దేశంలోని స్వయం ప్రకటిత మేధావులకీ, ఒక వర్గం పత్రికలకీ అన్ని వర్గాల మహిళలు, బాలికలు సమానం కాదా? వర్గం ఏదైనా, ప్రాంతం ఏదైనా మహిళకూ లేదా బాలికకు జరిగిన అన్యాయం ఒకటి కాదా? కాదని గట్టిగా చెప్పడానికి రుజువే తమిళనాడులోని అరియలూరు బాలిక బలవన్మరణం. ఈ బాలిక చదువుతున్న సేక్రెడ్‌ ‌హార్ట్ ‌హైయర్‌ ‌సెకెండరీ స్కూలు యాజమాన్యం ఆమెను క్రైస్తవంలోకి మారాలని వేధించిన కారణంగా ఆత్మహత్య చేసుకుంది. ఈ విషయం బాలిక మరణవాఙ్మూలంలోను, తల్లిదండ్రులు కూడా చెప్పారు. అయినా హక్కుల ఉద్యమకారులు ఎవరూ మాట్లాడలేదు. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌ ‌మొదలుకొని, బీజేపీ రాష్ట్రాలలో ఏ చిన్న సంఘటన జరిగినా వెంటనే రోడ్డెక్కే మహిళా సంఘాలు సైతం ఈ దుర్ఘటన మీద నోరు విప్పడం లేదు. హత్రాస్‌ (ఉత్తర ప్రదేశ్‌) ‌ఘటన ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి. అప్పుడు ఈ హక్కుల, మహిళా సంఘాల నేతల వీరంగం జ్ఞప్తికి తెచ్చుకోవాలి. జాతీయ బాలల హక్కుల రక్షణ సంఘం తమిళనాడు పోలీసు డైరెక్టర్‌ ‌జనరల్‌కు  ఈ ఉదంతం మీద సంజాయిషీ కోరుతూ నోటీసులు ఇచ్చింది. అయినా బాలిక మృతి పట్ల ఏ ఒక్క అభ్యుదయ స్త్రీవాద సంస్థ, వామపక్ష మేధావి, పత్రిక సానుభూతి ప్రకటించ లేదు. ఎందుకంటే, ఒక క్రైస్తవ వసతిగృహ యాజమాన్యం ఆమెను క్రైస్తవంలోకి మార్చే ప్రయత్నంలో జరిగిన దురాగతం కనుక. ముస్లింలు, క్రైస్తవులు చేసే దుశ్చర్యలకు ఇక్కడ మేధావుల నుంచి ఆమోదముద్ర ఉంటుందని అర్థం చేసుకోవాలేమో!

వడుగపాళయం అనే గ్రామానికి చెందిన (అరియలూరు జిల్లా) చెందిన ఆ 17 ఏళ్ల బాలిక మిచియల్‌పట్టి (తంజావూరులో ఉంది)లో ఉన్న సేక్రెడ్‌ ‌హార్ట్ ‌హైయర్‌ ‌సెకెండరీ స్కూల్‌లో 12వ తరగతి చదువుతోంది. సెయింట్‌ ‌మిషెల్‌ ‌బాలికల వసతి గృహంలో ఉంటున్నది. ఈ బాలిక ఈ జనవరి 9న ఆత్మహత్యాయత్నం చేసింది. 19వ తేదీన చనిపోయింది. ఈ పాఠశాలలో విద్యార్థినుల మతం మార్చడానికి అన్ని రకాల దండోపాయాలు జరుగుతున్నాయని ఇప్పటికే ఫిర్యాదు ఉంది. మతం మారకపోతే చాలా దారుణమైన శిక్షలు విధిస్తారు. తనను మతం మారమని వేధించేవారనీ, తన తల్లిదండ్రుల సమక్షంలో కూడా ఇలాంటి ప్రయత్నం జరిగిందనీ తాను వ్యతిరేకించడంతో పాఠశాలలో పాయఖానాలు కడిగించడమే కాకుండా, హాస్టల్‌లో గదులు ఊడిపించి, గిన్నెలు కూడా తోమించారని ఇప్పుడు చనిపోయిన ఆ బాలిక చివరి క్షణాలలో వెల్లడించింది. అక్కడ ఉండే టీచరు మతం మారితే పెద్ద చదువులు చదివిస్తామనీ, ఒకవేళ మతం మారకపోతే ఇక్కడ ఉండొద్దని ఆదేశించిందని ఆ బాలిక వీడియోలో స్పష్టంగా చెప్పింది. ఈ కేసులో హాస్టల్‌ ‌వార్డెన్‌ ‌సాగయమేరి (క్రైస్తవ సన్యాసిని)ని పోలీసులు అరెస్టు చేశారు.

9వ తేదీన ఆ బాలిక ఆత్మహత్య చేసుకోవడానికి పురుగుల మందు తీసుకుంటే, 10వ తేదీన తండ్రి మురుగునానందంకు కబురు పంపారు. వాంతులు చేసుకుంటున్న కూతురిని తీసుకువెళ్లమని ఆదేశించారు. తరువాత తంజావూరు వైద్యకళాశాల ఆసుపత్రికి తరలించారు. స్పృహలేని స్థితిలో అక్కడికి తీసుకువెళ్లినప్పటికీ, తరువాత డాక్టర్ల ప్రయత్నంతో ఆత్మహత్య కారణాలను ఆ బాలిక చెప్పింది. అక్కడి వైద్యులే తిరుక్కట్టుపల్లి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పాఠశాల హాస్టల్‌ ‌వార్డెన్‌ ‌బాలికను హింసించిన సంగతి, మత మార్పిడికి ఒత్తిడి చేసిన వాస్తవాన్ని పోలీసులు ధ్రువీకరించుకున్నారు. తనను రెండేళ్లుగా వేధిస్తున్నారని ఆ బాలిక చెప్పింది.

కానీ ఈ కేసులో తిమ్మిని బ్రహ్మిని చేయాలన్న తలంపు ప్రత్యక్షంగా కనిపిస్తున్నది. బాలిక మరణ వాఙ్మూలాన్ని అంతిమ సాక్ష్యంగా పరిగణించడం సాధ్యం కాదని తంజావూరు పోలీసు సూపరింటెం డెంట్‌ ‌రవళి ప్రియ చెప్పడం విశేషం. ఎందుకంటే తల్లిదండ్రులు మొదట ఇచ్చిన ఫిర్యాదులో మత మార్పిడి ప్రస్తావన లేదట. మనితానియ మక్కల్‌ ‌కచ్చి అనే పార్టీ ఎమ్మెల్యే ఎంహెచ్‌ ‌జవాహిరుల్లా కూడా ఇందులో మతకోణం లేదంటూ పోలీసులకు వత్తాసు పలుకుతున్నాడు. బాధితురాలే స్వయంగా చెప్పిన ఆడియో ఉండగా పోలీసు సూపరింటెండెంట్‌ ఇలాంటి ప్రకటన ఎలా చేస్తారని తమిళనాడు బీజేపీ నాయకుడు కె. అన్నామలై ప్రశ్నిస్తున్నారు. దర్యాప్తులో కొంత పురోగతి కూడా లేకుండానే బాలిక ప్రకటన నమ్మదగినది కాదని ఎలా చెబుతారని కూడా ఆయన అన్నారు. క్రైస్తవంలోకి మారమని తనను వేధించారనీ అందుకే చనిపోయాననీ అంత స్పష్టంగా ఆ బాలిక చెప్పినా, మేం నమ్మబోమని పోలీసులు, కొన్ని స్థానిక రాజకీయ పార్టీలు మాట్లాడుతూ ఉంటే, న్యాయం ఎక్కడ? హిందువులకు న్యాయం అందరాదని వీళ్లంతా మూకుమ్మడిగా కుట్ర పన్నుతున్నారా?

About Author

By editor

Twitter
Instagram