రాజకీయంగా ఎంతో ప్రాధాన్యం ఉన్న కొన్ని రాష్ట్రాల శాసనసభల ఎన్నికలకు కొద్ది రోజులలోనే పోలింగ్‌ ‌జరగబోతున్నది. వీటి ఫలితాలు వచ్చే లోక్‌సభ ఎన్నికల మీద, బీజేపీ గెలుపు మీద ప్రభావం చూపుతాయన్న అభిప్రాయమూ బలమైనదే. కొవిడ్‌ ‌సృష్టించిన రెండేళ్ల క్లిష్ట పరిస్థితి నుంచి ఆర్థికవ్యవస్థ ఇప్పుడిప్పుడే కోలుకుంటూ, ప్రభుత్వ ఖజానాకి రాబడులు పెరుగుతున్న సమయం కూడా ఇదే. ఇలాంటి సమయంలో వచ్చింది 2022-23 బడ్జెట్‌. ఇది తప్పనిసరిగా ప్రజాకర్షక బడ్జెట్‌ అయి ఉంటుందని అందరి ఊహ. కానీ ఆ ఊహను తారుమారు చేస్తూ మౌలిక సదుపాయాల కల్పనకూ, పెట్టుబడి వ్యయానికీ పెద్ద పీట వేస్తూ తన నాలుగవ బడ్జెట్‌ను ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ ‌పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారు.

ఈ బడ్జెట్‌లో మౌలిక సదుపాయాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వటం వల్ల, ప్రభుత్వం చేసే పెట్టుబడి వ్యయం మంచి ఫలితాలని ఇస్తుంది. అదెట్లా అంటే ఈ రంగంలో ఖర్చు పెరగటం వల్ల దేశంలో మరిన్ని సౌకర్యవంతమైన మౌలిక వసతులు అందుబాటులోకి వస్తాయి. మౌలిక సదుపాయాలు మెరుగుపడితే, పెట్టుబడులు పెరుగుతాయి. మరింత వేగంగా ఆర్థిక కార్యకలాపాలు జరుగుతాయి. వ్యాపారాలు, పరిశ్రమలు వృద్ధి చెందుతాయి. కేంద్ర ప్రభుత్వం చేసే వ్యయానికి మించి ప్రైవేటు సంస్థలు పెట్టు బడులు పెడతాయి. అప్పుడు దేశంలో వస్తు సేవలకి మరింత డిమాండ్‌ ‌పెరుగుతుంది. డిమాండ్‌కు తగ్గట్టుగా ఉత్పత్తులు పెంచాలంటే ఎక్కువమంది చేత పనిచేయించాలి. అప్పుడు ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. ఉపాధి అవకాశాలు, ఉత్పత్తి పెరిగి నప్పుడు దానికి తగ్గట్టుగా వినిమయం పెరుగుతుంది. వినిమయం పెరగాలంటే ప్రజలకు ఆదాయం ఉండాలి. ఇంత భారీస్థాయిలో పెట్టుబడి పెట్టినప్పుడు దాని ప్రభావం వల్ల ఆదాయం పెరుగుతుంది. ప్రజల ఆదాయం, వినిమయం పెరిగినప్పుడు, సదుపా యాలు మెరుగుపడినప్పుడు జీవన ప్రమాణాలు మెరుగుపడతాయి. ఇటువంటి అంశాలపై అవగా హన ఉన్నది కాబట్టే, తమ ప్రయత్నం సమ్మిళితమైన సంక్షేమంతో కూడిన ఆర్థిక వృద్ధి సాధించటమే అని ప్రభుత్వం స్పష్టంగా తెలియజేయగలిగింది.

 ఈ బడ్జెట్‌ ‌ప్రసంగంలో ఆర్థికమంత్రి నాలుగు ప్రాధాన్యాల గురించి ప్రస్తావించారు. అందులో ఒకటి “Energy Transaction & Climate Action”. దీనివల్ల భవిష్యత్తులో మనదేశ అభివృద్ధికి ఒక ఎజెండాను నిర్దేశించినట్టు భావించాలి. ఈ బడ్జెట్‌లో మన ఇంధన / శక్తి వినిమయ పద్ధతులను మార్చటానికి, ముఖ్యంగా పర్యావరణ పరిరక్షణకు ఉపయోగపడుతూ, కాలుష్యాన్ని తగ్గించి, పునరుత్పత్తి యోగ్యమైన ఇంధన వినియోగానికి అనేక ప్రోత్సాహకాలు ప్రకటించారు. ముఖ్యంగా 2030 కల్లా 230 గిగావాట్ల సౌర విద్యుత్‌ ఉత్పత్తి సామర్థ్యం కలిగి ఉండాలనే లక్ష్యాన్ని సాధించడానికి అదనంగా రూ. 19,500 కోట్లు ఉత్పత్తితో ముడిపడిన ప్రోత్సాహకాల కోసం కేటాయించారు. 2030 కల్లా మనదేశంలో అవసరమయ్యే విద్యుత్‌లో 50 శాతం విద్యుత్‌ ‌పునరుత్పాదక ఇంధనాలతో ఉత్పత్తి చేస్తామని ఇటీవల ప్రధానమంత్రి గ్లాస్గో అంతర్జాతీయ సదస్సులో చెప్పిన విషయాన్ని గుర్తు చేసుకోవాలి. అలాగే మనదేశంలో ఉత్పత్తి అయ్యే ఉద్గారాలను భారీగా తగ్గించి 2005లో ఉత్పత్తి అయిన ఉద్గారాల కంటే తక్కువ స్థాయికి తీసుకు రావాలని ఆ ప్రసంగంలోనే ప్రధాని ప్రస్తావించారు. దానికి కార్యరూపం ఇవ్వడానికి ఈ బడ్జెట్‌లో తగిన కేటాయింపులు, ప్రోత్సాహకాలు ప్రకటించారు. 2022-23లో 27 సౌరవిద్యుత్‌ ‌ప్రాజెక్టులకి, 127 జలవిద్యుత్‌ ‌ప్రాజెక్టులకి నిధులు కేటాయించారు. ఉద్గారాలను తగ్గించే క్రమంలో బొగ్గును మరింత సమర్థంగా ఉపయోగించటానికి, బొగ్గును గ్యాస్‌గా మార్చటానికి నాలుగు పైలట్‌ ‌ప్రాజెక్టులు నెలకొల్ప టానికి చర్యలు చేపట్టారు. ఇప్పటివరకు మనదేశంలో విద్యుత్‌ ‌వాహనాల వాడకం ఊపందుకోక పోవటానికి ప్రధాన కారణం దేశంలో చాలినన్ని బ్యాటరీ రీచార్జింగ్‌ ‌సదుపాయాలు లేకనే. కాబట్టి ఆ సమస్యను శీఘ్రగతిన పరిష్కరించటానికి బ్యాటరీలను మార్చే విధానానికి శ్రీకారం చుట్టారు. వంటగ్యాస్‌ ‌సిలిండర్ల వలె వాహనాల బ్యాటరీలను మార్చుకునే సౌకర్యాన్ని ప్రవేశపెట్టడం, ఇంకా ఇతర ప్రోత్సాహకాల ద్వారా విద్యుత్‌ ‌వాహనాల వినియోగానికి ఊతం ఇచ్చే ప్రయత్నం జరిగింది. ఇటువంటి చర్యల వల్ల మన ఇంధన దిగుమతులు ఆగటానికి, కనీసం పెరగకుండా ఉండటానికి అవకాశాలు ఉన్నాయి. అంతేకాదు వాతావరణ కాలుష్యం తగ్గే ఆవకావం కూడా ఉంది. కాలుష్యం తగ్గితే ప్రజారోగ్యంతో పాటు ఇతర రంగాలపై కూడా మంచి ప్రభావం ఉండవచ్చు. వాతావరణ సమతౌల్యం కాపాడటానికి ప్రభుత్వం నిబద్ధతతో పని చేస్తుందనటానికి ఇటువంటి చర్యలను ఉదాహరణగా పేర్కొనవచ్చు. అంతర్జాతీయ ఇంధన ధరలలో మార్పుల ప్రభావం మనదేశ ఆర్థిక పరిస్థితిపై పడుతుంది. దానిని తగ్గించటానికి ఇంధన దిగుమతులను క్రమంగా తగ్గించి, పునరుత్పత్తి ప్రత్యామ్నాయ ఇంధనాల వాడకం పెంచటానికి ప్రభుత్వం ఎంత దృఢ సంకల్పంతో పనిచేస్తుందో కూడా ఈ చర్యలను బట్టి అర్ధం చేసుకోవచ్చు.

దేశ పురోభివృద్ధిలో వేగంతో పాటు పర్యావరణ పరిరక్షణ కూడా ముఖ్యమైనదే కాబట్టి, ఇప్పుడు ప్రభుత్వం స్వచ్ఛమైన ఇంధనశక్తి పట్ల దృష్టి సారించింది. అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ రెండూ పరస్పర విరుద్ధమైన అంశాలనే ఆలోచన నుంచి రెండూ సమాంతరంగా, సమన్వయంతో సాగవచ్చనే ఆలోచనవైపు మన దృష్టి మరల్చటానికి ప్రభుత్వ ప్రయత్నాలు ఉపయోగపడతాయి. ఈ బడ్జెట్‌ ‌గ్రీన్‌ ‌బాండ్ల ద్వారా ఆర్థిక వనరులు సమకూర్చుకోనున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఇది ప్రభుత్వం ఈ సంవత్సరం చేయదల్చుకున్న అప్పుల పరిమితికి లోబడే ఉంటుందని స్పష్టం చేశారు. ప్రభుత్వం గ్రీన్‌ ‌బాండ్లను జారీ చేయడంవల్ల ఇటువంటి అవసరాలకు ఏ రేటులో నిధులు సమకూరుతాయో తెలుస్తుంది. కాబట్టి, ప్రైవేటు సంస్థలు కూడా ఇటువంటి బాండ్లను జారీ చేసి, నిధులు సేకరించి, క్లీన్‌ ఎనర్జీ ప్రాజెక్టులకు నిధులు సమకూర్చుకునే అవకాశం ఉంది. దానివల్ల మన ఆర్థిక వ్యవస్థలో గ్రీన్‌ ‌ప్రాజెక్టుల వాటా పెరుగుతుంది. మన ప్రధాని గ్లాస్గో సభలో చేసిన ప్రసంగంలో ప్రతిపాదించిన ‘‘పంచ అమృతాలు’’ అనే కల సాకారమవటానికి అవకాశం ఉంది.

ఈ బడ్జెట్‌లో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామి పథకానికి నిధులు కేటాయించలేదనే అసత్య ప్రచారం ఒకటి జరుగుతున్నది. వాస్తవానికి ఈ పథకానికి రూ. 73,000 కోట్లు కేటాయించారు. అయితే 2020-21లో రూ.1.11 లక్షల కోట్లు కేటాయించగా ఇప్పుడు తగ్గించటం సరైనది కాదని, అందునా 2021-22 బడ్జెట్‌లో రూ.73,000 కోట్లు మాత్రమే కేటాయించినా సవరించిన అంచనాలలో దానిని పెంచి రూ.98,000 కోట్లు చేశారు. కాబట్టి 2022-23కి మళ్లీ రూ.73,000 కోట్లు కేటాయించటం అసమంజసమనే వాదన ఒకటి వినిపిస్తున్నారు. అయితే వారి వాదనలో లోపం ఏంటో వారికి తెలియదని, భ్రమ పడవలసిన పనిలేదు. 2020-21 ప్రత్యేక పరిస్థితులలో కొవిడ్‌ ‌వల్ల అన్ని దేశాలు చేసినట్టే మనం కూడా లాక్‌డౌన్‌ ‌చేయటం వల్ల సంస్థలు మూతపడి, పనిలేక కార్మికులు అవస్థలు పడకూడదనే ఉద్దేశంతో అందరికీ ఈ చట్టం ప్రకారం కనీసం కొన్ని రోజులన్నా ఉపాధి కల్పించాల్సిన అవసరం ఏర్పడింది కాబట్టి, హెచ్చు నిధులు ఖర్చు చేయాల్సి వచ్చింది. 2021-22 నాటికి పరిస్థితులు కొంతమేరకు మెరుగుపడి, కొంతవరకు మళ్లీ కార్మికులకి ఉపాధి కల్పించగలిగే అవకాశం వచ్చింది కాబట్టి రూ.73,000 కోట్లు కేటాయించారు. అయితే రాష్ట్రాలలో 2020-21లో ఉపాధి కల్పించిన వారికి వేతన బకాయిలు మిగిలిపోయాయని వాటిని చెల్లించటానికి 2021-22 కేటాయింపులు వాడాల్సి వచ్చింది కాబట్టి అదనపు నిధులు అవసరాన్ని బట్టి సవరించిన అంచనాలలో పెంచుకున్నారు. ఇక 2022-23 మన ఆర్థిక వ్యవస్థ కోలుకుని 9 శాతానికి మించి వృద్ధి సాధించగలుగుతుందని అంచనా వేసినప్పుడు ఈ పథకం క్రింద ఉపాధి కోరుకునే వారి సంఖ్య అంతగా ఉండదని భావించటం సహేతుకమే కదా! అటువంటప్పుడు హెచ్చు నిధుల కేటాయింపుల అవసరం ఏముంటుంది? అదీకాక అవసర మనుకుంటే ఈ సంవత్సరం చేసినట్లే మళ్లీ సవరించిన అంచనా లిప్పుడు తగు మార్పులు చేయవచ్చు కదా! అసలు ఈ పథకాన్ని పంట నాట్లు వేసేటప్పుడు, కోతల పనుల్లో అమలు చేయవద్దని పలు సంఘాలు పదే పదే విజ్ఞప్తి చేస్తున్నాయి కదా! ఉపాధి లేనప్పుడు కార్మికులు పస్తులు ఉండకూడదనే లక్ష్యంతో ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు కదా! ఉపాధి అవకాశాలు మెండుగా పెరిగే అవకాశం ఉన్నప్పుడు దీనికి కేటాయింపులు సరిగా లేవనే వాదన ఎందుకు? కేటాయింపులతో సంబంధం లేకుండా చట్ట ప్రకారం పని దినాలు కల్పించాల్సిన అవసరం ఉంటే వారికి ఉపాధి కల్పిస్తున్నారు కదా. ఆ పర్యవేక్షణ అంతా రాష్ట్ర ప్రభుత్వ అధికారుల ద్వారానే జరుగుతున్నది కదా. ఇటువంటి అంశాలు తెలిసి కూడా ఈ పథకానికి చేసిన కేటాయింపుల గురించి వదంతులు, విమర్శలు చేస్తున్నారంటే వారు ఏ ప్రయోజనం ఆశిస్తున్నారో అర్ధం చేసుకోవచ్చు. అలాగే ఈ పథకం క్రింద ఇటీవల 4% వేతనం పెంచినా సరే అనేక రాష్ట్రాల్లో కార్మికులు పొందు తున్న వేతనం తక్కువగా ఉన్నదనే వాదన కూడా వినిపిస్తున్నారు. అది ఎందువల్ల జరుగుతున్నదో అర్థం చేసుకోవడానికి అర్థశాస్త్ర నిపుణులు కావలసిన అవసరం లేదు. అలాగే ఈ వేతనాలు మార్కెట్‌ ‌వేతనాల కంటే తక్కువ ఉన్నాయంటే ఆర్థిక వ్యవస్థ పుంజుకున్నదని, కార్మికులకు హెచ్చు వేతనాలు ఇచ్చి పని కల్పిస్తున్నారనే అర్థం. దానికి సంతోషించాల్సింది పోయి అదేదో తప్పు జరిగినట్టుగా విమర్శించటం వారి అంతర్యాన్ని తెలియజేస్తున్నది.

ప్రధానమంత్రి ఆవాస్‌ ‌యోజన కింద 48,000 కోట్ల రూపాయలు కేటాయించినప్పటికి గ్రామీణ ప్రాంతాల్లో ఈ పథకానికి రూ.20,000 కోట్లే కేటాయించారని, ఇది గత సంవత్సర కేటాయింపుల కంటే రూ.500 కోట్లు మాత్రమే పెంచినట్టని, గ్రామీణ ప్రాంతానికి కేటాయింపులు భారీగా పెరగకపోవటం వల్ల పేదలకు గూడు కల్పించే లక్ష్యానికి తూట్లు పొడిచినట్లు అయ్యిందని, విమర్శించే ప్రయత్నం జరుగుతున్నది. ప్రధానమంత్రి ఆవాస్‌ ‌యోజనకి గత బడ్జెట్‌లో కేవలం రూ. 27,500 కోట్లు కేటాయించారు. ఇప్పుడు దాన్ని రూ.48,000 కోట్లకి పెంచారు. ఈ కేటాయింపులో 80 లక్షల లబ్ధిదారులకి గృహవసతి కల్పించాలని సంకల్పించి నట్లు తెలియజేశారు. పట్టణ ప్రాంతంలో ఈ పథకం క్రింద ఇప్పటికే 114.02 లక్షల ఇళ్లు మంజూరు చేశారు. దాంట్లో 53.42 లక్షల గృహాల నిర్మాణం పూర్తయి లబ్ధిదారులు వాటిలో నివసిస్తున్నారు. అలాగే గ్రామీణ ప్రాంతంలో 2.95 కోట్ల పక్కా ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాలనే లక్ష్యంతో పథకాన్ని అమలు చేస్తూ, రెండవ దశను పూర్తిచేయడానికి గడువు పెంచిన విషయం గుర్తుండే ఉండి ఉంటుంది. వాస్తవానికి గ్రామీణ ప్రాంతంలో రెండవ దశలో మంజూరు చేసిన గృహాల నిర్మాణం 2022 నాటికే పూర్తి కావలసి ఉండగా, లబ్ధిదారులు కొవిడ్‌ ‌కారణంగా నిర్మాణం పూర్తి చేయలేకపోయామని, గడువు పొడిగించమని అభ్యర్థిస్తే, దానికి సానుకూలంగా స్పందించి 2024 వరకు గడువు పెంచి, ఆగిన కేటాయింపులు చేసినందుకు అభినందించకపోయినా ఫరవాలేదు, కనీసం అసత్య ప్రచారాలు, అపోహలు కల్పించే ప్రయత్నాలు చేయకూడదు.

ఈ బడ్జెట్‌లో ఎస్సీ, ఎస్టీల సంక్షేమానికి, మహిళా సంక్షేమానికి నిధులు తక్కువ కేటాయించారనే మరో అసత్య ప్రచారం జరుగుతున్నది. బడ్జెట్‌లో ఎస్సీ, ఎస్టీలకు చేసిన కేటాయింపులకు సంబంధించి ప్రత్యేక పట్టికలు పొందుపరిచారు. బడ్జెట్‌లో పొందుపరిచిన స్టేట్‌మెంట్‌ 10 ‌ప్రకారం షెడ్యూల్డ్ ‌కులాల సంక్షేమానికి 1,42,342 కోట్లు, షెడ్యూల్డు తెగల సంక్షేమానికి 89,265 కోట్లు, మహిళా సంక్షేమానికి 1,71,006 కోట్లు కేటాయించారు. ఈ కేటా యింపులు గత సంవత్సరం కంటే ఎక్కువ. శిశు సంక్షేమానికి కూడా గత సంవత్సరానికి మించి 92,737 కోట్ల రూపాయలు కేటాయించారు. అయితే ఎస్సీ, ఎస్టీ సంక్షేమానికి కేటాయించిన నిధులలో  38%, 44% నిధులు మాత్రమే ఎస్సీ, ఎస్టీ ప్రజలకు నేరుగా లబ్ధి చేకూరడానికి ఉపయోగించే పథకాలకు కేటాయించారని, మిగిలిన నిధులను ఇతర పథకాలలో ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చేసే ఖర్చు కోసం కేటాయించారని దీనివల్ల నేరుగా లబ్ధి చేకూరే పథకాలకు తగిన నిధులు ఉండవని చెబుతు న్నారు. ప్రభుత్వాలు అనేక పథకాలు అమలు చేస్తున్నప్పుడు నిబంధనల ప్రకారం వాటిలో ఎస్సీ, ఎస్టీ వర్గాలకు తగిన కేటాయింపులు చేయటం అనివార్యం అనే అంశాన్ని గుర్తించాలి. ఈ బడ్జెట్‌లో పోస్ట్‌మెట్రిక్‌ ‌స్కాలర్‌షిప్‌ల కేటాయింపుల విషయంలో ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకి అన్యాయం జరిగిందని, వారికి తగిన కేటాయింపులు చేయలేదనే ప్రచారం కూడా చేస్తున్నారు. అయితే ఎస్సీ విద్యార్థులకు పోస్ట్‌మెట్రిక్‌ ‌స్కాలర్‌షిప్‌ల కోసం రూ.7,000 కోట్ల రూపాయలు కేటాయించమని ఆ వర్గానికి చెందిన నాయకులు కోరగా బడ్జెట్‌ అం‌చనాలతో రూ. 5,660 కోట్లు కేటాయించి, అవి సరిపోకపోతే మరిన్ని నిధులు సంవత్సరం మధ్యలో కాని, చివర్లో కాని కేటాయిస్తా మని తెలియజేశారు. అలాగే ఎస్టీ విద్యార్థులకి పోస్టుమెట్రిక్‌ ‌స్కాలర్‌షిప్‌ల క్రింద రూ. 3,416 కోట్లకు పైగా కేటాయించారు. వ్యవసాయరంగంలో ఎస్సీ, ఎస్టీలకు చేసిన కేటాయింపులను కూడా కొంతమంది తప్పు పడుతున్నారు. మన గ్రామాలలో ఎస్సీ, ఎస్టీలకు భూములు లేవని వారికి ఆ రంగంలో చేసిన కేటాయింపులు ఎలా ఖర్చు చేస్తారని ప్రశ్నించేవారు ఓపికగా బడ్జెట్‌ ‌కాగితాలు, ఇతర నివేదికలు పరిశీలిస్తే వాస్తవాలు తెలుస్తాయి.

గిట్టుబాటు ధరకు కేటాయింపులు

ఈ బడ్జెట్‌లో ప్రభుత్వం వ్యవసాయరంగాన్ని విస్మరించిందని, ముఖ్యంగా రైతులకి గిట్టుబాటు ధర కల్పించటానికి నిధులు కేటాయించలేదనే అసత్య ప్రచారాలు కొంతమంది చేస్తున్నారు. బడ్జెట్‌లో రైతులకి గిట్టుబాటు ధర గురించి మంత్రి తమ ప్రసంగంలో చెప్పిన అంశాలను మరుగుపరిచి, లేనిపోని అపోహలు సృష్టించి ప్రజలను, ముఖ్యంగా రైతులను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ బడ్జెట్‌లో వరి, గోధుమలను సేకరించటానికి రూ.2.7 లక్షల కోట్ల• కేటాయించారు. భారత ఆహార సంస్థ, ఇతర రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని సేకరణ కేంద్రాలు ప్రభుత్వం నిర్ణయించిన కనీస గిట్టుబాటు ధరకి వరి, గోధుమలు సేకరిస్తారు. ఈ సంవత్సరం ఇప్పటికే 1200 లక్షల టన్నుల వరి, గోధుమలు సేకరించటానికి కేంద్ర ప్రభుత్వం రూ. 2.37 లక్షల కోట్ల• రైతుల ఖాతాలకు నేరుగా బదలీ చేసింది. దక్షిణాది రాష్ట్రాలలో రబీ పంట సేకరణ ఇంకా మొదలు కాలేదన్న విషయాన్ని ఈ సందర్భంగా గుర్తించాలి. దక్షిణాది రాష్ట్రాల పంటను కూడా పరిగణనలోకి తీసుకుంటే 2021-22 పంటల కాలానికి గానూ దాదాపు 1370 లక్షల టన్నుల వరి, గోధుమలను ప్రభుత్వం సేకరించగలదు. ఇది మనదేశ చరిత్రలో ఒక రికార్డుగా భావించాలి. అయితే దురదృష్టవశాత్తు ఇంతటి విజయానికి లభించాల్సిన ప్రచారం లభించలేదు. దాదాపు 163 లక్షల రైతుల నుంచి సేకరించిన పంట డబ్బును వారి ఖాతాలకు బదలీచేశారు. ప్రభుత్వం సేకరించిన పంటను జాతీయ ఆహార భద్రతా చట్టం పరిధిలోని 80 కోట్ల మంది లబ్ధిదారులకి అత్యంత తక్కువ ధరకు రేషన్‌షాపుల ద్వారా అందజేస్తుందన్న విషయం తెలిసిందే. పంట సేకరణ విషయంలో పరిమితులు అమలు చేయకపోవటం వల్ల ఈ 80 కోట్ల లబ్ధిదారులకి వితరణ చేయటానికి అవసరమైన దానికంటే ఎక్కువగా సేకరణ చేయటం జరుగు తుంది. అలా మిగిలిన పంట కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల గిడ్డంగులలో మిగిలిపోతుంది. ప్రస్తుతం అలా గిడ్డంగులలో ఉన్న నిల్వలు 548.90 లక్షల టన్నులని అంచనా. నిబంధనల ప్రకారం మన దేశంలో బఫర్‌స్టాక్‌ 214,10 ‌లక్షల టన్నులు ఉంటే సరిపోతుంది. అయితే ప్రస్తుత నిల్వలు దానికి రెట్టింపు కంటే ఎక్కువగా ఉన్నాయి.

 ప్రభుత్వం ఇలా పంటలను గిట్టుబాటు ధరలు చెల్లించి సేకరిస్తుంటే రైతులకి ఎటువంటి ప్రయోజనం చేకూర్చటం లేదనే ప్రచారానికే అధిక ప్రాధాన్యం ఇవ్వటం దురదృష్టం. దేశం ఆర్థికంగా ఇంత ప్రగతి సాధించిన నేపథ్యంలో 80 కోట్లమంది జాతీయ ఆహార భద్రత చట్టం కింద అర్హులైన లబ్ధిదారులు ఉండి వారికి ఇంత భారీ వ్యయంతో ఆహార సబ్సిడీ అందించటమే మేధావులు చర్చించాల్సిన అంశం. వాస్తవానికి ఇంతమంది రేషన్‌కార్డులు కలిగి ఉండటం వారి వాస్తవ స్థితిని ప్రతిబింబిస్తున్నదా? అనర్హులైన వారికి సబ్సిడీ ఇవ్వడం వల్ల ప్రభుత్వంపై అదనపు భారం ఎలా పడుతున్నది? దేశ జనాభాలో ఇంతమంది దారిద్య్రరేఖకు దిగువన లేరని ఇతర గణాంకాలు స్పష్టం చేస్తున్నప్పుడు ఆహారభద్రత విషయంలో వాటిని ఎందుకు వాడకూడదు? ఇలాంటి అనేక ప్రశ్నలపై మేధావులు చర్చించాల్సింది పోయి, అసలు విషయాన్ని మరుగు పరిచి, అవాస్తవ ప్రచారాలకు ప్రాధాన్యం ఇవ్వటంలో వారి ఆసక్తి ఎందుకో అర్థం చేసుకోవచ్చు. ఆహార సబ్సిడీ భారం కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది కాబట్టి అర్హులైన లబ్ధిదారుల ఎంపిక, అనర్హుల ఏరివేత విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలు ఉదాసీన వైఖరి అవలంబిస్తు న్నాయా అనే అంశంపై కూడా చర్చ జరగాలి. ప్రభుత్వం ఆహార పంటలలో వరి, గోధుమలను మాత్రం సేకరిస్తే సరిపోతుందా? ఇతర పంటల విషయం ఏమిటి అనే ప్రశ్నను లేవనెత్తటంలోని ఉద్దేశం ఏంటో అర్ధం చేసుకోవచ్చు. గిట్టుబాటు ధరలు వరి, గోధుమలకు మాత్రమే పరిమితం కాదనే విషయం వారికి తెలియదని భావించవలసిన అవసరం లేదు. అనేక సంస్థలు ఇతర పంటలకు గిట్టుబాటు ధర కల్పించటానికి రైతుల నుంచి వారి ఉత్పత్తులను సేకరిస్తారు. ఉదాహరణకు చీఖీజుణ రైతులనుంచి పప్పులు, నూనేగింజలు వంటివి సేకరిస్తుందని, అలాగే పండ్లకు సైతం గిట్టుబాటు ధర కల్పించటానికి పథకాలు ఉన్నాయని, వాటిని అమలు చేయటానికి యంత్రాంగం ఉన్నదనే విషయం వారికి తెలిసే ఉంటుంది. అయితే అనర్హులను, అవినీతిపరులను తగ్గించగలిగితే వాటి ఫలితాలు మరింత మందికి విస్తరిస్తాయని గమనించాలి, వీలైతే ఆ దిశగా కృషిచేయాలి.

 సబ్సిడీలు

ఆహార సబ్సిడీ కేటాయింపులు భారీగా తగ్గించారనే విమర్శ ఒకటి తెరమీదకి తీసుకు వచ్చారు. ఆహార సబ్సిడీకి ఈ బడ్జెట్‌లో రూ. 2,06,831 కోట్ల• కేటాయించారు. ఇది 2021-22 కంటే తక్కువే. అయితే 2021-22లో హెచ్చు కేటాయింపులు జరిగాయి. దానికి కారణం-కొవిడ్‌ ‌సమయంలో పేదలకు ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో ప్రధానమంత్రి గరీబ్‌ ‌కల్యాణ యోజన కింద ఆహార ధాన్యాలు ఉచితంగా అందజేశారు. దేశంలో 50 కోట్ల మంది లబ్ధిదారులకి ఒక్కొక్కరికి నెలకి 5 కిలోల బియ్యం లేదా గోధుమలు, 1 కిలో పప్పు వగైరాలు ఉచితంగా అందించారు కాబట్టి 2021-22లో ఆహార సబ్సిడీకి నిధులు ఎక్కువగా కేటాయించారు.

అయితే ఇప్పుడు అటువంటి అవసరం ఉండదనే ఉద్దేశంతో దానికి సంబం ధించిన ఖర్చు మేరకి కేటాయింపులు తగ్గించారు. పథకం గడువు తీరినాక కేటాయింపులు చేయరనే విషయం విమర్శ చేసేవారికి తెలిసే ఉంటుంది. అలాగే 2021-22లో కేంద్ర ప్రభుత్వం భారత ఆహార సంస్థ అప్పులను కొంతమేరకు తీర్చింది. అందువల్ల కూడా అధిక కేటాయింపులు అప్పుడు చేశారు. ఈ సంవత్సరం అటువంటి అవసరం లేదు కాబట్టి దానికి కేటాయింపులు చేయలేదు. అలాగే ఎరువుల సబ్సిడీ కూడా 2021-22 కన్నా తగ్గించి, ఈ బడ్జెట్‌లో రూ.1,05,222 కోట్లు కేటాయించారు. గత సంవత్సరం అంతర్జాతీయ మార్కెట్లో ఎరువులు, వాటికి ఉపయోగించే ముడిసరుకుల ధరలు బాగా పెరగటం వల్ల డిసెంబర్‌ 2021‌లో ఎరువుల సబ్సిడీకి అదనపు నిధులు సమకూర్చారు. వాస్తవానికి 2021-22 బడ్జెట్‌లో ఎరువుల సబ్సిడీకి రూ. 79.530 కోట్లే కేటాయించారు. అయితే డిసెంబర్‌లో అదనపు నిధులు సమకూర్చటం వల్ల ఆ కేటాయింపులు పెరిగాయి. 2022-23లో ఎరువుల దిగుమతి తగ్గుతుంది. దేశీయ ఉత్పత్తి పెరిగి, ఖర్చు తగ్గుతుంది. కాబట్టి ఎరువుల సబ్సిడీని రూ.1,05,222 కోట్లుగా అంచనా వేసి కేటా యింపులు చేశారు. పెట్రోలియం సబ్సిడీలు కూడా తగ్గించారు. గత కొన్ని సంవత్సరాలుగా ప్రభుత్వం పెట్రోలియం సబ్సిడీలను తగ్గించుకుంటూ వస్తున్నది. క్రమంగా 2020-21 నాటికి కేవలం వంటగ్యాస్‌, ‌కిరోసిన్‌, ఇం‌కా ఇతర అత్యవసర పెట్రోలియం ఉత్పత్తులపై మాత్రమే సబ్సిడీ ఇచ్చారు. అయితే ఆ తదుపరి సంవత్సరం ప్రభుత్వ విధానంలో మార్పు రావటం వల్ల కిరోసిన్‌పై సబ్సిడీని గత సంవత్సరం నుంచి నిలుపుదల చేశారు. కిరోసిన్‌పై సబ్సిడీ ఎత్తేశారు. కాబట్టి దానికి అయ్యే ఖర్చుకి సంబం ధించిన కేటాయిం పులు అవసరం లేదు. కాబట్టి తగ్గించారు. అలాగే క్రమంగా వంటగ్యాస్‌పై కూడా సబ్సీడీని ప్రభుత్వం తగ్గిస్తున్నది. ఇలా విధాన పరమైన మార్పులు ఉన్నాయి కాబట్టి పెట్రోలియం ఉత్పత్తులపై సబ్సిడీకి కేటాయింపులు తగ్గించారు. మొత్తం మీద బడ్జెట్‌లో సబ్సిడీలకి రూ. 3,55,639 కోట్లు కేటాయించారు.

ఈ బడ్జెట్‌లో రాష్ట్రాలకు రూ. 16.12 లక్షల కోట్లు వివిధ రూపాలకు బదలీ చేయనున్నారు. దీంట్లో రూ. 8.17 లక్షల కోట్లు పన్నులలో వాటా రూపంలో బదలీ చేస్తారు. రూ.7.95 లక్షల కోట్లు రాష్ట్ర ప్రభుత్వాలకు, స్థానిక సంస్థలకు, విపత్తు నిర్వహణకు, తదితర అంశాలకు బదలీ చేయను న్నారు. కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకాలకు విడుదల చేసే నిధులు కూడా ఇందులో కలిసి ఉన్నాయి. ఈ బడ్జెట్‌లో రాష్ట్రాలకు బదలీ చేసే నిధులకు సంబంధించి ఒక నూతన విధానాన్ని ప్రవేశ పెట్టారు. కేంద్ర ప్రభుత్వం ఈ బడ్జెట్‌లో పెట్టుబడి వ్యయానికి ప్రాధాన్యత ఇచ్చింది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాలను కూడా ఇందులో భాగస్వాములను చేయడానికి లక్ష కోట్ల రూపాయలను, రాష్ట్ర ప్రభుత్వాలకు పెట్టుబడి వ్యయం చేయడానికి ఇస్తారు. ఈ డబ్బును రాష్ట్ర ప్రభుత్వాలకు వడ్డీ లేకుండా ఇస్తారు. అంతేకాదు ఈ సొమ్మును రాష్ట్ర ప్రభుత్వాలు 50 సంవత్సరాలలో తీర్చాల్సి ఉంటుంది. వడ్డీ లేకుండా 50 సంవత్సరాల నిడివిలో తిరిగి చెల్లించే పద్ధతిలో డబ్బు సమకూర్చటం ఎంత మంచి అంశమో, దాని విలువ తెలిసిన వారు అర్ధం చేసుకోగలరు. దీనివల్ల దేశంలో మౌలిక సదుపాయాలు పెంచటానికి అవసరమైన నిధులు సమకూరతాయి.

ఈ బడ్జెట్‌లో దేశ ఆర్థిక ప్రగతికి ప్రాధాన్యమిస్తూ, ప్రజాకర్షణకి దానివల్ల వచ్చే ప్రయోజనాలకు ఆశపడకుండా, సాధ్యమైనంతవరకు అన్ని వర్గాలకు తగినంత కేటాయింపులు చేస్తూ, అదనపు పన్నులు వేయకుండా, ఆర్థికవృద్ధికి ఊతం ఇస్తూ, అలాగే దేశ భద్రతను విస్మరించకుండా దానికి ఇవ్వవలసిన ప్రాధాన్యత ఇవ్వటం, అర్ధ వ్యవస్థలో పరపతి పెంచటం, ప్రైవేటురంగం దేశవృద్ధిలో భాగస్వాములు అయ్యేట్టు చూడటం, ఈశాన్య రాష్ట్రాల మౌలిక సదుపాయాల పట్ల ప్రత్యేక శ్రద్ధ పెడుతూ సమతూకం పాటించే ప్రయత్నం చేస్తూ బడ్జెట్‌ను రూపొందించారని చెప్పవచ్చు. ఈ బడ్జెట్‌ ‌గోల్‌మాల్‌ అని అంటే ఎంత అసందర్భమో వేమనగారి పద్యం ద్వారా చెప్పవచ్చు. వందల ఏళ్లక్రిందటి ఆ మహానుభావుడు, ‘తన మది కపటము కలిగిన తన వలనే కపటముండు తగు జీవులకున్‌, ‌తన మది కపటము వీడిన తనకెవ్వడు కపటి లేడు మహిలో వేమ’ అన్నారు. ఎవరి మదిలోనైనా మంచి భావనలు ఉంటే అన్నింటిలో మంచి కనపడుతుందట. ఈ బడ్జెట్‌లో మంచి కనబడలేదు అనేవారు ఎందుకు అంటున్నారో వేరుగా చెప్పనవసరం లేదు.

– సాయి, ఆర్థిక నిపుణులు

About Author

By editor

Twitter
Instagram