జాగృతి – ఎండివై రామమూర్తి స్మారక నవలల పోటీలో ద్వితీయ బహుమతి పొందిన రచన

నందనాథుల అభిమానం విశేషంగా వడ్డాది మీద ప్రవహిస్తోందన్న భోగట్టా తెలుసుకున్న దరిమిలా చుట్టుపక్కల రాజ్యాలవారు వడ్డాదిని కబళించే ప్రయత్నాలకు ఆదిలోనే హంసపాదు పెట్టుకునేవారు.

అనంతరకాలంలో వడ్డాది సింహాసనాన్ని అధిష్టించిన ప్రతాపార్జునుడి కుమారుడు అర్జున దేవుడూ నందరాజ్యంతో పొత్తును యథాతథంగా కొనసాగించాడు. మైత్రీబంధాలతోనే ముందు కుసాగాడు. అర్జునుడు ఎంతగా పాటుపడినప్పటికీ పధ్నాలుగో శతాబ్దం ఆరంభకాలానికి కళింగ రాజ్యాల వ్యవహారాల్లో పెనుమార్పులు చోటుచేసుకున్నాయి. కొత్తగా కాకతీయులు ఈ దిక్కుకే చూడటం మొదలెట్టారు. బయ్యవరం పల్లవులూ, ఢల్లీి పాదుషాలూ దక్షిణాపథాన్ని పరిశీలించడం ప్రారంభించారు. ఎవరెవరో ప్రభువులు సామ్రాజ్య కాంక్షతో దొరికిన కళింగ కోటల్లో దొరికినట్టుగా పాగాలు వేయడానికి పాటుపడ్డారు. ఎవరెవరో కొత్తకొత్త రాజులు ‘రవితేజములలరగ..’ అనేటట్టు ఈ వైపునకే రావడమూ ఆరంభమైంది.

ఇదేసమయంలో అర్జునదేవుడు పరమ పదించడంతో నంద, మత్స్యదేశాలు ఎవరికివారే యమునాతీరే అన్నట్టయిపోయాయి. ఇరుసింహాసనాల మయాన సాంస్కృతిక సంబంధమైన వ్యత్యాసాలూ పొడసూపాయి. పల్లాలనున్న రేడు నాగరికుడు, గిరుల మీద వశిస్తున్న రాజు అనాగరికుడన్న భేదం తలెత్తింది. మెల్లగా రెండు రాజ్యాల సందునా విభజన రేఖలు గీసుకుపోయాయి. ఫలితంగా జోడుగద్దియలూ గుల్లబారడం మొదలైంది.

సరిగ్గా అప్పుడు మత్స్యరాజ్యాన్ని ఏలుతున్నవాడు దేవేంద్రుడు. నందరాజ్యాన్ని పాలిస్తున్నవాడు వెంకటేశుడు. మారిన పరిస్థితుల దృష్ట్యా ఇద్దరూ శత్రుభయం తప్పించుకునే ఉపాయాల్లో పడవలసి వచ్చింది. ఒకప్పటి మాదిరిగా కలిసికట్టుగా ఉండక పోతే ప్రమాదమేనని అటూ ఇటూ రాజ్యాల పెద్దలు తలపోశారు. రాజ్య రక్షణే వీరికి ప్రధాన లక్ష్యమైంది. ఇందులో భాగంగానే వివాహబంధాలు అగ్రేసర స్థానాన్ని ఆక్రమించాయి.

ఇదంతా ఎలా జరిగిందంటేను..

*      *       *

‘‘మీరు వెయ్యి చెప్పండి! లక్ష చెప్పండి! వాళ్లది కొండజాతి. మనం పల్లపు రాజులం. వాళ్లతో మనకు వియ్యం కుదురుతుందా? పైగా వాళ్లు అనాగరికులు.’’ రుసరుసలాడిపోయాడు వడ్డాది ప్రభువైన అర్జున దేవపుత్రుడు దేవేంద్రుడు. అతని ముఖం జేవురించి నట్టయింది. నేత్రాలు ఎర్రబారి ఉన్నాయి. దట్టమైన కనుబొమలు ముడిపడి ఉన్నాయి. ఆవేశంతో ఒక్కోమాటా కఠినంగా పలుకుతున్నాడు. అప్పటికే తన వాదాన్ని కొంతకాలంగా వినిపిస్తూనే ఉన్నాడు. కానీ, మాతృమూర్తీ, మంత్రివర్యులూ ఒప్పడం లేదు. ఆ క్షణాన అతని ఎదుట నిలిచింది ఆస్థాన పురోహితుడు, అమాత్యశేఖరుడు అయిన ప్రణవశర్మ గనక సరిపోయింది. మరోపాటివాడయితే ఈ ప్రతి పాదన తెచ్చినందుకు కరవాలానికి ఎరగా మారిపోయి ఉండేవాడే.

వాస్తవం మాట్లాడుకోవాల్సి వస్తే, మత్స్య రాచమందిరంలో ఈ గడబిడ ఇప్పటిది కాదు. నాలుగు మాసాలుగా నలుగుతున్నది. ఎట్టి పరిస్థితుల్లో నయినా కార్యాన్ని సాధించి తీరాలన్న దీక్షతో ప్రణవశర్మ పనిచేస్తున్నాడు. రాజుగారి మనసు మార్చే చొరవ, లౌక్యం, చనువు అతనికి తప్ప మరొకరికి లేనేలేవు. దేవేంద్రుని మాతృమూర్తి, దివంగత వడ్డాది ప్రభువు అర్జునదేవరాజు సతీమణి, మహారాణీ పూర్ణిమాదేవి లోపాయికారీగా శర్మకు సహకరిస్తోంది. ఆగ్రహ పడుతున్న దేవేంద్రుని దారికి తెచ్చేందుకు ఆమె గళం కదపవలసివచ్చింది.

‘‘మంత్రివర్యులు చెబుతున్నది సరైన మాటే. నువ్వు ఈ రాజ్యానికి ప్రభువు. ప్రభువంటే తన సుఖం చూసుకునేవాడు కాదు. ప్రజలందరిలోనూ తనను చూసుకునేవాడు. పౌరులందరూ స్వేచ్ఛావాయువులతో బతికేలా చేసేవాడు.’’ చెప్పలేక చెప్పలేక చెప్పినట్టుగా నాలుగే మాటలు పలకగలిగింది.

అమ్మమాట ఆలకించిన దేవేంద్రుడు ఉస్సురు మన్నాడు. నిప్పులు ఉమిసినట్టుగా దృక్కులు సూటిగా ఆమెవైపు సారించాడు. మందిరమంతా ప్రతి ధ్వనించేలా నిట్టూర్చాడు. మందిరం కొనల్లో ఉన్న పెద్దవత్తుల ఆముదపు దీపాలు ఆ నిట్టూర్పుల గాఢ నిశ్వాసాల తాకిడికి ఆరిపోయేంతగా వణికి పోయాయి. ప్రభువుల కళ్లనుంచి బయల్పడుతున్న కోపాగ్ని రవరవలు మందిరపు ద్వారానికున్న తెరలను కాల్చేసేటట్టుగా ఉన్నాయి. కొద్దిసేపు అక్కడ మౌనమే నడయాడిరది. ప్రణవశర్మ, పూర్ణిమాదేవి నిశ్శబ్దాన్నే ఆశ్రయించారు.

అంతవరకూ వీరి మాటల్ని ఉచితాసనం మీద కూర్చుని వింటున్న దేవేంద్రుడు మందిర గవాక్షం వైపు తటిల్లతలా తరలి పోయాడు. అడ్డుతెరలు తొలగించుకుని నీలాకాశం వైపు కళ్లు నిగిడ్చి చూశాడు. సాయంసంధ్యవేళ గనుక పిట్టలు సమూహాలుగా గూళ్ళకు చేరేదారుల్లో పరుగులు తీస్తూ   కనిపించాయి.

‘ఎంతగొప్పవి ఈ పిట్టలు!’ మనసులోనే అనుకున్నాడు.

‘వీటికున్న స్వేచ్ఛాస్వాతంత్య్రాలు పాలకులమైన మాకు లేవు కదా! పేరుకే ఏలికలం. తీరా చూస్తే పక్షులకంటే పిన్నలం. పిట్టల్ని తింటూ, చిక్కులెదుర యినప్పుడు చిలకపిట్టలచేత జోస్యం చెప్పించునే భీరువులం.’ హృదయాన్ని కుదిపిన ఆలోచనలతో తనలో తనే ముసిముసిగా నవ్వుకున్నాడు. చల్లగాలి రివటలు రివటలుగా సోకడంతో స్వేదంతో చెమరిస్తున్న అతని శరీరం ఆరుదల పడుతోంది. ఆగ్రహం దూరమై దేవేంద్రుడు చల్లబడుతున్నట్టుగా అయ్యాడు. దక్షిణగాలుల వీస్తుండగా తూర్పు కొండలమీది శ్రీవేంకటేశ్వరుని కోవెల గంటలు గణగణమన్నాయి. వీటికి సరిజోడుగా కోట ప్రధాన ద్వారాన ఎగురుతున్న పతాకం మీది చేప బొమ్మ కళ్లబడిరది. ఒక్కసారిగా అతని మనసు శీతల మార్గంలో పయనించింది. హృదయంలోనే తిరుమల దేవునికి నమస్సులు అర్పించుకున్నాడు. ఇంతలోనే పశ్చిమాద్రిన వెలసిన వడ్డాది కులదైవం పార్థసారథి కోవెల నుంచి శంఖనాదం కర్ణపేయంగా బయ ల్వెడలింది. సంధ్యానివేదన సమయాన అర్చక స్వాములు పూరించే శంఖధ్వానమది. ఉత్తర క్షణంలోనే దేవకీసుతుణ్ణి తల్చుకున్నాడు. గబగబా పడమటి కిటికీ చేరి ఆ నీలమేఘశ్యామునికి జోతలు చెల్లించుకున్నాడు. మళ్లీ మామూలు మనిషయి నట్టయ్యాడు. ఆసనానికి చేరుకున్నాడు. వెనువెంటనే,

‘‘ఎందుకమ్మా! ఇలా మమ్మల్ని పట్టుబడు తున్నారు. ఈ సంబంధమే చేసుకోమంటూ వత్తిడి చేస్తున్నారెందుకు?’’ తల్లిని నింపాదిగానే ప్రశ్నించాడు. ఆమె జవాబిచ్చేలోగానే,

‘‘శర్మగారూ! నాకూ, మా చెల్లెలు దేవేంద్రకే ఈ భాగ్యమంతా కట్టబెట్టాలని మీరెందుకు చూస్తున్నారు? ఇందులో మీకు కలిసివచ్చేదేంటి?’’ మాతృమూర్తిని ప్రశ్నించినట్టుగా కాకుండా కొంత వెటకారపు ధ్వనితో ప్రణవశర్మను అడగాలను కున్నది అడిగేశాడు. ఈ ప్రశ్న పూర్ణిమాదేవిని బాధించింది. ప్రణవశర్మ మాత్రం రాజుగారి మాటల్లోని శ్లేషను గ్రహించినప్పటికీ మనసు గంటు పెట్టుకోలేదు. శర్మవర్యులు చిన్నబోకూడదన్న ధ్యేయంతో పూర్ణిమాదేవి అందుకుంది.

‘‘బిడ్డా! ఇది రాజ్యానికి సంబంధించిన వ్యవహారం. అయినా నీ మంకుపట్టు నీదే అన్నట్టు న్నావు. ఒకప్పుడు మన రాజ్యం బోయకొట్టం. వైశాఖేశ్వరుని తీర్థపురాళ్లనుంచి నందరాజ్యం సరిహద్దుల వరకూ విస్తరించి ఉండేది. ఈ రోజు అనియంకపల్లిని సైతం వదిలిపెట్టి రావాల్సి వచ్చింది. కారణం. మనం బలమైన రాజులం కాకపోవడమే. చోళులు, చాళుక్యుల దెబ్బకి బోయకొట్టపు గౌరవాన్ని కోల్పోవలసివచ్చింది. మన చేయిజారిన భూభాగపు ప్రజలందరూ శత్రువుల చేతుల్లో పడుతున్న కష్టాలు నీకు తెలిసినవే. భవిష్యత్తులో మత్స్యరాజ్యం మరింతగా కుంచించుకుంటూ పోవాలా! మన ప్రజానీకం మరింతగా ఆరళ్లు పడాలా?’’ వేదనతో పరిస్థితుల న్నింటినీ ఏకరవుపెట్టింది. డస్సిపోయినట్టయ్యాడు దేవేంద్రుడు. ప్రభుబలం నానాటికీ క్షీణించి పోతోందన్న మాట అతణ్ణి తీవ్రంగా కలచివేసింది.

‘ఒకరకంగా మత్స్యదేశం నేడొక కల్లోల కాసారమైంది. కాకతీయులు, ప్రోలయరాజులు, పల్లవులు ఎప్పుడు మీద పడతారో తెలియదు. రోజుకో సవాలు విసురుతున్నారు. దినానికో విపత్తు తెచ్చిపెడుతున్నారు.’ మనసులోనే ఇవన్నీ అనుకున్న ట్టుగా దేవేంద్రుడు భావించినప్పటికీ పెదాలు దాటిన పలుకులుగా సన్నగా బయటపడనే పడ్డాయవి. ఇదే అదునుగా శర్మ కంఠం విప్పాడు.

‘‘మహారాజా! ఒకప్పుడు మత్స్యరాజ్యాన్ని ఒక ఒడ్డుకాసే నందపురం ఇప్పుడు దూరంగా జరిగి పోవడంతో శత్రుదేశాలకు మనం అలుసైపోయాం. ఈ పరిణామం బాహ్యాన మన స్థితినే కాదు. అంతరాన మన గతినీ తక్కువజేస్తోంది. శత్రుగణాలు సరే. అంతఃశ్శత్రువులూ పెరిగిపోతున్నారు. రాపల్లె, కల్యాణపులోవ, మాడుగుల ప్రాంతాల్లో తిరుగు బాటుదారులు చెలరేగిపోతున్నారు. మరోదిక్కున మన ఆర్థిక స్థితిగతులూ అంతంత మాత్రంగానే ఉన్నాయి. నిత్యకరవులు పట్టి పీడిస్తుండటంతో మత్స్యం దిగనాసిల్లి పోతోంది. అంతర్యుద్ధానికి పునాదులు పడకముందే మేలుకోవలసి ఉంది. ఈ సమస్యలన్నింటినీ పరిష్కరించుకుని క్షేమతీరానికి చేరాలంటే ఉన్నది ఒక్కటే మార్గం. అదే మీ పెళ్లిమార్గం.’’ చెప్పవలసింది చకచకా చెప్పేశాడు. ఆలకించిన దేవేంద్రుడు కణతలకు చేతులు చేర్చుకుని ఆలోచనలో పడి పోయాడు. అప్పటికీ శర్మ ఊరుకోలేదు.

‘‘ప్రభూ! చెల్లెలుగారికీ మీకూ ఈ యోగం ఎందుకు పట్టిస్తున్నారని ప్రశ్నించారు కదూ? అందుకు ఒకే ఒక సమాధానం. మేం తరతరాలుగా మీ ఉప్పు తింటున్నవాళ్లం. మీరు ఇవ్వగా వంశపారం పర్యంగా జయంతి నారాయణపురం అగ్రహారాన్ని అనుభవిస్తున్నవాళ్లం. మేం మీ అమాత్యులం. అన్నం పెట్టే చేతిని రక్షించుకోవడం మా ధర్మం. మేం వడ్డాది సింహాసనానికి బద్ధులం. అదే మా పద్ధతి.’’ సందట్లో సందడిగా తన నిబద్ధతనూ రాజుకు ఎరుక పరుచుకున్నాడు. కంగారుపడ్డాడు దేవేంద్రుడు. అనవసరంగా ప్రణవయ్యను వెటకరించినట్టుగా తలపోశాడు. పూర్ణిమాదేవి సంతోషానికి అవధుల్లేవు. సరిగ్గానే స్పందించినట్టుగా మంత్రివర్యులను కళ్లతోనే అభినందించింది. కొన్ని క్షణాలు ఇలా దొర్లిపోయాక మహారాజు మరో సందేహాన్నీ బయటపెట్టాడు.

‘‘అమాత్యశేఖరా! మా తండ్రి అర్జునరాజుల వారుగానీ, మా పితామహుడు ప్రతాపార్జున దేవరాజయ్యగానీ ఇలాంటి కుండమార్పిళ్లకు తలపడలేదే. శత్రురాజ్యాలను నెగ్గుకు వచ్చేందుకు వివాహబంధాలబాట పట్టలేదే.’’ వ్యాకులత చుట్టుకున్న ఎడదను ప్రణవశర్మ ముందు పరచనే పరిచాడు. రాజు వల్లించిన ఈ వల్లింపు శర్మను సంకటంలో పడవేసింది. నిస్త్రాణకూ గురిచేసింది.

‘ఎలా ఉండే మత్స్యరాజ్యం ఎలా అయింది! కాలమహిమ అంటే ఇదేనేమో! దుర్యోధనాదులు ఉత్తర గోగ్రహణానికి తెగబడేటంత పశుసంపద కలిగిన భూమి. నేడు నాలుగు గడ్డిపరకలకు నోచక గండక్షామాన పడటం వైపరీత్యం. శత్రురాజులచూపు ప్రసరించడానికే ఒల్లని మత్స్యం. ఈ వేళ నానా ఇక్కట్లకూ గురికావడం దైవలీల. జలరాశియే కార్యస్థలిగా జాతి పతాకాన రెపరెపలాడవలసిన చేప నేడు మడుగు ఎండి గిలగిలలాటడం లలాటలిఖితం.’ మనసులోనే భావన చేస్తూ,

‘‘రాజమార్గాన్ని ఈ విధంగా నిష్కంటకం చేసుకోవడం కోసం అమ్మాయిలను ఇచ్చిపుచ్చుకోవడం ఈ నాటిది కాదు మహారాజా! యుగాల నుంచి ఈ జగాన వర్థిల్లుతున్నదే. సాక్షాత్తూ మనం ఇలవేల్పుగా పూజించే ఆ పార్థసారథి సైతం తన చెల్లెలు సుభద్రను అర్జునుడికిచ్చి పెళ్లిచేయడం వెనుక ద్వారక ప్రజలను శత్రుసైన్యాల నుంచి కాపాడుకోవడమూ ఒకానొక వ్యూహమే. పాండవ మధ్యముడు ప్రమీలను చేపట్టినా, ఉలూచికి పెనిమిటి అయినా రాజ్యసంరక్షణే ప్రథమలక్ష్యం.’’ సవివరంగా మనవి చేసుకున్నాడు.

ఈ మాటలతో దేవేంద్రుని మనసు మెత్తబడటం మొదలైంది. అయినా అతని గుండెకొమ్ముల్లో ఎక్కడో ఒక అనుమానం ఉండనే ఉంది. భుజబలాన్ని

కాదని, బాంధవ్యాల సాయంతో సింహాసనాన్ని కాపాడుకోవడం ఎందుకనో పెద్దగా నచ్చడం లేదు. అందుచేతనే చివరి ప్రయత్నంగా,

‘‘నా సంగతి సరేనండి! ప్రజల కోసమంటూ మభ్యపెడుతున్నారు గనక ఆ అనాగరిక నందకొండ పాపను పెళ్లాడతాను. నా జీవితాన్ని ఫణంగా పెడతాను. కానీ, చెల్లెలు దేవేంద్రాలు ఈ కుండ మార్పిడికి సమ్మతి తెలియజేస్తుందా? మన భాష కాదు. మన యాస కాదు. మన తిండి కాదు. మన జాతి కాదు. కొండబాబుతో కలిసి బతుకు పంచు కోగలదా?’’ అడ్డుపుల్ల వేయబోయినట్టుగా అన్నాడు.

తదుత్తరక్షణంలోనే తనవంతు వచ్చినట్టుగా తలంపు చేసిన పూర్ణిమాదేవి,

‘‘ఒదిగితిమి కొడుక.. కొదువ కొంచెము లేదు.. అనే పెద్దల మాటను పాటిస్తానని యువరాణి దేవేంద్రాలు నాతో చెప్పింది. దేశం కోసం, దేశప్రజల కోసం అన్నగారు చేసే ఏ నిర్ణయానికయినా కట్టుబడి ఉంటానంది. ఎవరి ఇంటికోడలుగా వెళ్లమన్నా వెళతానంది.’’ టకటకా తేల్చి చెప్పేసింది. నిరుత్సాహ పడ్డట్టుగా అయ్యాడు దేవేంద్రుడు.

‘‘ఆఖరికి చెల్లాయిని సైతం త్యాగం చేసి సింహాసనాన్ని నిలుపుకుంటున్నాను. రాజు ఎవడయినా రాజే. కన్నగాడు కత్తిమరవడు.. వెజ్జుముంజ చెడిపి మరవదు.. అనే సామెత ఊరికే పుట్టలేదు. ప్రభువులు అధికారాన్ని ఎప్పుడూ మరచిపోలేరు. వదిలిపెట్టలేరు. దాన్ని నిలబెట్టుకునేందుకు ఎవరినయినా బలి చేస్తుంటారు. సరేలెండి. మీరంతగా చెబుతున్నప్పుడు మీ నిర్ణయమే అమల్లోకి తెండి. పాతరాతియుగపు కన్యను తెచ్చి ప్రతిష్టాత్మకమైన విరాటపు రానికి కోడలిగా చేస్తున్నారన్నమాట. కానివ్వండి. మీ మాటే కానివ్వండి.’’ నిస్పృహగా పలికాడు.

ప్రభువులవారి ఆ నిస్సత్తువ మాటలు ప్రణవ శర్మను కదిలించాయి. ఇప్పటిస్థితిలో అన్యంగా ఏదైనా పలికితే గనక మహారాజు పెళ్లికి సుముఖత చూపకుండా మరోసారి కొర్రెక్కినా ఎక్కుతాడన్న ప్రాప్తకాలజ్ఞతతో మిన్నకున్నాడు.

పూర్ణిమాదేవి మటుకు మాట్లాడక తప్పదన్నట్టుగా అయింది.

‘‘నువ్వు నందకుమారిని పెళ్లి చేసుకుంటున్నంత మాత్రాన ఆ రాజ్యాన్ని తక్కువగా చూడకు. నువ్వు విరాటరాజు వంశీకుడివయితే వాళ్లు వాకాటక ప్రభువులు. వాళ్లేం తేరగా దొరికేవాళ్లు కాదు. అనవసరంగా కాంతలను చులకన చెయ్యకు. మన రాజ్యంలోనూ ఆడపిల్లలున్నారు.’’ కఠినంగానే మాట్లాడిరది. విడ్డూరపడ్డాడు దేవేంద్రుడు.

‘అదెలాగ..’ అన్నట్టుగా తల్లి ముఖంలోకి చూశాడు. అందుకు ప్రతిగా పూర్ణిమ ధ్వజమెత్తి నట్టుగా వాక్కులు విరజిమ్మింది.

‘‘నందరాజ్యం నువ్వనుకున్నంత తేలికయినది కాదు. ఇప్పటివరకూ మత్స్యదేశం ఈ పాటి క్షేమంగా ఉందంటే నాడు నందులు అందించిన సహాయ సహకారాలూ ఇందుకు హేతువే. సాక్షాత్తూ ఉజ్జయిని చక్రవర్తి విక్రమాదిత్యుడు తన కుమార్తె ప్రభావతిని కోడలిగా నందపురానికి పంపిన సంగతి మనమెవ్వరం మరచిపోకూడదు. విక్రమప్రభువే కాళ్లు కడిగి నందరాజు ప్రబలభైరవుణ్ణి అల్లునిగా పొందాడు. అందుకు గుర్తుగా నందరాజ్యంలో విక్రమార్కుని ముప్ఫయిరెండు మెట్ల సింహాసనాన్ని ప్రబలభైరవుడు నిలిపాడు. అంతటి సామ్రాజ్యానికి జామాతవవు తున్నావు గుర్తుపెట్టుకో. ఇంకా పచ్చిగా చెప్పవలసివస్తే మీ తండ్రి, మీ తాతయ్య నందరాజ్యంతో నెరిపిన స్నేహబంధమంతా నీ హయాంలోనే చెదిరిపోయింది. నువ్వూ, నీ దళవాయిలూ ఆ మైత్రీగంధాన్ని దుర్వినియోగం చేసి గిరిసంపదను చాలావరకూ ఫొక్తు పరుచుకున్నారన్న విషయాన్ని ఎవరు దాచగలరు?’’ గంభీరమైన స్వరంతో చెప్పేసి ఠక్కున ముగించింది.

(ఇంకా ఉంది)

డా॥ చింతకింది శ్రీనివాసరావు

About Author

By editor

Twitter
YOUTUBE
Instagram