– జంధ్యాల శరత్‌బాబు, సీనియర్ జర్నలిస్ట్
మాట, పాట, బాట… ఈ మూడూ కలిపి గోరటి వెంకన్న! పెద్ద పెద్ద పదాలుండవు, సాగుతూపోయే రాగాలుండవు, తడబాటు అడుగులు అసలే కనిపించవు. మాట్లాడినా, పాడినా, కదిలినా ఒకే ఉద్వేగం. అందులోనే వెదురుగానం, నెమలి నాట్యం, వల్లంకి తాళం. వల్లంకిపిట్ట తెలుసు మనకు. వదినా వదినా వల్లంకిపిట్టా పాటను మనమంతా విన్నవాళ్లమే. దానిలో ఆటపట్టించడం ఉంది. మెల్లగ రమ్మంటా, పాపకు తోడుండి పొమ్మంటా అనడంలో చేరపిలవడం దాగుంది. పల్లె సాహితీ కిరీటి పరిభాషలో మటుకు` ఇన్నీ అన్నీ కాదు.. ఇంకెన్నో భావనాదాలున్నాయి.
అడవి అందాన్ని చూశారు. ప్రకృతి కాంతి సోయగానికి మురిశారు. ఎల్లలేవీ కానరాని ప్రేమ తత్వంతో తపించారు. అందులోనూ తనదైన తాత్త్వికతతో నిలిచి గెలిచారు. జానపదానికి ఆయన హారతి పడితే, పాఠక జనమంతా ఆయనకు నీరాజనం పలుకుతోంది. జీవితం తనకు పూలతోట. ఆట పాటల దరువే తన పాలిట రాచబాట. పాట అన్నాక రాగం తాళం పల్లవి తప్పవు. రాగాలాపనలో స్వర ఆరోహణ అవరోహణలుంటాయి. తాళంలో చరుపులూ విరుపులూ ధ్వనిస్తాయి. పల్లవి అనేసరికి పదే పదే అదే పనిగా వచ్చే పలకరింపులు మురిస్తాయి. మొత్తం ముప్ఫయ్ రెండు గేయకవితలను గుదిగుచ్చి, గోరటి అన్న అందించిన తాళకానుకకైతే ఏకంగా జాతీయ ఘనతే ఎదురొచ్చింది. ఆ సంకల కావ్యానికి సారస్వత పరిమళాలద్దింది కేంద్ర సాహిత్య అకాడమీ పురస్మృతి. గాలీ నీరూ చెట్టూ పుట్టా కొండా కోనలతో జట్టు కట్టే 58 ఏళ్ల ‘కుర్రాడు’. అక్షరాలతో తన మమేకం కడవరకు ఉంటుందని స్వచ్ఛమైన చిరునవ్వుతో ప్రకటించిన కలం, గళం ‘యువవీరుడు!’. ఒక్క తెలంగాణకే కాదుÑ తెలుగువారందరికీ, ఆ మాట కొస్తే యావత్ దేశానికీ ఖ్యాతి పతాకలా నిలుస్తున్నారీ వాగ్గేయకారుడు.
మట్టి మనిషికి మారుపేరు గోరటి వెంకన్న. తన తొలి గురువు అడవే అంటారు. వెన్నెల్లో ఏటి సోయగానికి పరవశిస్తుంటారు. ఇతరుల హితం కోరి సమస్తాన్నీ ప్రసాదించే నిర్వికార ప్రాణి చిరున్వులోనూ వెన్నెలనే చూస్తుంటారు. ప్రజాకవి, ప్రభారవి. పాటల అలవాటు తండ్రి నుంచి వచ్చింది. స్వరమధురిమ తల్లి ద్వారా అబ్బింది. ఆరుగాలం శ్రమించే రైతన్న కంటనీరు ఆయనలో అగ్నిని రేపింది. పల్లె కన్నీరు పెడుతుందో, నా తల్లి బందీ అయిపోతుందో అంటూ నిలువునా చలించిపోయారు. మడుగులు అడుగంటాయని, వాగులూ వంకలూ ఎండి పోయాయని, ఊళ్లన్నీ వన్నెతగ్గి చిన్నవోయాయని తల్లడిల్లారు. కోలాట పాటలు, భజన కీర్తనలు, మద్దెల మోతలు కనుమరుగయ్యాయి, ఏమిటంటూ కన్నీళ్ల పర్యంతమయ్యారు. వృత్తులూ ఉపాధీ పోయినా, మరో మార్గమన్నదే కరవైనాÑ కూలిన బతుకుల్ని నిలబెట్టడానికి కుటీర పరిశ్రమలు ఎందుకు పెట్టరని నిలదీశారు. మానవతా విలువలు కనుమరుగు అవుతున్నాయని క్షోభిస్తూ రాసినవే ‘రేలపూతలు.’ ఆ పాటలూ గ్రామాల చుట్టూ తిరిగాయి. అక్కడివారి చీకటి వెలుగుల్ని ప్రత్యక్షంచేశాయి. అంతేకాదు, బతుకు చిత్రాల్ని ఆవిష్కరించే కలాలపైన విరుచుకుపడొద్దనీ పాలకులకు హితవు పలికారు. పెన్నులమీద మన్ను కప్పితే గన్నులై మొలకెత్తుతాయని చురకంటించారు. ఏది రాసినా అది పట్టి చూపేది గ్రామీణ నాడినే. అందువల్లనే రేలపూతలకు ఉత్తమ గేయసంపుటి పురస్కారమిచ్చి సత్కరించింది తెలుగు విశ్వవిద్యాలయం. అందచందాల ‘అలసెంద్రవంక’కు పుష్కరకాలం క్రితమే స్మారక సాహితీ పురస్కారం లభించింది. సోయగం, రావినీడ, పూసిన పున్నమి.. ఇవన్నీ గోరటివారి కృతిపరంపరలే.
ప్రకృతి, సంస్కృతి ప్రాణావసరాలు
జాతీయ పురస్మృతులు ఆయనకు ఇదివరకూ వచ్చాయి. జీవన సాఫల్య పురస్కారాలూ, కోరి వరించాయి. రచనలు` పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాల విద్యార్థినీ విద్యార్థులకు పాఠ్య పుస్తకాలయ్యాయి. కొన్ని గీతికలు ఇతర భాషలలోకి అనువాదమయ్యాయి. ఆక్స్‌ఫర్డ్ స్థాయి ముద్రణల్లో చోటు సంపాదించాయి. గోరంటి రాసినవాటిపై పలు వర్సిటీల్లో పరిశోధనలు కొనసాగుతున్నాయి. డాక్యు మెంటరీ చిత్ర నిర్మాణాలు, కవితల సమీక్షాపరంపరలు అనేకం. దేశ విదేశాల్లో పర్యటనలు, రంగస్థల ప్రదర్శనలు… ఒకే ఒక్క వాక్యంలో చెప్పాలంటే ` కవితా జైత్రయాత్ర. ఊరిపాటల మొనగాడు, పదును మాటల చెలికాడు, రాస్తూపోవడమే తప్ప, వాటిని పుస్తకాలుగా చూసుకోవాలన్న తాపత్రయమైతే అంతగా లేదు. ఆ కారణంగానే, ఇంకా ప్రచురించాల్సినవి తన దగ్గర మరికొన్ని ఉన్నాయి. అయినా కేంద్ర బహుమతి సంపాదించిన వల్లంకితాళం తదితర దేశీయ భాషల్లోకి అనువాదమవుతుండటం వెంకన్న ఆశావాదాన్ని బలపరుస్తోంది. రచనా ప్రేరణ మొదటి నుంచీ జనమే. ఇంటా బయటా, ఊళ్లో, అవతలా, బంధువులు, మిత్రులు, ఉన్నవాళ్లు, లేనివాళ్లు అందరిలోనూ కవితా వస్తువును చూడగలగటం ఆయన దినచర్య. పచ్చని పొలాలు, చూడచక్కని చెట్లతోనే నేస్తం. గేయాలతోపాటు పద్యాలమీదా అనురక్తి ఎక్కువ. వందలకొద్దీ అప్పచెప్పగలిగే దిట్ట. ప్రస్తుతం ప్రత్యేకించి ఓ పుస్తక రచనా చేస్తున్నారు. పద్య నాటక ప్రదర్శనల గురించీ శ్రద్ధాసక్తులు చూపుతున్నారు. నేటికీ ఎన్నో కొన్ని వేస్తూ వస్తున్నారు. పాటలూ, పద్యాలతోనే సరిపెట్టుకుంటే, ఆయన గోరటి వెంకన్న ఎలా అవుతారు? ఒక వచన కవితా సంకలనం తేవడానికీ తనవంతు ప్రయత్నం చేసుకుంటూనే ఉన్నారు. తన ఆలోచనకు రానిది, తెలియనిదీ నేపథ్యంగా ఎన్నడూ తీసుకోలేదు. తనవైన అనుభవాల రాపిడి నుంచే ఏ పుస్తకమైనా!
మనసుల కదిపే పల్లె గురుతు
సరికొత్త పురస్కార కృతి ‘వల్లంకి తాళం’ రచించి ఇప్పటికీ మూడేళ్లు దాటింది. వెంకటయ్య (అసలు పేరు) రాయడం మొదలు పెట్టి నలభై ఏళ్లు దాటిపోయింది. పాటలు ఎంత బాగా రాస్తారో అంత వీనుల విందుగా పాడుతారు. రాయడంలో ఎంత విలక్షణత్వం ఉంటుందో, తాను రాసినవి పాడటంలోనూ అంతే ప్రత్యేకత. ‘పాట కథే నా కథ’ అనేది ఆయన పలు పుస్తకాల్లో ఒకటి. తన జీవితానికి కచ్ఛితంగా సరిపోతుందది. పల్లె పాటకు పట్టం కట్టడమంటే ఏమిటో ఆయనను చూసే ` ఇంకెవరైనా తెలుసుకోవాలి. పేదల వెతలు చూపుతూ ‘గల్లీ సిన్నది, గరీబోళ్ల కథ పెద్దది’ అన్నారు. వాళ్లు ఉన్న ఇల్లు కిళ్లీ కొట్టుకన్నా చిన్నదని బాధపడ్డారు. గ్రామ సీమల్లోని సంతలను వర్ణిస్తూ ‘మా ఊరి సంతÑ వారానికి ఒకసారి జోరుగా సాగేమంతా’ అంటూ ఉర్రూతలూగించారు. ‘పూసిన పున్నమి వెన్నెల మేన తెలంగాణ వీణÑ వాసిగ చరితల వెలుగొందిన గత వైభవాల కోన’ అని అభివర్ణించారు. పదగతుల వాణి, స్వరజతుల వేణి; ఉప్పొంగి మురిసే ఉల్లముల బాణిగా కీర్తికేతనమెత్తారు. వడి వడి కలబడి కుడి ఎడమలబడి; గడీల పొగరును దించిన దళములు / వాడిగ వడిసెల విసిరిన కరములుÑ పడి పడి పరుగులు పెట్టిన జలములు.. గా కళ్లకు కట్టించారాయన. పారే వాగులు, పచ్చని కొండలు, పరిమళమైన పూలగాలులు, కుంకుమకన్నా మెత్తని దుక్కులు, కూరలు కాయలు కుప్పల రాశులు, గొలుసుకట్టు జలధార నెలవులు, పుప్పొడి మించిన ఇసుక రేణువులు, చెరుకు వెన్నులు, పాలజున్నులు, గల గల గల గల పైరుల మిలమిల, పగలే నీడలు పరచిన చందము, మదిలో మెదిలే వదలని తావుల, మనసుల కదిపే పల్లె గురుతులా… అంటూనే ప్రాంతీయతా వైభవ ప్రాభవాన్ని సాక్షాత్కరింప జేశారాయన. ఇవన్నీ ఈ అన్నీ ఆ ప్రజల మనిషి ప్రబలశక్తిని నిరూపితం చేసే అక్షర సాక్ష్యాలు. కలమా అది ` లక్ష్యాన్ని ఛేదించే సాధనం, ఆయుధం కాదా మరి?
ఆసాంతం అక్షర క్రతువు
పారే ఏరు అలలమీద పండు వెన్నెల రాలడం చూశారా? ఊరే ఊట చెలమలోన తేట నీరు ఒలకడం గమనించారా? వెండి మెరుపుల నవ్వు ఎలా ఉంటుందో ఎప్పుడైనా విన్నారా? వీటన్నింటినీ చూడటం, వినడం, ఆస్వాదించడం, ఆనందించడం గోరటి వెంకన్నకు తెలిసినంతగా ఇంకెవ్వరికీ తెలియదు. ఇంటికొక గాథరా, విచారిస్తే బాధరా అనడం, అనుకోవడం తనకొక్కరికే తెలుసు. ఏ పుస్తకం రాయాలన్నా ఒక పవిత్ర క్రతువులా భావిస్తారు. తాను వల్లంకి తాళం రాయడానికి ఏళ్ల తరబడి శ్రమించారు. అటవీ ప్రాంతాల్లో విస్తృతంగా తిరిగి చెట్లతో మాట్లాడారు, పిట్టలతో కలిసిపాడారు. ఆయనకి మాత్రం తెలియదా? నేల అంతా తడిస్తేనే మొక్క ప్రాణం పోసుకుంటుందని! ఆయనకి మటుకు అనుభవం కాదా? ఎంతగానో పరిశ్రమిస్తే తప్ప, రచనకు ఓ పుస్తకరూపం రాదని! ఇప్పపూలబట్టీ, అడవి సిరుల ఉట్టి వంటి పద ప్రయోగాలు ఆ కలానికే సొంతం. పాట, మాట, పదం, పద్యం అన్నీ తానే అయిన సాంస్కృతిక శిఖర సమానుడు గోరటి. రూపు ధరించిన జనగీతిక, కవితా స్ఫూర్తికి అసలైన ప్రతీక.