ఎన్‌డీయే ప్రభుత్వం వచ్చిననాటి నుండి వ్యవసాయమే ప్రధానమైన మన దేశంలో ఆ రంగానికి ప్రత్యేక ప్రాధాన్యమిస్తూ పలు పథకాలతో దేశ ఆర్థిక ప్రగతికి దోహదం చేస్తున్నది.  రకరకాల పథకాలను అమలు చేయడం వల్ల  అటు వ్యవసాయోత్పత్తులు గణనీయంగా పెరగటమే గాక, ఆహారోత్పత్తులు రికార్డు స్థాయిలో పెరుగుతుండటం విశేషంగా చెప్పుకోవాలి. ఇందుకు పథకాల ద్వారా ప్రభుత్వం అందిస్తున్న సహాయ సహకారాలు, రైతుల నిర్విరామ కృషి కారణం. కరోనా కాలంలో పలు దేశాల ఆర్థిక స్థితిగతులు ఛిన్నాభిన్నమైనప్పటికీ  వ్యవసాయమే ప్రధానవృత్తిగా ఉన్న భారతదేశంలో  ఆర్థిక సుస్థిరతకు దోహదం చేసే పరిస్థితులే కొనసాగాయి.

ఈ సంవత్సరం కూడా వ్యవసాయ రంగాన్ని బడ్జెట్‌ ‌చల్లగానే చూసింది.  గత సంవత్సరం కన్నా (1.48 లక్షల కోట్లు) మిన్నగా 1.76 లక్షల కోట్లకు కేటాయింపులు పెంచడం వ్యవసాయరంగాన్ని ముందుకు నడిపించేందుకు తీసుకున్న చర్యే. ఇప్పటికే అమలులో ఉన్న పలు పథకాలను సమర్థవంతంగా అమలుచేసేందుకు తగిన నిధులను కేటాయిస్తూ, కొన్ని అంశాలకు  ప్రాధాన్యం పెంచి, అమలు చేసేందుకు తగినన్ని నిధులు అదనంగా కేటాయించడం వ్యవసాయరంగం పట్ల  ప్రభుత్వ చిత్తశుద్ధిని తెలియజేస్తుంది.

భారతీయుల వ్యవసాయం పురాతనమైనది. వేల సంవత్సరాలుగా  ప్రకృతితో మమేకమై సాగేది. పర్యావరణాన్ని, నేలతల్లిని సురక్షితంగా ఉంచుకుంటూ భూసారాన్ని రక్షించుకుంటూ ఆరోగ్యకరమైన వ్యవసాయోత్పత్తులను పొందడమే ధ్యేయంగా సేద్యం జరిగేది.  కానీ జనాభా పెరుగుదలతో కొన్ని కొత్త పరిణామాలు సంభవించాయి. రసాయనిక ఎరువులు, పురుగుమందుల వినియోగం, తక్కువ శ్రమతోనే అధికోత్పత్తులు సాధించాలన్న మోజు బాగా పెరిగాయి. ప్రజారోగ్యానికి, భూసార క్షీణతకు, పర్యావరణానికి, మున్ముందు మానవ మనుగడకే ముప్పు ముంచుకొస్తున్నది.

ఈ విషయాలన్నింటిని దృష్టిలో ఉంచుకుని, పర్యావరణానికి, భూ సంక్షేమానికి (భూసారానికి), రసాయన రహిత వ్యవసాయ ఉత్పత్తుల సాధనకు దోహదపడే విధంగా అనాదిగా అమలులో ఉన్న సహజ వ్యవసాయ పద్ధతులను, వాతావరణ పరిస్థితులకు అనువైన విధంగా ఆయా ప్రాంతాలలో మేలైన సాంకేతిక పద్ధతులను రూపొం దించి అమలు చేసేందుకు బడ్జెట్‌ ‌కేటాయింపుల ద్వారా దిశా నిర్దేశం చేయటం ముదావహం. ఈ దిశగా గతంలోనే కృషి సంచాయి యోజన ద్వారా నిధులు కేటాయించారు.

గంగాతీరం, ఇతర ప్రాంతాల్లో రసాయన రహిత, సహజ వ్యవసాయ పద్ధతుల ప్రదర్శనలు చేపట్టి, రైతుల చేత అమలుచేసేందుకు ఈ బడ్జెట్‌లో కేటాయింపులు పెంచి, దిశా నిర్దేశం చేశారు. ఇప్పటికే మనం వ్యవసాయోత్పత్తులలో, ముఖ్యంగా ఆహారోత్పత్తులను హెచ్చు పరిమాణంలో పొందు తున్నాం. అందుచేత•, నాణ్యతాపరంగాను, రసాయన రహితంగా, ఆరోగ్యదాయకంగా ఉంటాయి గనుక, ఆదాయం పెరిగి, రైతుల ఆర్థిక సుస్థిరతకు, ఆరోగ్యకరమైన జీవనానికి, అనువైన పర్యావరణానికి దోహదపడే విధంగా ప్రభుత్వం దిశానిర్దేశం చేసిందని గమనించాలి.

చిరుధాన్యాలు మంచి పోషక విలువలు కలిగినవిగా గుర్తింపు పొందాయి. వాటిని ప్రభుత్వం ‘సిరిధాన్యాలు’గా పేర్కొంటున్నది కూడా. వాటి సాగును ఇతోధికంగా ప్రోత్సహించేందుకు 2023ను ‘జాతీయ’ సిరిధాన్యాల సంవత్సరంగా ప్రకటించారు. వీటి సాగు విస్తరణకు విత్తనాల పంపిణీ నుండి మార్కెట్‌ ‌సౌకర్యాలను కల్పించే వరకు పలు ప్రోత్సాహకాలు అందించేందుకు సంకల్పిం చటం స్వాగతించవలసిందే. సిరిధాన్యాలు ప్రధానంగా మెట్ట ప్రాంతాల్లో తక్కువ వర్షాపాతం ఉన్న చోట్ల పండిస్తారు. గనుక వీటిని అధికంగా సాగు చేసి, మంచి దిగుబడులు సాధిస్తే, అధిక ధరలు లభిస్తాయి. మెట్ట/వర్షాధారిత ప్రాంత రైతులకు కూడా లబ్ధి చేకూరుతుంది. సిరిధాన్యాల నుండి పలు ఉప ఉత్పత్తులను సాధించి, విక్రయించటం ద్వారా కూడా రైతులకు/ మహిళా రైతులకు అదనపు ఆదాయం వచ్చే వీలుంది.

ఈ బడ్జెట్‌లో మరో ప్రత్యేక అంశం- నూనెగింజల ఉత్పత్తుల పెంపుపై దృష్టి. ఆ ఉత్పత్తు లను గణనీయంగా పెంచి, నూనెల దిగుమతులను వీలయినంత వరకు తగ్గించాలన్నది ప్రభుత్వ చిరకాల యోచన. ఇప్పటికీ మన దేశం వంటనూనెల దిగుమతికి దాదాపు రూ. 60,000 కోట్ల విదేశీ మారకాన్ని వెచ్చిస్తున్నది. ఈ వ్యయాన్ని తగ్గించేందుకు దేశంలోనే నూనెగింజల సాగును ఇతోధికంగా ప్రోత్సహించాలని ప్రభుత్వం భావిస్తున్నది. ఇందుకు ‘మిషన్‌ ‌మోడ్‌’ ‌పద్ధతిలో బృహత్‌ ‌కార్యక్రమాన్ని అమలు చేసేందుకు సంకల్పించింది. ఈ దిశలో ఇప్పటికే ‘పామాయిల్‌’ ‌మొక్కల సాగును లక్షల ఎకరాల్లో సాగు చేసేందుకు (దేశవ్యాప్తంగా ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాల్లో) సంకల్పించటం ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనం. మన రైతులు కూడా ఆ ఆలోచనను అర్ధం చేసుకుని పామాయిల్‌ ‌మొక్కల సాగును ఇతోధికంగా చేపట్టవలసిన అవసరం ఉంది.

ప్రభుత్వ ప్రతిపాదనలలో మరో అంశం (క్రాప్‌ ‌డైవర్సిఫికేషన్‌) ‌సాగులో వైవిధ్యం పెంచే విధంగా పలు పంటల సాగును ప్రోత్సహించడం. ఒకే ప్రాంతంలో ఒకే పంటను ప్రతిసారి సాగుచేసే కన్న ఇతర పంటలు (నూనెగింజలు, పప్పు ధాన్యాలు, తృణధాన్యాలు,  కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు, ఔషధ తదితర) ఉద్యానవన పంటలను ఇతోధికంగా చేపడితే, మనకు అవసరమైన ఉత్పత్తులను పెంపొందించటమేగాక, కొన్ని ఉత్పత్తుల్లో లోటు ఏర్పడకుండా కూడా చూసుకోవచ్చు. మార్కెటింగ్‌ ‌సమస్యలను అధిగమించడానికి కూడా వీలవుతుంది. పంట కోతల తదనంతర ప్రాసెసింగ్‌ ‌చర్యలకు కూడా వీలవుతుంది. వీటన్నింటివల్ల గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ ఉత్పత్తుల ప్రాసెసింగ్‌ ‌కేంద్రాలను ప్రోత్సహించేందుకు, గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి కల్పనకు కూడా వీలవుతుంది. మార్కెటింగ్‌ ఉత్పత్తులకు మంచి ధరలు కూడా లభ్యమవుతాయి.

మార్కెటింగ్‌ ‌విభాగానికి ముఖ్యంగా పంట ఉత్పత్తుల సేకరణకు ఇతోధికంగా బడ్జెట్‌ ‌కేటా యింపులు చేయడం (రూ. 2.37 లక్షల కోట్లు) ద్వారా వ్యవసాయోత్పత్తులకు మార్కెటింగ్‌ ‌సౌకర్యాలను కల్పించి, రైతులకు మేలు చేకూరుతుంది.

వాతావరణంలో కార్బన్‌ ‌డయాక్సైడ్‌ ‌పరిమాణం ఇతోధికంగా పెరుగుతున్నందున పర్యావరణానికి ముప్పు ఏర్పడి, భూతాపం పెరిగి పెను మార్పు వచ్చింది. ఇది వ్యవసాయ దిగుబడులపై ప్రభావం చూపుతోంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం, కార్బన్‌ ‌డయాక్సైడ్‌ ‌పరిమాణాన్ని తగ్గించేందుకు, తగిన చర్యలు తీసుకునేందుకు ఈ బడ్జ్ణెట్‌ ‌ద్వారా వీలు కల్పించింది.

వ్యవసాయ, ఇతర రంగాలలో మార్పులు వచ్చి వత్తిడి పెరిగింది. దీనితో వ్యవసాయ కూలీలకు కొరత ఏర్పడి, సాగుకు అవసరమైన సిబ్బంది / వ్యక్తులు / కార్మికులు లేక రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటు న్నారు. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయంలో మమేకం చేస్తే, అటు రైతులకు కూలీల కొరత తగ్గుతుంది, ప్రభుత్వానికి కూడా వ్యవసాయ కూలీలపై ఖర్చు  తగ్గి, నిధుల ఆదా సాధ్యమవుతుంది. మరో అంశం – వ్యవసాయ కూలీల కొరత, ముఖ్యంగా, పంటరక్షణ రసాయనిక మందులు పిచికారి సకాలంలో చేసేందుకు (డ్రోన్‌ల వినియోగాన్ని) ఇతోధికంగా పెంచి, రైతులకు ఉపశమనం కల్గించడానికి ఈ బడ్జెట్‌లో నిధులు కేటాయించారు. ఇదే స్ఫూర్తితో ప్రభుత్వం వ్యవసాయ పనులకు జాతీయ ఉపాధి హామీ పథకాన్ని మమేకం చేస్తుందని ఆశిద్దాం.

మారుతున్న సాగు పద్ధతులకు, వస్తున్న మార్పులకు అనుగుణంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని రూపొందించడం, పంటల సాగు (వ్యవసాయ, ఉద్యానవన పంటలు, పశుసమృద్ధి, చేపల పెంపకం) కోసం ఆ సాంకేతిక పరిజ్ఞానాన్ని రైతులు ఆకళింపు చేసుకునే అవకాశం ఇవ్వడానికి; పరిశోధన, విస్తరణ, బోధనలపై వారికి పూర్తి అవగాహన కల్పించేందుకు ప్రభుత్వం సన్నద్ధం కావడం ఆహ్వానించదగిన పరిణామం. సహజ వ్యవసాయ పద్ధతుల్లో (సేంద్రియ/ సహజ) సుశిక్షితులైన శాస్త్రవేత్తలను, బోధకులను, విస్తరణాధికారులన• తయారుచేయడానికి వ్యవసాయ విశ్వవిద్యాలయాల్లో పాఠ్యాంశాలను మార్పుచేసి, అమలు చేయాలని సంకల్పించడం విప్లవాత్మక పరిణామం.

– ప్రొ।। పి. రాఘవరెడ్డి, ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం మాజీ ఉపకులపతి

About Author

By editor

Twitter
Instagram