అక్టోబర్‌ 15 ‌విజయదశమి

దేశంలోని అష్టాదశ పీఠాలు సహా అనేకానేక శక్తిక్షేత్రాలలో శ్రీ ప్లవనామ సంవత్సర ఆశ్వయుజ శుక్ల పాడ్యమి నుంచి దేవీ నవరాత్రుల ఉత్సవాలు కొనసాగుతున్నాయి. నవరాత్రులలో ప్రధాన ఘట్టాలు సరస్వతీపూజ, దుర్గాష్టమి, మహర్నవమి, విజయదశమి, శమీపూజలను జరుపుకుంటారు. కొవిడ్‌ ‌మహమ్మారి మూడవ దశ పొంచి ఉందన్న హెచ్చరికలతో ప్రభుత్వాల మార్గదర్శకాల మేరకు తగు జాగ్రత్తల మధ్య పూజాదికాలు నిర్వహిస్తున్నారు. ఊరూవాడా మహిళలు ఒక్కచోట చేరి జరుపుకునే బొడ్డెమ్మ, బతుకమ్మ పండుగలు సీదాసాదాగానే సాగుతున్నాయి.

ఆశ్వయుజ శుక్ల దశమిని విజయదశమి లేదా ‘దసరా’ అనీ అంటారు. దశవిధ పాపాలను హరించేది కనుక ‘దశహరా’అని, కాలక్రమంలో ‘దసరా’గా వాడుకలోకి వచ్చిందని పెద్దలు చెబుతారు. ఇది దుష్టశిక్షణకు, శిష్ట రక్షణకు ప్రతీక. లోకకంటకుల పట్ల రౌద్రం ప్రదర్శించిన జగన్మాత నమ్మిన వారికి కొంగు బంగారమై కరుణ కురిపిస్తూ ‘అమ్మలగన్న అమ్మ’గా పూజలందుకుంటోంది. శ్రవణానక్షత్రంతో కూడిన ఆశ్వయుజ శుక్ల దశమినాడే ‘విజయ’ ముహూర్తం వస్తుందని, ఆ రోజునే క్షీరసాగర మధనం జరిగి అమృతం ఉద్భవించిందని పురాణాలు చెబుతున్నాయి.

సరస్వతీ పూజ

శరన్నవరాత్రులలో అతి ముఖ్యమైనది సప్తమి తిథి మూలానక్షత్రం రోజు జగన్మాతను సరస్వతీ అలంకారంలో అర్చిస్తారు. అమ్మవారిది మూలా నక్షత్రం కనుక ఆనాడు ఆదిశక్తిని విద్యల దేవత ‘సరస్వతీదేవి’గా అలంకరిస్తారు. దుష్టశిష్టణ, శిష్టరక్షణ కోసం అవతరించిన శక్తి స్వరూపిణి జగన్మాత మానవజాతి సకల దోషాలను హరించడంతో పాటు జ్ఞానజ్యోతిని వెలిగించ సంకల్పించారు. ఆ క్రమం లోనే సరస్వతీ అవతారంతో అనుగ్రహించారు. ‘దైవం మంత్రాధీనం’ అంటారు సద్గురువులు. ఆ మంత్రాలకు అధిదేవత, ఆరాధ్యదేవత సరస్వతీమాత. అనంతమైన అక్షర మహిమతోనే జ్ఞానం వెలుగులు చిమ్ముతుంది. మాఘమాసంలో వసంత పంచమి నాడు చేసే సరస్వతీ పూజ దుర్గాదేవీ నవరాత్రులలోనూ ఒక రోజు చోటుచేసుకోవడం విశేషం. వ్యాసభగవానుడు మహాభారతంలో సరస్వతిని వేదమాతగా అభివర్ణిం చారు. ‘అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపు టమ్మ…’ పద్యంలో ‘కృపాబ్ధి ఇచ్చుత మహత్త్వ కవిత్వ పటుత్వ సంపదల్‌’ అం‌టూ కృపాసముద్రురాలైన జగన్మాత విద్యాప్రదాయినిగా కవిత్వ సంపద ఇస్తుందని పోతనామాత్యుడు అభివర్ణించారు. వ్యాసుడు ప్రతిష్టించినట్లు చెప్పే బాసరలోని జ్ఞానసరస్వతి క్షేత్రంలో ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుంచి నవరాత్రులు నిర్వహిస్తారు. శ్రద్ధాభక్తులతో అర్చిస్తే చదువుల తల్లి ప్రసన్నురాలై జ్ఞానభిక్ష ప్రసాదిస్తుందని విశ్వాసం. ఆ క్రమంలోనే మూలా నక్షత్రం సందర్భంగా పిల్లలతో పాఠశాలల్లో సరస్వతీ పూజ నిర్వహిస్తారు. బడి ఈడు పిల్లలకు అక్షరా భ్యాసం కూడా చేపడతారు.

దుర్గాష్టమి

మంచికి పెట్టని కోటలాంటి జగన్మాత తత్త్వమే దుర్గ. ‘దుం దుర్గే దురితం హరా’…అని జపించడం వల్ల సమస్త అశుభాలను తొలగిస్తుందని భక్తుల విశ్వాసం. సాధించడం కష్టసాధ్యమైన దానిని ‘దుర్గ’ అంటారు. అందుకే అమ్మవారు కదనానికి సన్నద్ధమైతే ‘దుర్గాదేవి’గా మారతారట. అత్యంత శక్తిమంతుడైన దుర్గముడనే రాక్షసుడిని అమ్మవారు ఆశ్వయుజ శుక్ల అష్టమి నాడు సంహరించారు. రాక్షస సంహారం చేయాలంటూ దేవతలు అమ్మకు మొరపెట్టుకున్నారని, అందుకు మహాయ్ఞం నిర్వహించి తమ ఆయుధాలను యజ్ఞగుండంలో సమర్పించారని దేవీ భాగవతం బట్టి తెలుస్తోంది. వాటిలో భక్తి, జ్ఞానం, యోగమనే త్రిశక్తుల కలయిక శివుడి త్రిశూలం ఒకటి కాగా, విష్ణుమూర్తి చక్రం మరొకటి. ఇలా దేవతల నుంచి మొత్తం పద్దెనిమిది ఆయుధాలు గ్రహించి ఆ అసురుడిని అంతమొందించారు అమ్మవారు. పశువులు ఎరుపురంగును చూస్తే చికాకు పడతాయి. అగ్నిని చూస్తే ఆశ్వయుజ వెనుకంజవేస్తాయి. ఆ కోణంలోనే మహిషాసురుడిని సంహరించేందుకు అమ్మవారు అగ్నిధారణతో, ఎరుపు వస్త్రాలు ధరించి దండెత్తారట.

మహర్నవమి

దేవీనవరాత్రులలో విజయంతో పాటు మోక్ష సాధన కోసం అపరాజితదేవిని అర్చించేవారట. ప్రకృతిని ఆవహించి ఉండే ‘అపరాజిత’ను పూజించడం వల్ల శత్రుభయం పోయి జీవితం సుఖ శాంతులతో సాగుతుందని విశ్వాసం. మహిషాసుర వధను అందుకు ఉదాహరణగా చెబుతారు. లోకకంటకుడైన రక్తబీజుడనే రాక్షసుడిని అమ్మవారు నవమి నాడు అంతమొందించారని ఐతిహ్యం. లోక శుభంకరి, శాంతస్వరూపిణి జగన్మాత.. శత్రు సంహారంలో రౌద్రరూపం దాలుస్తారనేందుకు ఆ గాధ ఓ ఉదాహరణ. పురాణం ప్రకారం, రక్తబీజుడు తపస్సు చేసి మహిళను అబలగా పరిగణిస్తూ, ఆమె చేతిలో తప్ప అజేయుడిగా వరం పొందాడు. ఒకవేళ మరణం అనివార్యమైతే… భూమి మీద చిందే తన ప్రతి రక్తపు బిందువు నుంచి తన రూపం ఉద్భవించేలా వరం దక్కించుకున్నాడు. దరిమిలా అతని ఆగడాల• పెచ్చు పెరగసాగాయి. దానవ బాధితులు త్రిమూర్తులను ఆశ్రయించగా, వారి సూచన మేరకు ఆ దానవ సంహరణ బాధ్యతను అమ్మవారు స్వీకరిస్తారు. అతనిని పెళ్లాడాలనుకుంటున్నట్లు కబురు పంపడంతో అంగీకరిస్తాడు. అయితే తనతో యుద్ధం చేసి గెలవాలని షరతు విధించారు అమ్మవారు. త్రిలోక విజేతనైన తనను అబల ఏమీ చేయలేదన్న ధీమాతో సమరానికి అంగీకరిస్తాడు. రక్తబీజుడు కోరిన వరం మేరకు అతని రక్తబిందువులు నేలరాలకుండా అమ్మవారు నాలుకనే భూమిపై పరచి తొమ్మిది రోజులపాటు సాగిన యుద్ధంలో అతనిని అంతమొందిస్తుంది. శత్రుసంహార సమయంలో అమ్మవారు ఉగ్రస్వరూపిణీగా ఉంటారట. ‘క్రోధేచ కాళీ’ అంటారు. ‘కాల’ అంటే మృత్యువు. శత్రు వినాశన సమయంలో అంత క్రోధం ప్రదర్శించిన అమ్మవారు, మరునాడు ప్రసన్నత, సుందరదరహాసం, శాంతస్వరూపంతో రాజరాజేశ్వరీదేవిగా దర్శన మిస్తారు.

విజయదశమి

అసురత్వం (రాక్షసత్వం)పై దైవత్వం, చెడు మీద మంచి సాధించిన రోజు విజయదశమి. శ్రవణా నక్షత్రంతో కూడిన ఆశ్వయుజ శుక్ల దశమినాడే క్షీరసాగర మధనంలో అమృతం ఉద్భవించిందని పురాణాలు చెబుతున్నాయి. దేవాసుర సమరంలో పరాజితులైన దేవతలు శరన్నరాత్రులలో ఇష్ట దేవతలను అర్చించి దశమినాడు విజయు లయ్యారట. పాండవుల అజ్ఞాతవాస ఆరంభం, ముగింపు ఈ రోజుననే అని మహాభారతం పేర్కొంటోంది. రాజులు తమ విజయయాత్రలకు ఈ ‘దశమి’నే ముహూర్తంగా నిర్ణయించేవారట. దుర్గాదేవికి గల అనేక నామాలలో ‘అపరాజిత’ (పరాజయం లేనిది) ఒకటి. ఆమె విజయానికి అధిదేవత. విజయదశమి నాడు ఆమెను ఆరాధిస్తే జయం కలుగుతుందని విశ్వాసం. ‘దశమి’నాడు కనకదుర్గమ్మ వారు రాజరాజేశ్వరీదేవిగా భక్తులను అనుగ్రహిస్తారు. అమ్మవారిని ఈ అలంకారంలో దర్శిస్తే సకల శుభాలు, విజయాలు సిద్ధిస్తాయని విశ్వాసం. ఆ రోజ సాయం సమయంలో చుక్కలు పొడిచే సమయానికి ‘విజయ ముహూర్తం’ అని పేరు. ఆ సమయంలో ప్రారంభించే పనులు విజయవంత మవుతాయని, అందుకే ఆ రోజుకు విజయదశమి అని పేరు వచ్చిందని చెబుతారు. విద్యాభ్యాసం ఆరంభం సహా సకల శుభకార్యాలకు దీనిని శుభ సమయంగా భావిస్తారు. ఆనాడు ఆయుధపూజ నిర్వహిస్తారు. వేదపండితులతో వేదపారాయణం చేయించేవారు. దీనినే ‘వేదసభ’ అంటారు.

కోల్‌కతాలోని కాళీఘాట్‌ ‌ప్రాంతంలోని కాళీ ఆలయంలో (కలకత్తా కాళీ), దక్షిణేశ్వర్‌ ‌ప్రాంతంలో హుగ్లీ నదీతీరంలోని కాళీమాత (భవతారిణి మాత) ఆలయంలో దసరా ఉత్సవాలు వైభవంగా జరుగు తాయి. రావణునితో యుద్ధంలో రాముడి విజయానికి చిహ్నంగా ‘రామ్‌లీలా’ పేరిట ఉత్తరాదిలో రావణ దహన ఘట్టాన్ని అట్టహాసంగా నిర్వహిస్తారు. ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లోని పరవురామే శ్వర ఆలయంలో లభించిన క్రీ.శ. ఆరవ శతాబ్దం నాటి శిల్పం ఆధారంగా దేవీ నవరాత్రులు ఘనంగా నిర్వహించే వారని తెలుస్తోంది. బెంగాల్‌, అస్సోం రాష్ట్రాలలో తమ ఆడపడుచు పార్వతీదేవి పుట్టింటికి వచ్చినట్లుగా భావించి పండుగ జరుపుకుంటారు. గుజరాత్‌లో దాండియా నృత్యం చేయడం సంప్రదాయం. శ్రీకృష్ణుడి కోడలు ఉష (అనిరుద్ధుని భార్య) ఈ నాట్యాన్ని ప్రవేశపెట్టిందని అక్కడి వారి విశ్వాసం. శ్రీకృష్ణుని లీలలు, ఆదిపరాశక్తి గాథలను ఆలపిస్తూ నృత్యం చేస్తారు.

ఉభయ తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఆంధప్రదేశ్‌లోని విజయవాడ ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మకు నవరాత్రి ఉత్సవాలలో భాగంగా కృష్ణానదిలో అమ్మవారికి తెప్పోత్సవం ఘనంగా నిర్వహిస్తారు. శ్రీశైలంలో భ్రమరాంబదేవికి, తెలంగాణలోని అలంపురం జోగులాంబదేవి, వరంగల్‌లోని భద్రకాళికాదేవి తదితర ఆలయాలలో ఘనంగా వేడుకలు నిర్వహిస్తున్నారు.

శమీ పూజ

‘శమీ’ అంటే పాపాలను, శత్రువులను నశింప చేసేది అని అర్థం. శమీ (జమ్మి) వృక్షంలో అపరాజితాదేవి కొలువై ఉంటుందని విశ్వాసం. క్షీరసాగర మథనంలో ఉద్భవించిన వాటిలో ఇదీ ఒకటి. శమీవృక్షాన్ని పూజించడం విజయదశమి నాటి మరో విశేష కార్యక్రమమని, జమ్మికొమ్మ లేదా సమిధకు ప్రదక్షిణ చేస్తే తొమ్మిది రోజుల పూజలో లోపాలు ఉంటే పరిహారమవుతాయని, దశమినాడు జమ్మిచెట్టును పూజించడం వల్ల లక్షీదేవి ప్రసన్న మవుతుందని విశ్వాసం. విజయదశమి నాడు ఈ వృక్షం వద్ద అపరాజితా దేవిని పూజించి ‘శమీ శమయతే పాపం శమీ శత్రు వినాశినీ/అర్జునస్య ధనుర్ధారీ రామస్య ప్రియవాదినీ’ అని ప్రదక్షిణలు చేస్తే శనిదోషాలు తొలగిపోతాయని చెబుతారు. రావణవధకు ముందు శ్రీరామచంద్రుడు అపరాజితా దేవిని, శమీవృక్షాన్ని అర్చించాడట. అజ్ఞాతవాసం కాలంలో పాండవులు ధనుర్బాణాలను శమీవృక్షం పైనే భద్రరపరిచారు. జమ్మి ఆకులను పవిత్రంగా భావించి పెద్దలకు ఇచ్చి ఆశీస్సులు పొందడం, బంధుమిత్రులకు, ఆత్మీయులకు ఇచ్చి శుభాకాంక్షలు తెలపడం ఆనవాయితీ. ఈ ఆకులను ‘బంగారం’ అనీ వ్యవహరిస్తారు. తెలంగాణ గ్రామీణ ప్రాంతాలలో ఈ సంప్రదాయం ఇప్పటికీ కనిపిస్తుంది.

పాలపిట్ట దర్శనం దసరా పండుగలో మరో ప్రాధాన్యం గల అంశం. పాలపిట్టను భక్తిప్రపత్తులతో చూస్తారు. పాండవులు వనవాస, అజ్ఞాతవాసాలు ముగించుకొని తిరిగి వస్తుండగా దాని దర్శనమైందని, అప్పటి నుంచి విజయాలు వరించాయని జానపద గాథలు ఉన్నాయి. అప్పటి నుంచి ఈ పండుగనాడు ఆ పక్షి దర్శనాన్ని శుభసూచకంగా భావిస్తారు. తెలంగాణ సహా ఒడిశా, కర్ణాటక, బిహార్‌ల రాష్ట్ర పక్షి పాలపిట్ట కావడం గమనార్హం.

దేవరగట్టు ఉత్సవం

విజయదశమి పండుగలో భాగంగా వివిధ ప్రాంతాలలో జరుపుకునే ఉత్సవాలలో విలక్షణమైనది ఆంధప్రదేశ్‌లోని కర్నూలు జిల్లాలో ‘దేవరగట్టు కర్రల సమరం’ (దేవరగట్టు ఉత్సవం) ఆ రోజు రాత్రి కాగడాల కాంతుల్లో జరుపుకునే దీనినే ‘బన్ని ఉత్సవం’ అనీ అంటారు. ప్రచారంలో ఉన్న కథనం ప్రకారం, ‘త్రేతాయుగంలో మణి, మల్లాసురులనే రాక్షసుల బాధలు భరించలేని మునులు పార్వతీపరమేశ్వరులను శరణుకోరారు. వారికి అభయమిచ్చిన ఆదిదంపతులు రాక్షస సంహారానికి మాల, మల్లేశ్వరులగా అవతరించారు. అయితే దేవమానవుల వల్ల పొంచి ఉన్న ముప్పునుంచి తమను కాపాడవలసిందిగా రాక్షసులు అప్పటికే శివుడిని ఆశ్రయించి వరం పొందారు. దీనితో శివపార్వతులు దేవమానవులుగా కాకుండా భైరవరూపంలో తొమ్మిది రోజులు పోరాడి దానవులను సంహరించారు. భైరవమూర్తులను తమ ఆరాధ్య దైవాలుగా గుర్తించిన రాక్షసులు, తమకు ముక్తిని ప్రసాదించాలని, విజయదశమి నాడు పిడికెడు మానవ రక్తమైనా సమర్పించేలా చూడాలని వేడుకున్నారట. అప్పటి నుంచి ఈ ‘సమరం’ సాగుతూ వస్తోందని కథనం. ఆ ప్రాంతం చుట్టుపక్కల గ్రామాలు కొత్తపేట, నెరిణికి, నెరిణికి తండా తదితర గ్రామాల వారు ఇనుప వృత్తాలు తొడిగిన కర్రలు చేతబూని ‘స్వామి ఉత్సవం తమదంటే తమదం’టూ పరస్పరం అడ్డుకుంటారు. ఈ క్రమంలో తలలు పగిలినా వెనుకంజవేయరు. ఉత్సవ విగ్రహాలను ఊరేగించిన తరువాత ఒక భక్తుడు తొడకోసి పిడికెటు రక్తాన్ని ధారపోసి, అనంతరం ఆలయానికి చేరుకుని భవిష్యవాణి చెబుతారు. ఈ కాలంలో ఇది వింతగా అనిపించినా, ‘ఇది ఆచారంగా వస్తున్న ఆరాధనే కానీ ఆటవికం కాదు’ అని స్థానికులు చెబుతారు.

– డా।। ఆరవల్లి జగన్నాథస్వామి, సీనియర్‌ ‌జర్నలిస్ట్

About Author

By editor

Twitter
Instagram