నవంబర్‌ 15-22 ‌జనజాతీయ గౌరవ దినోత్సవం


చరిత్రను పరిపూర్ణం చేశాడు

‘ధర్తీ ఆబా’ (భూమి దేవుడు)గా ప్రఖ్యాతుడైన ముండా తెగ స్వాతంత్య్ర సమరయోధుడు బిర్సాకు ప్రధాని నరేంద్ర మోదీ నవంబర్‌ 15‌న ఘన నివాళి సమర్పించారు. బిర్సా పేరిట రాంచీలో ఏర్పాటు చేసిన వస్తు ప్రదర్శనశాలను  ప్రధాని  వర్చ్యువల్‌గా ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రసంగిస్తూ ప్రధాని, ధర్తీ ఆబా చిరకాలం జీవించకపోయినా భారతదేశ స్వాతంత్య్ర చరిత్రకు ఆయన పరిపూర్ణత చేకూర్చారని అన్నారు. అలాగే భావి తరాలకు దిశా నిర్దేశం కూడా చేశారని వ్యాఖ్యానించారు. భారతదేశంలో గిరిజన సమాజ మూలాలను నాశనం చేయడానికి సాహసించిన సిద్ధాంతం మీద ఆయన తిరుగుబాటు చేశారని ప్రధాని గుర్తు చేశారు. ఆధునికత పేరుతో జీవన వైవిధ్యం మీద, పురాతన అస్తిత్వం మీద, ప్రకృతి మీద దాడులు చేయడం సామాజిక సంక్షేమానికి వ్యతిరేకమని భగవాన్‌ ‌బిర్సా ఆనాడే గ్రహించారని మోదీ వ్యాఖ్యానించారు. బిర్సా ఆధునిక విద్యను ప్రేమించాడు. మార్పును స్వాగతించాడు. తన సమాజంలోని లోపాలకు వ్యతిరేకంగా గళం విప్పి సాహసవంతుడు అనిపించుకున్నాడు అని కూడా ప్రధాని గుర్తు చేశారు. నవంబర్‌ 15‌న గిరిజనుల ఆత్మ గౌరవం దినోత్సవం సందర్భంగా ప్రధాని ఝార్ఖండ్‌ ‌రాష్ట్ర ప్రజలను, గిరిజన సమూహాలను అభినందిస్తూ , బిర్సా పేరుతో ఏర్పాటు చేసిన వస్తు ప్రదర్శనశాలను వారికే అంకితం చేశారు. దీని పూర్తి పేరు బిర్సా ముండా ఉద్యాన్‌ అం‌డ్‌ ‌మ్యూజియం.

ఝార్ఖండ్‌ ‌రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవంగా కూడా నిర్వహించుకుంటున్న నవంబర్‌ 15 (‌బిర్సా జన్మదినం)న రాంచీలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి హేమంత్‌ ‌సొరేన్‌, ‌కేంద్రమంత్రి అర్జున్‌ ‌ముండా, మాజీ ముఖ్యమంత్రి బాబూలాల్‌ ‌మరాండి కూడా హాజరయ్యారు. బిర్సా తుదిశ్వాస విడిచిన పాత జైలు పరిసరాలలోనే ఈ మ్యూజియంను నిర్మించారు. 25 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన ఈ ప్రాంగణంలోనే 25 అడుగుల ఎత్తయిన బిర్సా విగ్రహాన్ని  ప్రతిష్టించారు. తమ అస్తిత్వాన్ని, హక్కులను, అడవినీ కాపాడు కోవడానికి గిరిజనులు చేసిన ఉద్యమాల గురించి ఈ మ్యూజియం వివరిస్తుంది. బుధు భగత్‌, ‌సిధు కాన్హు, నిలాంబర్‌- ‌పితాంబర్‌, ‌దివా-కిసున్‌, ‌తెలంగ ఖాదియా, గయా ముండా, జత్రా భగత్‌, ‌పోతో హెచ్‌, ‌భగీరథ్‌ ‌మాంజీ, గంగా నారాయణ్‌ ‌సింగ్‌ ‌వంటివారి జీవిత ఘట్టాలను కూడా ఇందులో ప్రదర్శించారు. 


అది ఝార్ఖండ్‌ ‌ప్రాంతం, చాయ్‌బాసాలోని లూథరన్‌ ‌చర్చ్. అక్కడ ఒక సమావేశం జరుగుతోంది. ఫాదర్‌ ‌నట్రాట్‌ ‌మనసులో ఉన్న విషం బయటకు కక్కాడు. ముండా తెగ గిరిజనులు యేండ్ల తరబడి ధార్మిక ఉత్సవాలు జరుపుకుంటున్న ఓ స్థలాన్ని తమ చర్చ్‌కు ధారాదత్తం చేయాలని అడిగాడు. ఆ తెగవారు ‘సర్నా’ అని పిలిచే ఆ పూజాస్థలాన్ని ఆక్రమించాలని క్రైస్తవులు పూనుకున్నారు. నిజానికి తమ నివాస ప్రాంతాలను ఆనుకొని ఉండే అడవిని పవిత్రంగా భావిస్తూ అలా పిలిచేవారు. సర్నా అన్నా అడవే. అదే సర్నామాత. వారు దేవతగా భావించేవారు. పర్వదినాల్లో బోంగా అనే గ్రామదేవతకు జంతుబలి ఇచ్చేవారు. ఇతర దినాల్లో అక్కడికి ఎవరు వెళ్లరు. ఆ ప్రాంతం ఆ దేవత పేరుమీద ఉంటుంది. అలాంటి పవిత్ర భూమిని ఫాదర్‌ ఆ‌క్రమించాలని చూశాడు. ముండా తెగ పెద్దలూ, సర్దార్లూ వ్యతిరేకించారు. దీనితో క్రైస్తవ ఫాదర్‌ ‌గిరిజన సంప్రదాయాలను, ఆచారాలను, పండుగలను దూషిస్తూ మాట్లాడాడు. అక్కడే ఉన్న ఒక పద్నాలుగేండ్ల బాలుడు అది సహించలేకపోయాడు. అతని రక్తం ఉడికిపోయింది. ‘అబద్ధాలకోరులూ, మోసగాళ్లూ, చోరులని తిడుతున్నారు. మేం ఎవరిని మోసం చేసాం? మేం కష్టజీవులం, మాట తప్పం, నిజాయితీపరులం’ అంటూ తన తెగ తరపున వాదించాడు. మీరు తెల్లదొరలూ కావచ్చు. ప్రభుత్వ అండ ఉండవచ్చు. ప్రభుత్వం ఖాఖీ దుస్తుల్లో, మీరు తెల్లదుస్తుల్లో రావచ్చు. మీ అందరి టోపీలు ఒక్కటే’ అంటూ గర్జించాడు. అతడు ఆ పాఠశాల విద్యార్థే. ఫాదర్‌ని నిలదీసినందుకు బయటకు పంపేశారు. భయం లేకుండా చర్చ్ ‌ఫాదర్‌ను చెండాడిన ఆ బాలుడు తర్వాత గిరిజనుల మార్గదర్శిగా, వారి భగవంతునిగా ఖ్యాతి గాంచాడు. ఆయనే బిర్సా ముండా. ఆయన నడిపిన ‘ఉల్‌ ‌గులాన్‌’ ‌భారతీయ గిరిజనోద్యమాలలో ప్రముఖంగా నిలిచింది.

నవంబర్‌15, 1875 ‌గురువారం ఝార్ఖండ్‌ ‌రాష్ట్రంలోని ఉల్నిహాతు గ్రామంలో కర్మీ ముండా, సుగానా దంపతుల మూడవ సంతానంగా బిర్సా జన్మించాడు. గురువారం పుట్టటం చేత బిర్సా అని పేరుపెట్టారు. ముండా అనేది సంస్కృత పదం. అంటే ‘పెద్దమనిషి’. తమ జాతిలో పెద్ద మనిషి పుట్టాడని వారు భావించారు. బిర్సా పుట్టగానే ముండా తెగ వారు ధరతీ కా ఆభా (భూ దేవత)గా చెప్పుకున్నారు. చారడేసి కండ్లు, చెక్కినట్టు ఉండే ముక్కు, ఉక్కు శరీరం కల బిర్సా స్ఫురద్రూపి, ప్రతిభా సంపన్నుడు, శాంతచిత్తుడు. సాటి బాలురతో మేకలు, గొర్రెలు మేపడానికి వెళ్లేవాడు. నేలపై అందమైన బొమ్మలు గీసేవాడు. పిల్లనగ్రోవి వాయించేవాడు. పశుపక్ష్యాదులు, బాటసారులు ఆ పిల్లనగ్రోవి నాదం మైమరచి వినేవారు. అసలు కృష్ణుడే బిర్సాగా జన్మించాడని ఆ తెగ నమ్మకం.

1886లో ప్రాథమిక విద్య తర్వాత బిర్సా చాయిబాసాలో జర్మన్‌ ‌లూథరన్‌ ‌మిషన్‌ ‌హైస్కూల్‌లో చేరాడు. అక్కడే ఫాదర్‌ ‌నట్రాట్‌ ‌వంచనతో హిందువులను క్రైస్తవులుగా మార్చేవాడు. గోమాంసం వండించేవాడు. దీనిని బిర్సా వ్యతిరేకించాడు. ఆపై అతని మనసు మాతృధర్మ చింతన, ధార్మికతల వైపు మరలింది. పాఠశాల వీడి భుక్తి కోసం కూలి చేసాడు. బంద్‌గావ్‌ అనే ఊరిలో ఆనంద్‌ ‌పండా అనే ఆధ్యాత్మికవేత్త దగ్గర ధార్మికశిక్షణ పొందాడు. ధర్మం, విశ్వం గురించి అన్వేషించాడు. రామాయణ, భారత, భాగవతాలు, భగవద్గీత అధ్యయనం చేశాడు. ధ్యానం, ధారణ, యోగసాధన అలవరుచుకున్నాడు. గిరిజనులలో ఉండే మూఢ నమ్మకాలూ, అనాచారాలు పారద్రోలాడు. సుదీర్ఘ సాధన, తపస్సు ధ్యానం, ధారణలతో గురువుగా, స్వామిజీగా మారి తన తెగవారికి భగవానుడయ్యాడు.

బిర్సా కొన్ని సూత్రాలు చెప్పాడు. మాతృధర్మ విశిష్టతను బట్టి, సుఖమయ జీవనం కోసం గోహత్య మానాలి. తులసిని పూజించాలి. రామాయణ, భారత, భాగవతాలను పారాయణం చేయాలి. శుచీశుభ్రత పాటించాలి. దైవ చింతన ఉండాలి. సత్యాన్ని పలకాలి. ఆయన తన తెగ వారిని విద్యావంతులను చేశాడు. ఆయన బోధనలు ప్రజలను ఆకర్షించాయి. ఆంగ్ల పాలనను నిరసిస్తూ, పన్నులు కట్టవద్దని పిలుపునిచ్చాడు. గ్రామాలలో తిరుగుతూ ప్రజలను జాగృతం చేయసాగాడు. ప్రజల్లో చైతన్యం వెల్లివిరిసింది. బిర్సా సాక్షాత్తు భగవంతుని స్వరూపంగా ముండా జాతి విశ్వసించింది. బిర్సా కూడా, తాను భగవంతుడినేనని, విదేశీ కబంధ హస్తాల నుండి భూమండలాన్ని కాపాడి ముక్తి కల్గిస్తానని చెప్పేవాడు. భారతదేశానికి పునర్‌ ‌వైభవం తెస్తాననీ, తనతోపాటు నడవమని పిలుపు నిచ్చాడు. పూర్వీకుల పరంపరను గుర్తుచేశాడు. ఆంగ్లేయులు గిరిజనుల పరంపరాగత హక్కులను కాలరాసిన తీరును వివరించాడు.


భగవాన్‌ ‌బిర్సా ముండా ముఖ్యమైన బోధనలు

  • ఈశ్వరుడు ఒక్కడే.
  • గోసేవ, ప్రాణిసేవ చేయాలి.
  • మత్తుకు బానిస కాకూడదు.
  • పరిశుభ్రమైన ఆహారం తీసుకోవాలి.
  • ఇల్లు శుభ్రంగా ఉండాలి.
  • పెద్దలయెడల గౌరవం ఉంచాలి
  • స్వధర్మాన్ని పాటించాలి.
  • సంఘటితంగా ఉండాలి.
  • వారంలో ఒక రోజు గ్రామ దేవతను పూజించాలి.
  • విదేశీయుల, విజాతీయుల మోసాలకు బలికావద్దు.
  • ప్రతి ఇంటి ముందు తులసి తప్పకుండా ఉండాలి.

బిర్సా ప్రబోధనలతో చైతన్యవంతులైన వనవాసులు ఆంగ్ల ప్రభుత్వాన్ని ధిక్కరిస్తూ, పన్నులు చెల్లించటం మానివేశారు. అటవీసంపద దోచుకునే కాంట్రాక్టర్లను అడ్డుకున్నారు. గ్రామాలన్నీ క్రైస్తవాన్ని వ్యతిరేకించాయి. గతంలో క్రైస్తవులుగా మారినవారు మళ్లీ మాతృధర్మంలోకి రావటం ఆరంభించారు. భగవాన్‌ ‌బిర్సాముండా బోధనలతో ‘బిర్సాయియేత్‌’ అనే పంథా ఏర్పడింది. దీన్ని మాతృధర్మంగా భావించారు.అంతిమంగా సాయుధ సంఘర్షణ వైపు తన ప్రజలను ఆయన నడిపించవలసి వచ్చింది.

ఆ ప్రవచనాలతో, వనవాసుల్లో వచ్చిన చైతన్యంతో ఆంగ్లేయులు, క్రైస్తవ మిషనరీలు హడలి పోయారు. ఈ తిరుగుబాటును అణచివేయడానికి మొదట బిర్సాను నిర్భంధించాలని పాలకులు తలచారు. ఇది పసిగట్టిన బిర్సా అనుచరులు సంప్రదాయ అస్త్రాలతో రక్షణగా నిలిచారు. మూడురోజులు ప్రయత్నించి, పోలీసులు బిర్సాను పట్టుకోకుండానే వెనుతిరిగారు. అదే బిర్సా మొదటి విజయం. అయితే ఆంగ్లేయుల తొత్తు జగ్మోహన్‌ ‌సాయంతో పోలీసులు అర్ధరాత్రి ఇంట్లో ఒంటరిగా నిద్రిస్తున్న బిర్సాను బంధించి, కాళ్లుచేతులు కట్టివేసి ఏనుగుపై తీసుకుపోయారు. దీనికి ప్రతీకారంగా ముండా జాతీయులు పోలీస్‌ ‌స్టేషన్‌పై దాడిచేశారు. తమ గురువును విడుదల చేయాలని గర్జించారు. ప్రభుత్వం వణికిపోయింది. లాఠిఛార్జి చేసి, కొందరిని నిర్బంధంలోకి తీసుకున్నారు. బిర్సా మీద పిచ్చివాడని ముద్రవేశారు. ఉద్రిక్తల నడుమ బిర్సాను రాంచీకి తరలించారు. కానీ న్యాయమూర్తి వారిని నిర్దోషులుగా ప్రకటించాడు. ఇది జీర్ణించుకోలేని ప్రభుత్వం మళ్లీ కేసు నడిపించింది. అప్పుడు ప్రభుత్వ వ్యతిరేకతను రెచ్చకొట్టాడనే నెపంతో రెండేళ్ల శిక్ష విధించి, హజారీబాగ్‌ ‌జైలుకు పంపారు. అక్కడ కఠోర తపోసాధన చేశాడు. తరువాత ఆయనను విడుదల చేశారు.

తమ భగవాన్‌ ‌బయటకు వచ్చిన వార్త తెలియగానే అన్ని తెగల వనవాసులు అన్ని ప్రాంతాల నుండి రాసాగారు. ఆంగ్ల పాలన నుండి విముక్తితోనే వనవాసులకు శాంతి చేకూరుతుందని బిర్సా ఇంకాస్త గట్టిగా భావించాడు. మళ్లీ చైతన్యం రాజుకుంది. సంఘటితం కావడానికి సమావేశాలు నిర్వహించాడు. చిన్న చిన్న సైనికదళాలుగా ఏర్పడి, ఒక నాయకుని ఎన్నుకొమ్మని సలహా ఇచ్చాడు. రహస్య కార్యకలాపాలు మొదలయినాయి.

బిర్సా ఎప్పుడు ఒకే ప్రదేశంలో ఉండేవాడుకాదు. వేరువేరు చోట్ల ప్రవచనాలు, సన్నద్ధత సభలు నిర్వహించేవాడు. గ్రామాలూ, కొండకోనలూ, అడవుల్లో అర్ధరాత్రి సమావేశాలు జరిగేవి. ఆ పనిలోనే బిర్సా తమ తెగ ఆరాధించే మహా పురుషులకు చెందిన పవిత్రస్థలాలు, రాజప్రాసాదాలు, కోటలు, శిథిల కట్టడాలను, ము్య•ంగా సనత్‌గఢ్‌ ‌కోటను సందర్శించాడు. అక్కడి మృత్తికలు, నదినీళ్లను తెచ్చాడు. చుతియా గ్రామం నుండి తులసి మొక్క, జగన్నాథపురం నుండి గంధం పసుపు కుంకుమలు తెచ్చాడు. చుట్టూ కోటగోడలూ, కొండలూ, రహస్యమార్గం ఉన్న దొంబారి అనే చోటును స్థావరం చేసుకున్నాడు. అది దట్టమైన చెట్లతో, అడవి మృగాలున్న దుర్గమారణ్య ప్రాంతం. అక్కడ భగవాన్‌ ‌బిర్సా ఆశ్రమం పేరుతో రెండు గుడిసెలు నిర్మించారు.

1897-1900 మధ్య ముండా వీరులకు, బ్రిటిష్‌ ‌సైన్యానికి మధ్య తీవ్రస్థాయిలో యుద్ధం జరిగింది. ఇదే ఉల్‌గులాన్‌గా ప్రసిద్ధి చెందిన బిర్సా తెగ ఉద్యమం. ఆగస్ట్‌లో తెల్లవాళ్లను భయకంపితులను చేస్తూ రాంచీ నుండి చాయిబాసా వరకు గల 400 చ.కి.మీ. పరిధిలోని మిషనరీలపై, ఖుంతి పోలీసు చౌకుపై యోజనా బద్ధంగా దాడిచేశారు. బాణాల వర్షం కురిపించారు. అన్ని వైపుల నుండి బాణాలు రావడంతో తెల్లవారికి దిక్కు తోచలేదు. ప్రతిచర్యకు ఆస్కారం లేకపోయింది. వణుకుతూ ఎక్కడివారక్కడ దాక్కున్నారు. రాంచీ భయభ్రాంతమైంది. ఆపై అన్ని గిరిజన గ్రామాల్లో తిరుగుబాటు మొదలయ్యింది. క్రైస్తవుల గోదాములు తగులబెట్టారు. పోలీస్‌ ‌స్టేషన్‌ల మీద దాడిచేశారు. పోలీసులు పారిపోయారు. ఇద్దరు పోలీసులు చనిపోయారు. కొందరు గాయాల పాలయ్యారు. గాయాలైన వారిని మళ్లీ బిర్సా ఆదుకున్నాడు. తిరుగుబాటు విజయవంతంగా సాగిపోయింది. 1898లో తంగా నది ఒడ్డున పోరు జరిగింది.

ఇక అణచివేతకు వ్యూహాలు తీవ్రమైనాయి. బిర్సాను పట్టిచ్చినవారికి బహుమానం ప్రకటించారు. మార్చి 3, 1900 అర్ధరాత్రి చక్రధర్‌పూర్‌ అడవుల లోని జాంకోపాయి అనేచోట పోలీసులు బిర్సాను బంధించి, రాంచీ కారాగారంలో దుర్భరమైన ప్రత్యేక సెల్‌లో వేశారు. చిత్రహింస పాలు చేశారు. రక్తపువాంతులతో వైద్యం అందక, ఆ సంవత్సరం జూన్‌ 9‌న ఆంగ్లేయుల దౌష్ట్యానికి బిర్సా బలయ్యాడు. కలరాతో చని పోయాడని రిపోర్టులో ఉన్నా అతని శరీరంలో ఆ లక్షణాలు కనిపించ లేదు. విషప్రయోగం జరిగిందని భావించారు. భగవాన్‌ ‌బిర్సా ముండా ఈ దేశ వనవాసుల ధర్మం, స్వేచ్ఛల కోసం బలయ్యాడు. అప్పటికి ఆయన వయసు 25 ఏళ్లు.

భగవాన్‌ ‌బిర్సా ఉద్యమంతో ఎన్నో సత్ఫలితాలు కలిగాయి. చోటా నాగపూర్‌ ‌ప్రాంతంలో భూసంస్కరణలు అమలు చేశారు. జమీందారుల నుండి విముక్తి కలిగించి కలెక్టర్ల ద్వారా భూమి హక్కుల వివాదాలు పరిష్కరిం చటం మొదలు పెట్టారు. దీనితో గిరిజనులకు వెసులుబాటు లభించింది. గిరిజనుల భౌతిక జీవనం మెరుగుపడింది. విద్య వైద్య, సౌకర్యాలు, సేవ – సహకార భావం పెంపొందాయి. దురాచారాలు, మూఢ నమ్మకాలూ తగ్గాయి. ధార్మిక చైతన్యం వెల్లివిరిసింది. క్రీడా, రాజనీతి రంగాల్లో వనవాసులు రాణించ సాగారు. సామజిక సంస్థల్లో ప్రతిభ కనబరిచారు. బిర్సా ప్రాచీన సాంస్కృతిక పరంపర పట్ల స్వాభిమానం రేకెత్తించారు. విదేశీ పాలన వద్దని, స్వాతంత్య్రం కావాలని స్పష్టం చేశాడు. ప్రాచీన హిందూత్వ ప్రతీకలని ఆదర్శంగా తీసు కున్నాడు. తులసి పూజ, తిలక ధారణ, యజ్ఞోపవీత ధారణ అలవాటు చేశాడు. విద్య, వైద్యం, శుచీశుభ్రత నేర్పాడు.

భారతదేశాన్ని బ్రిటిష్‌ ‌పాలన నుండి విముక్తం చేయడంలో గిరిజన వీరులు చేసిన పోరాటాలు ఎంతో గొప్పవి. దేశ స్వాతంత్య్రం, ధర్మం, సంస్కృతుల రక్షణ కోసం, వనవాసుల హక్కుల కోసం జరిగిన పోరాటాలే అవన్నీ. భగవాన్‌ ‌బిర్సా నేటికీ అక్కడి ప్రజలకు ఆరాధనీయుడే. ఆయనను భగవాన్‌గా కొలుస్తున్నారు. పార్లమెంటు భవనంలో ఆయన తైలవర్ణ చిత్రపటం, విగ్రహం నెలకొల్పారు.

రాంచీ విమానాశ్రయంతో పాటు, ఇంకా పలు సంస్థలకు బిర్సా పేరు పెట్టారు. భగవాన్‌ ‌బిర్సా విదేశీ పాలన మీద తిరుగుబాటు చేసి, గిరిజనులను చైతన్య పరిచిన గొప్ప స్వాతంత్య్ర సమరయోధుడు. ఆయన జన్మదినం నవంబర్‌ 15 ‌గిరిజన స్వాభిమాన దినోత్సవం. గ్రామాల్లో తండాల్లో పట్టణాల్లో గిరిజనులను చైతన్య పరచాలి.

– కె. రామచంద్రయ్య, వనవాసీ కల్యాణ పరిషత్‌

అఖిల భారతీయ ప్రశిక్షణ జట్టు సభ్యులు

About Author

By editor

Twitter
Instagram