భారతదేశ చరిత్ర వక్రీకరణకు మూలం తప్పులతడక ఆర్య, ద్రావిడ లేదా ఆర్య దండయాత్ర సిద్ధాంతం. బ్రిటిష్‌ ‌వారికీ, రోమన్లకీ BCE 600లకు ముందు చరిత్ర లేదు. యూరప్‌ అం‌తటినీ పాలించడం వల్ల అక్కడి ప్రతి ప్రాంత ప్రజలు తాము రోమన్ల వారసులం అనుకుంటారు. కాబట్టి భారతదేశాన్ని పాలించిన ఇంగ్లిష్‌ ‌వారు, వారిని అనుసరించిన మన చరిత్రకారులు కూడా భారత చరిత్రను యూరప్‌ ‌చరిత్రకు కుదించి రాశారు.

బైబిల్‌ ‌ప్రకారం BCE 4004 అక్టోబర్‌ 23‌వ తేదీ ఉదయం తొమ్మిది గంటలకు భూమి ఆవిర్భవించిందని లెక్క గట్టారు. అక్కడినుంచి లెక్కవేస్తే ప్రళయం BCE 2448 సంవత్సరంలో జరిగింది. ఈ మూల సిద్ధాంతం ఆధారంగా భారత చరిత్రకారులు, ఇంగ్లీషు చరిత్రకారులు భారతదేశ చరిత్ర రచనను పెడతోవ పట్టించారు. శాస్త్ర సాంకేతిక విజ్ఞానం ప్రకారం భూమి 3.5 బిలియన్‌ ‌సంవత్సరా లకు ముందు నిర్మితమైంది. హైందవ సిద్ధాంతం ప్రకారం కూడా 3.3 బిలియన్‌ ‌సంవత్సరాలకు ముందు భూమి ఆవిర్భావించింది. ఈ విషయా లన్నిటినీ పక్కనపెట్టి బైబిల్‌ ‌సిద్ధాంతానికి అను కూలంగా భారత చరిత్రను కత్తిరించారు. ఈ కారణంతోనే భారత ఇతిహాసాల కాలాలు ఉనికిని కోల్పోయాయి.

మొదటిసారి భారతదేశంపై ఇస్లాం దండయాత్ర 711లో జరిగింది. కానీ బ్రిటన్‌ 597 ‌వరకు పూర్తిగా పాగాన్‌ (‌విగ్రహారాధన) ప్రభావంలోనే ఉంది. CE 597లో పోప్‌ ‌గ్రెగరీ బ్రిటన్‌లో మతాంతరీకరణ ప్రారంభించి CE 686 నాటికి పూర్తిగా మతాంతరీ కరణ చేశాడు. అంటే CE 600 వరకు బ్రిటిష్‌ ‌జాతీయులు పాగాన్‌ ‌మతస్థులే. ఇదే బ్రిటన్‌, ‌జర్మనీ, ఫ్రాన్స్ ‌వంటి దేశాలకు వర్తిస్తుంది. CE 337లో కాన్‌స్టాంటైన్‌ ‌తూర్పు రోమన్‌ ‌సామ్రాజ్యం చక్రవర్తి క్రైస్తవం తీసుకునే వరకు పాగాన్‌ ఆరాధనే ఉంది. BCE 600లకు ముందు వీరికి చరిత్ర లేదు. అందుకే ఒక నూన్యతతో భారతదేశ చరిత్రను కుదించే యత్నం చేశారు. ఇదంతా క్రైస్తవ భావజాలం కుట్ర.

1773లో విలియం జోన్స్ ‌భారతదేశానికి న్యాయ మూర్తిగా వచ్చాడు. ఇతడు భారత ఇతిహాసాలను సంకలనం చేసే ప్రయత్నంలో నవ ద్వీపంలో సంస్కృతం అభ్యసించాడు. అయినా క్రైస్తవ భావజాలం లోనే ఇరుక్కుపోయాడు. భూమి పుట్టుక దీజు 4004 అన్న మూల సిద్ధాంతం దగ్గరే ఉండిపోయాడు. దీజు 2448లో వచ్చిన ప్రళయం తర్వాత, భూమి గట్టి పడడానికి వెయ్యి సంవత్సరాలు పోతే BCE 1500 దగ్గరలో ఈ ఆర్యులు మధ్యాసియా లేదా రష్యా దక్షిణ ప్రాంతం నుంచి వచ్చారని సూత్రీకరించాడు. వాళ్లకు లేని చరిత్ర ఇతరులకు ఉంటే సహించలేకపోవడమే ఈ పోకడకు అసలు కారణం. సంస్కృతంతో జర్మన్‌కు పోలికలు ఉండేవి కాబట్టి జర్మన్లు సంస్కృతాన్ని ఇండో-యూరోపియన్‌ ‌భాషగా సొంతం చేసుకునే ప్రయత్నంలో తప్పిదాలకు పాల్పడ్డారు. రాజా రామ్మోహన్‌రాయ్‌ ‌మతం మారిస్తే భారతదేశం సులభంగా క్రైస్తవదేశం అవుతుందని భావించి CE 1818లో క్రైస్తవ మిషనరీలు రెవరెండ్‌ ‌విలియం ఆడమ్‌కు ఆ పని అప్పగించారు. రెవరెండ్‌ అడమ్స్ ‌రాయ్‌ని మతాంతరీకరణ చేయడానికి మూడేళ్లు యత్నించినా ఆయన బ్రహ్మ సమాజం ప్రారంభిం చాడు. ఈ దెబ్బకే మిషనరీలు హిందూధర్మంలో లేదా వేదాల్లో ఏముందని వెతకడం మొదలు పెట్టారు.

1887 సంవత్సరంలో మాక్స్ ‌ముల్లర్‌ను వేదాలను తర్జుమా చేసే పనికి కుదుర్చుకున్నారు. ఇతడు కూడా పూర్తిస్థాయి క్రైస్తవ మనస్తత్వం కలిగిన వాడే. తన తల్లికి ఉత్తరం రాస్తూ మాక్స్ ‌ముల్లర్‌, ‌పూటకు 4 పౌండ్ల చొప్పున 400 పుటలు తర్జుమా చేసే పని దొరికిందని తెలిపాడు. మ్యాక్స్ ‌ముల్లర్‌ అనే ఆ జర్మన్‌ ‌జాతీయుడు ఆరు సంవత్సరాలు మాత్రమే వేదాధ్యయనం చేశాడు. ఈ జర్మన్‌ ‌జాతీయుడే ఆర్య దండయాత్ర సిద్ధాంతానికి ప్రాణం పోశాడు. తరువాత వేదాల మీద విపరీత వ్యాఖ్యలు చేసే ధోరణలకు అవకాశం కల్పించాడు. తన భార్యకు ఉత్తరం రాస్తూ తనకున్న హిందూ వ్యతిరేక, క్రైస్తవ అనుకూలతల గురించి స్పష్టంగానే రాశాడు. ‘చూడటానికి నేను బతికి ఉండకపోయినా దానికి నేను చేస్తున్న అనువాదం (హిందూధర్మానికి) ఇకపై ఇండియా తలరాత మీద చాలా ప్రభావం చూపుతుంది. వారి మతానికి ఇదే తల్లి వేరు. మూడు వేల ఏళ్లుగా దాని నుంచి పుట్టుకొచ్చిన వాటిని సమూలంగా పెకలిగించటానికి, ఆ వేరును తీసి వారికి చూపించడమే ఏకైక మార్గమని నా గట్టి నమ్మకం’ అని తెలిపాడు. అంతేకాకుండా అతని ఉద్దేశం ప్రకారం, ‘సెయింట్‌ ‌పాల్‌ ‌కాలం నాటి రోమ్‌, ‌గ్రీకు కన్నా ఇప్పుడు భారతదేశం మతమార్పిడి అను కూలంగా ఉంది’. ఈ సంగతి కూడా భార్యకు రాసిన ఉత్తరంలోనే రాశాడు. ఈ విధమైన భావజాలం ఉన్న వ్యక్తి భారతదేశ చరిత్రను, వేదాలను వక్రీకరించే పనికి మూలమ య్యాడు. తరువాతి కాలంలో జర్మన్లు ఆర్య అనే పదాన్ని సొంతం చేసుకోవడమే కాదు, ఆ పదాన్ని గర్వకారణంగా భావించడం, సంస్కృత భాష అధ్యయనం పైన పట్టు సాధించడం, CE 1871 యుద్ధంలో ఫ్రాన్స్‌ను ఓడించి బలీయమైన శక్తిగా జర్మన్‌ ఎదగడం జరిగిపోయాయి. కానీ ఆంగ్లేయులతో అతనికున్న సంబంధం కారణం చేత తన పైన ఉన్నటువంటి జర్మన్‌-ఆర్య పేరు తొలగించుకునేందుకు తన బాణీని మాక్స్‌ముల్లర్‌ ‌మార్చాడు. ఆర్య అనేది జాతి కాదు, అది ఒక భాషా పదమని చెప్పడం మొదలుపెట్టాడు. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.

ఇదంతా ప్రజల మధ్య విభజనకు కారణ మయింది. ఆర్యులు భారతదేశంపై దండయాత్ర చేసి, ఇక్కడ ఉన్న దాసులు లేద ద్రావిడులను దక్షిణ భారతానికి తరిమివేశారని బాగా ప్రచారంలోకి వచ్చింది. ఆర్యులు తెల్లగా ఉంటారనీ, దాసులు /ద్రావిడులు నల్లగా ఉంటారనీ, ఆర్యులు విష్ణువును పూజిస్తారనీ ద్రావిడులు శివుడిని పూజిస్తారనీ ప్రచారం చేశారు. ఈ వాదానికి సర్‌ ‌మొర్టీయేర్‌ ‌వీలర్‌ ‌వంటి వారు ఆజ్యం పోశారు.

కానీ ఇవన్నీ ఒక కల్పన ప్రకారం చెప్పినవే. విలియం జోన్స్, ‌మాక్స్ ‌ముల్లర్‌, ‌మొర్టీయేర్‌ ‌వీలర్‌ – ఎవరు చెప్పిన విషయాలైనా, వీటికి శాస్త్ర పరమైన కొలమానం ఏమీ లేదు.

ఆర్య ద్రావిడ సిద్ధాంతాన్ని బలంగా విశ్వసించే తమిళభాషలో కొన్ని అక్షరాలను ఉత్తరాది అక్షరాలు అంటారు. సంస్కృతం సంపూర్ణమైన భాష. ద్రావిడ వాదాన్ని బలంగా విశ్వసించే తమిళంలో ‘హా, ప, గ’ లాంటి అక్షరాలు లేవు. కానీ తెలుగులో స్పష్టమైన అక్షరాలు ఉన్నాయి.

తమిళనాడు పరిస్థితి విచిత్రం. పెరియార్‌ ఈ ‌రామస్వామి నాయకర్‌ అనే హిందూ వ్యతిరేకి వాదన ఎంత అశాస్త్రీయమో అంచనాకు అందదు. ఇతడు బ్రాహ్మణులను ఆర్యులంటాడు. ఇతరుల ద్రావిడులు అని ప్రతిపాదించాడు. అందుకే ఇది ఆతని మూర్ఖత్వానికి పరాకాష్టగా చెప్పాలి.

ఆర్య ద్రావిడ సిద్ధాంతానికి కల్పనలు తప్ప శాస్త్రీయ, పరిశోధన పునాదిగా ఉన్న సిద్ధాంతం లేదు. అందుకే ఆర్య ద్రావిడ సిద్ధాంతాన్ని తప్పు అనడానికి అనేకమైన సిద్ధాంతాలు పుట్టుకొచ్చాయి. మొదటగా డాక్టర్‌ ‌భీంరావు రాంజీ అంబేడ్కర్‌ ‌స్పష్టంగా శాస్త్రీయంగా ఆర్య ద్రావిడ సిద్ధాంతం తప్పుని నిరూ పించారు. తన Who Were The Sudras పుస్తకంలో పూర్తి స్థాయిలో ఆర్య అనే పదం సంబోధనార్థమేననీ, గౌరవ వాచకమనీ ఆయన చెప్పారు. రుగ్వేదం ఆధారంగా ఆయన ఈ విషయం తెలియజేశారు. ఆర్యులు బ్రాహ్మణులయితే శూద్రులు కూడా బ్రాహ్మణులేని చెప్పారు. ఇక రంగు (వర్ణం) గురించి చెబుతూ డాక్టర్‌ అం‌బేడ్కర్‌, ‌శ్రీరామచంద్రుడు నల్లగా ఉంటాడని తన పుస్తకంలో తెలియజేశారు. ఆ ప్రకారం ఈ సిద్ధాంతం తప్పేనని తిరుగులేకుండా ఆవిష్కరించారు.

ఉత్తర భారతదేశంలో విష్ణువును పూజిస్తారు అన్న వాదన ఎంత అసంబద్ధమైనదో వేరే చెప్పక్కరలేదు. ఉత్తర భారతంలో శైవ ఆరాధన లేదనడమే అంధత్వానికి పరాకాష్ట కూడా. అక్కడ అనాదిగా సేవలందుకుంటున్న పుణ్యక్షేత్రాలే ఇందుకు సాక్ష్యం చెబుతాయి. కేదార్‌నాథ్‌, ‌సోమనాథ్‌, ‌పశుపతినాథ్‌, అమర్నాథ్‌, అన్నింటికీ మించి కాశీ లాంటి పవిత్ర క్షేత్రాలు ఉత్తర భారతదేశంలోనే ఉన్నాయి. దక్షిణ భారతదేశమంతటా శివుని పూజిస్తారంటే తిరుమల వేంకటేశ్వరస్వామి, శ్రీరంగం, గురువాయుర్‌, ‌తిరువనంతపురం వంటి గొప్ప వైష్ణవ క్షేత్రాల మాటేమిటి? కాబట్టి ఈ వాస్తవాలు తెలియని మూర్ఖులు మాత్రమే ఉత్తర భారతదేశం విష్ణువుకీ, దక్షిణ భారతదేశం శివుడికీ కేంద్రాలని మొండి వాదనకు దిగుతారు.

ఇక శాస్త్రీయ పరిశోధనల విషయం చూద్దాం. CCMB హైదరాబాద్‌, ‌హార్వర్డ్ ‌MIT సంయుక్త శాస్త్రవేత్తలు లాల్జిసింగ్‌, ‌కుమారస్వామి దేశంలోని అన్ని జాతులు అన్ని ప్రాంతాలు వారి రక్త నమూనాలు సేకరించి డీఎన్‌ఏలను విశ్లేషించారు. ఆ విశ్లేషణలో తేలిన విషయం ఏమిటంటే, ఉత్తర, దక్షిణ భారత ప్రజల మధ్య ఎటువంటి తేడా లేదు. భారతీయు లందరూ ఒకటే. కాబట్టి ఆర్య ద్రావిడ సిద్ధాంతం శుద్ధ తప్పు.

 ఇక రెండవ సిద్ధాంత పరమైన రుజువు- డెక్కన్‌ ‌కాలేజ్‌ ‌పూనాకు చెందిన ప్రొఫెసర్‌ ‌వసంత షిండే, డాక్టర్‌ ‌నీరాజ్‌ ‌రాయ్‌, ‌హర్యానా రకన్గిరిలో దొరికిన అస్థిపంజరాలపై చేసిన పరిశోధన ఆధారంగా ఆర్య దండయాత్ర సిద్ధాంతం తప్పని ప్రకటించారు.

1958లో అమెరికన్‌ ‌శాస్త్ర పరిశోధకుడు హ్యారి హీక్స్ ‌ఢిల్లీ మార్కెట్లో ఒక ఒక విగ్రహాన్ని కనుగొన్నాడు. దానికి ప్రపంచ ప్రసిద్ధ నిపుణుడు రాక్‌ ఆం‌డర్సన్‌తో కలిసి కాలిఫోర్నియా స్విట్జర్లాండ్‌లలో, ఆధునిక ప్రయోగశాలలో అనేక రేడియోకార్బన్‌ ‌మెటలర్జికల్‌ ‌పరీక్షలు చేశారు. ఆ బొమ్మ BCE 3,700 నాటిదని తేలింది. Analysis of Indo _ European Vedic Aryan Head 4th millennum BC అనే వ్యాసంలో (journal of Indo- European studies vol 18 page, 425-46)1990 హిక్స్, ఆం‌డర్సన్‌ ఇదే విషయాన్ని ప్రకటించారు. ఆ పరిశోధన బట్టి క్రీస్తుపూర్వం 1500కు ముందే భారతదేశంలో పైన చెప్పిన వస్తు నిర్మాణం, లోహసంగ్రహణ ఉంది. కాబట్టి అప్పటికే భారతదేశం ఎంతో అభివృద్ధి చెంది ంది. దీన్ని బట్టి మనకు తెలిసేది ఏమిటంటే 1500లో దండయాత్ర తప్పు.

ఇక రామసేతువు, ద్వారకా నగరాల మీద పరిశోధన చేసిన శాస్త్రజ్ఞులు అది 30 వేల పైచిలుకు సంవత్సరాల ముందు నిర్మించారని తెలిపారు.

కాబట్టి వీరు చెప్పినట్టు ఆర్యులు దీజు 1500లో వచ్చినారు అనేది పూర్తి మూర్ఖత్వంతో కూడిన సూత్రీకరణ అని స్పష్టమవుతోంది. ఏ విధమైన శాస్త్ర పరిశోధనలు లేనటువంటి సిద్ధాంతాన్ని అను కూలంగా మాట్లాడేవాళ్లకి ఈ విషయాలైనా కనువిప్పు కలిగిస్తాయని ఆశించాలి. భారతీయులంతా ఒక్కటే అనే విషయాన్ని మనం గుర్తించాలి.

– మహేష్‌ ‌డేగల, 9704568017, రాష్ట్ర అధ్యక్షులు, హిందూ ఉపాధ్యాయ సమితి

About Author

By editor

Twitter
Instagram