– ఆదుర్తి భాస్కరమ్మ

అయోధ్యా పట్టణమంతయు హడావడిగానున్నది. వీధులను బాగు చేయువారు, బాగుచేసిన వీధులలో పందిళ్లు వేయువారు, సిద్ధమయిన పందిళ్లకు తోరణములను, పందిరి స్తంభములకు నరటిబోదెలు నాటువారు, గోడలకు వెల్లలు వేయువారు, వెల్లలు వేయబడిన గోడల మీద చిత్తరువులను చిత్రించువారు, తలుపులు మొదలగువానికి రంగులు వేయువారు, నగరమునంతను శృంగారించు వారునై యాపురవాసులందరునూపిరి త్రిప్పుకొనుటకైన దీరిక లేకయుండిరి. పట్టణమే యిట్లుండ నిక రాచనగరంనందలి సందడి చెప్పుట కలవియా? ఏమూల జూచినను పచ్చల తోరణములను గట్టువారే; యేవంక దిలకించినను ముత్యపుసరుల గ్రుచ్చువారే; ఏతట్టు పరికించినను జిత్ర విచిత్రములను చిత్తరువుల నిర్మించువారే; ఏ దిక్కు పొడగాంచినను ముత్యములతో చిత్రవిచిత్రములను మ్రుగ్గులను దీర్చువారే. అందరు నతితొందరతో పనులు చేయంచుండిరి.

పట్టణమంతయు నిట్టి సందడిలో నుండెను. కాని యెందుచేతనో రామునికి మాత్రం మేమియుదోచుటలేదు. సందడి యెక్కువయినకొలది, దినములు సమీపించుకొలది, రామునకు పరితాపమధికమగుచున్నది. ఏదియో చేయబోవును; చేయలేక వెనుకకు మరలును. సాయంకాలమిక రెండు గడియల ప్రొద్దున్నది. రాముని కింట నేమియు దోచుటలేదు. ఉద్యానవనములోనికి వచ్చెను; నిర్మానుష్యమగు, నిశ్చలమగు, శాంతిప్రదమగు నొకలతా మంటపమున నొక చంద్రకాంత శిలావేదికపై నధివసించెను; ఈ క్రింది విధముగా నాలోచింప బ్రారంభించెను:- ‘‘రేపు లేదెల్లుండేనా నా పట్టాభిషేకమహోత్సవము? ఎంత త్వరలో సమీపించినది? ఇప్పుడు నే చేయబోవు పనియేమి? నేనీలోకమున నెందుకొరకు జన్మించితిని? నా పూర్వజులవలె సింహసనాధిష్టితుడనై భోగముల ననుభవించుటకేనా? లేక దుష్టరాక్షస సంహారమొనర్చి లోకము నుద్ధరించుటకా? పట్టాభిషిక్తుడనైనచో నాకీకార్యము సాధ్యమేనా? కాదు. ఎంత మాత్రముకాదు. రాజకార్య ధురంధరత్వంనవలంబించిన పిమ్మట నిక నీవిషయమై యాలోచించుటకైన దీరిక యండునా? దుర్మార్గులగు ఖరదూషణాదులు, క్రూరాత్ములగు రావణాదులు ఈ సమీపముననున్నారా? అక్కడ కొందరు నక్కడ కొందరుగా నీయయోధ్య మొదలు కన్యాకుమారి యగ్రమువరకు వ్యాపించియన్న దండకారణ్య మంతయు నాక్రమించుకొని యున్నారు. రావణుడు సింహళములో నున్నాడని విన్నాను. వీరినందరిని దుదముట్టింపవలయునన్న నొకదినములోను, రెండు దినములలోను దీరు పనియా? కొన్ని నెలలు సరిపోవునా? దండకారణ్య మంతయు సంచారము చేయవలయును. కొన్ని సంవత్సరములందు గడుపవలయును. రాక్షసులనందరిని వెదకి వెదకి చంప వలయును. రావణుని బట్టుట సామాన్య విషయము కాదు. అతడఖండ ప్రజ్ఞావంతుడు. బ్రహ్మను, శివుని వేడి యనేకవరములను బడసెను. దేవేంద్రాది దేవతలనందరిని, బారద్రోలి స్వర్గమునుగూడ నాక్రమించుకొనెను. అట్టివాడు సామాన్యముగా జిక్కునా? ఇవి యనుకొన్న చిక్కులు. ఇవిగాక తీరా పనిలో బ్రవేశించిన తర్వాత తెలియరాని కష్టములింకా యెన్నికలుగునో యెవరి కెరుక? ఆయడవులలో నెంతకాలము సంచారమొనర్ప వలయునో? ఈ విషయము తండ్రిగారితో జెప్పిన యాయన యంగీకరించునా? పిల్లలకొరకు పరితపించి పరితపించి, యెన్నియో యుపవాసములు చేసి, వ్రతములు సల్పి, తుదకు పుత్రకామేష్టి యొనర్పగా గలిగిన సుతులము మేము. మానల్వురలో తండ్రిగారికి జ్యేష్ఠుడన గుటచేత నా మీద నపరిమిత ప్రేమ. అట్టి నన్నొక క్షణమయిన నెడబాయుట కాయన యొప్పుకొనరు. పొనీ, ఆయనతో పనియేమి, వెళ్లుదుమన్న నేను లోకముని కాదర్శకపురుషు డెట్లుండవలయనో నేనే యాదర్శకుడనుగా నుండి చూపవలయునను ముఖ్యోద్దేశము గల వాడనగుటచే పితరుల యనుజ్ఞలేకుండ నేకార్యమును చేయజాలను. ఈ విషయములో నాకు సహాయపడువారెవరు? తండ్రిగా రట్టివారు. అమ్మా, సుమిత్రా సాయపడుదురేమో యనినవారు సామాన్య స్త్రీలేకాని విశేష జ్ఞానవంతులు కారు. వారికి గూడ స్వార్థపరత్వమేకాని పరోపకార చింత యించుకయు లేదు. పుత్రమోహమమితము. వారేమియ జేయజాలరు. ఇక మిగిలిన వారెవరు? కైక.

ఈమె అసామాన్య ప్రజ్ఞా ధురంధరురాలు; అఖండ విద్యావతి; సామాన్య విద్యలోనే కాక ధనుర్విద్యాదిసమర విద్యలలోగూడ ప్రవీణ. కొన్ని కొన్ని సందర్భములలో సమరవిద్యాకోవిదులను పురుష పుంగవులుగూడ నీమె ముందు పనికిరారు. ఈమె తండ్రియగు కేకయరాజునకు పుత్రులయందున కన్న పుత్రికల యందు ప్రేమ మిక్కుటము. అందువలన తన పుత్రికలను సామాన్య స్త్రీలవలె స్త్రీలకు గావలసిన సాహిత్య చిత్రకళా నృత్యగానాది విద్యలలోనే కాక తనపుత్రులతో పాటు పురుషులకు గావలసిన గుఱ్ఱపుస్వారీ, రథము నడపుట, యుద్ధము చేయుట మొదలగు యుద్ధ విద్యలలోగూడ ప్రవీణురాండ్రను జేసెను. అందరిలో కైక యెక్కువ సూక్ష్మ జ్ఞానము గలదగుటచేతను, ఆలోచనాపరురాలగుట చేతను తండ్రి కామెయందది కానురాగము.

ఆమె సౌందర్యమా నిరుపమానము, సౌందర్యమునకు దగిన విద్య; విద్యకు దగిన బుద్ధి. తనలోగల యామూడు శక్తులచేత భర్తను పూర్తిగా దనకు బద్ధునిగా జేసికొనినది. నాతండ్రి కామె చెప్పినదే మాట; ఆమె గీసినదే గీటు. ఇది యిట్లుండ దేవతలకు సహాయముగా రాక్షస సంహారమునకు దాను బోయినప్పుడు కైకకూడ నాతనికి సహాయముగా వెళ్లినది. ఆ యుద్ధములో నొకానొక సందిగ్ధ సమయమున దశరథున కేమియు నుపాయము తోచలేదు. సైనికులందరు నిర్ఘాంతులై నిలువబడి పోయిరి. రాక్షసులందరు నొక్కపెట్టున మీద బడనుండిరి. క్షణములో మెరుపువలె నా పినతల్లి రథమునతిచమత్కారముగా నడిపి భర్తకు జయము సేకూర్చేను. అప్పటియామె సమయోచితబుద్ధి, యుద్ధ నిపుణత వర్ణింపదగినవి. ఆమె యద్భుతశక్తికి మెచ్చి సంతోషము బట్టజాలక నాతండ్రి యామెతో, ‘రెండువరములడుగుము. అవి యెట్టివైనను దప్పక యొసంగెద’ ననిచెప్పెను. అప్పుడు కైక- ‘నాథా! మీరు వరము లొసగుటకు నేనొనర్చిన ఘనకార్యమేమి? భార్యకు భర్త, భర్తకు భార్య సాయపడుటొక విశేషమా? ఇందు నేనెవరికేమి యుపకారమొనర్చితిని? నాయర్ధశరీరమును గాపాడుకొంటిని. అందువలన శరీరమంతయు నేబాధయు లేకుండ పరిపూర్ణ సౌఖ్యముతో నుండుటమే వరము. అంతకన్న వేరేమి కావలయును? అని పలికినదే! ఆహా! ఏమి! ఆమె యోగ్యత! తల్లీ, నీ యోగ్యతయంతయు నీ యీ యొక్క మాటలో ప్రకటితమగుచున్నది. అది మొదలు నాతండ్రికామె దేవివలె గన్పించుచున్నది. ఆమె యనిన యమితమగు ప్రేమ మాత్రమే కాదు: గౌరవము, భయము కూడ గలవు. ఒక్కొక్కప్పుడామె ప్రజ్ఞ ముందును, బుద్ధి ముందును తన ప్రజ్ఞయు, రాజకార్య ధురీణతియు నెందుకని యనుకొనుచుండును. ఆమె సలహా లేకుండ నేకార్యమును నెరవేర్పడు. ఆమెను జూచిన నాకునునట్లే తోచును. ఆమె స్త్రీయైనను ఆమె హృదయము తక్కిన స్త్రీహృదయములవలె సంకుచితము గాదు; అతివిశాలము. అది యామెస్వభావమో, విద్యాప్రభావమో చెప్పజాల. ఆమెకు నాయందెంత ప్రేమ! సవతికొమారుండనను నీర్ష్య యిసుమంతయు లేదుకదా! తనకున్న పుత్రుడగు భరతునికంటె నన్నే యెక్కుడుగా ప్రేమించును; గౌరవము చూపును. పెక్కుసారులు నన్ను తేరిపారజూచి, ‘రామా! నీయందేదో తేజము ప్రకాశించుచున్నది. అద్భుతశక్తి పొడగట్టుచున్నది. నీవు సామాన్య రాజులవలె రాజ్యము చేయుట కేర్పడినట్లు తోచుటలేదు. లోకమునంతను నుద్ధరింప నవతరించినవానివలె గన్పట్టుచున్నావు. లోకులకు రాక్షసబాధ తొలగింప నీవే సమర్థుండవు’ అని యనుచుండును. నాప్రయత్నములో నామె యేమయిన దోడ్పడునేమో కనుగొందుగాక!’’

2

సంధ్యారాగము లెల్లెడల నల్లుకొనుచుండెను. ఆ సంధ్యారాగముల మధ్య నయోధ్యాపురి వైభవము ద్విగుణీకృతమగుచుండెను. ఆ పట్టణమున నాసమయమున సౌందర్యదేవత తాండవమాడుచుండెను. అట్టి సంతోష సమయమున, నా సౌందర్యరాశి మధ్యమున నొకచలువరాతి సౌధముపై సర్వాంగసుందరియగు నొక సుందరి తనగంభీర ధృక్కుల నలుదెసల బర్వజేయుచు నిలుచుండి యుండెను. ఆమె ముఖచంద్రబింబ మతిగంభీరముగను, నేదియోయాలోచనతో గూడినదిగను నుండెను. మధ్యమధ్యనది మేఘావృతమగుచుండెను. ఆమె యేదో సందిగ్ధావస్థలో దగుల్వడి తెంపుగానక యవస్థపడుచున్నట్లు కనబడుచుండెను ఆ సమయములో లోకమంతయు, ముఖ్యముగా నాపట్టణవాసులు, నానందసాగరమున నోలలాడుచుండ, సౌఖ్యవారాశి మున్కలు వేయుచుండ, సౌందర్యదేవతా సన్నిధానమున తాండవమాడుచుండ, పొంగిపొరలు కోరికలతో నుప్పోంగుచుండ, నీమె యొక్కతె యిట్టి సందిగ్ధావస్థలో బాధపడుచుండుటకు గారణము తెలియరాదు.

రాముడటకు వచ్చెను. ‘‘అమ్మా! ఏదియో దీర్ఘాలోచనలో మునిగియున్న దానివలె గన్పించుచున్నావు. ఏమి యాలోచించుచుంటివి?’’

కైక : రామా, వచ్చితివా? పట్టాభిషేక మహోత్సవ శృంగారములన్నియు బూర్తియైనవా? రేపు లేదెల్లుండేకదా నీపట్టాభిషేకము? ఇకనుండి నీకిప్పటివలె స్వేచ్ఛగా సంచరించుట కవకాశముండదుకాబోలు. రాజుగారిక రాజకీయ వ్యవహారములలో దగుల్కొని ప్రపంచముమాటయే మరచిపోదురనుకొనెదను.

రాముడు : అమ్మా, అట్లెన్నటికి తలంపకుము. నేనెందుకోరకై యీ లోకమున జన్మించితినో, నా యుద్దేశమేమో యావిషయమై నీతో మాట్లాడుటకే యిపుడిక్కడకు వచ్చితిని. నాకాలోచన చెప్పుదానవు, నా కార్యములలో ప్రోత్సాహము చేయుదానవు, నాకు సహాయపడుదానవు నీవుగాక వేరొకరు లేరు.

కైక : కుమారా, నీకు నేనెట్టి సాయమొనర్చగలను? ఏదేని చేయగలిగినచో, నాబిడ్డకొరకై, యంతకన్న నెక్కుడుగా లోకముకొరకై, దేశముకొరకై, నా ప్రాణ మర్పింపకున్నను, తప్పక యర్పించుదాన. కాని, కుమారా! శూరుడవు, పరాక్రమశాలివి, దేశోద్ధారకుడవు, లోకరక్షకుడవు, దేవతాంశ సంభూతునివలె గన్పట్టుచున్నావు; నీకు నేనెట్టిసాయ మొనర్చగలను?

రాముడు : అమ్మా నీవు మొదట వాగ్దాన మొనర్చితివి. నీచేతిలోని సాయము నేనేకోరెదను నీవు మాట దిరుగరాదు సుమా!

కైక : కుమారా! చెప్పుము.

రాముడు : తల్లీ! పసితనము నుండి నాలోని శక్తిని గ్రహించినదానవు నీవొక్కతెవు మాత్రమే అని నేను దృఢముగా జెప్పగలను. నాన్నగారికి, అమ్మకు నామీద నమితానురాగము. వారి పుత్రవ్యామోహమ సామాన్యము. ఆ మోహాంధకారముచే వారి కేమియు గనుపడదు. నేనతి సుకుమారుడ ననియు, నడచిన కందిపోదునేమోయనియు నన్నతి గారాబముతో చూచుకొను చుందురు. నన్నెక్కడకును కదలనీయరు. తాటకి సంహారమునకు నన్ను గొనిపోవ విశ్వామిత్రుడు వచ్చి యడిగినప్పుడు చూచితివా ఎంత పరితాపపడినారొ? కుఱ్ఱవాడగు రాముడేమి చేయగలడనియు, నేనే వచ్చెదననియు జెప్పిరి. వృద్ధులగు తమకు ఆ మాయలమారి తాటకను సంహరించుట తరమా? పరశురామునితో నేను బోరుచున్నప్పుడాయనపడ్డ యాతురత, పరితాపమా తలచుకొనిన నిప్పుడుకూడ నవ్వువచ్చుచున్నది. నాన్నగారే యట్టున్ననిక అమ్మనంగతి వేరే చెప్పవలయునా? సభలోని వారందరూ రాముడెప్పుడు రాజగును, అతని చల్లనిపాలనములో మన మందరమెప్పుడు సౌఖ్యములనుభవింతుము అనియే యాలోచించుచున్నారు గాని లోకము సంగతి తలంప కున్నారు.

అమ్మా! సమస్తము దెలిసినదానవు; నీకు వేరుగా నే నికేమియు చెప్పనవసరము లేదు. ఖరదూషణాది రాక్షసుల వలన బాధలననుభవింపలేక ప్రజలందరు నట్టుడికి నట్లుడికిపోవుచున్నారు. వీరందరికి ప్రభువు రావణాసురుడనువాడు; లంకను పాలించుచు, నప్పుడప్పుడు మనదేశము మీదికి కూడ వచ్చి ప్రజలనమితముగా హింసించుచున్నాడు. ఈ రాక్షసులవలన లోకమునకు గలుగుబాధ యింత అంత అని చెప్పుటకు వీలుకాదు. మన ఆర్యస్త్రీల మర్యాద కొంచెమైన దక్కుటలేదు. బ్రాహ్మణులకు వారి యజ్ఞయాగాది కర్మలు నెరవేరుట లేదు. ధర్మ మంతయు నశించుచున్నది. వారిని తుదముట్టించి లోకమును రక్షింపవలయునని దృఢసంకల్పము కలిగియున్నాను. ఈ కార్య మొకటిరెండు దినముల లోను, నెలలలోను, సంవత్సరములలోను నగునది కాదు. ఇది నెరవేరుటకు కొన్ని సంవత్సరములు పట్టును. ఒకచోట నుండి చేయునది కూడకాదు.

దండకారణ్యమంతయు సంచరించి మూల మూలలనున్న రాక్షసులనందరను, క్రూరమృగమలను వేటాడినట్లు వేటాడవలయును. ఈ పనియంతయు నేను సింహాసనాధిష్ఠితుడనై రాజ్యపాలనము సేయుచు నెరవేర్చుటకు సాధ్యమా? కావున నీపట్టాభిషేక మహోత్సవ ప్రయత్నములు నా కెంతమాత్రము సంతోషదాయకములు గానేరవు. ఎట్లయిన నీబంధనముల నుండి బయటబడి లోకమునుద్ధరిం పవలయును.

కైక : ఏమి! కుమారా, రాజ్యపాలన మొనర్ప నిచ్చగింపవా? పట్టాభిషేక మహోత్సవము స్వీకరింపవా?

రాముడు : అమ్మా అంతకన్న నెక్కువ పని చేయదలంచువాని కది యెందుకు? రాజ్యపాలన మొనర్పనిచ్చగింప; లోకరక్షణసేయ నిచ్చగించెద.

కైక : అందులకు తండ్రిగారొప్పెదరా?

రాముడు : అందుకనే నీ సహాయమపేక్షించుట. వారొల్లరు. వారి యిష్టము లేకుండ, వారితో చెప్ప కుండ నేవెళ్లినచో తండ్రి యిష్టమునకు వ్యతిరేకముగా నడచినవాడనగుదు. నేను నా జీవితమును లోకమున కాదర్శముగ జేయ నిశ్చయించితిని. తండ్రి యాజ్ఞకు వ్యతిరేకముగా నేపనియు జేయరాదు కదా? ఆయనతో జెప్పి వెళ్లుదనన్న ఆయన వెళ్లనీయరు. అది నిశ్చయము.

కైక : ఇక నీ ప్రయత్న మెట్లు సాగును?

రాముడు : తల్లీ! నాన్నగారికి నీవనిన నమితాను రాగము. నీ వేదయిన నొకమాట చెప్పితివా, దానిని తప్పక నెరవేర్చి తీరుదురు. ఆయన నీకెన్నడు నెదురాడి యెరుగరు. కాబట్టి యెట్లయిన నాయనకు నచ్చజెప్పి నన్నడవులకు బంపునట్లు చేయుము.

కైక : బాగు; రామా, బాగు. అసలే నీకు నేను సవతితల్లిని. సవతితల్లి బిడ్డల మేలుగోరి యేదయిన జెప్పినను లోకులు కీడునకనియే తలంతురు. అందులోను నిట్టిమాటా? మీ నాన్నగారి కేవిషయము లోనైన నామాట విందురు గాని ప్రాణమునకన్న నెక్కువగా జూచు కొనుచున్న నీవిషయములో నీవిధముగా చెప్పిన విందురా?

రాముడు : ఒక వేళ మంచిగా చెప్పినచో వినరని తోచిన, వెనుక రాక్షససంహర సమయమున నీవు చూపిన యుద్ధకౌశలమునకు మెచ్చి నిన్ను రెండు వరములను గొరుమని యడిగిరటకదా. అప్పుడు నీవు వినమ్రతా, భర్తృ ప్రేమా, నిగర్వమూ, విశాల హృదయమూ వెల్లడియగునట్లు వానిని స్వీకరింపలేదని విన్నాను. ఆ వరముల నిప్పుడిమ్మని యడుగుము. అందొకటి నన్ను కొన్ని సంవత్సరములు అరణ్యమునకు బంపవలెననుము. లెక్కకావలయుననిన పదునాలుగు సంవత్సరములని చెప్పుము. నేజేయబోవు పనికంత కాలము కావలయుననుకొనెదను. నేనరణ్యములకు బోయిన యెడల రాజ్యమరాచకము గాకుండ రాజ్యమునకు భరతుని పట్టాభిషిక్తుని జేయునట్లు రెండవది. తండ్రిగా రెట్టికష్టములనైన భరింతురు; ఎట్టియాపదలకు భయపడరు; గాని అసత్యమాడుట యనిన, ఆడినమాట తప్పుటనిన మిగుల భయ పడుదురు. అసత్యమాడు వాడు, మాట తప్పువాడు అని యనిపించుకొనుటకు సహింపరు. కావున నీవరముల దప్పక నొసగెదరు. ఆయన జాలికొలుపు మాటలతో, హృదయమును గరగించు ఆవేదనతో నివిగాక వేరొండు వరముల నడుగుమని వేడు కొందురు. ఏమయినను నీవుమాత్రము వెనుదీయ కుము; జాలి, నొందకుము; లొంగిపోకుము. ఇది స్వార్థపరత్వము కాదు: జనోపకారము. దేశోవ కారము. లోకరక్షణము కొరకు ఒక పెద్ద కార్యమును, అసామాన్య కార్యమును, లోకమున కంతకు నమిత మగు మేలొసగు కార్యమును, జేయ తలపెట్టినప్పుడు చిన్నచిన్న విషయములను లెక్క సేయరాదు.

కైక :- కుమారా, లోకులు నన్నేమని తలం తురు? కైక యెంత దుర్మార్గురాలు, ఎంత నీచురాలు, ఎంతకఠినాత్మురాలు! ఇట్టి స్త్రీ లోకములో నిదివరకెక్కడా పుట్టియుండదు; ఇకముందు పుట్టబోదు అని యెందరా? కేక యారాజవంశమున చెడ బుట్టినదని దూషింపరా? ఆమె యసామాన్య సౌందర్యమూ, ఉన్నత విద్యా అద్భుత ప్రజ్ఞా ఇవియన్నియు నెందుకు? కాల్పనా? అని యెంచరా? రాముడు, సకలగుణాభిరాయుడు, లోకరక్షకుడగు రాముడు, తన కన్నతల్లి కన్న తన్నెక్కుడుగా ప్రేమించు రాముడు, లోకులందరి యొక్క ప్రేమ నాకర్షించిన రాముడు, తనకేమి యపకారమొనర్చెను? ఎట్టివారి ప్రేమనైన తనవైపున కాకర్షింపజేసికొనగల్గెను. కాని కఠిన హృదయురాలగు, క్రూరచిత్తయగు నాకైక ప్రేమను మాత్రము సంపాదింప లేకపోయెనా? కైక బిడ్డలను గన్న తల్లికాదా? స్త్రీ కాదా? అంతటి మృదు శరీరములో భగవంతుడింతటి వజ్రకాఠిన్య హృదయము నెట్లమర్పగల్గెను? కావలయుననిన తన కుమారునకు రాజ్యమీయమని యడుగవచ్చును కాని యేపాప మెరుగని రామునరణ్యవాసమునకు బంపుమని కొరుటెందుకు? అని నన్ను నిందింపరా? నేనిట్లు గోరితినని విన్న భరతుడు నన్నేంత అసహ్యించుకొనును? నన్ను జంపివేయుటకుకూడ బ్రయత్నించునేమో? ఈయపఖ్యాతి యిప్పుడు మాత్రమే కాక శాశ్వతముగా లోకములో నిలిచి పోదా? దుష్ట స్త్రీలనందరిని నాతో బోల్చరా? ఇదియేనా నా మీద నీకు గల ప్రేమ? నన్ను శాశ్వతమగు నపఖ్యాతిపాలు గమ్మనెదవా?

రాముడు : అమ్మా, ఈ నష్టము నీకొక్కదానికే కదా? లోకమునంతను నుద్ధరించుట కీపాటి స్వార్ధ త్యాగ మొనర్పజాలవా? నేనడవులలో గొన్ని సంవత్సరములు సకల శ్రమల నొందుట కేర్పరుచుకొని యుండ నీవీ మాత్రపు నింద భరింపజాలవా?

కైక : రామా, ఎట్టి కష్టములనైన భరింప వచ్చునుగాని నింద మోయుట కష్టము. కష్టములు తాత్కాలికములు. నింద శాశ్వతము. నీవు పదు నాలుగు సంవత్సరములు మాత్రమే శ్రమ నొందుదువు. నేను శాశ్వతాపకీర్తిపాలు గావలయును.

రాముడు : తల్లీ! నీవన్నది నిజమే. కాని నిజముగా దుష్ట హృదయులగు వారికా బాధ. ఇందు నీనేరమేమాత్రమును లేదు. నీయంతరాత్మ నిన్ను బాధింపదు. నిష్కళంక హృదయము, ప్రేమపూరిత మగు మనస్సు నీకెల్లప్పుడు సంతోషమునిచ్చు చుండును. లోకోపకారార్థమై యిట్టి స్వార్థత్యాగ మొనర్చితినిగదా యని మనస్సున కొకవిధమైన గర్వము కలుగును. ఇంకేమి కావలయును? ఆనందమునకు లోకులేమనుకొనిన నీకేమి? నిజముగా నేరము చేసినవానికి పిరికితనము, దైన్యము, శిక్షయనిన భయము; మృతియనిన బెదరు. నేరము జేయని నిష్కళంక హృదయునకు పొరబాటున తనమీద నేరమారోపింపబడినను, శిక్షించుచున్నను; తుదకు మరణశిక్ష విధింపబడినను నిర్భయముగా, నిశ్చలముగా, గంభీరముగా వానినెల్ల సహించును; నవ్వుతో ప్రాణములను విడుచును. అతనికేమి కాదు? అట్లనే, అమ్మా, నీవుకూడ ఆ నిందలను నవ్వుతో భరింపవలయను.

కైక కొంతసేపు ఏమియు బలుక లేకపోయెను. చాలాసేపు దీర్ఘాలోచన చేసెను. వేరు మార్గమేమయిన గలదేమోయని వెదకెను. ఏమియు గన్పించలేదు. ‘‘రామా, నీవు చెప్పినది నిజము. వేరు త్రోవలేదు. ఒకవేళ నీవు తండ్రితో జెప్పకుండ వెళ్లినను నాయన యనేకులగు చారుల నానాముఖములకు బంపి నీ వెక్కడనున్ననూ వెదకించి తన సన్నిధికి వచ్చువరకు నిన్ను బాధించునుగాని వదలి పెట్టరు. నీ మనస్సునకు నిశ్చలత యుండదు. ఈవిధముగా నైనచో నిక నిన్ను బాధించుటకు వీలుండదు. మంచి యుపాయమే. నీవు మొదట నావద్దకు వచ్చునప్పటికి నేనూ ఆ విషయమయియే యాలోచించుచుంటిని. నీ శక్తినంతను వృథా సేయుదువు కాబోలు! ఈ బాధల నివారించువారికయెవరు? రాముడు కూడ రాజ్యభోగలాసుడై యీ భోగములలో చిక్కుకొనుటకే యేర్పరచుకొనెను కాబోలు! ఈ తహ తహపడు ప్రజలయార్తి దీర్చువారెవరు? లోకమునుద్ధరించు వారెవరు? అనియే యాలోచించుంచుంటిని. ఇప్పుడు నీ నిశ్చయము విన్న తరువాత నాకపరిమితానందము కలిగినది. లోకమునిమిత్తమేమి యొసగుమనిన నను నొసంగెదనని చెప్పితిని. నాకీర్తి నిచ్చెవేయుచున్నాను. లోకోపకారార్థమై శాశ్వతాపకీర్తిని భరించెద. అందువలన నాకు గలుగు నష్టమతిస్వల్పము. అందుకు నేనొప్పుకొననిచో లోకమునకు గలుగు నష్టమమితము. అని కైక పలికెను.’’

రాముడు : అమ్మా! లోకహితార్థమై, దేశాభివృద్ధికై, ధర్మరక్షణార్ధమై నేను రాజ్యమును; తల్లిదండ్రులను, సోదరులను, సమస్తమును విడిచి యరణ్యవాసము చేయబోవుచున్నాను. అందులోనే యానందమును, సుఖమును పొందగోరుచున్నాను. నీవు నదే కార్యార్థమై యపరిమితానురాగుడైన ప్రియ భర్త యొక్క గాఢమగు ప్రేమను, కొమారుని యొక్క మాతృభక్తిని, ప్రజల యొక్క గౌరవమన్ననలను పోగొట్టుకొనుచున్నావు. అందువలన గలుగు అపనిందలోను, కష్టములలోను నానందమనుభవింవ నిశ్చయించుకొన్నావు. నీమీద నెంతమందికి కోపము వచ్చినను, నాప్రేమమాత్రము శాశ్వతము; గౌరవమపరిమితము. అమ్మా! ఇక నేను సెలవుతీసికొనెద. ఆరణ్య వాసమునకు సిద్ధుడనై యుండెద.

3

రాత్రి కైక పరుండెను. నిద్రపట్టదు. అనేకా లోచనలు పోవుచుండెను. ‘‘రామునకేమని వాగ్దత్త మొసగితిని? కోరరానికోరికలను భర్తను వేడి శాశ్వతాపఖ్యాతికి బాల్పడుటకా? భర్త యెంతో ముద్దుగా, ప్రేమతో, నామీద నాతని కాక్షణమందు గలిగిన యపరిమితాశ్చర్యముతో, గౌరవముతో వరముల నడుగుమని నప్పుడతినమ్రత గలదాననై, నిగర్వినై, ‘భర్తను గాపాడుకొనుట యొక ఘనకార్యమా; ఇంతమాత్రమునకే వరము లెందుకని చెప్పినప్పు డాయనకు నామీద యెంత గౌరవము కలిగినది! నేటి వరకు నిశ్చలముగా నున్న యానిష్కళంక గాఢ ప్రేమను, ఆగౌరవమును నేడొకక్షణములో ఒకమాటలో గోల్పోవుటేనా? రేపు నేనీ రెండు వరములడుగుటతోడనే నాథుడెంత యాశ్చర్యపడునో? ఏమనుకొనునో? నమ్మునా? ఇంతకాలము నుండి యున్న నా యటువంటి మంచి స్వభావము ఇప్పుడిట్లు హఠాత్తుగా మారునని యెన్నడైన యెంచియుండునా? ఒకవైపున తానింతవరకు నపరిమితముగా ప్రేమించి నమ్మియున్న భార్య ఒక్కమాటుగా నిట్టి దుష్టపు కోరికలను గోరుట; మరియొక వంక ప్రాణముకన్న నెక్కుడుగా జూచుకొనుచున్న ప్రియపుత్రని వియోగము. తనవార్ధక్యములో నిట్టి కష్టముల భరింపగల్గునా! ఒకవేళ వీనిని సహించలేక ప్రాణములు విడుచునేమో! ఇంతకను మరియొక మార్గము గానరాదు. రాముడు వెళ్లక తప్పదు, ఏదో కొందరు త్యాగమొనర్చినగాని, బలియైనగాని యిట్టి లోకోపకార కార్యములు నెరవేరుట దుర్లభము. భర్తగారు వృద్ధులగుట చేతను, పుతప్రేమ గాఢమగుట చేతను, పుత్రునెడబాసి స్తిమితముగా నుండుటకు దృఢమగు శక్తి యాయనకిక లేదు. కావున నీవిషయములో కొన్ని యనర్థములు రాక మానవు. వెనుక లోకోపకారార్థమయి భర్త ప్రాణముల గాపాడితిని. ఇప్పుడునూ అందు నిమిత్తమయియే ఆయన గాఢ ప్రేమానురాగాదులను మాత్రమేకాక తటస్థించినచో భర్తగారినిగూడ గోల్పోయెదను. లోకముకొరకు, దేశముకొరకు ఒకరము ప్రాణములను, మరియొకరము గౌరవ కీర్తులను, నింకొకరము భోగములను త్యాగమొన ర్చెదము.’’ ఈ విధముగా రాత్రి యంతయు నామె యాలోచనలతోడనే గడిపెను. తెల్లవారి రాముని పట్టాభిషేక సమాచారమును సంతోషముతో గైక కెరింగించుటకొరకు దశరథుడు కైక మందిరమునకు వచ్చెను. కైక రాబోవునిక్కట్టులనెల్ల దలచుకొని ఖిన్నురాలైయుండెను. ఆమెను జూచుటతోడనే దశరథునకు బెదురు పుట్టెను. అయినను మామూలు ప్రకారము ప్రేమతో నామెను జేరదీసికొని యావార్త నామె కెరింగించెను. కైక తన మనోభావములనెల్ల నతిగంభీరమగు మనంబుననే యడంచుకొని రామునికోరిక ప్రకారమాతని పట్టాభిషేక విషయమై తనయనిష్టమును దెలిపి తన రెండు కోరికలను నొసగుమని వేడెను.

దశరథుడాశ్చర్యమునొందెను. ఈమె తన ప్రాణ ప్రదమగు కైకయేనా యని సందేహము నొందెను. ఆమెను అవిగాక యింకేమయిన నడుగుమని బ్రతిమాలుకొనెను. నీయిష్ట ప్రకారము భరతునకు బట్టము కట్టెదను, రామునింట నిలువనీయుమనెను. కాళ్లు పట్టుకొని ప్రార్థించెను. పాపము, కైకకు హృదయము కరగిపోవుచుండెను. ‘ఛీ! ఎంత కఠిన హృదయురాలను!’ అని తనలో తాను దూషించు కొనుచుండెను. కాని ముందు చేయవలసిన యుత్కృష్ట కార్యమును దలంచుచుండెను. రాముని కోరిక తనకు బలము నొసగుచుండెను. ధైర్యమవలంబించెను. గంభీరముగా తనపట్టును వీడలేదు. దశరథుడు మూర్ఛనొందెను. ఈ వార్త రామునకు దెలిసి యేమియు నెరుగనివానివలె కైక మందిరమునకు వచ్చెను. దశరథునకప్పుడే తెలివి వచ్చినది. రామునిపై అతి దీన భావముతో జూచెను. రాముడు సంగతి యేమని ప్రశ్నించెను. కాని దశరథుడు జవాబు చెప్పలేకపోయెను. కైకయే జరిగిన సంగతి చెప్పెను. వెంటనే రాముడు ‘‘తండ్రిగారు మాటదప్పరాదు. సూర్యవంశపు రాజులెన్నడు ఆడినమాట దప్పలేదు. ఆమె కోరిక ప్రకారము మీరు నన్నడవులకు పంపి భరతునకు పట్టాభిషేకము చేయవలసినదే. నేనేమో అనుకొనెదనని భయవడకుడు. తలిదండ్రుల యాజ్ఞను శిరసావహించి పరమ సంతోషముతో నేనిదే యేగుచున్నవాడ’’నని చెప్పెను. దశరథుడు మరల మూర్చనొందెను. ఆయనకు మరల తెలివి వచ్చిన యెడల వెళ్లవద్దని విచారించెదరనియు, వెళ్లిపోయిన తరువాత మనస్సు రాయిచేసికొని స్తిమితము నొందుదురనియు తలంచి, యచటి నుండి తిన్నగా బయలుదేరి తక్కిన తనవారందటితోడను తన యరణ్యవాస వృత్తాంతము జెప్పెను. లక్ష్మణుడతి కోపముజెందెను. కైకను జంపుదునని బయలుదేరెను. రాముడు నవ్వి యతనిని శాంతాత్ముని జేసెను. సీతాలక్ష్మణులు రాముని విడిచి యుండలేక వెంట బయనమయిరి. ఇంటిలోని వారందరు, నూరిలోని వారు కైకను నిందింప మొదలు పెట్టిరి. పాపము, కైక యిదివర దాకా వీరందరచే నెంతయో గౌరవింపబడిన కైక, వీరందరచే నపరిమితముగా ప్రేమింపబడిన కైక, దేవతవలె జూడబడిన కైక, ఒక్కసారిగా వీరందర నుండి దూషణ వాక్యములను వినవలసి వచ్చెను. మరి పది దినములకు దశరథుడు మరణించెను. తన మరణకాల సమీపమున భార్యలను మువ్వురను బిలిచి యిందు కైక నేరమెంతమాత్రమును లేదనియు, తన కేదియో శావముండుటచే నీవిధముగా పుత్ర వియోగ మనుభవింవ లేక మృతి నొందుచుంటి ననియు, కాకున్న నంత యుత్తమురాలగు కైక యిట్టి కోరిక గోరునాయనియు, నామెను దూషింప వలదనియు జెప్పి మృతి నొందెను. తాతగారి యింటియొద్ద నుండి భరతుడు వచ్చి సంగతినంతను విని తల్లిని మిగుల దూషించెను.

కాని ధైర్యవంతురాలగు, గంభీరయగు, పరమార్థచింతగలదగు కైక యించుకైన చలింపక రాముని నాదర్శ పురుషుని జేయ నిశ్చయించిన దగుటచేత రహస్యమును వెలిబుచ్చక ఓర్పుతో వీని నన్నిటిని భరించుచుండెను.

భారతి, జనవరి 1928

‘స్త్రీల కథలు-2’ నుండి

By editor

Leave a Reply

Your email address will not be published.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Twitter
Instagram