– భమిడిపాటి గౌరీశంకర్‌

వాకాటి పాండురంగరావు స్మారక దీపావళి కథల పోటీలో ద్వితీయ బహుమతి పొందిన రచన

ఏ స్త్రీ జీవితమైనా, అంతా ఒక మమకారాల చరిత్ర

– వాషింగ్టన్‌ ఇర్విన్‌

***

‘‘మా దేశంలో లేనిదేదో మీ దేశంలో ఉందని నేను ఇక్కడకు వచ్చాను. కానీ మనుషులు కలిసి ఉంటున్నా వారి మధ్య ఇంతింత దూరాలను ఎలా భరిస్తున్నారు? ఇదో టార్చర్‌ కాదా?’’ అన్నాడు రాబర్టు, నాతో.

రాబర్టు అమెరికా నుంచి విశాఖపట్నం వచ్చేసిన పేరు పొందిన క్రిమినల్‌ లాయర్‌. దశాబ్ద కాలంగా నాకు తెలుసు. నా మిత్రులు కొద్దిమంది ‘ఆయన’ నోటి చలువ వలన విడాకులు పొందారు. అయినా సంతోషంగా లేరు. తనకు నచ్చిన స్త్రీ, పురుషులతో క… ల.. సి… ఉన్నారు. కానీ కలసిపోయి లేరు. ఇది రాబర్టుకు తెలుసు. నేనో కళాశాల లెక్చరర్‌ని. వివాహం చేసుకోలేదు. ఎప్పుడు నేను రాబర్టుని కలిసినా మా మధ్య నా టాపిక్‌ వస్తుంది.

ప్రతి ఆదివారం మేము భీమిలి బీచ్‌కు వెడతాం. కొద్దిక్షణాలు డచ్చివారి సమాధుల వద్ద గడుపుతాం. అలా జనానికి దూరంగా, అలలకు దగ్గరగా ఓ రెండు గంటలు కాలం వెచ్చించి వెనక్కి తిరుగుతాం. ఇదిగో ఈ చర్చ మనదేశంలో పెరుగుతున్న విడాకుల గురించి..

‘‘నిజమే. నేనెక్కడో చదువుకున్నాను. శారీరక సుఖానికి, మానసిక వ్యధకు సంబంధం లేదని ఏనాడో తెలుసుకోవడం వల్లనేమో, ప్రతీక్షణం కీచులాడుకొనే దంపతులు కూడా పిల్లల్ని కనగలుగుతున్నారు. కానీ ఆ తరువాత వారి జీవితం వారి చేతుల్లోంచి జారిపోతున్నది.’’ అన్నాను, కాస్త వేదనగా.

‘కారణం?’` రాబర్టు ప్రశ్న

‘పిల్లలు కలగనంతవరకు వారి కోసం తపన, వారు పుట్టగానే వారికోసం జీవితాన్ని మార్చేసు కుంటారు. భార్యభర్తలు ఒకరినొకరు కోల్పోతారు.
‘ప్రేమ లేకనా?’ రాబర్టు సందేహం.

‘కాదు.. స్త్రీ, పురుషులకు ప్రేమ ఒక్కటి కాదు. దాని పట్ల ఇరువురికి వేరువేరు భావాలుంటాయి. డబ్బులాగ ప్రేమ ఒక శక్తి. ప్రేమ ప్రేరణగా, ఉపకరణంగా దేనినైనా సాధించకపోతే ఆ ప్రేమకు ఏ విలువా ఉండదు.

‘మీ దేశపు వివాహబంధం గొప్పదని.. మా దేశంలో చెప్పుకుంటారు కాని ఏదో బలహీనత సంసారాల్లో విషాదం నింపుతున్నదని నా భావన.’’ రాబర్టులో తెలియని కోణం ఏదో ఉంది. క్రమంగా బయటకు రావాలని అతని ప్రయత్నం.

అతనో గొప్ప న్యాయవాది. అవివాహితుడు. కోర్టులో అతను చేసే ఇంగ్లిషులో వాదన న్యాయమూర్తులను ఆశ్చర్యచకితులను చేస్తుంది. ఇంత ఎనర్జీ ఎలా సాధ్యం? నాకు ఆశ్చర్యం. అతన్ని ఎన్నోసార్లు అడిగాను ‘స్టడీ చేస్తా’ అని సమాధానమిచ్చి తప్పుకుంటాడు. మా సమయం ముగిసింది. బయలుదేరాం.

నన్ను ఆశ్చర్యంలో ముంచెత్తే రాబర్టుకు చెందిన ఓ విషయం నాకు రెండు రోజుల తరువాత తెలిసింది.

***

ఆ రోజు సాయంత్రం కాలేజీ నుంచి ఇంటికి వచ్చి నా రాతలేవో నేను చూసుకుంటున్నాను.

‘‘మీ కోసం ఎవరో రూపట. వచ్చింది.’ పని మనిషి చెప్పింది.

‘‘రూప? ఎవరు, ఎందుకు, అడిగావా?’’ అన్నాను.

‘‘లేదయ్యా. మీరు కావాలంది. లేరన్నాను. రాత్రికి వస్తారని చెప్పాను. రేపు ఉదయం ఎనిమిది గంటలలోపు వస్తానని చెప్పమంది.’’

‘‘సరేలే.’’ అన్నాను.

పనిమనిషి లోనికి వెళ్లిపోయింది.

నా పనుల కోసం నేనో మనిషిని పెట్టుకున్నాను. నాకు పెళ్లి చేయాలని, నన్ను చేసుకోవాలని ఎంతోమంది ప్రయత్నం చేసారు. హాయిగా ఉద్యోగం. మంచి జీతం. నడి వయసు. నా అన్నదమ్ములు నలుగురు. ఎవరి జీవితాలు వారివే. అత్తపోరు, ఆడపడుచు పోరు కూడా లేదు. నేనుంటున్న ఇల్లు కూడా నాదే. ఏమో, ఏదో సమయంలో నా మనసు మారవచ్చు. వివాహం దిశగా ఆలోచనలు మరలవచ్చు.

ఎవరీ రూప?

ఉదయం ఆరింటికే లేవటం నా అలవాటు. పనిమనిషి ఎనిమిదింటికి వస్తుంది. నేను తొమ్మిదికి కాలేజీకి వెళతాను.

డోర్‌ బెల్‌ శబ్దం.. వెళ్లి తీసాను.

ఎదురుగా ఓ అపరిచిత మహిళ. కూడా ఓ బాబు ఉన్నాడు. మూడు లేదా నాలుగేళ్లు ఉండచ్చు.

‘‘రండి కూర్చోండి. నా గురించి మీకు తెలుసా?’’ అన్నాను. ఆమె అశక్తిగా ఎదురుగా ఉన్న సోఫాలో కూర్చుంది. బాబు ఆమె ఒడిలో నిద్రపోయాడు. ఆమె కొంచెం పక్కకు జరిగి బాబును పూర్తిగా సోఫాలో పడుకోనిచ్చింది.

‘‘కొంచెం మంచినీళ్లు ఇప్పిస్తారా?’’ అంది రూప.

‘‘ఎంతమాట. ఓ గంటగడిస్తే కాని పనిమనిషి రాదు. పాలు వగైరాలు వంటగదిలో ఉన్నాయి. కావాలంటే.. అభ్యంతరం లేకుంటే మీరింత తాగి.. నాకింత ఇస్తే ధన్యున్ని’’ అన్నాను.

ఆమె నవ్వుతూ వంటింటి దారి అడిగింది. నేను చూపాను.

నేను, నా ఎదురుగా బాబు.

ఎవరీమె, నేనెలా తెలుసు, నా దగ్గరకెందుకు వచ్చింది. నేనేమి చేయాలి? కొంపతీసి నన్ను చుట్టుకోదు కదా. ఛ.. ఛ.. మనిషి చదువుకున్న దానిలా ఉంది. సంస్కారిలా ఉంది.

మనిషి జీవితంలో అద్భుతమైన సంఘటనలకి నాంది కూడా అతిసాధారణంగా ప్రారంభమవు తుంది. నిజమే.

నా ఆలోచనల మధ్య ఆమె నాకు టీ కప్పు అందించింది. టీ తాగుతూ ‘‘బాబుకు పాలు పట్టలేకపోయారా’’ అన్నాను.

‘‘వాడిరత వేగిరంగా లేవడు. ఆ సరికి మీ పనిమనిషి రావచ్చు. ఈలోగా నేనెవరో, ఎందుకు వచ్చానో మీకు తెలియలిగా. మీ సమయాన్ని నేను తిననులెండి క్లుప్తంగా చెబుతాను.

నేను వినటం ప్రారంభించాను.

***

ఒక స్త్రీ తన విలువల్ని ఎందుకు కోల్పోతుంది. భర్త, పిల్లలు ఉండి కూడా మరో వ్యక్తితో సంబంధం ఎందుకు?’’ నారాయణ ప్రశ్న.

‘‘ఒక భార్య తన మనసులో నిర్లిప్తతని భర్తకు చెప్పుకోలేని ప్రపంచం ఇది’’ అంది రూప.

‘‘నీకు నవలలు చదివే అలవాటు ఉందా?’’ నారాయణ సూటి ప్రశ్న.

‘‘నేను పి.జి. విద్యార్థినని మరచిపోతున్నావు. అయినా నా మాటలకు నీ రియాక్షన్‌ అలా ఉంటే. ఇక నేను చెప్పింది పూర్తిగా వింటే నీ రియాక్షన్‌ ఎలా ఉంటుందో..’’ రూప గొంతులో జీర.

‘‘ఏంటది?’’

‘‘నేనిప్పుడు ఒట్టి మనిషిని కాను..’’

వారి మధ్య ఐదు నిమిషాల వరకు మాటలు లేవు.

‘‘నీవు ఆపరేషన్‌ చేయించుకోలేదా?’’ నారాయణ గొంతులో ఆశ్చర్యం. మళ్లీ అతనే ‘‘నేనింకా చాలా ఎదగాలి. సమాజంలో నాకంటూ ఓ హోదా, డబ్బు, పలుకుబడి ఇవన్నీ కావాలి. నువ్వు కూడా. కానీ వివాహితవు.. ఎలా?’’ అతని గొంతులో భయం, ఆవేదన.

‘‘నిజమే. నేను వివాహితనే. నా భర్త, పిల్లలను వదులుకొని నీతో రావాలనుకున్నాను. కానీ నీలో నీ పట్ల నీకే తెలియని అయోమయం. భారతీయ స్త్రీ అంటే నాలాగే ఉంటుందని కూడా నీవనుకోవచ్చు. ఆడవారంటే నాలాంటి వారేనని కూడా అనుకోవచ్చు. దా.. ఇలా కూర్చో. ఇది నీ ఇల్లు. ఎన్నోసార్లు ఇది మన ఇల్లు అని నీవే అన్నావు కదా. ఇదే మంచంపైన ఎన్నోసార్లు….’’ ఆమె ఆగింది. తలవంచుకుంది. ఆయాసం, నిస్సహాయత ఆమెలో.

మళ్లీ ఆమే ‘‘ఓడిపోవడం నాకు నచ్చదు.. గెలిచేవరకు పోరాటం చేయాలి. గంగా, శకుంతల కథలు నాకెంతో ఇష్టం. నీ బిడ్డ నాకు కావాలి. నా సంసారం నాకెందుకు వద్దో నీకు చెప్పదలచుకోలేదు. అది నీవు వినలేవు కూడా. ఎందుకంటే బరితెగించి, ఉద్యోగం చేస్తున్న ఆడదంటే ఈ సమాజానికో చిన్నచూపు. ప్రతీవాడు ఆమెను వాడుకోవాలనే చూస్తాడు. ఆదుకోవాలనుకోడు…’’ ఆమె ఆవేదన.

‘‘కానీ నేను అటువంటివాడిని కాను. కాస్త ఎదగటానికి నేను చేస్తున్న ప్రయత్నాలు నీకు తెలుసు. ఇప్పుడిప్పుడే నాకంటూ ఓ స్థానం దొరుకుతున్నది. నీవు లేని జీవితం కూడా నేను ఊహించలేను. నేను ఈ ప్రాంతం వాడిని కాను. ఎక్కడినుంచో వచ్చినవాడిని. నీవు దొరికావు. కానీ నా పరిస్థితి.. ఆలోచిస్తున్నాను. అంతే.’’ నారాయణ ఆవేదన.

‘‘నీవు దొరికావు అనే మాట నాకు నచ్చలేదు. స్త్రీలలో బేలతనాన్ని, ఆధారపడే గుణాన్నీ ప్రేమించినంతగా మరిదేన్ని ప్రేమించడు పురుషుడు. చాలామంది పురుషులు ఎందుకీ ఆడవారు పక్కదారులు పడతారని నా వెనుక ప్రశ్నిస్తారు. నాకు వినబడే విధంగానే సుమా..’’ అంది.
వారి మధ్య మరోసారి నిశ్శబ్దం.

నారాయణ బయటనుంచి తెప్పించిన టిఫిన్‌ తిని టీ తాగింది.

క్షణకాలం తరువాత ‘‘ప్రతి స్త్రీ చుట్టూ కొన్ని నైతిక సూత్రాల చట్రం నిర్మించి ఉంటుంది. ఇది సమాజం, పురుషులు నిర్మించినది కాదు సుమా. తనకు తానే ఏర్పాటు చేసుకొన్నది. అది ఛేదించటంలో ఆమెలోని అంతర్మధనం, ఘర్షణ ఎవరికీ తెలియదు. గట్టుదాటిన ప్రతివారు తనకు తానుగా ఓ వాదన నిర్మించుకుంటారని నీవనుకోవచ్చు. నా గురించి నీకు తెలుసు, నీ గురించి నాకు తెలుసు. మన గురించి నాకు తెలియాలి అంతే.’’ ఆమె ధృడంగానే నారాయణను అడిగింది.

‘‘నాకు కొంచెం సమయం కావాలి…’’ అతని సమాధానం.

‘‘ఎన్నాళ్లు? నెలా. ఆరు నెలలా. సంవత్సరమా. ఒక జీవితకాలమా. ఎంత సమయం కావాలి?’’ ఆమె ఎంతో కూల్‌గా ఈ ప్రశ్నలు వేసింది. ఆమె అతని పట్ల ఓ దృఢాభిప్రాయం కలిగి ఉంటుంది.

అతను ఏమి చెప్పలేకపోయాడు. ఓ మౌనం వెనుక ఓ ఘనీభవ స్థితి ఉంటుంది.
అదే ఆఖరు వారిద్దరూ కలుసుకోవటం..

***

పనిమనిషి వచ్చింది. మా ఇద్దరికి కాఫీలిచ్చింది. బాబుకు పాలిచ్చింది.

‘‘చెప్పండి. ఇప్పుడు నేనేం చేయాలి?’’ అన్నాను.

కథ చాలా ఇంట్రస్టింగ్‌గా ఉండటం వలన ఫోన్‌లోనే నా సెలవు సంగతి చెప్పాను. ఒకపూట సెలవుకు ప్రిన్సిపాల్‌ అంగీకరించారు.

‘‘లేవండి. స్నానం, పానం చేయండి. తరువాత తీరిగ్గా మాట్లాడుకుందాం.’’ అన్నాను. రూప లోపలకు వెళ్లింది.

నేను పనిమనిషితో ‘‘నీవు ఈ పూట ఇక్కడే ఉండు. ఆమెకు కావలసినవి చూడు!’’ అన్నాను. ఇటువంటి సన్నివేశాలలో పనిమనుషుల సాక్ష్యం ఎంతో అవసరం.

నేను బజారుకు వెళ్లి పాలు, కూరగాయలు తెచ్చాను. ఈ లోపల రూప చక్కగా తయారయింది. దబ్బపండు రంగు చదువుకున్న స్త్రీ. అందమైన పెద్ద కళ్లు. మగవాడు కోరుకునే శరీరాకృతి. చాలా బాగుంది. నాలో టీచర్‌ మేల్కొన్నాడు. సిగ్గుపడ్డాను.

అది గమనించి ఆమె అందంగా నవ్వింది. నాలుగు పదులు దాటిన స్త్రీ ఇంత హుందాగా ఉంటుందా?

భోజనాలు ముగించుకొని ఇంటికి వెళ్లి ఓ గంటలో వస్తానని పనిమనిషి వెళ్లిపోయింది.

‘‘నా పనేమిటో చెప్పలేదు’’ అన్నాను, రిలాక్స్‌డ్‌గా.

‘‘నారాయణ ఇక్కడే ఉన్నాడని తెలుసుకున్నాను. నేను ప్రస్తుతం హైదరాబాద్‌లో పని చేస్తున్నాను. బాబు నా తండ్రి ఎవరని అడుగుతున్నాడు. చివరి ప్రయత్నం చేద్దామని ఓ ఆలోచన. అంతే.. నారాయణ మీ మిత్రుడని కూడా తెలిసింది.’’

‘‘నా మిత్రుడా?!’’ నా ఆశ్చర్యానికి అంతు లేదు.

‘‘ఇదిగో నారాయణ ఫొటో చూడండి. మీ మిత్రుడని, మీరు అతనితో కలసి సినిమాలు, షికార్లు చేస్తారని కూడా తెలుసు. అతనింకా వివాహం చేసుకోలేదని కూడా తెలుసు. మీరు కూడా అవివాహితులేనట కదా. పని మనిషి చెప్పింది.’’ అంది నవ్వుతూ. ఆమె నవ్వులో ఏదో తెలియని ఆకర్షణ. ఎందుకో నాకు మధురవాణి నవ్వు గుర్తుకు వచ్చింది. పోలిక తప్పు కావచ్చు.

ఆమె బ్యాగ్‌లో నుంచి ఓ ఫొటో తీసి చూపించింది.

ఆ ఫొటో చూసి ‘‘ఇతనా.. నారాయణా?’’ నేను షాకయ్యాను. నా నోటి వెంట మాట రాలేదు.

‘‘అదేమిటి ఫొటో చూసి అలా ఉండిపోయారు.’’ అంది రూప.

నేను సర్దుకున్నాను.

‘‘నిజమే. ఇతను నాకు బాగా తెలుసు. ఇతని ఫోన్‌ నెంబర్‌ కూడా ఉంది.’’ అన్నాను.

ఆ క్షణంలో నాకో ఆలోచన కలిగింది.

అదే ఆమెకు చెప్పాను.

‘‘క్షమించండి. నేను ఇప్పుడతనిని వివాహం చేసుకోదలచుకోలేదు. అతనినే కాదు ఎవరినీ చేసుకోను. కేవలం నా బిడ్డకో తండ్రి ఉన్నాడని తెలియాలి. వాడు అనాథ కాదని అందరికి కాదు, కనీసం ఆ చిన్నవాడికైనా తెలియాలి. ఎవరడిగినా తనకో తండ్రి ఉన్నాడని, అతని అడ్రస్‌ ఇదని వాడు చెప్పాలి.’’ ఆమె మాటల్లో దృఢత్వం.

‘‘కాదు, జీవితంలో ఒకతోడు అవసరం కదా’’ అన్నాను. అందరం డైనింగ్‌ టేబుల్‌ చేరుకున్నాం. పనిమనిషి వడ్డిస్తున్నది. బాబు మొహంలో ఏదో తెలియని ఆనందం.

‘‘నాకు ఇప్పటికి అర్ధం కాని ప్రశ్న ఒకటుంది. కోపగించుకోనంటే అడుగుతాను.’’ అన్నాను ఆసక్తిగా.

‘‘మీ మీద కోపమెందుకు. ఆతిథ్యం ఇచ్చి గౌరవించినందుకా, అడగండి.’’ ఆమె మనోహరంగా నవ్వింది. ఆమె ముఖంలో ఏదో గ్రేస్‌నెస్‌ కనబడిరది.
‘‘మనిషి.. ముఖ్యంగా స్త్రీలు.. తెలిసి ఇటువంటి తప్పులెందుకు చేస్తారు?’’ అన్నాను.

మా మధ్య నిశ్శబ్దం.

ఆమె మెల్లగా పెరుగును అన్నంలో వేసుకుంటూ చెంచాను టేబుల్‌పై పడేసింది.

చిన్న శ్శబ్దం.

‘‘ఏ స్త్రీ తాను తప్పు చేయాలనుకోదు. వస్తువులు పగిలితే శబ్దం. మనసులు విరిగితే నిశ్శబ్దం. పెళ్లయి పిల్లలున్న స్త్రీ మరొకనితో బిడ్డని కనటం అనైతికం కదా. ఇది తప్పు. నిజమే. ఎందుకు చేసావంటే నా వాదన నాది. ప్రేమరాహిత్యం, అభద్రత, ఆత్మన్యూనతా. ఇవి ఆడవారికి శత్రువులు. ఇవే తప్పులు చేయిస్తాయి.’’ ఆమె గొంతులో వేదన, కనిపించని గిల్టీనెస్‌.

అందరం లేచాం. ఒక అరగంట విశ్రాంతి తరువాత ‘‘నేను బయలుదేరుతాను. బాబును నారాయణ దగ్గరకు చేర్చండి. ఆ తరువాత నా దగ్గరకు పంపేయండి. మీ నెంబరు ఇవ్వండి. నా నెంబరు అడగొద్దు. నేను ఎప్పటికి మిస్టరీగానే ఉండాలనేది నా ఉద్దేశం’’.
బాబును నా దగ్గర వదిలి ఆమె వెళ్లింది, మహాభారతంలో గంగలా.

ఆ మరుసటి రోజు కాలేజీకి సెలవుపెట్టి రాబర్టును కలిసాను. రూప సంగతి చెప్పాను. బాబును తన దగ్గరుంచుకొంటానన్నాడు. బాబు కూడా రాబర్టుకు చేరువయ్యాడు. నా బాధ్యత పూర్తయింది. ‘‘నేను హైదరాబాద్‌ వెళ్లాలి. సెంట్రల్‌ యూనివర్సిటీలో ఓ పదిహేను రోజులు ట్రైనింగ్‌ ఉంది. బాబు జాగ్రత్త’’ అన్నాను. రాబర్టు నవ్వాడు. బాబు నవ్వాడు. నేను నవ్వుకున్నాను.

నారాయణ.. రాబర్టు.. రూప.. బాబు.. ఏదో తెగని బంధం. విశ్లేషించుకుంటే మనుషుల ప్రవృత్తులంత కృత్రిమమైనవి మరేవీ లేవనుకుంటాననే ఓ రచయిత మాటలు గుర్తుకు వచ్చాయి.

‘‘ఒక్క నిమిషం..’’ రాబర్టు పిలుపు. నేను ఆగాను.

‘‘నేను భారతీయతను ఇష్టపడను. కారణం` అనేక దుర్లక్షణాలున్నాయి. నేను ఉదాహరణలతో వివరించగలను. నేను ఏవగించుకున్న క్షణాలున్నాయి. రూప కథ విషయంలో కూడా. కానీ భారతీయ ఆత్మలో, హిందూ సంస్కృతిలో, సభ్యతలో ఏదో అనిర్వచనీయమైన ఆకర్షణ, సాటిలేని సౌందర్యం, మహోన్నత్యం ఉన్నాయి. వాటిని అభిమానించకుండా, ప్రేమించకుండా ఉండలేను.’’ అన్నాడు బాబును గుండెలకు హత్తుకుంటూ అమెరికన్‌ రాబర్టు.

‘‘నారాయణ ఫొటో చూసిన తరువాత నేనెందుకు షాకయ్యానో మీకు చెప్పలేదు కదా. వదిలేయండి. కథ సుఖాంతం కదా!’’ ఆ గొడవలు మనకెందుకు? కాలానికి వదిలేద్దాం.

రచయిత పరిచయం

తల్లితండ్రులు నర్సింగరావు, అన్నపూర్ణ. శ్రీకాకుళం జిల్లా పార్వతీపురంలో పుట్టాను. గాయత్రి కాలేజీ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌లో తెలుగు అధ్యాపకునిగా పనిచేస్తున్నాను.
నేను రాసిన 105 కథలు, 80 సాహిత్య వ్యాసాలు వివిధ పత్రికలలో ప్రచురితమయ్యాయి. 7 కథా సంకలనాలు వెలువరించాను. వివిధ సంస్థల నుండి ఎన్నో బహుమతులు పొందాను. నా కథలపైన ఆంధ్ర విశ్వవిద్యాలయం విద్యార్థులు పరిశోధన చేస్తున్నారు.
‘ఏదో మహత్తు ఉంది!’కి ద్వితీయ బహుమతి ఇచ్చినందుకు జాగృతికి కృతజ్ఞతలు.

About Author

By editor

Twitter
Instagram