ఎం.వి.ఆర్‌. ‌శాస్త్రి

“Members of the Azad Hind Fauj are honest patriots and revolutionaries fighting for the freedom of their motherland. They are therefore entitled to decent treatment during their captivity, in accordance with international conventions.. If our countrymen at home take up this matter and carry on raging and tearing campaign inside India, I am sure that the British authorities will be brought to their senses.’’

(ఆజాద్‌ ‌హింద్‌ ‌ఫౌజ్‌ ‌సభ్యులు తమ మాతృభూమి స్వాతంత్య్రం కోసం పోరాడుతున్న సిసలైన దేశభక్తులు; విప్లవకారులు. నిర్బంధంలో ఉన్నప్పుడు వారిపట్ల అంతర్జాతీయ ఒడంబడికల ప్రకారం మర్యాదగా వ్యవహరించాలి. లేదా- ఈ విషయంలో మా దేశ వాసులు కలగజేసుకుని ఇండియా లోపల భీకరమైన ఉద్యమం సాగిస్తారు. అప్పుడు గానీ బ్రిటిష్‌ ‌పాలకులకు బుద్ధిరాదు.)

పట్టుబడిన ఐఎన్‌ఎ ‌వీరులు 20 మందిని సరైన విచారణ ఏదీ లేకుండా చంపేశారని తెలిసి, 1945 మే 30న (మరణించటానికి మూడు నెలల ముందు) సుభాస్‌ ‌చంద్రబోస్‌ ‌చేసిన హెచ్చరిక ఇది. యుద్ధం గెలిచిన మదంలో తెల్లదొరతనానికి ఈ హితవు తలకెక్కలేదు. గతంలో లెక్కలేనన్ని తిరుగుబాట్లను ఉక్కుపాదంతో తొక్కివేసినట్టే, 1857 స్వాతంత్య్ర సంగ్రామంలో పాల్గొన్న వారిని చెట్లకు ఉరితీసి జనాన్ని హడలగొట్టినట్టే ఈసారీ తమ తడాఖా ఇంకొంచెం నాజూకుగా చూపించాలని విర్రవీగారు. ద్రోహులకు పట్టే గతిని కళ్ళారా చూశాక మళ్ళీ ఇంకొకడు అలాంటి తప్పుడు పనికి సాహసించలేడు; అవిధేయతకు శిక్ష ఎంత తీవ్రంగా ఉంటుందో తెలిశాక సైన్యంలో ఇంకెవడూ క్రమశిక్షణ గీటు దాటడు – అని దొరలు తలపోశారు.

అంత గొప్ప కార్యాన్ని తలపెట్టినప్పుడు దానికి వేదిక కూడా అంతే గొప్పగా ఉండాలి కదా? బ్రిటిషు సర్కారును జయించి ఎర్రకోటలో విజయోత్సవం జరపాలని విర్రవీగిన ఐఎన్‌ఎ ‌కొమ్ములు విరిచేందుకు ఎర్రకోటే సరైన స్థలం! 1857లో తిరుగుబాటు దారులను చిత్రహింసలు పెట్టిందీ, తిరుగుబాటులో చేరిన బహదూర్‌ ‌షా చక్రవర్తిని విచారించి ప్రవాస శిక్ష వేసిందీ అక్కడే. తాజా తిరుగుబాటు భరతం పట్టటానికీ అదే మంచి చోటు. ఎర్రకోట అయితే మీడియా కవరేజికి, ప్రెస్‌ ‌బ్రీఫింగులకు అనువుగా ఉంటుంది. ఇలా అన్నీ చక్కగా ఆలోచించి సర్కారు వారు ఎర్రకోటకు విచారణ తోరణాలు కట్టారు.

బందీలుగా పట్టుకున్న సుమారు పాతికవేల మంది ఐఎన్‌ఎ ‌యోధుల్లో చాలా మందిని అంతకు ముందే ఎర్రకోటకు తరలించి ఖైదు చేశారు. మిలిటరీకి చెందిన అన్ని విభాగాల ఇంటలిజెన్స్ ‌సంస్థలకు కలిపి కంబైన్డ్ ‌సర్వీసెస్‌ ‌డిటైల్డ్ ఇం‌టరాగేషన్‌ ‌సెంటర్‌ (•‌ణ×) అక్కడే నెలకొల్పి ఐఎన్‌ఎ ‌ఖైదీలను గుచ్చిగుచ్చి నిగ్గదీసి, ఎవరెవరి పాత్ర ఎంతెంత అన్నది ఆరాలు తీశారు. సేకరించిన సాక్ష్యాధారాలను బట్టి మహాతీవ్ర నేరాలకు పాల్పడిన వార్‌ ‌క్రిమినల్స్‌గా 125 మందిని షార్ట్ ‌లిస్టు చేసారు. వారిలో కనీసం 20 మందికి కోర్ట్ ‌మార్షల్‌లో మరణశిక్ష పడుతుందని వైస్రాయ్‌ ‌లార్డ్ ‌వేవెల్‌ అం‌చనా వేశాడు.

తొలివిడతగా బోనెక్కించటానికి పోపా యుద్ధ రంగంలో పనిచేసిన ఐఎన్‌ఎ ‌ఫస్ట్ ‌డివిజన్‌ ‌కమాండర్లు షానవాజ్‌ ‌ఖాన్‌, ‌ప్రేమ్‌ ‌సెహగల్‌, ‌గురుబఁ్‌ ‌సింగ్‌ ‌ధిల్లాన్‌లను ఎంపిక చేశారు. (ఐఎన్‌ఎలో వారు ప్రమోషన్ల మీద పొందిన ఉన్నత హోదాలను లాగేసి పూర్వం బ్రిటిష్‌ ఆర్మీలో ఉన్నప్పటి పాత రాంకులకు వారిని ముందే డిమోట్‌ ‌చేశారు.) ఆ ముగ్గురు ఐఎన్‌ఎలో సీనియర్‌ ‌మోస్ట్ ఆఫీసర్లేమీ కారు. ముందుగా వారినే బోనులో నిలబెట్టటానికి ప్రత్యేక కారణమేమీ లేదు. ఇంకో యాదృచ్ఛికత ఏమిటంటే వారిలో ఒకరు హిందువు; ఒకరు ముస్లిం; ఒకరు సిక్కు. నేరారోపణ చేయబడ్డ ముగ్గురూ వేరువేరు మతాలకు చెందిన వారు కావటం నేతాజీ నడిపిన పోరాటపు జాతీయ లక్షణాన్ని చెప్పకనే చెప్పింది. జిన్నా వంటి వారిని ఉసికొలిపి దేశంలో మత విద్వేషాల చిచ్చు పెట్టేందుకు బ్రిటిషు సర్కారు భయానక కుతంత్రాలు పన్నుతున్న సమయాన అన్ని మతాల వారిని ఏకంచేసి జాతీయ సైన్యం నిర్మించిన నేతాజీ మీద ప్రజలకు గౌరవం పెరిగింది.

యుద్ధం నడిచినంతకాలమూ పత్రికల మీద కర్కశమైన సెన్సార్షిప్‌ ఉం‌డేది. సుభాస్‌ ‌చంద్రబోస్‌ ‌ద్రోహి; జపాన్‌ ‌చేతిలో కీలుబొమ్మ; అతడు కూడగట్టిన ఐఎన్‌ఎ అనేది జపాన్‌ ఆడించినట్టల్లా ఆడే పప్పెట్‌ ఆర్మీ అని బ్రిటిష్‌ ‌బాకాలు చేసిన నిరంతర దుష్ప్రచారమే పత్రికల్లోనూ వచ్చేది. అడపా దడపా సుభాస్‌ ‌బోస్‌ ‌చేసిన రేడియో ప్రసంగాలు రహస్యంగా ఆలకించటం ద్వారా ప్రజలకు కాస్తయినా వాస్తవాలు తెలిసేవి. యుద్ధం ముగిసి సెన్సార్‌ ఆం‌క్షలు తొలిగాక అబద్ధాల ఆట కట్టింది. బ్రిటిష్‌ ‌పీడ నుంచి దేశాన్ని విముక్తి చేయటానికి నేతాజీ నేతృత్వంలో వేలాది జాతీయ సైనికులు సాగించిన అద్భుత సంగ్రామం గురించి హిందూస్తాన్‌ ‌టైమ్స్, ఇం‌డియన్‌ ఎక్స్‌ప్రెస్‌, ‌ది హిందూ వంటి అగశ్రేణి పత్రికలు ఫ్రంట్‌ ‌పేజిలో రసవత్తర వార్తాకథనాలు ప్రచురించసాగాయి. జమాల్‌ ‌కిద్వాయ్‌ అనే యువ జర్నలిస్టు 1945 అక్టోబర్‌లో రంగూన్‌ ‌వెళ్లి లెఫ్టినెంట్‌ ‌కల్నల్‌ ‌లక్ష్మీ స్వామినాథన్‌ను కలసి ఆజాద్‌ ‌హింద్‌ ‌ఫౌజ్‌, ‌ఝాన్సీరాణి రెజిమెంట్‌ ‌చేసిన త్యాగాలు, పడిన కష్టాలు, మాతృదేశ విమోచనకు సాగించిన వీర పోరాటాలకు సంబంధించి సేకరించిన వివరాలు జాతీయ మీడియాలో పెద్ద సంచలనమయ్యాయి. ఐఎన్‌ఎ ‌సైనికులు నేషనల్‌ ‌హీరోలు అయ్యారు. స్వాతంత్య్రం కోసం అంతటి మహా యుద్ధం సాగించిన నేతాజీ పట్ల ఆరాధనాభావం ప్రతి భారతీయుడి ఎదలో ఉప్పొంగింది. ఐఎన్‌ఎ ‌ఖైదీలను తీసుకువెళ్ళే రైళ్ళు ఆగిన ప్రతిచోటా వేలసంఖ్యలో జనం గుమికూడి నేతాజీ చిత్రపటాలు ప్రదర్శిస్తూ సంఘీభావ సూచకంగా నినాదాలు చేసేవారు. ఆజాద్‌ ‌హింద్‌ ‌ఫౌజ్‌ ‌కవాతు గీతం ‘కదమ్‌ ‌కదమ్‌ ‌బడాయే జా’ గ్రామఫోన్‌ ‌రికార్డు గ్రామగ్రామానా మారుమోగేది. ఐఎన్‌ఎ ‌వారి ‘జైహింద్‌’ ‌నినాదం దేశమంతటా పాపులర్‌ అయింది. మిలిటరీ యూనిఫాంలో నేతాజీ చిత్రపటం ప్రతి ఇంటిలో, ప్రతి దుకాణంలో సగర్వంగా వేలాడింది. ‘ద్రోహులు కారు… దేశభక్తులు’ అనే కరపత్రం విస్తృతంగా ప్రచారమయింది. ఐఎన్‌ఎ ‌ఖైదీలకు మద్దతుగా ఎక్కడ చూసినా ర్యాలీలు! ప్రతి నోటా నేతాజీ నామస్మరణ! దేశంలో ఎక్కడ చూసినా ఐఎన్‌ఎ ‌మీద చర్చ. ఆ దేశభక్తులను ఎలాగైనా కాపాడుకొని తీరాలన్నదే ఆందరి మాట.

ఆ అందరిలో మహా ఘనతవహించిన కాంగ్రెస్‌ ‌నేతలు కూడా ఉన్నారు. అఖిల భారత కాంగ్రెస్‌ అధ్యక్షుడుగా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన బోస్‌ను పని చేయనినివ్వకుండా సైంధవుల్లా అడ్డుపడి, సహాయనిరాకరణ చేసి, అమానుషంగా సతా యించిన మహానుభావులు వారు. వారితో వేగలేక దేశం వదిలిపోయి ఆయన బయటనుంచి స్వాతంత్య్ర సంగ్రామం సాగించినంత కాలమూ బోస్‌ ‌ఫాసిస్టు అనీ, నాజీల తొత్తు అనీ, జపాన్‌ ఏజెంటు అనీ బ్రిటిషువారి కంటే ఎక్కువగా తిట్టి పోశారు. నాజీలతో, ఫాసిస్టులతో చేతులు కలిపిన సుభాస్‌ ‌చంద్ర బోస్‌ ‌తన సైన్యంతో ఇండియా మీదికి దండెత్తి వస్తే తాను స్వయంగా అతడిని ఎదుర్కొంటానని వీర శూర జవాహర్‌లాల్‌ ‌నెహ్రూ ఉత్తర కుమార ప్రతిజ్ఞలు చాలా చేశాడు. ఐఎన్‌ఎని జపాన్‌ ‌చేతిలోని ‘పప్పెట్‌ ఆర్మీ’ (కీలుబొమ్మ సేన) అని అనేక విధాల ఈసడించాడు.

బతికి ఉన్నంతకాలం సుభాస్‌ ‌చంద్రబోస్‌ ‌మీద కత్తికట్టిన కాంగ్రెస్‌ ‌నీతిమంతులు అతడు మరణించాడు; ఇక తమకు సమస్య కాడు అని ధృవపడ్డాక జంకు గొంకు లేకుండా ప్లేటు ఫిరాయించి రాత్రికి రాత్రి నేతాజీకి, ఐఎన్‌ఎకి వీరాభిమానులయి పోయారు. నేతాజీ పడిన కష్టాన్ని, కత్తుల వంతెనపై ఆయన నడిపించిన ఐఎన్‌ఎ ‌త్యాగాలను, శౌర్యాన్ని, వాటి మూలంగా ప్రజల్లో ఉప్పొంగిన సానుభూతిని తమ రాజకీయ లాభానికి వారు చక్కగా ఉపయోగించుకున్నారు.

ఐఎన్‌ఎ ‌విచారణ సమయానికి కాంగ్రెస్‌ అన్ని విధాల డీలా పడి రాజకీయంగా దివాలా స్థితికి చేరింది. యుద్ధ కాలంలో బ్రిటిష్‌ ‌సర్కారుతో సహక రించినా, సంఘర్షించినా కాంగ్రెస్‌ ‌బావుకున్నది సున్న. క్విట్‌ ఇం‌డియా పోరాటాన్ని బ్రిటిషు ప్రభుత్వం క్రూరంగా అణచేసి, పేరున్న నాయకులందరినీ దీర్ఘకాలం ఖైదు చేశాక దేశంలో కాంగ్రెస్‌ ‌కార్యకలాపాలు ఇంచుమించుగా స్తంభించాయి. జాతీయ రాజకీయాలలో కాంగ్రెస్‌ ‌ప్రభావం నగణ్యమై ముస్లిం లీగ్‌ ‌ప్రాధాన్యం హెచ్చింది. దూరమైన జాతీయ జీవన స్రవంతికి తిరిగి ఎలా చేరాలో తోచక దిక్కులు చూస్తున్న కాంగ్రెస్‌ ‌వారికి ఐఎన్‌ఎ ‌విచారణ వ్యవహారం అయాచిత వరమైంది.

 ఇంటిపేరు అహింస అని చెప్పుకునే కాంగ్రెస్‌ ‌వారు రాజకీయ అవసరార్థం అహింస వ్రతాన్ని పక్కనపెట్టారు. హింసాత్మక సంగ్రామంతో దేశాన్ని విముక్తి చేయబూనిన ఐఎన్‌ఎకి ఎంచక్కా గొడుగు పట్టారు. మొదటి ప్రపంచ యుద్ధ కాలంలో సాయుధ పోరాటం ద్వారా భారత స్వాతంత్య్రం సాధించటానికి బయటి దేశాలనుంచి నౌకల్లో వచ్చిన గదర్‌ ‌విప్లవకారులను హింసకు పాల్పడ్డారన్న నెపంతో వ్యతిరేకించి, వారిని అవశ్యం ఉరి తీయవలసిందేనని పలికిన అహింసా ప్రవక్త మహాత్మా గాంధీ గారికి, అదే మాదిరిగా రెండో ప్రపంచ యుద్ధంలో ఐఎన్‌ఎ ‌సాగించిన సాయుధ స్వాతంత్య్ర పోరాటం తెగ ముద్దొచ్చింది! సుభాస్‌ ‌బోస్‌కు బద్ధ వ్యతిరేకులైన నెహ్రూ, పటేల్‌లను వెంటపెట్టుకుని ఐఎన్‌ఎ ‌ఖైదీల చెరసాలకు వెళ్లి, మీకు అండగా మేమున్నామని మహాత్మాజీ గొప్ప అభయమిచ్చాడు. ఐఎన్‌ఎ ‌కమాండర్‌ ‌మహమ్మద్‌ ‌కియానీ భుజాల మీద చేతులు వేసి ‘మీరు మా ఆఫీసర్లు’ అని భరోసా ఇచ్చాడు. తన పేరిట ఐఎన్‌ఎలో గాంధీ బ్రిగేడ్‌ ఉం‌డిందని చెపితే ముక్కున వేలు వేసి చిరుకోపం అభినయిం చాడు. ఐఎన్‌ఎ ‌ఖైదీల తరఫున న్యాయపోరాటం చేయటానికి కాంగ్రెస్‌ ‌వర్కింగ్‌ ‌కమిటీ 1945 నవంబరు 7న నేషనల్‌ ‌డిఫెన్స్ ‌కమిటీని ఏర్పరచింది. న్యాయవాదిగా ప్రాక్టీసు చేసిన కాలంలో ఒక్క పెద్ద కేసూ గట్టిగా వాదించి ఎరుగని జవాహర్‌లాల్‌ ‌నెహ్రూ గారు మూలన పెట్టిన నల్ల గౌను తొడుక్కుని ఐఎన్‌ఎ ‌నిందితుల తరఫున వాదించేందుకు తానుసైతం తయారయ్యాడు. ఐఎన్‌ఎని శిక్షించటమంటే మొత్తం ఇండియాను, భారతీయులందరిని శిక్షించినట్టే అని మీడియా ముందు గర్జించాడు.

 ఎర్రకోటలో సైనికుల బారక్స్ ‌డార్మిటరీగా ఉపయోగించిన హాలులో 1945 నవంబర్‌ 5‌న ఐఎన్‌ఎ ‌మీద మిలిటరీ కోర్టు విచారణ మొదలైంది. కోటలోని బురుజులు, గోడల నిండా సాయుధ సైనికులు కాపలా ఉన్నారు. చుట్టుపట్ల రహదారులన్నీ మిలిటరీ పోలీసులు మూసేశారు. విచారణ నడిచినంత కాలమూ నిషేధాజ్ఞలను ధిక్కరించి ‘ఐఎన్‌ఎ ‌వీరులను కాపాడండి’ అని ప్లకార్డులు పట్టి జనం పెద్దసంఖ్యలో ఎర్రకోట ఎదుట గుమికూడేవారు. ప్రభుత్వ, మిలిటరీ వాహనం ఏది లోపలికి వెళుతున్నా ‘జైహింద్‌’ అని నినదించేవారు. ఎర్రకోటలో భాగమైన సలీంగడ్‌ ‌కోట వెలుపల రైల్వే ట్రాక్‌ ‌మీద వచ్చేపోయే ప్రతి రైలునూ ప్రయాణికులు చెయిన్‌ ‌లాగి ఆపేవారు. కోట లోపలి ఖైదీలకు సంఘీభావంగా ‘జైహింద్‌’, ‘ఇం‌క్విలాబ్‌ ‌జిందాబాద్‌’ ‌నినాదాలు నోరు నొప్పిపుట్టే దాకా చేసిన తరవాతగానీ బండిని కదలనిచ్చేవారు కాదు. ‘లాల్‌ ‌కిలా తోడ్‌ ‌దో! ఆజాద్‌ ‌హింద్‌ ‌ఫౌజ్‌ ‌చోడ్‌ ‌దో’ అని నినాదం చేస్తూ దిల్లీ నుంచి పల్లెల వరకూ ప్రజా ప్రదర్శనలు విరివిగా సాగాయి.

మేజర్‌ ‌జనరల్‌ ‌బ్లాక్స్ ‌లాండ్‌ ‌నాయకత్వంలో ఏడుగురు ఆర్మీ ఆఫీసర్లు మిలిటరీ కోర్టులో ఐఎన్‌ఎ ‌విచారణకు కొలువుదీరారు. తొలివిడతలో నిందితులైన షానవాజ్‌ ‌ఖాన్‌, ‌సెహగల్‌, ‌ధిల్లాన్‌లను కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల నడుమ ప్రవేశపెట్టి వారిమీద అభియోగాలను వినిపించారు. ముగ్గురి మీద విడివిడిగా, ఉమ్మడిగా మొత్తం పది నేరాలు మోపారు. ధిల్లాన్‌ ‌నలుగురిని హత్య చేశాడనీ, సెహగల్‌ ‌దానిని ఆమోదించి సహకరించాడనీ, అలాగే షానవాజ్‌ ఇం‌కొకడి హత్యకు కారకుడనీ, మొత్తం ముగ్గురూ భారత చక్రవర్తి అయిన ఆరవ కింగ్‌ ‌జార్జ్ ‌మహారాజావారి ప్రభుత్వంపై యుద్ధానికి ఒడిగట్టారనీ అభియోగాల సారాంశం. ‘అబద్ధం. మేము నిరపరాదులం’ అని ఏక కంఠంతో బదులిచ్చారు యూనిఫాంలో నిటారుగా నిలబడ్డ నిందితులు.

ముగ్గురు నిందితుల తరఫున వాదించటానికి భారత దేశ న్యాయ చరిత్రలో మొదటిసారిగా దిగ్గజాల వంటి న్యాయప్రవీణులూ, టాప్‌ ‌క్లాస్‌ ‌న్యాయ వాదులతో నేసనల్‌ ‌డిఫెన్స్ ‌కమిటీ ఏర్పాటైంది. న్యాయరంగంలో అఖండ ప్రజ్ఞావంతుడైన భూలాభాయి దేశాయి ముఖ్య బాధ్యత వహించిన ఆ కమిటీలో సర్‌ ‌తేజ్‌బహదుర్‌ ‌సప్రూ, టేక్‌ ‌చంద్‌, ‌కైలాస్‌ ‌నాథ్‌ ‌కట్జూ వంటి సీనియర్‌ ‌బారిస్టర్లు ఎందరో ఉన్నారు. గతంలో భగత్‌సింగ్‌ ‌తరఫున వాదించిన బారిస్టర్‌ అసఫాలీ డిఫెన్స్ ‌కమిటీ కార్యవర్గంలో ముఖ్యసభ్యుడు. డిఫెన్స్ ‌పక్షాన్ని సమర్థంగా నడిపించిన భూలాభాయి దేశాయి 1939లో కాంగ్రెస్‌ అధ్యక్ష పదవికి పోటీ చేసినప్పుడు సుభాస్‌ ‌చంద్రబోస్‌ను తీవ్రంగా వ్యతిరేకించిన కాంగ్రెసువాది. అయితేనేమి? స్వాతంత్య్రం కోసం సాగిన సాయుధ సంగ్రామం గురించి తెలిశాక నేతాజీకి వీరాభిమాని అయ్యాడు. ఐఎన్‌ఎను కేసుల బారి నుంచి బయటవేసే బాధ్యతను సంతోషంగా స్వీకరించాడు. ఎర్రకోటలోని ఆర్మీ బారక్స్‌కు వెళ్లి కలిసినప్పుడు నిందితులతో ఆయన అన్న మాటలివి: ‘‘జంటిల్మెన్‌! ‌నేను మిమ్మల్ని డిఫెండ్‌ ‌చేయటానికి వచ్చాను. కాని మీ డిఫెన్సు కంటే కూడా నేతాజీ గౌరవం, ఐఎన్‌ఎ ‌ప్రతిష్ఠ కాపాడటం ముఖ్యం. గౌరవప్రదంగా మీ ప్రాణాలు కాపాడటానికి మేము శాయశక్తులా ప్రయత్నిస్తాము. అది సాధ్యపడకపోతే మీరు మరణించి మీ నాయకుడి గౌరవాన్ని, మీ సంస్థ ప్రతిష్ఠను కాపాడటమే మీకు మంచిది.’’

సింగపూర్‌లో బ్రిటిష్‌ ‌సైన్యం లొంగిపోయి నప్పుడు జపాన్‌ ‌చేతిలో చిత్రహింసలకు గురి అయిన బ్రిటిష్‌ ‌సైన్యాధికారులు వేల సంఖ్యలో ఉన్నారు. జపాన్‌ ‌వారు ఎంత ఒత్తిడి చేసినా, ఎన్ని ఆశలు పెట్టినా ఐఎన్‌ఎలో చేరకుండా యుద్ధఖైదీలుగా కొనసాగి అష్టకష్టాలు పడిన భారతీయ సైనికులూ కొన్ని వేలమంది ఉన్నారు. శత్రుదేశంతో కుమ్మక్కై, విధేయత ప్రమాణాన్ని అతిక్రమించి, బ్రిటిష్‌ ‌సర్కారుకు ద్రోహం చేశారని ఐఎన్‌ఎ ‌వారిమీద వారందరికీ మహా కసి. అదృష్టవశాత్తూ యుద్ధంలో జపాన్‌ ఓడి, మళ్ళీ మంచి రోజులు వచ్చాక ఐఎన్‌ఎ ‌ద్రోహులకు గట్టి శాస్తి జరగాలని పూర్వపు యుద్ధ ఖైదీలు, బ్రిటిష్‌ ఆఫీసర్లు తహతహలాడారు. సైనిక ప్రమాణాన్ని ఉల్లంఘించి అవిధేయతకు పాల్పడిన ద్రోహులను కఠినంగా శిక్షించకపొతే సైన్యంలో విధేయత ఎలా ఉంటుందని జనరల్‌ ఓ ‌కొన్నర్‌ ‌వంటి మిలిటరీ ఉన్నతాధికారులు కమాండర్‌ ఇన్‌ ‌చీఫ్‌ ఆచిన్‌ ‌లెక్‌ను ప్రశ్నించారు.

 సర్కారు దృష్టిలో ఐఎన్‌ఎ ‌యోధులు ద్రోహులు; జపాన్‌ ‌తొత్తులు; సైనికుడికి ముఖ్యంగా ఉండవలసిన క్రమశిక్షణను మంట కలిపి, జీతమిచ్చే సర్కారుకు ఎదురుతిరిగి, బ్రిటిష్‌ ‌చక్రవర్తిమీదే యుద్ధానికి పాల్పడిన నీచులు. వారి మహాపరాధాలను సాక్ష్యా ధారాలతో పబ్లిగ్గా రుజువుచేస్తే జనమే వారి మొగాన ఉమ్ముతారు; అంతటి నికృష్టుల పట్లకూడా న్యాయప్రకారం వ్యవహరించి, చట్టబద్ధంగా శిక్షించిన బ్రిటిషు ధర్మప్రభువుల దొడ్డ గుణాన్ని వేనోళ్ళ కొనియాడుతారు – అని విదేశీ ప్రభువులు ఊహించారు. దానికి తగ్గట్టుగా నేరాల నిరూపణకు కావలసిన వాదాల, సాక్ష్యాల సరంజామా అంతా సిద్ధం చేసుకున్నారు.

ఐఎన్‌ఎ అనేది స్వతంత్ర సైన్యం కాదు; అది ఇండియాను జయించే దుర్బుద్ధితో జపాన్‌ ‌సృష్టించిన కీలుబొమ్మల మంద; చట్టబద్ధ అస్తిత్వమే లేనప్పుడు దానికి బ్రిటిష్‌ ‌ప్రభుత్వం మీద పోరాడే హక్కు లేదు; ఎవరినీ కోర్ట్ ‌మార్షల్‌ ‌చేసి మరణశిక్ష విధించే అధికారం దానికి లేదు; ఆ పేరిట నిందితులు చేసిన ఘాతుకాలను మామూలు హత్యల కిందే పరిగణించి దేశీయ చట్టప్రకారం శిక్షించాలి; విధేయత ప్రమాణాన్ని ఉల్లంఘించి తమను నియమించిన ప్రభుత్వం మీద యుద్ధానికి దిగటం క్షమించరాని రాజద్రోహం; అత్యంత కఠినంగా శిక్షార్హం. ఇదీ స్థూలంగా సర్కారు వాదం.

 అవతలవైపు నిందితుల పక్షాన నిలబడ్డవాడు అంతర్జాతీయ న్యాయ శాస్త్రంలో ఆరితేరిన భూలాభాయి దేశాయి. ఆయనకు అండదండ లందించిన వారు ఆ కాలంలో మొత్తం భారత దేశంలో కెల్లా బెస్ట్ ‌లీగల్‌ ‌బ్రెయిన్లు అనదగ్గ సుప్రసిద్ధ న్యాయవాదులు, తలపండిన న్యాయ ప్రవీణులు! బ్రిటిష్‌, అమెరికన్‌, ‌ఫ్రెంచ్‌, ‌లాటిన్‌ అమెరికన్‌, ఏసియన్‌ ‌చరిత్రల నుంచి పోలికలను చూపించి, ప్రపంచ న్యాయకోవిదుల అభిప్రాయాలను ఉటంకించి, అంతర్జాతీయ న్యాయ సూత్రాలను, న్యాయపీఠాల చరిత్రాత్మక నిర్ణయాలను ఎత్తిచూపి వారు పటిష్ఠమైన కేసు తయారుచేశారు. డిఫెన్సు వాదం స్థూలంగా ఇది:

పరాయి పాలనలో ఉన్న జాతికి తన స్వాతంత్య్రం కోసం సంఘటితమయ్యే హక్కు ఉందని ఆధునికకాలంలో అంతర్జాతీయ న్యాయం గుర్తించింది. అలా ఒక జాతిజనులు సంఘటితమై, సంఘటిత సైన్యం ద్వారా సంఘటిత యుద్ధం చేసినప్పుడు ఆ యుద్ధంలో భాగంగా చేసినదానికి ఆ సంఘటిత సైన్యానికి చెందినవారు స్వదేశీయ న్యాయస్థానాలకు సమాధానం చెప్పవలసిన పనిలేదు. దేశీయ చట్టం కింద వారిని ప్రాసిక్యూట్‌ ‌చేయ కూడదు. తమ జాతి విమోచన నిమిత్తం సంఘటితమై యుద్ధం ప్రకటించాక చేసే దేనికైనా అంతర్జాతీయ యుద్ధ న్యాయానికి మాత్రమే వారి జవాబుదారీ. చట్టబద్ధంగా ఏర్పడిన ఆజాద్‌ ‌హింద్‌ ‌తాత్కాలిక ప్రభుత్వం యుద్ధాన్ని ప్రకటించినందువల్ల ఆ యుద్ధ సమయంలో జరిగిన వాటికి ఆజాద్‌ ‌హింద్‌ ‌సైన్యానికి చెందిన వారిమీద సాధారణ పౌరుల వలె చర్య తీసుకోవటం అంతర్జాతీయ న్యాయానికి విరుద్ధం.

మలయా, సింగపూర్‌లలోని ఇండియన్‌ ‌సైనికులను గొర్రెలమంద వలె జపాన్‌కు అప్పగించిన తరువాత వారిమీద బ్రిటిషు ప్రభుత్వానికి కంట్రోలు ఉండదు. కొత్తగా ఏర్పడిన భారత ప్రభుత్వానికి వారు విధేయతా ప్రమాణం చేశాక బ్రిటిష్‌ ‌సమ్రాట్టుకు గతంలో వారు చేసిన ప్రమాణం రద్దు అవుతుంది. చట్టబద్ధంగా ఏర్పడిన ఆజాద్‌ ‌హింద్‌ ‌ప్రభుత్వం చేసిన ఇండియన్‌ ‌నేషనల్‌ ఆర్మీ యాక్ట్ ‌ప్రకారమే వారు పనిచేయవలసి ఉంటుంది. బ్రిటిష్‌ ‌ప్రభుత్వంపై యుద్ధప్రకటన తరవాత న్యాయరీత్యా దీవశ్రీశ్రీఱస్త్రవతీవఅ• గానే ఐఎన్‌ఎని పరిగణించి తీరాలి. తిరుగుబాటుదారులు బెల్లిగెరంట్‌ ‌ప్రతిపత్తిని పొందినదానికి గతంలో బ్రిటిష్‌ ‌సామ్రాజ్యంపై తిరగబడ్డ ఉత్తర అమెరికన్ల పోరాటం లాంటి చారిత్రక దృష్టాంతాలను, న్యాయస్థానాల తీర్పులను భూలాభాయి దేశాయి ఎన్నో ఉటంకించాడు. తన వాదనకు రుజువుగా అమెరికా స్వాతంత్య్ర ప్రకటన మొత్తాన్ని చదివి వినిపించాడు.

 డిఫెన్సు పక్షం ఎక్కువ కష్టపడవలసిన పనిలేకుండా వారికి కావలసిన సాక్ష్యాలను, సాక్షులను ప్రాసిక్యూషన్‌ ‌వారే అసంకల్పితంగా సమకూర్చిపెట్టారు! ఆజాద్‌ ‌హింద్‌ ‌స్వతంత్ర ప్రభుత్వం ఏర్పడిందనీ, అనేక రాజ్యాలు దానిని గుర్తించాయనీ, కేబినెట్‌ ‌నిర్ణయం ప్రకారం యుద్ధం ప్రకటింపబడిందనీ సర్కారీ సాక్షులే ధృవీకరించారు. జపాన్‌ ‌పూర్వపు ప్రభుత్వంలో, మిలిటరీలో ఉన్నత స్థానాల్లో ఉన్న మరికొందరిని డిఫెన్సు సాక్షులుగా సమన్‌ ‌చేశారు. ఆజాద్‌ ‌హింద్‌ ‌ప్రభుత్వంతో జపాన్‌ ‌రెగ్యులర్‌ ‌దౌత్య సంబంధాలను పెట్టుకున్న వైనాన్ని విదేశాంగ శాఖ వైస్‌ ‌మినిస్టరు ధృవీకరించాడు. ఆజాద్‌ ‌హింద్‌ ‌ప్రభుత్వానికి రంగూన్‌లో రాయ బారిగా తాను వెళ్ళినప్పుడు ఆధికారిక నియామక పత్రాలు చూపిస్తే గాని నేతాజీ తన మొగం చూడలేదని చెప్పి ఆ ప్రభుత్వ సర్వస్వతంత్ర ప్రతిపత్తిని అంబాసడర్‌ ‌హచియ కోర్టుకు చాటాడు. ఇంఫాల్‌ ‌రణరంగం ఆపరేషన్స్‌లో ఐఎన్‌ఎకి నిర్దేశించిన స్వతంత్ర భూమికను జనరల్‌ ‌కతకురా వివరించాడు. భారత భూభాగంలో తమకు వశమైన ప్రాంతాల, ఆస్తుల మీద ఆధిపత్యం ఆజాద్‌ ‌హింద్‌ ‌ప్రభుత్వానికి తాము ముందే దాఖలు పరచామని అతడు వెల్లడించాడు. 2,32,562 మంది ప్రమాణ పూర్వకంగా విధేయత ప్రకటించటం వల్ల, తొమ్మిది ప్రపంచ దేశాల గుర్తింపు పొందటం వల్ల, దానికంటూ ప్రత్యేక భూభాగం, సొంత సైన్యం ఉన్నందు వల్ల బోస్‌ ‌నెలకొల్పిన స్వతంత్ర ప్రభుత్వానికి చట్టబద్ధ ప్రతిపత్తి చేకూరిందని ప్రచార శాఖ మంత్రి ఎస్‌.ఎ. అయ్యర్‌ ‌సాక్ష్యాధారాలతో రుజువుపరచాడు.

 ఐఎన్‌ఎ ‌విచారణ ముగింపుకు వచ్చేసరికి భూలాభాయి దేశాయి ఆరోగ్యం క్షీణించింది. (తరవాత కొద్దివారాలకే ఆయన మరణించాడు.) పని ఒత్తిడి తగ్గించుకోవాలని వైద్యులు గట్టిగా చెప్పారు. ‘నా ప్రాణం పోతే పోనీ ఈ ముగ్గురు యువకులను నేను రక్షించి తీరాలి’ అని ఆయన అన్నాడు. నోట్స్ ఏదీ లేకుండా రెండురోజులు మొత్తం పదిగంటలకు పైగా ఆయన మిలిటరీ కోర్టులో అద్భతంగా వాదించాడు. విదేశీ పాలకులపై జాతీయ విమోచన యుద్ధం సాగించేందుకు అస్వతంత్ర జాతికి ఉన్న లీగల్‌ ‌హక్కును ప్రపంచంలో మొదటిసారి పవర్‌ఫుల్‌గా ఉగ్గడించిన ఆయన లీగల్‌ ఆర్గ్యుమెంటును వినేందుకు బి.ఆర్‌. అం‌బేద్కర్‌ ‌వంటి న్యాయ పారంగతులు రోజూ కోర్టుకు వెళ్ళేవారు.

 ఇరుపక్షాల వాదనలు అయ్యాక నిందితులు ముగ్గురి స్టేట్‌మెంట్లు! ‘‘రాజా? దేశమా? అన్న ప్రశ్న ఎదురైనప్పుడు నేను దేశాన్ని ఎంచుకున్నాను. జీవితంలో మొదటి సారి సుభాస్‌ ‌చంద్రబోస్‌ ‌ప్రసంగం విన్నప్పుడు నేను ఒక భారతీయుడి కళ్ళతో భారతదేశాన్ని దర్శించాను. ఆయన దేశభక్తి, నిస్వార్థబుద్ధి, జపాన్‌కు తలవంచని స్వతంత్ర వైఖరి నన్ను ముగ్ధుడిని చేశాయి. ప్రభుత్వం అంటున్నట్టు మాది పప్పెట్‌ ఆర్మీ అయితే మేము దుర్భరమైన బాధలను, కష్టాలను ఇష్టపూర్వకంగా పడేవాళ్ళం కాము.’’ అన్నాడు షానవాజ్‌ ‌ఖాన్‌. ‘‘‌బ్రిటిష్‌ ఆర్మీలో కొనసాగితే నెలకు 120 డాలర్లు సంపాదించగలిగి కూడా 80 డాలర్ల జీతానికి నేను ఐఎన్‌ఎలో చేరింది నా స్వార్థం కోసం కాదు… నా దేశ స్వాతంత్య్రం కోసం’’ అని ఎలుగెత్తి చాటాడు పి.కె.సెహగల్‌. ‘‘అన్నిటికంటే ముఖ్యం నీ దేశ క్షేమం. ఆ తరవాత నీ కింద పనిచేసేవారి క్షేమం. ఆ రెండిటి తరవాతే నీ క్షేమం’’ -అని డెహ్రాడూన్‌లోని రాయల్‌ ఇం‌డియన్‌ ‌మిలిటరీ అకాడెమీ ప్రాంగణంలో స్వర్ణాక్షరాలతో లిఖించబడ్డ సూక్తిని తన జాతివిమోచన నిబద్ధతను వివరిస్తూ గుర్తు చేశాడు జి.ఎస్‌.‌ధిల్లాన్‌.

 ‌వాదనలు ఎంత పదును అయితేనేమి? రుజువులు, సాక్ష్యాలు, సెంటిమెంట్లు ఎంత బలంగా ఉంటేనేమి? అది బ్రిటిష్‌ ‌సైన్యాధికారులు తీర్పరులైన బ్రిటిష్‌ ‌మిలిటరీ కోర్టు. సర్కారీ ప్రయోజనాలనే తప్ప న్యాయాన్ని, ధర్మాన్ని కాపాడటం దాని పని కాదు. నవంబరు 5 నుంచి డిసెంబరు 31 వరకూ 57 రోజులపాటు వాడిగా, వేడిగా నడచిన వాదప్రతి వాదాలను విన్న తరవాత కోర్ట్ ‌మార్షల్‌ ‌చైర్మన్‌ అయిన మేజర్‌ ‌జనరల్‌ అలాన్‌ ‌బ్లాంక్స్ ‌లాండ్‌ ‌ముందే ఆలోచించిపెట్టుకున్న రెడీమేడ్‌ ‌తీర్పు చెప్పాడు. ముగ్గురు నిందితులు రాజుమీద యుద్ధానికి దిగిన నేరంలో దోషులు అని నిర్ధారించటమైనదట. దానికి గాను విధించిన శిక్ష- ముగ్గురు ముద్దాయిలకూ యావజ్జీవ ఖైదు! జీతభత్యాల బకాయిలేవీ చెల్లించ కుండా అవమానకరమైన రీతిలో సర్వీసునుంచి డిస్మిస్‌!

 – ‌మిగతా వచ్చేవారం

About Author

By editor

Twitter
Instagram