ఆమె మారింది – 17

– గంటి భానుమతి

వినీల, వినోద కన్నా విక్రాంత్‌ దగ్గరివాడు అన్న భావం ఆమెలో ఇప్పుడే కలుగుతోంది. పైగా స్కూళ్ళల్లో పిల్లల కోసం డాలర్లు పంపిస్తూంటాడు. ఈ విషయం ఒక్కసారి కూడా తనతో అనలేదు. ఒకరోజు పూర్తిగా తనతో ఉన్నాడు. తన గురించిన విషయాలు గొప్పలు చెప్పలేదు. తన ఇంటి వాళ్ల గురించి కాని, వాళ్లు చేసే ఛారిటీ గురించి ఏమీ చెప్పలేదు. విక్రాంత్‌ తనకి అర్థం కాలేదు. తను అర్థం చేసుకోలేదు. తను మారాలి. ఎదుటివాడు అర్థం కావాలంటే ముందు తనకున్న కళ్లజోడు తీసెయ్యాలి. లేదా కళ్లజోడుకున్న మురికిని శుభ్రంగా తుడిచెయ్యాలి. ఈ రెండూ చెయ్యకపోతే విక్రాంత్‌ని తను ఎప్పటికీ అర్థం చేసుకోనేరదు.

సాయంత్రం సుధీర, వినోద పాపాయిని చూసి వచ్చారు. ఇవాళ పాప రెండు రెప్పల్ని కలిపేసిన పొర విడిపోయింది. కళ్లు విప్పి చూసింది.

‘‘ఇవాళ చాలా సంతోషంగా ఉంది, పాపకి పేరు పెట్టు వదినా!’’

‘‘నేను పెట్టడం ఏంటీ? మీ వారిని, అత్తగారిని అడుగు. రోజూ వాళ్లతో మాట్లాడుతూంటావు కదా! ఈ విషయం రాలేదా?’’

‘‘నిజమే వదినా! మేము రోజూ మాట్లాడు కుంటున్నాం. అందులో నా పాప ఆరోగ్యం గురించి నేను చెప్తూంటాను. మా అత్తగారు, మా ఆడపడుచు అప్పడే పుట్టిన ఆమె కొడుకు గురించి చెప్పడం, ఈ మాటలు మాట్లాడకోడం తోనే సరిపోయింది. అయినా నాకు నచ్చిన పేరు నేను పెట్టుకోవచ్చు. నా ఇష్టం కాదనే వాళ్లులేరు. ఇది మా వ్యక్తిగతం!’’

వినీల అదృష్టవంతురాలు. తనకి నచ్చింది చేసుకోగలదు.

తను కూడా తనకి నచ్చింది చేసుకోగలదు. కాని, అసలు తనకి ఏం నచ్చుతుందో, తనకి ఏం కావాలో తనకే తెలీడం లేదు. స్వతంత్రం అను కుంటోంది కానీ ఆ స్వతంత్రం తనకి సంతృప్తిని ఇవ్వగలుగుతుందా! తనకి ఇప్పుడు ఏం కావాలో, ఏం చేయాలో అర్థం అవడం లేదు. తన గమ్యం ఏంటీ, గమనం ఆ వైపుగానే ఉందా, గమ్యం చేరుకోవాలంటే గమనం మార్చాల్సి ఉంటుందా?

పెళ్లయ్యి సరిగ్గా ఇరవై రోజులైంది. ఈ ఇరవై రోజుల్లో ఎన్నిసార్లు అమ్మతో మాట్లాడిరది. వేళ్ల మీద లెక్క పెట్టచ్చు. ఎందుకు మాట్లాడలేదు? మాట్లాడద్దని ఎవరూ అడ్డు పెట్టలేదు. కాని తనంతట తాను ఫోన్‌ చేసి మాట్లాడలేదు. అమ్మని మర్చిపోయేంతటి, చక్కటి వాతావరణంలో ఉందా?

అమ్మ ఎందుకు గుర్తురాలేదు? గుర్తు రానంత బిజీగా బిజీగా ఉందా? అమ్మ చేసినప్పుడు తను మాట్లాడిరది కానీ ఎక్కువ మాట్లాడ లేకపోయింది. ఈ ఇంటి సంగతులు కూడా ఎక్కువగా చెప్పలేక పోయింది. ఈ ఇంటి విషయాల్లో తప్పులు వెతకలేక పోయింది. ఎందుకని, ఈ ఇంటిని తన ఇంటిగా భావించిందా ! ఈ ఇంటి విషయాలు బయటి వాళ్లకి చెప్పకూడదని అనుకుందా ! అమ్మావాళ్లు బయటి వాళ్లల్లాగా అనిపించారా! ఈ ఇంటిని తన ఇంటిగా భావించిందా! కారణం ఏదైనా కానీ, తను ఎక్కువ మాట్లాడలేదు. అమ్మ కూడా అత్తగారితో మాట్లాడేది కానీ, సుధీర కివ్వండి అని అనేది కాదు. అమ్మ కూడా పెళ్లైయ్యాకా తనని పరాయిదానిగా చేసిందా!

విక్రాంత్‌తో ఓరోజు పరిచయం, అంతే. ఓ విధంగా విక్రాంత్‌ కూడా అపరిచితుడే. అత్తగారూ, మామగారూ, మామ్మ, సుబ్బాయమ్మ, నరసాయమ్మ, దుర్గ, వినీల, వినోద అందరూ పరాయి వాళ్లే. కానీ అందరితో ఇన్ని రోజులుఉంది. ఏ ధైౖర్యం తనని వీళ్లందరితో కలిపింది? అది ఎక్కడి నుంచి వచ్చింది? పెళ్లితో వచ్చిందా? ఈ పెళ్లి మూలంగా ఇంతమంది తెలియని వాళ్లు తన వాళ్లయ్యారు. అన్నీ బంధాలు.

ఇప్పుడు ఇక్కడ ఈ ఆసుపత్రిలోని వాళ్లందరూ కూడా, వినీలకి తను అక్కనని అనుకుంటున్నారు. అన్ని విషయాలు తనకే చెప్తున్నారు. ఏదైనా అడగాలన్నా తననే అడుగు తున్నారు. ఇదోరకమైన బంధం.

ఓ రెండు రోజుల్నించి సుధీరే వినీలని పాప దగ్గరకి తీసుకెళ్తోంది. పాపని ముట్టుకుంటోంది. తన చేతుల్ని వినీల చేతుల్ని దూదిని యాంటి సెప్టిక్‌ లోషన్‌లో పెట్టి, ఎంతో సున్నితంగా తుడుస్తోంది.

మొదటిసారి నర్స్‌కు కూడా ఎలా తుడవాలో చెప్పింది. మరో పాత్ర పోషిస్తోంది. ఓ నర్సుగా కూడా మారి పోయింది. పాప కూడా తనదేనా? కాదు , కాని రోజూ అలా తదేకంగా చూస్తూంటే పాప తన పాపే అన్నంతగా అనిపిస్తోంది ఆమెకు.

‘‘వినీలా! పాప కళ్లు తెరిచి చూస్తోంది. ఓ బొమ్మ చూసినట్లుగా చూస్తోంది. దృష్టి నిలపడం లేదు. అన్నీ క్లియర్‌గా కనిపించకపోవచ్చు కదా!’’ అని ఉత్సాహంగా సుధీర చెప్పేస్తోంది.

‘‘వినీలా! చూడు! కాలు మీద కాలు వేసింది. ముద్దొస్తోంది. పాప కూడా బాగా పుంజుకుంటోంది. టెంపరేచర్‌ మార్పు లేకుండా ఎక్కువా తక్కువా లేకుండా సరిగ్గా అలాగే ఉంటోంది.’’ అంది చార్ట్‌ చూసి. మొదట్లో వినీలని ఉత్సాహ పరచడానికి ఏదో అన్నా , తరవాత మాత్రం మనస్ఫూర్తిగానే అంటోంది.

‘‘చెస్ట్‌ ఎక్సరేలు కూడా క్లియర్‌గా, స్పష్టంగా ఉన్నాయని డాక్టర్లు అన్నారు కదా! అలాగే బ్రెయిన్‌ కూడా స్కాన్‌ చేసారు. అది కూడా అంతే అన్నారు. ఇంక ఫరవాలేదు వినీలా!’’

ఇలా ఎన్నో విషయాలు పాప గురించే ఆమెకి జరుగుతున్న ట్రీట్మెంట్‌ గురించే , దాని మీదే ఇద్దరూ మాట్లాడుకున్నారు.

‘‘ఇన్ని రోజులు పేరు పెట్టలేదు. ఓసారి మనం అనుకున్నాం కూడా, ఏదైనా మంచి పేరు సూచించమని. ఇప్పుడు పాప మన లోకంలోకి వస్తోంది. కొంచెం కోలుకుంటోంది. ఇంక ఉయ్యాలలో వెయ్యడం అదీ మా అత్తగారూ వాళ్ళూ వచ్చాకా చేయచ్చు. అప్పుడు వాళ్ల ముచ్చట కూడా

తీర్చినట్లవుతుంది. ఏం వదినా ఏవంటావ్‌…’’

‘‘ఏదైనా, ఓ గురువుని అడుగుదాం!’’ అదే విషయాన్ని వినోదని అడిగింది.

వినోద వెంటనే పుట్టినరోజూ తేది, నక్షత్రం, టైము అన్నీ వివరంగా ఓ పేపరు మీద రాసి ఇంటికి వెళ్తూ దార్లో ఓ కృష్ణుడి గుడి కనిపిస్తే అక్కడికి వెళ్లి

కనుక్కుంది. అక్కడ ఎవరూ లేరు. తన దగ్గరున్న కాయితాన్ని అక్కడున్న చిన్న పూజారికిచ్చింది. మర్నాడు వచ్చి, తీసుకుంటానంది.

అదే విషయాన్ని వినోద వచ్చినప్పుడు చెప్పింది.

‘‘నేను గుడికి వెళ్లినప్పుడు అక్కడ ఎవరూ లేరు. ఓ గంట కూచుంటే ఇలాంటివి బాగా తెలిసి ఉన్న పండితుడు వస్తారుట, కూచోమన్నారు. నాకు అక్కడ కూచునే టైము లేక వచ్చేసాను. అదంతా కాదు కాని, మనమే ఓ చక్కటి పేరు పెట్టెద్దాం. నామకరణం అదీ తరవాత చూద్దాం!ఏం సుధీరా ఏమంటావ్‌ నువ్వు!’’ అంటూ సుధీరని చూసింది వినీల.

‘‘నేను ఓ పేరు ముందే ఆలోచంచాను. మీరు చెప్పమంటే చెప్తాను’’

‘‘నువ్వు ఇప్పుడు పరాయి దానివి కావు. వినీల ఎంతో నువ్వు కూడా అంతే. స్వతంత్రంగా అన్నీ చెప్పచ్చు. మేమేం అనుకోం. అది వదిలెయ్యి. ఇప్పుడు చెప్పు. నువ్వు ఏ పేరు అనుకున్నావో!’’

‘‘నాకు ఇలా తోచింది. జీవితంతో యుద్ధం చేస్తోంది. అందులో విజయం లభించాలని కోరుకుందాం. అమృతం తాగి పెరిగేటట్లుగా అపరాజిత అని పెడదాం. ప్రతీ నిమిషం, అన్నిటికీ రాజీ పడుతోంది అందుకని రాజీ అని పిలుద్దాం!’’ ‘‘అని ఆగి, ఆ ఇద్దరిని చూసింది.

‘‘వండర్‌ఫుల్‌ ‘‘అంటూ సంతోషంగా ఇద్దరూ చప్పట్లు కొట్టారు.

సుధీరకి సంతోషం వేసింది. ఇంట్లో మనుషులకి స్నేహితులకి కొన్ని విషయాల్లో తేడా ఉంది. ఈ దగ్గరి తనం స్నేహితుల్లో తనకి కనిపించలేదు. వాళ్లతో ఇంత క్లోజ్‌గా ఉండలేదు. కొన్ని విషయాలు చెప్పడానకి ఇష్టపడలేదు. కొన్ని అభిప్రాయాలు ఎంతో ఆలోచించి చెప్పాలి. లేకపోతే మాట్లాడడం మానేస్తారు. కొన్ని చెప్పడానికి ధైర్యం కావాలి. స్నేహం నిలవాలంటే ఓ గీత గీసుకోవాల్సిందే. కాని ఇక్కడ ఏ గీతా లేదు. తన మనసులో ఉన్నది ఏ జంకు లేకుండా చెప్పింది

అపరాజిత సంగతి అందరికీ తెలిసింది. చుట్టాలు రావడం వినీలని చూడడం, ధైర్యం చెప్పడం, మెసేజ్‌లు. ఆ మెసేజ్‌లని ఇద్దరూ చూస్తూ పైకి చదువుతున్నారు. వివరాలు అడిగి తెలుసు కుంటున్నారు. ఏ రకమైన సాయం కావాలన్నా చెయ్యడానికి సిద్దం అంటూ వచ్చిన మెసేజ్‌లు ఎక్కువ.

వినీల అత్తగారూ, మామగారూ ఆమె ఆడపడు చులు అందరూ రోజూ ఏదో ఒక సమయంలో ఫోన్‌ చేస్తున్నారు. అందరితో సుధీర గురించి చెప్తూ పొగిడెస్తోంది. ప్రతీసారీ ఒకటే మాట, మా వదిన, అదే, పాపం! మొన్న పెళ్లైన అన్నయ్య వైఫ్‌. సుధీర ప్రతీక్షణం నా పక్కనే ఉండి అన్నీ తనే చూస్తోంది. పాపని నా కన్నా జాగ్రత్తగా చూస్తోంది. అని చెప్తూంటే సుధీరకి సంతోషం వేసింది. వాళ్ల పొగడ్తలు విన్నప్పుడల్లా ఆమెకు ఎక్కడో చిన్న సందేహం కలుగుతోంది.

తను ఎప్పుడైనా ఎవరి సాయాన్నైనా గుర్తించిందా! గుర్తించినా, దాన్ని పైకి వ్యక్తీకరించిందా! లేదు. ఆ గుణం తనలో లేదు. తను చదువుకుంది కానీ తనలో ఏదో లోపించింది. ఇది అహంకారం అంటారా ! తనేంటో తన తత్వం ఏంటో మెల్లగా ఒక్కొక్క రోజు గడుస్తున్న కొద్ది తెలుస్తోంది. తనలో చాలా లోపాలున్నాయి. అందుకు ఇప్పుడు తను చేయ వలసినది మానవ సంబంధాలని మెరుగు పరుచుకోవడం.

ఎప్పటిలాగే స్నానం చేసి బట్టలు మార్చుకోడానికి వినోద ఇంటికి వెళ్లింది. వెళ్లే సరికే ఇంటినిండా బిలబిల మంటూ మనుషులు హాలు నిండా కనిపించారు. ఆ వచ్చిన వాళ్లకి సుధీర ఎవరో వినోద పరిచయం చేసింది. అందరూ సుధీరని పొగిడేస్తు న్నారు.

‘‘ఈరోజుల్లో చదువుకున్న వాళ్లు, ఉద్యోగం చేస్తున్న వాళ్లు ఇలా ఎవరు చేస్తారు! ఇలా పై ఊరు వచ్చి ఆడపడుచు కోసం ఇక్కడే ఉండిపోవడం అన్నది మాటలు కాదు. చక్కటి అమ్మాయి. మీలో కలిసిపోయే అమ్మాయి!’’ నిజంగా తను అలాంటిదేనా, కాదు. ఈ ఇంటితో బంధాలు తెంచుకుందామని అనుకుంది. విక్రాంత్‌ నుంచి దూరంగా వెళ్లిపోదామనుకుంది. ఆ నిర్ణయం బలహీనమైంది. అందుకనే వీళ్లతో మనస్పూర్తిగా కలిసిపోయిందా!

ఆ తరవాత వాళ్లందరిని పరిచయం చేసింది. వాళ్లంతా ఎవరో వినోదకు ఏమవుతారో ఆ చుట్టరికం చెప్పింది. సుధీరకి అర్థం అవడానికి టైం పట్టేది. వీళ్లకి ఇంత మంది చుట్టాలా!

ఢల్లీిలో తమకి ఎక్కువమంది చుట్టాలు లేరు. ఉన్న చుట్టాలు ఢల్లీి చూడడం కోసం రావడం, స్టేషన్‌కి వెళ్లి వాళ్లని తీసుకురావడం, ఊరు చూపించడానికి అమ్మో, నాన్నగారో ఓ మూడు రోజులు వాళ్లతో ఉండడం, ఆ తర్వాత స్టేషన్‌లో దింపడం, రైలెక్కించడం. అంతే ఆ తరవాత వాళ్లు పత్తా ఉండరు. ఓ చిన్న థాంక్స్‌ కూడా ఉండదు. ఇలాంటి వాళ్లు తమ చుట్టాలు. ఉండడానికి తెలుగువాళ్లు మాత్రం చాలా మంది ఉన్నారు. అయితే వాళ్లు స్నేహితుల్లోకే వస్తారు. వాళ్ల మాటలు చేతలు అన్నీ పైపైనే. పార్టీలకి, గెట్‌ టుగెదర్‌లకి, పార్టీలకి మాత్రమే ఆ స్నేహం. అక్కడివరకే ఆ స్నేహం. ఆపైన గీత దాటడానికి లేదు.

ఇదే విషయం మామ్మ అన్నారు, పరిధిని పెంచుకోవాలని అన్నారు. అన్నీ సజావుగా జరుగు తున్నప్పుడు ఎవరూ మనకక్కర్లేదని అనుకుంటాం. అన్ని రోజులూ మనవి కావు. అవసరం అయినప్పుడు ఓ ఓదార్పు మాట, మాట్లాడేవాళ్లుం టారు. వాళ్లు డబ్బున్న వాళ్లే అవక్కర్లేదు. మనసున్న వాళ్లు, మానవత్వం ఉన్నవాళ్లు. అందుకే ఎవర్నీ దూరం చేసుకోకు అన్నారు. ఆ మాటలు తనకి వర్తిస్తాయా! కుటుంబంతో కలిసి పోవాలని చెప్పకనే చెప్పారా!

మొదట్లో విక్రాంత్‌ ఇంట్లో వాళ్లు, సౌత్‌ అనీ, పల్లెటూరు వాళ్లు అనీ ఓ తక్కువ ఇంప్రెషన్‌ ఉంది. అది తనకేకాదు. ఉత్తరాది వాళ్లందరికి ఉంటుంది. బెంగుళూరు సిటీ అయితే మాత్రం సౌత్‌ కదా! సిటీలో ఉంటున్నా అలాగే ఉంటారు, అన్న అభిప్రాయంలో ఉంది. కాని వీళ్లతో పోల్చుకుంటే తనకేం తెలీదు. వాళ్లకున్న జ్ఞానం తనకి లేదు. వాళ్లకున్న పరిపక్వత తనకి లేదు. ఆమాటకొస్తే తనకి అక్క రజనికి మధ్య కూడా దగ్గరితనం లేదు. చిన్నప్పుడూ లేదు. ఇప్పుడు కూడా లేదు. రజని కూడా ఎప్పుడు తనతో ఓ స్నేహితురాలిలాగా మాట్లాడదు. ఎప్పుడూ తన గొప్పలు, తన పిల్లల గొప్పలు, వాళ్లాయన గొప్పలు? వినడానికి విసుగుపుట్టేలా మాట్లాడుతుంది.

కానీ వినోద, వినీల ఎంత చక్కగా ఉంటారో! ఎప్పుడూ వాదించుకోకుండా, ఒక్కమాట మీదే ఉంటారు. అసలు వీళ్ల మధ్య పొరపొచ్చాలు రావా! వాదిచుకోరా! పైగా ఎప్పుడూ కూడా ఎవరి మీదా చెడు చెప్పగా వినలేదు. ఎంతో ఉన్నతంగా కనిపించారు. వాళ్లముందు తను మరుగుజ్జు.
ఆరోజుకి అపరాజితకి నాలుగు రోజులయ్యాయి. వినీలని డిస్చార్జ్‌ చేస్తామని అన్నారు.

‘‘ఎలా వెళ్లను సుధీరా! ఆ రోజుల పిల్లని తన సొంత వాళ్లెవరూ లేని చోట అలా వదలేసి వెళ్ళనా? నా ప్రాణాలన్ని ఇక్కడే ఉంటాయి. ఎలాగైనా నేను ఇక్కడే ఉండిపోయేలా ఏదైనా జరిగితే బావుంటుంది. నా రాజీకి అన్నీ తెలుసు, అది నా స్పర్శని గుర్తు పడ్తుంది. నా వేలు పట్టుకోగానే, ఆ పట్టుకున్నది నేనేనన్న సంగతి ఇట్టే పసిగట్టెస్తుంది. నేను సరిగా రావడం లేదని బాధ పడుతుంది. నేను ఇలాగే మంచం మీదే ఉండిపోతే బావుంటుందనిపిస్తోంది. నా మంచాన్ని రాజీ పక్కనే వేసుకుని ఉండాల్సింది. ఆ చిన్న చేతిని అలాగే పట్టుకుని ఉండాల్సింది. దానికర్థం అయ్యే భాషలో ఏదైనా చెప్పి ఉండాల్సింది. అవేం చెయ్యలేదు. అయినా వెళ్లాల్సొస్తోంది.’’

‘‘అలా అనుకోకు నీలా! నువ్వు ఎంత చెయ్యాలో అంతా చేసావు. అపరాజితకి బలం రావాలి. అన్నీ తట్టుకునే శక్తి రావాలి. అందుకోసమైనా దాన్ని ఇక్కడే ఉంచాలి. మనం చాలా అదృష్టవంతులం వినీలా! ఈ హాస్పటల్‌ పెద్దది కాబట్టి, ఈ విభాగం ఇందులోనే ఉంది. అన్నింట్లో ఇది ఇంత దగ్గరగా ఉండదు. ఈ ఫెసిలిటీ లేకపోతే ఇలాంటి పాపల్ని బయట ఉండే నియో నేటల్‌ కేర్‌ అని వేరే స్పెషల్‌ ఆసుపత్రులలో ఉంచుతారు. ఇక్కడ మంచి డాక్టర్లున్నారు. ఆ నర్సులూ, వాళ్ల అసిస్టెంట్లూ అందరూ కూడా ఈ ఇంటెన్సివ్‌ కేర్‌ నర్సరి కోసం ప్రత్యేకంగా ట్రెయినింగ్‌ అయినవారే. రోజుల పిల్లల్ని కూడా జాగ్రత్తగా హేండల్‌ చేయ్యగలిగే చాకచక్యం, నేర్పు ఉన్నవాళ్లు. నువ్వే చూసావుగా, చేతులకి,కాళ్లకి, ముక్కూ, నోరూ అన్నచోట్లా ట్యూబులు, వైర్లు ఉన్నాయో! బీపీ మానిటర్లు, వెంటిలేటర్లు, ఒకటా రెండా ఎన్నో దాని చుట్టూ ఉన్నాయి. ఇవన్నీ పెట్టి దానిని బతికించడానికి భగీరథ ప్రయత్నం చేస్తున్నారు. అక్కడున్న ప్రతీ పాపాయి వాళ్ళకి ఓ ఛాలెంజ్‌. ఇవన్ని ఆలోచించే వాళ్ళు ఆ ప్రి మెచ్యూర్‌ బేబీలని స్పెషల్‌ వార్డులో ఉంచుతున్నారు. బయటి వాతావరణానికి అలవాటయ్యే వరకూ ఆ ఇంక్యుబేటర్లలో ఉంచు తున్నారు. ఇంక కొన్ని రోజుల్లో దాని ఆరోగ్యం బాగయిపోతుంది. బరువు పెరుగుతుంది. మామూలు అయిపోతుంది. అప్పడు దాన్ని నీ గుండెల మీద పడుకో పెట్టుకోవచ్చు. ఆడిరచచ్చు. మీ ఇంట్లో కొత్త సభ్యరాలు. అందుకని ఇప్పుడు చక్కగా ఇంటికి ఏ మాత్రం భయం లేకుండా మనం వెళ్దాం. రాజీ ఒక్కత్తీ లేదు ,నేను రోజూ వచ్చీ చూస్తూంటాను’’ అలా సుధీర ఆమెని మానసికంగా తయారుచేసింది.

‘‘థాంక్యూ సుధీరా! నాకు ఎంతో మోరల్‌ సపోర్ట్‌ నిస్తున్నావు.’’

డిశ్చార్జ్‌ అయ్యే సమయానికి వినోద వచ్చింది. కట్టాల్సిన బిల్లులు అవీ కట్టేసింది. అన్ని ఫార్మాలిటీస్‌ పూర్తి అయ్యే సరికి ఒంటిగంట దాటింది. వినోద తీసుకొచ్చిన కార్లో వాళ్లింటికి వెళ్లారు. వినోద అత్తగారూ, మామగారూ చిరునవ్వుతో ఆహ్వానించారు. గదిని వెచ్చగా తయారుచేసారు. వెంటనే వినోద వేడి పాలు తీసుకొచ్చింది.

(ఇంకా ఉంది)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Twitter
Instagram