డిసెంబర్‌ 16, 1971: ‌భారత్‌-‌పాకిస్తాన్‌ ‌సైనిక చరిత్రలో కీలకమైన తేదీ ఇది. అలాగే పాకిస్తాన్‌ ‌నుంచి విడివడిన బంగ్లాదేశ్‌కు కూడా చరిత్రాత్మకమైన రోజు అది. 1971 నాటి భారత్‌-‌పాక్‌ ‌యుద్ధం ముగిసిన రోజు అదే. పాకిస్తాన్‌ ‌తన సగ భూభాగం కోల్పోయిన రోజు కూడా అదే.పాకిస్తాన్‌ ‌సైనిక దళాల అధిపతి జనరల్‌ అమీర్‌ అబ్దుల్లా ఖాన్‌ ‌నియాజీ నాయకత్వంలో 93,000 మంది పాకిస్తాన్‌ ‌సైనికులు భారత సైన్యానికి, బంగ్లా పోరాట సంస్థ ముక్తి వాహినికి లొంగిపోయారు. అందుకే ఈ ఘట్టం రెండో ప్రపంచ యుద్ధం తరువాత జరిగిన అతిపెద్ద యుద్ధ ఖైదీలు లొంగిన ఘట్టంగా నమోదైంది. ఆగస్ట్ 2,1972‌న జరిగిన సిమ్లా ఒప్పందం మేరకు భారత్‌ ‌తన నిర్బంధంలో ఉన్న 93,000 మంది యుద్ధఖైదీలను విడిచిపెట్టింది. పాక్‌ ‌వ్యూహాలను క్షణాలలో పసిగడుతూ పశ్చిమ యుద్ధ రంగంలో 15,010 కిలోమీటర్ల మేర పాక్‌ ‌భూభాగాన్ని భారత సైనికులు స్వాధీనం చేసుకున్నారు. ఈ యుద్ధంలో భారత త్రివిధ దళాలు తొలిసారి కలసి పోరాడాయి. మరణాలకు సంబంధించి కూడా బంగ్లా ఆవిర్భావం ఒక నెత్తుటి పుటను ఆవిష్కరించింది.  డిసెంబర్‌ 16, 1971‌న బంగ్లాదేశ్‌ ‌ప్రభుత్వాన్ని గుర్తిస్తున్నట్టు భారత పార్లమెంట్‌ ‌ప్రకటించింది. ఇందులో 3630 మంది మన సైనికాధికారులు, సైనికులు మరణించారు. 9856 మంది గాయపడ్డారు. 213 మంది అధికారుల ఆచూకీ ఇప్పటికీ తెలియదు. ఆ పరిణామాలు ఇంకాస్త వివరంగా-

1947, ఆగస్ట్ 14,15 ‌నాటి పరిణామాలూ, ఆ సందర్భంగా పాకిస్తాన్‌ ‌గవర్నర్‌ ‌జనరల్‌ ‌మహమ్మ దలీ జిన్నా ఉపన్యాసాలు అందరికీ తెలిసినవే. కానీ అవి నీటి మీద రాతలు. దీనికి ప్రబల నిదర్శనం తూర్పు పాకిస్తాన్‌ అనే భూభాగం పాకిస్తాన్‌ ‌నుంచి వేరుపడడం. పాకిస్తానీయులు, పాకిస్తాన్‌కు వలస వచ్చిన వారు తమకు నచ్చిన మతాన్ని ఆశ్రయించ వచ్చు. జీవన విధానాన్ని స్వీకరించవచ్చు. మసీదు, గుడి, చర్చ్, ‌గురుద్వారా.. దేనిలో అయినా ఆరాధన చేసుకోవచ్చు అన్నారు జిన్నా. ఆ మాటలు పాక్‌ ‌ప్రజల చెవులలో మార్మోగుతుండగానే దేశంలో ఉర్దూ తప్ప మరొక భాషకు స్థానం లేదన్నారాయన. ఈ మౌఢ్యం ఒక అంతర్యుద్ధానికి దారి తీసింది. అంతిమంగా భారత్‌తో పూర్తిస్థాయి యుద్ధంగా పరిణమించింది. దేశం విడిపోయింది.

పాకిస్తాన్‌ది ఆది నుంచి దమననీతే. ఈ విషయంలో పౌర పాలకులు, సైనిక పాలకులదీ ఒకేమాట. ఇరుగు పొరుగుతో కీచులాటలు, ప్రజల స్వేచ్ఛ, స్వాతంత్య్రాల హరణ, అణచివేత, మనోభావా లను దెబ్బతీయడం ఇస్లామాబాద్‌ ‌పాలకుల వైఖరి. ఈ మొండి, అపరిపక్వ విధానమే పాకిస్తాన్‌ ‌పాలిట శాపంగా మారింది. ఆవిర్భవించిన రెండు దశాబ్దాలకే దేశ విచ్ఛితికి దారితీసింది. 1971లో జరిగిన ఇండో – పాక్‌ ‌యుద్ధమే ఇందుకు నిదర్శనం. ఈ యుద్ధంతోనే బంగ్లాదేశ్‌ ‌స్వతంత్ర రాజ్యంగా అవతరించింది. ప్రపంచచరిత్రలో, ముఖ్యంగా దక్షిణాసియా చరిత్రలో ఇది కీలక పరిణామం. భారత్‌కు సంబంధించి సువర్ణ అక్షరాలతో లిఖించదగ్గ ఘట్టం. భారత్‌ ‌వంటి శాంతికాముక పొరుగు దేశంతో పాకిస్తాన్‌ ‌కయ్యానికి కాలుదువ్వి పరాభవాన్ని కొని తెచ్చుకుంది. ముందస్తు దాడులకు దిగి అపజయాన్ని మూటగట్టుకుంది. అంతర్జాతీయంగా అప్రతిష్టపాలైంది. తనకన్నా వెనక స్వాతంత్య్రాలను పొందిన అనేక దేశాలు ప్రగతిపథంలో పరుగెడుతుండగా పాకిస్తాన్‌ ఈసురోమంటోంది. ఇదంతా స్వయంకృతాపరాధమే.


‌కాళ్ల దగ్గర పాగాతో, కంట ఆనంద బాష్పాలతో

యుద్ధంలో గెలిచినప్పటికీ భారత్‌ అసాధారణ సంయమనాన్ని ప్రదర్శించింది. అనివార్య పరిస్థితుల్లోనే తాను స్పందించాల్సి వచ్చిందని అంతర్జాతీయ సమాజానికి అర్థమయ్యేలా సోదాహరణంగా వివరించింది. బందీలుగా చిక్కిన వేల మంది పాక్‌ ‌సైనికుల పట్ల మానవీయ కోణంలో స్పందించింది. వారిని గౌరవంగా చూసింది. యుద్ధం అనంతరం పాకిస్తాన్‌ ‌వెళ్లిన ఆర్మీ చీఫ్‌ ‌మానెక్‌ ‌షా పట్ల పాక్‌ ఆర్మీ అత్యంత గౌరవం ప్రదర్శించింది. ఆయన గౌరవ వందనం స్వీకరిస్తుండగా అకస్మాత్తుగా ఒక సైనికుడు తన తలపాగా తీసి మానెక్‌ ‌షా కాళ్ల ముందు పెట్టారు. ఇలా ఎందుకు చేశావని షా ప్రశ్నించగా అతను భావోద్వేగానికి లోనయ్యాడు. తనకు అయిదుగురు కుమారులని, వారంతా సైనికులేనని, భారత్‌కు బందీలుగా చిక్కారని చెప్పారు. యుద్ధ ఖైదీలైనప్పటికి తమను భారత్‌ ‌గౌరవంగా చూసుకుందని, ఆదరించిందని కుమారులు చెప్పారని అందుకు చేతులెత్తి నమస్కరిస్తున్నట్లు తెలిపారు.

మా సైనికులు చదువుకోవడానికి మీరు పవిత్రమైన ఖురాన్‌ ‌గ్రంథం ఇచ్చారు. రుచికరమైన భోజనం అందించారు. అందువల్ల హిందువులు చెడ్డవాళ్లని ఎవరు ఎంతగా చెప్పినా ఎవరూ నమ్మరు అని ఆ సైనికుడు వివరించారు. దీనికి చిరునవ్వుతో స్పందించారు మానెక్‌ ‌షా. బందీలైన పాక్‌ ‌సైనికులను బాగా చూసుకోవడంపై తనపైనా స్వదేశంలో విమర్శలు వచ్చాయని, వారిని అల్లుళ్లుగా చూసుకున్నారంటూ కొందరు ఆగ్రహించారని, ఈ మేరకు ప్రధాని ఇందిరాగాంధీకి ఫిర్యాదు కూడా చేశారని షా వివరించారు. వాళ్లు కూడా సైనికులే, బాగా పోరాడారు, అయినప్పటికీ ఓడిపోయారని చెప్పడంతో ఇందిరాగాంధీ శాంతించారని మానెక్‌ ‌షా వెల్లడించారు. అప్పట్లో భారత ప్రభుత్వం తమపై మోపిన బాధ్యతను చిత్తశుద్ధితో సమర్థంగా నిర్వర్తించామని ఆయన తెలిపారు. శత్రువు నుంచి దేశాన్ని కాపాడటం తమ బాధ్యతని, తాము చేసిందీ అదేనని ఆయన వినమ్రంగా వివరించారు. సరిహద్దుల పరిరక్షణకు సైన్యం సదా సిద్ధంగా ఉంటుందని మానెక్‌ ‌షా వెల్లడించారు.


స్వతంత్ర రాజ్యంగా పాక్‌ అవతరించినప్పటికీ భిన్న ప్రాంతాల ప్రజల మనోభావాలను గుర్తించడం, గౌరవించడంలో పాక్‌ ‌పాలకులు విఫలమయ్యారు. తమ అభిమతాలను ప్రజలపై రుద్దడం ప్రారంభించారు. దేశం భౌగోళికంగా పశ్చిమ పాకిస్తాన్‌ (‌ప్రస్తుత పాకిస్తాన్‌), ‌తూర్పు పాకిస్తాన్‌ (‌ప్రస్తుత బంగ్లాదేశ్‌) ‌విస్తరించినప్పటికీ పెత్తనమంతా పశ్చిమ పాకిస్తాన్‌ ‌పాలకుల చేతుల్లోనే ఉండి పోయింది. రెండు ప్రాంతాల మధ్య భౌగోళికంగా 1600 కిలోమీటర్ల దూరం ఉంది. దీంతో సహజం గానే పశ్చిమ, తూర్పు పాకిస్తాన్‌ ‌ప్రజల మధ్య అనేక విషయాల్లో సారూప్యత మొదటి నుంచి కొరవడింది. బెంగాలీల భాష, ఆచార వ్యవహారాలు, సంప్రదాయా లను, మనోభావాలను ఉద్దేశపూర్వకంగా విస్మరిం చారు. ఇదేమని గళమెత్తితే ప్రజాభిప్రాయాన్ని సైతం విస్మరించి అణచివేతలను మొదలుపెట్టారు.

ఈ నేపథ్యంలో 1970లో నాటి అధ్యక్షుడు జనరల్‌ ‌యాహ్యాఖాన్‌ ‌సాధారణ ఎన్నికలు ప్రకటించారు. ఆ ఎన్నికల్లో షేక్‌ ‌ముజిబుర్‌ ‌రెహమాన్‌ ‌సారథ్యంలోని ఆవామీలీగ్‌ ‌సంపూర్ణ మెజార్టీ సాధించింది. అయినప్పటికీ ప్రధాని పదవి కట్టబెట్టేందుకు పశ్చిమ పాకిస్తాన్‌ ‌నాయకుల మనసు అంగీకరించ లేదు. జుల్ఫికర్‌ ఆలీ భుట్టో నాయకత్వం లోని పాకిస్తాన్‌ ‌పీపుల్స్ ‌పార్టీ (పీపీపీ) 81సీట్లతో అధికారానికి ఆమడ దూరంలో నిలిచిపోయింది. నూరుల్‌ ‌హసన్‌ను యాహ్యాఖాన్‌ ‌ప్రధానిగా నియమించారు. ఆపై తూర్పు పాకిస్తాన్‌లో అణచివేత మొదలయింది. అక్కడ పనిచేస్తున్న పాక్‌ ఆర్మీ, నేవీ, వాయుసేన అధికారులు భారత్‌కు పారిపోయి వచ్చారు. వారి ఆధ్వర్యంలోనే ‘బంగ్లా ముక్తి వాహిని’ ఆవిర్భవించింది.

 ఈ సమస్యపై నాటి భారత ప్రభుత్వం అగ్రరాజ్యాలైన అమెరికా, అప్పటి సోవియట్‌ ‌యూనియన్‌ (‌ప్రస్తుత రష్యా), చైనాతోపాటు అనేక అరబ్‌ ‌దేశాలతో చర్చలు జరిపింది. 1971 మార్చి- అక్టోబర్‌ ‌మధ్య ఆరు మాసాల పాటు ఇందిరాగాంధీ భారత సరిహద్దుల వద్ద పరిస్థితిని వివరించే ప్రయత్నం చేశారు. సుదీర్ఘంగా 21 రోజుల పాటు సోవియెట్‌ ‌రష్యా, జర్మనీ, ఫ్రాన్స్, ‌బ్రిటన్‌, ‌బెల్జియం, అమెరికా నేతలతో సమావేశాలు జరిపారు. జనరల్‌ ‌టిక్కాఖాన్‌ ‌నాయకత్వంలో తూర్పు పాకిస్తాన్‌లో జరుగుతున్న ఊచకోత గురించి వివరించారు. అయినా ఫలితం లేకపోయింది. దీంతో అనివార్యంగా నాటి ప్రధాని ఇందిరాగాంధీ 1971 మార్చి 27న తూర్పు పాకిస్తాన్‌ (‌తూర్పు బెంగాల్‌) ‌సాతంత్య్ర ఉద్యమానికి బహిరంగంగా మద్దతు పలికారు.

పాక్‌ అధ్యక్షుడు జనరల్‌ ‌యాహ్యాఖాన్‌ ‌నవంబరు 23న ఎమర్జెన్సీ విధించి భారత్‌పై యుద్ధానికి సన్నద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. వెనువెంటనే డిసెంబరు 3 సాయంత్రం పాకిస్తాన్‌ ‌యుద్ధ విమానాలు మన దేశంలోని ఆగ్రా సహా 11 వైమానిక స్థావరాలపై దాడులు చేశాయి. ఈ కవ్వింపు చర్యలకు పాక్‌ ‘ఆపరేషన్‌ ‌చంఘీజ్‌ఖాన్‌’ అని పేరు పెట్టింది. ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండా దుస్సాహసానికి పాల్పడిన పాక్‌కు భారత్‌ ‌దీటైన సమాధానమిచ్చింది. కలకత్తాకు సమీపంలో ఆవామీ లీగ్‌ ‌ప్రవాస ప్రభుత్వం ఏర్పాటుకు ఆమె అనుమతించారు. అయితే అప్పటికి ఎలాంటి గుర్తింపును ప్రకటించలేదు. పాకిస్తాన్‌ ‌పై దాడి చేసి తూర్పు పాకిస్తాన్‌కు విముక్తి కల్పించే విషయమై నాటి ఆర్మీ చీఫ్‌ ‌జనరల్‌ ‌మానెక్‌షాతో చర్చించారు. కానీ ఏ దశలోను సంయమనం కోల్పోలేదు.


ఆవామీ లీగ్‌, ‌ముక్తి వాహిని

ఆవామీ లీగ్‌ ‌పార్టీ ఆవిర్భావం కూడా ఒక తిరుగుబాటే. 1949లో జరిగిన దీని స్థాపనలో ముఖ్యుడు సుహ్రావర్ధి కావడం విశేషం. ఇతడు ముస్లింలీగ్‌ ‌సభ్యుడే. జిన్నా వెంట నడిచినవాడే. ఇంకా అతుర్‌ ‌రహమాన్‌, ‌షమ్‌షుల్‌ ‌హుక్‌లతో కలసి ఆ సంస్థ స్థాపనలో షేక్‌ ‌ముజిబూర్‌ ‌రెహమాన్‌ ‌కూడా ఉన్నారు. ఆవామీ ముస్లిం లీగ్‌ ‌పేరుతో ఆవిర్భవించినప్పటికి 1950లో ఆవామీ లీగ్‌ అని పేరు మార్చారు. ముస్లిమేతరులకు కూడా ఇందులో ప్రవేశం ఉందని చెప్పడమే దీని వెనుక ఉద్దేశం. 1956 నాటికి దీని ప్రాబల్యం తూర్పు పాకిస్తాన్‌లో బాగా పెరిగింది. ముస్లిం లీగ్‌కు పోటీగా తయారయింది. 1966 నాటికి ముజిబూర్‌ ‌రెహమాన్‌ ‌నేతగా ఎదిగారు. తూర్పు పాకిస్తాన్‌కు స్వతంత్ర ప్రతిపత్తి కావాలన్న నినాదం ఇస్తూ ముజీబ్‌ ‌తీసుకు వచ్చిన ఆరు సూత్రాల ఉద్యమం సమయంలో బెంగాలీల ఆరాధ్య రాజకీయ సంస్థగా ఎదిగింది.

ముక్తి బాహిని లేదా ముక్తి వాహిని

తూర్పు పాకిస్తాన్‌కు స్వాతంత్య్రం ప్రకటించుకున్న తరువాత ముజిబూర్‌ ‌రెహమాన్‌ అరెస్టయ్యారు.బంగ్లా విమోచనకు అప్పుడే అంటే, మార్చి 7, 1971న దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. ఏప్రిల్‌, 1971 ‌నుంచి ముక్తి వాహిని తన కార్యకలాపాలను ఆరంభించింది. జనరల్‌ ఎంఏజీ ఉస్మానీ నాయకుడు. ఇందులో దాదాపు 70,000 మంది పనిచేశారు.  


యాహ్యాఖాన్‌, ‌టిక్కాఖాన్‌ ‌దుందుడుకు చర్యతో డిసెంబర్‌ 3, 1971‌న భారత్‌పై దాడుల నిర్ణయం తీసుకున్నారు. అప్పుడు మాత్రమే ఇందిర జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తూ ‘మనం యుద్ధానికి వెళ్లక తప్పని పరిస్థితి కల్పించారు’ అని యుద్ధ భేరీ ప్రకటించారు. ఆర్మీ, నేవీ, వాయుసేనలు రంగంలోకి దిగి పాక్‌ను అష్టదిగ్బంధనం చేశాయి. పాక్‌ ‌నేవీకి ఆయువు పట్టయిన కరాచీ ఓడరేవును భారత్‌ ‌చుట్టుముట్టింది. పాక్‌ ‌నౌకాదళానికి ప్రధాన స్థావరం కరాచీ. ఈ నగరం పాక్‌ ‌నౌకా వాణిజ్యానికి కేంద్రబిందువు కూడా. దేశంలోని పెద్ద నగరం కూడా ఇదే. అందువల్లే వ్యూహాత్మకంగా కరాచీపై భారత్‌ ‌నేవీ కన్నేసింది. యుద్ధనౌకలను, వాణిజ్య నౌకలను, చమురు డిపోలను ధ్వంసం చేసింది. పాక్‌ ‌లోని సింథ్‌ ‌ప్రావిన్స్ ‌రాజధాని నగరమే కరాచీ. కరాచీపై దాడికి ‘ఆపరేషన్‌ ‌త్రిశూల్‌’ అని పేరు పెట్టారు. కీలకమైన కరాచీ ఓడరేవు భారత్‌ ‌స్వాధీనం కావడంతో పాకిస్తాన్‌కు కాళ్లు, చేతులు ఆడలేదు. పదాతి, వాయుసేనల పరిస్థితీ అదే. పాక్‌ ‌వాయు సేనను భారత్‌ ‌వాయుసేన పూర్తిగా కట్టడి చేసింది. అడుగు తీసి అడుగు వేయకుండా అష్టదిగ్బంధనం చేసింది. పాకిస్తాన్‌ ‌జలాంతర్గామి ఘాజీని విశాఖపట్నం దగ్గరగా భారత నౌకాదళం ముంచేసింది. దీంతో పలువురు పాక్‌ ‌పైలట్లు బర్మా (ప్రస్తుత మయన్మార్‌) ‌పారిపోయారు. భారత సైనిక దళాలు కరాచీ వరకు చొచ్చుకువెళ్లారు. చివరికి డిసెంబరు 16న భారత సైనికులు ఢాకా నగరాన్ని చుట్టు ముట్టారు. తక్షణమే లొంగిపోకుంటే తీవ్ర పరిణామాలు తప్పవని భారత్‌ ‌సైన్యం పాక్‌ ‌సైనికులను హెచ్చరించింది. దీంతో దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్న పాక్‌ ‌సైన్యం గత్యంతరం లేక లొంగుబాటు ప్రకటన చేసింది. పాకిస్తాన్‌ ఈస్ట్ ‌కమాండ్‌ అధిపతి లెఫ్టినెంట్‌ ‌జనరల్‌ ఏఏకే నియాజీ, ఆయన సహాయకుడు వైస్‌ అడ్మిరల్‌ ఎంఎన్‌ ‌ఖాన్‌ ‌యావత్‌ ‌సైన్యంతో సహా లొంగిపోయారు. భారత లెఫ్టినెంట్‌ ‌జనరల్‌ అరోరాతో కలిసి లొంగుబాటు పత్రాలపై సంతకాలు చేశారు. దీంతో 13 రోజుల్లోనే యుద్ధం ముగిసింది. భారత సైన్యం డిసెంబర్‌ 3, 1971‌న పశ్చిమ, తూర్పు పాకిస్తాన్‌ ‌రెండు సరి హద్దులలోను దాడి చేసింది. వరసగా తప్పటడు గులు వేస్తున్న పాకిస్తాన్‌ ‌మరొక తప్పటడుగు వేసి భారత్‌ ‌చొరబడడానికి ఆస్కారం ఇచ్చింది. పాకిస్తాన్‌ ‌విమానాలు భారత వాయువ్యంలో అదే రోజున దాడులు చేశాయి. ఇందిర వెంటనే నిర్ణయం తీసుకున్నారు. డిసెంబర్‌ 16‌న పాకిస్తాన్‌ ‌సైన్యం లొంగిపోయింది. అప్పుడు విదేశాంగమంత్రిగా ఉన్న భుట్టో ఐక్యరాజ్య సమితిని ఆశ్రయించాడు. అమెరికా శరణు వేడాడు. కాల్పుల విరమణకు, తూర్పు పాకిస్తాన్‌ ‌నుంచి భారత సేనలను వెనక్కి పంపడానికి భారత్‌ను ఒప్పించవలసిందని అమెరికాను కోరాడు. కానీ ఈ పథకాన్ని రష్యా వ్యతిరేకించింది. డిసెంబర్‌ 16, 1971‌న బంగ్లాదేశ్‌ ఏర్పడింది. కొన్ని రోజుల తరువాత యాహ్యాఖాన్‌ ‌పదవి నుంచి దిగిపోయాడు. భుట్టో పదవి చేపట్టాడు. అప్పుడు ముజీబ్‌ను జైలు నుంచి విడుదల చేశారు. 1972 జనవరిలో ముజీబ్‌ ‌ప్రధానిగా అబూ సయీఫ్‌ ‌చౌధురి అధ్యక్షునిగా తొలి ప్రభుత్వం ఏర్పడింది.

పశ్చిమ పాకిస్తాన్‌ ‌నుంచి తూర్పు పాకిస్తాన్‌కు విముక్తి లభించింది. తూర్పు పాకిస్తాన్‌… ‌బంగ్లాదేశ్‌ ‌పేరుతో స్వతంత్ర దేశంగా అవతరించింది. బంగబంధు షేక్‌ ‌ముజిబుర్‌ ‌రహమాన్‌ ‌నాయకత్వం లోని ఆవామీలీగ్‌ అధికారాన్ని చేపట్టింది. ముజిబుర్‌ ‌దేశ తొలి ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. భారత్‌, ‌పాకిస్తాన్‌, ‌బంగ్లాదేశ్‌ ‌చరిత్రలో ఇదొక చారిత్రక ఘట్టం. దక్షిణాసియాలో కీలక పరిణామం.

బంగ్లాదేశ్‌ ‌స్వాతంత్య్ర సాధనలో భారత్‌ ‌చూపిన తెగువ, చొరవ, పాక్‌ను అణచిన తీరు అంతర్జాతీ యంగా ప్రశంసలు అందుకుంది. అగ్రరాజ్యాలైన అమెరికా, సోవియట్‌ ‌యూనియన్‌ (‌ప్రస్తుత రష్యా) భారత్‌ ‌పాత్రను గుర్తించాయి. అంతర్జాతీయంగా భారత్‌ ‌పేరు ప్రతిష్టలు మార్మోగాయి. శాంతికాముక భారత్‌ ‌జోలికొస్తే ఎలాంటి ప్రతిస్పందన ఉంటుందో అంతర్జాతీయ సమాజానికి అర్థమైంది. శాంతికి ఎంత ప్రాధాన్యమిస్తుందో దాడులకు దిగితే ఎంత దీటుగా స్పందిస్తుందో తెలిసివచ్చింది.

చివరిగా – 1971లో భారత్‌ అం‌దించిన సాయం, ఇచ్చిన నైతిక మద్దతు ఇప్పుడు బంగ్లాదేశ్‌కు గుర్తున్నాయా? నాడు ఉన్న సెక్యులర్‌ ‌భావాలు నేడు అక్కడ కనిపిస్తున్నాయా? నాడు హిందువులు అందించిన అండదండలు మదిలో మెదులు తున్నాయా? వారి ఉనికిని గౌరవించాలన్న కనీస స్పృహ బంగ్లావాసులలో ఉన్నదా? వీటికి సమాధా నాలు చెప్పడం కొంచెం కష్టమే అయినా, పాకిస్తాన్‌ అనే ఒక మతోన్మాద భూతం నుంచి చిన్న దేశాన్ని రక్షించి మనకు అనుకూలంగా మలుచుకోవాలన్నంత వరకే నాడు భారత్‌ ‌కోరుకుంది.

– గోపరాజు విశ్వేశ్వర ప్రసాద్‌, సీనియర్‌ ‌జర్నలిస్ట్

By editor

Twitter
Instagram