– ఎం.వి.ఆర్‌. శాస్త్రి

 సుభాస్‌ చంద్ర బోస్‌ ఏమయ్యాడు అన్నది ఇండియన్‌ హిస్టరీలో ఇప్పటికీ పెద్ద మిస్టరీ !

షెర్లాక్‌ హోమ్స్‌ను తలదన్నిన డిటెక్టివ్‌ ప్రజ్ఞతో ఎందరో మహానుభావులు ఎన్నో పుస్తకాలు రాశారు. బోలెడు సినిమాలూ, లెక్కలేనన్ని వీడియోలూ తీశారు. మహా మేధావులు బలమైన వాదనలు, సిద్ధాంతాలు, చిత్రవిచిత్ర కల్పనలు విసుగు విరామం లేకుండా ఆవిష్కరించారు. 1945 ఆగస్టు 18 తరవాత ఏమైందన్న దానిలో ఎవరి ఊహ వారిది. కాని ఆ తేదీన నేతాజీ మరణించలేదు అన్నంతవరకూ అందరిదీ ఒకటే మాట. విమాన ప్రమాదం మిథ్య. అందులో బోస్‌ మరణం మిథ్య అనటానికి ఎవరైనా చూపెట్టే కారణాలు ముఖ్యంగా ఇవి:

ప్రమాదం జరిగినట్టు రుజువు లేదు. నోటిమాటే తప్ప ఫోటోల సాక్ష్యం లేదు. డాక్యుమెంటరీ ఆధారాలు లేవు. ఏరోడ్రోమ్‌లో లాగ్‌ రికార్డ్‌ లేదు. మృతదేహం దాఖలా లేదు. బోస్‌ మరణించినట్టు డెత్‌ సర్టిఫికేట్‌ లేదు. దహనం చేసినట్టు క్రెమేషన్‌ సర్టిఫికేట్‌ లేదు. మునిసిపల్‌ ఆఫీసులో మరణం నమోదు కాలేదు. ఒక ఇచిరో ఒకురా చనిపోయినట్టూ, దహనం కాబడినట్టూ ధ్రువపత్రాలను చూపించి అతడే సుభాస్‌ చంద్ర బోస్‌ అనుకోమన్నారు. జపాన్‌లో మరణించాడని ఒకరంటే కాదు తైహోకు ఆసుపత్రిలోనని ఇంకొకరంటారు. మృతదేహాన్ని టోక్యో తీసుకువెళ్లారని ఒకసారి చెపుతారు. కాదు తైహోకు లోనే దహనం అయిందని ఇంకోమారు అంటారు. ప్రత్యక్ష సాక్షిగా చెప్పబడే హబిబుర్‌ రహమానే శవదహనం జరిగింది ఆగస్టు 20న అని ఒకరికీ, 22న అని ఇంకొకరికీ చెప్పాడు. రెట్టించి అడిగితే మాట దాటేశాడు. నేతాజీకి వేసిన ఒట్టుకు కట్టుబడి నిజం దాస్తున్నాడన్న అభిప్రాయం అందరికీ కలిగించాడు.

తాము ఆశ్రయమిచ్చి, ఆధికారికంగా గుర్తించిన ఆజాద్‌ హింద్‌ ప్రభుత్వ అధినేత, ప్రపంచ స్థాయి స్టేట్స్‌మన్‌ అయిన సుభాస్‌ చంద్ర బోస్‌ 1945 ఆగస్టు 18న మరణిస్తే జపాన్‌ ప్రభుత్వం నుంచి గానీ, మిలిటరీ హెడ్‌ క్వార్టర్స్‌ నుంచి గానీ ఒక్క అధికారిక ప్రకటన కూడా లేదు. ఆఖరికి తైవాన్‌ (ఫార్మోసా) స్థానిక ప్రభుత్వంకూడా ఎలాంటి ప్రకటన చేయలేదు. మరణించిన ఐదు రోజుల తరవాత 23న గానీ మరణ సమాచారాన్ని బయటపెట్టలేదు. అదికూడా జపాన్‌ న్యూస్‌ ఏజెన్సీ అందించిన వార్తగా!

 నేతాజీ ఐఎన్‌ఎ సేనల సరెండర్‌ విషయం మాట్లాడటానికి టోక్యో వెళుతుండగా విమాన ప్రమాదం జరిగిందని ఆయన వెంట ఉన్న హబిబుర్‌ రహమాన్‌ అన్నాడు. అదే మాట జపాన్‌ సైన్యాధి కారులూ చెప్పారు. వారన్నట్టు అది మామూలు పర్యటనే అయితే నేతాజీకి వీడ్కోలు ఇవ్వటానికి ఆయన మంత్రులు అంతమంది కట్టకట్టుకుని సింగపూర్‌ నుంచి సైగాన్‌ దాకా ఆయన వెంట విమానాల్లో ఎందుకు వెళ్ళారు? సైగాన్‌లో ఆయనను విమానం ఎక్కించటానికి జపాన్‌ మిలిటరీ జనరల్‌ ఒకరు, ఆజాద్‌ హింద్‌ ప్రభుత్వానికి కేటాయించబడ్డ జపాన్‌ రాయబారి బాంగ్‌ కాక్‌ నుంచి ప్రత్యేక విమానంలో ఎందుకు వెళ్ళారు? టోక్యోలో మంతనాలయ్యాక వెనక్కి తిరిగివచ్చే ఉద్దేశం నేతాజీకి ఉన్నట్టయితే తూర్పు ఆసియా భారతీయులు సమర్పించిన బంగారం, ఆభరణాల నిధిని తన వెంట ఎందుకు తీసుకు పోయాడు? సింగపూర్‌లో బయలుదేరే ముందు అదే చివరి చూపు అయినట్టు ఐఎన్‌ఎ ఆఫీసర్లకు, సైనికులకు బహుమానాలు ఇచ్చి, కళ్ళనీళ్ళతో వీడ్కోలు సందేశాలు ఎందుకు ఇచ్చాడు?

I am writing to you on the eve of a long journey by air and who knows an accident may not overtake me.’ (దూర ప్రయాణానికి విమానంలో వెళ్ళబోతూ నీకు ఇది రాస్తున్నాను. మధ్యలో ఏ ప్రమాదం ఎదురవుతుందో ఎవరికెరుక?)- అని ఆగస్టు 17న సైగాన్‌ లో బయలుదేరబోయే ముందు తన కేబినెట్‌ సహచరుడు జాన్‌ థివీకి పంపిన సందేశంలో నేతాజీ అన్నాడు. దీన్నిబట్టి జరగబోయే ప్రమాదం ఆయనకు ముందే తెలుసన్న అభిప్రాయం కలగదా? ప్రమాదానికి లోనయినట్టు లోకాన్ని నమ్మించి ఎక్కడికో రహస్యంగా తప్పించుకు పోవాలని ఆయన ముందే పథకం వేశాడని అనిపించటం లేదా? బోస్‌ గమ్యం టోక్యో అయినట్టయితే మంచురియాలో దిగిపోయే రష్యన్‌ వ్యవహారాల నిపుణుడు లెఫ్టినెంట్‌ జనరల్‌ షిదేయికి ఆయనను జతచేసి ఎందుకు పంపారు? నేతాజీ అసలు వెళ్ళదలచినది రష్యాకనీ, విమాన ప్రమాదం నాటకం ఆడి గుట్టు చప్పుడు కాకుండా జపాన్‌ వారు ఆయన మంచురియా గుండా రష్యా చేరేందుకు సాయపడ్డారనీ అమాయకులు సైతం పోల్చుకోలేరా? జపాన్‌ చేతులెత్తేసిన తరవాత తన పోరాటం కొనసాగించ టానికి రష్యాయే శరణ్యమన్న నిర్ణయానికి బోస్‌ ఎప్పుడో వచ్చాడు. టోక్యో వెళ్ళినప్పుడూ అక్కడి రష్యన్‌ రాయబారి ద్వారా మాస్కోకు సందేశం పంపాడు. సోకాల్డ్‌ ప్రమాదం తరవాత కూడా కొందరికి రష్యాలో, కొందరికి సైబీరియా చెరలో, కొందరికి చైనాలో, కొందరికి సైగాన్‌లో, కొందరికి ఇండియాలోనే చాలా ఏళ్ళు బాబా వేషంలో కనిపించాడు.

వీటిని బట్టి తేలేదేమిటి? 1945 ఆగస్టు 18నప్రమాదంలో బోస్‌ మరణం అబద్ధం! ఆయన, జపాన్‌ వారు కలిసే శత్రువుల కళ్ళు కప్పటానికి జరగని ప్రమాదాన్ని కల్పించారు.

బోస్‌ మిస్టరీ గురించి అటుతిప్పి ఇటుతిప్పి ఎవరు ఎంతమాట్లాడినా సారం మాత్రం ఇప్పటిదాకా మనం చెప్పుకున్నదే. వినటానికి ఇంపుగానే ఉంటుంది. కాని ఈ చిలవలపలవల కథనాల్లో ఏదీ తర్కపరీక్షకు నిలవదు.

కిందటి అధ్యాయాలలో వివరించిన ఘటనా క్రమాన్ని జాగ్రత్తగా గమనించిన వారెవరికీ బోస్‌ మరణం మీద అనుమానం కలగదు. తెలిసీ తెలియని మేధావులు, పసలేని రచయితలు, పనికిమాలిన పత్తేదారులు భూతద్దంలో చూపెట్టే అసంబద్ధాలు, వైరుధ్యాలు సంగతి సందర్భాలు ఎరిగినవారికి ఆశ్చర్యం కలిగించవు. మన మిస్టరీ మాస్టర్లు అరిగిపోయిన గ్రామఫోన్‌ రికార్డులా వినిపించే ప్రతి వాదనకూ లాజికల్‌గా సమాధానం చెప్పవచ్చు. అసలు విషయం వడ్లగింజలో బియ్యపు గింజ. ఆ సంగతి తేట పడాలంటే ముఖ్యంగా కొన్ని వాస్తవాలు గమనించాలి.

సుభాస్‌ చంద్ర బోస్‌ బ్రిటిషు మహా సామ్రాజ్యానికి సింహస్వప్నం. పక్కలో బల్లెం. తనను వరించి వచ్చిన ఐసిఎస్‌ కొలువును ఎడమకాలితో తన్ని తమ జాతి మదం మీద దెబ్బ కొట్టినప్పుడే అతడు ఇండియా లోకెల్లా ‘అత్యంత ప్రమాదకరమైన వ్యక్తులలో’ ఒకడు అని బ్రిటిషువాళ్లు గ్రహించారు. స్వాతంత్య్ర పోరాటంలో అడుగు పెట్టిన నాటి నుంచి బోస్‌ కదలికలను అనుక్షణం కనిపెట్టి, శాయశక్తులా సతాయించారు. అతడిని ఎలా అణచివేయాలన్న విషయాన్ని 1924 జనవరిలోనే బ్రిటిష్‌ కేబినెట్‌ చర్చించింది. తప్పుడు కేసులు పెట్టి 27 ఏళ్ల వయసులోనే అతడిని మాండలే జైలు నరకంలో పడేసి యమయాతనలు పెట్టింది. ఆ తరవాతా మాటిమాటికీ జైళ్లలో వేసి అతడి ఆరోగ్యాన్ని చేతులారా చెడగొట్టింది. వైద్యచికిత్స నెపంతో దేశం నుంచి గెంటేసింది . మూడేళ్ళు యూరప్‌ ప్రవాసంలో ఉన్నప్పుడూ బ్రిటిష్‌ గూఢచారులు బోస్‌ను నీడలా వెంటాడారు. ఒక సమయంలో అతడిని బ్రిటన్‌లో అడుగు కూడా పెట్టనివ్వలేదు. కాంగ్రెస్‌ లోని మిగతా జాతీయ నాయకులను పూలచెండ్లతో కొట్టిన తెల్లదొరతనం సుభాస్‌ చంద్ర బోస్‌కు మాత్రం ఎప్పుడూ కొరడాలతోనే స్పెషల్‌ ట్రీట్మెంట్‌ ఇచ్చింది. ఇట్టే మింగేయ్యలని తెల్లవారు 1940లో అతడితో ‘పిల్లి-ఎలుక ఆట’ మొదలెడితే, వారి నెత్తిన జెల్లకొట్టి అతడు డేర్‌ డెవిల్‌ లా ‘గ్రేట్‌ ఎస్కేప్‌’ అయ్యాడు.

బ్రిటిషు పాలకులు ఎన్ని ఎత్తులు వేసినా ప్రతిసారీ సుభాస్‌ చంద్ర బోస్‌ చేతుల్లో ఓడిపోతూనే వచ్చారు. ఎంత ఒడిసి పట్టామనుకున్నా ఒంటికి ఆముదం రాసుకున్నట్టు ప్రతిమారూ అతడు తప్పించుకుంటూనే ఉన్నాడు. అతడు కనిపిస్తే కాల్చేయ్యమని ఉత్తర్వులు ఇచ్చారు. అతడిని వెతికి చంపటానికి మనుషులను పెట్టారు. అతడి రహస్య సందేశాలు పొంచి విన్నారు. అతడి మనుషులను లోబరచుకున్నారు. గాలించటా నికి యుద్ధవిమానాలు పంపారు. బాంబులేసి మట్టుపెట్టమని యుద్దనౌకలను పురమాయించారు. అయినా సముద్రాలను దాటి, ఖండాలు దాటి అతడు తూర్పు ఆసియాలో నేరుగా వారి పెరట్లోకే చొరబడ్డాడు. వారినే ఎలుకను చేసి, తానే గండుపిల్లిగా మారాడు. వారి సైన్యాన్ని వారి మీదికే ప్రయోగించి, సామాన్య పౌరులను, సగటు మహిళలను సైనికులుగా మలచి, వారు చెరబట్టిన హిందూదేశం మీదికి దండెత్తి వచ్చాడు. ప్రపంచ మహాయుద్ధంలో గెలిచామన్న సంతోషం లేకుండా, తమ సామ్రాజ్యపు గుండెకాయనే ఎక్కడ పెకలిస్తాడోనని హడలిచచ్చే దురవస్థ తెచ్చిపెట్టాడు. హిట్లర్‌ ఆత్మహత్య చేసుకుంటే నేమి, ముస్సోలినీని జనం వెంటపడి చంపేస్తేనేమి బ్రిటిషు సామ్రాజ్యానికి వారిని మించిన పీడ సుభాస్‌ చంద్ర బోస్‌.

 ఇంఫాల్‌ యుద్ధంలో పరాజయం తరవాత కూడా సుభాస్‌ బోస్‌ చేవ తగ్గలేదు. మాతృభూమి విముక్తికి పట్టిన పంతం మానలేదు. ప్రపంచం అసహ్యించుకున్న అక్షరాక్షస కూటమితో చేయి కలిపినప్పటికీ, ప్రజలలో అతడి ప్రతిష్ఠ మసకబార లేదు. అతడు పిలుపిస్తే కదలటానికి, తెల్లవాళ్ళ పుటం ఆర్పటానికి భారతప్రజలు కాచుకుని ఉన్నారు. తమ కొంప ఏ రీతిన ఎలా ముంచుతాడోనన్న ఆరాటంతో అతడి ప్రతి కదలికనూ బ్రిటిషు పాలకులు వెయ్యికళ్ళతో గమనిస్తున్నారు.

మరి అలాంటి అదనులో తైపేలో విమానం కూలి బోస్‌ మరణించాడు, అక్కడికక్కడే దహనం కూడా కాబడ్డాడు అని ఐదు రోజులు ఆలస్యంగా జపాన్‌ రేడియో ప్రకటిస్తే అది నిజం కాదు, జపాన్‌ వాళ్ళే మాయచేసి అతడిని ఎక్కడికో రహస్యంగా చేరవేశారు – అని ఇప్పుడు మనకు వచ్చిన డౌట్లు ఆ కాలంలోనే బోస్‌ పగవాళ్లకు వచ్చి ఉండవా? మన కాలపు మేధావులకున్నపాటి తెలివితేటలు నాటికి ప్రపంచంలోకెల్లా శక్తిమంతమైన బ్రిటిషు మహా సామ్రాజ్యానికి లేవనుకోవాలా? తమకు అత్యంత ప్రమాదకరమైన ఆ ప్రబల శత్రువు జాడ తీసి, వెంటాడి వేటాడటానికి ఆ సామ్రాజ్యం సర్వశక్తులూ ఒడ్డకుండా ఉంటుందా?

బోస్‌ మరణవార్త తెలిసిన వెంటనే అందులో ఏదో మోసం ఉన్నదనీ, ఎక్కడికో తప్పించుకు పోవటానికే అతడు ప్రమాదం నాటకం ఆడి ఉంటాడనీ బ్రిటిష్‌ ఇండియా సర్వాధికారి అయిన వైస్రాయ్‌ వేవెల్‌ తన డైరీలో రాసుకున్నాడు. దానిమీద లోతుగా కూపీ తీయమని వెంటనే ఆనతిచ్చాడు. సుభాస్‌ చంద్ర బోస్‌ మరణ సమాచారం పై దర్యాప్తుకు ఆదేశించినట్టు వైస్రాయ్‌ వేవెల్‌ 1945 ఆగస్టు 27న తన మంత్రిమండలికి తెలిపాడు. తైపేలో విమాన ప్రమాదం జరిగి నాటికి తొమ్మిదవ రోజు.

సుభాస్‌ బోస్‌ మిలిటరీ చాలెంజ్‌ని జయప్రదంగా వమ్ము చేసిన ఆగ్నేయాసియా సుప్రీం కమాండర్‌ లార్డ్‌ మౌంట్‌ బాటెన్‌ ఇక బోస్‌ను పట్టుకోవటమే తరువాయి అని ఉత్సాహపడుతుండగా జపాన్‌ రేడియో బోస్‌ మరణ వార్తను వినిపించింది. దీన్ని నమ్మకూడదు, అసలు ఏమైందో జపాన్‌ ప్రభుత్వాన్ని విచారించి వాస్తవ సమాచారం రాబట్టవలసిందిగా మౌంట్‌ బాటెన్‌ వైస్రాయ్‌ చెప్పకముందే అమెరికన్‌ జనరల్‌ డగ్లాస్‌ మెక్‌ ఆర్థర్‌ను కోరాడు. మెక్‌ ఆర్థర్‌ ఆగస్టు 30న తమ అధీనంలోని టోక్యోను అడిగాడు. సెప్టెంబర్‌ 15న జపాన్‌ ప్రభుత్వం మెక్‌ ఆర్థర్‌కు ఇంటరిమ్‌ రిపోర్టు పంపింది. 1945 ఆగస్టు 18న మధ్యాహ్నం 2 గంటలకు తైహోకులో టేకాఫ్‌ అయిన 97-2 మోడల్‌ జపనీస్‌ బాంబర్‌ విమానం పైకి లేచీ లేవగానే ఎడమవైపు ఇంజన్‌ ప్రొపెల్లర్‌ ఊడి పడటంతో, అటూ ఇటూ ఊగి కిందకు కూలిందనీ, మంటలలో కాలి తీవ్రంగా గాయపడ్డ చంద్ర బోస్‌ ను మధ్యాహ్నం 3 గంటలకు అక్కడి మిలిటరీ హాస్పిటల్‌లో చేర్చగా అదేరోజు రాత్రి 9 గంటలకు మరణించాడని ఆ నివేదిక ధృవీకరించింది.

 దాన్ని బ్రిటిషు సర్కారు నమ్మలేదు. సెప్టెంబర్‌ 15న టోక్యో నుంచి ఇంటరిమ్‌ రిపోర్టు వెలువడిన ఆరు రోజులకు వైస్రాయ్‌ వేవెల్‌ తన దినచర్య జర్నల్‌లో దానిపై చేసిన వ్యాఖ్య ఇది:

“According to the Japs, S.C. Bose definitely is dead, but I shall be sceptical till further confirmation.”
[Wavell: The Viceroy’s Journal . Ed. Penderel Moon, p. 174 ]

(ఎస్‌.సి. బోస్‌ ఖాయంగా మరణించాడని జపాన్‌ వాళ్లు చెపుతున్నారు. కాని తదుపరి ధృవీకరణ అయేంతవరకు నాకు అనుమానమే.)

తదుపరి ధృవీకరణ పని బ్రిటిష్‌ రాజ్‌లో అతి ప్రధాన గూఢచారి వ్యవస్థ అయిన ఇంటలిజెన్స్‌ బ్యూరోకు అప్పగించారు. బోస్‌ ఏమయ్యాడో విచారించి, బతికి ఉంటే ఆచూకీ కనిపెట్టి అరెస్టు చెయ్యమని ఆదేశించి 1945 సెప్టెంబరులో ఫిలిప్‌ ఫిన్నీ నాయకత్వంలో నలుగురు పోలీస్‌ ఆఫీసర్ల బృందాన్ని ఇంటలిజెన్స్‌ బ్యూరో డైరెక్టర్‌ సర్‌ నార్మన్‌ స్నిత్‌ ఆగ్నేయాసియా పంపించాడు. ఆ ఫిన్నీ లోగడ కోలకతాలో పోలీసు సూపర్నెంటుగా ఉండగా బోస్‌ మీద నిరంతరం నిఘా పెట్టినవాడు. బోస్‌ మరణించ లేదు, రష్యా ఆక్రమిత ప్రాంతానికి తప్పించుకు పోయాడు అని బాంగ్‌కాక్‌లో అందరూ అనుకుంటు న్నారు అని అతడు 1945 అక్టోబరులో తోలి నివేదికలో అన్నాడు. సాక్ష్యాధారాలను నింపాదిగా విచారించిన మీదట దర్యాప్తు బృందం అభిప్రాయం మారింది.

“The conclusion of the Police officers was that Bose has died as a result of air crash and they reported to the Government of India accordingly… The report was definite that Netaji was dead and thereafter the Government of India withdrew the warrant of arrest against Bose”

[Brothers Against The Raj, Leonard A Gordon, p. 545 ]

(విమానం కూలి బోస్‌ మరణించాడని పోలీసు ఆఫీసర్లు నిర్ధారించి ఆ విషయం భారత ప్రభుత్వానికి నివేదించారు. నేతాజీ మరణం కచ్చితంగా ద్రువ పడటంతో అతడి మీద జారీచేసిన అరెస్టు వారంటును భారత ప్రభుత్వం రద్దు చేసింది.)

నిజానికి బ్రిటిషు సర్కారు కేవలం ఒక పోలీసు బృందం దర్యాప్తుతోనే సంతృప్తి చెందలేదు. అనేక లేయర్లలో వివిధ ఏజెన్సీల ద్వారా ఇంకా అనేక దర్యాప్తులను సమాంతరంగా జరిపించింది. టోక్యో లోని బ్రిటిష్‌ రాయబార కార్యాలయంలో మిలిటరీ సలహాదారుగా ఉంటూ అమెరికన్‌ కౌంటర్‌ ఇంటలిజెన్స్‌ కోర్‌ (CIC)లో డిప్యుటేషన్‌ మీద ఉన్న లెఫ్టినెంట్‌ కల్నల్‌ జాన్‌ ఫిగ్గేస్‌ను బోస్‌ ఏమయ్యాడో ఎంక్వైరీ చేయమని ఆగ్నేయాసియా కమాండ్‌ (SEAC)) పురమాయించింది. ఒక వైపు అతడు ఆ పనిలో ఉండగానే సయాంలోని అలైడ్‌ లాండ్‌ ఫోర్సెస్‌ (ALFS)కు చెందిన ఇంటలిజెన్స్‌ అసాల్ట్‌ యూనిట్‌ (IAU) ఆగ్నేయాసియా లోని ఐఎన్‌ఏ, జపాన్‌ ఆర్మీల కార్యాలయాలమీద పడి బోస్‌ కదలికలకు సంబంధించిన రికార్డులన్నీ తనిఖీ చేసింది. ఆ సందర్భంలో బాంగ్‌కాక్‌లో ఒక ఫైలు బయటపడిరది. అందులో 1945 ఆగస్టు 18 మధ్యాహ్నం 2 గంటలకు తైహోకులో విమానం కూలి ‘T’ ( సుభాస్‌ బోస్‌) అదే అర్ధరాత్రి స్థానిక ఆస్పత్రిలో మరణించాడంటూ సైగాన్‌ లోని జపనీస్‌ సదరన్‌ కమాండ్‌ అధిపతి జనరల్‌ తెరౌచీ హికారీ కికాన్‌ చీఫ్‌ జనరల్‌ ఐసోడాకు ఆగస్టు 20న పంపిన టెలిగ్రాం దొరికింది. అది చూడగానే నిజమే కాబోలని బ్రిటిషు పత్తేదారులు నమ్మలేదు. సైగాన్‌, బాంగ్‌కాక్‌ లోని మిలిటరీ ఆఫీసుల్లో రికార్డులన్నిటినీ ధ్వంసం చేసిన జపాన్‌వారు ఈ ఫైలును మాత్రం ఎందుకు వదిలివెళ్లారు? మనల్ని తప్పుదారి పట్టించటానికా- అని చాలా అనుమానించారు. సంబంధిత వ్యక్తులతో మాట్లాడి, తెలిసిన సమాచారాన్ని జాగ్రత్తగా సరిచూసిన మీదట అన్ని దర్యాప్తులలోనూ విమాన ప్రమాదం, అందులో బోస్‌ మరణం నిజమని ధృవపడిరది. ప్రధాన దర్యాప్తుదారు అయిన లెఫ్టినెంట్‌ జనరల్‌ ఫిగ్గేస్‌ 1946 జూలై 25న ప్రభుత్వానికి పంపిన నివేదికలోఏమన్నాడో చూడండి:

»»As a result of a series of interrogations of individuals in the following paragraphs, it is confirmed as certain that S.C.Bose died in Taihoku Military Hospital sometime between 1700 and 1800 hrs local time on 18 August 1945. The cause of death was heart failure resulting from multiple burns and shock. All the persons named below were interrogated at different times but the several accounts of the event agree both in substance and detail at all points where the knowledge of the subjects could have been deemed to be based on common experience.The possibility of a pre arranged fabrication must be excluded since most of the individuals had no opportunity to contact one another prior to interrogation.µµ

[Quoted in TheLost Hero, Mihir Bose, p.492]

(ఈ కింది పేరాల్లో పొందుపరిచిన వ్యక్తుల ఇంటరాగేషన్లను బట్టి 1945 ఆగస్టు 18 రాత్రి 7-8 గంటల మద్య తిహోకు మిలిటరీ హాస్పిటల్‌లో ఎస్‌.సి. బోస్‌ మరణం యధార్థమని ధృవపడిరది. ఒంటిమీద చాలాచోట్ల కాలిన గాయాలు, షాక్‌ మూలంగా గుండె ఆగటం వల్ల మరణం సంభవించింది. కింద పేర్కొన్న వ్యక్తులను వేరువేరు సమయాల్లో ఇంటరాగేట్‌ చేశాము. అయినా జరిగిన ఘటన ముఖ్య అంశాల సారాంశంగాని, వివరాలు గాని అందరూ ఒకే విధంగా చెప్పారు. అందరు చూసిందీ ఒకే దృశ్యం అయితే తప్ప అలా జరగదు. కూడబలుక్కుని అలా కల్పించి చెప్పటం సాధ్యం కాదు. ఎందుకంటే ఇంటరాగేషన్‌ కంటే ముందు ఆ వ్యక్తులు ఒకరినొకరు కాంటాక్ట్‌ చేసుకునే అవకాశం లేదు.)

ప్రమాదం నుంచి బయటపడిన సైన్యాధి కారులను, చికిత్స చేసిన డాక్టర్లను, ఆ సమయాన అక్కడ ఉన్నవారిని విడివిడిగా వేరువేరు సమయాల్లో ప్రశ్నించినా అందరు చెప్పిన విషయాలు ఒకదానితో ఒకటి టాలీ అయ్యాయి. ఇతర రుజువులూ సాక్ష్యాలు సరిపోయాయి. ఆ సంగతి ఒకటికి పదిసార్లు క్రాస్‌ చెక్‌ చేసి నిర్ధారించుకున్నాకే బ్రిటిష్‌ ప్రభుత్వం తమ బద్ధ శత్రువు సుభాస్‌ చంద్ర బోస్‌ ముమ్మాటికీ మరణించాడని నమ్మి అతడి మీద అరెస్ట్‌ వారంట్‌ను ఎత్తివేసింది.

 దుర్ఘటన జరిగిన సంవత్సరం తరవాత అనుకోకుండా ఒక స్వతంత్ర విచారణ జరిగింది. ముంబాయిలో ప్రసిద్ధ ఆంగ్ల దినపత్రిక ‘ఫ్రీ ప్రెస్‌ జర్నల్‌’లో పని చేసే జర్నలిస్టు హరీన్‌ షా ఏదో అంతర్జాతీయ ఈవెంటును కవర్‌ చేయటానికి 1946 సెప్టెంబరులో తైపేకు (జపాన్‌ ఏలుబడిలో ఉన్న కాలంలో దాని పేరు తైహోకు) ప్రెస్‌ పార్టీలో వెళ్ళాడు. అతడు సుభాస్‌ చంద్ర బోస్‌ను సన్నిహితంగా ఎరిగినవాడు. తాను అభిమానించే సుభాస్‌ విషాదాంతం గురించి పత్రికల్లో వచ్చిన పరస్పర విరుద్ధ వార్తలకు, రకరకాల కథనాలకు కలత చెంది వాస్తవమేమిటో తెలుసుకోవాలని అతడు తలచాడు. అందివచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకుని తైపేలో స్వతంత్రంగా పరిశోధన చేశాడు. అతడికి తైపే గవర్నర్‌ ఆఫీసులో హిందీ బాగా మాట్లాడే చుంగ్‌ అనేవాడు మిత్రుడయ్యాడు. అతడు షా కు ముఖ్యమైన వ్యక్తులను పరిచయం చేశాడు. వారి ద్వారా షా ఆ దీవిలో ప్రధాన దినపత్రిక అయిన Taiwan Nichi Nichi Shimbun పాత పత్రికలను తిరగేశాడు. విమాన ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ చంద్ర బోస్‌ తైహోకు ఆస్పత్రిలో మరణించిన వైనాన్ని 1945 ఆగస్టు 22 న స్థానిక జపనీస్‌ గారిసన్‌ కమాండర్‌ ఒక ప్రెస్‌ నోట్‌లో తెలిపినట్టుగా 23వ తేదీ సంచికలో ఆ పత్రిక ప్రచురించిన సంగతి అతడికి తెలిసింది. తైవాన్‌ పత్రికలలో దుర్ఘటన వార్త రిపోర్ట్‌ కాలేదన్న ప్రచారం తప్పు అని తేలింది. చుంగ్‌ ద్వారా పరిచయ మైన స్థానిక పోలీసు సూపర్నెంటు మిలిటరీ హాస్పిటల్‌కు హరీన్‌ షా ను వెంట పెట్టుకుని వెళ్లి బోస్‌కు చికిత్స చేసిన మెడికల్‌ బృందం లోని ‘చు చౌ త్సు’ అనే చైనీస్‌ నర్సుతో మాట్లాడిరచాడు. ఆ సంభాషణ ఇలా నడిచింది :

షా: చంద్ర బోస్‌ను మీరు చూశారా? అతడి పరిస్థితి ఎలా ఉంది?

నర్సు: మరణించడానికి ముందు మెడికల్‌ వార్డులో చంద్ర బోస్‌ను చాలా సార్లు చూశాను. అప్పుడు నేను సర్జికల్‌ నర్సుగా డ్యూటీలో ఉన్నాను. ఎయిర్‌ క్రాష్‌లో ఒళ్ళు కాలి చంద్ర బోస్‌కు తీవ్ర గాయాలయ్యాయి. హాస్పిటల్‌కు తీసుకురాగానే అతడి ఒళ్ళంతా గాయాలకు ఆలివ్‌ ఆయిల్‌ రాయమని డాక్టర్‌ యోషిమి చెపితే నేనే రాశాను. ఇదే మెడికల్‌ వార్డులో అదుగో ఆ బెడ్‌ మీదే అతడున్నాడు. (అని ఆ బెడ్‌ దగ్గరికి తీసుకువెళ్ళి చూపించింది)

షా: మరణశయ్య మీద చంద్ర బోస్‌ మీతో మాట్లాడాడా?

నర్సు: ఏమంత లేదు. అతడు స్పృహలో ఉన్న సమయం చాలా తక్కువ. అప్పుడప్పుడూ సైగ చేస్తే మంచినీళ్ళు ఇచ్చాను.

షా: అయితే చంద్ర బోస్‌ మరణం మీకు కచ్చితంగా తెలుసా?

నర్సు: తెలుసు. మరణించాక ఏమైందో తెలియదు. అంతా రహస్యంగా జరిపించారు. చంద్ర బోస్‌కు మిలిటరీ గౌరవ లాంఛనాలు పూర్తిగా సమర్పించాలని హాస్పిటల్‌ ఇన్‌ చార్జి డాక్టర్‌ యోషిమి తన కిందివారికి చెప్పటం నేను విన్నాను.

[Quoted in Laid To Rest, Ashis Ray, pp. 144-146]

పోలీసు అధికారుల సహాయంతో హరీన్‌ షా తైపే లోని మెట్రోపాలిటన్‌ మునిసిపల్‌ బ్యూరో ఆఫ్‌ హెల్త్‌ అండ్‌ హైజీన్‌ కార్యాలయానికి వెళ్లి 1945 ఆగస్టు 21న బోస్‌ శవ దహనానికి పర్మిట్‌ కోసం జపనీస్‌ అధికారులు వెళ్ళిన సమయాన డ్యూటీ లో ఉన్న ‘లీ చిన్‌ క్వి’, ‘తాన్‌ చి చి’ అనే క్లర్కులతో మాట్లాడాడు.

షా: ఆ మృతదేహం చంద్రబోస్‌దని మీకు ఎలా తెలుసు?

క్లర్కులు: ఆ దేహం విశిష్ట భారతీయ నాయకుడు చంద్ర బోస్‌దని దాని వెంట వచ్చిన మిలిటరీ ఆఫీసర్లు మా జపనీస్‌ డైరెక్టర్‌కి చెపుతుంటే మేము విన్నాము.

షా: తరవాత ఏమైంది?

క్లర్కులు: మామూలుగా అయితే మృతదేహాన్ని మేము చెక్‌ చేయాలి. వద్దు, పైనుంచి ఆర్డర్లు వచ్చాయి, ఈ గొప్ప వ్యక్తికి రొటీన్‌ పరీక్ష చేయకూడదు అని మిలిటరీ ఆఫీసర్లు చెప్పారు. అంతా గోప్యంగా జరపాలంటూ వారు పట్టుబట్టారు.

డాక్టర్‌ సర్టిఫికేట్‌, క్రిమేషన్‌ పర్మిట్‌ ‘ఇచిరో ఒకురా’ అనే పేరిట ఇవ్వబడ్డాయని షా పరిశోధన లో తేలింది. తరవాత అతడు తైపే లోని దహనవాటికకు వెళ్లి అక్కడి కీపర్‌ ‘చు త్సుంగ్‌’ ని కలిశాడు. 1945 అక్టోబరుకు ముందు రికార్డులేవీ అక్కడ లేవు. ‘ఇదుగో ఈ క్లాస్‌ వన్‌ సెంట్రల్‌ చాంబర్‌ తెరవమని ఆరోజు నాకు చెప్పారు. ఇండియన్‌ని ఇందులోనే దహనం చేశాం అని చు త్సుంగ్‌ చూపించాడు. ‘శవాన్ని పెట్టిన పెట్టె మరీ పెద్దది కావటం వల్ల ఇంకో చిన్న కాఫిన్‌ లోకి మార్చి దహనం చేశాం’ అని అతడు చెప్పాడు.

షా: బయటికి తీసినప్పుడు బాడీని మీరు చూశారా?

చు త్సుంగ్‌: అంత ధైర్యం నేను చెయ్యలేదు. పెద్ద బాసులు పక్కన ఉన్నారు. నేను ఆర్డర్ల ప్రకారం నడవాలి. మృతదేహం బట్టలో చుట్టి ఉండటం మాత్రమే చూశాను.

షా: అది విమానప్రమాదంలో చనిపోయిన ఇండియన్‌ది అని మీకెలా తెలుసు?

చు త్సుంగ్‌: జపనీస్‌ ఆఫీసర్లు మాట్లాడుకుంటుంటే విన్నాను. పక్కనే ఉన్న ఇండియన్‌ కూడా ఔనన్నట్టు అప్పుడు తల ఊపాడు.

షా: దహన సమయంలో ఎవరున్నారు?

చు త్సుంగ్‌: ఏడెనిమిది మంది జపనీస్‌ ఆఫీసర్లున్నారు. వారివెంట మోచేతికి కట్టుకట్టుకున్న పొడగరి ఇండియన్‌ ఉన్నాడు. ళిఅదే గ్రంథం, పే.173రి

తన విస్తృత పరిశోధనలో తేలిన విషయాలను హరీన్‌ షా ‘Verdict From Farmosa’ అనే గ్రంథంలో పొందుపరచాడు. జపాన్‌లో అత్యధిక ప్రాచుర్యం కలిగిన Yomiuri Shimbun దినపత్రిక రెండో ప్రపంచ యుద్ధంలో జపాన్‌ పాత్ర, దాని పరాభవాల వాస్తవ చిత్రాన్ని భావితరాలకు ఎరుక పరచటం కోసం 1966లో Emperor in the Showa Era అనే ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు చేపట్టి పదివేలమందిని ఇంటర్వ్యూ చేయించింది. అందులో సుభాస్‌ బోస్‌కు సంబంధించి వెల్లడైన విశేషాలను Adventure into the Unknown పేరిట కె.సి.యాదవ్‌ ఆనే చరిత్రకారుడు పుస్తకంగా తెచ్చాడు. కూలిన విమానంలో నేతాజీతో బాటు ప్రయాణం చేసిన కోనో, నోనోగాకి, తకిజవా, సకాయి అనే జపాన్‌ సైన్యాధికారుల ప్రత్యక్ష సాక్ష్యాలు, బోస్‌కు స్వయంగా చికిత్స చేసి, మరణించేవరకు కనిపెట్టుకుని ఉన్న డాక్టర్‌ యోషిమి చెప్పిన వివరాలు, నేతాజీ మరణం, దహనం గురించి తైవాన్‌ మిలిటరీ పోలీసు హెడ్‌ క్వార్టర్స్‌ అధికారి లెఫ్టినెంట్‌ కల్నల్‌ తకమియా, తైపే ఇంఫెంట్రీ బ్యూరోలో సబ్‌ లెఫ్టినెంట్‌ హయషిదా చెప్పిన స్వానుభవాలు అందులో పూసగుచ్చినట్టు వెల్లడిరచారు.

వాస్తవానికి విమాన దుర్ఘటన జరిగిన కొత్తలోనే దానినుంచి ప్రాణాలతో బయటపడ్డ జపాన్‌ వారి ప్రత్యక్ష సాక్ష్యాలను United Press of America వార్తా సంస్థ ప్రచురించింది. హాస్పిటల్‌ నర్సు ‘చెన్‌ పీ ష’ చెప్పిన వివరాల ఆధారంగా చైనీస్‌ సెంట్రల్‌ న్యూస్‌ ఏజెన్సీ 1945 నవంబర్‌ 23న ప్రమాదంలో బోస్‌ దుర్మరణాన్ని ధృవీకరించింది. 1956లో జపాన్‌ ప్రభుత్వం వెలువరించిన ఫైనల్‌ రిపోర్ట్‌ సైతం తైహోకు ప్రమాదాన్ని, అందులో బోస్‌ మృతిని మరోసారి ధ్రువపరచింది.

ఇన్నిన్ని సాక్ష్యాలూ, రుజువులూ కళ్ల ముందు కనపడుతున్నా కానకుండా ప్రమాదం మాయ.. నేతాజీ మరణం మిథ్య అని ఇప్పటికీ వాదించే మహా మేధావుల మూర్ఖత్వానికి దండం పెట్టటం మినహా చేయగలిగింది లేదు. అసలు ఇందులో మిస్టరీ ఏమిటన్నదే పెద్ద మిస్టరీ!

మిగతా వచ్చేవారం

About Author

By editor

Twitter
Instagram