‘సామూహిక దండన పేరుతో గ్రామాలకు గ్రామాలను (పాకిస్తాన్‌ ‌సేనలు) ధ్వంసం చేయడం నేను చూశాను. ఆ సైన్యంలో చంపడానికీ, సజీవ దహనం చేయడానికి ప్రత్యేకంగా పని చేసిన విభాగాల పశుత్వానికి నేనే ప్రత్యక్ష సాక్షిని. ‘ఇవాళ ఎంతమందిని చంపావు?’ అని అడిగి మరీ జవాబులు చెప్పించుకుంటున్న వైనాలు సైనికాధికారుల మెస్‌లో రాత్రివేళలలో నేను వింటూ ఉండేవాడిని….’

మార్చి 25, 1971 మధ్య నుంచి బంగ్లాదేశ్‌లో (నాటి తూర్పు పాకిస్తాన్‌) ‌జరిగిన హత్యాకాండ గురించి ఇంగ్లండ్‌ ‌నుంచి వెలువడే ‘సండే టైమ్స్’ ‌పత్రిక జూన్‌ 13,1971‌న ప్రచురించిన వ్యాసంలోని వాక్యాలివి. ఆంథోని మాకారెన్హాస్‌ అనే పత్రికా రచయిత రాశారు.


చరిత్ర చూసిన అత్యంత పాశవికమైన ఘోరాలను సైతం మరుగున పరచాలన్న నీచమైన కుట్ర ఇప్పటిది కాదు. నల్లవారి మీద, ఆసియా దేశ వాసుల మీద శ్వేతజాతి సాగించిన అకృత్యాలు ఇలా ఎన్నో మరుగున ఉండిపోయాయి. కొండకోనలలో తండాలకు తండాలుగా అమాయక గిరిజనాన్ని నిర్మూలించిన గాథలు చీకటిలో ఉండిపోయాయి. కాదు, చీకటిలో మగ్గబెడు తున్నారు. మానవతనూ, కన్నీటినీ ఘోరంగా అవమానించే ఇలాంటి అనేక ఘట్టాలకు 20వ శతాబ్దం చిరునామాగా చెబుతారు. రెండు ప్రపంచ యుద్ధాలలో, నాజీల హయాంలో, సోవియెట్‌ ‌రష్యాలో, కంబోడియాలో, చైనాలో జరిగిన అకృత్యాలకు ఆ శతాబ్దమే సాక్షి. అలాంటిదే, ఆ అకృత్యాలకు ఏ మాత్రం తీసిపోనిదే – 1971లో పాకిస్తాన్‌ ‌సైన్యాలు బంగ్లాదేశ్‌లో సాగించిన మారణ కాండ. ప్రపంచ స్థాయి మేధావులు, అధ్యయన కేంద్రాలు 1971లో పాకిస్తాన్‌ ‌సాగించిన అకృత్యాల గురించి ఇచ్చిన అంచనా భయానకమైనది. పాక్‌ ‌కిరాకత సేనల, రజాకారుల చేతులలో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 30 లక్షలని బంగ్లాదేశ్‌ ‌ప్రభుత్వం ఆరోపణ. బంగ్లా విముక్తి పోరాటం వెనుక ఉన్నారన్న సాకుతో పాకిస్తాన్‌ ‌హిందువులను లక్ష్యంగా చేసుకున్న మాట నిజం. హిందూ మహిళలు, విద్యార్థులు, మేధావులను భౌతికంగా తుడిచిపెట్టే పనిని ఆరంభించింది. మనం చంపాల్సింది హిందువులనే అన్న మాటలు సైనికుల నోటి నుంచి వెలువడేవి.

‘సండే టైమ్స్’ ‌పత్రిక ప్రచురించిన ఆ వ్యాస రచయిత ఆంథోని మాకారెన్హాస్‌ 1971‌లో కరాచీ కేంద్రంగా పనిచేసేవారు. ఈ వ్యాసం బంగ్లాదేశ్‌లో పాకిస్తాన్‌ ‌సాగించిన నరమేధాన్ని వెలుగులోకి తెచ్చిన తొలి వ్యాసంగా కూడా ఇది ఖ్యాతి గాంచింది. దక్షిణ ఆసియా పత్రికా రచనను ఇతోధికంగా ప్రభావితం చేసినదిగా పేర్గాంచింది. ఏవో కారణాలు చెప్పి, పాకిస్తాన్‌ను వీడి లండన్‌ ‌చేరిన ఆంథోని తన కుటుంబం కూడా కరాచీ నుంచి లండన్‌ ‌చేరిన తరువాతనే సండే టైమ్స్ ఈ ‌వ్యాసాన్ని వెలువరించింది. వెన్ను జలదరించే, రక్తం గడ్డ కట్టించే ఘటనలు ఈ వ్యాసంలో కోకొల్లలు. నిజానికి ఇదొక ఉదాహరణ. అక్కడ జరిగిన హత్యలు లక్షలలో.. అప్పుడు జరిగిన మానభంగాలు లక్షలలో, నిరాశ్రయులైన వారూ లక్షలలోనే.. బంగ్లా విమోచన, ఆ ఉద్యమకారుల మీద పాకిస్తాన్‌ ‌సైన్యం అకృత్యాలు అంతకు ముందు చరిత్ర చూసిన ఘోరాలకు తీసిపోనివే. మూడు దశలుగా సాగిన పాక్‌ ‌సేనల రక్తకాండలో తొలి దశ పేరు, ‘ఆపరేషన్‌ ‌సెర్చ్‌లైట్‌’. ఇదంతా గమనిస్తే, వాస్తవాలు చూస్తే బంగ్లాదేశ్‌ ‌మీద పాకిస్తాన్‌ అక్షరాలా పూర్తి స్థాయి యుద్ధం ప్రకటించిన మాట, సాధారణ ప్రజల మీద యుద్ధం చేసిన మాట నిజమని అంగీకరించక తప్పదు.

ఆంథోని (1986లో మరణించారు) వ్యాసంతోనే పాకిస్తాన్‌ ‌మీద ప్రపంచానికి ఉన్న దృష్టి మారిపోయింది. ఈ అంశంలో భారతదేశం దృఢ నిశ్చయంతో ముందడుగు వేయడానికి కూడా ఈ వ్యాసమే ఉపకరించిందని చెబుతారు. ఈ వ్యాసం తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందనీ, భారతదేశం బంగ్లాలో సైనిక చర్య తీసుకునే అంశం గురించి ఐరోపా దేశాలతో, మాస్కోతో వ్యక్తిగతంగా దౌత్యం నడపడానికి ముందుకు నడిపిందనీ నాటి సండేటైమ్స్ ‌సంపాదకుడు హెరాల్డ్ ఎవాన్స్‌కు ప్రధాని ఇందిరాగాంధీ చెప్పారు. ఈ వ్యాసం ఇప్పటికీ బంగ్లా యుద్ధ జ్ఞాపకాల ప్రదర్శనశాలలో ఉంది.

అప్పుడు జరిగిన ఎన్నికలలో తూర్పు పాకిస్తాన్‌లో ఆవామీ లీగ్‌ ఆధిక్యం సాధించడం, విస్తృత స్థాయిలో స్వయం ప్రతిపత్తి కలిగిన ప్రభుత్వం కావాలని కోరడంతో సైన్యానికీ, ఆవామీ లీగ్‌కీ మధ్య ఘర్షణ తలెత్తింది. 1970 డిసెంబర్‌లో అవిభాజ్య పాకిస్తాన్‌లో జాతీయ ఎన్నికలు జరిగాయి. తూర్పు పాకిస్తాన్‌లో ఆవామీ లీగ్‌ ‌విజయం సాధించింది. 1972 ఫిబ్రవరిలో లీగ్‌ ‌నేతలు, కార్యకర్తలను అణచివేయాలని పథకం సిద్ధమైంది. డిసెంబర్‌ ‌వరకు ఈ నరమేధం జరిగింది. లీగ్‌, ‌రాజకీయ వ్యతిరేకులు, మేధావులు, హిందువులకు వ్యతిరేకంగా సైన్యం దాడులకు దిగింది. అప్పటి బంగ్లాలో వీరు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. జనరల్‌ ఆగా మహ్మద్‌ ‌యాహ్యా ఖాన్‌, అతడి సైనిక అధికారులు బెంగాలీ మేధావులను, సాంస్కృతిక, రాజకీయ ప్రముఖులను చంపడానికి పథకాలు వేశారు. ఇక హిందువులను భారత్‌కు తరిమివేయాలని, దొరికినంతమందిని చంపాలని కూడా నిర్ణయించారు.

 మార్చి 25 రాత్రి ప్రారంభమైన హత్యాకాండ (ఆపరేషన్‌ ‌సెర్చ్‌లైట్‌) ‌లోనే ఐదు వేల నుంచి లక్షమంది బెంగాలీలు చనిపోయారు. జగన్నాథ్‌ ‌హాల్‌, ‌ఢాకా విశ్వవిద్యాలయం మీద ఏకకాలంలో హత్యాకాండ సాగింది. వీటి తలుపులు బద్దలు కొట్టడానికి పాక్‌ ‌సైనికులు షెల్స్ ‌ప్రయోగించారు. అది కూడా రాత్రివేళ. అక్కడ ఉన్న అన్ని వర్గాల విద్యార్థులను బలి తీసుకున్నారు. ఈ దాడి గురించి నాడు ఢాకాలో ఉన్న అమెరికా కాన్సుల్‌ ‌జనరల్‌ అర్చర్‌ ‌బ్లడ్‌ ‌తన దేశ రక్షణ శాఖకు టెలిగ్రామ్‌ ‌ద్వారా తెలియచేశారు కూడా. ఆ దాడిలో విద్యార్థులపై కూడా మెషీన్‌గన్‌లు ఉపయోగించారు. అసలు బంగ్లా విమోచన ఉద్యమానికి ఆరంభకులు విద్యార్థులేనని పాకిస్తాన్‌ ‌నమ్మకం. సైమన్‌ ‌డ్రింగ్‌ అనే విలేకరి ‘డెయిలీ టెలిగ్రాఫ్‌’‌కు పంపిన నివేదికలో ఢాకా విశ్వవిద్యాలయంలో 200 మంది విద్యార్థులను, ఆచార్యులను చంపారని నివేదించాడు. ఆ రోజు రాత్రే పాత ఢాకా ప్రాంతంలో కాల్పులు జరిగాయి. అందులో 700 మంది, ప్రధానంగా హిందువులు చనిపోయారు. ఈ సంఖ్య లక్ష అని ‘సిడ్నీ మార్నింగ్‌ ‌హెరాల్డ్’ ‌ప్రచురించింది. బంగ్లా ప్రాంతంలో పుట్టిన ఆఖరితరం కూడా పాకిస్తాన్‌కు దాసోహం అనక తప్పని రీతిలో ఆర్థిక వ్యవస్థను నాశనం చేయాలని కూడా సైనికులు ప్రయత్నించారు. గ్రామీణ ప్రాంతాలలో గెరిల్లా యుద్ధం జరుపుతున్న బంగ్లా జాతీయవాదులపైనా హత్యాకాండ జరిగింది. ఇలాంటి నేపథ్యంలోనే పశ్చిమ పాకిస్తాన్‌లో ఉంటున్న ఎనిమిదిమంది పత్రికా రచయితలను బంగ్లాదేశ్‌లో పదిరోజులు పర్యటించడానికి సైన్యం అనుమతించింది. ఆ పదిరోజుల పర్యటన తరువాత ఏడుగురు మాత్రం, సైనికాధికారులు ఏం చెబితే అదే నమోదు చేశారు. ఒక్కరు మాత్రం అలా రాయలేదు. ఆయనే ఆంథోని. ఉన్నది ఉన్నట్టు రాస్తే సైన్యం కాల్చిచంపడం ఖాయమని తన భార్య యువెన్నాకు ఆంథోని చెప్పారు. ఎందుకంటే వార్తాపత్రికలలో వచ్చే ప్రతి వ్యాసాన్ని సైన్యం సెన్సార్‌ ‌చేసేది.

చరిత్రలో జరిగిన రక్తపాతం అప్పటికి ఇంకిపోవచ్చు. కానీ దాని జ్ఞాపకం ఎప్పటికీ తడి ఆరదు. రష్యాలో, చైనాలో, జర్మనీలో జరిగిన హత్యాకాండ వలెనే బంగ్లాదేశ్‌లో పాకిస్తాన్‌ ‌సైన్యం చేసిన అకృత్యాలు కూడా అక్కడి ప్రజల జ్ఞాపకాలలో ఇప్పటికీ భద్రంగానే ఉంది. ఏప్రిల్‌ 1, 2021‌న ‘ఎకనమిక్‌ ‌టైమ్స్’ ఇదే అంశం మీద ప్రచురించిన విశ్లేషణ దిగ్భ్రాంతి కలిగించేదే. ఆ హత్యాకాండలో 30 లక్షల మంది బంగ్లా దేశీయులు చనిపోయారన్న ఆ ప్రభుత్వ వాదననే సమర్ధిస్తూ ఆ పత్రిక ఈ అంశాన్ని విశ్లేషించింది. ముస్లింలే అయినా, బంగ్లాదేశ్‌లోని బెంగాలీలను జాతిపరంగా నిర్మూలించే కుట్ర జరిగింది. అందుకు పాక్‌ ‌సైన్యం ఎంచుకున్న విధానమే బెంగాలీ మహిళల మానభంగం. వారిని మానభంగంతో గర్భవతులను చేసి శుద్ధమైన ముస్లిం తరాలకు జన్మనివ్వాలని అనుకున్నారు. ఇలాంటి పశుప్రాయమైన వైఖరితో పాకిస్తాన్‌ ‌సైనికులు, రజాకారులు (హైదరాబాద్‌ ‌రజాకారుల వారసులు కాదు) 2,00,000 అమాయక బెంగాలీ మహిళలను మానభంగం చేశారు. వీటిని పెద్ద పెద్ద యుద్ధాలలో పరాయి దేశం మహిళలను పథకం ప్రకారం అవమానించడానికి ఉద్దేశించిన జనోసైడ్‌ ‌రేప్‌గా అంచనా వేశారు. బాధితులలో ఎక్కువ మంది హిందూ మహిళలే.ఈ హేయమైన చర్యలను పాకిస్తాన్‌ ‌మత గురువులు, మత సంస్థల నాయకులు సమర్ధించారు. యుద్ధంలో దొరికిన స్త్రీలు విజేతలకు దక్కే సొత్తు అని ప్రకటించారు. ఈ మేరకు ఫత్వాలు జారీ అయినాయి. పాక్‌ ‌సైనిక మూకలు అపహరించిన మహిళలు కొందరు వాళ్ల అధీనంలోనే ఆత్మహత్యలు చేసుకున్నారు. కొందరు భారత్‌కు వలస వచ్చారు. ఇక జరిగిన గర్భస్రావాలు, శిశు హత్యలు అంచనాకు అందవు. యుద్ధాల చీకటికోణంలో ఘోరమైనది మహిళలపై అత్యాచారాలు. బంగ్లాదేశ్‌లో ఉన్న బిహారీ ముస్లింలు పాకిస్తాన్‌ను సమర్ధించేవారు. వీరి మీద కక్షతో బంగ్లా విముక్తి కోసం పోరాడిన ముక్తి వాహిని కార్యకర్తలు మొదట్లో బిహారీ ముస్లిం మహిళల మీద అత్యాచారాలకు పాల్పడ్డారన్న ఆరోపణలు ఉన్నాయి. విషాదం ఏమిటంటే- పాక్‌ అనుకూల బెంగాలీలు, పాక్‌ ‌సైన్యం, రజాకారులు, బిహారీ ముస్లింలు ఒక్కటై హిందూ మహిళలను లక్ష్యంగా చేసుకున్నారు.

మార్చి 21, 2021న ‘హిందుస్తాన్‌ ‌టైమ్స్’ ‌వెలువరించిన ఒక కథనం కూడా నాటి అకృత్యాలను గుర్తు చేసింది. తొమ్మిది మాసాలు సాగిన ఈ స్వజాతి హననం చరిత్రలోనే సుదీర్ఘమైనదని వ్యాఖ్యానించింది. ఇంత హత్యాకాండ వెనుక బంగ్లాలో అసలు బెంగాలీ మాట్లాడేవారే, ఆ వర్గీయులే ఉండకూడదన్న విషపుటాలోచన ఉంది. కానీ ఈ జాతి సామూహిక నిర్మూలన గురించి ఐరోపాలో జరిగిన స్వజాతి హననాల స్థాయిలో చరిత్రలో నమోదు కాలేదు.

బంగ్లాదేశ్‌ ‌కోసం ఉద్యమించడానికి దారి తీసిన కారణాలలో ముఖ్యమైనది భాష. ‘పాకిస్తాన్‌కు ఒకటే భాష, అది ఉర్దూ’ అంటూ 1948లో మహమ్మదలీ జిన్నా చేసిన శాసనాన్ని మొదట వ్యతిరేకించినవారు విద్యా ర్థులు. ఈ అంశంతోనే అక్కడ అలజడులు ఆరంభమైనాయి. తమ మాతృభాష బెంగా లీయేనని వారు నినదించారు. దీనిని కూడా మత ధిక్కారం గానే పాక్‌ ‌నాయకత్వం భావించింది.

రాహుల్‌ ‌హల్దార్‌ అనే ఫ్రీలాన్స్ ‌జర్నలిస్ట్ ‌జ్ఞాపకాలు మరింతగా మనసును వికలం చేస్తాయి. పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఈయన చిన్నతనంలో తండ్రి వెంట కారులో జెస్సోర్‌, ‌ఖుల్నా అనే మారుమూల గ్రామాలకు వెళ్లారు. ఆ సమయంలో ఈయన తండ్రి కలకత్తా విమానాశ్రయంలో పనిచేసేవారు. వీరు ఉంటున్న అధికారిక నివాసాలకు సైన్యం కాపలా ఉండేది. గాయపడిన సైనికులు, ప్రజలతో, కొన్ని సందర్భాలలో శవాలతో కూడా విమానాలు వచ్చేవి. అసంఖ్యాకంగా వచ్చే క్షతగాత్రులను సైనిక ఆసుపత్రికి తరలించేవారు. అలాంటి సమయంలో హల్దార్‌ ‌బాలునిగా బంగ్లా వెళ్లారు. రోడ్లన్నీ పాకిస్తాన్‌ ‌సైన్యం షెల్స్‌తో గతుకులు పడి ఉన్నాయి. ఊళ్లకు ఊళ్లే దగ్ధమై కనిపించేవి. ఖాళీ అయిన గ్రామాల నుంచి, స్మశానాల నడుమ నడకలా నిశ్శబ్దం మధ్య ఆ ప్రయాణం సాగింది. బంగ్లా ముస్లింలను, హిందువులను చంపడమే ధ్యేయంగా పాక్‌ ‌సైన్యం హత్యాకాండ సాగిందన్నది నిజమని హల్దార్‌ అం‌టారు. ఈ దారిలో ఉన్న కొన్ని కుళాయిల నుంచి నీరు మడ్డిలా రక్తం కలసి ఎర్రగా వచ్చేది. ఎందుకంటే పాక్‌ ‌సైన్యం వందలాది మంది పౌరులను చంపి ఆ చుట్టుపక్కల ఉన్న చెరువులలో, నదులలో పడేసేది. మరొకవైపు కనిపించే దృశ్యం కూడా ఎప్పటికి మరపునకు రాదు. స్టెన్‌ ‌గన్న్‌లు పట్టుకుని పాక్‌ ‌మూకలను ఎదుర్కొనడానికి సిద్ధంగా ఉన్న ముక్తి వాహిని కార్యకర్తలు కనిపించేవారు. వారిలో ఎక్కువమంది 16, 17 ఏళ్ల బాలురే. దొరికిన రజాకార్లను చంపేసి, వీరు స్థానికుల ఎదుట ప్రదర్శనకు పెడుతుండేవారు. రజాకార్ల కర్కశత్వాన్ని బట్టే, దానికి ప్రతీకారం తీర్చుకుంటున్నట్టే ముక్తివాహిని యోధుల చర్యలు ఉండేవి. ఎలాగంటే, ప్రజల ముందుకు తెచ్చి పడేసిన రజాకార్ల శవాల అవయవాలు తెగిపోయి ఉండేవి. తాము యుద్ధానికి వెళ్లినప్పుడు పాకిస్తాన్‌ ‌సైన్యం తమ కుటుంబాలను ఊచకోత కోసిందని, అందుకే ఇలా ప్రతీకారం తీర్చుకుంటున్నామని వారు బాహాటంగానే చెబుతూ ఉండేవారు. భారత్‌లో ప్రవేశించాలన్న ఉద్దేశంతో చుక్నాగర్‌ అనే గ్రామంలోకి వచ్చిన ఒక పెద్ద బృందాన్ని పాకిస్తాన్‌ ‌సేనలు చంపేశాయి. ఈ విషాదం గురించి ముక్తి వాహిని వారు పదే పదే చెప్పేవారు. మే 20, 1971న చుక్నాగర్‌ ‌నరమేధం జరిగింది. ఆ బృందాన్ని చంపేసి, తరువాత పాక్‌ ‌సేనలు గ్రామంలోకి ప్రవేశించాయి. విచక్షణా రహితంగా జనాన్ని కాల్చాయి. ఇదంతా చూసిన కొందరు వృద్ధులు ఆ క్షోభను తట్టుకోలేక తరువాత ఆత్మహత్య చేసుకున్నారు. చాలా ఇళ్ల గోడలు తూటాల రంధ్రాలతో కనిపించాయి. వాటి అరుగుల మీద ఎండిన రక్తపు మరకలు ఉన్నాయి. ఈ గ్రామంలోనే కొందరిని చెట్లకు కట్టి కాల్చారు. ఆ చెట్లకు అప్పటికీ ఎండిన రక్తపు మరకలు ఉన్నాయి. నిజానికి ఈ రక్తపు మరకలని ముక్తివాహిని కార్యకర్తలు అలాగే ఉంచారు, పాకిస్తాన్‌ ‌సైన్యం రాక్షసత్వానికి నిదర్శనంగా. బంగ్లా విముక్తి పోరాటం సమయంలో చాలాచోట్ల ఊచకోత ఘటనలు జరిగాయి. కానీ చుక్నాగర్‌ ఉదంతం ఘోరమైనది. ఐదు గంటలలోనే పదివేల మందిని పాక్‌ ‌సైనికులు పొట్టన పెట్టుకున్నారు. సాధారణ ప్రజానీకం మీద లైట్‌ ‌మెషిన్‌ ‌గన్‌లు, సెమి ఆటోమేటిక్‌ ఆయుధాలు ఉపయోగించారు.

ఈ దురంతం మూడు దశలలో ఆపరేషన్‌ ‌సెర్చ్‌లైట్‌ ‌మే నెల వరకు జరిగింది. ఈ దమనకాండ ప్రధానంగా నగరాలకు పరిమితం. రెండోది- సెర్చ్ అం‌డ్‌ ‌డిస్ట్రాయ్‌. అక్టోబర్‌ ‌వరకు సాగిన ఈ హత్యాకాండ గ్రామీణ ప్రాంతాలను రక్తసిక్తం చేసింది. ఇది ఎక్కువ కాలం జరిగింది. బెంగాలీలు కూడా ఆయుధాలతో ప్రతిఘటించారు. బంగ్లాదేశ్‌కు చెందిన ఆంగ్ల దినపత్రిక ‘ది డెయిలీ స్టార్‌’ ఇచ్చిన వార్తా కథనం ప్రకారం మహిళలు కూడా పురుష వేషంలో యుద్ధంలో పాల్గొన్నారు. తమ ఉనికి తెలిసిపోతుందేమోనని రోజులు తరబడి స్నానాలు కూడా చేయకుండా పాక్‌ ‌సేనలతో వారు పోరాడారు. ఈ దశలోనే పాకిస్తాన్‌ ‌సేనలు ప్రధానంగా హిందూ స్త్రీలను లక్ష్యంగా చేసుకున్నాయి. దొరికిన వారిని మానభంగం చేయడం, సెక్స్ ‌బానిసలుగా చేసుకోవడం వంటి దారుణాలకు పాల్పడ్డారు. మూడో దాడి పేరు స్కార్చ్‌డ్‌ ఎర్త్. ‌డిసెంబర్‌లో ఆరంభమైన ఈ హత్యాకాండలో ఎక్కువగా హిందూ మేధావులను చంపారు. అలాగే హిందువులలోని న్యాయవాదులు, వైద్యులు, ఇంజనీర్లను కూడా వెతికి వెతికి చంపారు. ఇవి ఎక్కువగా ఢాకాలో జరిగాయి.

అమెరికా సెనేటర్‌ ఎడ్వర్డ్ ‌కెన్నెడి 1971 అక్టోబర్‌లో ఇచ్చిన సమాచారం ప్రకారం ఆ నెల 25 వరకు 9.54 మిలియన్‌ (‌దాదాపు కోటి) శరణార్థులు ఇండియాకు చేరారని చెప్పారు. ఆ నెలలో రోజుకి 10,845 మంది వలస వెళ్లారు.

డిసెంబర్‌ 16,1971‌న బంగ్లాదేశ్‌ అనే కొత్త దేశం జన్మించింది. దురదృష్టం ఏమిటంటే- ‘బీరాంగన’ (వీరాంగన, స్వతంత్ర బంగ్లా ఇచ్చిన బిరుదు) పేరుతో ఒక కొత్త వర్గం అక్కడ పుట్టుకొచ్చింది. వీరంతా పాక్‌ ‌సేనల చేతులలో మానభంగాలకు గురైనవారు. మరొక చేదునిజం- సంఘం చేత బహిష్కుృతులు. తమ పిల్లలతో సిమెంట్‌ ‌తూములలో ఊరి బయట దుర్భర జీవితాలు గడిపేవారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చినా, వీరికి మాత్రం సమాజంలో తగిన స్థానం దక్కలేదు. వీరికి పుట్టిన సంతానమే, తండ్రులు ఎరుగుని చిన్నారులే లక్షలలో ఉన్నారు.

నిజానికి బంగ్లాలో ఉన్న మొత్తం హిందూ జనాభాయే లక్ష్యంగా పాకిస్తాన్‌ ‌యుద్ధకాండ సాగించిందన్నది నిజం. భారతదేశానికి వచ్చిన శరణార్థులలో 80 శాతం హిందువులు. చనిపోయినట్టు చెబుతున్న ముప్పయ్‌ ‌లక్షల మందిలో 80 శాతం హిందువులు. 25 లక్షల మంది హిందువుల ఆచూకీ దొరకలేదు. 2009లో యుద్ధ నేరాల నిజ నిర్ధారణ సంఘం ఇచ్చిన వివరాల ప్రకారం ఈ హత్యా కాండ జరిగిన 40 ఏళ్ల తరువాత 1,597 మందికి యుద్ధ నేరాల కింద శిక్షలు విధించారు. 2010 నుంచి అంతర్జాతీయ నేరాల ట్రిబ్యునల్‌ ‌కొందరిని విచారించి శిక్షలు ఖరారు చేసింది. ఆనాటి ఆ దురా గతాలన్నింటికి పాకిస్తాన్‌ ‌క్షమాపణ చెప్పాలని బంగ్లా ఇప్పటికీ కోరుతూనే ఉంది. అది అరణ్యరోదనగానే మిగిలి ఉంది. అది అరణ్యరోదనే. ఎందుకంటే పాకిస్తాన్‌ ‌వంటి దేశం నుంచి అంతటి సంస్కారాన్ని ఎవరైనా ఎలా ఆశించగలరు?

By editor

Twitter
Instagram