింది మరి. ఒకటీ రెండూ కాదు… సెబీకి పాతికవరకూ విభాగా లుండటంతో, దేశీయ ఆర్థిక విపణి నియంత్రణ సాధ్యమవుతోంది. వీటిల్లో సాధారణ సేవలు, మానవ వనరులు, సమాచార సాంకేతికం, విచారణలు, దర్యాప్తులు, పర్యవేక్షణలు, అంతర్జాతీయ వ్యవహా రాలు, ఇలా అనేకం పనిచేస్తున్నాయి. అన్నింటా నడుమా సమన్వయ సహకారాల కల్పనకే అధిక ప్రాధాన్య మివ్వాలన్నది మాధవి నాటి ఆలోచన, నేటి సమాచారణ. క్రియాశీలురాలు కాబట్టి, ఆమె చేపట్టే చర్యలపైనే మార్కెట్లు దృష్టి కేంద్రీకరిస్తున్నాయి.

బహుముఖ ప్రతిభ

రోజులకిందటే పదవీ స్వీకారం చేసిన మాధవికి ప్రాధన్యాలతోపాటు సంస్థాగత అవసరాల అవగాహన బాగా ఎక్కువ. ఇండియన్‌ ‌స్కూల్‌ ఆఫ్‌ ‌డెవలప్‌మెంట్‌ ‌మెనేజ్‌మెంట్‌ ‌వంటి పలు పెద్దసంస్థలకు నాడు స్వతంత్ర సలహాదారు కనుక పూర్వాపరాలు గమనింపు పుష్కలం. కార్య నిర్వాహకానికి అదనంగా విభిన్న సంస్థలెన్నింటికో డైరెక్టర్‌ ‌బాధ్యతలు వహించి తన ప్రతిభా సామర్థ్యాలను ఎక్కడికక్కడ రుజువు చేసుకున్నారు. సృజనాత్మకత ఆలోచనలకు పెద్దపీట వేసే ఈ ఉత్సాహవంతురాలు సంబంధిత సంప్రదింపుల మండళ్లకీ ప్రాతినిధ్యం వహించిన అనుభవశీలి.

ప్రజలకు ఆరోగ్య భాగ్యం కలిగించేలా, ప్రధానంగా క్యాన్సర్‌ ‌వ్యాధి బెడదను వదిలించేలా ఒక ప్రత్యేక కార్యాచరణ విభాగాన్ని సహ నిర్మాతగా రూపొందించారీమె. ఎటువంటి లాభాపేక్ష లేకుండా, దాదాపు దశాబ్దకాంగా తన సేవలందించిన కరుణామయి. విద్యారంగానికీ తనవంతు చేయూత నందిస్తూ సామాజిక సేవలో దూసుకెళుతున్నారు. మరింత ఆసక్తికర సమాచారం ఇంకొకటుంది. బోధనను ఇష్టపడే ఆ ప్రతిభాన్విత ఎంతోకాలం బిజినెస్‌ ‌పాఠాలు చెప్పి యువతలో వాణిజ్య ఆసక్తిని పెంపొందించారు. వాటి గురించి విద్యార్థినీ విద్యార్థులు ఇప్పటికీ గుర్తు చేసుకుంటూనే ఉంటారు. ఇంతకీ మీకు నచ్చిన సూక్తి ఏమిటని పాత్రికేయులు అడిగితే ఆమె ఏమని బదులిచ్చారో తెలుసా? ‘సవాళ్ళకు జంకి వెనకడుగు వేయడంకాదు. అవే సవాళ్లకు ఎదురు నిలిచి; గెలిచేదాకా పరిశ్రమించ డమే జీవితం’. దీన్ని బట్టి మనందరికీ ఇంకా బాగా అర్థమవడం లేదూ..నిరంతర కృషికి మారుపేరు మన మాధవేనని!

By editor

Twitter
Instagram