– గంటి భానుమతి

జాగృతి – ఎండివై రామమూర్తి స్మారక నవలల పోటీలో మొదటి బహుమతి పొందిన రచన

సాయంత్రం అలాగే ఒంటరిగా అటూ ఇటూ తిరుగుతూ గడిపింది. ఒక్కసారి కూడా విక్రాంత్‌ కనిపించలేదు. భోంచేసాక తమ గదిలోకి వెళ్లి పోయింది. ఎప్పుడో నిద్రపోయింది.

ఏవో గుసగుసలు వినిపిస్తూంటే సుధీరకి తెలివి వచ్చింది. బలవంతంగా కళ్లు తెరిచి పక్కకి తిరిగి టైం చూసింది. ఒంటి గంట అవుతోంది. విక్రాంత్‌ లేడు. అంటే రాత్రి పడుకోవడానికి రాలేదా? తలుపు గడియ తీసి ఉంది. తలుపు దగ్గరగా వేసి ఉంది.

అలాగే కళ్లు మూసుకుంది. అంతలో విక్రాంత్‌ లోపలికి వచ్చాడు.

‘‘మామ్మకి ఒంట్లో అస్సలు బాగా లేదు. సీరియస్‌గా ఉంది. ఇప్పుడో అప్పుడో అన్నట్టుగా ఉంది. కిందికి రా. చీర కట్టుకుని రా. ఈ నైటీతో వద్దు.’’ అని గబగబా వెళ్లిపోయాడు. మళ్లీ తను ఏం కట్టుకుని రావాలో చెప్పిన విక్రాంత్‌ పైన కోపం వచ్చింది.

ఏం జరుగుతోందో అర్థం అవడానికి సమయం పట్టింది. పక్కనే ఉన్న బాత్రూంలోకెళ్లి మొహం కడుక్కుని వచ్చి, జుట్టుని కట్టింది. అయినా రెండు వైపులా పొట్టి జుట్టు చెంపల మీదకి వాలిపోయాయి. నైటీ విప్పింది, కానీ ఏ చీర కట్టుకోవాలో అర్థం అవలేదు. ఉండే వారం రోజుల కోసం ఎక్కువ చీరలెందుకని తెచ్చుకోలేదు. అయినా తనకి ఎక్కువ చీరలు కూడా లేవు. ఉన్నవన్నీ కూడా పట్టు చీరలు, ఖరీదైన చీరలు. అవి కూడా పెళ్లికి అత్తగారు వాళ్లు కొన్నవి. అవి కట్టుకుంటే బావుండదు. ఇలాంటి అకేషన్‌కి ఏం కట్టుకోవాలో తెలీలేదు. డ్రెస్సులైతే ఉన్నాయి. చిన్నచిన్న లేత నీలం పూల కాటన్‌ కుర్తా పైజామా వేసుకుని వచ్చింది కిందికి.

అందరూ మామ్మగారి గదిలో ఉన్నారని తెలుసుకుని ఆ గదిలోకి వెళ్లింది. మంచం మీద తెల్లటి దుప్పటి కప్పి ఉన్న మామ్మ గారు ఓ పువ్వులా ఉన్నారు. ఆమె కాళ్ల దగ్గర ఓ కుర్చీలో అత్తగారు కూచుని ఉన్నారు. అక్కడే నేల మీద ఓ నలుగురు కూచుని ఉన్నారు. గుమ్మం దగ్గర తలుపుని ఆనుకుని వంటావిడ సుబ్బమ్మ, పైపనులు చేసే నర్సమ్మ, కళ్లు వత్తుకుంటూ నుంచున్నారు.

అత్తగారు సుధీరని చూసి దగ్గరికి రమ్మని సైగ చేసారు. సుధీర వెళ్లగానే చెయ్యి పట్టుకుని ముసలావిడని చిన్నగా కుదిపింది. ఆమె కళ్లు తెరిచింది.
‘‘అత్తయ్యా, ఇదిగో కోడలు సుధీర.’’ అంటూ సుధీర చేతిని ఆవిడ చేతిలో ఉంచింది. ఆమెలో పెద్దగా చలనం లేదు. సుధీరకి ఏం చేయాలో తెలీలేదు. చేతిని తీసుకోవాలో వద్దో.

అంతలోనే ఆమెలో కదలిక, వేళ్లు మెల్లిగా కదిల్చింది.
‘‘కదుల్తోంది. పెద్దమ్మ కదుల్తోంది.’’ అని అందరూ అన్నారు.

ఆవిడ కళ్లు బాగా తెరిచి సుధీరని చూసింది. దగ్గరికి వచ్చి కూచోమన్నట్లు సైగ చేసింది. ఓసారి అత్తగారిని చూసి ఆమె పక్కన కూచుంది. చావుకి దగ్గరగా ఉన్న మనిషి దగ్గర ఉన్నానన్న సంగతి వెంటనే గుర్తొచ్చింది. భయంగా కూచుంది.

అత్తగారిని రమ్మని సైగ చేసింది. అతి కష్టంమీద తలగడకి ఉన్న గలీబులోకి మెల్లిగా చేయి పెట్టి, ఓ చిన్న సంచీ తీసి అత్తగారి చేతిలో ఉంచి, సుధీరకివ్వమన్నట్లుగా చేత్తో చూపించి, ఇంక బలం లేనట్లుగా కిందకి వాల్చేసింది.

ఆ సంచీ లోంచి రెండు గాజులు, చంద్రహారం తీసి అందరికీ చూపించింది ఆమె.
‘’కొత్త కోడలికి ఆవిడ బహుమతి’’ అంటూ మరోసారి అందరికీ చూపించి, సుధీర చేతిలో ఉంచింది. అందరూ సంతోషంగా సుధీరని చూసారు.

‘‘తీసుకో తల్లీ. మనవడి పెళ్లి చూడాలనుకుంది, కొండమీద చేసారు కాబట్టి చూడలేకపోయింది. కానీ కోడల్ని చూసింది. ముని మనవడిని చూసే అదృష్టం లేకపోయింది. ముని మనవడు పుడితే తన పేరు పెట్టమని ఎన్నోసార్లు నాతో అన్నారు. ఆ శుభవార్త వినకుండానే.’’ అంటూ ఒకావిడ ఒక్కసారి గొల్లుమంది. ఏడుపు చూసి కామాక్షి కూడా తన ఏడుపు ఆపుకోలేక పోయింది.

‘‘ఊరుకో కామాక్షీ. ఊరుకో.. ఏడ్చీ నీ ఆరోగ్యం పాడుచేసుకోకు. ఆవిడని కన్నతల్లి కన్నా ఎక్కువగా చూసుకున్నావు. ఆవిడ నోట్లో మాట నోట్లో ఉండగానే అన్నీ సమ కూర్చావు. ఆవిడ ఏం చెప్తే అది, ఎలా చెప్తే అలా ఎదురు చెప్ప కుండా చేసావు. ఆవిడకి ఏ లోటూ లేదు. సంపూర్ణ జీవితం చూసింది. ఇంక ఇంత కన్నా ఏం కావాలి. అన్ని విధాలా అదృష్టవంతురాలు. మన చేతుల్లో ఏం ఉంది. అంతా పైవాడి చేతుల్లో ఉంది. ఇప్పుడు ఆవిడ ఆయుర్దాయం తీరిపోతోంది. ఆవిడ లేదు అన్న లోటు ఒక్కటే కనిపిస్తుంది. నీకు ఓ చక్కటి కోడలు వచ్చింది. బాగా చదువుకుంది. ఢల్లీిలో పెరిగిన పిల్ల. కుటుంబంలో ఇమిడిపోతుంది. తెలివైన పిల్ల.’’ అంటూంటే అక్కడున్న అందరూ సుధీరని చూసారు. సుధీరకి సిగ్గేసింది. వాళ్లంతా తనని అలా పొగుడ్తూంటే తల దించుకుంది. అందరూ అదే మాట. అవే పొగడ్తలు.

సుధీర ఆ పొగడ్తలకి పొంగిపోలేదు. పైగా నీరు కారిపోయింది. ఎవరూ కూడా, అమెరికా వెళ్లిపోతుందనో, ఇక్కడ ఉండదు అని అనకపోవడం నిరాశనిచ్చింది. అంటే తను ఇక్కడ ఉంటుందనే అనుకుంటున్నారా! లేకపోతే ఆ సంగతి ఎవరికీ తెలియదా! పెళ్లి అయ్యాక విక్రాంత్‌ ఉన్న ఊరు వెళ్తుందని తెలీదా! ఇలాంటి మాటలు అని అని తనని మానసికంగా ఇక్కడ ఉండేలా చేద్దామనుకుంటున్నారా!

మామ్మగారు మగతలోకి జారిపోయారు. అందరూ అన్నీ మర్చిపోయి మామూలు కబుర్లలోకి దిగిపోయారు. సుధీరకి ఏం చేయాలో తెలీలేదు. మంచం మీద నుంచి లేచి, గోడకి ఆనుకుని నుంచుంది.

‘‘కూచోమ్మా ఎంత సేపలా నుంచుంటావు. కాళ్లు నొప్పులెడతాయి.’’

అలాగే గోడకి ఆనుకుని కూచుంది. తన మీద తనకే జాలివేసింది. కూచోమని వాళ్లు చెప్పే వరకూ తను ఎందుకు కూచోలేదో, ఎందుకు నుంచుందో ఆమెకే తెలీలేదు. తను ఏం చెయ్యాలో మరొకరు చెప్పే స్థితికి సరెండర్‌ అయిపోయిందా!

తెల్లారుతూండగా విక్రాంత్‌ వెళ్లి డాక్టర్‌ని తీసుకొచ్చాడు. ఆ వెనకే నలుగురు పెద్ద మనుషులు కూడా గదిలోకి వచ్చారు. అందరూ ఒక్కసారి లేచి నుంచున్నారు.

‘‘కాస్త తప్పుకోండి, ఆయన మామ్మ గారిని చూస్తారు.’’ అని అన్నాక అందరూ మంచానికి కాస్త దూరం జరిగారు.

ఆయన స్టెత్‌ పెట్టి చూసారు. నాడి చూసారు. రెప్పలు పైకెత్తి కళ్లు చూసారు.

‘‘పెద్దగా లాభం లేదు. పల్స్‌ అస్సలు అందడం లేదు. నేను చెయ్యాల్సింది ఏం లేదు. ఎవరికైనా కబురు పంపాలంటే పంపండి. ఈరోజు గడవడం కష్టం.’’ అని అందరినీ ఓసారి చూసి తల అడ్డంగా ఊపి, విక్రాంత్‌ని చూసి బయటికి వెళ్లారు. విక్రాంత్‌ కూడా అతని వెనకాలే వెళ్లాడు.

అంతా ఎవరెవరు ఎక్కడెక్కడున్నారో లిస్ట్‌ వేస్తున్నారు. ఫోన్‌ నంబర్లున్న వాళ్లకి ఫోన్‌ చేయడం లాంటిది ఎవరెవరు ఏం చేయాలో నారాయణగారు చెప్తున్నారు.

సుధీరకి ఏం అర్థం అవడం లేదు. ఆమెకి ఏదైనా జరిగితే, తను ఏం చెయ్యాలి. విక్రాంత్‌ అమెరికా వెళ్తాడా, ఇక్కడే ఉంటాడా. విక్రాంత్‌ ఇక్కడే ఉంటే తను ఇక్కడే ఉండాలి. హే భగవాన్‌. ఇలాంటి పరిస్థితి తెచ్చావేంటీ?

బాగా తెల్లవారగానే ఆ వీధిలో వాళ్లు వచ్చారు. మొగవాళ్లు అరుగుల మీద కూచున్నారు. ఆడవాళ్లందరూ మండువా చుట్టూ కూచున్నారు. మధ్య మధ్యలో మామ్మగారెలా ఉన్నారో చెప్పుకుంటున్నారు. ఎవరెవరు ఎలా పోయారో అన్నీ కథలు కథలుగా చెప్పుకుంటున్నారు. మధ్య మధ్య గదిలోకి వెళ్లి మామ్మగారిని చూసి లేటెస్ట్‌ రిపోర్ట్‌లు ఇస్తున్నారు.

‘‘అమ్మా సుధీరా.’’

ఉలిక్కి పడి చూసింది సుధీర. వంటావిడ సుబ్బమ్మగారు పక్కన నుంచుని పిలిచారు.

‘‘ఒక్కసారి పెరట్లోకి రా’’ అంటూ గబగబా ముందుకు నడిచింది.

హమ్మయ్య అక్కడి నుంచి బయట పడినందుకు ఊపిరి పీల్చుకుంది. ఆమె వెనకాలే వెళ్లింది.

ఆమె పెరటి అరుగుమీద ఉన్న పొయ్యి దగ్గర నిలబడిరది.

‘‘అందరికీ కాఫీలూ అదీ ఇవ్వాలి, ఎన్ని చెంచాలు కాఫీ పొడి వెయ్యనూ. మూడు ఫిల్టర్లున్నాయి’’

అయోమయంగా ఆమెను చూసింది. నాకేం తెలుసు. అన్నట్టుగా ఉంది ఆమె చూపులు.

అంతలోనే నర్సాయమ్మ వచ్చింది. ఆమె ఎవరో, ఏం చుట్టరికమో సుధీరకి తెలీదు. కానీ వచ్చినప్పటి నుంచి అటూ ఇటూ తిరుగతూ పనులు చకచకా చేస్తూంటే చూసింది. అందరూ ఆమెని పేరు పెట్టి పిలుస్తూంటే ఆమె పేరు తెలిసింది.

‘‘ఏవిటి సుబ్బమ్మా నువ్వు మరీ చేస్తావ్‌, సుధీర కొత్త కోడలు. అసలు ఆమె వచ్చి ఎన్ని రోజులయింది. పూర్తిగా రెండు రోజులు కూడా కాలేదు. అప్పుడే ఆమెని అడుగుతున్నావేంటీ, నీకేం కావాలో చెప్పు. నన్నడుగు, నేను చెప్తాను. పాపం ఆ అమ్మాయికేం తెలుస్తుంది’’ అంటూ గబగబా రంగంలోకి దూకింది.

పాల డేగిసాని పొయ్యి మీద పెట్టింది. సుధీరకి ఏంచేయాలో అర్థం అయింది.

వచ్చిన వాళ్లకి కాఫీలు ఇవ్వాలి, వెంటనే వంటింటి పక్కన ఉన్న సామాన్లున్న గదిలోకి వెళ్లింది. గ్లాసులు చూసింది. ఓ ఇరవై వరకూ ఉన్నాయి. అవి సరిపోవు. ఇంకా లోపలున్నాయా, లేకపోతే వీటినే వాడి, కడిగి మళ్లీ వాడడమా? అని ఆలోచిస్తూ నుంచుంది.

సుబ్బమ్మ వెనకాలే వచ్చింది ‘‘నేను ఇందాకా మిమ్మల్ని అడిగానని ఏం అనుకోకండమ్మా ఏం చెయ్యాలో అన్నీ మాకు తెలుసు. అన్నీ మేము చూస్తాము. అయితే ప్రతిదీ అమ్మగారికి చెప్పి చెయ్యడం అలవాటు. ఇప్పుడు ఆవిడ అక్కడ ఉన్నారు కాబట్టి ఆవిడ తరవాత మీరే కదా ఈ ఇంటి యజమాని, అందుకని అలవాటుగా మిమ్మల్ని అడిగాను అంతే. ఇంతకుముందు మేము ఈ ఇంట ఎన్నో కార్యాలు చేయించాము. ఎన్నో చూసాము. ఎన్నో చేసాము. ఎంతమంది వచ్చినా మాకు కంగారు లేదు. భయపడం. ఎన్నో ఏళ్లనుంచి ఈ ఇంట్లో పని చేస్తున్నాము. మాకు అలవాటే. ఏం చెయ్యాలో ఎలా చెయ్యాలో అన్నీ మాకు తెలుసు.’’

హమ్మయ్య అనుకుంది సుధీర. కానీ తరవాత ఏం చెయ్యాలో తెలీలేదు. అక్కడ ఉండాలో అక్కర్లేదో తెలీదు. కాఫీలూ అవీ చేసాక అందరికీ తనే ఇస్తానని నర్సాయమ్మ అంది. ఇంక ఇప్పుడేం చెయ్యాలో తెలీలేదు సుధీరకి, అందరూ ఉన్న మామ్మగారి గదిలోకి వెళ్లాలని లేదు. అందుకని పైకెళ్లి గదిలోకి వెళ్తే.. అనుకుంది. ఏంటో తను పిరికిదైపోయింది. ఏం చెయ్యాలో తెలీక అయోమయంలో ఉండి పోతోంది అని అనుకుంది.

‘‘కాఫీ తాగి స్నానం చేసి వచ్చెయ్యండమ్మా. ఏమో ఆ తరవాత ఎలా ఉంటుందో ఏమో.’’

‘‘అవునమ్మా ఆ పని చెయ్యండమ్మా.’’ అంది సుబ్బమ్మ.

మళ్లీ తనేం చెయ్యాలో వీళ్లే చెప్పేస్తున్నారు. మామూలుగా సుధీరకి ఏం చెయ్యాలో ఎవరైనా చెప్తే కోపం. నాకు ఎవరూ చెప్పక్కర్లేదు, ఏం చెయ్యాలో నాకు తెలుసు అని ఇంట్లో తల్లితో అనేది. దెబ్బలాడేది. నిజానికి శని, ఆది వారాల్లో సెలవు రోజుల్లో సుధీరకి తొందరగా స్నానం చేసే అలవాటే లేదు. ఆఫీసు ఉన్నప్పుడు లేటుగా లేచినా ఓ గంటలో అన్ని పనులు కానిచ్చుకుని, బ్రేక్‌ ఫాస్ట్‌ తింటూ తింటూనే వెళ్లిపోతుంది. కానీ ఈ క్షణంలో వాళ్లు చెప్పిందానికి సంతోషించింది. స్నానం చేయడానికి అక్కడినుంచి కదిలింది.

సుధీర లోపలికి వెళ్తూంటే విక్రాంత్‌ ఎదురొచ్చాడు.

‘‘థాంక్యూ సుధీరా. నువ్వు ఇంటి బాధ్యతని స్వీకరిస్తున్నావు.’’

కోపంగా చూసి తల ఎగరేసి అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఏడుపులు వినిపించాయి. సుధీరకి ఒక్కసారి భయంలాంటిది వేసింది. ఎప్పుడూ ఓ చావుని ఇంట్లో చూడలేదు. చచ్చిపోయిన మనిషిని దగ్గరగా చూడలేదు. కొన్ని గంటల క్రితం తనని దగ్గర కూచో పెట్టుకుని తన గాజుల్ని, మూడు పేటల చంద్రహారాల గొలుసునిచ్చిన మనిషి ఇప్పుడు లేరంటే ఎలా నమ్మడం. చేతికి అత్తగారు తొడిగిన గాజుల్ని చూసింది. మెళ్లోని గొలుసుని తడిమింది. ఇంటికి వచ్చిన కొత్తమ్మాయికి ఎంత ఉదారంగా, ఎంత నమ్మకంగా ఇచ్చేసింది. అలాంటి మనిషి కోసం రెండు కన్నీటి బొట్లు రాల్చడం తన విధి కాదా…

కామాక్షిని ఎవరూ పట్టలేకపోయారు.

‘‘ఏడవకు… ఏడ్చీ ఏడ్చీ నీ ఆరోగ్యం పాడుచేసుకోకు’’

అందరూ ఆమెని ఓదారుస్తున్నారు.

‘‘నా పదో ఏట పెళ్లయింది. పదహారో ఏట కాపురానికి వచ్చాను. అప్పటినుంచి నన్ను తన కడుపులో పెట్టుకున్నారు. ఇప్పుడు నన్నిలా వదిలేసి వెళ్లిపోయారు.’’

‘‘ఊరుకో కావుడూ, పోవడం మనచేతుల్లో ఉందా ఏవిటీ. అందరు పోవాల్సిన వాళ్లమే. కాకపోతే కాస్త ముందు వెనకా అంతే.’’

‘‘కావచ్చు. ఈమె అందరి లాంటి అత్తగారు కాదు. నన్ను కూతురులా చూసుకున్నారు. నాతో పరీక్షలు కట్టించారు. రాయించారు. నన్ను ఓ విద్యావంతురాలిని చేసారు. నాకో లక్ష్యాన్ని చూపించారు. ఈ రోజున ఇంత సామాజిక సేవ చేస్తున్నానంటే ఆవిడే కదా కారణం.’’

ఢల్లీిలో ఎంతో మంది అత్తా కోడళ్లని చూసింది. పైకి అందరి ముందు ఎంతో ప్రేమగా ఉంటారు. ఇంటికెళ్లిన తరవాత ఉద్దాలుడు, ఛండిక అవతారాలు ఎత్తుతారు. ఒకే ఇంట్లో ఉన్నా అత్తా కోడలు విడి విడిగా వంటలు చేసుకోడం, ఆ సొసైటీలో అందరికీ తెలుసు. అలాంటిది సుధీర ఆశ్చర్యంగా తన అత్తగారిని చూసింది. పైకి ఎంతో సాధారణంగా, మామూలుగా ఉన్న ఈవిడని ఏం చదువుకోనిచ్చారు. ఈమె ఏం చదివింది? ఏం సామాజిక సేవ చేస్తున్నారు?

సుధీరని ఒకావిడ పిలిచింది ‘‘ఇలారామ్మా.’’

‘‘చీర కట్టుకోవడం వచ్చా?’’

‘‘వచ్చు, కాని పెద్దగా అలవాటు లేదు.’’ సిగ్గుపడుతూ అంది.

‘‘ఫరవాలేదులే. మా పిల్లలు, మనవలు కూడా అంతే. మామూలుగా అయితే ఊరుకుందుము. కానీ నీకు కూడా కొన్ని పద్ధతులు అవీ తెలియాలి కదా. అందుకే అంటున్నాను. ఈ పదకొండు రోజులూ అపసవ్యంగా ఉండాలి. మామూలుగా ఆరు గజాలు కట్టు కుంటాం కదా, కానీ ఇలాంటప్పుడు రోజూ తలస్నానం చెయ్యాలి. ఏడు గజాల చీర కచ్చపోసి కట్టుకోవాలి. నుదుట బొట్టు అదీ లేకుండా. జడ కాకుండా వేలు ముడి వేసుకోవాలి. ఎడమ పమిట కాకుండా కుడి పమిట వేసుకోవాలి. అంటే ఓ విధంగా శోకంలో ఉన్నట్టన్న మాట. ఇవన్నీ నీకిష్టం అయితేనే చెయ్యి. బలవంతం ఏం లేదు. మన ఆచారాలు, వ్యవహారాలు ఓ తరాన్నుంచి మరో తరానికి అందించడం అనేది ఇలా జరుగుతుంది. ఇప్పుడు కూడా చీర కూడా నీకిష్టం అయితేనే, లేకపోతే నీ పంజాబీ డ్రెస్‌ నువ్వు వేసుకో, ఎవరో ఏదో అనుకుంటారన్న ఇది ఏం లేదు. ఎవరూ ఏమీ అనుకోరు.’’

సుధీరకి ఆమె చెప్పినదాన్లో తప్పేం కనిపించ లేదు. నిజమే. కొన్ని వందల ఏళ్ల నుంచి వస్తున్నవి ఈ రోజున కూడా మనం అనుసరిస్తున్నాం అంటే ఎవరో ఒకరు మరొకరికి అందిస్తున్నారనే కదా. ఆ ఎవరో ఈ సుబ్బమ్మ, నర్సమ్మ లాంటి వాళ్లే కదా. వాళ్లు కాకపోతే ఆ ముందు తరాల్లోని అమ్మమ్మలూ వాళ్లే.

(ఇంకా ఉంది)

By editor

Twitter
Instagram