అక్టోబర్‌ 7 ‌దేవీనవరాత్రులు ప్రారంభం

భారతీయ సంస్కృతిలో శక్తి ఆరాధనకు విశిష్ట స్థానం ఉంది. ఆ ఆదిశక్తే దుర్గాదేవి. ఆ తల్లిని తొమ్మిది రూపాలలో అర్చించడమే దేవీనవరాత్రుల పరమార్థంగా చెబుతారు. స్వాతంత్య్ర సముపార్జనకు దుర్గాపూజ ఎంతగానో ఉపకరించింది. ప్రజలను సంఘటితపరచి చైతన్యవంతం చేసేందుకు జాతీయ నాయకులు దుర్గాపూజను

వేదికగా చేసుకున్నారు. బహిరంగ ప్రదేశాలలో అమ్మవారి విగ్రహాలు నెలకొల్పి ఘనంగా పూజలు నిర్వహించారు. లక్ష్మీస్వరూపిణీగా సంపదను; సరస్వతిగా జ్ఞానాన్ని; పార్వతిగా శక్తిని ప్రసాదించే దుర్గమ్మను ‘అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాల పెద్దమ్మ సురారులమ్మ….’ అని పోతనా మాత్యుడు శ్లాఘించారు. అందుకే ఈ నవరాత్రులను పురస్కరించుకొని పార్వతీ, లక్ష్మి, సరస్వతులను మూడేసి రోజులు అర్చిస్తారు.

ఆశ్వయుజ శుక్ల పాడ్యమి నుంచి అమ్మవారిని వివిధ రూపాలలో అలంకరించి అర్చిస్తారు. మహాలయ పక్షానికి ‘యుద్ధపక్షం’ అని మరోపేరు. అసురులతో యుద్ధంలో పరాజితులైన సురలు శరన్నవరాత్రులలో తమ ఇష్టదేవతలను అర్చించి దశమినాడు విజయం సాధించారని పురాణకథనం. ‘ప్రథమం శైలపుత్రీ ద్వితీయా బ్రహ్మచారిణీ/తృతీయా చంద్రఘంటేతి కూష్మాండేతి చతుర్థకీ/పంచమా స్కందమాతేతీ షష్ఠ్యా కాత్యాయనీతచ/సప్తమా కాలరాత్రీతి మహాగౌరీచాష్టమీ/నవమా సిద్ధిధాత్రీతి నవదుర్గాః ప్రకీర్తతాః’ (శైలపుత్రి, బ్రహ్మచారిణి, చంద్రఘంట, కూష్మాండ, స్కంద మాత, కాత్యాయని, కాళరాత్రి, మహాగౌరి, సిద్ధిధాత్రి) అని నవదుర్గలను నవరాత్రులలో అర్చిస్తారు. దుర్గాదేవి, బాలాత్రిపుర సుందరి, మహాలక్ష్మి, గాయత్రీమాత, అన్నపూర్ణేశ్వరి, మహాకాళి, లలితాంబ, సరస్వతి, మహిషాసురమర్ధని, రాజరాజేశ్వరీదేవి రూపాలలోనూ అమ్మవారిని ఆరాధిస్తారు.

ఒక్కొక్కరోజు ఒక్కొక్క రకమైన నైవేద్యాన్ని నివేదిస్తారు. నవరాత్రులను శాస్త్రోక్తం నిర్వహించా లనుకునేవారు పాడ్యమినాడు కలశస్థాపనతో ఉపక్రమిస్తారు. ఆయా తిథులలో అమ్మవారి అవ తారాలకు సంబంధించిన అష్టోత్తర, సహస్రనామాలు, పూజాద్రవ్యాలతో అర్చించి, శక్తికొద్దీ నైవేద్యాలు సమర్పిస్తారు. విదియ, తదియలలో చక్కెర, పాలు నివేదించినా, అమ్మవారికి ఇష్టమైన పాయసాన్ని ఈ మాసమంతా ఆరగింపుగా సమర్పిస్తారు. గణపతి నవరాత్రుల మాదిరిగానే దేవీ నవరాత్రులను పెద్ద విగ్రహాలు ప్రతిష్టించి చివరిరోజున నిమజ్జనం చేస్తారు. తొలినాళ్లలో ఆలయాలు, రాజప్రసాదాలకే పరిమితమైన నవరాత్రి వేడుకలు కాలక్రమంలో సామాన్యులు ఊరూరా జరుపుకోవడం మొదలు పెట్టారు.

దేవీనవరాత్రుల నేపథ్యం

ఒకప్పుడు దేవీనవరాత్రులను వసంత రుతువులో (చైత్రమాసం)లో నిర్వహించేవారట. రామాయణ కాలం వరకు ఆ విధానం ఉండేదట. రావణుడితో యద్ధం సమయంలో శ్రీరామచంద్రుడు అనివార్యంగా ఆశ్వయుజ మాసంలో చండీహోమాన్ని నిర్వహించి దుర్గాదేవి అనుగ్రహానికి పాత్రుడయ్యాడని, నాటి నుంచి శరదృతువులో నవరాత్రులు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందని, అందుకే వీటిని శరన్నవరాత్రులుగా వ్యహరిస్తున్నారని ప్రతీతి. అమ్మవారిని చైత్రమాసంలో పూజించడమే సరైనదని, ఆశ్వయుజంలో అర్చించడం అంటే అమ్మవారిని అకాలంలో నిద్రలేపడమేనని (అకాల్‌ ‌బోధొ) బెంగాలీలు కొందరు విశ్వసిస్తారు. నవరాత్రుల ప్రాశస్త్యంలో భాగంగా ఒక పురాణగాథను చెబుతారు. కృతయుగంలో సుకేతనుడనే రాజు జ్ఞాతుల వల్ల రాజ్యం కోల్పోయి అడవులపాలు కాగా, అంగీరస రుషి ఆయనకు నవరాత్రి పూజా విధానం ఉపదేశిం చారని, దానిని ఆచరించిన రాజు పూర్వవైభవం పొందారని కథనం.

తెలుగు రాష్ట్రాలలో..

దక్షయజ్ఞం సందర్భంలో సతీదేవి కల్పించుకున్న యోగాగ్ని ఫలితంగా ఆమె శరీర భాగాలు పడిన ప్రాంతాలు శక్తిపీఠాలుగా ప్రసిద్ధమయ్యాయి. అవి అష్టాదశ పీఠాలుగా ప్రసిద్ధమయ్యాయి. వాటిలో నాలుగు పీఠాలు తెలుగు రాష్ట్రాలలో ఉన్నాయి. అలంపురం జోగులాంబ (తెలంగాణ), శ్రీశైలం భ్రమరాంబ, పీఠికాపురం పురహుతాదేవి, ద్రాక్షారామం మాణిక్యాంబ (ఆంధప్రదేశ్‌).

‌విజయవాడ ఇంద్రకీలాద్రిపై వెలసిన శ్రీ కనకదుర్గమ్మ, శ్రీశైలంలోని శ్రీ భ్రమరాంబికాదేవి, అలంపురంలోని శ్రీ జోగులాంబదేవికి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు. విజయవాడ కృష్ణానదిలో కనకదుర్గమ్మకు తెప్పోత్సవం నిర్వహిస్తారు. దసరా అనగానే వెంటనే స్ఫురించే క్షేత్రాలు ఇవే అయినా అన్ని ప్రాంతాలలోని అమ్మవారి ఆలయాలలో నవరాత్రులను విశేషంగా నిర్వహిస్తారు.

హిమాచల్‌‌ప్రదేశ్‌లోని కులు ప్రాంతంలో దసరా వేడుకలు విలక్షణంగా ఉంటాయి. ఇతర ప్రాంతాలలో ఈ ఉత్సవాలు విజయదశమితో ముగిస్తే, అక్కడ ఆ రోజు ప్రారంభమై వారం పాటు కొనసాగుతాయి. కశ్మీర్‌, ‌పంజాబ్‌, ‌హర్యానా, ఉత్తరప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, ‌పశ్చిమ బిహార్‌ ‌ప్రాంతాలలో దసరాను వ్యవసాయ పండుగగా (మనకు సంక్రాంతి మాదిరిగా) జరుపుకుంటారు. దేవీనవరాత్రుల ప్రారంభం రోజున గోధుమలు, బార్లీ వంటి ధాన్యాన్ని మట్టికుండలో పోసి, దసరా నాటికి మొలకెత్తిన వాటిని చెరువులు లేదా నదులలో నిమజ్జనం చేస్తారు. మధ్యప్రదేశ్‌, ‌చత్తీస్‌ఘడ్‌ ‌ప్రాంతాలలో మహాలయ అమావాస్యకు ముందు నుంచే పండుగ వాతావరణం కనిపిస్తుంది. గుజ రాత్‌లో నవరాత్రుల సందర్భంగా దాండియా, గార్భా నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా ఉంటాయి. ఉత్తరాఖండ్‌ ‌కుమావ్‌ ‌ప్రాంతంలో రంగస్థల సంప్రదాయం ప్రకారం ‘రామ్‌లీల’ వేడుకను నిర్వహిస్తారు.

దసరా వేడుకలకు ఘన చరిత్ర ఉంది. విజయ నగరం రాజులు హంపీలో ఈ ఉత్సవాలను ఘనంగా నిర్వహించేవారట. ఆ సామ్రాజ్యం పతనం తరువాత మైసూర్‌ ‌మహారాజాలు (వడయార్‌ ‌రాజవంశీయులు) వీటిని అందిపుచ్చుకున్నారు. వారు 17వ శతాబ్ది తొలినాళ్లలో ఈ ఉత్సవాలను శ్రీరంగ పట్టణంలో నిర్వహించేవారని, మూడవ కృష్ణరాజ వడయార్‌ ‌హయాంలో (1805 నుంచి) ఇవి మైసూరుకు మారాయని చరిత్ర చెబుతోంది. ఈ నవవరాత్రుల సందర్భంగా రాజవంశీయుల ఇలవేల్పు చాముండేశ్వరీ దేవిని 750 కిలోల బంగారంతో నిర్మించిన మండపంపై ఉంచి అర్చిస్తారు.

దేశవిదేశాలలోనూ వేడుకలు

విదేశాలలోనూ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుపుకుంటారు. నేపాల్‌లో ఈ పండుగను ‘దసైన్‌’‌గా పిలుచుకుంటారు. బంగ్లాదేశ్‌ ‌రాజధాని ఢాకాలో ఢా•కేశ్వరి ఆలయంతో పాటు ఇతర ఆలయాలలోనూ; సింగపూర్‌, ‌మలేసియా, బ్రిటన్‌, అమెరికాలోని వివిధ రాష్ట్రాలలో; జర్మనీ, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్, ‌శ్రీలంకలో స్థిరపడిన భారతీయులు ఈ వేడుకలను ఉత్సాహంగా నిర్వహించుకుంటారు. చైనాలోని భారతీయులు 2004లో షాంగైలో దేవీ నవరాత్రుల ఉత్సవాల నిర్వహణను ప్రారంభించారు.

పూల పండుగలు

ప్రజారోగ్యం, కోరికలు తీరేందుకు, గ్రామాల సౌభాగ్యం కోసం గ్రామదేవతల ఆరాధన అనాదిగా వస్తోంది. వీటిని వివిధ ప్రాంతాలలో ఉత్సవం, పండుగ, తీర్థం, జాతర, కొలువు, తిరునాళ్ల లాంటి పేర్లతో పిలుస్తారు. శరన్నవరాత్రుల్లో బొడ్డెమ్మ, బతుకమ్మ పండుగలు అలాంటివే. తెలంగాణ అస్తిత్వ చిహ్నంగా చెప్పుకునే ఈ పండుగలు ఖండాంతరాలకు వ్యాపించాయి.

బొడ్డెమ్మ

బొడ్డెమ్మ, బతుకమ్మలను పూవుల పండుగలుగా చెబుతారు. పూవులతో పూ చేయడం సాధారణం. కానీ పూవులనే పూజించడం విశేషం. బొడ్డెమ్మను పూజించడం అంటే ప్రకృతిని పూజించడమేనని భావిస్తారు. తెలంగాణ ప్రాంతంలో ‘బొడ్డి’ అంటే చిన్నపిల్ల అని అర్థం. మంచిభర్త లభించాలని కోరుతూ పెళ్లీడు పిల్లలు భాద్రపద బహుళ పంచమి లేదా దశమి నుంచి మహాలయ అమావాస్య వరకు ‘బొడ్డెమ్మ’ ఆడతారు (అధిక ఆశ్వయుజం వస్తే నిజ మాసం తిథుల ప్రకారం కార్యక్రమం ఆరంభ, ముగింపులు ఉంటాయి). బొడ్డెమ్మ పండుగను శరన్నరరాత్రులకు ముందు తొమ్మిది రోజులు జరుపుతారు. భాద్రపద బహుళ పంచమి నాడు బొడ్డెమ్మను తయారు చేస్తారు. ఆమెను వివిధ రూపాలుగా తీర్చిదిద్దుతారు. పసుపుతో తయారు చేయడం ఒక పద్ధతికాగా, పుట్టమన్నుతో బొడ్డెమ్మను చేసి చుట్టూ పందిరి వేస్తారు. దీనిని పందిరి బొడ్డెమ్మ అంటారు. చిన్న గుంతతీసి, దాని చుట్టూ పుట్టమన్నుతో గోపురం ఆకారంలో నిర్మిస్తారు. లేదా చెక్కపై పుట్టమన్నుతో ఐదు లేదా ఏడు దొంతర్లుగా గోపురం ఆకారంలో నిర్మిస్తారు. దానిపైన తులసీమొక్కను అలంకరిస్తారు. చాలా గ్రామాలలో బొడ్రాయి వద్ద లేదా ఆలయాల వద్ద బొడ్డెమ్మను ఆడతారు.

బతుకమ్మ

ఆదివాసుల నమ్మకాలతో పురుడు పోసుకున్న బతుకమ్మ పండుగ ‘పూల దేవత’గా పూజలందుకొని ఇక్ష్వాకులు, విష్ణుకుండినులు, చాళుక్యులు, కాకతీయులు కాలంలో పరిఢవిల్లి నేడు రాష్ట్ర పండుగగా అవతరించింది. బతుకమ్మ పూవనరుల లోని ప్రధానమైనది ‘తంగేడు’ రాష్ట్ర పుష్పంగా గుర్తింపు పొందింది.

బతుకమ్మను బతుకునిచ్చే అమ్మగా, ‘త్రిమాత’ల స్వరూపంగా పూజిస్తారు. ఈ పండుగ భాద్రపద అమావాస్యనాడు (ఈ నెల 6వ తేదీన) ప్రారంభ మవుతుంది. అప్పటికి ప్రకృతి పచ్చదనం కళకళ లాడుతూ రకరకాల పూవుల దొరుకుతాయి. తంగేడు వంటి సాధారణ పూలకే ఈ పండుగ సమయంలో గౌరవం ఎక్కువ. గునుగు పూలు, గడ్డిపూలు, కట్లెపూలు, గోరింట, పట్టుకుచ్చులు, చామంతి, బంతి, మందారం, మోదుగ, గన్నేరు, రుద్రాక్ష, కనంకాబరం, నిత్యమల్లి, గానుగు తదితర పూవులతో బతుకమ్మను ఏడు పొరలుగా వలయాకారంలో అలకంరిస్తారు. దేవతలు, పెద్దల, బతుకు పట్ల గల ఆరాధన భావానికి పూల శిఖరాన్ని ప్రతీకగా కొలుస్తారు. మొదటిరోజు మొగ్గలను సేకరించి పెదవులతో ఊది బతుకమ్మను పేరుస్తారు కనుక దీనిని ‘ఎంగిలి పూలు’ అంటారని జానపదులు భావిస్తారు. కాని దీనిని ‘తొలి’ అనే అర్థంలో వాడతారు. ఇది సామూహిక ఉత్సవం. ఇతర పండుగలు ఇళ్లకే పరిమితమైతే, దీనిని గ్రామకూడళ్లు, మైదానాలు, ఆలయ ప్రాంగణాలలో జరుపు కుంటారు. కొత్తగా పండిన సజ్జలను ఇచ్చిపుచ్చు కోవడం వల్ల ‘సజ్జల బతుకమ్మ’ అని వ్యవహరిస్తారు. చివరిరోజు నాటి పండుగను ‘పెద్ద బతుకమ్మ’ లేదా ‘సుద్దులు’ అంటారు.

 స్త్రీలు బతుకమ్మ చుట్టూ తిరుగుతూ చేతులు తడుతూ, పాటలు పాడతారు. వాటికి అనుగుణంగా కోలాటాలు వేస్తారు. రామాయణ, భాగవతాది కథలను జానపద బాణీలో ఆలపిస్తారు. లక్ష్మీ పార్వతుల స్తుతులతో పాటు సీత, అనసూయ, సావిత్రి, కన్యకాపరమేశ్వరి చంద్రమతి, సత్యభామ తదితరుల గాథలను, వైభవాన్ని పాటలుగా పాడ తారు. ముఖ్యంగా ఈ పండుగ సందర్భంగా పార్వతి ఆడపడచుగా పుట్టింటికి వచ్చిందని, నిమజ్జనం పక్రియతో అమెను మెట్టినింటికి తిరిగి పంపినట్లుగా భావిస్తారు. ఈ పండుగ నేపథ్యం గురించి అనేక కథలు ప్రచారంలో ఉన్నాయి. వివాహితలు మాంగళ్య రక్షణ కోరుతూ గౌరీదేవిని ప్రార్థిస్తారు.

నేపథ్యం

బతుకమ్మ పండుగకు సంబంధించి సామాజిక, చారిత్రక గాథలు ప్రచారంలో ఉన్నాయి. తంజావూరు బృహదీశ్వరాలయం నిర్మాణ సమయంలో చోళులు వేములవాడ చాళుక్యులను ఓడించి వేములవాడ భీమేశ్వరాలయంలోని శివలింగాన్ని తరలించుకు పోయారట. అందుకు విలపిస్తున్న పార్వతిని ఓదార్చి ఉల్లాసం కలిగించేందుకు పూలతో ఉత్సవం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందని ఒక కథనం. భూస్వాముల దాష్టీకాలను ప్రతిఘటించి బలైపోయిన ఒక గ్రామీణ మహిళ స్మృత్యర్థం ఈ పండుగను జరుపుకుంటున్నారని ఒక కథనం. చోళరాజ్యంలో ధర్మాంగదుడు, సత్యవతి దంపతుల పుత్రులంతా యుద్ధంలో వీరమరణం పొందగా, జగన్మాత వారికి కూతురుగా జన్మించి, తాను బతికి ఎన్నో బతుకులకు దారి చూపిన ‘బతుకమ్మ’గా ప్రాచుర్యంలోకి వస్తుందని మునులు ఆశీర్వదించారని చెబుతారు. ‘గుమ్మడి పూలు పూయగా బ్రతుకు/తంగెడి పసిడి చిందగ బ్రతుకు/గునుగు తురాయి కులకగ బ్రతుకు/కట్ల నీలిమలు చిమ్మగ బ్రతుకు/బ్రతుకమ్మా బ్రతుకు/అమ్మని మరువని సంతానము గని /బ్రతుకమ్మా బ్రతుకు..’ అని ప్రజాకవి కాళోజీ రాశారు.

నల్గొండ జిల్లా వాడపల్లిలో (ఓడపల్లి) బతుకమ్మకు సంబంధించి కాకతీయ గణపతి దేవుని కాలానికి చెందిన శాసనం లభించింది. కృష్ణా- మూసీనదుల సంగమ ప్రదేశంలో క్రీ.శ. 1211 ‘బ్రతుకేశ్వర స్థానం’ ఉండేదని ఆ శాసనం పేర్కొంది. అంటే అక్కడ బతుకమ్మలను నిమజ్జనం చేసేవారని బోధపడుతోంది. మేలుగుంటు సోదరులు సుమారు ఎనిమిది శతాబ్దాల క్రితం అక్కడ బతుకమ్మ గుడిని నిర్మించారు. కాకతీయ రుద్రమదేవి బతుకమ్మను ఆరాధించినట్లు సాహితీవేత్తలు పేర్కొన్నారు. ఆమె దేవగిరి రాజులపై విజయం సాధించి, రాజధాని ఓరుగల్లుకు చేరిన తరువాత విజయ సూచకంగా బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారని ఆచార్య తిరుమల రామచంద్ర రాశారు.

బొమ్మలకొలువు

శరన్నవరాత్రులలో మరో సంబరం బొమ్మల కొలువు. సంక్రాంతి, దసరా పండుగల సమయంలో వీటిని పెడతారు. ఈ రెండు సందర్భాలకు కొంత తేడా ఉంది. దసరా వేళలో బొమ్మల కొలువు కన్నెలు చేసుకునే వేడుక కాగా సంక్రాంతి వేళ పెట్టే బొమ్మల కొలువులో ముతైదువలు ప్రధానంగా పాల్గొంటారు. ఈ తొమ్మిది మెట్లు జగన్మాత ధరించిన నవ రూపాలకు, నవగ్రహాలకు చిహ్నమని చెబుతారు. దేవతామూర్తుల నుంచి అన్నిరకాల బొమ్మలు కొలువుతీరతాయి. అమ్మవారికి ప్రతిరోజు నైవేద్యం సమర్పిస్తారు. నవరాత్రులు ముగిసిన తరువాత ఆ బొమ్మలను తీసి భద్రపరుస్తారు. అయితే ప్రతి సంవత్సరం ఒక కొత్తబొమ్మనైనా ఈ ‘కొలువు’లో చేర్చాలని నియమం.

దసరా వేళ చుట్టుపక్కల పన్నెండేళ్లలోపు పిల్లలంతా అక్కడికి చేరి పాటలు పాడతారు. స్నేహసంబంధాలు ఏర్పడి, ఇచ్చిపుచ్చుకునే ఆరోగ్య కరమైన అలవాట్లు అలవడతాయనేది కూడా ఈ పండుగలోని ఆంతర్యం. బొమ్మలపెళ్లి ఇందులోని ముఖ్య వేడుక. మామూలు పెళ్ల్లిళ్లకు దీనిని నమూనాగా భావించవచ్చు. వివాహాల్లో కనిపించే హడావిడి, మర్యాదలు, పెట్టుపోతల విషయంలో వియ్యాలవారి కయ్యాలు, అప్పగింతలు, అలకలు, బుజ్జగింపులు, బతిమిలాటలు…లాంటివి ఈ వేడుకలో భాగాలు. ఈ సందర్భంగా పెద్దలు చెప్పే సుద్దులు భవిష్యత్‌లో దంపతులకు అవగాహన కోసం అలా నిర్దేశించేవారని భావించవలసి ఉంటుంది.

అయ్యవారికి…

దసరా అంటే పిల్లలకు సరదాయే కాదు. ఉపాధ్యాయులకూ ఆనందమే. ఇప్పుడది కనుమరుగైన అనుభూతి. వీధిబడుల కాలంలో ఉపాధ్యాయులు శిష్యులతో పూలబాణాలు పట్టించి ఊరిలోని ఇంటింటికి వెళ్లేవారు. విద్యార్థికి సంబంధించిన ఇంటికి రాగానే అతను వరుసలో ముందుకు వచ్చేవాడు. ‘దసరాకు వస్తిమని విసవిసలు పడక/ బహుమానాలు ఇచ్చి పంపండి వేగం’ అని గడుసుగా అడిగేవారు. తమకు పాఠం చెబుతున్నందుకు గురుదక్షిణ సమర్పించుకోలేక మిమ్మల్ని అర్థిస్తున్నాం అనే భావంతో ‘గురునకు దక్షిణల్‌ ‌కోరి యీదలచి/వెరపు తోడుత మిమ్ము వేడవచ్చితిమి’ అని పిల్లలు పాట రూపంలో తమ అశక్తను, గురుభక్తిని చాటిచెప్పేవారు. పెద్దలకు కోపం తెప్పించడం ఇష్టంలేక, వినయంగా ‘అయ్యవారికి చాలు ఐదు వరహాలు..పిల్లవాండ్రకు చాలు పప్పు బెల్లాలు’ అని తమకు తాము మినహాయింపునిచ్చుకునేవారు. తల్లిదండ్రులు కూడా ఆనందంగా తోచినంత ఇచ్చేవారు. ఇక్కడ ‘దసరా దక్షిణ’ సమర్పణ లేనిదే గురువుకు గడవదని అర్థం కాదు. పిల్లలకు లోకజ్ఞానం, దాతృత్వాన్ని నేర్పడం, పదిమందితో కలివిడిగా ఉండేలా చేయడం దీని తాత్పర్యం. ‘బతకలేక బడి పంతులు’ అన్న నానుడి ఉన్నప్పుడూ తృప్తిగా వెళ్లదీసిన కాలం అది.

– డా।। ఆరవల్లి జగన్నాథస్వామి, సీనియర్‌ ‌జర్నలిస్ట్

About Author

By editor

Twitter
Instagram