మట్టిప్రమిదలోన మమత వత్తిగ జేసి,

చమురు పోసి,జగతి తమముతొలగ

బాణసంచ గాల్చు పర్వదినాన-దీ

పాలకాంతి యొసంగుత పరమశాంతి!

చీకట్లో అంతా సమతలమే.

వెలుగులోనే ఎరుక.

ఆ వెలుగునిచ్చేది దీపం!

దీపం ధ్యానయోగి. జ్ఞానపథ దర్శిని జ్యోతి. దీపం-

దుష్టశిక్షణకి శక్తిని తేజాన్నిచ్చేది

దీప పరంపరలు మహాప్రభలు.

చీకటింట చిరుదివ్వె చిర్నవ్వులే ఇరులవిరియగ చేయగలవు.

‘తిమిరంతో సమరం జరిపే బ్రతుకే అమరం’- అంటారు దాశరథి.

‘‘దీపాదుత్పన్నదీపమివ!’’- అనే ఆర్యోక్తి దీపం అఖండంగా వెల్గుతూనే ఉండాలని సూచిస్తోంది.

వెలగని దీపం నీడని కూడా చూపలేదు, దారి మాట దేవుడెరుగు!

రంగుకాగితాలెన్ని రంగుహొరంగుల్ని మనకు చూపినా, వాటి వెనుకనున్నది ఒక్క దీపమే!

వెల్తురు స్వాగతం- చీకటి వీడ్కోలు.

‘తమసోమాజ్యోతిర్గమయ’! – అని ఉపనిషత్ప్రార్థన.

చీకట్లో నుండి వెల్తురులోకి…..‘‘Lead kindly Light!’’

‘‘దీపం జ్యోతి పరబ్రహ్మ

దీపం సర్వతమోపహరమ్‌

‌దీపేన సాధ్యతే సర్వమ్‌

‌దీపం జ్యోతి నమోస్తుతే’’

-దీపం సత్త్వరజస్తమో గుణాలు కలది. ‘‘దీపం కరోతు కల్యాణమ్‌!’’

‌చీకటి అజ్ఞానానికి సంకేతం. భయం అజ్ఞానానికి పుత్రిక. వెలుగు జ్ఞానానికి ప్రతీక. ధైర్యమిచ్చేది జ్ఞానమే. వెలుతురు మొగ్గ-దీపం.

వెలుగెందుకు ఉదయిస్తుందో?

ఎందుకు కొండెక్కిపోతుందో?

-అని ప్రశ్నించే కవి తాత్త్వికుడు.

‘కాలుతున్నా కాంతినీయటం- త్యాగంకాదు- అది నా నైజం’- అనే దీపానిది మౌనభాష.

అది చెప్పలేని సృష్టి రహస్యాలుంటాయా?

నిశ్శబ్దరత్నాకరంలో వెలికి వచ్చేది- కాంతి కల్పతరువు.

దీపకాంతిని స్మరిస్తాం.దీపధారిని విస్మరిస్తాం!- అంటాడు కవి తనని గుర్తించరేమని!

కాంతి, శబ్దం, మెరుపు, ఉరుము వంటివి. దీపావళి విశిష్టత ఇదే కదా!

గత ఇరవై నెలలపైగా  ‘కరోనా’ చిమ్మచీకటి మనల్ని ఆక్రమించేసింది. కన్నుచించుకున్నా- దారీతెన్నూ కానరాలేదు.

‘శర్వరి’- నుంచి ఇప్పుడిప్పుడే తేల్తున్నాం ‘ప్లవ’ రాకతో!

ఆవునేతి దీపం వలన గ్లుకోమా అనే కంటివ్యాధి రాదని వైద్యశాస్త్రం. దీపం వలన ఆరోగ్యం మెరుగవుతుందని ఆయుర్వేదం. కరోనా’ రోజుల్లో దీపకాంతి ఫోటానుశక్తిగా మారుతుందనే నమ్మిక మనకి కల్గింది. కనుకనే అప్పుడు తొమ్మిది దీపాలు వెల్గించాం.

షోడశోపచారాల్లో దీపారాధన ప్రముఖమైంది.

ప్రమిదలోని దీపం- శ్రీకారం!

చుట్టూఉన్న చీకటిని తిడ్తూ కూర్చోక చిన్నదీపం వెలిగిస్తే చాలు.

హరప్పా త్రవ్వకాల్లో దీపపాత్రలు దొరికాయి. దానిని బట్టి దాదాపు 4వేల ఏళ్ల నుండి దీపావళి పండుగ ఉందని చెప్తున్నారు.

ఎదగల మంచిని చూపి వెలిగెడి దీపిక- దీధితికి జ్ఞాపిక!

సూర్యచంద్రులు కలిసి సరదాగా భూమిమీదకి వచ్చే రోజే అమావాస్య.

ళిఅమా- దానితోపాటు వాస్య – వసించుట అని అర్థం చెప్పారు పెద్దలురి

నరక చతుర్దశిని ‘ప్రేత చతుర్దశి’-అనటం కూడా కద్దు.

అమావాస్యా చతుర్దశుల్లో దీపదానం వల్ల నరుడు పితృదేవతలకి విముక్తినిస్తాడు.

ఆ దీపాల వెలుగులో వారు నరకం నుండి స్వర్గానికి పోతారట!

‘‘నేలనీర్నిప్పునింగియుగాలి’’- ఈ పంచభూతాల్లో నిప్పు-(కాంతి)- లేనివేళ దానిని సృష్టించుకున్న ఆనందంలో నరకాసుర వధ కథని సృష్టించుకున్నాడు మనిషి’’ అంటారు భమిడిపాటి కామేశ్వరరావు గారు.

కొందరి దృష్టిలో రావణవధ జరిగినరోజే దీపావళి.

నరకవధ దీపావళి పండుగకి హేతువన్నది జగత్ప్రసిద్ధమే.

విక్రమార్క శకారంభమని కొందరియభిప్రాయం.

రామభరతుల కలయికే ‘భరత్‌ ‌మిలాప్‌’- అనికొందరు అంటారు.

సత్యభామ భూదేవి. నరకుడు భూమిసుతుడు.

నరకవధ కృష్ణుని లీల, సత్యభామ సాక్షిగా!

ఇదేంకాదు- పితృదేవతల్ని నరకం నుండి తప్పించేది ‘నరక చతుర్దశి’ యైనదంటున్నది నిర్ణయసింధు.

నరక విముక్తికై యమునుద్దేశించి త్రయోదశి రాత్రి నూనెదీపం ఇంటి యెదుట ఉంచితే అది యమదీపం!

రాజకీయరంగంలో-తాలిబాన్‌- ‘‘‌మేం పడగొట్టేసేవి- బండరాళ్లేగదా!’’-అని రాతి విగ్రహాల గురించి అన్నారు. కాని-

వాటిల్లో కనిపించకుండా అంతర్నిహితంగా ఉండేది చైతన్యదీపం! అదొక మానవతా మహోత్పాతం.

(Humanitarian Castastrophe).

అస్తమించే రవికొక అనుమానం. ఇంకిప్పుడు తన బాధ్యతనెవరుమోస్తారు?

‘‘నేనున్నాను,స్వామీ!’’-అనగల మట్టి ప్రమిద రవీంద్రకవీంద్రుని భావదీపం!

కార్తికమాసంలో కాంతామణులకు కావలసినది కార్తికదీపం!

(సీరియల్‌ ‌కాదు సుమండి!)

‘‘ఇంటికి దీపం ఇల్లాలే!’’

‘‘దీపముండగానే ఇల్లు చక్కబెట్టుకో!’’- వంటి సామెతలు తెలుగుతల్లి వెలుగుజిలుగుల్ని ఎగజిమ్ముతున్నాయి.

‘‘ఒకదీపం వెలిగింది.’’- అని ఒక సినిమా పాట ఉంది. అంటే ‘ప్రేమ’- అని భాష్యం చెప్పారు ముళ్లపూడి వెంకటరమణ గారు.

దీపావళి- దీపలక్ష్మికి- అంటే మహస్సు అనే మహాలక్ష్మికి జనం ఇచ్చే నీరాజనం. ఆ లక్ష్మికి ఊరేగింపుల ఆర్భాటమే- బాణాసంచా కాల్చడమట!

‘‘చిటపటటుప్పుటప్పనెడి సీమటపాసులపెట్టెలెన్ని యు

ద్భటముగఢమ్ముఢామ్మనుటపాసులెన్ని మతాబులెన్ని పి

క్కటిలెడి ఝల్లులెన్నిమరికాకర

పూవత్తులెన్ని కాల్తురో

దిటముగతెల్ప నా తరమె దివ్వెల పండుగరేయినర్భకుల్‌’’ – అన్నారు దాసు శ్రీరాములుగారు. ఈ బాణాసంచా సవ్వడులకి అలక్ష్మి దూరంగా తొలగిపోతుందట!

క్రిమికీటకాదుల సంహారానికి ఈ తతంగం అవసరమే.

తారాజువ్వగు కోపమెంచ ముదమే తారాడు భూచక్రమై

ధారాపాతమునౌ మతాబు వెలుగుల్‌ ‌తామెచ్చి భావింప నే

పారున్‌ ‌కాకరపూవు చిట్పటలునై పావిత్య్రమత్యంత ని

ష్ఠారమ్యాక్షరతన్వెలుంగుత మహాశాజ్యోతులింటింటిలోన్‌

‌దీపమారిపోతే మళ్లీ వెల్గించేటంతవరకెంత ఆరాటం?! దీపమారిపోవటం కూడా ఒక పరీక్షే. దీపనిర్వాణ గంధాన్ని పోగాలం దాపురించినవారు మూర్కొనజాలరు.

మట్టిదీపం ఉష్ణాన్ని లాగేసుకుంటుంది. లోహదీపాలు వేడెక్కిపోతాయి. వట్టినేలపై దీపం పెట్టవద్దంటారు పెద్దలు.

మనలో రాగద్వేషాలు దీపంలో నెయ్యి వత్తిలాగ హరించుకుపోతే అది ప్రగతి.

అవ్యయకాంతులీనేది- అఖండదీపం!

అఖండ పుణ్యఫలాల్ని అందించేది- ఆకాశదీపం!

సరస్సులో ఆకాశపునీడ.

ఆ ఒడిని చేరి నీట వెలిగే చినుకు తళుకు జలదీపం!-

పేదవాడి కష్టాల కడలిలో ఏ చిట్టివెల్గైనా కనబడితే అది కన్నీటిదీపం!

విమల విజ్ఞానకాంతి దుష్టశీతల వాయువుచే వణకక నిలిస్తే ధైర్యదీపం!

న్యాయం కోసం పోరాడిన వీరునిది- ధర్మదీపం!

నాడిపట్టి వెజ్జు వెలిగించేది- ప్రాణదీపం!

ఒజ్జలు అంతేవాసులకి దిశానిర్దేశం చేస్తే- అది జ్ఞానదీపం!

యజమాని ఇంట నిలబెట్టేది- గృహదీపం!

అమ్మ లాలన పోషించేది- అమరదీపం!

ప్రేమ మహిమతో జీవితాన్ని వెల్గులతో నింపేది ప్రేమదీపం!

ధర్మదీక్షతో సేవానురక్తుల వెల్గించాలనుకొనేది సేవాదీపం!

విప్లవకారుల విజృంభణకి కావాలి క్రాంతిదీపం!

త్యాగధనులు వెల్గించగలది- దానదీపం!

సాహితీవేత్తలది అక్షరదీపం!

సంగీతకారులకాకర్షణ- రాగదీపం!

తరులవరుసన విరులదీపం!

అరుదైన ప్రతిభావంతునిలో కాంతికారకమైనది-మణిదీపం!

ఆకొన్న నిరుపేదకి అన్నంమెతుకే- బ్రతుకుదీపం!

అడుగడుగున దీపముంది….

అందరిలో దీపముంది….ఆ దీపం ఆత్మదీపం!

మనిషి కలతల్లో- నిజంకాని

కలల్లో-కన్నీటివెతల్లో- కతల్లో-

కలగాపులగపు బాధల పాటల

పల్లవిలో- చీకట్లలోంచి వెలుగులోకి కదిలించేదే-దివ్వెలపండుగ! ఈ పండుగ భిన్నమతాల- భిన్న కులాల- భిన్న ఆచారవ్యవహారాల్ని ఏకవాక్యత వైపు నడిపేదే ఈ దీపపర్వం! అది సిద్ధిస్తే ‘భరత్‌ ‌మిలాప్‌’- ‌కాస్తా- ‘‘భారత్‌ ‌మిలాప్‌’’- ‌గా మారి సౌదర్యసౌందర్యంతో అలరారవలె అన్నది నా ఆశాదీపం!

ఆధ్యాత్మికంగా ఆలోచిస్తే అయోధ్యలో రామమందిర నిర్మాణానికి-ఎంతకాలం నిరీక్షణ? ఇది హైందవ జాగృతి దీపం!

‘నిత్యజాగృతుని వ్యక్తిత్వమూలం- అకుంఠిత చలనంతో అడుగు కలిపే జ్వలనశీలం’-దీపానిది.(శ్రీసి.నారె.)

ఇన్ని దీపాల తోరణమే దీపావళీపర్వం!

నిద్రాణమైన జాతిలో ఏకాకృతిని

వెలుగునట్టి జాగృతి దీపాకృతి!

‘‘శాంతి శాంతి కాంతి కాంతి

జగమంతా జయిస్తుంది!’’ (శ్రీశ్రీ)

‘‘జ్యోతిషామపి తజ్జ్యోతిః

తమసః పరముచ్యతే

జ్ఞానం జ్ఞేయం జ్ఞానగమ్యమ్‌

‌హృది సర్వస్వ విష్ఠితమ్‌’’

(‌భగవద్గీత-13-18)

–  పొన్నపల్లి శ్రీరామారావు

విశ్రాంత ప్రిన్సిపల్‌, ‌మలికిపురం

By editor

Leave a Reply

Your email address will not be published.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Twitter
Instagram