– డా॥ చింతకింది శ్రీనివాసరావు

జాగృతి – ఎండివై రామమూర్తి స్మారక నవలల పోటీలో ద్వితీయ బహుమతి పొందిన రచన

‘‘మహాజనులారా! నందరాజ్యవాసులారా! మీ అందరికీ రాజమాత మాకలిశక్తి తరఫున వందనాలు. ఆమెపై మీరు చూపిస్తున్న అభిమానాన్ని, నంద సింహాసనంపై మీ ఆదరాన్ని స్వయంగా వారికి మేం తెలియజేస్తాం. మాలాంటి లెంకలు ప్రతీ ఏటా ఇటిం పండగరోజుల్లో గ్రామగ్రామాన తిరిగి దేశిరాజుల త్యాగాన్ని ప్రచారం చేస్తున్న సంగతి మీకు తెలిసిందే. ఎంత తిరిగినా కొన్ని పల్లెలకు ప్రతీ ఏటా రాలేక పోతున్నాం. మీ ఊరికి మేం వచ్చి అప్పుడే మూడేళ్లయి పోయింది. అయినప్పటికీ మీరంతా కథాగానం విషయంలో మునుపటి శ్రద్ధాసక్తులే కలిగి ఉండటం నందరాజ్యం చేసుకున్న పుణ్యం.’’ ఈ మాటల్ని గణగణా పలుకుతూ ఊపిరి తీసుకోవడాని కన్నట్టుగా లెంక ఆగాడు. వెనువెంటనే ప్రజా సమూహంలో ఎవరో,

‘‘నందపురం వర్థిల్లాలి.. దేశిరాజులు త్యాగం నిరుపమానం.. జై నీలకంఠ.. జై జై నీలకంఠ..’’ ఆకాశాన్ని తాకేలా నినాదాలు చేశారు. అక్కడ కూడిన వారంతా అనుసరించారు.

కొన్ని నిమిషాల పాటు ధనుష్టంకారాల వంటి ఆ జయకారాలు రిప్పులు రిప్పులుగా మెట్టమీద కురిసిపోగా లెంకల ఆనందానికి అవధుల్లేవు.

నినాదాలు నెమ్మదించాక మళ్లీ ప్రధాన లెంక తన వాగ్విన్యాసాన్ని పునఃప్రారంభించాడు. జనమంతా చెవులు రిక్కించి వినడం మొదలెట్టారు.

‘‘మిత్రులారా ! ఇప్పడు దేశిరాజుల గాథను మీ కోసం మేం పాడబోతున్నాం. ఇది కథాగానం. పాట ఉంటుంది. అర్థతాత్పర్యాలూ ఉంటాయి. అంచేత మీకు బోధపడటానికి అడ్డుండదు.’’ ముఖ్యలెంక ఇలా అంటుండగానే అతని వంతలయిన ఇద్దరు లెంకలూ,

‘శరణు శరణు దుర్గాండ్లమ్మలు ` మీ చరణాలు తప్పలేము
మీ చరణాలు తప్పినగాని ` మీ కరుణాలు తప్పలేము
మీలాంటి కాలమురాగ ` తుమ్మెదీరో మిమ్ము తలచి పాడుతాము
ఇంటి ఇలవేలుపులార ` తుమ్మెదీరో మాయందున సాయముండుడు
శరణుబాబు దేశిరాజులు ` తుమ్మెదీరో శరణుబాబు శరణుబాబు..’

గీతాలాపన శ్రావ్యంగా, ఉద్వేగంగా ఆరంభించే శారు. కొండపదం తెలిసిన వేదిక కింది కొందరు వారికి వంతపాడుతూ పాటను మనసున పొదువు కున్నారు. దుర్గాండ్లకు, దేశిరాజులకు జోరలు సమర్పించిన లెంకలు మరిక ఆగలేదు.

‘రేపల్లె డేర్జాలకు తుమ్మెదీరో ` విధములేని ఆటలమ్మ తుమ్మెదీరో
ఆడతానె ఉన్నారమ్మ తుమ్మెదీరో ` పాడతానె ఉన్నారమ్మ తుమ్మెదీరో
వచ్చి వచ్చి రాజులేమో తుమ్మెదీరో ` తలఎత్తి చూడగలేము తుమ్మెదీరో
వారెబాబు దేశిరాజులు తుమ్మెదీరో ` వారెబాబు దుర్గాండ్లు తుమ్మెదీరో..’

గీతం అద్భుతమైన సరళిలో సాగిపోతోంది. రాగప్రస్తారం రంజితమవుతోంది. పాటకు కట్టిన మట్టు మహోన్నతంగా వినిపిస్తోంది. నందపురానికి చెందిన ఏడుగురు దేశిరాజుల, సప్తమాతృకలని పేరుపడ్డ మత్స్యరాజ్యపు ఏడుగురు దుర్గాండ్ల సమాగమాన్ని వర్ణిస్తోంది. తోడువాద్యాలు జతకావడంతో పాట పరిమళిస్తోంది.

గద్దె ముందు కూర్చున్నవారే కాదు. ప్రకృతి సైతం స్తంభించిపోయి వింటున్నట్టుగా మెట్ట మీది వాతావరణం అగుపించింది. ఉచ్ఛస్వరంతో బయల్పడుతున్న లెంక పాట, మనోధర్మంతో సాగుతున్న సంగతులు అందరిలాగానే కోలన్న పరివారాన్నీ సంబరంలో ముంచి తేలుస్తున్నాయి. గంగునయితే ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఆమెకు లెంకల స్వరం స్వరంలా కాక అమృతంపు సోనలా అనిపిస్తోంది. తీయని తేనె జల్లుజల్లుగా కర్ణాలలో కురిసినట్టు తలపోస్తోంది. ఆమె ఆనందానికి అవధుల్లేవు. ఆమె సంతోషానికి కట్టు కనబడటం లేదు. అయితే ఒక్కటే లోటు. లెంకల పాట బాగున్నప్పటికీ కథ మరింతగా అర్థమైతే బాగుండునని ఆ పిల్ల తలపోసింది. ఆ భావన రాగానే తల్లి ముఖంలోకి చూసింది. రేక కూడా ఎందుకనో ఆ సమయాన కూతురివైపే చూసింది.

‘గాయనం బాగుందా..’ కళ్లతోనే అడిగింది. అవునన్నట్టుగా నేత్రాలు నిగిడ్చి మౌనముద్రతోనే సమాధానాన్ని జాలువార్చింది గంగు. ఈ తరుణం లోనే ఈ సారి ప్రధాన లెంక గళం విప్పారింది.

‘మీ కోసమే వచ్చితిమి ` తుమ్మెదీరో
మా బాబు వెంకటేశు తుమ్మెదీరో ` మీకు మేనమామ అవుతాడు
మీ అమ్మ రాచగన్నియ తుమ్మెదీరో ` మాకు మేనత్త అవుతాది
ఆలకించిరి దుర్గాండ్లు తుమ్మెదీరో ` అలవిగాని ఆనందము తుమ్మెదీరో
దేశిరాజులు దుర్గాండ్లు ` కూడుకుని రతలైన ఎక్కినారు
రతాలైన వెడత ఉన్నయి ` పులులు దూరనట్టి పుల్లలైన సిడగలుబాబు
మామగాద మేనమామ ` మామగాద కన్నమామ
ఏడు ఘడియల శిక్ష తుమ్మెదీరో ` ఆత్మహత్యల పాలబడిరి తుమ్మెదీరో..’

ముఖ్యలెంక పాడుతున్నాడో లేక పదంలో మమైక్యమయ్యాడో చెప్పలేనంతగా చరణాలు సాగిపోతున్నాయి. అన్నింటికీమించి ‘ఏడు ఘడియల శిక్ష తుమ్మెదీరో ` ఆత్మహత్యల పాలబడిరి తుమ్మెదీరో..’ పంక్తులదగ్గరకు వచ్చేసరికి లెంక గొంతు జీరబోయింది. సజలనేత్రుడైపోయడు. వేదిక మీది మిగిలిన అందరి నేత్రయుగళాలూ లెంకగళం దైన్యం కావడంతో ధారాపాతంగా వర్షించడం మొదలె ట్టాయి. వాయిద్యాలు సైతం ఆ క్షణాన చేష్టలుడిగినట్టే అయిపోయాయి. వాటిని మోగిస్తున్నా అవి ఇవ్వాల్సినంత ధ్వని ఇవ్వలేకున్నాయి. ఔజపు చర్మాలు వజవజ వణికినట్టయ్యాయి. తూతుగొమ్ము రాగం తప్పింది. నాగస్వరం నాదరహితమైంది. ఆలకిస్తున్న గద్దెకింద ప్రజ స్థితీ ఇదే. అందరూ మొహమొహాలు చూసుకుంటూ దేశిరాజులకు పడిన శిక్షలను తల్చుకుని వాపోతున్నారు. వేదన చెందారు. రాజుల ఆత్మహత్యల పర్వాన్ని తలపోసి కళ్లనీళ్లు కుమ్ముకున్నారు. అందరితో పాటుగానే కోలన్నా రేకమ్మలూ ఎగసిపడుతున్న కన్నీటిని చేతులతో తుడుచుకుంటూ పాట వింటున్నారు.

చిత్రమేమిటంటే గ్రామప్రజావళిలో తరతమ భేదాలుండవచ్చు. అగ్ర, అంత్య తారతమ్యాలుండ వచ్చు. కానీ, కన్నీళ్లకు అలాంటివేం ఉండవు. అవి కలవారినీ లేనివారినీ ఒకలాగానే కరుణిస్తాయి. నిలువూనిపాతంగా నీరయ్యేలా చేస్తాయి. కొన్ని అంతే. వాటికి వారూ వీరూ అనే అసమానతలుండవు. వాటికి అందరూ ఒక్కటే. నవ్వుకు రంగులు, ఆకలికి వర్ణాలు, మనసు తడిసే ఏడుపుల్లో తేడాలు, తల్లి పడే పురిటినొప్పుల్లో హెచ్చుతగ్గులు ఉండవు. సమస్త ప్రపంచానికీ ఆకాశం ఒకటే అయినట్టు. ఉలి కదలికలకు ఏ శిల అయినా ఒక్కలా స్పందించినట్ట్టు. గద్దె కింది తొలివరుసల పెద్దవారు, వారికి అంటకుండా రాళ్లమీద వేరెక్కడో వెనగ్గా కూర్చున్న కోలన్న పరివారమూ కథ విని రోదిస్తుండటమే ఇందుకు నిదర్శనం.

ఇదేమీ పట్టించుకోని ప్రధానలెంక కన్నీరుపెడుతూనే పాటను ఇంకా ఇంకా పాడుకుంటూ పోయాడు. అలా కొంతసేపు కాదు. గొంతుక వెలివిరాసి పోయేటంతగా కొన్ని గంటల పాటు పాటు కథాగానాన్ని కొనసాగించాడు.

దేశీ సంప్రదాయ బాణీలో అక్షరసంపద లేనివారినీ ఆకట్టుకునేలా ఆలాపనలు చేశాడు.

నిర్వికార చిత్తంతో లెంకలను చూస్తూ, వారి గానాన్ని వింటూ, జనం కథలో కలగలిసిపోయారు.

అందరూ ఆ విధంగా అయిపోతున్నా గంగుకు మాత్రం ఇదంతా కొత్తగానే ఉంది. పాట మొత్తం అవగతమైనట్టు మనసుకు పడుతోంది. ఇంతలోనే మళ్లీ అవగాహనకు రానట్టు వేసట కలిగిస్తోంది. లయ హృదయాన్ని తాకుతున్నా భావం మటుకు పూర్ణంగా మెదడుకు చేరక బేల అవుతోంది. ఎందుకనో ఆ పిల్లకి ఆ వేళ కొంచెం భయమూ వేసింది. చిప్పిల్లిన నేత్రాలతో కథాగానం వింటున్న తల్లి దగ్గరకి జరిగింది. అమ్మఒడికి పారదలచిన బాలలా మరింతగా ఒరిగింది. చెంతచేరిన పిల్లను గద్దెవైపున్న చూపుల్ని మరల్చకుండానే దగ్గరగా లాక్కుంది రేకమ్మ. కొన్ని క్షణాలు గడిచాక ఒడిలో ఒదిగిన గంగువైపు చూసింది. తడిసిన నేత్రాల తల్లిని చూడగానే గంగుకు నోట మాటరాలేదు. అప్పుడిక రేకమ్మకు కూతురుతో మాట కలపాలని అనిపించింది.

‘‘అమ్మాయీ! పాట వింటుంటే పాలుపోవడం లేదా?’’ అనునయంగానే బిడ్డ వదనాన్ని చీర కొసతో తుడుస్తూ అడిగింది.

‘‘దేశిరాజులకు ఏమైందమ్మా! వాళ్లకి ఏదైనా హాని జరిగిందా? కథ మొత్తంగా తెలియడం లేదమ్మా!’’ అమాయకపు మేకపిల్లలా ప్రశ్నించింది. అప్పటికి పాప విషయం పూర్తిగా అర్థమైంది రేకమ్మకి. విషయం వివరించాలన్న యోచనతో,

‘‘ఇంతవరకూ పాటవిన్నావు కదా. ఇప్పుడు కథ కూడా చెబుతారు విను. బోధపడుతుంది. చిన్నపిల్లవి కాబట్టి లెంకలు పాడిన విషాదరాగాలు విన్నందుకు జడుస్తున్నావు. కథ మొదలైపోతోంది అటు చూడు.’’ తల్లి పలుకులతో గంగు తెప్పరిల్లింది.

‘కథ చెబుతారన్నమాట. తనకు కథలంటే ఎంతిష్టమో!’ మనసులోనే తలపోస్తూ గద్దెవైపు చూపులు ప్రసరింపజేసింది.

అప్పటికింకా మధ్యరాత్రి కాలేదు. పాట పుణ్యమో ఏమో ఎవ్వరికీ నిద్ర తలపన్నదే లేదు. ఇదంతా ఇలా ఉండగానే ప్రధానలెంక స్వరం ఖంగున మోగింది.

‘‘ఇప్పుడు దేశిరాజుల వృత్తాంతాన్నీ, వారి మరణాన్నీ, అందుకు పూర్వరంగమై నిలిచిన విషయాలను నా పక్కనున్న లెంకలు మీకు తెలియ జేస్తారు. కథగా పూసగుచ్చినట్టు చక్కగా చెప్పుకొస్తారు. మీ హృదయాల్లో చిరస్థాయిగా ముద్రవేసుకునేలా వల్లిస్తారు. సావధానచిత్తులై ఆకర్ణించండి.’’ అని గద్దె పక్కకు కాస్తంతగా జరిగాడు.

వెంటనే ఇరువురు లెంకలు స్వరతంత్రులు కదిలించారు.

‘‘అక్కలారా! అన్నలారా! సకలజగన్మిత్రులారా!! ఇప్పటివరకూ మీరందరూ నందరాజుల కథాగానాన్ని విన్నారు. ఆస్వాదించారు. ఇప్పుడు అర్థతాత్పర్యాలను ఆలకించబోతున్నారు. ఇదీ అసలు కథ. సిసలైన కథ. నందరాజ్యం వ్యధ. అవధరించండి.

అదిగదిగో వడ్డాది..

మత్స్యరాజ్యపెన్నిధి..

పదివేలమాయలు నేర్చిన పల్లపుమాయలనిధి.’’ అంటూ మొదలుపెట్టేశారు. అందరి దృష్టినీ ఒక్కసారిగా మత్స్యరాజ్యంవైపు మరల్చివేశారు.

ప్రియవచనమై, లయబద్ధమై, శ్రుతిశుభగమై, జనరంజకమై, స్వరితమె,ౖ వారు వినిపించిన ఈ వచన కథాసుధ మండివలస వాసులకే కాదు. మన్యవాసులందరికీ, భారతావని మొత్తానికీ, జగతిలోని సకల ప్రాణికోటికీ, ప్రకృతిలోని సమస్త జీవరాశికీ వినవచ్చేటట్టుగా ఇలా విపులంగా విస్తరించుకుంటూ వెళ్లిపోయారు…

****

క్రీస్తుశకం పన్నెండు, పధ్నాలుగు శతాబ్దాల్లో భారతదేశపు దక్షిణ కళింగాన మహావీరులైన మత్స్యవంశజుల ఏలుబడి సాగింది. బోయకొట్టమై ఖ్యాతినార్జించిన వైశాఖసీమకు, మన్నెకొట్టమని పేరుపడిన నందరాజ్యానికీ నడుమ నిలిచిన వడ్డాది రాజధానిగా ఈ పరిపాలన జరిగింది. ఓఢ్రభాష ప్రభావంతో ఉడ్రులక, వడబాడి, వడబాది నామధేయాలతో వర్థిల్లి, అనంతరకాలాన వడ్డాదిగా ఈ రాజధాని జనశ్రుతిలో పేరుపడిరది.

మత్స్యరాజులందరూ తాము మహాభారతంలోని విరాటరాజ వంశోద్భవులని నమ్ముతుండేవారు. పాండవులను అజ్ఞాతవాస సమయాన ఆదరించిన ప్రభువులుగా తమకు పేరుప్రతిష్టలు దక్కాయని గర్వపడేవారు. శ్రీకృష్ణభగవానుని తలపూవుగా తలచేవారు. రాజ్యపతాకంగా విరాటమత్స్య కేతనాన్నే ఎగురవేసేవారు. గంగపుత్రులుగా సముద్రాలను ఛేదించి మార్గాలను నిర్ణయించిన మహాప్రభువులమని విశ్వసించేవారు. నౌకానిర్మాణంలోనూ, నౌకా యానంలోనూ వడ్డాది ప్రభువులను మించినవారు ఇలలో లేరని ప్రజలు కీర్తిస్తుంటే పొంగిపోయేవారు. తూర్పున విశాఖ సముద్రం, పడమట నందరాజ్యం, ఉత్తరాన జంతరనాటి కాశీపురం, దక్షిణాన గోదావరి ప్రాంతాల హద్దులతో విలసిల్లుతుండేవారు. వైశాఖేశ్వరుని, సింహాచలేశునీ కొలుచుకుంటూ ధర్మబద్ధమైన విధానాలను అనుసరించేవారు. ప్రజాళిని కన్నవారిలా సాకేవారు.

తొలినాళ్లలో మత్స్యరాజ్యానికి తిరుగుండేది కాదు. అఖండశక్తితో, ప్రచండ బాహుబలంతో, చండతర సైనిక పాటవంతో, అసమాన రాజకీయ వ్యూహాలతో, అరివీర భయంకరమై విరాజిల్లేది. అటు సముద్రతలంమీద ఇటు ఇలాతలం మీదా తనదే ఆధిపత్యమన్నట్టుగా మత్స్య ప్రభువు ప్రతాపార్జున దేవరాజు మెరిసేవాడు. పిట్టగడ్డ, కల్యాణపు లోవ, తామరచర్ల, అర్జాపురం పేరిట ఉప రాజ్యాలను ఏర్పాటుచేసి జనక్షేమానికి పాటుపడ్డాడు. భారతీయ ధర్మప్రచారకుడైన ప్రతాపార్జునుడు జీవితమంతా ఆ నిష్టతోనే గడిపాడు. మానవతకు పెద్దపీట వేస్తూ వడ్డాది సింహాసనానికి కీర్తిని తీసుకువచ్చాడు. పండితులను పామరులను ఆదరించాడు. ప్రజా సంక్షేమం తప్పనిచ్చి మరోమాటే లేనట్టుగా నడయాడాడు. దిబ్బడ గ్రామాన్ని ఆస్థానంలోని వేదవేద్యులకు, పంచాంగకర్తలకు, వాస్తు శాస్త్రవేత్తలకు కానుక చేసి వారి దీవెనలు పొందాడు. దిబ్బడ గ్రామ నామాన్ని మార్చాడు. తండ్రి పేరిట జయంతి నారాయణపురంగా నామకరణం చేశాడు. తామ్ర శాసనమూ వేయించాడు.

రాజ్యంలోని దున్నేవారందరికీ మరింత మేలు కలిగేలా ప్రతాపార్జునుడు చేసిన యత్నాలన్నీ సత్ఫలితాలే ఇచ్చాయి. కర్షకులకు సేద్యపు భూములిచ్చాడు. దుక్కిదున్ని, మొక్కనాటి, కలుపుతీసి, కోతకోసే సమయంలో ఆర్థిక సాయం చేశాడు. పొలాలకు నీళ్లు తోలించాడు. వాగుల్ని సరిచేసి, వంకలను మలిపి, మెరక పొలాలను సుక్షేత్రాలుగా మలిచాడు. బంగారు పంటలు తీయించాడు. కళాకారులకూ తక్కువ చేయలేదు. వారికి గౌరవ భృతి కల్పించాడు. వారిని సింహాతలాటాలతో సత్కరించాడు. కవిగాయకులను పోషించాడు. సకల వర్గ సమభావనతో రాజ్యం చేశాడు.

అయితే, ప్రతాపుడి హయాంలో వడ్డాది అంతా సవ్యంగానే ఉందా? మత్స్యరాజ్యానికి ఒడిదుడుకులే లేవా? అంటే, లేవని చెప్పలేం. తూర్పు గాంగులు పక్కలో బల్లెంగా మారకపోలేదు. వారి వారసులుగా పైకి తేలి, ఓఢ్రకటకాన్ని పరిపాలిస్తున్న గజపతుల సంగతి చెప్పనక్కరలేదు. తూర్పు గాంగులతో వైవాహిక సంబంధాలను ఏర్పరుచుకున్న చోళులూ వైశాఖ సీమ పాలితులుగా అప్పటికే ఖ్యాతినార్జించి ఉన్నారు. కుళుత్తోంగచోళుడు విశాఖ సముద్రతీరాన తనకిష్టమైన కుమారస్వామిని వైశాఖేశ్వరునిగా నిలిపిన ఘనమైన ఘటనా చోటుచేసుకునే ఉంది. చాళుక్యల విషయమూ చెప్పదగినదే. ఎలమంచిలి గ్రామాన్ని కార్యస్థానంగా మలుచుకుని జయసింహుడు, కొక్కిలిభట్టారకుడూ రాజ్యలక్ష్మిని నడిపినవారే. అన్నిటికీమించి కటకంనుంచి కంచి వరకూ అధికారాన్ని పాకించిన గజపతుల బలిమికీ, కలిమికీ లోటులేదు.

ఆ వంక చోళులు, ఈ వంక చాళుక్యులు, మరువంక గాంగ గజపతులు అధికారదాహంతో మత్స్యదేశం మీద కన్నువేసి ఉండగా వడ్డాది ప్రభువు ప్రతాపార్జునదేవరాజు వీరందరినీ సామ, దాన, భేద, దండోపాయాలతో సమర్థంగా నిభాయించుకుంటూ వచ్చాడు. అంతటి వత్తిడిలోనూ ఆ మహారాజుకు పక్కనే ఉన్న కొండల నందరాజ్యమే కొండంత సాయం. కొండంత సాంత్వన.

నందరాజ్య ప్రభువులకు గిరికట్టుబాట్లు హెచ్చు. మహాకాళేశ్వరుడంటే అపారమైన భక్తి. భేతాళ దుర్గాభైరవులను పూజించడమే నిత్యవిధి. తమకు దక్కిన రాజ్యం దైవప్రసాదమనే చింతనతో సతతమూ కాలం గడిపేవారు. పరాయి సొమ్మును ఆశించేవారు కాదు. పరదేశం మీద దృష్టివేసేవారే కాదు. రాజ్యకాంక్ష వారి నెత్తురులోనే లేదు. అలాంటి కాంక్ష చెలరేగేవారిని చూసి విచిత్రపోయేవారు. ఆధ్యాత్మిక సుధామధురిమలతో పాలనావ్యవస్థను నడిపించేవారు. మహాశూరులైనప్పటికీ శాంతవర్తనులై సాగేవారు. మహాబలులైనప్పటికీ మౌనముద్రతోనే రాజ్యంచేసే వారు. ఆర్తులెవరు అర్థించినా సాయంచేసి పంపేవారు. బహుశా ఈ లక్షణాలే ధర్మప్రవర్తకులైన వడ్డాది మత్స్యరాజుల పట్ల వీరికి మక్కువకలిగేలా చేసి ఉంటాయి.

(ఇంకా ఉంది)

About Author

By editor

Twitter
Instagram