‘క్షమించు’ (పార్డన్‌)

ఈ ‌సంవత్సరం ఆరంభంలో ఫ్రెంచ్‌ ‌కేథలిక్‌ ‌చర్చ్‌కు చెందిన బిషప్‌ల కోసం ప్రత్యేకంగా ప్రదర్శించిన నాటకం పేరు ఇది. ఆ దేశ నటుడు, రచయిత లారెంట్‌ ‌మార్టినెజ్‌ ‌రాసి ప్రదర్శిస్తున్నాడు. ఒక బాలిక లేదా బాలుడి మీద లైంగిక అత్యాచారం జరిగితే వారి జీవితం మీద ఆ దురంతం చూపించే దుష్ఫలితం ఎలా ఉంటుంది? దాని పీడ ఎన్నేళ్ల పాటు వేటాడుతుంది? వారి వారి మానసిక స్థితిని ఎంతగా కుంగదీస్తుంది? తన చుట్టూ నివసించే సమాజంలోని వ్యక్తులను నిరంతరం ఎంత అనుమానంగా చూసేలా చేస్తుంది? ఈ ప్రశ్నలకు సమాధానం ఇస్తూ సాగే నాటకమది. ఇంతకీ ఆ నాటక ఇతివృత్తం మార్టినెజ్‌ ‌జీవితానుభవమే. ఎనిమిదో ఏట అలాంటి చేదు అనుభవం అతడు ఎదుర్కొన్నాడు. నలభయ్‌ ఏళ్ల క్రితం జరిగినా పచ్చి పుండులాగే ఉన్న ఆ జ్ఞాపకం అతడిని ఈ నాటక రచనకు, ప్రదర్శనకు పురిగొల్పింది. నిజానికి ఈ నాటకం 2019లో అవినాన్‌ ‌కళోత్సవంలో మొదటిసారి ప్రదర్శించారు. దేశంలో చాలాచోట్ల ప్రదర్శించారు. మళ్లీ ఈ సంవత్సరం ఆరంభంలో ప్రత్యేకంగా బిషప్‌ల కోసం ప్రదర్శించడం ఎందుకు? గడచిన డెబ్బయ్‌ ఏళ్లలో ఫ్రాన్స్ ‌కేథలిక్‌ ‌చర్చ్‌లలో 3,30,000 మంది చిన్నారులు లైంగిక అత్యాచారాలకు గురైనట్టు చెప్పే ఒక భయానక నివేదిక బయటపెట్టడానికి కాస్త ముందు ఈ నాటకం చూపించారు. ఈ నాటకం తాజా ప్రదర్శన నేపథ్యం అదే.


నిజమే, అక్షరాలా 3,30,000 మంది బాలబాలికలు ఫ్రెంచ్‌ ‌కేథలిక్‌ ‌చర్చ్ ‌మత గురువులు, ఇతర సిబ్బంది చేతులలో లైంగిక అత్యాచారాలకు గురయ్యారు. ఇది ఎవరో చేసిన ఆరోపణ కాదు. సాక్షాత్తు చర్చ్ ‌నియమించిన స్వతంత్ర దర్యాప్తు బృందం రెండేళ్ల పాటు కష్టపడి తయారు చేసిన నివేదికలోని వాస్తవం. 1950 నుంచి 2020 వరకు జరిగిన అత్యాచారాల చిట్టా ఇది. ఇందుకు 2,900 నుంచి 3,200 వరకు కేథలిక్‌ ‌మత గురువులు బాధ్యులని కూడా ఆ నివేదిక వెల్లడించింది. అంతేకాదు, ఈ అత్యాచారాలు బహిర్గతం కాకుండా అన్ని చర్చ్ ‌పెద్దలు అన్ని చర్యలు తీసుకున్నారంటూ మరొక దారుణమైన వాస్తవం కూడా బయటపెట్టింది. కాబట్టి ఇప్పటికీ అన్ని ఉదంతాలు వెలుగు చూడలేదనే అర్ధం.

 సంపన్న ఐరోపా దేశం, సాంకేతికంగా, ప్రగతి పరంగా శరవేగంగా ముందుకు సాగుతున్న దేశం, ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యదేశం ఫ్రాన్స్‌లో తాజాగా వెలుగు చూసిన ఘటనలు అంతర్జాతీయ సమాజాన్ని ఆందోళనకు గురి చేశాయి. సభ్య సమాజాన్ని సిగ్గుతో తలదించుకు నేలా చేశాయి. కొందరు మత ప్రతినిధుల తీరు మాయనిమచ్చగా మిగిలింది. పోప్‌ ‌ఫ్రాన్సిస్‌ ‌వంటి వాటికన్‌ ‌సిటీ అధిపతి సైతం కలత చెందారంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. ఆందోళన, ఆవేదన, బాధ వ్యక్తం చేసి, క్షమాపణ చెప్పారంటే ఆ దారుణాలు ఎంత మాయని మచ్చగా మిగిలి పోయాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

ఆ నివేదిక ఏమిటి? ఏం చెప్పింది? అక్టోబర్‌ 5‌న స్వతంత్ర దర్యాప్తు సంఘం అధ్యక్షుడు జాన్‌ ‌మార్క్ ‌సావే ఈ నివేదిక బహిర్గతం చేశారు. ఫ్రాన్స్ ‌కేథలిక్‌ ‌చర్చ్‌లో గత ఏడు దశాబ్దాలలో అంటే 1950 నుంచి మతాధికారులు, పూజారులు పిల్లలపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. అభం శుభం తెలియని దాదాపు 3,30,000 మంది చిన్నారులు ఈ దారుణాలకు గురయ్యారు. వీరిలో ఎక్కువమంది అంటే దాదాపు 80 శాతం వరకు అబ్బాయిలే కావడం గమనార్హం. మిగిలిన వారు బాలికలు. 10 నుంచి 13 ఏళ్లలోపు వారే ఈ దురాగతాలకు బలయ్యారు. లైంగిక వేధింపులకు గురైన బాల బాలికల్లో 60 శాతం మంది అనంతర కాలంలో మానసికంగా, లైంగిక జీవితంలో సమస్యలను ఎదుర్కొన్నారు. స్థిమితంగా, సరిగా, ఆలోచించలేక పోతున్నారు. దైనందిన జీవితంలో ఎదురయ్యే ఇబ్బందులను, సమస్యలను పూర్తిస్థాయిలో అధిగమించలేకపోతున్నారు. ఈ దారుణాలకు పాల్పడింది అసాంఘికశక్తులు కాదు. స్వయంగా మతానికి ప్రాతినిథ్యం వహిస్తూ, సమాజాన్ని, యువతను సన్మార్గంలో ముందుకు నడిపించే, బాధ్యతాయుతమైన, ఆధ్యాత్మిక జ్ఞాన సంపన్నులు కావడం ఆందోళనకు గురి చేస్తోంది. ఈ విచారణ సంఘాన్ని ఫ్రాన్స్ ‌కేథలిక్‌ ‌బిషప్‌లు 2018 చివర్లో ఏర్పాటు చేశారు. 2500 పేజీల భారీ పాపాల చిట్టానే ఆ సంఘం ప్రపంచం ముందు పెట్టింది. ఈ నివేదికను చర్చ్‌కు అందించిన వెంటనే ఫ్రాంకాయిస్‌ ‌డెవాక్స్ ‌హర్షం వ్యక్తం చేశారు. ఆయన చర్చ్ ‌లైంగిక అత్యాచార పీడితుల సంఘం అధ్యక్షుడు. ఆ సంఘం పేరు-విముక్త ప్రపంచం. ఇది చరిత్ర లోనే ఒక మలుపు అని, ఇక నేరాలను కప్పెట్టే అవకాశం లేదని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు కూడా. ఆ నేరాల కంటే కూడా మత గురువులు విశ్వాసాన్ని దగా చేస్తున్నారు, నైతిక విలువలను దగా చేస్తున్నారు, బాలబాలికలను దగా చేస్తున్నారు, అమాయకత్వాన్ని దగా చేస్తున్నారు అని ఆయన ఆక్రోశం వ్యక్తం చేశారు. చిత్రంగా ఇటీవల కాలంలో వృద్ధాప్యంలోకి అడుగు పెట్టిన వారు ఇలాంటి దురంతాల గురించి నోరు విప్పుతున్నారు. అందులో మార్టిన్‌ (73), ‌మిరెల్లి (71) ఉన్నారు. ఈ ఇద్దరు మహిళలు ఇంతకాలం కుటుంబ సభ్యులకు భయపడి, కుటుంబ గౌరవానికి తలొగ్గి బయటకు చెప్పలేక పోయారు. తనకు జరిగిన ఆ అన్యాయం గురించి ఏనాటికైనా బయటపెట్టాలనే తన కోరిక అని, అందుకోసం తన తల్లిదండ్రులు మరణించేవరకు వేచి ఉన్నానని మార్టిన్‌ ‌చెప్పారు. కేవలం తనకే ఇలా జరిగిందని బాధితులు అనుకోవడం ఇందులో విషాదమని, అందుకే బయటకు రావని మిరెల్లి అన్నారు. మరొక లైంగిక అత్యాచార బాధితుల సంఘం అధ్యక్షులు అలీవర్‌ ‌సావినాక్‌ ఈ ‌దర్యాప్తులో తన వంతు సాయం అందించారు.

ప్రభువు పాపులను రక్షిస్తాడని ఆ మత గురువులు ప్రపంచాన్ని నమ్మించడానికి విశ్వ ప్రయత్నం చేస్తుంటారు. కానీ పాస్టర్లే పాపులైతే! ఆ పాపకృత్యానికి వారి దైవ సన్నిధే నిలయమైతే! నిజానికి కేథలిక్‌ ‌చర్చిలో ఈ ఆరోపణలు ఈనాటివి కాదు. మత గురువులు క్రైస్తవ సన్యాసినులపైన, బాలబాలికల పైన అత్యాచారాలకు ఒడిగట్టడం 20వ శతాబ్దంలో కూడా ఎక్కువ. అదే 21వ శతాబ్దంలో కూడా కొనసాగు తున్నవే. కానీ వీటిలో చాలా ఉదంతాలు రహస్యం గానే ఉండిపోయాయి. క్రైస్తవ సన్యాసినులు, బాలబాలికలే కాదు, కేవలం మూడు సంవత్సరాల వయసున్న చిన్నారి కూడా చర్చ్‌లో అత్యాచారానికి గురైనట్టు ఆధారాలు ఉన్నాయి. 1980 నుంచి ఈ దురాగతాలు వెలుగులోకి వచ్చే పక్రియ మొదల యింది. బాధితులు నోరు విప్పడం ఆరంభించారు. మరొక పదేళ్లకు మీడియా కూడా తన పని తాను చేయడం ఆరంభించింది. కెనడా, అమెరికా, చిలీ, ఆస్ట్రేలియా, ఐర్లాండ్‌ ఇలాంటి అపఖ్యాతిని మూటకట్టుకున్నవే. అమెరికాలో బోస్టన్‌ ‌గ్లోబ్‌ అనే పత్రిక ఈ అత్యాచారాల గురించి విరివిగా కథనాలు ప్రచురించింది. ఇవన్నీ మెసాచుసెట్స్‌లో జరిగాయి. వీటి మీదే డాలస్‌ ‌మార్నింగ్‌ ‌న్యూస్‌ ‌కూడా ఏడాది పాటు పరిశోధన చేయించింది. అవన్నీ 2004 సంవత్సరానికి చెందినవి. సాక్షాత్తు పోప్‌ ‌వంటి పెద్దల ప్రమేయంతో ఉండే హోలీ సీ అనే చర్చ్ ‌న్యాయస్థానమే 2001 నుంచి 2010 వరకు 3000 మంది మత గురువులను లైంగిక అత్యాచారాల ఆరోపణల మీద విచారించిందంటే పరిస్థితి అర్ధమవుతుంది. ఇంకాస్త వెనక్కి వెళితే 1940లోనే అమెరికా కేథలిక్‌ ‌మత గురువు గెరాల్డ్ ‌ఫిట్జ్‌గెరాల్డ్ ఇతర మత గురువులతో కలసి ఒక సమావేశం ఏర్పాటు చేశారు. ఇందులో మతాధికారులు ఎదుర్కొంటున్న రకరకాల వ్యక్తిగత సమస్యలను చర్చించడానికి ఇది ఏర్పాటయింది. అందులో లైంగిక వేధింపులు కూడా ఒక అంశం.

నివేదికను కేథలిక్‌ ‌బిషప్‌ ఎరిక్‌ ‌డి మౌలిన్స్ ‌బ్యూఫోర్ట్ (‌ఫ్రాన్స్ ‌బిషప్‌ల సంఘం అధ్యక్షుడు)కు అక్టోబర్‌ 5‌న అందిస్తున్న స్వతంత్ర దర్యాప్తు సంఘం అధ్యక్షుడు జాన్‌ ‌మార్క్ ‌సావె

నానాటికీ ప్రబలుతున్న పరిస్థితిని అరికట్టడంలో చర్చ్‌లో పూర్తిగా విఫలమైందన్నది చేదు నిజం. దశాబ్దాలుగా కొనసాగుతున్న దారుణాలు వెలుగులోకి రాకుండా చూడటంలో కొందరు మతాధికారులు కీలకపాత్ర పోషించారు. విషయం వెలుగులోకి వస్తే తాము శిక్షకు గురవుతామన్న భయం వారిని కట్టిపడేసింది. పూజారులుగా, మతాధికారులుగా బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన వారు తమ పాత్రను మలినం చేశారు. చిన్నారులపై లైంగిక వేధింపులకు సంబంధించి కమిషన్‌ ‌దాదాపు 3200 మంది సాక్షులను లోతుగా విచారించింది. వారి నుంచి సమగ్రమైన వాంగ్మూలాలను సేకరించింది. వేల మంది పూజారుల వాదనలనూ విన్నది. ప్రత్యక్ష సాక్ష్యాలుగా ఘటనలకు సంబంధించిన సుమారు 6500 చిత్రాలను స్వీకరించింది. బాధితుల సంఘం నాయకుడు ఒలీవియర్‌ ‌సావిగ్నాక్‌ ‌వేధింపులకు సంబంధించి తన వద్ద గల సాక్ష్యాధారాలను కమిషన్‌ ‌కు అందజేశారు. వివిధ కారణాల వల్ల స్వయంగా రాలేని, చెప్పుకోలేని బాధితులు తమకు జరిగిన అన్యాయంపై పూర్తి సమాచారం అందజేసేందుకు విచారణ కమిషన్‌ ‌ప్రత్యేక హెల్ప్ ‌లైన్‌ ‌ను ఏర్పాటు చేయడం విశేషం. ఇక తమకు ఎదురైన చేదు అనుభవాలను వెల్లడించేందుకు కొంతమంది బాలబాలికలు భయపడ్డారు. దీనివల్ల సమస్య పరిష్కారం కాకపోగా మరింత తీవ్రమవుతుందని, వేధింపులు ఎక్కవవుతాయన్నది వారి ఆందోళన. అయినప్పటికీ కొంతమంది బాధితులు తమకు జరిగిన అన్యాయాన్ని చెప్పడానికి కమిషన్‌ ‌ముందుకు ధైర్యంగా రావడాన్ని పోప్‌ ‌ఫ్రాన్సిస్‌ అభినందించారు. పిల్లలపై లైంగిక వేధింపులకు సంబంధించి 2500 పేజీలతో సమగ్ర నివేదికను రూపొందించింది. మూడువేల మందిపై అభియోగాలను మోపింది. మత పెద్దల నిర్వాకాలను ఎండగట్టింది. మతాధికారులు తమ ప్రవర్తన ద్వారా మానవత్వానికి మచ్చ తెచ్చారని, హేయమైన నేరాలకు, నమ్మక ద్రోహానికి, విలువల హననాకి, సంప్రదాయాలు, కట్టుబాట్ల ఉల్లంఘనకు పాల్పడ్డారని అభిశంసించింది. ఇది చర్చ్ ‌సిగ్గు పడాల్సిన విషయమని ఫ్రాన్స్ ‌బిషప్‌ల కాన్ఫరెన్స్ అధిపతి ఎరిక్‌ ‌డి మౌలిక్స్ ‌బ్యూఫోర్స్ ‌వ్యాఖ్యానించారు. బాధితులకు ఉపశమనం కలిగించాలని, బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవాలని, చర్చ్ ‌క్షమాపణలు కోరాలని ఆయన సూచించారు. బాధితుల పట్ల ఉదారంగా వ్యవహరించాల్సిన చర్చ్ ‌వైఖరి మరింత దారుణంగా ఉంది. వారి పట్ల క్రూరంగా వ్యవహ రించింది. వారికి ఉపశమనం కలిగించడంలో ఉదాసీనంగా, నిర్లిప్తంగా వ్యవహరించి విమర్శలను ఎదుర్కొంది.

ఇతర దేశాల్లోనూ….

ఈ దారుణాలు ఒక్క ఫ్రాన్స్‌కే పరిమితం కాలేదు. చాలా దేశాల్లో చోటుచేసుకున్నాయి. వీటిల్లో సంపన్న, ప్రగతి పథాన పరుగులిడుతున్న దేశాలూ ఉన్నాయి. కొన్ని దేశాల్లో ఈ దారుణాలు వెలుగులోకి వచ్చాయి. మరికొన్ని చోట్ల వెలుగులోకి రాలేదు.అంతే  తేడా. 2012 ప్రాంతంలో ఆస్ట్రేలియాలోని విక్టోరియా రాష్ట్రంలో దాదాపు 600 మంది పిల్లలు మత పూజారుల చేత లైంగిక వేధింపులకు గురయ్యారు. ఈ విషయాన్ని పూజారులు స్వయంగా అంగీకరించారు. తాము చేసింది తప్పేనని ఒప్పు కున్నారు. కొందరు సన్యాసినులు సైతం మతాధికారుల చేతిలో లైంగిక వేధింపులకు గురయ్యారు. ఇది ఎవరో చేసిన ఆరోపణ కాదు. స్వయంగా బాధితులు చెప్పిన విషయం. న్యూజిలాండ్‌ ‌కు చెందిన డాక్టర్‌ ‌రోసియో ఫిగ్యూరో, జర్మనీకి చెందిన డోరిస్‌ ‌వాగ్నర్‌ ‌రైసింజర్‌ ‌తాము పూజారుల చేతిలో లైంగిక వేధింపులకు గురయ్యా మని బహిరంగంగా వెల్లడించడం గమనార్హం. ఇంగ్లండ్‌, ‌వేల్స్ ‌లోనూ ఈ దారుణాలు చోటుచేసుకున్నాయి. అక్కడి మతాధికారులు, పూజారులు కూడా పిల్లలపై అకృత్యాలకు పాల్పడ్డారు. దాదాపు మూడువేల మంది బాల బాలికలు లైంగిక వేధింపులకు గురయినట్లు అంచనా.

ఇవీ సిఫార్సులు…

ఈ పరిస్థితిని అధిగమించేందుకు తీసుకోవలసిన చర్యలను విచారణ సంఘం సూచించింది. దీనికి సంబంధించి సుమారు 45 సిఫార్సులను చేసింది. వాటిల్లో ముఖ్యమైనవి పూజారులకు, మతాధికారులకు ఆధ్యాత్మిక అంశాలపై శిక్షణ, నైతిక విలువలు, కట్టుబాట్లపై స్పష్టమైన అవగాహన, సమాజాన్ని, ముఖ్యంగా యువతను ముందుకు నడిపించడంలో వారు పోషించాల్సిన బాధ్యతా యుతమైన పాత్ర, చర్చ్‌ల పాలన, బాధితులను గుర్తించడం, వారికి తగిన మేరకు పరిహారం చెల్లించడం, చట్ట సవరణ వంటి విలువైన సూచనలను చేసింది. వీటిని పకడ్బందీగా అమలు చేయాలని కోరింది. సిఫార్సులు, నిబంధనలు, చట్టాలను పక్కనపెడితే మతాధికారుల్లో విలువలు, బాధ్యత, వారిలో విశుద్ధ ప్రవర్తన మరింత పెరగాల్సిన ఆవశ్యకతను నొక్కి చెప్పింది. ఇది ప్రతి ఒక్కరూ ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన సమయం. పాలకుల నుంచి మత పెద్దల వరకూ ముఖ్యంగా సమాజ మార్గ నిర్దేశకులుగా వ్యవహరించాల్సిన వారు మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. మహిళలు, చిన్నారులు, యువకులు, వృయో వద్ధుల పట్ల దయ, కరుణతో వ్యవహరించాలి. లేనట్లయితే సమాజ గతి తప్పుతుంది. కంచే చేనును మేసే పరిస్థితి ఏర్పడుతుంది. మిగిలిన మతాలకు చెందినవారంతా పాపులేనని గట్టిగా విశ్వసించే ఆ మతంలో ఇప్పటికైనా జడత్వం వదలాలి. ముందు తమ మత గురువులు మూటగట్టుకుంటున్న పాపం గురించి ఆలోచించాలి. అవతలి మతాల మీద వక్రీకరణలు మానాలి. సత్యాన్ని చూడాలి. సత్యాన్ని దర్శించడానికి తపస్సు చేయాలి.

– జాగృతి డెస్క్ / ‌గోపరాజు విశ్వేశ్వరప్రసాద్‌, సీనియర్‌ ‌జర్నలిస్ట్


‌కేథలిక్‌ ‌చర్చ్‌ను కదుపుతున్న మత గురువులు

ఫ్రాన్స్ ‌కేథలిక్‌ ‌చర్చ్ ‌ఘనకార్యం వెల్లడైన తరువాత ఇతర దేశాలలో కూడా ఏం జరిగిందో మళ్లీ వెలుగులోకి వచ్చింది. 1950-2020 మధ్య కేథలిక్‌ ‌మత గురువులు, ఇతర చర్చ్ ‌సిబ్బంది జరిపిన లైంగిక అత్యాచారాల గురించిన సమాచారమిది. ఇలాంటి దారుణాలు ఫ్రాన్స్ ‌కేథలిక్‌ ‌చర్చ్‌కే పరిమితమనుకుంటే, మిగిలిన పాశ్చాత్య దేశాలలో, అలా అనుకుంటే భారత్‌లోని క్రైస్తవ మత గురువుల ఘనత ప్రపంచానికి తెలియదు. ఆ లోటు ఇప్పుడు తీరుతోంది. ప్రపంచంలో చాలా దేశాలలో చర్చ్‌లు లైంగిక అత్యాచారాలకు సంబంధించి తీవ్ర ఆరోపణ లను ఎదుర్కొంటున్నవే. 1990 నాటికే ఇవన్నీ చర్చ్ ‌పెద్దలకు తెలుసు కూడా. వేలాది ఉదంతాలు, డజన్ల కొద్దీ దేశాలలో జరిగినట్టు తెలియవచ్చింది. అలాంటి దేశాలలో అమెరికా, ఆస్ట్రేలియా, జర్మనీ, ఐర్లాండ్‌, ‌మెక్సికో, ఫిలిప్పీన్స్, ‌పోలెండ్‌ ఉన్నాయి.

ఇలాంటి ఘోరాన్ని అరికట్టే విషయంలో వాటికన్‌ (‌కేథలిక్‌ ‌ప్రపంచ పీఠం) స్పందన దోషభూయిష్టంగా ఉందన్న ఆరోపణలు ఉన్నాయి. ఇంతకు ముందు పోప్‌గా పనిచేసిన బెనెడిక్ట్ ఈ ‌పరిస్థితిని సరిదిద్దడానికి సంస్కరణలు తెచ్చేందుకు యత్నించినా విఫల మయ్యారు. ఇది చాలు- పాస్టర్ల కామదాహం ఏ స్థాయిలలో ఉందో చెప్పడానికి. బిషప్‌ల మీద వచ్చిన లైంగికారోపణల నిగ్గు తేల్చాలని బెనెడిక్ట్ ‌యత్నించి కూడా విఫలమయ్యారు. ఆధారాలన్నీ బిషప్‌లు తుడిచేశారు. 2013లో పోప్‌ ‌ఫ్రాన్సిస్‌ ‌బాధ్యతలు స్వీకరించినప్పుడు ఈ అన్యాయం మీద నిర్దిష్ట చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. 2018లో ఆయన చర్చ్‌లకు లేఖలు రాస్తూ, లైంగిక అత్యాచారాలను ఖండించడమే కాదు, ఆధారాలు లేకుండా చేస్తున్న నేరపూరిత మనస్తత్వం గురించి ప్రస్తావించారు. ఇన్ని చర్యలు తీసుకునే యత్నం చేసినప్పటికి పోప్‌ ‌ఫ్రాన్సిస్‌ ‌తొందరపాటు నిర్ణయాలు తీసుకున్నారన్న ఆరోపణ ఉంది. చిలీయిన్‌ ‌బిషప్‌ ‌మీద వచ్చిన ఇలాంటి ఆరోపణలను ఆయన పాక్షికమైనవని ప్రకటించారు. తరువాత తాను తప్పు చేశానని ఫ్రాన్సిస్‌ ‌చెప్పుకోవలసి వచ్చింది. అయితే మరొకసారి తప్పిదం చేయరాదన్న సంకల్పం ఏదీ ఆయన వ్యవహార శైలిలో కనిపించలేదు. ఎలాగంటే, చర్చ్‌లలో జరుగుతున్న లైంగిక అత్యాచారాల ఉదంతాలను కప్పిపుచ్చినట్టు ఆరోపణలు ఎదుర్కొంటూ, తమ పదవుల నుంచి వైదొలగుతూ పలువురు జర్మన్‌ ‌బిషప్‌లు ఇచ్చిన రాజీనామాలను నిరాకరించారు. ఇది ఈ సెప్టెంబర్‌ ‌నెలలోనే జరగడం విశేషం.

లైంగిక ఆరోపణలు వచ్చినప్పుడు దాని మీద దర్యాప్తు చేసే అధికారం జాతీయ చర్చ్‌కు ఉంది. ఇలాంటి అధికారంతోనే ఫ్రాన్స్‌లో దర్యాప్తు జరిగింది. కొన్నిదేశాలలో ప్రభుత్వాలు కూడా ఈ ఉదంతాల మీద దర్యాప్తునకు పూనుకుంటున్నాయి. ఆస్ట్రేలియా ప్రభుత్వం కూడా ఇలాంటి ఒక దర్యాప్తును జరిపించింది. దాని ప్రకారం 1950-2017 మధ్య దేశంలోని ఏడు శాతం కేథలిక్‌ ‌మత గురువులు లైంగిక అత్యాచారాలకు పాల్పడినవారే. ఈ దర్యాప్తు సంఘమే చాలా చక్కని వాస్తవికమైన సిఫారసు కూడా చేసింది. వాటికన్‌తో మాట్లాడి మత గురువులు తప్పనిసరిగా బ్రహ్మచర్యం పాటించాలన్న ఆ నిబంధన కాస్తా తొలగించడం మంచిది అని కుండబద్దలు కొట్టింది. అమెరికాలో పెన్సిల్వేనియా కేథలిక్‌ ‌చర్చ్‌లో ఇలాంటి దర్యాప్తు జరిగింది. ఏడు దశాబ్దాలలో వందలాది మంది మత గురువులు కనీసం వేయి మంది బాలబాలికల మీద అత్యాచారాలకు పాల్పడ్డారని ఆ సంఘం తేల్చింది. ఇక్కడ బాధితులు కోర్టులకు వెళ్లి చర్చ్ ‌నుంచి బిలియన్‌ల కొద్దీ నష్టపరిహారం కూడా పొందారు. ఉత్తర ఐర్లాండ్‌లో ఈ సెప్టెంబర్‌ ‌మాసంలోనే ఇలాంటి నేరానికే తొలిసారిగా చర్చ్ ‌నష్టపరిహారం చెల్లించింది. అన్నట్టు ఫ్రెంచ్‌ ‌దర్యాప్తు సంఘం కూడా బాధితులకు నష్టపరిహారం ఇప్పించాలని కోరింది. 2019లో జర్మన్‌ ‌చర్చ్ ఈ అం‌శం మీద   ప్రత్యేక సమావేశాలే నిర్వహించింది.

అభివృద్ధి చెందిన దేశాలలో ఇలాంటి ఉదంతాలు బయటపడుతున్నా పేద దేశాలలో బాధితులకు ఇలాంటి వెసులుబాటు లేదు. అసలు ఆ దేశాలలో జరిగిన కేసులను అంచనా వేయడం కూడా కష్టమన్న అభిప్రాయం ఉంది. ఎందుకంటే అక్కడ చర్చ్ ‌చాలా పలుకుబడి కలిగి ఉంటుంది. ఇటలీలో అంటే వాటికన్‌ ‌సిటీ ఉన్న దేశంలోనే వెరోనా మూగ చెవిటి బాల బాలికల పాఠశాల ఇందుకు మినహాయింపు కాకపోవడమే విషాదం. ఈ పాఠశాలకు చెందిన పలువురు మాజీ విద్యార్థులు తమ మీద జరిగిన అత్యాచారాల గురించి 2009లో ఫిర్యాదు చేశారు. తమకు పాఠాలు చెప్పినవారే ఇలాంటి దారుణాలకు ఒడిగట్టారని ఆ పిల్లల ఫిర్యాదు సారాంశం. వీటి మీద ఇంతవరకు చర్యలు లేవు. కానీ అర్జంటైనాలో మాత్రం ఇదే ఆరోపణ మీద కొందరు మాజీ ఉపాధ్యాయులను అరెస్టు చేశారు. ఈ నాటకాన్ని అతడు తన ఇద్దరు కుమారులకు మొదట చదివి వినిపించాడు. తరువాత ఫ్రాన్స్‌లోని చాలా నాటకశాలలో ప్రదర్శించాడు కూడా. ఫ్రాన్స్ ‌కేథలిక్‌ ‌టెలివిజన్‌ ‌నెట్‌వర్క్ (‌కేటీఓ) కూడా దీనిని ప్రసారం చేసింది. ఎందుకంటే తన లాగే తన కొడుకులు చర్చ్ ‌బాధితులు కాకూడదని హెచ్చరించడానికే.

(ది ఎకనమిస్ట్ అక్టోబర్‌ 11, 2021 ‌నుంచి)

About Author

By editor

Twitter
Instagram