నేతాజీ (జనవరి 23) జయంతి సందర్భంగా మణిపూర్‌ ‌రాజధాని ఇంఫాల్‌లో జరిగిన కార్యక్రమంలో ఆర్‌ఎస్‌ఎస్‌ ‌సర్‌ ‌సంఘచాలక్‌ ‌మోహన్‌జీ భాగవత్‌ ‌మాట్లాడారు.

జాగృతి పాఠకుల కోసం మోహన్‌జీ ప్రసంగ పాఠం…

ఈ రోజు (జనవరి 23) నేతాజీ జయంతి. ప్రతి సంవత్సరం ఈ దినాన వారిని స్మరిస్తుంటాం. భారతదేశమంతటా ఈ కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. స్వాతంత్య్రం సాధించి 75 సంవత్సరాలు అవుతున్న ఈ సందర్భంలో, ఈ సంవత్సరం ఈ కార్యక్రమం మరింత ప్రాధాన్యం సంతరించుకుంది.  స్వాతంత్య్రం కోసం నేతాజీ ఇల్లు విడిచి వెళ్లి, సేనను తయారుచేసుకుని ఆంగ్లేయులపై పోరాడారు. ఆయన మరణించారా లేదా అన్నది ఇప్పటికీ నిగూఢంగానే ఉండిపోయింది. ఏది ఏమైనా వారు అంతర్ధాన మయ్యారు. వారి జీవితం మొత్తాన్ని స్వసుఖాల కోసం కాక,  దేశం కోసం సమర్పించారు. ఆజాదీ కా అమృతోత్సవ్‌ అనే ప్రత్యేక సందర్భంలో మాత్రమే కాదు, ఇలాంటి మహోన్నత వ్యక్తిని  నిరంతరం స్మరించుకొంటూనేఉంటాం. ఉండాలి కూడా. ఎందుకంటే వారి జీవనం మనందరికీ ఆచరణీయమైనది.

నేతాజీ సుభాస్‌ ‌చంద్రబోస్‌  ‌తన స్వార్థం కోసం జీవించలేదు. తన వారి (దేశవాసుల) కోసం జీవించారు. అప్పుడు మన దేశం బానిసత్వంలో ఉంది. బానిసత్వంలో జీవించడం ఎవరి స్వభావమూ కాదు. ఎవరికైనా అలా జీవించడం  అవమానమే. అలాంటి స్థితిలో స్వాతంత్య్రం కోసం ప్రయత్నించడం ప్రతి భారత పుత్రుడి స్వాభావిక కర్తవ్యం. దేశం మొత్తానికి స్వాతంత్య్రం సిద్ధింప చేయాలని నేతాజీ ప్రయత్నించారు.

నేతాజీ ఒరిస్సాలో పుట్టారు. బెంగాల్‌లో చదువుకొన్నారు. కాని యావత్‌ ‌భారతదేశాన్ని తన కార్యక్షేత్రంగా మలచుకొన్నారు. విదేశాలకెళ్లి ఆంగ్లేయుల సైనికులుగా పనిచేస్తున్న భారతవాసుల మనసుల్లో దేశభక్తిని జ్వలింపచేశారు. ఆ సమయంలో ఆంగ్లేయుల సైన్యం చాలా బలంగా ఉంది. రవి అస్తమించని సామ్రాజ్యమని ప్రతీతి. అలాంటి బ్రిటిష్‌ ‌సామ్రాజ్యానికి నేతాజీ సవాలు విసిరారు. అంతేకాదు, విదేశీయులపై పోరాటంలో అనేక అడ్డంకులనెదిరించి భారత భూమిపై స్వతంత్ర ప్రభుత్వాన్ని ఏర్పాటుచేశారు కూడా. ఈ పనిలో భారతవాసులందరినీ కలుపుకొన్నారు. ఎంతో తీవ్రమైన పోరాటం, ఎంతో స్వాభిమానంతో, ఎంతో పరాక్రమవంతమైన పోరాటం ఆంగ్లేయులతో చేస్తున్నప్పటికీ ఒక్క భారతీయునితో కూడా తగాదా పడలేదు. దేశభక్తి అంటే ఏమిటి, యావత్‌ ‌దేశం కోసం పనిచేయటం. మనవారితో విభేదించినప్పటికీ, భేదాభిప్రాయాలున్నప్పటికీ ఎక్కడా గొడవ పడలేదు. కాంగ్రెస్‌కు అఖిల భారతీయ అధ్యక్షునిగా ఎన్నికై నప్పటికీ కారణాంతరాల వలన గాంధీజీకి ఇష్టం లేకుండినది. మెజారిటీ నేతాజీ వైపు ఉన్నారు. కావాలనుకుంటే వారు గొడవపడి ఉండవచ్చు. కాని అలా చేయలేదు. వారే  ఆ పదవి నుండి వైదొలగారు. ఎందుకంటే విదేశీ శక్తులతో పోరాటం చేయాలంటే మనం అంతా ఒకటవ్వాలి. నీదీ, నాదీ అంటూ అల్ప స్వార్థం కోసం పోరాటం వదలిపెట్టడం కాకుండా, దేశహితం అనే గొప్ప స్వార్థం కోసం యుద్ధం చేయాలి. నేతాజీ నిర్మాణం చేసిన సైన్యంలో యావత్‌ ‌భారతదేశం నుండి జవానులు చేరారు. ఆజాద్‌ ‌హింద్‌ ‌ఫౌజ్‌ ‌పేరును మనం గమనిస్తే దేశం మొత్తంలోని అన్ని ప్రాంతాల నుండే కాదు, అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని భాషల వారున్నారు. దేశం మొత్తాన్ని తనదిగా నేతాజీ భావించారు కనుక ఆ విధంగా చేయగలిగారు. వారి జాతీయ భావన అలాంటిది. దేశభక్తి, ఏకాత్మ భావనతోబాటు అందుకు సర్వస్వార్పణ ప్రవృత్తితో నేతాజీ తన సర్వస్వాన్ని అర్పించారు. తనది అంటూ ఏదీలేదు, ఉన్నదంతా దేశం కోసమే అనేది వారి జీవన ప్రవృత్తిగా కొనసాగింది. అందరి కోసం జీవించాలనేది వారికి కలిగిన గొప్ప ప్రేరణ. దీనికి నాంది, ఆధ్యాత్మిక ప్రేరణ అని వారి సాహిత్యాన్ని చదివితే మనకు అర్థం అవుతుంది. బోస్‌ ‌యువకునిగా ఉన్నపుడు హిమాలయాలకు వెళ్లారు. ఆధ్యాత్మిక ప్రేరణతో దేశం కోసం తన సర్వస్వాన్ని త్యాగం చేశారు. ఆ సమయంలో దేశం పరాయి  పాలనలో ఉన్నది కాబట్టి స్వాతంత్య్రం సాధించే పని చేశారు నేతాజీ. అయితే దేశాన్ని ముందుకు తీసుకెళ్లాలంటే, బలోపేతం చేయాలంటే అలాంటి వ్యక్తులు ఎప్పటికీ అవసరమే. 75 సంవత్సరాల స్వాతంత్య్ర అమృతోత్సవాల సందర్భంగానే కాకుండా ఇలాంటివారిని ఎల్లప్పుడూ స్మరించుకొంటూనే ఉండాలి. మనందరం వారి దారిలో నడిచినా  సుభాస్‌ ‌బోస్‌లము కాలేకపోవచ్చు. కాని అయిదు అడుగులైనా ముందుకేయవచ్చు. ఆ విధంగా వారిని అనుసరించడం వలన మనలో వ్యక్తిగతంగా కలిగే మంచి పరివర్తన, దేశహితం కోసం పరివర్తన, ప్రజలంతా సుభిక్షంగా ఉండాలన్న ఆశయం సిద్ధిస్తాయి. తద్వారా నా సుఖం అందరి సుఖంలో ఉంటుందనే భావన నాటుకొంటుంది. నా సుఖం కోసం ప్రత్యేకంగా ప్రయత్నించాల్సిన అవసరం లేదు. కనుక నేతాజీని అనుసరించడమే వారికి మనం ఇచ్చే నిజమైన నివాళి.

About Author

By editor

Twitter
Instagram