సమస్యను పరిష్కరించుకోవడమనేది కాంగ్రెస్‌ ‌పార్టీ చరిత్రలో ఉండదు. సిద్ధాంతంలో కానరాదు. ఇలాంటి పార్టీ సంస్కృతే ప్రభుత్వ నిర్వహణలో కూడా కనిపించేది. దేశాన్ని చిరకాలం పట్టి పీడించిన చాలా సమస్యలకు ఆ పార్టీ నరనరాన జీర్ణించుకున్న ఈ తత్త్వమే కారణం. ఏ సంక్షోభమూ పరిష్కారానికి నోచుకోదు. దానికదే కునారిల్లుతుంది. లేదంటే ప్రజ్వరిల్లుతుంది. కాంగ్రెస్‌ ‌పార్టీ సీనియర్‌ ‌నేత, పంజాబ్‌ ‌మాజీ ముఖ్యమంత్రి అమరీందర్‌ ‌సింగ్‌; ‌పీసీసీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన నవజోత్‌ ‌సింగ్‌ ‌సిద్ధు వ్యవహారం ఇందుకు తాజా ఉదాహరణ. ఎలాంటి కీలక సమయం కావచ్చు. సరిహద్దు రాష్ట్రమైనా కావచ్చు. ఒక సంక్షోభాన్ని పరిష్కరించడం దగ్గర కాంగ్రెస్‌ ‌పార్టీకి ఎంతటి నిర్లక్ష్యం ఉంటుందో ఈ రాజకీయ పరిణామం మళ్లీ దేశానికి చెప్పింది. ఇదే కాదు, సంక్షోభ పరిష్కారం కంటే భేషజాల ప్రదర్శనే ఆ పార్టీకి ముఖ్యమన్న సంగతి కూడా మళ్లీ  మళ్లీ బయటపడుతూనే ఉంది. పంజాబ్‌ ‌నాయకత్వ మార్పు పరిష్కారం కాస్తా పార్టీ ఉనికికే ముప్పుగా పరిణ మించింది. ఇప్పుడు రాజస్తాన్‌, ‌చత్తీస్‌గఢ్‌లకు అదే జాఢ్యం వ్యాపించింది. అయినా జాతీయ నాయకత్వంలో చలనం లేదు. బీజేపీ మీద, బీజేపీ ప్రభుత్వం మీద, మోదీ మీద అర్ధం లేని పసలేని విమర్శలు గుప్పించే క్రమంలో సొంత పార్టీ కకావికలవుతున్నా  రాహుల్‌ ‌గాంధీకి పట్టడం లేదు. అదే ఆ పార్టీ నాయకుల బాధ. మొద్దు నిద్రలో ఉన్న అధిష్టానాన్ని కదపలేరు. పార్టీని వీడి వెళ్లలేరు. 

సోనియా గాంధీ మౌనంలో, రాహుల్‌ ‌గాంధీ వైఖరిలో నిజంగా ఉన్నది ఏమిటి? 2019లో రాహుల్‌ ‌గాంధీ పార్టీ అధ్యక్ష పదవి నుంచి వైదొలిగారు. కానీ రాహుల్‌, ‌నెహ్రూ-గాంధీ కుటుంబమే కాంగ్రెస్‌కు దిక్కు అన్న సంగతి దేశం మరచిపోకుండా ఉండేందుకు వార్డు కమిటీల నుంచి, పీసీసీల వరకు రాహుల్‌ ‌తిరిగి అధ్యక్ష పదవి చేపట్టా లంటూ అడపా దడపా తీర్మానాలు చేస్తున్నాయి. నిజానికి రాహుల్‌ ‌పార్టీ అధ్యక్షుడు కావాలనుకుంటే దానికి అడ్డు చెప్పేవారే ఉండరు. కానీ అది కూడా తేల్చకుండా నాన్చుతున్న నాయకుడి వైఖరే జి23 వంటి అసమ్మతి గళాలు తయారు కావడానికి వాతావరణం కల్పిస్తున్నది. నిరుడు ఏర్పడిన ఈ జి 23లో ఉన్నవారంతా సోనియాకు అత్యంత విధేయులే. కపిల్‌ ‌సిబల్‌, ‌శశి థరూర్‌, ‌పి. చిదంబరం, ఆనంద్‌ ‌శర్మ ఎవరిని తీసుకున్నా నెహ్రూ కుటుంబానికి విధేయులే. కానీ 1969లో ఇందిర ఆలోచించినట్టు సోనియా కూడా ఆలోచించాలని ఎవరైనా సలహా ఇస్తున్నారా? నెహ్రూ ఇందిర విషయంలో చేసినా, ఇందిరా గాంధీ సంజయ్‌ ‌గాంధీ కోసం చేసినా ఇదే. సీనియర్లను తప్పించి, వారసులకి మార్గం సుగమం చేయడమే. అలాగే ఇప్పుడు రాహుల్‌ ‌గాంధీ విధేయులనే పార్టీ ఉన్నత స్థానాలలో నింపే పనిలో సోనియా ఉన్నారని కొందరు విశ్లేషిస్తున్నారు. వాస్తవానికి ఆ అవసరం లేదు. అధ్యక్ష మకుటం ఆయన కోసమే వేచి ఉంది. కానీ ఆ పార్టీలో పరిణామాలను చూస్తే ఆ విశ్లేషణను పూర్తిగా కొట్టివేయడానికి కూడా లేదు.

కొత్త అధ్యక్షుడు ఎప్పుడు?

పంజాబ్‌ ‌రాజకీయ పరిణామాలు కాంగ్రెస్‌ ‌పార్టీ నాయకులను బాధిస్తాయి. పార్టీ భవిష్యత్తు గురించి ప్రశ్నలూ లేవనెత్తుతాయి. పార్టీ 136వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఢిల్లీలో దీన్‌దయాళ్‌ ‌మార్గ్‌లో కొత్తగా నిర్మించిన పార్టీ కార్యాలయంలోకి మారాలని కాంగ్రెస్‌ అధిష్టానం ముహూర్తం పెట్టింది. కానీ అప్పటికైనా పార్టీకి పూర్తి సమయం పనిచేసే అధ్యక్షుడు కనిపిస్తాడా? అన్న ప్రశ్న  సాధారణ కార్యకర్తలలో వచ్చింది. అంతేకాదు, పార్టీ అంతవరకు మరొక చీలిక రాకుండా నిలబడుతుందా అన్న పెద్ద ప్రశ్న నాయకులకూ వచ్చింది. పరిణామాలు ఆ దిశగానే సాగుతున్నాయి. కాంగ్రెస్‌కు గతంలోను అలాంటి అనుభవాలకు లోటు లేదు. పంజాబ్‌ ‌ముఖ్యమంత్రిగా అమరీందర్‌ ‌రాజీనామా చేసిన సమయంలోనే చోటు చేసుకున్న పరిణామాలు కూడా కాంగ్రెస్‌ ‌నేతలలో ఖేదాన్ని కలిగిస్తాయనడానికి ఎలాంటి సందేహం అక్కరలేదు. అదే సమయంలో పైన ప్రస్తావించిన ప్రశ్నలను సంధించుకునేలా చేస్తాయి. ఇదంతా కాంగ్రెస్‌ ‌నాయకులకే కాదు, ప్రజాస్వామ్యం మీద గౌరవం కలిగిన వారికి కూడా ప్రశ్నే. అమరీందర్‌ ‌సింగ్‌ ‌వంటి నాయకుడు వెళ్లిపోవడానికి అధిష్టానమే పరిస్థితులు సృష్టించడం ఒకవైపున. టుక్డే టుక్డే గ్యాంగ్‌ ‌ఫేం కన్హయ కుమార్‌ను పార్టీలోకి తీసుకోవడం, పాక్‌ అనుకూలుడని సాక్షాత్తు మాజీ ముఖ్యమంత్రి ఆరోపించిన సిద్ధును పార్టీలో కొనసాగేటట్టు చేయడానికి తలకిందులుగా తపస్సు చేయడం చూస్తే ఆ పార్టీ ప్రస్థానం గురించి సందేహాలు వస్తాయి. గుజరాత్‌కు చెందిన జిగ్నేశ్‌ ‌మేవానీ పార్టీలో చేరతాడని ముహూర్తం కూడా పెట్టాక ఆయన ఎన్నికల సమయంలో చూద్దాం అని చెప్పడం 135 ఏళ్ల కాంగ్రెస్‌ ‌విషయంలో జరగకూడనిదే.

నిర్ణయాలను నిలదీస్తున్న పెద్దలు

ఇంత పెద్ద పార్టీకి సంబంధించిన కీలక నిర్ణయాలు ఎవరు తీసుకుంటున్నారు? అంటూ సెప్టెంబర్‌ 29‌న ఒక సూటి ప్రశ్న అధిష్టానానికి వెళ్లింది. సంధించినది కూడా జి23. పంజాబ్‌ ‌పరిణామాల నేపథ్యంలో ఆ బృందం మళ్లీ ఒక్కసారిగా జూలు విదిలించింది. ఫలితమే ఆ ప్రశ్న. కాంగ్రెస్‌ ‌ప్రముఖుడు, న్యాయవాది కపిల్‌ ‌సిబల్‌ అయితే జి23 జీ హుజూర్‌ ‌దుకాణం కాదు అని బాహాటంగానే ప్రకటించారు. జి23 పార్టీ క్షేమం కోరుతూ వినిపిస్తున్న డిమాండ్లను అపబోదని కూడా ఆయన అన్నారు. అసలు పూర్తి సమయం అధ్యక్షుడు లేకుండా ఇంత పెద్ద నిర్ణయాలు ఎవరు తీసుకుంటు న్నారని కూడా సిబల్‌ ‌ప్రశ్నించడం విశేషమే. కానీ ఆ ప్రశ్నలోని సహేతుకతని పరిశీలించే నిర్మాణాత్మక దృష్టి పార్టీలో ఉన్నదా లేదా అన్నది కూడా సందేహమే. మరొక ప్రముఖుడు గులాం నబీ అజాద్‌ ‌కాంగ్రెస్‌ ‌వర్కింగ్‌ ‌కమిటీ సమావేశం ఏర్పాటు చేయాలని కోరారు. పేరు బయటకు రావడం ఇష్టం లేని ఒక కాంగ్రెస్‌ ‌నాయకుడైతే సోనియాకు నేరుగా లేఖ రాశాడని వార్తలు వస్తున్నాయి. పార్టీని మరమ్మతు కాదు, ప్రక్షాళన చేయాలన్నదే ఆ లేఖ సారాంశం.

కాంగ్రెస్‌ ‌పార్టీలో కొనసాగను (బీజేపీలో చేరను అని కూడా అన్నారు) అని అమరీందర్‌ ‌చెప్పడం, గోవా మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్‌ ‌ప్రముఖుడు లూజినో ఫెలేరియో హఠాత్తుగా తృణమూల్‌ ‌కాంగ్రెస్‌లో చేరిపోవడం, అంతకంటే ముందు మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ‌ముఖర్జీ కుమారుడు అభిజిత్‌ ‌ముఖర్జీ, సుస్మితాదేవ్‌ (‌కాంగ్రెస్‌ ‌మాజీ ఎంపీలు) కూడా టీఎంసీలో చేరడం ఆ పార్టీని పెద్ద కుదుపునకే గురి చేయవలసి ఉంది. కేరళ కాంగ్రెస్‌ ‌నాయకుడు వీఎం సుధీరన్‌ ఏఐసీసీ పదవులను వదిలి పెట్టేశారు. జ్యోతిరాదిత్య సింధియా మధ్య ప్రదేశ్‌ ‌నుంచి, జితిన్‌ ‌ప్రసాద ఉత్తర ప్రదేశ్‌ ‌నుంచి బీజేపీలో చేరిపోయారు. ఈ ఇద్దరు కూడా ఇప్పుడు బీజేపీ ప్రభుత్వాలలో మంత్రులు. కానీ రాహుల్‌ ‌వీటిలో ఏ పరిణామానికి చలించలేదు. ఎవరు వెళ్లినా లెక్క చేయం అన్న రీతిలోనే కాంగ్రెస్‌ అధిష్టానం ఉంది. ఈ నేపథ్యంలోనే నాయకత్వ సమస్య గురించి చర్చించడానికి వెంటనే సీడబ్ల్యుసీ సమావేశం నిర్వహించాలని జి 23 కోరడం పార్టీలో ఉన్న విభేదాలు యథాతథంగా ఉన్నాయనే చెబుతుంది. ఇవన్నీ సీడబ్ల్యుసీలో చర్చించవలసిన అవసరం ఉందా లేదా తేల్చుకోవాలని గులాం నబీ అధిష్టానాన్ని నిలదీస్తున్నారన్నమాటే. ఇలాంటివన్నీ బయట మాట్లాడితే పార్టీ పరువు పోతుంది. అందుకోసమైనా సీడబ్ల్యుసీని పిలవాలని మరొక నాయకుడు సోనియాకు లేఖ రాశారు. ఒక నిర్ణయం తీసుకోవాలంటే, ఒక అంశం మీద తీర్పు చెప్పాలంటే ప్రజాస్వామ్యంలో గుత్తాధిపత్యంతో సాధ్యం కాదని గాంధీజీ చెప్పిన మాటను కూడా కొందరు గుర్తు చేస్తున్నారు. కానీ గాంధీజీ ఈ గాంధీలకు గుర్తున్నాడా? అదే పెద్ద ప్రశ్న. మీరు వినండి. విన్న తరువాత మీ నిర్ణయం మీది. మా విన్నపాన్ని పట్టించుకోకపోయినా మీ ఇష్టం. కానీ ముందు వినండి అన్నారు కపిల్‌ ‌సిబల్‌.

‌ప్రజాస్వామ్యం గురించి చెప్పొద్దు

కాంగ్రెస్‌ ‌పార్టీలో ప్రజాస్వామ్యం గురించి మంచి మాట చెబితే అది వికటిస్తుంది. ఈ చేదునిజం కపిల్‌ ‌సిబల్‌కి గతంలో తెలుసునో లేదో! ఇప్పుడు మాత్రం తెలిసి వచ్చింది. ఇలాంటి ప్రకటన ఇచ్చిన తరువాత ఢిల్లీలోని చాందినీ చౌక్‌ ‌ప్రాంత కాంగ్రెస్‌ ‌కార్యకర్తలు వచ్చి ఆయన ఇంటి ముందు ధర్ణా చేశారు. ‘త్వరగా కోలుకో’ అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. నిజంగా పార్టీ గురించి మాట్లాడుతున్న సిబల్‌ ‌మానసిక ఆరోగ్యం బాగాలేదని వారి ఆరోపణ కావచ్చు. గతంలో ఆయన అదే నియోజక వర్గం నుంచి ఎంపీగా ఎన్నిక య్యారు. పార్టీ గురించి ప్రశ్నలు సంధిస్తారు గాని, తన నియోజకవర్గ ప్రజల బాగోగుల గురించి ఏనాడూ అడిగింది లేదని కూడా ఆందోళనకారులు నినాదాలు చేశారు. కాంగ్రెస్‌ ‌పార్టీ జాతీయ కార్యదర్శి మాకెన్‌ ‌మరొక అడుగు ముందుకు వేసి, తనకు రాజకీయ ఉనికిని ఇచ్చిన నాయకత్వం పట్ల ఇలా వ్యవహరించకూడదని సుద్దులు వినిపించారు. ఈ నీతులు సిబల్‌కే కాదట, ఆయనలా ప్రవర్తిస్తున్న మిగిలిన అంద•రికీనట.

అధికార కేంద్రాలు

కాంగ్రెస్‌ ‌పార్టీ నుంచి ఎవరు ఎప్పుడు బయటకు వచ్చినా, నిరసన గళం ఎత్తినా కొన్ని సత్యాలు అనుకోకుండా బయటపడుతూ ఉంటాయి. ఇప్పుడు కూడా అదే జరిగింది. అభిజిత్‌ ‌బెనర్జీ పార్టీని వీడిన తరువాత చేసిన ప్రకటన అలా కొన్ని  నిజాలను వెల్లడించేదే. సోనియా కాలం నాటి కాంగ్రెస్‌కీ, ఇవాళ్టి కాంగ్రెస్‌కీ చాలా తేడా ఉంది అని అన్నారాయన. ఇప్పుడు 24 అక్బర్‌ ‌రోడ్‌లో మూడు అధికార కేంద్రాలు ఉన్నాయి అని కూడా ఆయన చెప్పారు. ఈ శిబిరాలతోనే నిజమైన కాంగ్రెస్‌ ‌కార్యకర్తలు నిర్లక్ష్యానికి గురి అవుతున్నారని కూడా అన్నారు.

 పంజాబ్‌ ‌సమస్యనే చూద్దాం. ఆ సమస్యను పరిష్కరించామని ఢిల్లీ నాయకత్వం భ్రమ పడింది. దాదాపు సంవత్సరం నుంచి పంజాబ్‌లో నవజోత్‌ ‌సింగ్‌ ‌సిద్ధు పేరుతో ప్రవేశించిన అసమ్మతి ముఖ్య మంత్రి అమరీందర్‌ ‌సింగ్‌ను తొలగించినా వదల లేదు. మేం ఒక ఎస్సీ వర్గీయుడిని ముఖ్యమంత్రిని చేశాం అంటూ సవాలు చేసిన రెండు రోజులకే గాలి తీసేసినట్టయింది. ఆ గాలి తీసినవారు సాక్షాత్తు పంజాబ్‌ ‌పీసీసీ అధ్యక్షుడు సిద్ధుయే. పంజాబ్‌లో నాయకత్వం మార్చింది కాంగ్రెస్‌. ‌చిత్రంగా వెంటనే రాజస్తాన్‌, ‌చత్తీస్‌గఢ్‌ల నాయకత్వ మార్పు సమస్యలు పదునెక్కాయి. చత్తీస్‌గఢ్‌ ‌ముఖ్యమంత్రి మీద తిరుగు బాటు జెండా మరింత రెపరెపలాడింది. అలాగే రాజస్తాన్‌లో అశోక్‌ ‌గెహ్లోత్‌, ‌సచిన్‌ ‌పైలట్‌ల అసమ్మతి యుద్ధం రావణ కాష్టానికి తీసిపోదు. ఆ రెండు రాష్ట్రాలలోను నాయకత్వ మార్పే ధ్యేయంగా అసమ్మతి మండుతూనే ఉంది. అంటే పంజాబ్‌ ‌నిర్వాకంతో కాంగ్రెస్‌ ‌తమ పాలనలో ఉన్న రాజస్తాన్‌, ‌చత్తీస్‌గఢ్‌లలో అసమ్మతి వర్గానికి ఆశ కల్పించింది.

సమస్య జాతీయ నాయకత్వమే

నిజానికి కాంగ్రెస్‌లోని నాయకత్వ సమస్య రాష్ట్రాలకు సంబంధించినది కానేకాదు. అది జాతీయ నాయకత్వ సమస్య. సోనియా గాంధీ తాత్కాలిక అధ్యక్షురాలు. రాహుల్‌గాంధీ పదవి స్వీకరించకుండా అధ్యక్ష బాధ్యతలు అడ్డూ అదుపూ లేకుండా నిర్వర్తిస్తున్న నాయకుడు. 2019లో ఆయన పార్టీ పదవికి రాజీనామా చేశారు. అప్పటి నుంచి ఒక జాతీయ పార్టీకి, ఈ దేశాన్ని నాలుగున్నర దశాబ్దాల పాటు పాలించిన పార్టీకి పూర్తి సమయం జాతీయ అధ్యక్షుడు లేకపోవడం, రాకపోవడం ఆ పార్టీకే అవమానకరమైన విషయమని ఎవరికీ అనిపించడం లేదు. పార్టీ నాయకత్వం, రాజకీయాలు హాబీగా కాదు, తీవ్రంగా స్వీకరించే నాయకుడు కావాలని రాహుల్‌ను ఉద్దేశించి జి 23 పరోక్షంగా హెచ్చరించినా ఆయనలో మార్పు రావడం లేదు.

ప్రణబ్‌ ‌కుమారుడు అభిజిత్‌ ‌నిస్సంకోచంగా చెప్పినట్టు కాంగ్రెస్‌లో శిబిరాలు నిజమని నమ్మక తప్పడం లేదు. పంజాబ్‌ ‌పరిణామాలను పరిశీలించిన వారికి ఈ విషయం చాలా త్వరగానే అర్ధమవుతుంది. కాంగ్రెస్‌లో రెండు అధికార శిబిరాలు నిజమేనని నమ్మక తప్పదు. ఒకటి సోనియా గాంధీ శిబిరం, రెండు ఆమె సంతానం రాహుల్‌, ‌ప్రియాంకాలకు చెందినది. తొమ్మిదిన్నర సంవత్సరాలు పాలించి, 2017 నుంచి ప్రతి ఎన్నికలోను కాంగ్రెస్‌ను గెలిపిస్తూనే ఉన్న అమరీందర్‌ ‌సింగ్‌ను తొలగించి, అంతగా ప్రభావం చూపలేని చరణ్‌జిత్‌ ‌సింగ్‌ ‌చన్నిని ముఖ్యమంత్రిని చేయడంలో సోనియా సంతానం తనదైన పాత్రను నిర్వహించిందంటే ఎవరికీ సందేహం ఉండదు. సిద్ధుకు పీసీసీ బాధ్యతలు అప్పగించడం ప్రియాంక వాద్రా నిర్ణయమేనని వార్తలు వచ్చాయి కూడా. కానీ తాము నమ్ముకున్న సిద్ధు కూడా ఇంత భయానకమైన పరిణామాన్ని చూపుతాడని ఆ ఇద్దరు కూడా ఊహించలేదు. కాబట్టే వారి రాజకీయ అనుభవం మీద, నిర్ణయాల మీద సీనియర్లు ప్రశ్నలు సంధిస్తున్నారు. స్థిరత్వం లేని ఒక నాయకుడి కోసం, ఎన్నికల విజయానికి ఎంతమాత్రం హామీలేని బలహీన (కొత్త ముఖ్యమంత్రి) నేత కోసం అమరీందర్‌ను బలి చేసిన ‘అనుభవం శూన్య’ నాయకత్వం గురించే ఇప్పుడు ఆ పార్టీ బాధంతా. రాజకీయంలో ఇంత దారుణమైన జూదం ఇటీవలి కాలంలో ఎప్పుడూ లేదు.

సిద్ధును నమ్ముకుంటే..

తాను పీసీసీ అధ్యక్ష పదవికి రాజీనామా చేయడానికి సిద్ధు చూపిన కారణాలే హాస్యాస్పదం. పోలీసు డైరెక్టర్‌ ‌జనరల్‌గా ఇక్బాల్‌ ‌ప్రీత్‌ ‌సింగ్‌ ‌సహోతాను నియమించడం ఆయనకు నచ్చలేదు. బాదల్‌ ‌ప్రభుత్వం ఉన్నప్పుడు 2015లో బెహిబెల్‌ ‌కలాన్‌ ‌కాల్పుల ఘటన మీద దర్యాప్తు కోసం నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందానికి ఇక్బాల్‌ ‌నాయకుడు. అప్పుడు ఆ బృందం ఇద్దరు అమాయకులను బలి చేసిందని సిద్ధు ఆరోపణ. మరొకటి- రాష్ట్ర అడ్వకేట్‌ ‌జనరల్‌గా అమర్‌ ‌ప్రీత్‌ ‌సింగ్‌ ‌డియోల్‌ను నియమించడం. ఈయన మీద కూడా కేసులు ఉన్నాయని సిద్ధు ఆరోపణ. నైతికంగా రాజీ పడడం ప్రారంభిస్తే ప్రజా సేవ చేయలేమని పెద్ద పెద్ద మాటలే సిద్ధు చెబుతున్నారు. కానీ అవే ప్రమాణాల ప్రకారమైతే సిద్ధు నైతిక పతనం ఎప్పుడో పరిపూర్ణమైపోయింది. సోనియా, రాహుల్‌ ‌జమిలిగా చేసిన అక్రమాల గురించి ఒక్కసారి డాక్టర్‌ ‌సుబ్రమణియం స్వామిని అడిగితే తెలుస్తుంది. నేషనల్‌ ‌హెరాల్డ్ ‌పత్రికలో ఆ కుటుంబం చేసిన అక్రమాలు ఒక్కసారి సిద్ధు గుర్తు చేసుకోవాలి. అలాగే రాబర్ట్ ‌వాద్రా మీద వచ్చిన ఆరోపణల మాటేమిటి? రాజీనామాకు చెప్పిన మూడో కారణం మరీ హాస్యాస్పదం. ప్రభుత్వంలో కపుర్తల ఎమ్మెల్యే రానా గుర్జీత్‌ ‌సింగ్‌ను చేర్చుకోవడం సబబు కాదట. 2018 నాటి ఒక భారీ గనుల అక్రమ లావాదేవీలలో గుర్జీత్‌ ‌సింగ్‌ ‌ప్రమేయం ఉందని ఆరోపణలు ఎదుర్కొంటు న్నారు. యూపీఏ-1, యూపీఏ-2 ప్రభుత్వాల అవినీతి, పట్టుబడిన మంత్రుల సంగతి సిద్ధు ఇంత తొందరగా మరచిపోతే ఎలా? కాంగ్రెస్‌లో ఉంటూ అవినీతి గురించి మాట్లాడడం జుగుప్సాకరం. కాబట్టి సిద్ధు ఎజెండా వేరు. అందులో నైతిక విలువలు లేవు. కాంగ్రెస్‌ ఎం‌తకైనా దిగజారుతుందని చెప్పడానికి అమరీందర్‌ ‌సింగ్‌ ‌రాజీనామా చేసి, కాంగ్రెస్‌నే వీడుతున్నాను అని చెప్పిన తరువాత కూడా ఆ పార్టీ ప్రతినిధి సూర్జేవాల్‌ ‌చేసిన ప్రకటన నిరద్శనం. అమరీందర్‌ను తప్పించాలని 79 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలకు గాను, 78 మంది కోరారని సూర్జేవాల్‌ ఇప్పుడు చెబుతున్నారు. ఇది చన్ని, సిద్ధులలో ఎవరిని మెప్పించడానికి! అమరీందర్‌ ‌కేంద్ర హోంమంత్రి అమిత్‌షాను, రక్షణ సలహాదారు అజిత్‌ ‌ధోవల్‌ను కలుసుకున్న తరువాత ఈ సంగతి కాంగ్రెస్‌కు గుర్తుకు వచ్చింది. ఏమైనా సిద్ధును నమ్ముకుంటే ఏదో తోక పట్టుకుని గోదారి ఈదే ప్రయత్నం లాంటిదేనని తేలిపోయింది. అది పంజాబ్‌కు పరిమితం. రాహుల్‌ను నమ్ముకుని పార్టీలో ఉండాలంటే అలాంటి ఫలితమే ఉంటుందని జాతీయ స్థాయిలో కింది స్థాయి నాయకులకు, కార్యకర్తలకు ఎప్పుడు తెలుస్తుందో! కాంగ్రెస్‌ ‌పార్టీ అంటే ఆనాటి నుంచి శిబిరాల మయమే. తరువాత అసమ్మతి కార్యకలాపాల నిలయం. ఇక ఎప్పటికీ కుటుంబ పాలన.


నెహ్రూ హయాంలో ఇందిర, ఇందిర హయాంలో సంజయ్‌

‌కాంగ్రెస్‌లో వారసులను పీఠం దగ్గరకు తీసుకురావడం ప్రత్యేకమైన కళగా కనిపిస్తుంది. ఇప్పుడు రాహుల్‌కు అత్యున్నత పీఠం కట్టబెట్టేందుకు సోనియా అదే చేస్తున్నారని విశ్లేషకుల అభిప్రాయం. గతంలోను అంతే. ఎవరు విమర్శించినా ఆ పని ఆగదు. పైగా ఆ విమర్శలనే వారసులకు అధికార సోపానాలుగా మార్చే మీడియా, రాజకీయ దళారులు ఆ పార్టీ నిండా ఉంటారు. ఎందరో యోధాను యోధులను పక్కకు పెట్టి నెహ్రూ తన కుమార్తె ఇందిరను  కాంగ్రెస్‌ అధ్యక్ష పీఠం మీద కూర్చో పెట్టారు. కానీ ఇందిర హయాంలో కొంచెం వాతావరణం మారింది. శిబిరాలు మొదలయినాయి. సంజయ్‌ ‌గాంధీ శిబిరం అలాంటిదే. ఇవన్నీ చారిత్రక సత్యాలు. ప్రియరంజన్‌ ‌దాస్‌మున్షితో పాటు ఏకే ఆంటోని  ఒక్కరే సంజయ్‌గాంధీని విమర్శించడానికి సాహసించారని వికీలీక్స్ (2013)‌బయట  పెట్టింది. 1976లో గౌహతిలో జరిగిన ఏఐసీసీ సమావేశంలో సంజయ్‌ ఆధిపత్యం మీద విమర్శలు వచ్చాయి. సంజయ్‌ ‌గాంధీ నాయకత్వాన్ని అంగీకరించడానికి ఆయన పార్టీకీ దేశానికీ చేసిన సేవ ఏమిటని కేరళ కాంగ్రెస్‌ అధ్యక్షునిగా ఉన్న ఏకే అంటోనీ ప్రశ్నించారు. 1976 నాటికి భారతదేశం అత్యవసర పరిస్థితి నీడలో ఉంది. అప్పుడు సంజయ్‌ ‌గాంధీ ‘రాజ్యాంగేతర శక్తి’గా చెలరేగిపోయారన్న విమర్శ ఎప్పటికీ ఉంటుంది. అది పచ్చి నిజం.

ఇందిర నాయకత్వంలో కాంగ్రెస్‌ ఉన్నప్పుడు కూడా సంజయ్‌ ‌గాంధీ వర్గం అంటూ ఒకటి కాంగ్రెస్‌ ‌పార్టీలో కొనసాగింది. వీసీ శుక్లా, బన్సీలాల్‌ ‌మరికొందరు సంజయ్‌ అనుచరులగా పార్టీలో ప్రసిద్ధులయ్యారు. ఇందిర హత్య తరువాత సిక్కులను ఊచకోత కోసిన ఢిల్లీ కాంగ్రెస్‌ ‌నేతలలో ఎక్కువ మంది సంజయ్‌ అనుచరులేనని అనేవారు. నిజానికి ఎమర్జెన్సీకి సంజయ్‌ ఎం‌పీ కూడా కాదు. అయినా ఆయన కాంగ్రెస్‌లోనే కాదు, ప్రభుత్వంలో కూడా విశేష అధికారాలు చెలాయించారని ఆరోపణలు ఉన్నాయి. పదవితో నిమిత్తం లేకుండా గాంధీ-నెహ్రూ కుటుంబీకులకు పార్టీలో ఎంత పలుకుబడి ఉంటుందో చెప్పడానికి సంజయ్‌ ‌గాంధీని మించిన ఉదాహరణ మరొకటి లేదు. 1969 నాటి కాంగ్రెస్‌ ‌చీలిక కూడా పార్టీ అధినేత్రి, నెహ్రూ-గాంధీ కుటుంబీకురాలి పుణ్యమే.

రాష్ట్రపతి పదవి కోసం పార్టీ నిర్ణయించిన అభ్యర్థిని (నీలం సంజీవరెడ్డి) అక్కడ సమర్ధించి, తరువాత అంతరాత్మ ప్రబోధం పేరుతో తన అభ్యర్ధికి (వీవీ గిరి) ఓటు వేయమని కోరిన చరిత్ర ఇందరకు ఉంది. దీనితో మొరార్జీ దేశాయ్‌, ‌నాడార్‌, ‌పాటిల్‌ ‌వంటివారు కాంగ్రెస్‌ను వీడారు. పార్టీ మాత్రం తరువాత ఇందిర నడిపినట్టే నడిచింది.  అయితే ఏ సంక్షోభమైనా, అసమ్మతి అయినా నెహ్రూ-గాంధీ కుటుంబానికి అనుకూలంగా మార్చే తెలివిడి నాడు ఉండేది. ఇప్పుడు అది కొరవడింది. ఎన్ని చెప్పినా కాంగ్రెస్‌ ‌మనుగడ నెహ్రూ-గాంధీ కుటుంబం మీదే ఆధారపడి ఉందని ఆది నుంచి ఆ పార్టీ కార్యకర్తల దగ్గర నుంచి, నాయకుల వరకు నమ్ముతారనేది సత్యం. ఇప్పుడిప్పుడే అది భ్రమేననీ, అలాంటి పరిస్థితి నేడు లేదనీ నాయకుల స్థాయిలో అయినా ఒక దృక్పథం నిర్మాణమవుతున్నది. ఇందుకు జి 23 తొలి అడుగు కావచ్చు.

– జాగృతి డెస్క్

About Author

By editor

Twitter
Instagram