జాగృతి – ఎండివై రామమూర్తి స్మారక నవలల పోటీలో మొదటి బహుమతి పొందిన రచన

‘‘నేను స్నానం చేస్తాను. బట్టలు పెద్దగా ఏం తెచ్చుకోలేదు. తెచ్చుకున్నవి వాడేసాను. నైటీలున్నాయి. వాటిని పగలు వేసుకునే అలవాటు లేదు. సాయంత్రం బజారుకు వెళ్లి రెండు సూట్లు కొనుక్కుంటాను’’ అంది సుధీర.

‘‘నువ్వు డ్రెస్సులు కొనుక్కోవాలంటే కొనుక్కో. కానీ నైటీ వేసుకున్నా ఏం ఫరవాలేదు. మా ఇంట్లో ఆ పట్టింపులేం లేవు. నువ్వు పగలు నైటీ వేసుకున్నా, గౌను వేసుకున్నా, స్కర్ట్‌ వేసుకున్నా మా అత్తగారు, మామగారూ ఏం పట్టించుకోరు. అంతగా నీకు ఇక్కడ వేసుకోవడం ఇష్టం లేకపోతే నా డ్రెస్‌లున్నాయి. వినీల డ్రెస్సులున్నాయి. కొనక్కర్లేదు. అవి నీకు సరిపోతాయి.’’

లోపలికి వెళ్లి ఓ కాటన్‌ బ్లాక్‌ ప్రింట్‌ సల్వార్‌ కుర్తా, చున్నీ తెచ్చి ఇచ్చింది.

 సుబ్బరంగా తలస్నానం చేసి జుట్టు ఆర పెట్టుకుంటూంటే, ముగ్గురు కబుర్లు కులాసాగా చెప్పుకుంటున్నారు.

‘‘మీరు మాట్లాడుతూ ఉండండి. నేను మా వంటమనిషి ఏం చేస్తోందో చూసి వస్తాను. నీకు పత్యం కూరలు చేయమని చెప్పి వచ్చాను.’’ అంటూ వినోద కదిలింది.

‘‘ఏం కూరలు చేయాలో నీకెలా తెలుసు, మీ అత్తగారిని అడిగావా?’’ అడిగింది వినీల.

‘‘లేదు, ఆవిడకి కూడా పెద్దగా ఏం తెలీదు. పైగా అన్నీ తినచ్చు అంటారు. మొన్ననే మా కొలీగ్‌ కావేరికి డెలివరీ అయింది, ఆమెనే అడుగుదామను కున్నాను. మా వీధిలో ఓ లేడి డాక్టరుంది. ఆవిడ సలహా కూడా తీసుకున్నాను. ఆ తరవాత మన అమ్మమ్మ డాట్‌ కామ్‌ ఉండనే ఉంది. అందులో చూసాను. చాదస్తం అని కాదు కాని, ఆమె చెప్పిన దానితో నేను తృప్తిపడ్డాను. అందుకని నీకేం భయం లేదు’’ అని అక్కడినుంచి వెళ్లిపోయింది. ఎప్పటిలా మందులు అన్నీ వినీలకిచ్చింది సుధీర.

మరి కాస్సేపటికే సెల్‌ మోగింది. ఆ ఫోన్‌ శబ్దం వినగానే వినీల పరిగెత్తుకుని వచ్చింది.

‘‘సుధీరా అది ఎక్కడినుంచో చూడు, నాకు భయంగా ఉంది’’ అంది వినీల.

‘‘హాస్పిటల్‌ నుంచి’’ అని వినీల వైపు చూస్తూ ఆమె చేతికిచ్చింది సుధీర.

‘‘మిసెస్‌ వినీల’’ అంది అవతలి కంఠం. ఆ గొంతు వెనకాల నుంచి మానిటర్ల టిక్‌ టిక్‌, బీప్‌ బీప్‌ మిషన్ల శబ్దాలు వినిపిస్తున్నాయి. ఆమె గుండె ఆగినట్లయింది.

‘‘యెస్‌. స్పీకింగ్‌’’ అని అందర్నీ ఓసారి చూసింది. అంతా ఆమెనే ఏం జరిగిందన్నట్లు బొటన వేలుని ఊపి ప్రశ్నార్థకంగా చూస్తున్నారు.

‘‘నేను శంతనూ బెనర్జీ. స్పెషల్‌ కేర్‌ నర్సరీ డ్యూటీలో ఉన్న సీనియర్‌ హౌస్‌ ఆఫీసర్‌ని.’’

‘‘ఏం జరిగింది?’’ భయంగా అడిగింది.

 ‘‘పాప పరిస్థితి మామూలుగా లేదు. రాత్రి బ్రీతింగ్‌ కష్టం అయింది. ఒక లిప్త పాటు ఆగింది. గుండె కూడా చాలా స్లోగా కొట్టుకోవడం మొదలైంది. కారణాలు తెలీదు. న్యూమో థొరాక్స్‌ వచ్చింది. అంటే ఏంటో తెలుసా?’’

‘‘తెలీదు. ఎప్పుడూ వినలేదు.’’

‘‘ఇది ఓ అబ్‌నార్మల్‌ కండిషన్‌. లంగ్‌కి, ఛాతిగోడకి మధ్య గాలి చేరుకుంటోంది, దీనితో ఆక్సిజన్‌ తగ్గి బీపీ తగ్గుతుంది. ఊపిరితిత్తులు కొలాప్స్‌ అవడానికి కారణం అయింది.’’

ఆమె నోట మాట రాలేదు. మౌనంగా సెల్‌ని సుధీరకిచ్చింది. అంతా వినింది.

‘‘అయ్యో మరి ఇప్పుడు ఏం చేస్తారు?’’ అని భయంగా అడిగింది.

 ‘‘మేం అంతా చెయ్యాల్సినది చేసేసాం. చిన్న సర్జికల్‌ ఇనసిషన్‌ చేసాం. దానితో లోపల ఉన్న గాలినంతా బయటికి పంపేసాం. దీంతో ఊపిరితిత్తులు క్లియర్‌ అయ్యి, మామూలుగా వ్యాకోచం చెందింది’’

‘‘ఇప్పుడు ఫరవాలేదా, ప్రమాదం లేదు కదా, మరోసారి రావడానికి అవకాశం ఉందా?’’

‘‘ఇప్పుడు ఫరవాలేదని అనచ్చు. కాని ముందు ముందు రాదని మేము మీకు జోస్యం చెప్పము. ఏదైనా జరగచ్చు. అయినా మేం ఉన్నాం. ప్రస్తుతానికి ఏం భయం లేదు. మీ పాప సేఫ్‌ హాండ్స్‌లో ఉంది.’’

‘‘థాంక్యూ డాక్టర్‌’’ అని ఫోన్‌ వినీలకిచ్చి, డాక్టరు చెప్పిందంతా అక్కడున్న వాళ్లకి చెప్పింది.

‘‘ఇంత చిన్నరోజుల పాప. ఎన్నో ఇంకా ఎన్ని వినాలో, ఎన్ని ఆపరేషన్లు చెయ్యాలో.’’ అని పైకి అంటూ అందర్ని చూసింది.

‘‘ఏదో ఫోన్‌ వచ్చినట్లుంది. పాప ఎలా ఉంది. డాక్టర్లు ఏం అన్నారు?’’ అంటూ వినోద అత్తగారు వచ్చి, అక్కడున్న కుర్చీలో కూచున్నారు.

డాక్టరు చెప్పిన విషయాలనే వినీల చెప్పింది. చెప్తూ చెప్తూ వినీల ఏడ్చింది. ఆమె తలని తన భుజం మీదకి తీసుకుని తలనిమిరింది.

‘‘సుధీరా నువ్వున్నావు కాబట్టి, మాకు ధైర్యంగా ఉంది. ఇలాంటి సమయాల్లోనే కదా నేనున్నానంటూ మన దగ్గర మన వాళ్లుండాలి. ఇంకా మన మధ్య ఉండాల్సిన దగ్గరితనం రాలేదు. నువ్వు ఎలా ఉంటావో అనుకున్నాను. కానీ నువ్వు చాలా దగ్గరైపోయావు. థాంక్యూ సుధీరా’’ అంది వినీల.

సుధీర నవ్వింది. కానీ మాట్లాడలేదు.

నన్నింతగా పొగడాల్సిన అవసరం లేదు. నేను నాకు ఇష్టమై రాలేదు. విధిలేక, ఓ విధంగా చెప్పాలంటే అయిష్టంగా వచ్చాను. ఇక్కడినుంచి నేను మా ఊరు ఢల్లీి వెళ్లిపోవాలని అనుకున్నాను.. మళ్లీ మీ అందరిని కలుసు కుంటానని అనుకోవడం లేదు. కాని ఇప్పుడు నేను ఢల్లీి వెళ్లాలా, వద్దా, ఇక్కడే ఉండిపోవాలా? అన్నదాని గురించి ఆలోచించాలి అని మనసులో అనుకుంది.

‘‘వెళ్దామా, అపరాజితని చూడ్డానికి?‘‘ అంది వినీల, సుధీరని చూస్తు.

తల ఊపింది. చూడ్డానికి సుధీర, వినీల వెళ్లారు. వినోద పిల్లలకి పరీక్షలు, తొందరగా వచ్చేస్తారుట. అందుకని ఆమె రాలేదు.

నర్సరీలోకి వెళ్తూనే గాజు తలుపులు దాటు కుంటూ, హ్యూమిడ్‌గా, వేడిగా ఉన్నగదిలోకి వెళ్లారు. లోపలికి వెళ్తూనే చేతులు రెండూ లోషన్‌తో క్లీన్‌ చేసుకున్నారు. అపరాజిత ఉన్న దగ్గరికి వెళ్లారు. వైర్లు, ట్యూబుల మధ్య మొహం సరిగా కనిపించలేదు. కళ్లు మూసుకుని ఉన్నాయి. అయితే ఎప్పటి లాగా కాళ్లూ చేతులూ కదల్చడం ఆపలేదు.

వినీల తన చూపుడు వేలుని అపరాజిత చిన్న అరచేతిలో ఉంచింది. వెంటనే కాకపోయినా మెల్లగా పట్టుకుంది. ఆ పట్టు గట్టిగా ఉంది.

వెంటనే సుధీర వైపు తిరిగింది, ‘‘మొదటిసారి ఎలా పట్టుకుందో ఇప్పుడు కూడా అలాగే పట్టుకుంది. ఓ సారి నువ్వు పట్టుకో. అలాగే రెస్పాండ్‌ అవుతుందో లేదో చూద్దాం.’’

సుధీర వేలు పట్టుకోవడం మాట అటుంచి. ఎప్పుడు అంత చిన్న పిల్లలని చూడలేదు, చేతిలోకి తీసుకోలేదు.

ఒకసారి అంశు ఇంటికెళ్తే వాళ్ల పక్కింటి వాళ్ల పాపని తెచ్చి ఆడిస్తున్నారు. పాపకి ఆర్నెల్లుట. చక్కగా నవ్వుతోంది. అటూ ఇటూ తిరుగుతూ అందరినీ ఎంటర్‌టైన్‌ చేస్తోంది. ఆమెని చేతిలోకి తీసుకుంది. ఎత్తుకుంది. ఆడిరచింది. మెట్రోలో ఎక్కినప్పుడు, మాల్స్‌లో పిల్లలు కనబడితే బుగ్గలు పుణికేది. పేరేంటి అని అడిగేది. అంతే.

అలాంటిది నిండా వారం రోజులు కూడా లేని పాప, అరచేయంత ఉన్న పాప వేలు పట్టుకోగలనా! అనుకుంది. ఆ చిన్ని అరచేతిలో ఆమె తన వేలునుంచింది. అపరాజిత తన వేళ్లని అటూ ఇటూ కదిపితే వేలుని పట్టుకుంది, ఆ వేళ్లు గులాబీ రేకులంత మెత్తగా, మృదువుగా ఉన్నాయి. ఏదో విద్యుత్‌ ప్రవహించినట్లైంది. ఒళ్లు పులకరించింది. ఆమె వేలుని వదలడం లేదు.

సుధీర మెల్లిగా తన వేలుని తీసుకుంది. వెంటనే వినీల తన వేలుని అందించింది. ఆమె తనకు తోచింది ఏదో పాప చెవి దగ్గర అంటోంది. పాప కళ్లు తెరిచింది. వెంటనే వినీల తల ఎత్తింది, సుధీరని చూసింది.

‘‘సుధీరా పాప నా గొంతుని గుర్తు పట్టింది. నన్ను చూసింది. కళ్లు తెరిచింది. మా బంధం గట్టి పడుతుంది. ఇంక పాప ఆరోగ్యం బాగయిపోతుంది.’’ అంది సంతోషంగా.

అప్పుడే అక్కడికి వచ్చిన సిస్టర్‌ని పాప న్యూమోథొరాక్స్‌ గురించి అడిగింది.

‘‘అవునండి. ఓసారి పాపకి చేసారు. ఆ తరవాత బాగానే ఉంది.’’

‘‘అంటే ఇలాంటిది మళ్లీ రావడానికి ఛాన్స్‌ ఉందా?’’ ఆమె మొహంలోకి చూస్తూ ఆతృతగా అడిగింది వినీల.

‘‘ఏమో మేడమ్‌ ఏ క్షణంలో ఏం జరుగుతుందో ఏం చెప్పలేం. ఏదీ ముందుగా ప్రిడిక్ట్‌ చెయ్యలేం. ఇది లెక్క కాదు కదా మేడమ్‌, ఈ స్టెప్‌ తరవాత ఈ స్టెప్‌ వస్తుంది అని చెప్పడానికి. ఇది జీవితం. అనుకున్నట్లు ఏది జరగదు. జోస్యం అంతకన్నా చెప్పం’’ అక్కడున్న సిస్టర్‌ అంది.

మళ్లీ వినీల మొహంలో నీలినీడలు. ఇద్దరూ బయటికి వచ్చేసారు.

‘‘ఫరవాలేదు వినీలా అన్నీ సద్దుకుంటాయి. దేవుడి మీద నమ్మకం ఉంచు. అన్నీ ఆ దేవుడే చూసు కుంటాడు. ఏది ఎప్పుడు చెయ్యాలో వాడికే తెలుసు.’’

‘‘ఏమో సుధీరా, నేను ఓ ప్రపంచంలో ఉండి పోతున్నాను. అందులో అంతా భయం. ఏ క్షణం ఏం జరుగుతుందో అన్న ఆందోళన, ఆదుర్దా. అందుకే టెలిఫోన్‌ శబ్దం అంటేనే భయంగా అనిపిస్తోంది, ఏ వార్త తెస్తుందో అని. సుధీరా, దగ్గరివాళ్లని అందులో మరీ చిన్నపిల్లలని పోగొట్టుకోవడం కంటే దురదృష్టం మరొకటి ఉండదు.’’

జీవితంలో ఏదీ శాశ్వతంకాదు, ఏదీ ముఖ్యం కాదు అని అనిపించింది సుధీరకి. ఏ రోజున ఏం జరుగుతుందో తెలీదు. జీవితం ఎన్నిరోజులో తెలీనప్పుడు ఎందుకు ఈ పంతాలు, పట్టింపులు? అదే కాకుండా జీవితం ఎంత చిన్నదో ప్రతీ క్షణం తెలుస్తోంది. ఈ చిన్నజీవితానికి ఎన్నో రంగులు అద్దాలనుకుంటోంది. అవి శాశ్వతం కాదు, ఎక్కువ రోజులుండవు. చివరికి వెలిసి పోతుందేమో ననిపిస్తోంది. ఎందుకంటే ఏదీ కూడా తను అను కున్నట్లుగా జరగడం లేదు. జీవితం అంటే పెద్దగా అవగాహన లేని సమయంలో ఆనందాన్ని అనుభవించింది. ఇప్పుడే కాస్త అర్థం అవుతున్న సమయంలో కన్నీళ్లు వస్తున్నాయి. అంతలోనే తలుపుల శబ్దం వినపడిరది. ఓ నర్సు, ఓ ఆయా, ఇద్దరు డాక్టర్లు నిశ్శబ్దంగా లోపలికొచ్చారు. వాళ్ల చేతిలో చిన్న పాప ఉంది. పైపులు, వైర్లు, మానిటర్లతో సహా అంతకు ముందు మరో చిన్న పాపనీ తీసుకొచ్చి మరో చిన్న ఇంక్యూబేటర్‌లో ఉంచారు.

వీళ్ల జీవితాలు ఇంతేనా? అక్కడ ఉన్న ప్రతీ పాప కళ్లు మూసుకునే ఉంటోంది. కళ్లు మూసుకున్న ఆ కళ్లల్లో ఏవో కలలు ఉండి ఉంటాయి. అవి సాకారం అవకుండానే ఈ లోకం విడిచి వెళ్లిపోతే! లేదు లేదు. అలా జరక్కూడదు. ఈ పాపలు అందరూ బతకాలి. కిలకిలా నవ్వుతూ వాళ్ల తల్లితండ్రుల జీవితాలలో ఆనందం నింపాలి. చెడు ఆలోచనలు, వేరే ఊహలు మనసులోకి రాకూడదు అని కళ్లు మూసుకుని దేవుడిని కోరుకుంది.

ఈ కొద్ది రోజుల్లోనే అపరాజిత సుధీరకి ఎంతో దగ్గరైపోయింది. తన కూతురేమో అన్నంతగా ఆమెకి అనిపిస్తోంది. దేవుడు ఆ చిన్న పాప మీద పగ పట్టాడా, ముందు ముందు ఏం జరుగుతుందో అన్న భయం కలుగుతోంది. గంటలు ఒకదాని తరవాత మరొకటి జారుతూనే ఉన్నాయి. అన్నీ నిరాశనే పెంచు తున్నాయి. అపరాజితని దేవుడు భౌతికంగా చాలా హింసిస్తున్నాడు. ఆమెని చూడడానికే భయం వేస్తోంది.

అందుకని ఒక్కోసారి వెళ్లకుండా ఉంటే అని కూడా అనిపిస్తోంది. ఒకవేళ అపరాజిత తన కూతురైతే అలాగే అనుకుంటుందా? అనుకోదు. రాత్రీ పగలూ ఆ పాపని చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది. అపరాజిత తన స్వంత కూతురు కాకపోతేనేం మానసికంగా బాగా దగ్గరైన కూతురు. వెళ్లాలి. అందుకని వెళ్లడం మానకూడదని అనుకుంది. రోజూ ఆసుపత్రికి వెళ్లడం, అపరాజితని చూడడం, అక్కడ పేరెంట్స్‌ రూంలో కూచోవడం. మళ్లీ పాపని చూడడం, ఇంటికి రావడం. ఇదే అయిపోయింది.

ప్రతిరోజూ ఏం జరుగుతోందో, డాక్టర్లు ఏం అంటున్నారో, పాప గురించినవన్నీ కూడా సుధీర ఫోన్‌ చేసి అత్తగారికి, విక్రాంత్‌కి చెప్తోంది. ఈ సంభాషణల మూలంగా మొదట్లో ఉన్న జంకూ అదీ పోయాయి. అందరూ ఎంతో క్లోజ్‌ అయిపోయారు. ఫోన్‌ చేసిన ప్రతీసారి ఆరోగ్యం ఎలా ఉంది? మామయ్య గారికి ఎలా ఉంది, నేను బాగానే ఉన్నాను. నువ్వెలా ఉన్నావు? లాంటి సంభాషణల మూలంగా తెలీకుం డానే ఎన్నో విషయాలు మాట్లాడే స్తోంది. విక్రాంత్‌ కూడా అక్కడి సంగతి, తండ్రి సంగతి, అన్నీ చాలా వివరంగా చెప్తున్నాడు. ఏదైనా కాని తమ మధ్య మొదటి సారి ఢల్లీిలో కలిసి తిరిగినప్పుడు కలిగిన భావాలు, ఆకర్షణ, ఇష్టం కలుగుతున్నా యని సుధీరకి అనిపించింది.

ఆరోజు వినీల మేనత్త కూతురు వాళ్లు బెంగళూరులోనే ఎక్కడో ఉంటారుట. వాళ్లు భోజనం టైంకే వచ్చారు. సుధీరకి కాస్త ఇబ్బంది అనిపించింది. ఇలా ఇంటికి వచ్చి, అన్నీ కెలికి మనుషులని బాధపెట్టే కన్నా ఓసారి ఫోన్‌ చేసి కనుక్కుంటే సరిపోతుంది కదా అని అనుకుంది. కానీ వాళ్ల రాకకి, వినోద అత్తగారు, మామగారు చాలా సంతోషించారు. వాళ్లు అసలు విషయం పక్కకి పెట్టి, ఏవో విషయాలు మాట్లాడుకున్నారు. వినీల, వినోద కూడా వాళ్ల దగ్గరే కూచున్నారు. విధి లేక సుధీర కూడా అక్కడే కూచుంది. అయితే వాళ్ల మూలంగా వీళ్లకి ఏమీ అలజడి కలగలేదు. ఎప్పటి విషయాలో మాట్లాడు కున్నారు. వాళ్ల కబుర్లకి అంతులేకుండా పోయింది. భోజనాల దగ్గర కూడా కబుర్లు చెప్పుకుంటూ తింటూంటే అన్నం తక్కువైతే మరోసారి వండుకుని తిన్నారు. ఓ గంట భోంచేసారు. తిన్నాకా మళ్లీ కబుర్లు, టీ తాగి వెళ్తూ వెళ్తూ.. బాధ పడకు. ఆయుర్ధాయం ఉంటే పిల్ల బతుకుతుంది. లేకపోతే మనమేం చెయ్యలేం కదా. మన చేతుల్లో ఏం లేదు కదా. అంతా ఆ భగవంతుడి మీద భారం వెయ్యడమే, అంటూ ధైర్యం చెప్పి వెళ్లారు. కుటుంబ పరిధిని పెంచుకోవాలని మామ్మగారు అన్నారు. రోజులు బాగా లేనప్పుడు మనల్ని చూసి మేం ఉన్నామని ధైర్యం చెప్పేవాళ్లు కరవైన ఈ రోజుల్లో ఇలాంటి వాళ్లు ఎంత అవసరమో అనుకుంది.

తాతగారు పోయినప్పుడు అమ్మా, నాన్నగారు మాత్రమే హైద్రాబాదు వెళ్లారు. కార్యక్రమాలన్నీ పూర్తయ్యాక ఢల్లీి వచ్చారు. ఎవరూ కూడా పరామర్శించడానికి రాలేదు. ఎవరో మరీ దగ్గర వాళ్లు మాత్రం ఫోన్‌ చేసారు. తెలిసిన వాళ్లు అసలు రాలేదు. ఫోన్‌ కూడా చెయ్యలేదు. చెప్పుకోవడానికి అందరూ చుట్టాలే. కానీ అక్కరకి రాని చుట్టాలే.

వాళ్లు వెళ్లాకా సుధీర, వినీల అపరాజితని చూడడానికి వెళ్లారు. వెంటనే అనుమతినివ్వలేదు.

 అందుకని ఎప్పట్లాగే పేరెంట్స్‌ హాల్లో కూచు న్నారు. వినీలకి చాలా ఫోన్లొస్తున్నాయి. అందుకే వాళ్ల మధ్య మాటలు ఎక్కువ రాలేదు. అందుకని సుధీర మగతగా కళ్లు మూసుకుంది. ఒక్కసారి కళ్లుతెరిచి వినీలని చూసింది. కళ్లు మూసుకుని ఉంది.

 ఎందుకో ఓసారి వెళ్లి అపరాజితని చూస్తే అని, అనిపించి లేచింది. వినీలని లేపింది. వెంటనే లేవలేదు. రాత్రిళ్లు సరిగా నిద్ర ఉండడం లేదేమో. వినీల సన్నగా తీస్తున్న గురక వినిపించింది. ఇంక డిస్టర్బ్‌ చెయ్యడం ఇష్టం లేక తనే వెళ్లింది.

(ఇంకా ఉంది)

– గంటి భానుమతి

About Author

By editor

Twitter
YOUTUBE
Instagram