– ఎం.వి.ఆర్‌. ‌శాస్త్రి

Comrades!.. You may perhaps feel that you have failed in your mission to liberate India. But let me tell you that this failure is only of a temporary nature. No setback and no defeat can undo your positive achievements of the past… …Therefore remain true to India and do not for a moment waver in your faith in India’s destiny. The roads to Delhi are many and Delhi still remains our goal…The sacrifices of your immortal comrades and of yourselves will certainly achieve their fulfilment. There is no power on earth that can keep India enslaved. India shall be free and before long. Jai Hind.

(కామ్రేడ్స్!… ‌భారత్‌ ‌విమోచన లక్ష్యంలో విఫలమయ్యామని బహుశా మీరు అనుకుంటు న్నారేమో! ఈ వైఫల్యం తాత్కాలికమే. గతంలో మీరు సాధించిన ఘన విజయాలను ఏ ప్రతిబంధకమూ ఏ ఓటమీ వమ్ము చేయలేవు. …కాబట్టి భారత్‌కు తగ్గట్టు మెలగండి. భారత భవితవ్యంపై విశ్వాసం చెదరనివ్వకండి. దిల్లీకి చాలా దారులు ఉన్నాయి. ఇప్పటికీ మన లక్ష్యం దిల్లీనే! మీరు, అమరులైన మీ సహచరులు చేసిన త్యాగాలు ఆ లక్ష్యాన్ని తప్పక సాధిస్తాయి. భూమి మీద ఉన్న ఏ శక్తీ భారత్‌ను బానిసత్వంలో అట్టిపెట్టజాలదు. ఇండియాకు స్వాతంత్య్రం వచ్చి తీరుతుంది.. అదీ త్వరలోనే. జైహింద్‌.)

1944 ఆగస్టు 15న ఆజాద్‌ ‌హింద్‌ ‌ఫౌజ్‌ ‌సైనికులకు నేతాజీ సుభాస్‌ ‌చంద్ర బోస్‌ ‌ప్రత్యేక సందేశంలో చేసిన ఉద్బోధ ఇది. మూడేళ్ళ తరవాత సరిగ్గా అదే తేదీన ఇండియాకు స్వాతంత్య్రం వచ్చింది. పరాజయాల పరంపరతో జపాన్‌ ‌డీలా పడి లొంగుబాటుకు మానసికంగా సిద్ధమయింది. చక్రవర్తి ముందు వైఫల్యాన్ని అంగీకరించి జపాన్‌ ‌ప్రధాని టోజో రాజీనామా చేశాడు. అంతదాకా మహా పౌరుషంగా ప్రగల్భాలు పలికిన జపానీ సేనానులు తమ వైఫల్యాల డెబిట్లను ఇతరుల ఖాతాలో వేసే పనిలో పడ్డారు.మొత్తం స్కంధావారంలో ధైర్యాన్ని కోల్పోక , భవిష్యత్తుమీద పరిపూర్ణ విశ్వాసంతో, గెలిచి తీరుతామన్న నమ్మకంతో నిటారుగా నిలబడ్డది సుభాస్‌చంద్ర బోస్‌ ఒక్కడే.

విధిలేని పరిస్థితుల్లో పోరాటం కట్టిపెట్టి రంగం నుంచి అష్టకష్టాలుపడి తిరిగొస్తున్న తన సైనికులను నేతాజీ ఎదురెళ్లి ఆప్యాయంగా రిసీవ్‌ ‌చేసుకున్నాడు. అటునుంచి మేమ్యో వెళ్లి, తీవ్ర గాయాలతో, మలేరియా, అతిసార వ్యాధులతో తిరిగొచ్చిన సైనికులు 2 వేల మంది చికిత్స పొందుతున్న హాస్పిటల్‌ను నేతాజీ దర్శించాడు. ప్రియతమ నేతాజీని కళ్ళారా చూడగానే సైనికులకు ప్రాణాలు లేచొచ్చాయి. వారి మొగాల్లో కొత్త కళ వచ్చింది. బెరిబెరి వ్యాధితో మొగంవాచి, నానా యాతన పడుతున్న ఒక సైనికుడిని ‘మళ్ళీ ఎప్పుడు డ్యూటీకి వస్తావు?’ అని నేతాజీ తమాషాగా అడిగాడు. ‘రంగానికి కదలమని మీరు ఎప్పుడు ఆర్డర్స్ ఇస్తే అప్పుడే’ అని బదులిచ్చాడతడు. ఇక్కడ సదుపాయాలు ఎలా ఉన్నాయి అని ఆయన ఎవరిని అడిగినా ‘ ఝాన్సీ రాణి రెజిమెంటు నర్సులు మమ్మల్ని బాగా చూసుకుంటున్నారు. మా ఇంట్లోవాళ్ల కంటే ఎక్కువగా మాకు సేవ చేస్తున్నారు’ అని రోగులు చెప్పారు. ఆస్పత్రిలో మందుల కొరత, వైద్య సిబ్బంది కొరత తీవ్రంగా ఉన్నా అక్కడి నర్సులు రేయింబవళ్ళు కష్టపడి సైనికులకు ఇష్టంగా చేస్తున్న సేవ నేతాజీని కదిలించింది. బేలా దత్‌ అనే 18 ఏళ్ల బెంగాలీ అమ్మాయి తానొక్కతే 85 మంది అతిసార రోగుల కేసులు చూస్తూ, వారి బట్టలు ఎప్పటికప్పుడు మారుస్తూ, ఒళ్ళు శుభ్రం చేస్తూ అద్భుత సేవ కావిసున్న సంగతి తెలుసుకుని నేతాజీ ముగ్ధుడయ్యాడు. ఆమెకు అక్కడికక్కడే ప్రమోషన్‌ ఇచ్చాడు.

పరామర్శలయ్యాక మాండలేలో మొదటి డివిజన్‌లోని కమాండర్లతో సమావేశమై యుద్ధంలో వారి అనుభవాలను, అభిప్రాయాలను వివరంగా అడిగి తెలుసుకున్నాడు. జపాన్‌ ‌సైన్యం చేసిన మోసాలను, ఆ సైన్యానికీ, ఐఎన్‌ఎకీ నడుమ సమన్వయానికి ఉద్దేశించబడ్డ హికారీ కికాన్‌ ఏ అవసరాలూ తీర్చలేక, ఎందుకూ పనికిరాక తానే పెద్ద న్యూసెన్సుగా మారిన వైనాన్ని కమాండర్లు వివరించారు. అన్ని సరఫరాలకూ జపాన్‌ ‌మిలిటరీ మీద ఆధారపడటం వల్ల వచ్చిన అనర్థాలను నేతాజీ గ్రహించి, ఇకపై సైన్యానికి యుద్ధసామగ్రి, రేషన్లు వగైరా అన్ని సరఫరాలను స్వయంగా తామే చూసుకోవాలని నిర్ణయించాడు. దానికోసం ప్రత్యేకంగా 12 మందితో ఒక ‘వార్‌ ‌కౌన్సిల్‌’ ఏర్పాటు చేశాడు. అక్కరకురాని హికారీ కికాన్‌ ‌ప్రమేయం లేకుండా అన్ని వ్యవహారాలను నేరుగా జపాన్‌ ‌ప్రభుత్వం తోనే తేల్చుకోవటం కోసం నేతాజీ టోక్యో వెళ్లాలనుకున్నాడు. దానివల్ల తమ ప్రాముఖ్యం ఎక్కడ తగ్గిపోతుందోనని భయపడ్డ జపనీస్‌ ‌సైన్యాధికారులు శాయశక్తులా అడ్డుపుల్లలు వేశారు. సైపాన్‌ ‌సమరంలో జపాన్‌ ఓటమి దరిమిలా టోజో రాజీనామా అనంతరం జనరల్‌ ‌కైసో నాయకత్వంలో కొత్తప్రభుత్వం ఏర్పడటం బోస్‌కు అనుకూలించింది. అన్ని విషయాలు మాట్లాడుదాము రమ్మని బోస్‌నూ, బర్మా ప్రభుత్వాధినేత డాక్టర్‌ ‌బా మా నూ కొత్త ప్రధాని ఆహ్వానించాడు. వార్‌ ‌కౌన్సిల్‌ ‌సభ్యులైన ఎ.సి.చటర్జీ, కియానీ లతో కలిసి 1944 అక్టోబర్‌ 29 ‌న నేతాజీ టోక్యో వెళ్ళాడు. విదేశాంగమంత్రి, వార్‌ ‌మినిస్టరు, పలువురు మిలిటరీ, సివిల్‌ ఉన్నతాధికారులు విమానాశ్రయంలో నేతాజీకి సాదర స్వాగతం పలికారు. ప్రధాని కైసో ఆయన గౌరవార్థం ఇచ్చిన విందులో భారత స్వాతంత్య్ర పోరాటానికి సర్వవిధాల మద్దతు ప్రకటించాడు.

 నేరుగా జపాన్‌ ‌మీదే మిత్రరాజ్యాలు చేస్తున్న వైమానిక దాడులు, పసిఫిక్‌లో వరస పరాజయాలు గమనించాక యుద్ధంలో జపాన్‌ ‌శక్తులు ఉడిగాయని సుభాస్‌ ‌బోస్‌కు అర్థమయింది. నూతన ప్రధాని కైసోనూ, కేబినెట్‌ ‌మంత్రులనూ కలిసినప్పుడు ఆయన తన డిమాండ్లను మొగమాటం లేకుండా వారిముందు పెట్టాడు. సమాలోచనలు చాలారోజులు సాగాయి. ఆజాద్‌ ‌హింద్‌ ‌ప్రభుత్వానికి టోక్యోతో నేరుగా సంబంధం ఉండేందుకు అనువుగా రాయబారి నియామకం, ఐఎన్‌ఎకు జపాన్‌ ‌మిలిటరీ నియంత్రణతో నిమిత్తం లేని సర్వస్వతంత్ర ప్రతిపత్తి, ఐఎన్‌ఎ ‌సేనాబలం 45 వేలకు పెంపు, ఆజాద్‌ ‌హింద్‌ ‌ప్రభుత్వానికి తిరిగి తీర్చే ప్రాతిపదికన జపాన్‌ ‌ప్రభుత్వ ఋణం వంటి అనేక అంశాలను టోక్యో ఆమోదించింది. ఆ ప్రకారమే ఒక రాయబారిని కూడా నియోగించింది. (సరైన నియామకపత్రాలు లేని కారణంతో అతగాడికి దర్శనం ఇవ్వటానికి కూడా బోస్‌ ‌నిరాకరించిన వైనాన్ని ఇంతకూ ముందు ఒక అధ్యాయంలో చెప్పుకున్నాం.)

 యుద్ధంలో వరస దెబ్బలతో ఆర్థికంగా, సైనికంగా అన్నివిధాల చితికిన జపాన్‌ ఐఎన్‌ఎకు సహాయం చేయగలిగిన స్థితిలో లేదు. అదే తనకు ఎవరు సహాయం చేస్తారా అని దిక్కులు చూస్తున్నది. ఆ సంగతి ఇంపీరియల్‌ ‌మిలిటరీ హెడ్క్వార్టర్స్ ‌పెద్దలతో మాట్లాడినప్పుడు బోస్‌కు బాగా తేటపడింది. యుద్ధంలో నష్టపోయిన ఆయుధాలను, ఇతర సైనిక ఎక్విప్మెంటును తిరిగి సమకూర్చుకోవ టానికి మాకేమైనా సహాయం చేయగలరా అని బోస్‌ ‌వాళ్ళను అడిగాడు. మేమే కరువులో ఉన్నాం. ఇంతకుముందు మేము సమకూర్చిన చిన్న తరహా ఆయుధాలు గట్రా మీరు తిరిగి ఇచ్చేస్తే బావుంటుంది -అని వారు ఎదురు డిమాండు పెట్టారు!

 బ్రిటిష్‌ ఇం‌డియాపై సాయుధ సంగ్రామం కొనసాగించటానికి జపాన్‌ ‌ను నమ్ముకుని ప్రయోజనం లేదని తేలాక నేతాజీ ఇక ఏమి చెయ్యటమా అని తలపట్టుకోలేదు. 1944 డిసెంబరు మధ్యలో టోక్యోనుంచి మలయాకు తిరిగొచ్చినది లగాయతు 1945 ఆగస్టులో జపాన్‌ ‌మిత్రరాజ్యాలకు సరెండర్‌ అయ్యేంతవరకు స్వశక్తి, స్వావలంబన, సొంత వనరుల మీదే ఆధారపడి ఎన్ని సమస్యలు ఎదురైనా, ఎన్ని ఎదురుదెబ్బలు తగిలినా సాయుధ పోరాటాన్ని కొనసాగించాడు. జపాన్‌తో ఒడంబడిన ప్రకారం మలయా రక్షణకు ఐఎన్‌ఎ ‌మూడో డివిజన్‌ను నియోగించాడు. ఇర్రావద్ది నదిని దాటి బర్మాలోకి దూసుకొస్తున్న బ్రిటిష్‌ ‌సేనలతో ఐఎన్‌ఎ ‌రెండో డివిజన్‌ ‌మెయిక్టిలా రంగంలో 1945 ఫిబ్రవరి నుంచి ఏప్రిల్‌ ‌వరకూ హోరాహోరీగా పోరాడింది. కేవలం ఆదేశాలిచ్చి ఊరుకోకుండా నేతాజీ ఆ సమయాన కదనరంగానికి వెళ్లి సుప్రీం కమాండర్‌ ‌గా ఎంత ధైర్యం, ఎంతటి తెగువ చూపాడన్నదానికి షానవాజ్‌ ‌ఖాన్‌ ‌గ్రంథం లోని ఈ వాక్చిత్రం ఒక మచ్చుతునక:

 యుద్ధరంగంలో ఉన్న సేనల తనిఖీకి నేతాజీ 1945 ఫిబ్రవరి 18న పయిన్మనాకు వచ్చాడు. రెండో డివిజన్‌ ‌కమాండర్‌ ‌కల్నల్‌ అజీజ్‌ అహ్మద్‌ ‌బాంబు దాడిలో తీవ్రంగా గాయపడినందున పోపా వెళ్లి అ డివిజన్‌ ‌కమాండ్‌ ‌బాధ్యత తీసుకోమని నన్ను ఆదేశించాడు. ఇంఫాల్‌ ఆపరేషన్‌లో నా కింద పనిచేసిన మొదటి డివిజన్‌ ‌ట్రూప్స్ ‌నుంచి సెలవు తీసుకుని నేను నేతాజీతో కలిసి మెయిక్టిలాకు, అటు నుంచి పోపాకు బయలుదేరాను.మరునాడు రాత్రంతా నడిచి 20 వ తేదీ తెల్లవారే లోపు మెయిక్టిలాకు 20 మైళ్ల దూరం లోని ఇండో అనే గ్రామానికి చేరుకున్నాము. పొద్దంతా శత్రు విమానాలు గద్దల్లా చక్కర్లు కొడుతుంటాయి. కాబట్టి బయట తిరగటం ప్రమాదం. రాత్రివేళ కూడా లారీలు , కార్లు లైట్లు ఆర్పేసి ప్రయాణం చేస్తాయి.

 పగలంతా ఆ ఊళ్ళో ఆగి ఉన్నప్పుడు మాకు ఓ కబురు తెలిసింది. పాకోకౌ ప్రాంతంలో నెహ్రూ బ్రిగేడ్‌ ‌కాపుకాస్తున్న ప్రాంతాలు శత్రువు వశమయ్యాయి. ఘర్షణలో మన సైనికులు పెద్దసంఖ్యలో చనిపోయారు. అక్కడినుంచి మెయిక్టిలా మీదికి శత్రుదళాలు రావచ్చు. అది తెలిశాక- వాళ్ళ కంటే ముందే మనం అక్కడికి వెళదాం అన్నాడు నేతాజీ. చీకటిపడగానే బయలుదేరి కాసేపట్లో మెయిక్టిలా చేరుకున్నాం. అప్పటికి మాండలే రంగంలోని జపాన్‌ ‌సేనలను టాంకులతో విమానా లతో ఊచకోత కోసి బ్రిటిష్‌ ఆర్మీ మాండలేను ఆక్రమించింది. అక్కడినుంచి మెయిక్టిలా – రంగూన్‌ ‌దారి పట్టి , ఇర్రావద్ది నదిని దాటి, మేమున్న వైపు దూసుకొస్తున్నది. జపాన్‌ ‌వారి రోడ్డు, రైల్‌ ‌రవాణా వ్యవస్థకు మెయిక్టిలా కీలకం. అది కనుక శత్రువుకు స్వాధీనమయితే బర్మాలో జపాన్‌ ‌సైనిక వ్యవస్థ మొత్తం చచ్చుబడిపోతుంది. భీషణ సంగ్రామం జరగబోతున్నప్పుడు నేతాజీ అక్కడ ఉండటం క్షేమం కాదు. పోపా వెళ్ళే ఆలోచన మానుకుని వెంటనే వెనక్కి మరలాలని మేము కోరాము. ఆయన వినలేదు. సరే! ముందు నేను పోపా వెళ్ళి మిలిటరీ పరిస్థితి చూసివచ్చి మిమ్మల్ని తీసుకెళతాను. ఈ లోపు మీరు దగ్గరలోని ఐఎన్‌ఎ ‌హాస్పిటల్‌ ‌తనిఖీకి వెళ్ళండి- అని నేను నచ్చచెప్పి ఒప్పించాను.

 తన మిలిటరీ సెక్రెటరీ మేజర్‌ ‌మహబూబ్‌ అహ్మద్‌, ‌నేను కలిసి ఆ అర్ధరాత్రి బయలుదేరే ముందు నేతాజీ మాకు ఇకపై యుద్ధంలో ఎలా పోరాడాలన్న దానిపై వివరంగా ఆదేశాలిచ్చాడు. ఆశ్చర్యకర విషయం ఏమిటంటే అప్పటికి బర్మాలో జపాన్‌ ‌పని అయిపోయింది – అని మామూలు మనుషులకు కూడా అర్థమయింది. కానీ నేతాజీ మాత్రం అన్నివైపులనుంచీ ప్రచండంగా తరుముకొస్తున్న శత్రువును తప్పక గెలవగలమనే ఇంకా నమ్ముతున్నాడు. ‘అక్షకూటమి మొత్తం ఆయుధాలు దించి లొంగిపోయినా సరే మన పోరాటం కొనసాగించాలి. బ్రిటిషువాళ్ళు మన దేశం వదిలి పోయేంతవరకు మనం పోరాడవలసిందే’ అని మమ్మల్ని సాగనంపుతూ అన్నాడు. నేను పోపా వెళ్లి డివిజన్‌ ‌కమాండ్‌ ‌చార్జి తీసుకుని రెజిమెంట్‌ ‌కమాండర్లు జి.ఎస్‌.‌ధిల్లాన్‌, ‌పి.ఎస్‌.‌సహగల్‌ ‌లకు అవసరమైన ఆదేశాలిచ్చాను. 25వ తేదీన నేను, మహబూబ్‌ అహ్మద్‌ ‌వెనక్కి వెళ్లి నేతాజీకి పరిస్థితి వివరించాము.

 అది వెన్నెలరాత్రి. ఆర్ధరాత్రి ఆరుబయట మా సమావేశం జరిగింది. మెషిన్‌ ‌గన్లు, భారీ ఫిరంగుల మోతలు దూరాన వినిపిస్తున్నాయి. బ్రిటిషు టాంకులు ఎప్పుడైనా వచ్చి మెయిక్టిలా మీద పడవచ్చు. నేతాజీ ఇంకా అక్కడ ఉండటం క్షేమం కాదు; పోపాకు వెళ్ళటం అసలే కుదరదు- అని నేను గట్టిగా చెప్పాను. అప్పుడే ఒక జపనీస్‌ ఆఫీసరు అక్కడికి వచ్చాడు. బ్రిటిష్‌ ‌టాంకులు, ఆర్మర్డ్ ‌కాలమ్‌లు మెయిక్టిలాకి 40 మైళ్ళ దూరంలోకి వచ్చినట్టు అతడి సమాచారం. వెంటనే బయలుదేరి దక్షిణాన పయిన్మనాకు వెళ్ళమని అతడు నేతాజీని కోరాడు. అర్మర్డ్ ‌కాలమ్‌కి 40 మైళ్ల దూరం ఒక లెక్కలోనిది కాదు. మధ్యదారిలో దానిని అడ్డుకునే సైనిక దళం ఏదీ లేదు. వచ్చిపడ్డాక దానిని ఎదుర్కోవటం మా తరమూ కాదు. నేతాజీ వ్యక్తిగత రక్షణకు ఉన్నది కేవలం 20 మంది. వారి దగ్గర ఉన్నవి వట్టి రైఫిళ్లు. ‘ఇక్కడ ఉంటే ప్రమాదం, వెంటనే వెనక్కి వెళ్ళండి’ అని నేను ఎంత చెప్పినా నేతాజీ వినలేదు. నాకు చిర్రెత్తింది.

 ‘నేతాజీ ! ఇదేమీ బాగొలేదు. మీరు ఎంత ధైర్యవంతులో చాటుకోవటం కోసం ఇక్కడే ఉంటానంటున్నారు. ఈ రకంగా మీ ప్రాణాన్ని రిస్కు చేసే హక్కు మీకు లేదు. మీ ప్రాణం మీది కాదు. అది భారతదేశం ఆస్తి. దానిని సంరక్షించాల్సిన బాధ్యత మా మీద ఉన్నది. మీకు ఏమైనా అయితే ఐఎన్‌ఎ, ‌స్వాతంత్య్రోద్యమం ఏమవుతాయి అన్నది కాస్త ఆలోచించండి’ అని నిష్టూరంగా అన్నాను. అదంతా తన క్షేమం కోరే అని ఆయనకు తెలుసు. అంతా విని నవ్వి , ‘షానవాజ్‌! ‌నాతో వాదించి ప్రయోజనం లేదు. నేను పోపా వెళ్ళాలని నిశ్చయించుకున్నాను. వెళ్లి తీరతాను. నా భద్రత గురించి నువ్వు దిగులు పడకు. సుభాస్‌ ‌చంద్ర బోస్‌ను చంపగల బాంబును ఇంగ్లాండు ఇంకా తయారు చెయ్యలేదు.’ అన్నాడు. ఆ చివరి మాట నిజమే. ఆ మధ్యాహ్నమే ఆయన ఉన్న చోట శత్రు విమానాలు భారీగా బాంబింగ్‌ ‌చేశాయి. చుట్టుపట్ల అంతా ధ్వంసమయింది. అయినా తనకు చెక్కు చెదరలేదు. ఎలా తప్పించుకున్నాడన్నది ఎవరికీ అర్థం కాలేదు.

 నేతాజీ ఒక నిర్ణయానికి వచ్చాక దాన్ని మార్చటం ఎవరివల్లా కాదు. కానీ ఆ సమయాన ఆయన పోపా వెళ్ళటం మహా ప్రమాదం. దాన్ని ఎలా ఆపాలా అని మేము ఆలోచిస్తూంటే నేతాజీ వ్యక్తిగత సహాయకుడు మేజర్‌ ‌రావత్‌ ఒక ఉపాయం చెప్పాడు. అప్పుడు టైం 2 గంటలయింది. నేతాజీ బయలుదేరకుండా ఇంకో రెండు గంటలు ఎలాగైనా ఆపగలిగితే తెల్లవారుజాము అవుతుంది. అప్పుడిక ఎలాగూ కదలలేరు. ప్లాను ప్రకారం ప్రయాణం ఆలస్యం చేసే పని మొదలైంది. త్వరగా బయలు దేరాలని నేతాజీ మహా తొందర మీద ఉన్నాడు. ఆలోగా ఒక ముఖ్యమైన లెటర్‌ ‌తయారు చేయమని రావత్‌కు పురమాయించాడు. టైపు చేయటం ఎంతకీ తెమలకుండా రావత్‌ ‌సాధ్యమైనంత జాగు చేశాడు. ఆలోగా కారు ట్రబుల్‌ ఇచ్చిందని డ్రైవరు చేత చెప్పించాడు. నేతాజీ చిరాకుపడి అందరిమీదా విసుక్కోసాగాడు. డ్రైవరు కారు రిపేరు చేస్తూనే ఉన్నాడు. అది తెమిలే సరికి 5 గంటల యింది. ప్రయాణం వాయిదా పడింది.

మేము నేతాజీకి నచ్చచెప్పి పక్క ఊళ్ళోని గుడిసెలో విశ్రమించేందుకు ఒప్పించాం. శత్రువు కదలికలు కనిపెట్టటానికి జపనీస్‌ ‌లైజాన్‌ ఆఫీసరు వెళ్లి 8 గంటలకు తిరిగొచ్చాడు. బ్రిటిష్‌ ఆర్మర్డ్ ‌బ్రిగేడ్‌ ‌మెయిక్టిలాకు ఉత్తరాన 10 మైళ్ళ దూరంలో ఉన్నదట. మెయిక్టిలా నుంచి మాండలేకూ , క్యౌక్‌ ‌పడాంగ్‌కు వెళ్ళే రోడ్లను కట్‌ ‌చేశారట. ఇక ఏ క్షణమైనా మెయిక్టిలా మీద దాడి జరగొచ్చట. ఇప్పటికే మనం ఆలస్యం చేశాం. వెనక్కి పోవటానికి మనకు మిగిలింది రంగూన్‌ ‌వెళ్ళే దారి ఒక్కటే. శత్రువులు బహుశా దాన్ని కూడా ఈపాటికి మూసేసి ఉండొచ్చు – అన్నాడు జపాన్‌ ‌వాడు.

శత్రువును ఎదుర్కొనే శక్తి మాకు లేదు. అక్కడే ఉంటే పోరాడి అందరం చచ్చిపోతాం. ఎక్కడికైనా వెళ్లిపోదాం అంటే దారిలేదు. బయట అడుగుపెడితే ఆకాశంలో తెగ తిరిగే శత్రువిమానాలు వెంటపడి కాల్చేస్తాయి. పగటివేళ ప్రయాణం ఆత్మహత్యతో సమానం. ఏమి చెయ్యటమా అని మేము సందిగ్ధం లో పడ్డాం. నేతాజీ ఏ మాత్రం జంకకుండా ‘పదండి వెళదాం’ అన్నాడు.

 పది నిమిషాల్లో అందరం రెడీ అయ్యాం. మా దగ్గర ఉన్నది ఒకటే కారు. అందులో డ్రైవరు కాక నలుగురు మాత్రమే పడతారు. తన వెంట ఎవరు రావాలన్నది నేతాజీనే నిర్ణయించమన్నాం. నా కర్తవ్యం ఏమిటో నాకు పాలుపోలేదు. ఒక వైపు నా సైనికులు పోపా, క్యౌక్‌ ‌పడాంగ్‌ ‌లలో గెలిచే ఆశ లేని పోరు సాగిస్తున్నారు. ఎలాగైనా అక్కడికి చేరుకొని సేనలను నడిపించటం డివిజన్‌ ‌కమాండరుగా నా బాధ్యత. ఇంకో వైపు నా నాయకుడి విలువైన ప్రాణాన్ని పెనువిపత్తులో కాపాడుకోవటమూ నా ధర్మమే. ఏది ఎంచుకోవాలో తేల్చుకోలేక నిర్ణయ భారం నేతాజీ మీద వేశాను. జపానీ లైజాన్‌ అధికారి, వ్యక్తిగత వైద్యుడు కల్నల్‌ ‌రాజు కాక నేతాజీ వెంట వెళ్ళటానికి ఒక్కరికి మాత్రమే చోటు ఉంది. ఆయన నావైపు తిరిగి ‘నాతో నువ్వు రా’ అన్నాడు. నేను కారును గ్రెనేడ్లు, అమ్యునిషనుతో నింపాను. తప్పించుకునే అవకాశం ఎంత మాత్రం లేదు. ఆ సంగతి మా అందరికీ తెలుసు. అయినా ఎవరూ అధైర్య పడలేదు. ఒకటి మాత్రం ఖాయం. మమ్మల్ని ప్రాణాలతో పట్టుకోవటం శత్రువు తరం కాదు.

మేము కారు ఎక్కే సరికే నేతాజీ లోడ్‌ ‌చేసిన టామీ గన్‌ ఒళ్లో పెట్టుకుని కూచున్నాడు. కల్నల్‌ ‌రాజు రెండు గ్రెనేడ్లను, జపనీస్‌ ఆఫీసరు ఒక టామీ గన్‌ ‌ను పట్టుకున్నారు. నా చేతిలో బ్రెన్‌ ‌గన్‌ ఉం‌ది. జపాన్‌ అధికారి ఫుట్‌బోర్డ్ ‌మీద నిలబడి ఆకాశంలో శత్రు విమానాలను కనిపెట్టసాగాడు. రాజు డ్రైవర్‌ ‌పక్కన కూచున్నాడు. నేను, నేతాజీ వెనక సీట్లో చెరో కిటికీ గుండా చూస్తూ అప్రమత్తంగా ఉన్నాం.

అదృష్టవశాత్తూ శత్రువిమానాల బారిన పడకుండా, ఏ రోడ్‌ ‌బ్లాకులూ లేకుండా 40 నిమిషాల్లో మేము 20 మైళ్ళ దూరంలోని ఇండో గ్రామం చేరాం. మేము ఊళ్ళో అడుగు పెట్టామో లేదో శత్రు విమానాలు మెషిన్‌ ‌గన్లతో కాల్పులు మొదలెట్టాయి. ఐదు నిముషాలు ఆలస్యమైనా మేము రోడ్డు మీద వాటికి చక్కగా చిక్కేవాళ్ళమే. ఆరుబయట ఫైటర్‌ ‌విమానాల వాత పడటం ఎంత భయంకరమో ఆ అనుభవం లేనివారు ఊహించలేరు. ఒక్కో విమానంలో పది పన్నెండు హెవీ మెషిన్‌ ‌గన్లు ఉంటాయి. రైల్వే ఇంజన్లను, టాంకులను ధ్వంసం చేయటానికి వాడే 10 అంగుళాల కార్ట్రిడ్జిలను మనుషుల మీద ఉపయోగించటానికి బ్రిటిష్‌ ‌సైన్యం సంకోచించదు. అవి కనుక తగిలితే శరీరం ఆనవాలు మిగలకుండా చిద్రమవుతుంది.

 ఆ కాలాన ఎక్కడ చూసినా బ్రిటిష్‌ ఏజెంట్లు ఉండేవారు. మొదట మేము ఊరికి దగ్గరలో నాగజెముడు పొదలమాటున దాక్కున్నప్పుడు బర్మావాడొకడు మమ్మల్ని అనుమానంగా చూసి వెళ్ళాడు. ఎందుకైనా మంచిదని మేము వెంటనే ఒక మైలు దూరంలోని దట్టమైన అడవిలోకి వెళ్లాం. అంతలోనే రెండు బ్రిటిష్‌ ‌విమానాలు మేము వదిలిపెట్టిన చోటుకు వచ్చి పొదల చుట్టూ తక్కువ ఎత్తులో చక్కర్లు కొట్టసాగాయి. మమ్మల్ని చూసివెళ్లిన వాడు బ్రిటిష్‌ ఇన్ఫార్మరు అని తేలిపోయింది. ఆ రోజంతా ఎన్నో విమానాలు మాకోసం ఆ ప్రాంతమంతా గాలిస్తూనే ఉన్నాయి. మేము వాటి కంట పడలేదు. విమానదాడి నుంచి తప్పించు కోవటానికి నేను నేతాజీకి ట్రెంచ్‌ ‌తవ్వి పెట్టాను. ఒకసారి సరిగ్గా మేము దాక్కున్న స్థలం పైనే చెట్టంత ఎత్తులో విమానాలు తెగ తిరిగాయి. మేమిద్దరం ట్రెంచ్‌లో కదలకుండా ఉన్నాం. అప్పుడే ఓ పెద్ద నల్ల తేలు నేతాజీ మెడకు అంగుళం దూరంలో కనిపించింది. నేతాజీ కూడా దాన్ని చూశాడు. కానీ అలికిడి అయితే విమానాల బారిన పడతాము కాబట్టి కదలకుండా ఉండిపోయాడు. ఓ నిమిషం తరవాత ఇంకో పొద వైపు విమానాలు వెళ్ళాయి. మేము ఊపిరి పీల్చుకుని తేలును చంపేశాం.ఆ రోజంతా అడవిలోనే ఉన్నాము. నేను దగ్గరలోని పొలంలోకి వెళ్లి పెసలు, సెనగలు దొరికినన్ని పట్టుకొచ్చాను. వాటితోనే కడుపు నింపుకున్నాము.

 చీకటి పడ్డాక నేతాజీ పయిన్మనాకు బయలుదేరాడు. నేను మెయిక్టిలాకు తిరిగివెళ్ళి అక్కడ పోరాడుతున్న సైనికులను వేరే చోటికి తరలించటం లాంటి పనులు చూసుకుని మార్చి 1న పయిన్మనాలో నేతాజీని కలుసుకున్నాను. ఈ లోగా ఆయన ఒకటో డివిజన్‌ ‌లో జబ్బుపడిన వారు కాక మిగిలిన వారితో కల్నల్‌ ‌ఠాకూర్‌ ‌సింగ్‌ ‌నాయకత్వంలో ‘%% రేజిమెంటు’ను తయారుచేశాడు. శత్రువు దాడి చేస్తే పారిపోకుండా అక్కడే ఉండి చివరి సైనికుడి ప్రాణం పోయేంతవరకూ పోరాడాలని ఆయన ఆదేశించాడు. తానుకూడా ఆ రెజిమెంటు తోనే ఉండి కడదాకా పోరాడాలని ఆయన అనుకున్నాడు. మేము వద్దని వారించాము. మెయిక్టిలాలో కాలు నిలదొక్కుకుని బ్రిటిష్‌ ‌సైన్యం ఇటుకేసి రావటానికి ఇంకా పక్షం రోజులు పట్టవచ్చు. అక్కడ ఉండి ప్రయోజనం లేదు కనుక మా కోరిక మీద రంగూన్‌ ‌తిరిగివెళ్లి 1,2,3 డివిజన్లను నడిపించటానికి నేతాజీ అంగీకరించాడు. నేను వెంట ఉండి ఆయనను రంగూన్‌లో దిగబెట్టి అక్కడినుంచి పోపాలో నా డివిజన్‌ ‌ను చేరుకున్నాను.

[My Memories of INA And Its Netaji, Maj. Gen. Shahnawaj Khan ,pp.141- 149]

 మిగతా వచ్చేవారం

About Author

By editor

Twitter
Instagram