ఫిబ్రవరి 12 భీష్మ ఏకాదశి

గంగాశంతనులకు జన్మించిన దేవవ్రతుడు కాలాంతరంలో భీషణ ప్రతిజ్ఞతో ‘భీష్ముడు’గా, సర్వవిద్యావిశారదుడిగా, సర్వజ్ఞుడిగా, కురు పితామహుడిగా ప్రఖ్యాతి చెందాడు. పితృభక్తి, ప్రతిజ్ఞాపాలన, ఆత్మవిశ్వాసం, స్థితప్ర్ఞత్వం, చాతుర్యం, శౌర్య సాహసాలు తదితర గుణాలను పుణికి పుచ్చుకున్నాడు. పుణ్యశ్లోకులైన కృష్ణభక్తులలో పప్రధముడు. పితృవాక్యపాలనలో శ్రీరాముడంతటివాడు. ఇచ్చిన మాట కోసం, రాజధర్మంకోసం జీవితంలో ఏనాడూ సుఖానికి నోచుకోలేదు. పూర్వజన్మలో వసిష్టమహర్షి, ఆయనకు చెందిన నందినీధేనువు పట్ల చేసిన అపచార ఫలితంగా పొందిన శాపం ఇలా పరిణమించిందని చెబుతారు. బాల్యం నుంచి మానసిక పరాజయాలు ఎదురైనా మొక్కవోని స్థయిర్యంతో సాగి, ‘ఇహలోకంలో పరాజితుడైనా పరలోకంలో విజేతగా నిలిచాడు.

శ్రీకృష్ణుడు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువనే అచంచల విశ్వాసం భీష్మాచార్యులది. కురుక్షేత్ర సంగ్రామంలో రౌద్రాకారం, విజృంభణలో వాసుదేవుడినే గడగడ లాడించిన ఆయన భక్తాగ్రేసురుడిగా శ్రీకృష్ణుడిలో విశ్వమంతటిని దర్శించారు. ఆయన భవిష్యవాణి మహత్తరమైనది. ‘ధర్మ సంస్థాపనార్ధాయ సంభవామి యుగేయుగే’ అని భగవానుడు చెప్పిన దానిని అందరికంటే ముందే ఊహించాడు. ఆయన ముందు తామంతా నిమిత్త మాత్రులమని భావించాడు. రాజసూయ యాగ నిర్వహణకు సంబంధించి ధర్మరాజు సలహా అడిగినప్పుడు అంతా శ్రీకృష్ణ భగవానుడే చూచుకుంటాడని భరోసా ఇచ్చాడు. ధర్మపక్షపాతి వాసుదేవుడు అండగా ఉండగా పాండవులకు పరాజయం ఉండదని ఆయనకు తెలుసు.

పుణ్యశ్లోకులైన కృష్ణభక్తుల్లో పప్రధముడు కనుకనే కృష్ణుని విశిష్టతను లోకానికి చాటారు. అంపశయ్యపై ఉన్న తన దాహం తీర్చేందుకు అర్జునుడు పాతాళగంగ కోసం చేస్తున్న ప్రయత్నాలు ఫలించలేదు. దాంతో ‘సదా బ్రహ్మ చారిని ధ్యానిస్తూ బాణాన్ని సంధించవలసిందిగా సూచించాడు భీష్ముడు. ‘సదా బ్రహ్మచారి అంటే బ్రహ్మచర్యం పాటించడం కాదు. సదా బ్రహ్మా నందంలో చరించేవాడు. అతడే పరబ్రహ్మ స్వరూపుడు శ్రీకృష్ణ భగవానుడు’ అని పితామహుడు వివరించాడు. జీవితంలో ఎన్ని ఒడుదుడుకులు ఎదుర్కొంటున్నా ధర్మచింతన, భగవత్‌ ‌దృష్టి ఉంటే భగవంతుడి అనుగ్రహానికి పాత్రుడవుతారనేందుకు కురు పితామహుడు మరో ఉదాహరణ.

ధర్మ సంకటంలో..

ధర్మమూర్తిగా మన్ననలు అందుకున్నప్పటికీ కొన్ని సందర్భాలలో అధర్మాన్ని నిలదీయలేక•• పోవడం, చెప్పిచూచినా దుర్యోధనాదులు పెడచెవిన పెట్టటం కలవరపరిచింది. మాయాజూదంలో ఫణంగా నిలిచిన ద్రౌపది ‘ధర్మరాజు తన్నోడి నన్నోడినా?నన్నోడి తన్నోడినా? నేను ధర్మ విజేతనా? అధర్మ విజేతనా?’ అని నిండుసభలో నిలదీసినప్పుడు కూడా ‘ఆ ప్రశ్నకు సమాధానం చెప్పగల సమర్థుడు ధర్మరాజే’ అని దాటవేత వైఖరి అవలంబించారనే అపవాదు ఉంది. ద్రౌపది వస్త్రాపహరణం యత్నాన్ని నిలువరించే యత్నంలో తాను చొరవ చూపినా ఫలితం విదురుని ప్రయత్నం కంటే భిన్నంగా ఉండదనే భావనతో మౌనం వహించి తమ పెద్దరికాన్ని నిలుపుకున్నాడనే వాదన ఉంది. తనకు ఆశ్రయం ఇచ్చినందుకు ధర్మానికి కట్టుబడి దుర్యోధనుడి దురాగతాలను సహిస్తూ, విధిలేని పరిస్థితుల్లో పాండవులపై యుద్ధానికి దిగాడు. ధర్మపక్షపాతి వాసుదేవుడు అండ ఉండగా పాండవు లకు పరాజయం ఉండదని ఆయనకు తెలుసు.

స్వీయశిక్ష…?

తన ప్రమేయం లేకుండానే తన ఎదుటనే జరుగుతున్న విపరీత పరిణామాలను కులపెద్దగా చక్కదిద్ద లేకపోవడం తన అసమర్థతగా భావించబట్టే ప్రతిగా తన పొరపాట్లకు స్వీయశిక్ష విధించుకుని చరమదశలో 56 రోజులు అంపశయ్యపైనే గడిపారనే వ్యాఖ్యానాలు ఉన్నాయి (ఆయన 170 సంవత్సరాలు జీవించాడని పరిశోధకులు తేల్చారు). పార్ధుడి బాణాలకు దక్షిణాయనంలో నెలకొరిగినా స్వచ్ఛంద మరణ వర ప్రభావంతో ఉత్తరాయణ పుణ్యకాలం వరకు నిరీక్షించినప్పటికీ, ఆయన ధర్మనిరతిని వెల్లడిం చేందుకే అలా జీవించాడని భావించాలి. ‘స్వీయశిక’• పూర్తికాగానే మాఘశుద్ధ అష్టమినాడు భగవానుడు తనలో విలీనం చేసుకుని ఆ తరువాత వచ్చిన ఏకాదశిని ‘భీష్మ ఏకాదశి’గా ప్రకటించాడు. దానినే ‘జయ ఏకాదశి’అని వ్యవహరిస్తారు.

అద్వితీయ సహస్ర నామం….

పంచమవేదంగా పరిగణించే మహాభారతం శతసహస్ర సంహిత (నూరువేల శ్లోకాలతో కూడిన బృహద్గ్రంధం) కాగా విష్ణు సహస్రనామం వేదాల సారమని ఆధ్యాత్మికవేత్తలు, ప్రవచనకర్తలు విశ్లేషిస్తారు. మహాభారతానికి మూలకేంద్రాలైన భగవద్గీత, విష్ణు సహస్ర నామాలలో లేనిది మరోచోట కనిపించదని అంటారు. ఒకటి గీతామృతం కాగా మరొకటి నామామృతం. కురుక్షేత్ర సంగ్రామానికి పూర్వరంగం గీతోపదేశం అయితే సహస్ర నామ సంకీర్తన ఉత్తర రంగం. మొదటిది రణరంగ వాతా వరణంలో, రెండవది అతి ప్రశాంత వాతా వరణంలో కృష్ణ, భీష్ముల ముఖతా వెలువడ్దాయి. విష్ణుసహస్రనామాలనే ‘భీష్మ గీత’ అని అంటారు. పరమాత్మను మించిన ధర్మం మరొకటి లేదని రెండూ స్పష్టంచేస్తున్నాయి.

ఉపదేశ వ్యాఖ్యలు

‘జాతస్య మరణం ధ్రువమ్‌….’అన్న సూక్తి నిత్యసత్యమైనప్పటికీ కారణజన్ముల నిర్యాణం లోకానికి నష్టం. వారివల్ల జగతికి మేలు కలగాలి. భీష్ముడు ఆ కోవకు చెందిన వారే. ఆయనకు తెలిసినన్ని విషయాలు, విశేషాలు ఇతరులెవ్వరికీ తెలియవు. ‘నాడు దుర్యోధనుడి దుస్సాంగత్యంలో ఉన్నాను కనుక ధర్మం ప్రకాశించ లేదు. అప్పుడు కలుషితమైన రక్తాన్ని దేవదేవుడి సారథ్యంలోని అర్జునుడు తన శరాలతో తీసి వేసినందున ఇప్పుడు నిర్మల మనస్కుడను’అని సమాధానపరచుకుని కృష్ణుని ఆదేశాన్ని అమలు చేయడానికి ఉపక్రమించాడు.

‘ధర్మాన్ని కాపాడేది సత్యమే. అదే మహాయజ్ఞం. వేయి అశ్వమేధ యజ్ఞాల కంటే సత్యవచన ఫలం మిన్న. లోభమే మోసానికి, అధర్మానికి, అజ్ఞానానికి, కోపానికి, దుఃఖానికి కారణం కనుక దానిని త్యజించాలి. భోగభాగ్యాలు అశాశ్వతమని గ్రహిస్తే లోభం నశిస్తుంది. సంతృప్తితో ఆశను, ప్రయత్నంతో సోమరితనాన్ని జయించవచ్చు. తల్లిదండ్రులు, గురువు వేదత్రయం, త్రిమూర్తుల వంటివారు. గురువును సేవించేవారు అవ్యయానందం (బ్రహ్మానందం) పొందుతారు. ఆహార నియమయే తపస్సు. అదే మహాధర్మం’ అంటూ అనేకానేక ధర్మసూత్రాలు వివరించారు. భీష్ముడు తెలియచెప్పిన శాంతిమార్గం సార్వకాలీనం. ఈ యుగంలో ప్రతి ఒక్కరికి కర్తవ్య బోధగా పెద్దలు చెబుతారు.

భీష్మపంచకం

మాఘ శుద్ధ సప్తమి నుంచి ఏకాదశి వరకు అయిదు రోజులను ‘భీష్మ పంచకం’ అంటారు. ఆయన తన పంచప్రాణాలను వరుసగా అయిదు రోజులలో విడిచారని, అందుకే అలా వ్యవహరించారని చెబుతారు. అయితే అష్టమినే భీష్మనిర్యాణ దినంగా ధర్మసింధు, నిర్ణసింధు, నిర్ణయచంద్రిక లాంటి గ్రంథాలు పేర్కొన్నాయి. పన్నెండు మాసాలలోని ఏకాదశి తిథులలో ‘భీష్మ ఏకాదశి’ అత్యంత పుణ్య ప్రదమైందిగా పద్మపురాణం పేర్కొంది. తూర్పు గోదావరి జిల్లాలోని అంతర్వేది నృసింహస్వామి కళ్యాణోత్సం ఆనాడే జరగడం ఒక ప్రత్యేకత.డా।। ఆరవల్లి

– జగన్నాథస్వామి, సీనియర్‌ ‌జర్నలిస్ట్

About Author

By editor

Twitter
Instagram