– ఎం.‌వి.ఆర్‌. ‌శాస్త్రి

ఇంఫాల్‌ ‌సంగ్రామంలో ఓడి, సేనలు వెనక్కి వచ్చిన తరవాత 1944 అక్టోబర్‌లో ఆజాద్‌ ‌హింద్‌ ‌హింద్‌ ‌ఫౌజ్‌ ‌సెరిమోనియల్‌ ‌పెరేడ్‌ 3000 ‌మంది సైనికులతో రంగూన్‌లో నడుస్తున్నది. జపనీస్‌ ‌మిలిటరీ జనరల్సు, బర్మా మంత్రులు, పురప్రముఖులు చాలామంది పెరేడ్‌ ‌తిలకిస్తున్నారు. పెద్ద ఆరుబయలు పెరేడ్‌ ‌గ్రౌండ్‌ ‌మధ్యలో వేదిక మీద నిలిచి నేతాజీ సుభాస్‌ ‌చంద్రబోస్‌ ‌తనముందు బారులు తీరిన సైనికులను ఉద్దేశించి ఎప్పటిలాగే ఉత్తేజకరంగా ప్రసంగించాడు. తరవాత మార్చ్ ‌పాస్ట్. ‌ఝాన్సీ రాణి రెజిమెంట్‌ ‌ముందుభాగాన నిలవగా సైనిక కవాతు మొదలైంది.

అంతలో విమాన దాడి హెచ్చరిక అలారం మోగింది. దగ్గరలోని ఏరోడ్రోమ్‌ ‌నుంచి జపాన్‌ ‌ఫైటర్‌ ‌విమానాలు ఆకాశంలోకి ఎగిశాయి. మరికొద్ది నిమిషాల్లో బ్రిటిష్‌ ‌బాంబర్లు, ఫైటర్‌ ‌ప్లేన్లు రంగూన్‌ ‌మీద దాడికి రివ్వున రానే వచ్చాయి. మా నెత్తిమీదే భీకరమైన గన్‌ ‌బాటిల్‌ ‌మొదలైంది. జపాన్‌ ‌జనరల్స్ ‌సహా సందర్శకులందరూ ప్రాణభయంతో పరుగులిడి దగ్గరలోని ట్రెంచిల్లో దాక్కున్నారు. నేతాజీ వేదిక మీదే నిబ్బరంగా, విగ్రహం వలె నిశ్చలంగా నిలబడి ఉన్నాడు. ఝాన్సీ రాణి రెజిమెంట్‌ అమ్మాయిలు ఏమాత్రం జంకకుండా నేతాజీకి సెల్యూట్‌ ‌చేస్తూ ఏమీ జరగనట్టే కవాతు కొనసాగించారు.

హఠాత్తుగా శత్రువిమానాలు చాలాకిందికి దిగి పెరేడ్‌ ‌నడుస్తున్న ప్రాంతం మీదికి వచ్చాయి. వాటిలో ఒకటైతే నేతాజీ నిలిచిన చోటికి 100 అడుగుల దూరంలో 50 అడుగుల ఎత్తుకి దిగింది. జపాన్‌ ‌విమానదళం దానిపై కాల్పులు జరిపింది. అందులో ఒక షెల్‌ ‌నేతాజీ ఎదుటి నుంచి సైనిక వందనం చేస్తూ వెళుతున్న ఒక మహిళా సిపాయి తలకు తగిలి ఆమె అక్కడికక్కడే మరణించింది. అయినా ఎవరూ హడలిపోలేదు. గగ్గోలెత్తి పారిపోలేదు. కదం ఆపలేదు. కవాతు ఆగలేదు. ఏకంగా ఆరు భారీ మిషన్‌ ‌గన్లు ఉన్న శత్రువిమానం కాల్పులు జరపగలిగి ఉంటే నేతాజీ సహా ఎందరొ సైనికులు నేలకొరిగే వారే. చావంటే భయంలేని ఆజాద్‌ ‌హింద్‌ ‌ఫౌజ్‌ ‌ధైర్యాన్ని, అందునా ముఖ్యంగా మహిళా రెజిమెంట్‌ ‌స్థైర్యాన్ని చూసి ఎన్నో యుద్ధాల్లో కాకలు తీరిన జపాన్‌ ‌మిలిటరీ మల్లులే నిర్ఘాంతపోయారు.

[My Memories Of INA And Its Netaji, Maj. Gen. Shahnawaj Khan, p.262-263 ]

1945 ఏప్రిల్‌ 20‌న బ్రిటిషు సేనలు ఇంకో 24 గంటల్లో పయిన్మనాను ఆక్రమించబోతున్నాయనగా జపనీస్‌ ‌కమాండర్‌ ఇన్‌ ‌చీఫ్‌ ‌జనరల్‌ ‌కిమురా సుభాస్‌ ‌చంద్ర బోస్‌ ‌దగ్గరికి వచ్చి ‘మనం చేతులెత్తేసినట్టే. ఇక రంగూన్‌లో నిలవలేము. తొందరగా వెనక్కి వెళ్లి పోదాం. మీరు సిద్ధమవండి’. అన్నాడు. ‘మీరు వెళితే వెళ్ళిపొండి. మేము రాము. నాతొ సహా మా మొత్తం మంత్రిమండలి రంగూన్‌లోనే ఉండి మా కంఠంలో ప్రాణం ఉన్నంతవరకూ పోరాడతాం’ అని నేతాజీ నిష్కర్షగా బదులిచ్చాడు.

ఏప్రిల్‌ 23 ‌పొద్దున్నే దుర్వార్త. బ్రిటిష్‌ ‌సైనిక దళాలు సెంట్రల్‌ ‌బర్మాలో పయిన్మనా దాటేశాయి. మరికొన్ని గంటల్లో అవి రంగూన్‌ ‌చేరుకోవచ్చు. నేతాజీ ఇంకా రంగూన్‌లోనే ఉంటే తరుముకొస్తున్న బ్రిటిష్‌ ‌సైన్యానికి చిక్కక తప్పదు. అది వీల్లేదు. వెంటనే రంగూన్‌ ‌నుంచి వెళ్లిపోవలసిందే అని కాబినెట్‌ అత్యవసర సమావేశంలో మంత్రులు గట్టిగా చెప్పారు. ఆయన వినలేదు. వినలేదని సహచరులు ఊరుకోలేదు. యుద్ధం ముగియకుండానే నాయకుడు శత్రువుకు బందీ కావటంలో అర్థం లేదు. పరిస్థితి ఎంత నిరాశా జనకంగా ఉన్నా పోరు కొనసాగించేందుకు ఏదో ఒక దారి దొరకకపోదు.’ అని గట్టిగా నచ్చచెప్పారు. వారి బలవంతం మీద బోస్‌ ‌తిరోగమనానికి ఒప్పుకున్నాడు. రంగూన్‌లో తన ప్రతినిధిగా మేజర్‌ ‌జనరల్‌ ‌లోకనందన్‌ను నియమించాడు.

రంగూన్‌ ‌చుట్టుపక్కల 7000 మంది ఐఎన్‌ఎ ‌సైనికులు ఉన్నారు. వారిలో అత్యధిక సంఖ్యాకులు తీవ్రంగా జబ్బుపడి ఆస్పత్రులలో చికిత్స పొందు తున్నారు. మిగిలిన వారికి పోరాడే సత్తువ అంతంత మాత్రం. పైగా వారి దగ్గర ఆయుధాలు లేవు. హుటాహుటిన అంతమందినీ తరలించటానికి రవాణా సదుపాయమూ లేదు. కాబట్టి ఆ బాపతు సైన్యాన్ని ఉపసంహరించే అవకాశం లేదు. లొంగుబాటు మినహా వారికి గత్యంతరం లేదు. రంగూన్‌లోనే ఉండి బ్రిటిషు సైన్యానికి వారిని సాఫీగా సరెండర్‌ ‌చేయించే బాధ్యత లోకనందన్‌ ‌కు నేతాజీ అప్పగించాడు. ఆరకాన్‌ ‌రంగం నుంచి వెనక్కి వచ్చి దమ్ము ధైర్యం పుష్కలంగా ఉన్న మొదటి బెటాలియన్‌ ‌సుభాస్‌ ‌బ్రిగేడ్‌ను వదులుకోవటానికి బోస్‌ ఇష్టపడలేదు. వారిని తన వెంట తీసుకువెళ్ళాడు.

ఝాన్సీ రాణి రేజిమెంటులో బర్మాకు చెందిన వారికి వీడ్కోలు ఇచ్చి ఇళ్ళకు పంపారు. వారిలో రేబా సేన్‌ అనే బెంగాలీ అమ్మాయి ఇంటికి సుభాస్‌ ‌స్వయంగా వెళ్లి, తన జ్ఞాపకంగా తన అన్న శరత్‌కు కోలకతా వెళ్ళినప్పుడు అందజేయమని చెప్పి ఆమె తండ్రి చేతికి కొన్ని వస్తువులు అందజేశాడు. టిటో బహుమానమైన జపనీస్‌ ‌వేస్‌, ‌ముస్సోలినీ ఇచ్చిన జేడ్‌ ‌బాక్సు వాటిలో ఉన్నాయి. మరలిరాని ప్రయాణానికి తాను త్వరలో ఆయత్తమవనున్నట్టు బోస్‌కు ముందే తెలుసనడానికి ఇది ఒక దృష్టాంతం.

మలయా నుంచి వచ్చిన రాణుల్లో కొంతమంది రైళ్ళలో తిరిగివెళ్ళగలిగారు. రంగూన్‌ ‌క్యాంపులో ఉన్న మిగతా అమ్మాయిలను ముందుగా రైలెక్కించాలని, ఆ తరవాతే నేతాజీ కాన్వాయి బయలుదేరాలని నిర్ణయమైంది. తామే ఊరు నుంచి ఎప్పుడు ఉడాయిద్దామా అని తొందర మీద ఉన్న జపాన్‌ అధికారులు ఈ అమ్మాయిల సంగతి పట్టించుకోలేదు. సాయంత్రం రైల్వే స్టేషనుకైతే తీసుకు వెళ్లారు. ప్లాట్‌ ‌ఫాం మీద వారిని మూడు గంటలు వెయిట్‌ ‌చేయించారు. తీరా ట్రెయిన్‌ ‌వచ్చాక అందులో వారికి చోటులేదు పొమ్మన్నారు. రాత్రి 10 గంటలకు ఈ సంగతి తెలిసి నేతాజీ మండిపడ్డాడు. తన కేబినేట్‌ ‌మంత్రి ఎస్‌.ఎ. అయ్యర్‌ను పిలిచి, ‘నువ్వు వెళ్ళి- కొత్తగా రాయబారిగా వచ్చాడే ఆ హచియకు చెప్పు. రాణులకు ప్రయాణం ఏర్పాటు కాకుండా నేను ఇక్కడినుంచి కదలను. జపాన్‌ ‌వాళ్ళు నాకు ఇంకేమి చేయనక్కరలేదు. ఇదొక్కటీ చేస్తే చాలని చెప్పు’ అన్నాడు.

అయ్యర్‌ ‌వెళ్లి అడిగితే కొత్త రాయబారి జపాన్‌ ‌వారితో మాట్లాడి అమ్మాయిలకోసం అప్పటికప్పుడు అదనంగా లారీలు ఏర్పాటు చేశాడు. ఏప్రిల్‌ 24‌న నేతాజీ రంగూన్‌లోని అన్ని కాంపులకూ వెళ్లి అక్కడ నిలిచిపోతున్న తన సైనికులకు వీడ్కోలు ఇచ్చాడు. లోకనాథన్‌కు, ఇతర అధికారులకు తుది ఆదేశాలిచ్చి చీకటి పడ్డాక బంగళానుంచి సపరివారంగా బయలుదేరాడు. ఆజాద్‌ ‌హింద్‌ ‌ఫౌజ్‌ ‌సీనియర్‌ ఆఫీసర్లు, భోంస్లే, చటర్జీ, కియానీలు, తాత్కాలిక ప్రభుత్వ మంత్రులు, సివిలియన్‌ అధికారులు, వందలాది సైనికులు, సుమారు వంద మంది రాణులు, తోడుగా జపాన్‌ ‌ప్రభుత్వం తరఫున రాయబారి హచియ, హికారీ కికాన్‌ అధిపతి జనరల్‌ ఐసోడా నేతాజీ వెంట ఉన్నారు. ఆ చరిత్రాత్మక ప్రస్థానం విశేషాలలో కొన్ని ఎస్‌.ఎ. అయ్యర్‌ ‌మాటల్లో:

‘‘మా కాన్వాయిలో నాలుగు కార్లు, పన్నెండు లారీలు ఉన్నాయి. అందులో మూడు లారీలు రాణుల కోసం. అది వెన్నెల రాత్రి. శత్రువుల కంట పడకుండా ఉండటం కోసం రంగూన్‌- ‌పెగూ రోడ్డుకు రెండువైపులా ఉన్న చెట్ల ఆకులు, కొమ్మలతో మా వాహనాల బయటి భాగాలను కప్పేశారు. అప్పటికే జపాన్‌ ‌వాళ్ళు కూడా రంగూన్‌ ‌విడిచిపెట్టటం మొదలెట్టారు. వారి ఆఫీసులు ఖాళీ చేస్తూ ముఖ్యమైన పత్రాలు తగుల పెట్టసాగారు.

‘‘రోడ్డు పట్టి గంట అయిందో లేదో ఆకాశంలో విమానాల మోత వినిపించింది. మేము వాహనాల నుంచి దిగి రోడ్డుకు రెండువైపులా చెట్ల చాటున నక్కాము. అది మొదలు ప్రతి రెండు మూడు గంటలకూ అదే పని. దాంతో ప్రయాణం నెమ్మదిగా సాగింది. మేము వెళ్ళే దారిలో జపాన్‌ ‌వాళ్లు పెగూ ఊరిని, అటు దారిలో అమ్యూనిషన్‌ ‌డంపులను తగలబెట్టటం కనపడింది. మండుతున్న గ్రామాల పక్కనుంచి మా ప్రయాణం కొనసాగించాం. సామాన్లు మోసుకుంటూ ఎంతోమంది జపాన్‌ ‌సైనికులు ఆ దారిన నడిచి వెళుతున్నారు. వారిని తప్పించుకుంటూ మా వాహనాలు నెమ్మదిగా పోతుంటే జపానీ లారీలు విపరీతమైన వేగంతో మమ్మల్ని దాటి వెళ్ళసాగాయి. కాన్వాయ్‌లో వాహనాల వరసను సరిచేసుకోవటానికి పలుచోట్ల ఆగవలసి వచ్చింది. వావ్‌ ‌నది దగ్గరలో ఒక కుగ్రామానికి చేరేసరికి తెల్లవారవచ్చింది. పగటివేళ ప్రయాణం ప్రమాదం కాబట్టి ఆ రోజుకు అక్కడ ఆగిపోయాం. ఉదయం 8 గంటలకు ఒక ఫైటర్‌ ‌విమానం ఊరిమీదుగా చక్కర్లు కొట్టి, అనుమానం తోచిన ప్రాంతాల మీద గుండ్లవర్షం కురిపించింది. నేతాజీ విశ్రమించిన చోటు పైనా అది తిరిగింది. అదృష్టవశాత్తూ ఆయనకు ఏమీ కాలేదు.

‘‘అన్నం, కూరతో కడుపు నింపుకుని పొద్దుగుంకాక బయలుదేరి కాసేపట్లో వావ్‌ ‌గ్రామం చేరాం. భారీవర్షాలకు నేలంతా బురదమయమైంది. మా వాహనాలు చాలానే బురదలో కూరుకుపోయాయి. ప్లాంకుల సాయంతో అతికష్టం మీద వాటిని బైటికి లాగాము. కాస్త ముందుకెళ్లాక నేతాజీ కారు పెద్ద బురద గుంటలో సగం లోతున దిగబడి కనిపించింది. ఆయనకు ఏమైందోనని భయపడ్డాము. అంతలో నేతాజీ కాస్త దూరాన నిలబడి , అటువెళ్లే వాహనాలను ‘పెద్ద గుంట ఉన్నది, పక్కనుంచి వెళ్ళమ’ని హెచ్చరిస్తూ , ట్రాఫిక్‌ ‌కంట్రోల్‌ ‌చేస్తూ కనిపించాడు. ఆయన కారును కష్టపడి బైటికి లాగాక మళ్ళీ బురద దారిలో వావ్‌ ‌నదితీరానికి బయలు దేరాం. మాకన్నా ముందు వెళ్ళిన లారీల రద్దీ వల్ల రోడ్డు మీద ముందుకు కదలటం చాలా కష్టమైంది. వేరే దారి ఉందేమో చూసి కొంతమంది ముందు వెళ్లండి-అన్నాడు నేతాజీ. మాలో కొందరం మెయిన్‌ ‌రోడ్డు పక్కనుంచి కచ్చా రోడ్డు పట్టి నదివైపు వెళ్ళసాగాం. ఆ బాట మరీ దారుణం. లారీలు అడుగడుగునా బురదలో దిగబడ్డాయి. వాటిని అక్కడే వదిలేసి కాలినడక సాగించాం. కాలు మోపితే జర్రున జారిపోతున్నది. అలాగే పడుతూ లేస్తూ బురదలో స్కేటింగ్‌ ‌చూస్తూ చచ్చీచెడి నది ఒడ్డుకు చేరాం.

‘‘అక్కడంతా గందరగోళం. ఎక్కడపడితే అక్కడ లెక్కలేనన్ని లారీలు ఆగాయి. తెల్లవారేలోగా నది దాటేయ్యాలని ఎవరికీ వారు తెగ తొందర పడుతున్నారు. వెలుతురు వచ్చాక కూడా అక్కడే ఉండిపోతే లారీల బారులను శత్రు విమానాలు తేలిగ్గా కనిపెడతాయి. ఆ రద్దీలో ఎవరు ఎక్కడ ఉన్నదీ పోల్చుకోలేక పోయాం. అందరం 100 గజాల దూరంలోనే ఉన్నా ఎవరిని ఎవరం కనుక్కోలేక పోయాం.

‘‘నది దాటటానికి మనుషులకూ, లారీలకు ఉన్నది ఒక్కటే ఫెర్రీ. దానికోసం అందరూ ఎగబడటంతో విపరీతమైన తొక్కిసలాట. నేతాజీ పరిస్థితిని గమనించి కల్నల్‌ ‌మాలిక్‌, ‌మేజర్‌ ‌స్వామిలను పిలిచాడు. ఫెర్రీ కోసం ఆగవద్దు. మన అమ్మాయిలను ఎలాగైనా దగ్గరుండి నది దాటించమని చెప్పాడు. మా రాణులు చాలా ధైర్యవంతులు. చీకట్లో పీకలలోతు ప్రవాహంలో నడుచుకుంటూ మొత్తానికి నది దాటి అవతలి ఒడ్డుకు చేరారు. జనరల్‌ ‌కియానీని, నన్ను, ఇంకా చాలామందిని కూడా నేతాజీ పట్టుబట్టి అవతలి ఒడ్డుకు పంపించాడు. తన కారును, వీలైనన్ని లారీలను ఫెర్రీమీద దాటించే అవకాశం కోసం నేతాజీ ఈవలి తీరాన ఓపిగ్గా వేచి ఉన్నాడు. తెల్లారేలోపు నదిదాటే ఆశ లేదనుకున్న లారీలను జపాన్‌ ‌వాళ్లు తగులబెట్టసాగారు. ఒక వైపు మంటలు, చెల్లా చెదురుగా నిలిచిన లారీలు, చుట్టూ జనం నడుమ ఫెర్రీ దగ్గర వంతుకోసం నిలబడ్డ నేతాజీని చూస్తే నా గుండె కలుక్కుమంది.

‘‘మొత్తానికి తెల్లవారవస్తుండగా అందరం నది దాటగలిగాము. ఫైటర్లూ, బాంబర్లూ విరుచుకుపడే లోగా సాయంత్రంవరకూ తలదాచుకోవటానికి చోటు వెతుక్కోవాలి. తలా ఒక దిక్కు గాలించగా దగ్గరలోని పల్లెలో ఒక శిధిలమైన మంటపం కనిపించింది. సామాన్లు మోసుకుని మంటపం దగ్గరకు వెళుతూండగానే విమానాల రొద వినిపించింది. కనపడ కుండా దాక్కోమని నేతాజీని హెచ్చరించాము. ఆయన వినిపించుకోలేదు. ముందు అమ్మాయిల సంగతి చూడాలి అంటూ వారిని గబగబ లాక్కు పోయాడు. నెత్తిమీద శత్రువిమానాలు పొంచి ఉన్నా లెక్క చేయక, చిట్టచివరి రాణిని క్షేమంగా ఒక చోట ఉంచేవరకూ ఆయన తిరుగుతూనే ఉన్నాడు. అది చూస్తున్న మేము ఆయనకేమి అవుతుందోనని హడలిపోయాం.

‘‘రంగూన్‌లో బయలుదేరింది మొదలు 300 మైళ్ళ దూరంలోని బాంగ్‌ ‌కాక్‌కు అడవులగుండా చేరేంతవరకూ నేతాజీ అనుక్షణం రాణుల క్షేమం గురించే ఆలోచించేవాడు. పల్లెలో, అడవిలో ఎక్కడ బస చేసినా ముందుగా వారికి ఆహారం, మరుగు సౌకర్యం, భద్రత మీద దృష్టి పెట్టేవాడు. అలాగే తన సౌకర్యం, తన సుఖం పట్టించుకోకుండా ఎల్లవేళలా తన వెంట ఉన్న సహచరుల అవసరాలకు ప్రాధాన్యం ఇచ్చేవాడు. కాన్వాయ్‌లోని కార్లు, లారీలకు సంబంధించి ఏ చిన్న వివరమూ ఆయన దృష్టిలో పడకుండా ఉండేది కాదు. చేయబోయే ప్రతి మజిలీలో వంటకు కావలసిన బియ్యం, పప్పు, కూరలు సరిపడినన్ని నిలవ ఉన్నాయా, మంచినీటికి వసతి ఉంటుందా అన్నది స్వయంగా కనిపెట్టేవాడు. ఆ పనులన్నీ చూసుకోవటానికి తగిన మనుషులు లేక కాదు. భోంస్లే, కియానీ, చటర్జీ లాంటి జనరల్సు, గుల్జారాసింగ్‌, ‌మాలిక్‌, ‌చోప్రా వంటి కల్నల్సు, రాతూరి, స్వామి వగైరా మేజర్లు, ఇంకా ఎందరో ఆఫీసర్లు నేతాజీ ఆదేశాల కోసం ఎప్పుడూ కాచుకుని ఉండేవారు. మొత్తం కాన్వాయ్‌ అవసరాలను వారిలో ప్రతిఒక్కరూ జాగ్రత్తగా నిభాయించగలరు. అయినా నేతాజీ ప్రతిదీ తానే దగ్గరుండి చూసుకున్నది ఆఫీసర్ల మీద నమ్మకం లేక కాదు. తన మనుషులంటే ఆయనకున్న ప్రేమ, ఆపేక్ష అటువంటిది. నేతాజీ నిస్సందేహంగా గొప్ప స్టేట్స్‌మన్‌. ‌గొప్ప యోధుడు. గొప్ప నాయకుడు. అన్నిటికీ మించి ఆయన గొప్ప మానవతావాది, ప్రేమమూర్తి! ప్రమాదాలతో పందెం వేస్తూ బర్మా- థాయిలాండ్‌ ‌బార్డర్లో మూడువారాల పాటు మేము చేసిన సాహసయాత్రలో ఆ సంగతి నాకు మునుపటికంటే బాగా అర్థమయింది.

ఆ మధ్యాహ్నం నేతాజీ మండపం వేదికమీద నిద్రపోతుండగా ఒక ఫైటర్‌ ‌స్క్వాడ్రన్‌ ‌మెషిన్‌ ‌గన్లతో నిప్పులుకక్కుతూ మా పైనా ఎగిరింది. ‘నేతాజీ! చాటుకు తప్పుకోండి’ అని మేము కేకలుపెట్టాం. ఆయన కళ్ళు తెరిచి మాకేసి చిరాగ్గా చూసి పక్కకు తిరిగి పడుకున్నాడు.

‘‘ఆ రాత్రి పొద్దుపోయాక నేతాజీ నన్నూ, జనరల్‌ ‌భోంస్లేనూ, జనరల్‌ ‌చటర్జీనీ కేకేసి, ఓ నలభై మంది రాణులను మీతో వెంటబెట్టుకు వెళ్ళి తెల్లవారే లోగా పై ఊరికి చేర్చండి – అని పురమాయించాడు. వర్షం వల్ల దారి మొత్తం రొచ్చురొచ్చుగా ఉన్నది. మా లారీ కొంతదూరం వెళ్ళాక బురదలో కూరుకుపోయింది. దాన్ని కదపటం మా వల్ల కాలేదు. దాన్ని అక్కడే వదిలేసి, మేము, రాణులు చీకట్లో వరిపొలాలకు అడ్డంపడి తెల్లవార్లూ నడిచి పక్క ఊరికి చేరాము. ఊరంతా నిర్మానుష్యంగా ఉంది. అస్తమానం విమానాల మోతలూ, తెరపిలేని కాల్పుల బాధ పడలేక అందరూ ఊరు వదిలిపోయారు. ఓ పాడుబడ్డ పెద్ద ఇంట్లో మేము తలదాచుకున్నాము. రాణులు మాకు అన్నం, కూర వండిపెట్టారు. అర్ధరాత్రి దాటాక మాకు నేతాజీ మిగిలిన రాణులను తీసుకుని ఈ ఊరికి ఇంకో వైపు వచ్చి ఉన్నాడని, అక్కడ సిట్టంగ్‌ ‌నది దాటటానికి ఫెర్రీ కోసం వేచి ఉన్నాడని కబురందింది. మేము వెంటనే బయలుదేరి నది దగ్గరికి వెళ్లాం. అక్కడ నేతాజీ ఉంచిన ఐఎన్‌ఎ ఆఫీసర్ల సాయంతో మొత్తానికి ఫెర్రీ ఎక్కగలిగాం. నేతాజీ పార్టీ అప్పటికే నది దాటింది.

‘‘మేము అవతలి ఒడ్డు చేరగానే ఒక ఐఎన్‌ఎ ఆఫీసరు ఫెర్రీ దగ్గరికి వచ్చి రెండుమైళ్ళ దూరంలోని ఒక కుగ్రామానికి తీసుకువెళ్ళాడు. అక్కడ అందరం తిరిగి కలుసుకున్నాం. అంతకుముందు నేతాజీ పార్టీ దాగిన షెల్టరు మీద రెండు గంటలపాటు విమానాల నుంచి కాల్పులు జరిగాయట. జనరల్‌ ‌చటర్జీ వ్యక్తిగత ఎడిసి బులెట్‌ ‌తగిలి మరణించాడు. అదృష్టవశాత్తూ నేతాజీ క్షేమంగా తప్పించుకున్నాడు. నేతాజీ కారు ఒక్కటే ఫెర్రీ మీద రాగలిగింది. అప్పుడున్న గందరగోళ స్థితిలో, ముమ్మరమైన శత్రుదాడులను తట్టుకుంటూ మిగతా కార్లు, వాహనాలు నది దాటి మా వద్దకు రాగలవన్న ఆశ లేదు. వాటికోసం వేచి ఉందామన్నా మా వాసన పట్టిన శత్రువులు మమ్మల్ని బతకనివ్వరు. ఇప్పుడు ఏమి చెయ్యాలి అన్నది సమస్య.

దాన్ని నేతాజీ ఇట్టే పరిష్కరించాడు. అమ్మాయిల భద్రత అన్నిటికంటే ముఖ్యం. కనీసం వారికైనా వాహనాలు లేనప్పుడు ఏం చేస్తాం? అవసరమైతే బాంగ్‌కాక్‌ ‌దాకా అందరం నడుద్దాం – అని ఆయన నిర్ణయం.

[Onto Him A Witness, S.A. Ayer, 17-24]

 మిగతా వచ్చేవారం

About Author

By editor

Twitter
Instagram