సిగ్గు

– మోదేపల్లి శ్రీలతా కోటపాట

వాకాటి పాండురంగరావు స్మారక దీపావళి కథల పోటీలో తృతీయ బహుమతి పొందిన రచన

చాలా సిగ్గుగా ఉంది నాకు. జీవితంలో ఇంత సిగ్గుపడే పని చెయ్యలేదు. చేసే అవసరం రాలేదు.

నాన్న వ్యవసాయం చేసేవారు. పంటలమ్మి డబ్బులు లోన్లకు పోగా మిగిలినవి అమ్మచేతికి ఇచ్చి లోపల పెట్టమనేవారు. తనకు కావలసినప్పుడు అడిగి తీసుకునేవారు.

ఇల్లు జరపడం, మా స్కూలు ఫీజులూ అన్నీ అమ్మనడిగే తీసుకునేవాళ్లం. అమ్మ అన్నీ లెక్క రాస్తూ ఉండేది.

నాన్నగారెప్పుడు అమ్మను లెక్క అడిగేవారు కాదు. అయినా అమ్మ రాస్తూనే ఉండేది. నయాపైసాతో సహా రాస్తూనే ఉండేది.

‘‘నాన్నగారు చూడరు గదా ఎవరికోసం లెక్కలు?’’ అని అక్క అడిగితే..

‘‘నాన్నగారు ఎప్పుడయినా అడిగితేనో’’ అనేది కాదు. నాన్నగారు అడగరన్న నమ్మకం అంతగా ఉండేది.

‘‘మన సంసారం ఓ లెక్కా పద్ధతిలో ఉండాలంటే.. మనకి మనం ఎంత ఖర్చులో బ్రతుకుతున్నామో తెలియాలంటే, ఎక్కడ దుబారా చేసామో చూసుకోవాలంటే లెక్కలు రాయడం తప్పనిసరి. లెక్కలు రాస్తే ఖర్చులు మన అధీనంలో ఉంటాయి’’ అనేది.

అమ్మను చూసి మాకు అలవాటైంది. చిన్ని చిన్ని పుస్తకాలు కొని ఏరోజు అమ్మ దగ్గర తీసుకున్నాదీ దాని ఖర్చు రాసేవాళ్లం. నాన్నగారి లాగే అమ్మ కూడా ఆ పుస్తకాలు చూసేది కాదు.

పెద్దవాళ్లం అయిపోయాం. డిగ్రీ వరకు చదివించి అక్కకు, నాకు పెళ్లీళ్లు చేసేశారు. తమ్ముడిరకా చదువుకుంటున్నాడు.

నేను కాపురానికి వచ్చాను. శ్రీరాం సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌, మంచి సాలరీ. నాన్నగారిచ్చిన కొంత డబ్బులతో అపార్ట్‌మెంట్‌ కొనుకున్నాం.

కూతుళ్లకు కూడా ఆస్తిలో భాగమిచ్చిన ఆదర్శవంతుడవయ్యా అనేవారు నాన్నగారిని ఎరిగినవాళ్లు.

ఇల్లు ఏర్పడిరది కానీ చేతిలో డబ్బులు వచ్చే ఆదాయాలేవీ లేవు. ఉదయం లేస్తే అన్ని శ్రీరాం తేవాల్సిందే, ఇల్లు జరగాల్సిందే.

సంవత్సరమయినా శ్రీరాం సాలరీలో ఒక్కపైసా ముట్టుకోలేకపోయాను. అన్నీ అతనే తెచ్చేవాడు. ఏదైనా కావాలంటే తీసుకెళ్లి కొనిచ్చేవాడు తప్పితే ‘‘తెచ్చుకో’’ అని డబ్బులు చేతిలో పెట్టేవాడు కాదు. ‘‘నీ దగ్గర ఉండనీ’’ అని రూపాయి కూడా ఇచ్చేవాడు కాదు.

ఎంత మంచి ఇంట్లో ఉన్నా, ఎంత మంచి చీరలు కడుతున్నా చేతిలో చిల్లుగవ్వ లేకపోవడం చిన్నతనంగా అనిపించేది. ఎక్కడికైనా ఒంటరిగా షాపింగ్‌ వెళ్లాలన్నా.. ఇంట్లో ఏదైనా అయిపోతే తెచ్చుకోవాలన్నా.. పుట్టింటికి వెళ్లి రావాలన్నా… అక్క పిల్లలకు ఏవైనా గిఫ్ట్‌లివ్వాలన్నా… శ్రీరాంను అడగాల్సిందే.

అప్పుడు గిల్టీగా ఉండేది. ఇంత చిన్న చిన్న ఖర్చులకు కూడా ఆయన్ని అడగాల్సి వస్తుందే అని ఒక్కోసారి ఇచ్చేవాడు. ఒక్కోసారి ‘‘వీలుకాదు’’ అనేవాడు.

ఆస్తి ఉన్నా, భర్త మంచి పొజిషన్‌లో ఉన్నా ఆర్థిక స్వాతంత్య్రం లేకపోవడమంటే ఇదే.

కాన్ఫిడెన్స్‌ దెబ్బతిని పోయింది. ఏదైనా శ్రీరాంను అడిగి చేయాలి. అతనొప్పుకోకపోతే ఊరుకోవాలి.

ఇదేమంత పెద్ద సమస్య కాదు. చిన్న సంఘర్షణ.

కొద్దిగా ఇగో ప్రాబ్లమ్‌.

అమ్మకు నాన్న ఇచ్చినట్లు మొత్తం పెత్తనం తనకివ్వకపోయినా ఏదో నెలవారి ఖర్చులుంటాయి. ఈ డబ్బు వాడుకోవోయ్‌ అంటూ కొంత మనీ అతను తనకిస్తే బావుండు అనిపిస్తుంది పాకెట్‌ మనీలాగ.

అతను ఇవ్వడు, నేను అడగను.

పుట్టింటికి వెళ్లినప్పుడు నాన్నకు చెప్పాను.

‘‘నాన్న అతన్ని నా దగ్గర కొన్ని డబ్బులు ఉంచమని చెప్పండి. నేను దుబారా చేయనని కూడా చెప్పండి’’ అని.

‘‘బాధలేవీ లేనివాళ్లు టైమ్‌పాస్‌ కోసం ఏదో ఒక బాధను తమకు ఆపాదించుకొని బాధపడుతూ ఉంటారు. అది ఒక హాబీ. వాళ్లెప్పుడూ బాధలోనే ఉంటారు.’ అన్నారు’’ నువ్వు అంతే అన్నట్టుగా.

‘‘చిన్నప్పటి నుంచి చూస్తున్నా, మీరు అమ్మకు ఇచ్చే ప్రాధాన్యం. ఆ ప్రాధాన్యానికి నేను తగనా నాన్నా?’’ అని అడిగా. అమ్మ నవ్వుతూ చూస్తోంది.

‘‘నువ్వు పుట్టిన వాతావరణం నీకెలాంటి వ్యక్తిత్వం ఏర్పరచిందో అతను పుట్టిపెరిగిన వాతావరణం అతనికీ ఒక వ్యక్తిత్వాన్ని ఏర్పరుస్తుంది. బహుశా అతని తండ్రి అతనిలా ఉండేవాడేమో’’ అన్నారు.

‘‘పరిష్కారం లేదా అమ్మా?’’ అడిగాను.

‘‘వాడి చూడు అతని డబ్బులు. అతని రియాక్షన్‌ను బట్టి నువ్వు నడుచుకోవచ్చు’’ అన్నారు నాన్న.

ఇంటికి వచ్చేసాను.

మనసులో ఏదో పరాయితనం. తన సంసారం మీద తనకు పట్టులేని తనం.

ఆర్థిక స్వాతంత్య్రం లేకుంటే అస్థిత్వం లేనట్టే. నేను తెచ్చిన ఆస్తిని, ఇంటిని అతను యథేచ్ఛగా వాడుకుంటున్నాడు. మరి అతను తెచ్చే సంపాదనపై నాకు స్వాతంత్య్రం ఉండకూడదా?

బీరువా తాళాలు పెట్టే వాడరాబ్‌ తెరిచా. తాళాలు తీసుకున్నా. మెల్లగా బీరువా తెరిచా.

సిగ్గుగా ఉంది. దొంగతనం చేస్తున్నట్లు ఉంది. పెళ్లైయి రెండు సంవత్సరాలైనా ఎప్పుడు బీరువా తీయాలని అనుకోలేదు. డబ్బులు అడిగి తీసుకుందంతే. అడిగితేనే అతనిచ్చేవాడు.

ఎదురుగా డబ్బుల కట్టలు.

‘‘ఇవి నావి కూడా, నేనతని భార్యను. అతని డబ్బుమీద హక్కు కల దానను. ఇది దొంగతనం కాదు. అతిసామాన్యం.’’ అని మనసును హిప్నటైజ్‌ చేసుకున్నా.

ఒక వెయ్యి రూపాయలు తీసుకున్నా. చేతులు వణికాయి. బీరువా తలుపులు మూసి ఫ్యాన్‌ కిందకు వచ్చి నిలబడ్డా. ఎంతో హాయిగా ఉంది. ఇక అతను నాకు ఇవ్వకపోయినా తను తీసుకోవచ్చు. ఇప్పుడు నాకు ఆర్థిక స్వాతంత్య్రం వచ్చేసింది. పైన ఫ్యాన్‌తో కలిపి గిర్రున తిరిగాను. మొహం రెండు అరచేతులతో కప్పుకుని లోలోపలే నవ్వుకున్నా. చక్కగా రెడీ అయి బజారుకు వెళ్లి ఓ స్వెట్టర్‌ కొన్నా.

‘‘ఏమిటోయ్‌ మహా సంతోషంగా ఉన్నావు?’’ అని అడిగాడు శ్రీరాం.

‘‘ఈరోజు నాకు స్వాతంత్య్రం వచ్చింది’’ అన్నా.

‘‘ఇది ఆగస్ట్‌ నెల కాదే!’’ అన్నాడు శ్రీరాం.

‘‘అందరికీ కాదు ఓన్లీ నాకే’’ అన్నా.

‘‘అదేలా?’’ అనడిగాడు.

‘‘నేను మన డబ్బుల్లోంచి ఓ వెయ్యి రూపాయలు తీసుకుని మీకో మంచి స్వెట్టర్‌ గిఫ్ట్‌ తెచ్చా. ఈ చలికాలం మీకు ఎంతో ఉపయోగపడు….’’ అని పూర్తిచేయకుండా ఆపేసా, శ్రీరాం ముఖంలో మారుతున్న రంగుల్ని చూసి.

‘‘నా బీరువా ఎందుకు ముట్టుకున్నావు?’’ అని తీక్షణంగా అడిగాడు.

అప్పటికే కళ్లు ఎర్రబడ్డాయి. ముక్కు పుటాలు అదురుతున్నాయి.

‘‘ఆ డబ్బులు నేను కారు కొనడానికి జమచేస్తున్నా. నన్నడక్కుండా ఎందుకు తీసుకున్నావ్‌?’’ అని సోఫాలో ఉన్న దిండును విసిరి నేలకేసి కొట్టాడు.

‘‘అసలు ఆ డబ్బు ముట్టుకునే ధైర్యం నీకెక్కడిది? పైగా నాకో చింపిరి స్వెట్టర్‌ కొంటావా! కావాలంటే నేను కొనుక్కోనా! పైగా ఆర్థిక స్వాతంత్య్రమని పేరొకటా! ఇంకోసారి ఇలా జరిగితే నేనూరుకోను. అది నా డబ్బు, నా కష్టార్జితం. అవసరాలన్నీ తీరుస్తున్నా కదా! నీ కింక డబ్బెందుకు? ఒకవేళ కావాలంటే మీ పుట్టింటికి వెళ్లి తెచ్చుకో, నా డబ్బు ముట్టుకోకు’’ అని కరాఖండిగా చెప్పి బెడ్‌రూమ్‌లోకెళ్లి తలుపు వేసుకున్నాడు.

కళ్లు విరుచుకున్నాయి. నోరు తెరుచుకుపోయింది. శరీరం నిశ్చలమైపోయింది. మనసు మూగపోయింది. నుదుటి మీద నుంచీ చెమట, మెదడు పెటిల్లున పేలినట్లయింది.

నిజంగా సిగ్గువేసింది. టీ పాయ్‌ మీద ఉన్న పేపర్‌, పెన్ను తీసుకున్నా.

‘‘నేను కొన్నిరోజులు మా పుట్టింట్లో ఉండి వస్తాను. నాకోసం మాత్రం మీరు రాకండి. నన్ను మరోసారి సిగ్గుపడేలా చేయకండి’’ అని రాసి పెట్టి గడప దాటి కదిలాను.

*       *       *

ఒంటరిగా వచ్చిన నన్ను చూసి అమ్మనాన్నల కళ్లు ఆశ్చర్యంతో విచ్చుకున్నాయి.

‘‘నాన్నా నాకివ్వవలసింది అపార్ట్‌మెంట్‌ కాదు జాబ్‌ అప్పాయింట్‌మెంట్‌’’ అని లోపలికి వెళ్లిపోయా.

*       *       *

మరో ఆరు నెలలకు అమ్మా నాన్నల ఆశీర్వాదం తీసుకుని శ్రీరాం దగ్గరకు బయలుదేరా! ఇంట్లో ఉన్నాడు. వెళ్లేసరికి తలుపు తీసి ఆశ్చర్యంగా చూశాడు. చటుక్కున పక్కకు జరిగి లోపలికి దారి ఇచ్చాడు.

సూటిగా బీరువా దగ్గరకు వెళ్లి హాండ్‌బ్యాగు లోంచి డబ్బుల కట్టలు తీసి అతని డబ్బుల కట్టల పక్కన పెట్టా.

అయోమయంగా చూస్తున్నాడు శ్రీరాం.

‘‘అది నీ డబ్బు. ఇది నా డబ్బు అని కాదు అనాల్సింది, ఇది మన డబ్బు అని.’’

‘‘మీ డబ్బులు నేను వాడుకునే హక్కు నాకిస్తారో లేదో కాని నా డబ్బు మనం ఇద్దరం వాడుకోవచ్చు. నేను జాబ్‌ చేస్తున్నాను. ప్రతి నెలా మన డబ్బు మనకు ఉపయోగపడుతూనే ఉంటుంది.’’ అన్నా ప్రశాంతంగా.

అప్రయత్నంగా అతని తల వంగిపోయింది.

‘‘నన్ను క్షమిస్తావా’’? అనడిగాడు దీనంగా.

‘‘లేదు! కృతజ్ఞతలు తెలుపుతున్నాను. నేనేమిటో నాకు చూపించారు. ఇక ఏనాటికీ డబ్బు విషయంలో నేను సిగ్గు పడకుండా చేశారు.’’ అన్నాను.

అతని కళ్లవెంట ధారావాహికంగా కన్నీళ్లు దొర్లాయి.

‘‘ఆర్థిక స్వాతంత్య్రం అంటే భర్త తెచ్చిన డబ్బును స్వేచ్ఛగా వాడుకోవడమే కాదు. తాను ఆర్జించిన డబ్బును వాడుకోవడం’’ అనిపించింది నాకు.

శ్రీరాం చేతిలో చేయి వేసి ‘‘ఇది తప్పు కాదు! తరతరాలుగా వస్తున్న కొన్ని అధికారాలు. ఇప్పుడవి తిరగబడుతున్నాయంతే’’ అన్నా.

‘‘ఇక నేను సిగ్గు పడాల్సిన అవసరం లేదు’’ అనిపించింది కూడా.

అతను సిగ్గుపడ్డాడు.

రచయిత్రి పరిచయం

ఎం.ఎ., ఎల్‌.ఎల్‌.బి. చదువుకున్నాను. గత 20 సంవత్సరాలుగా రచనలు చేస్తున్నాను. మొదటి నవల ‘వెన్నెలస్పర్శ’. పధ్నాలుగు నవలలు, ఐదు సీరియల్స్‌, 200 కథలు రాశాను. నాలుగు కవితా సంపుటాలు వెలువరించాను.

ఎన్నో అవార్డులూ, బిరుదులూ పొందాను.

వంద పాటలు రాశాను. 108 సాయి కీర్తనలు రాశాను. శ్రీలత శతకం రాసి తొలి వచన శతకంగా గుర్తింపు పొందాను.

నా కథకు తృతీయ బహుమతి లభించడం ఆనందంగా ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Twitter
Instagram