విప్లవద్రష్ట

జనవరి 12 వివేకానంద జయంతి

‘భారతమాత విముక్తమవుతుంది!’

1893లో షికాగోలో జరిగిన సర్వమత సమ్మేళనానికి హాజరవడానికి అమెరికా వెళుతూ మద్రాసులో స్వామి వివేకాంద అన్నమాట ఇది. అణు విస్ఫోటనానికి ఏ మాత్రం తీసిపోని ఈ మాటను మొదట అన్నవారు ఆయనే కావచ్చు. ఇది ఆనాటి యువతరంలో ఎంతటి శక్తిని దట్టించి ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. భారతీయుల మధ్య ఆధ్యాత్మికత పునాదిగా, భారతీయత నేపథ్యంతో ఏకాత్మ భావనను నిర్మించిన దూరదృష్టి ఆయన సొంతం. అదే ఈ పురాతన సనాతన దేశం కొత్త చరిత్రను లిఖించింది.

స్వాతంత్య్ర పోరాటానికి భారతీయులు సిద్ధం కావడానికి అవసరమైన తాత్త్వికతను అందించినవారిలో స్వామి వివేకానంద ముఖ్యులు. ఆయన నేరుగా ఉద్యమంలో పాల్గొనలేదు. కానీ ఆత్మ గౌరవమే పునాదిగా, మనదైన గతం మీద కొత్త దృష్టిని ప్రసాదిస్తూ వివేకానంద అందించిన ప్రేరణ అసాధారణమైనది. ‘ఇవాళ వివేకానందులు జీవించి ఉంటే వారే నా గురువు. ఆయనే నా మార్గదర్శకులు. ఆయన పాదాల చెంతనే నా స్థానం’ అని సుభాస్‌ చంద్రబోస్‌ అన్నారంటేనే వివేకానందుల ప్రభావం అర్ధమవుతుంది. అరవిందయోగి విప్లవ రుషిగా అవతరించే క్రమం మీద కూడా వివేకానంద స్ఫూర్తి ఉంది. అలీపూర్‌ కారాగారంలో ఉండగా వివేకానందుని ఆత్మతో నేను మాట్లాడేవాడిని అన్నారు అరవిందులు. వాటితో పాటు బెంగాల్‌ భూమి మీద అంకురించి భారతావని మొత్తానికి ఆదర్శంగా నిలిచిన తీవ్ర జాతీయోద్యమానికి అపురూపమైన సేవలు అందించిన సోదరి నివేదిత గాథను చూసినా స్వరాజ్య సమరం మీద వివేకానందుల ప్రభావం ఎంతటిదో బోధపడుతుంది.

 భారత జాతీయ కాంగ్రెస్‌ ఆవిర్భావానికి కొంచెం ముందు, అంటే 1885 నాటి భారతావనిలో నిర్మితమైన పునరుజ్జీవనోద్యమంలో వివేకానందుల స్థానం చిరస్మరణీయం. దయానంద, ఆత్మారాం పాండురంగ, రనదే, వివేకానందులు వంటి వారే పునరుజ్జీవన దృష్టిని ప్రసాదించారు.

1901లో గోపాలకృష్ణ గోఖలేతో కలసి గాంధీజీ కలకత్తాలో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్‌ వార్షిక సమావేశాలకు హాజరయ్యారు. అప్పుడు అక్కడ కొద్దిరోజులు ఉన్నారు. బేలూరు మఠానికి వెళ్లి స్వామిని దర్శించుకోవాలనే భావించారు. అప్పటికే వివేకానందులు తీవ్ర అనారోగ్యంతో ఉండడం వల్ల సాధ్యపడలేదు. ఇది తన ఆత్మకథలో గాంధీజీ రాసుకున్నారు. ఆ తరువాత కొద్దికాలానికే ఆ మహనీయుడు కన్నుమూశారు. అణచివేతకు గురైన సమూహాల పట్ల వివేకానందులు వెల్లడిరచిన భావాలు, ప్రకటించిన ప్రేమ గాంధీని ఆనాడే కదిలించాయి. ఆ భక్తిభావాన్ని అలాగే కాపాడుకుంటూ, గాంధీజీ 1921లో కలకత్తాలోనే జరిగిన వివేకానంద జయంతి కార్యక్రమానికి హాజరయ్యారు. స్వామి వివేకానంద గ్రంథాలు చదివిన తరువాత నా శక్తి వేయిరెట్లు పెరిగిన అనుభూతి పొందాను అన్నారాయన. హిందూధర్మం ఎలాంటి సంపదో అలనాడు ఆది శంకరులు చెప్పారు. ఇప్పుడు వివేకానంద మాటలు చెబుతున్నాయి అన్నారు బాలగంగాధర తిలక్‌. భారతదేశాన్ని అర్ధం చేసుకోవాలని నీవు కోరుకుంటే స్వామి వివేకానంద రచనలు చదువు. వాటి నిండా సానుకూల దృక్పథమే వెల్లివిరుస్తూ ఉంటుంది అన్నారు విశ్వకవి రవీంద్రనాథ్‌ టాగూర్‌. 1893లో వివేకానందులు విదేశీ పర్యటనలో ఉన్నారు. యోకోహామా నుంచి కెనడాకు నౌకలో వెళుతున్నప్పుడు జంషెడ్జీ టాటా కలిశారు. ఆయనకు స్వామి చెప్పిన మాట అద్భుతమైనది. మన దేశంలో శాస్త్రీయ దృక్పథం పెంచడానికి దోహదపడే విజ్ఞానశాస్త్ర వ్యాప్తికి, పరిశోధనలకీ మీ కృషి అవసరమని చెప్పారు టాటాకి.

ఢాకా ముక్తి సంఫ్‌ును స్థాపించిన ప్రసిద్ధ బెంగాలీ తీవ్ర జాతీయవాది హేమచంద్ర ఘోష్‌ అనుభవానికి మరొక కోణం ఉంది. గాంధీజీ కలవడానికి ప్రయత్నించిన 1901లోనే హేమచంద్ర వివేకానందులను ఢాకా వచ్చినప్పుడు కలుసుకోగలిగారు. ప్రఖ్యాత బెంగాలీ నవలాకారుడు శరత్‌బాబు ఈయనకు సన్నిహితుడు కూడా. ‘పథేర్‌ దాబి’ అనే నవలలో ఆ మహా రచయిత చిత్రించిన విప్లవకారుని పాత్రకు మాతృక హేమచంద్ర జీవితానుభవమేనని చెబుతారు. తాను కలసినప్పుడు స్వామి ఏమి చెప్పారో హేమచంద్ర నమోదు చేశారు. ‘భారత్‌ మొదట రాజకీయంగా స్వాతంత్య్రం పొందాలి. ఎందుకంటే, ఒక వలసదేశం మాట వినడానికి, ఆ దేశాన్ని గౌరవించడానికి ప్రపంచంలోని ఏ ఒక్క దేశం కూడా సిద్ధపడదు. నేనొక సత్యం మీకు చెబుతున్నాను వినండి. ఈ ప్రపంచంలో ఏ ఒక్క శక్తికీ ఈ సత్యాన్ని నిరోధించలేదు. భారతదేశం స్వతంత్రమవుతుంది. ఆ క్షణాలు మరీ దూరంగా కూడా లేవు’ అన్నారాయన. ఎంత ఆత్మ విశ్వాసం!

ఆత్మ విశ్వాసానికీ, సమదృష్టికీ, సమ భావనకీ వివేకానందుని తలుచుకోవడం, అధ్యయనం చేయడం ప్రతి తరంలో, ప్రతి భారతీయుడి కర్తవ్యం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Twitter
Instagram