భాష వేసిన బీజం

1947 నాటి భారతదేశ విభజన నివారించగలిగిన ఘోర విషాదం, పాకిస్తాన్‌ అనే దేశం ఏర్పడింది. ఇది జరిగి పాతికేళ్లు పూర్తికాకుండానే పాకిస్తాన్‌ ‌విభజన చోటు చేసుకుంది. పాకిస్తాన్‌ ‌పరిధిని పశ్చిమ పంజాబ్‌కు కుదించివేస్తూ, 1971లో తూర్పు (బెంగాల్‌) ‌పాకిస్తాన్‌ ‌బంగ్లాదేశ్‌గా ప్రపంచ పటం మీద అవతరించింది. ఇది నివారించడానికి వీలు కాని పరిణామం. ఒక సమూహాన్ని మతోన్మాదం కలిపి ఉంచలేదని ఈ పరిణామం రుజువు చేసింది. మాతృభాషాభిమానం నుంచీ, సాంస్కృతిక మూలాల నుంచీ ఏ సమాజమూ దూరంగా జరగలేదన్న సంగతి బంగ్లాదేశ్‌ అవతరణ అనే పేరుతో చరిత్రకెక్కింది. తమకి ప్రాధాన్యం లేదంటూ, మేం హిందూ ఆధిక్య పాలనలో కొనసాగలేమంటూ భారత స్వాతంత్య్ర పోరాటంలో ముస్లిం లీగ్‌ అసంబద్ధ వాదనను ప్రచారం చేసింది. పాకిస్తాన్‌ ఏర్పడిన సరిగ్గా 24 సంవత్సరాలకే తమను చిన్నచూపు చూస్తున్నారంటూ, మేం పశ్చిమ పాకిస్తాన్‌ ‌నాయకుల పాలనకు అంగీకరించబోమంటూ తూర్పు పాకిస్తాన్‌ ‌ప్రజలు భావించడం చారిత్రక వైచిత్రి. ఇది చరిత్ర, ఇటీవల చెప్పిన గొప్ప పాఠం. అప్పుడు హిందువుల ఆధిక్యం గురించి ఉపఖండ ముస్లింలంతా ధ్వజమెత్తారు. తరువాత పశ్చిమ పాక్‌ ‌ముస్లింలను తూర్పు పాకిస్తాన్‌ ‌ముస్లింలు ఏకంగా వలసవాదులుగా చూపారు. స్వతంత్య్రం కోసం ఉద్యమించారు. పాతికేళ్లలోపుననే వేయి మైళ్లు దూరంగా ఉన్న పశ్చిమ పాకిస్తాన్‌ ‌పిడికిలి నుంచి తప్పించుకున్నారు. ఫలితమే బంగ్లాదేశ్‌. ఈ ‌ఘటనకు యాభయ్‌ ఏళ్లు నిండాయి. ఆ క్రమాన్ని ఒక్కసారి మన తరం కూడా గమనించాలి. అణచివేత నుంచి అంతర్యుద్ధానికీ, అంతర్యుద్ధం నుంచి పూర్తి స్థాయి యుద్ధానికీ ఈ ఘట్టం సాగింది.

ముస్లింలీగ్‌ ‌నాయకుడు మహమ్మదలీ జిన్నా పాకిస్తాన్‌ను కోరడంలోనే పొరపాటు ఉందని ఇప్పుడు కాదు, అప్పుడే గుర్తించినవారు ఉన్నారు. కచ్చితంగా చెప్పాలంటే, ఒక భౌగోళిక అసంబద్ధతతోనే తాను పాకిస్తాన్‌ను అంగీకరిస్తున్నానన్న వాస్తవం జిన్నాకూ తెలుసు. ‘మాత్‌ ఈటెన్‌’ (‌చిమ్మెటలు కొట్టేసిన) వస్త్రం వంటి భాగాన్ని ఇస్తున్నారని ఆఖరి వైస్రాయ్‌ ‌మౌంట్‌బాటన్‌తో జిన్నా వ్యాఖ్యానించడమే దీనికి ప్రబల నిదర్శనం. భారత జాతీయ కాంగ్రెస్‌ ‌నాయకుడూ, ఆ పార్టీలోని ప్రముఖ సంప్రదాయ ముస్లింవాదీ మౌలానా అబుల్‌ ‌కలాం ఆజాద్‌ ‌మాటలను ఒకసారి స్మరించుకుని ఆ చరిత్ర పరిణామాలను పరామర్శించడం సబబు. ‘బెంగాల్‌ ‌బయటివారి ఆధిపత్యాన్ని అంగీకరించదన్న సంగతిని ఆయన (జిన్నా) ఇంకా తెలుసుకోవలసి ఉంది. త్వరలోనే లేదా తరువాతైనా బెంగాల్‌ ‌ప్రాంతం నిరసన బాట పడుతుంది. పశ్చిమ పాకిస్తాన్‌ ఆధిపత్యాన్ని తూర్పు పాకిస్తాన్‌ ఏనాటికీ భరించదని నా నమ్మకం. ఆ రెండు దేశాలు ఏనాటికీ కలసి సాగలేవు.’ షొరీష్‌ ‌కశ్మీరీ అనే జర్నలిస్ట్‌కు 1946, ఏప్రిల్‌లో ఇచ్చిన ఇంటర్వ్యూలో అబుల్‌ ‌కలాం ఆజాద్‌ అన్నమాటలివి.


ఆమాటలలో అక్షరం కూడా పొల్లుపోలేదు. పశ్చిమ పాకిస్తాన్‌ ‌చర్య, తూర్పు పాకిస్తాన్‌ ‌ప్రతిచర్య సరిగ్గా అబుల్‌ ‌కలాం అంచనాను అక్షరమక్షరం నిజం చేశాయి. ఈ పరిణామానికి రెండు దశలు. మొదటిది భాషోద్యమ దశ. రెండు స్వయం ప్రతిపత్తి నుంచి ప్రత్యేక దేశం వరకు సాగిన ఉద్యమ దశ. అంతిమంగా యుద్ధం.  ఫిబ్రవరి 23,1948న ఉర్దూను జాతీయ భాషగా పాకిస్తాన్‌ ‌కేంద్ర ప్రభుత్వం తరఫున గవర్నర్‌ ‌జనరల్‌ ఎంఏ ‌జిన్నా  ప్రకటించారు. ‘ఉర్దూ, కేవలం ఉర్దూ’యే రాజభాషగా రుద్దారు. బంగ్లాదేశ్‌ అనే దేశం కోరడానికి తూర్పు పాకిస్తాన్‌ ‌ప్రజలకు ఈ చర్యతోనే  పశ్చిమ పాకిస్తాన్‌ ‌నాయకులు అవకాశం ఇచ్చారు. భాషాభిమానం, ఆపై అది భాషోద్యమంగా అవతరించడంతో బంగ్లాకు అంకురార్పణ చేసినా, ఇతర కారణాలు కూడా లేకపోలేదు. బంగ్లా ఆవిర్భావం వెనుక ఉన్న నేపథ్యం, తాత్త్వికతలను చారిత్రక దృష్టితో పీవీ నరసింహారావు తన నవల ‘ఇన్‌సైడర్‌’‌లో చక్కగా చెప్పారు, ‘1953లో తూర్పు పాకిస్తాన్‌లో ఒక్కుమ్మడిగా బెంగాలీలకి అనుకూలంగా తిరుగు బాటు ప్రజ్వరిల్లింది. ఎందరో సాహసిక యువకులు తూటాలకు ఎదురు నిలిచారు. అయితే భాషా వివాదం మొత్తం వివాదానికి ఒక సన్నని కొస మాత్రమే. రకరకాల కారణాతో తూర్పు పాకిస్తాన్‌ను ముంచెత్తిన అశాంతికీ, అసంతృప్తికీ అది కేవలం ఒక సూచిక. ప్రజల ఊహలో ‘వలస పీడన’కు అద్దం పడుతున్న పశ్చిమ పాకిస్తాన్‌ ‌నుంచి తూర్పు పాకిస్తాన్‌ ‌విముక్తికి తలపెట్టిన పోరాటంగా అది క్రమంగా విస్తరించింది’ అన్నారు. ఈ పేరా చివర ఆయన చేసిన వ్యాఖ్య ఇంకా గమనించదగినది, అది, ‘మత సంబంధం బలహీనపడింది.’ ఉర్దూను దేశమంతటికి అధికార భాషగా చేయబోయేసరికి బెంగాలీని కూడా అధికార భాషలలో ఒకటిగా గుర్తించాలన్న డిమాండ్‌ ‌తూర్పు పాకిస్తాన్‌లో వెంటనే, అత్యంత సహజంగా పుట్టుకొచ్చింది. ఇది న్యాయమైన కోర్కె కూడా. ఉద్యోగావకాశాలలోనే కాదు, సాంఘిక ప్రతిపత్తిలోనూ భాష ప్రత్యక్షంగా ముడిపడి ఉంటుంది. భాషా రాజకీయాలు తొలి మంట రాజేయగానే అంతే కీలకమైన, బహుశా అంతకు మించిన ఇతర అంశాలు కూడా పైకి తోసుకువచ్చాయి. జనాభా రీత్యా తమదే పైచేయి కనుక దామాషా ప్రకారం చట్టసభలలో, పరిపాలనలో పెద్ద వాటా ఇవ్వాలని తూర్పు పాకిస్తాన్‌ ‌డిమాండ్‌ ‌చేసింది. ఇది పశ్చిమ పాకిస్తాన్‌కు ఇష్టం లేకపోవడం వల్ల 1954లో రాజ్యాంగ నిర్మాణ పక్రియే నిలిచిపోయింది.

భాషకు ప్రాధాన్యం గురించీ, ఆర్థిక ప్రయోజనాల గురించి తూర్పు పాకిస్తాన్‌ ‌వారు లేవనెత్తిన సమస్యలను పరిశీలించే దృష్టి గాని, పరిష్కరించే యోచన గాని పశ్చిమ పాకిస్తాన్‌కు లేవు. పైగా అణచివేతకు దిగింది. ఫిబ్రవరి 21, 1952లో ఢాకా విశ్వవిద్యాలయం విద్యార్థులు ప్రభుత్వ ఆదేశాలను ధిక్కరిస్తూ నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఆ ప్రదర్శన మీద పోలీసులు కాల్పులు జరిపారు. కొంతమంది విద్యార్థులు చనిపోయారు (నవంబర్‌ 17, 1999‌న యునెస్కో అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం- ఫిబ్రవరి 21- ప్రకటించడానికి పునాది ఈ రోజే). దీనిని ఆవామీ లీగ్‌ (‌మొదట ఆవామీ ముస్లిం లీగ్‌) ‌పెద్ద ఉద్యమంగా మలచింది. ఆఖరికి ప్రభుత్వమే దిగి వచ్చి 1956లో బెంగాలీకి అధికార భాష (ఉర్దూతో పాటు) హోదా ఇచ్చింది.

మొదటి నుంచి తూర్పు, పశ్చిమ పాకిస్తాన్‌ల నడుమ సయోధ్య లేదు. పశ్చిమ పాకిస్తాన్‌ ‌జనాభా పాకిస్తాన్‌ ‌జనాభాలో తక్కువే. కానీ ఆదాయంలో ఎక్కువ వాటా అక్కడికే కేటాయించేవారు. పారిశ్రామి కాభివృద్ధి, వ్యవసాయ సంస్కరణలు, ప్రజాభివృద్ధి పథకాలు అన్నీ ఆ ప్రాంతానికే అధికంగా కేటాయించే వారు. పాకిస్తాన్‌ ‌పౌర, సైనిక ఉద్యోగాలలో కూడా పంజాబీలే, అంటే పశ్చిమ పాకిస్తాన్‌ ‌వారే ఎక్కువ. పైగా బెంగాలీలను, అంటే తూర్పు పాకిస్తాన్‌ ‌ప్రజలను యుద్ధవీరులు కారని బ్రిటిష్‌ ‌వేసిన ముద్రను పశ్చిమ పాకిస్తాన్‌ ‌నాయకులు వాడుకుంటూ, తూర్పు ప్రాంతం వారిని చిన్న చూపు చూసేవారు. నిజానికి బ్రిటిష్‌ ఇం‌డియా కాలం నుంచి సైనిక విభాగంలో పంజాబీలది పైచేయి. తరతరాల నుంచి సైన్యంలో పనిచేసేవారన్న కీర్తి కలిగినవారు బెంగాలీ కుటుంబాలలో లేరు. కానీ, పాకిస్తాన్‌లో ఏమైనా అభివృద్ధి అంటూ జరిగితే కేవలం తూర్పు పాకిస్తాన్‌ ‌ప్రయోజ నాలను బలిపెట్టడం ద్వారానే జరిగిందన్నది నిజం.

షేక్‌ ‌ముజిబూర్‌ ‌రెహమాన్‌ ‌

ఈ స్థితిలో తూర్పు బెంగాల్‌ ‌ప్రాంత ప్రయోజనాల రక్షణకు ప్రత్యేక ప్రతిపత్తి సాధనతోనే సాధ్యమని 1960 ప్రాంతానికి ఒక నిర్ణయానికి వచ్చారు. 1962-68 మధ్య ఈ ప్రాంత గవర్నర్‌గా పనిచేసిన అబ్దుల్‌ ‌మెమన్‌ ‌ఖాన్‌ ‌ప్రతిపక్షం మీద ఆంక్షలు పెట్టి, మీడియా మీద సెన్సార్‌ ‌విధించాడు. 1965 నాటికి గవర్నర్‌ ‌పాలన మరీ అప్రతిష్ట కొని తెచ్చుకుంది. ఇండియా, పాక్‌ ‌యుద్ధం సమయంలో తూర్పు పాకిస్తాన్‌ ‌ప్రజలలో దేశభక్తి గణనీయంగా పెరిగింది. ఇది ఒక ఐక్యతను తెచ్చింది. చిత్రం ఏమిటంటే ఒకవేళ భారత్‌ ‌దాడి చేస్తే పశ్చిమ పాకి స్తాన్‌ ‌సైన్యం వచ్చి ఆదుకోదని కూడా వీళ్లు నమ్మేవాళ్లు.

అప్పుడే, 1966లో ప్రతిపక్షాలన్నీ కలసి లాహోర్‌లో కీలక సమావేశం జరిపాయి. దానికి ఆవామీ లీగ్‌ ‌నాయకుడు షేక్‌ ‌ముజిబూర్‌ ‌రెహమాన్‌ ‌నాయకత్వం వహించారు. ఆ సమావేశంలో ఆరు సూత్రాల కార్యక్రమం ప్రకటించి, స్వయం ప్రతిపత్తిని కోరారు. రాజకీయ, ఆర్థిక, రక్షణ వ్యవహారాలలో స్వయం ప్రతిపత్తి ఇవ్వాలని ఈ సమావేశం కోరింది. ఇదే ఆరుసూత్రాల ఉద్యమానికి నాంది. నిజానికి ఇందులో స్వయం ప్రతిపత్తి అన్న డిమాండ్‌ ఉన్నా, వాస్తవానికి తూర్పు పాకిస్తాన్‌ ‌కోరినది, స్వతంత్ర దేశమే. రక్షణ వ్యవహారాలలో స్వయం ప్రతిపత్తి కోరడం వెనుక ఉండేది ఇదే. రెండేళ్ల తరువాత ఈ డిమాండ్‌ ‌పెట్టిన ఫలితం కనిపించింది. అది అగర్తలా కుట్ర రూపంలో వచ్చింది. భారత్‌ అం‌డతో తూర్పు పాకిస్తాన్‌ను ప్రత్యేక దేశంగా ఏర్పాటు చేయడానికి ప్రయత్నిస్తున్నారంటూ ముజిబూర్‌ ‌రెహమాన్‌ ‌మీద కేంద్ర ప్రభుత్వం జూన్‌ 1968‌లో కేసు నమోదు చేసింది. అంతకు ముందు మే 1967లో పబ్లిక్‌ ‌సేఫ్టీ యాక్ట్ ‌కింద కూడా ఒక కేసు నమోదు చేసింది. దీనితో ముజీబ్‌ ‌ప్రతిష్ట మంటగలుస్తుందని ప్రభుత్వం భావించింది. కానీ ఈ కేసును ఉపసంహరించుకోవా లంటూ తూర్పు ప్రాంతంలో ఆందోళనలు మొదలై నాయి. అదే సమయంలో ఆయుబ్‌ ‌ఖాన్‌ను పదవి నుంచి తొలగించాలంటూ పశ్చిమ పాకిస్తాన్‌లో ఆరంభమైన ఉద్యమం తూర్పునకు కూడా పాకింది. 1969లో ఆయుబ్‌ ‌రాజీనామా చేశాడు. ఆ స్థానంలోకి జనరల్‌ ‌యాహ్యా ఖాన్‌ ‌వచ్చాడు. 1970లో ఎన్నికలు జరపబోతున్నట్టు, అందులో పాల్గొనడానికి రాజకీయ పార్టీలకు అనుమతి ఇస్తున్నట్టు ఆయనే ప్రకటించాడు. మళ్లీ పార్లమెంట్‌ ఏర్పడి రాజ్యాంగం వచ్చే వరకు తాను పదవిలో ఉంటానని చెప్పాడు.

డిసెంబర్‌ 7, 1970‌న ఎన్నికలు జరిగాయి. తూర్పు పాకిస్తాన్‌లో 162 నేషనల్‌ అసెంబ్లీ స్థానాలకు గాను 160 ఆవామీ లీగ్‌ ‌గెలిచింది. ప్రావిన్షియల్‌ అసెంబ్లీ ఎన్నికలలోను ఘన విజయం సాధించింది. అక్కడ ఉన్న 300 స్థానాలలో 288 గెలిచింది. పాకిస్తాన్‌ ‌నేషనల్‌ అసెంబ్లీలో మొత్తం స్థానాలు 313. అందులో ఆవామీ లీగ్‌ 167 ‌స్థానాలతో అతి పెద్ద పార్టీగా అవతరించింది. జుల్ఫీకర్‌ అలీ భుట్టో నాయకత్వంలో పోటీ చేసిన పాకిస్తాన్‌ ‌పీపుల్స్ ‌పార్టీ పశ్చిమ పాక్‌లో 88 స్థానాలతో ద్వితీయ స్థానంలో నిలిచింది. అక్కడ 138 స్థానాలు ఉన్నాయి. అయితే ముజీబ్‌కు అధికారం అప్పగించకుండా దేశంలో పెద్ద అలజడి జరిగింది.

మార్చి 25న సైన్యం ఢాకాలో అణచివేత ఆరంభించింది. ఆ మరునాడే ముజీబ్‌ ‌స్వతంత్రం ప్రకటించాడు. ప్రభుత్వ నిర్బంధంలోనే ఉన్న ముజీబ్‌ అధ్యక్షునిగా తూర్పు పాకిస్తాన్‌ ‌ప్రవాస ప్రభుత్వం ఏర్పడింది. తాజుద్దీన్‌ అహ్మద్‌ ‌ప్రధాన మంత్రి. ఈ ప్రభుత్వానికి మార్చి 27న భారత ప్రధాని ఇందిరాగాంధీ మద్దతు ప్రకటించారు.

బెంగాలీలకు మద్దతు ఇవ్వడానికి అమెరికా నిరాకరించిందని సోవియెట్‌ ‌రష్యా పరిశోధకుడు ఆండ్రియో ఒక అధ్యయనంలో చెప్పారు. దీనితో ఇందిరాగాంధీ ఆగస్ట్ 9, 1971‌న సోవియెట్‌ ‌రష్యాతో శాంతి ఒప్పందం కుదుర్చుకుని ప్రపంచ దేశాలలో ముజీబ్‌కు మద్దతు తేవడానికి ప్రయత్నించారు. బంగ్లా శరణార్థులు రావడానికి సరిహద్దులలో అనుమతిం చారు. పశ్చిమ బెంగాల్‌, ‌బిహార్‌, అస్సాం, మేఘాలయ, ఉత్తరప్రదేశ్‌, ‌త్రిపురలలో కాందిశీకుల శిబిరాలు ఏర్పాటు చేశారు. ప్రవాసంలో ఉన్న బంగ్లా సైనికాధికారులు వీరి నుంచి ముక్తి వాహిని సైన్యంలోకి చేరికలు సాగించారు. బంగ్లా స్వాతంత్య్ర సమర యోధుల శిక్షణకు కూడా భారత్‌ ‌సహకరించింది.

నవంబర్‌ 11,1970‌న దక్షిణ తీరంలో పెను తుపాను ఐదు లక్షల మందిని తుడిచిపెట్టేసింది. ఈ విషయంలో పాకిస్తాన్‌ ‌ప్రభుత్వం అత్యంత నిర్లక్ష్యం ప్రదర్శించింది. తుపాను రాక గురించి హెచ్చరికలు ఇవ్వడం, తుపాను వచ్చిన తరువాత సహాయ చర్యలు కూడా కావాలని జాప్యం చేసింది. ఇది జాతీయోద్య మాన్ని తీవ్రం చేసింది.

 ఏప్రిల్‌ 17, 1971‌న వీరు ముజిబ్‌నగర్‌లో ప్రమాణ స్వీకారం చేయడంతో బంగ్లా ప్రభుత్వం ఏర్పడింది. ఇదే ఒక రాజ్యాంగాన్ని ప్రకటించింది. పరిపాలన ఆరంభించింది. అయితే‘ఈ రోజు బంగ్లాదేశ్‌ ‌స్వతంత్ర దేశం’ అని మార్చి 26, 1971 వేకువన ముజీబ్‌ ‌లాంఛనంగా స్వాతంత్య్రం ప్రకటిం చారు. ఆ మరునాడే విమోచన యుద్ధానికి సిద్ధం కావలసిందిగా తూర్పు పాకిస్తాన్‌ ‌ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు. ముక్తి వాహిని అనే ఆజ్ఞాతవీరుల సేనలు రంగంలోకి దిగాయి.

About Author

By editor

Twitter
Instagram