భారత్‌ను శాశ్వతంగా బ్రిటిష్‌ ‌రాజ్‌తో బంధించాలని వైస్రాయ్‌ ‌కర్జన్‌ ఆశించాడు. అయితే బెంగాల్‌ ‌విభజన, ఆ పరిణామం తరువాత వచ్చిన పెను వివాదం భారత్‌ను పునరుజ్జీవనోద్యమం వైపు అడుగులు వేయించాయి. చివరకు బ్రిటన్‌ ‌భారత్‌ను విడిచిపెట్టాల్సి వచ్చింది. ఇవి ‘లయన్‌ అం‌డ్‌ ‌ది టైగర్‌’, ‘‌ది రైజ్‌ అం‌డ్‌ ‌ఫాల్‌ ఆఫ్‌ ‌ది బ్రిటిష్‌ ‌రాజ్‌ 1600-1947’ ‌రచయిత డేనిష్‌ ‌జడ్‌ ‌రాసిన వ్యాఖ్యలు.

స్వాతంత్రోద్యమాన్ని మలుపు తిప్పిన నిరసనోద్యమం ‘స్వదేశీ’. ఈ ఉద్యమం ఆగస్టు 7, 1905న ఆరంభమైంది. ఈ ఉద్యమం బ్రిటిష్‌ ‌పాలకుల వెన్నులో చలి పుట్టించింది. 1905లో బెంగాల్‌ను విభజించారు. కర్జన్‌ ‌తీసుకున్న ఈ నిర్ణయాన్ని భారతదేశమంతా వ్యతిరేకించింది. దేశవ్యాప్తంగా నిరసన ప్రారంభమైంది. లక్షలాది మంది ప్రజలు ఉద్యమంలో పాల్గొన్నారు. ఆగస్ట్ 7, 1905 ‌కలకత్తా టౌన్‌హాల్‌లో భారీ బహిరంగ సభ జరిగింది. దాదాబాయ్‌ ‌నౌరోజీ, గోఖలే, రనడే తిలక్‌, ‌గణేష్‌, ‌వెంకటేష్‌ ‌జోషి మొదలైనవారు హాజరయ్యారు. ఈ సమావేశం ‘బహిష్కరణ’ తీర్మానాన్ని ప్రవేశ పెట్టింది. దీనితో స్వదేశీ ఉద్యమం లాంఛనంగా ప్రారంభమయ్యింది. స్వదేశీ వస్తువుల వినియోగాన్ని ప్రోత్సహించాలని విజ్ఞప్తి చేశారు నాయకులు. అంటే ఇది రాజకీయ, ఆర్ధిక  సామాజిక ఉద్యమం.

బ్రిటిష్‌ ‌నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రవీంద్రనాథ్‌ ‌టాగూర్‌ ‘అమర్‌ ‌సోనార్‌ ‌బంగ్లా’ గీతం రాశారు. స్వాతంత్య్ర సంగ్రామంలో తెల్లవాడి గుండెల్లో దడ పుట్టించిన అంశాలు ఉప్పు, ఖాదీ. భిన్న మత సంస్కృతులూ, సంప్రదాయాలున్న దేశ ప్రజలందరినీ ఏకోన్ముఖం చేసిన ఘనత ఖాదీకే దక్కుతుంది. విదేశీ వస్తు బహిష్కరణ, వస్త్ర దహనాలతో జాతీయోద్యమం పతాక స్థాయికి చేరుకొని ఖాదీ, స్వదేశీ ఉద్యమంగా రూపుదిద్దుకుంది. ప్రజాప్రతినిధులూ, ఆ స్థాయి వ్యక్తులు తమ హోదాను ప్రదర్శించుకోవడానికి ఖద్దరును ఎంచుకొంటున్నారు.

దేశంలో ఖాదీ కమిషన్‌ అనుమతించిన ఖాదీ పరిశ్రమలు రెండువేల వరకూ ఉంటాయి. అయినా ఖాదీ అనగానే గుర్తుకొచ్చేది ఆంధ్రా లోని శ్రీకాకుళం జిల్లాలో గల పొందూరు. ఇక్కడ తయారయ్యే నాణ్యమైన ఖాదీ మరెక్కడా తయారవ్వదు.

హిల్‌ ‌కాటన్‌ (‌కొండపత్తి)తో తయారయ్యే వస్త్రాలకు 71 నుండి 100 వరకూ నాణ్యతను బట్టి కౌంట్‌ ఇస్తారు. నూరు కౌంట్‌ ‌వచ్చిన దారాన్ని సన్న పోగు అంటారు. ఖాదీ వస్త్రాలు ధరిస్తే సౌకర్యంతో పాటు హుందాతనం ఉట్టిపడుతుంది.

చేతితో వడికిన నూలుతో దేశీయ మగ్గం మీద నేసిన వస్త్రాన్నే ఖద్దరు లేదా ఖాదీ అంటారు. సత్యం, అహింస భావాలపై నిర్మితమైన ఆర్ధిక సామాజిక వ్యవస్థకి కుటీర పరిశ్రమలు పునాదుల వంటివి. అందుకే స్వదేశీ గ్రహమండలంలో ఖాదీ సూర్యుని వంటిది. రాజనీతిలో అహింసకు ఎంతటి స్థానముందో అర్ధ శాస్త్రంలో ఖాదీకి అంతటి స్థానముందని గాంధీజీ నమ్మేవారట. పొందూరు ఘనత విన్న గాంధీజీ తన కుమారుడు దేవదాసు గాంధీని వివరాలు తెలుసుకొని రమ్మని పంపారు. ఇక్కడ వస్త్రాల తయారీ, నాణ్యత తదితర వివరాలతో ఓ నివేదికను గాంధీజీకి అందించారు దేవదాసు. వాటి నాణ్యత చూసిన గాంధీజీ తన పత్రిక ‘యంగ్‌ ఇం‌డియా’లో వ్యాసం రాశారు. దానితో పొందూరు ఖాదీకి దేశ వ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు, గౌరవం వచ్చాయి.

క్విట్‌ ఇం‌డియా ఉద్యమ సమయంలో దేశ పర్యటన చేసినప్పుడు  పొందూరుకు పది కిలోమీటర్ల దూరంలోని దూసి రైల్వేస్టేషన్‌లో గాంధీజీ 15 నిమిషాలు ఆగారు. అప్పుడు అనేకమంది పొందూరు ఖాదీ బట్టలను ఆయనకు బహూకరించారు.

స్వాతంత్య్రోద్యమంలో ఆవిర్భవించి, వృద్ధి చెంది, ఆ చరిత్రకు గుర్తుగా మిగిలిన అనేక వ్యవస్థలలో పొందూరు ఖాదీ ఒకటి. డెన్మార్క్, ‌నార్వే, జర్మనీ, జపాన్‌, ‌కెనడా, అమెరికా, స్వీడన్‌ ‌వంటి దేశాలకు పొందూరు నుండి దుస్తులు ఎగుమతి అయ్యేవి. అక్టోబర్‌ 13, 1955‌లో ఆచార్య వినోబా భావే పొందూరు గ్రామాన్ని సందర్శించి చేనేత సంఘ భవనానికి శంకుస్థాపన చేశారు. చేనేత కుటుంబాలు వినోబాకు సన్న నూలుతో తులాభారం నిర్వహించారు. గాంధీజీ మనుమరాలు తారా భట్టాచారి కూడా పొందూరు వచ్చారు. ఖాదీని గంగా నదితో పోలుస్తూ, పొందూరును దానికి జన్మనిచ్చిన గంగోత్రిగా ఆమె అభిప్రాయపడ్డారు. ఖాదీ అంటే కేవలం వస్త్రం మాత్రమే కాదని నిజాయితీకి, శుచికి సంకేతంగా నిలుస్తుందని చెప్పారు. కుటీర పరిశ్రమల చెంతనే ఖాదీ వినియోగదారులకు కేరాఫ్‌ అ‌డ్రస్సుగా పొందూరు విరాజిల్లాలని అనుకుంటే పొందూరును పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దాలి.

స్వదేశీ చేనేత, ఖాదీ ఉత్పత్తులను ప్రోత్సహించేందుకు ఆగష్టు 7, 2015 న ప్రధాని నరేంద్ర మోదీ దేశంలో మొదటి వార్షిక జాతీయ చేనేత దినోత్సవాన్ని స్మరించుకున్నారు.భారత తయారీ ఉత్పత్తులను మాత్రమే ఉపయోగించాలని ప్రకటించడానికి ఆ తేదీని ఎంచుకొన్నారు.

About Author

By editor

Twitter
Instagram