శ్రీమద్రామాయణం చతర్వేదసారమని ప్రతీతి. నాలుగు వేదాలు దశరథ తనయులుగా ఆయన ఇంట ఆడుకున్నాయని ఆధ్యాత్మికవాదులు సంభావిస్తారు. య్ఞయాగాది క్రతుసంబంధిత మంత్రసహిత రుగ్వేద యజుర్వేదాలను రామలక్ష్మణులతో అభివర్ణిస్తారు. అందుకే విశ్వామిత్రుడు తన యాగసంరక్షణకు ఆ అపూర్వ సోదరులను వెంటతీసుకు వెళ్లారట. ఆ వేదసారం వాల్మీకి మహర్షి మోము నుంచి ఆదికావ్యంగా ప్రభవించింది. తమసా నదీ తీరాన బోయవాడి బాణానికి నేలకూలిన మగ క్రౌంచపక్షిని చూసిన శోకంతో పలికిన పలుకులు చంధోబద్ధమైన శ్లోకమై రామకథకు నాంది అయింది. విధాత ఆదేశానుసారం రామాయణ కావ్య రచనకు ఉపక్రమించిన వాల్మీకి మునికి బ్రహ్మ మానసపుత్రుడు నారదుడు రామాయణ గాథను సంక్షిప్తంగా వివరించారు.

‘ఇక్ష్వాకు వంశ ప్రభవో రామో నామ జనైఃశ్రుతః

నియతాత్మా మహావీర్యౌ ద్యుతిమాన్‌ ‌ధృతిమాన్‌ ‌వశీ’

అని శ్రీరాముడి సుగుణాలను నారదుడు వర్ణించగా విన్న వాల్మీకి ఆయనను సభక్తిగా అర్చించాడు. రామాయణాది పురాణ రచనకు ప్రతిభ మాత్రమే సరిపోదట. అచంచలమైన భక్తి, విశ్వాసాలు ఎంతో అవసరమట. త్రిమూర్తులు, సప్తరుషులు, నారదాది మహనీయుల అనుగ్రహపాత్రుడైన ఆయనలో భక్తి, విశ్వాసాలకు కొదువలేదు. వాటితోనే రామకథ పాత్రలను అజరామరం చేశారు.

ఈ పవిత్ర భూమిపై సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే శ్రీరామచంద్రమూర్తిగా మానవ రూపంలో అవత రించాడని ఆస్తికుల విశ్వాసం. ఆర్షధర్మబద్ధమైన జీవన విధానానికి, సచ్ఛీలత, సత్ప్రవర్తనలకు ఆయన మార్గదర్శి. ‘రామస్య అయనమ్‌’-‌రామాయణం. మానవ జీవితాలకు మార్గదర్శనం చేసే దివ్యసుధ. మనిషిని ‘మనీషి’ని చేసిన మానవీయ కావ్యం. దుష్టశిక్షణ, శిష్ట రక్షణ అనేది ఇతర అవతారాల మాదిరిగానే రామావతారం పరమార్థం అయినప్పటికీ, అంతకు మించిన మహోన్నతాశయం దాగి ఉంది. భగవంతుడు లీలలు ప్రదర్శించడం ఇతర అవతారాలలో సర్వసాధారణం. కానీ మహోన్నత వ్యక్తిత్వం కలిగిన మనిషి భగవంతుడిగా మారవచ్చని చెప్పిన అవతారమిది. ‘మానవుడే మహనీయుడు.. మానవుడే మాననీయుడు’ అని చాటేందుకు వాల్మీకి మహర్షి దేవదేవుడిని సామాన్యుడిగా ఆవిష్కరించారు. ధర్మ సంస్థాపనకు వచ్చినట్లు కవి రాముని నోట పలికించలేదు. తాను భగవంతుడిననే సంగతి తనకే తెలియనట్లుంటాడు రామచంద్రుడు. ఆయన మాటలు, చేతలలో మనిషికి ఉండవలసిన లక్షణాలను సూచిస్తాయి. మనిషిగా భావోద్వేగాలను, కష్టనష్టాలను చవిచూశాడు. అందుకే రామాయణం జీవన పారాయణం. ‘మిత్రవాక్యం’ లాంటి దీనిని పూర్తిగా ఆకళించుకున్నవారు ధర్మాధర్మ విచక్షణకు ఇతరత్రా గ్రంథాలను అధ్యయనం చేయనవసరంలేదని విజ్ఞులు అంటారు.

‘నానృషిః కురుతే కావ్యం..’ అనే వేదవాక్కుకు ప్రత్యక్షర నిదర్శనం వాల్మీకి మౌని. చతుర్విధ పురుషార్థాలనే నాలుగు స్తంభాలపై శ్రీమద్రామాయణ కావ్యసౌధాన్ని నిర్మించి, ఆదర్శపురుషుడి ఆవిష్కరణతో విశ్వమానవునికి సన్మార్గం చూపిన క్రాంతిదర్శి. మనిషి మనుగడ ఎలా సాగాలి? ప్రకృతిని, పరిస్థితులను ఎలా సద్వినియోగం చేసుకోవాలి? జీవితపథంలో ఎదురైన అవరోధాలను దృఢచిత్తంతో ఎలా అధిగమించాలి? భారతీయ సమాజంలో ఆదర్శ కుటుంబ సంబంధాలు ఎలా ఉంటాయి? ఎలా ఉండాలి? లాంటి అనేకానేక అంశాలను ఈ కావ్యం ద్వారా లోకానికి వివరించారు. ఈ మహాకావ్యంలోని పాత్రలన్నీ మానవ స్వరూప స్వభావాలకు ప్రతిబింబాలు. పితృభక్తి, ఏకపత్నీవ్రతం, ప్రేమ, ధర్మనిష్ట, స్వచ్ఛత, సత్యం, సుపరిపాలన, శాంతమూర్తి, ధర్మరక్షకుడు, సత్యసంధుడు,  సమర్థ పాలకుడిగా, ఎదురులేని వీరుడు, అనురాగ సోదరుడు, ప్రాణమిత్రుడు, ఉత్తమభర్త.. ఇలా అనేక సలక్షణాలకు శ్రీరాముడు ప్రతీక. అందుకే శాంతి సౌభాగ్యాలు గల సమాజం ‘రామరాజ్యం’గా మన్ననలు అందు కుంటోంది. సీతామాత సహనశీలాది విషయాలలో భారతనారీమణికి సంకేతం కాగా, లక్ష్మణభరత శత్రుఘ్నలు సోదర ప్రేమకు, హనుమ నిజాయితీ, నిబద్ధత గల సేవా తత్పరతకు ప్రతీకలు. సృష్టిలో ఏ రూపమైనా శ్రీరామునితో సరిపోలేదనేంత ఉన్నతంగా రాముడిని వర్ణించాడు. అందుకే ‘రామో విగ్రహవాన్‌ ‌ధర్మః’ (శ్రీరాముడు మూర్తీభవించిన ధర్మం) అన్నారు. ‘రామాదివత్‌ ‌వర్తితవ్యం’ (శ్రీరామ సోదరుల వలె ప్రవర్తించాలి). ‘నరావణాదివత్‌’ (‌రావణాదుల మాదిరిగా కాదు) అని వాల్మీకి కృతి హితవు చెబుతోంది. మానవ (రామసోదరులు), వానర సోదరులు (వాలి, సుగ్రీవ), రాక్షస సోదరుల (రావణాదులు) పాత్రలను మహాకవి నిర్వహించిన తీరు అనితర సాధ్యమని, ఆ మూడు రకాల సోదరులు ఒక్కొక్క ప్రకృతికి ఒక్కొక్క ప్రతీక అని ఆధ్యాత్మికవేత్తలు విశ్లేషిస్తారు.

రామాయణ కథలేని భారతీయ భాషలేదు. రామాలయం లేని పల్లె లేనట్లే, రామకథ లేని భాషలేదనడం అతిశయోక్తి కాదు. ఇది భారతదేశ సాహిత్య సంపదే కాదు. టిబెట్‌, ‌టర్కీ, చైనా, సింహళం, జావా, కంబోడియా, థాయ్‌లాండ్‌, ఇం‌డోనేసియా, మలేషియా, వియత్నాం లాంటి ఎన్నో దేశాలకు విస్తరించింది. ఈజిప్టు రాజవంశం పేర్లు, కథలతో రామాయణగాథలకు ఆ దేశానికి పరిచయం ఉన్నట్లు చెబుతారు. తెలుగు సాహిత్యానికి సంబంధించినంత వరకు ‘మహాభారతం’ ఆది కావ్యమైనప్పటికీ కవిత్రయ భారతాంధ్రీకరణ తరువాత ప్రాచీన, అర్వాచీన కవులు వివిధ పక్రియలలో రామాయణ రచన చేశారు, చేస్తున్నారు.

వాల్మీకి మహాకావ్యం మాతృకగా ఎన్నో భాషలలో, ఎన్నో పక్రియలలో ఎన్నో రామాయణాలు ఆవిష్కతమయ్యాయి.

దేశి ఛందస్సులో గోన బుద్ధారెడ్డి (13 శతాబ్దం) రాసిన ‘రంగనాథ రామాయణం’ తెలుగులో వచ్చిన మొదటి రామాయణంగా చెబుతారు. అంతకు ముందు కవిత్రయంలో ద్వితీయుడు తిక్కనామాత్యుడు ‘నిర్వచనోత్తర రామాయణం’ రాసినా అది ఉత్తర రామచరితను తెలిపేది కావడంతో దానిని తెలుగులో మొదటి రామాయణంగా పరిగణింపలేకపోయారని చెబుతారు.

విశ్వనాథ వారు తమ కృతికి పేరు పెట్టినట్లు ‘రామాయణం కల్పవృక్ష’మే. రామాయణం శాశ్వత ధర్మానికి కేంద్రం. త్యాగభావానికి, త్యాగశీలతకు నిలయం. నిత్య సంపదకు స్థావరం. జడత్వానికి, భవరోగానికి దివ్యౌషధం. రసజ్ఞానానికి రమణీయ కావ్యం. సామాన్యులకు అందమైన కథ. నీతివేత్తలకు నీతిశాస్త్రం. యోగులకు యోగశాస్త్రం, మంత్ర సాధకులకు మంత్రరాజ మహిమాన్వితం, ముముక్షువులకు మోక్షప్రదం. సర్వజన శ్రేయోదాయకం, సర్వమంగళప్రదం.

యః కర్ణాంజలి సంపుటైరహ రహస్సమ్యక్‌ ‌పిబత్యా దరాత్‌

‌వాల్మీకేర్వదనరావింద గళితం రామాయణా్య•ం మధు

జన్మవ్యాధి జరావిపత్తి మరణై రత్యంత సోపద్రవం

సంపారం సవిహాయ గచ్ఛతి పుమాన్‌ ‌విష్ణోః పదం శాశ్వతమ్‌

‘ఆదికవి వాల్మీకి పలికిన రామకథామృతాన్ని ఆస్వాదించినవారు జన్మదుఃఖం జరాదుఃఖం, వ్యాధి, ఆపదలు, మరణబాధ లేకుండా వైకుంఠ ప్రాప్తి పొందుతారు’ అని భావం.

‘శ్రీరామాయణ కావ్యకథ.. జీవన్ముక్తి మంత్ర సుధా’లా యుగయుగాలుగా మానవజీవితంతో మమేకమైన కావ్యస్రష్టకు అనంత అభివాదాలు.

– డా।। ఆరవల్లి జగన్నాథస్వామి, సీనియర్‌ ‌జర్నలిస్ట్

By editor

Leave a Reply

Your email address will not be published.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Twitter
Instagram