ఆమె మారింది-10

– గంటి భానుమతి

సుధీరకి ఆశ్చర్యంగా ఉంది. తను చాలా మారిపోయింది. ఎప్పుడైనా అమ్మ పండగల గురించి; వ్రతాలు, నోములు గురించి చెప్తూంటే, చీర కట్టుకోమంటే నేను కట్టుకోను నాకు చెప్పకు, నేనేం పాటించను, నాకు చిరాకు. నాకు టైం లేదంటూ విసుక్కునేది. అలాంటిది ఇప్పుడు ఏమాత్రం సంకోచించకుండా అన్నీ వింటోంది. చెప్పింది చేయడానికి సిద్ధమవుతోంది.

‘‘దుర్గని పంపిస్తాను. దానికన్నీ వచ్చు. నీకు ఈ ఏడు గజాల చీర కట్టుకోవడం నేర్పిస్తుంది. ఏదీ ముట్టుకోకు. మైల దానివి. ఆ ప్లాస్టిక్‌ ‌కుర్చీలో కూచో.’’ అంటూ ఆవిడ వెళ్లిపోయింది.

మరో ఐదు నిమిషాలకి గుమ్మం దగ్గర అలికిడి అయితే చూసింది సుధీర. దుర్గ నుంచుని ఉంది. అంతకు ముందురోజు సాయంత్రం పూలమాల కట్టింది. చాలా దగ్గర నుంచి, చాలా సేపు చూసింది కాబట్టి వెంటనే గుర్తు పట్టింది.

‘‘ఇప్పుడు మీకు చీరని కచ్చపోసి కట్టమని నర్సాయమ్మగారు చెప్పి పంపారు’’ అంటూ ఓ చీర చూపించింది.

‘‘ఇది మీ అత్తగారి చీర. పెరట్లో ఆరేసి ఉంటే పట్టుకొచ్చాను.’’ అంటూ ముదురాకుపచ్చ రంగు చీర సుధీరకి చూపించింది.

‘‘మీరు పంజాబీ డ్రెస్‌ ‌వేసుకున్నారు కదా, అడుగు పరికిణి అక్కర్లేదు. జాకెట్‌ ‌కూడా అక్కర్లేదు. అందుకని నేను దీనిమీదే కట్టేస్తాను.’’

అలాగే దానిమీదే దుర్గ చీర కుడి పమిట వేసి కట్టింది.

‘‘అంతా నదీ తీరానికి వెళ్తాం. వస్తారా’’ అని అడిగింది.

‘‘నా పేరు సుధీర. నన్ను అలాగే పేరు పెట్టి పిలు. మీరు అని అనద్దు. మనిద్దరం ఒక వయసు వాళ్లలాగే ఉన్నాం.’’

పెదవులు విడకుండా దుర్గ నవ్వింది.

వెంటనే సరే అని అనలేదు. ఆమె నవ్వుని చూసి నవ్వు కూడా అందంగా ఉంది అనుకుంది.

‘‘నదిలో స్నానం చెయ్యడానికి అభ్యంతరం ఉందంటే, అక్కడ బాత్రూములు, కుళాయిలు కూడా ఉన్నాయి. ఎలా అయినా ఫ•రవాలేదు.’’

‘‘బట్టలు తీసుకెళ్లాలి కదా, నాకు మరో చీర కావాల్సి వస్తుంది.’’

‘‘అదెంత సేపు. నర్సాయమ్మ ఉంటే, కనపడితే ఓ చీర తీసి ఇవ్వమంటాను. మిగిలిన వాళ్లెవరూ ముట్టుకోవడానికి లేదు. మైల కదా.’’

 సుధీరకి ఈ మైల అదీ ఏం తెలీదు. మైల అంటే ఏంటని అడిగితే, ఇంట్లో బీరువాల్లోని బట్టలూ ఏదీ ముట్టుకోకూడదు, ఏం చేయకూడదు పైగా మనకి అన్ని అందించే.. వాళ్లు వంట చేయాలి. పెట్టే వాళ్లు ఎవరూ లేరు. అన్ని మనమే చేసుకోవాలి. ఈ చిన్న ఇళ్లల్లో కుదరదు, అని చెప్పింది. తల్లి ఎప్పుడు ఇలాంటివి పాటించలేదు. తాతగారు పోయినప్పుడు పరీక్షలు, అందుకని వెళ్లలేదు. బామ్మ పోయినప్పుడు కాశీలో చేస్తున్నారు, పిల్లలక్కర్లేదు అంటే వెళ్లలేదు. అందుకే ఈ మైల, దేనిని ముట్టుకోకూడదు అన్న నియమాలు ఏవీ తెలీదు. ఏది కావాలో అది తీసుకోడమే. అన్నీ ముట్టుకోడమే.

‘‘మీకక్కడ చేయడం ఇష్టం లేకపోతే, ఏం ఫ•రవాలేదండి, ఇంటికొచ్చాక స్నానం చేయచ్చు. అక్కడ ఆ నది నీళ్లు నెత్తిన చల్లుకుంటే సరిపోతుంది.’’ ఆమె మౌనం చూసి అంది. సమయానికి తగ్గట్లుగా ఎక్కడికక్కడ ఎమెండ్‌మెంట్స్ ‌చేసుకున్నారు. తను అనుకున్నంతగా, ఊహించుకున్నట్లుగా లేరు. తనకి అనుకూలంగా మసలుకుంటున్నారు. ఎవరూ బలవంతంగా తన నెత్తిన రుద్దడం లేదు. నీకిష్టం అయితేనే, అని అంటున్నారు. ఎంతో మర్యాదగా ప్రవర్తిస్తున్నారు. తను కూడా వీళ్లలో కలిసి పోతున్నట్టుగా అనిపిస్తోంది.

 చీర కట్టుకుని అందరూ ఉన్న దగ్గరికి వచ్చేసరికి కార్యక్రమాలు మొదలయ్యాయి. అప్పటికే అక్కడ చాలా మంది ఆడవాళ్లు కబుర్లు చెప్పుకుంటున్నారు. ఒకళ్ల తరవాత ఒకళ్లు, అందరూ తలలు తిప్పి సుధీర కేసి చూసారు. ఆకుపచ్చ చీరలో తెల్లగా మెరిసిపోతున్న సుధీరని చూసి కొత్త కోడలు బొమ్మలా ఉంది. ఢిల్లీ అమ్మాయి అయినా ఈ ఇంటి వాళ్లలో కలిసిపోయింది.

 సుధీర వాళ్ల పక్కన కూచుంది. ఆమెకి అంతా ఆశ్చర్యంగా ఉంది. అసలు కల్లో కూడా అనుకోలేదు. ఇలా ఓ పల్లెటూరు కొచ్చి, వాళ్ల ఇంటికొచ్చిన తెలియని వాళ్ల మధ్య కూచుంటుందని. తెలియని ఊరు. తెలియని వాతావరణం, తెలియని మనుషులు. అయినా వచ్చింది. పెళ్లి అంటే ఇదేనా. జీవితాంతం వీళ్లతో, వీళ్ల దగ్గర ఉండడానికి తయారయింది. ఇదేనా పెళ్లికి అర్థం. పెళ్లితో వచ్చే బంధం. కుటుంబం పరిధిని పెంచుకోడం అంటే ఇలాగేనా!

 అంతలో దుర్గ వచ్చి, భుజం మీద తట్టి రమ్మన్నట్లు తల ఊపింది. ఆమె వెనకాలే పెరటి తలుపు తోసుకుని పక్కవాళ్లింటికి తీసుకెళ్లింది.

 ‘‘ఇది మీ పినమామగారిల్లు. వంటవాళ్లు ఉప్మా చేసి ఇక్కడికి పట్టుకొచ్చారు. ఒక్కొక్కొళ్లు వచ్చి తినేసి వెళ్తే మంచిది. అందరూ షుగరు వాళ్లు, బీపీ వాళ్లు. మందు వేసుకోవాలి కాబట్టి, ఏదో కాస్త తింటారు. ముందు మీరు తినేయండి.’’ అంటూ ఓ అరిటి ఆకులో ఉప్మా పెట్టింది. మొహమాట పడకుండా ఉప్మా తినేసింది. ఎలా వచ్చారో అలాగే వెనక వైపు నుంచి వెళ్లారు.

‘‘ఇలా రా’’ అంటూ ఎవరో పిలిస్తే అటువైపు వెళ్లింది.

‘‘ఇలా మా దగ్గర కూచో. మేము ఎవరమో నీకు తెలీదు. నీ పెళ్లికి వచ్చాం కానీ అది హడావుడి పెళ్లి. మమ్మల్ని సరిగ్గా చూసి ఉండకపోవచ్చు. మేమిద్దరం నీకు పినత్తగార్లం. మీ అత్తగారు పెద్ద, నేను రెండు, ఈ సీత మూడోది. మేం ముగ్గురం అక్కాచెల్లెళ్లం. పక్క ఊళ్లో ఉంటున్నాం.’’

అంతలోనే దుర్గ వచ్చింది.

‘‘పిన్ని మీరంతా పక్కింటికెళ్లి కాస్త తిని రండి. మూడూ, నాలుగు వరకూ బోయినాలు, బొట్లూ ఏం ఉండవు.’’

అంతా మందుల డబ్బాలతో అక్కడికి తినడానికి వెళ్లారు.

తరవాత అందరూ వంతుల వారీగా పెరట్లోకి వెళ్లడం, రావడం జరిగింది.

 మధ్యాహ్నం అవుతూండగా నదీ తీరానికి అందరూ వెళ్తూంటే సుధీర కూడా వెళ్లింది. నదీ తీరం దూరమే. మరీ నడవ లేని వాళ్లకోసం కార్లు కూడా ఉన్నాయి. అయితే చాలా మంది నడుస్తూంటే ఆమె కూడా నడవడానికే తయారయింది. ఊరు చూసేందుకు వచ్చిన అవకాశం ఇది అని అనుకుంది. నది దగ్గరికి వెళ్లడానికి వచ్చిన అవకాశం అని అనుకుంది. తనకి వచ్చిన అనుమానాలని భర్తకి చెప్పాలనుకున్నా విక్రాంత్‌ ఎక్కడా కనిపించలేదు. ఆడవాళ్లు చిన్న చిన్న గ్రూపులుగా నడస్తూ కబుర్లు చెప్పుకుంటున్నారు. ఆగిపోయిన పెళ్లిళ్ల గురించి, తప్పిపోయిన పెళ్లిళ్ల గురించి, సినిమాలు, సీరియల్స్, ‌పోయినవాళ్ల గురించి, పోవడానికి సిద్ధంగా ఉన్న వాళ్ల గురించి ఎన్నో విషయాల మీద మాటలు నడుస్తున్నాయి.

 కాస్సేపు వాళ్ల మాటలు వింది కానీ అవి పెద్ద ఇంట్రెస్టింగ్‌గా అనిపించలేదు. అలా అని నిశ్శబ్ధంగా ఉండలేకపోయింది. సుధీర తన పక్కన ఉన్న దుర్గతో మాటలు కలిపింది.

‘‘దుర్గా, మీ పిల్లలేం చదువుతున్నారు?’’ ఏదో మాట్లాడాలని మాట్లాడింది.

‘‘పెద్దవాడు పదో క్లాసుకి వచ్చాడు, రెండోవాడు ఆరో క్లాసు.’’

ఆశ్చర్యపోయింది. పదో క్లాసా! ఆమెని మరోసారి చూసింది. సుధీర మనసులో లెక్క వేసుకుంటోంది. పదో క్లాసంటే పిల్లాడికి పదహారు పదిహేడేళ్లైనా ఉంటాయి. ఆమెని చూసి ఆశ్చర్యపోయింది.

‘‘నువ్వు చూస్తే చిన్నగా కనిపిస్తున్నావు, అప్పుడే నీకింత పెద్ద కొడుకులున్నారా…’’

 ‘‘వీళ్లు నా పిల్లు కారు. నా భర్త పిల్లలు. నా భర్త మొదటి భార్య పోయింది. భార్య లేకపోతే ఏ కార్యాలు చెయ్యడానికి, ఏ పూజలు చేయడానికి పనికి రారు. అందుకని తప్పనిసరిగా పెళ్లి చేసుకోవసి వచ్చింది.’’

‘‘నీ ఇష్టం మీదే జరిగిందా?’’

 ‘‘ఇలాంటి పెళ్లిళ్లు మనస్ఫూర్తిగా ఇష్టపడి జరగవు. ఇది అంతే. నా పెళ్లికి నాకు పదిహేనేళ్లు. పెళ్లి అంటే ఏంటో తెలీని వయసు. దానికి కారణం నా పుట్టుక. ప్రేమించానని, పెళ్లి చేసుకుంటానని మా అమ్మని ఓ పెద్ద మనిషి, ఓ విధంగా రాజకీయ నాయకుడు వాళ్ల ఊరు తీసుకెళ్లాడు. గుళ్లో పెళ్లి చేసుకున్నాడు. నేను పుట్టాను. ఆ తర్వాత మా అమ్మకి తెలిసింది, అతనికి అప్పటికే పెళ్లయిందని, మా అమ్మ వెంటనే నన్ను తీసుకుని వెళ్లిపోయింది. మా నాన్న ప్రతీవారం నా కోసం వచ్చేవాడు. అతనికి నేనంటే చాలా ఇష్టం. తన ఒళ్లో కూచోపెట్టుకునేవాడు. కథలు చెప్పేవాడు. ఏవో పూసలదండలూ, గౌనులు అవీ తెచ్చేవాడు. మా అమ్మ వాటిని పారేసేది, అతనిని తిట్టేది. కానీ నాకు మా నాన్న అంటే ఇష్టం. అమ్మకి కోపం. అతనిని రావద్దనేది. కానీ నా కోసం వచ్చేవాడు.’’

‘‘మీ నాన్న ఇంటికి ఎప్పుడైనా వెళ్లావా, అతని మొదటి భార్య, అదే మీ నాన్న మొదటి భార్యనీ, పిల్లలని నువ్వు ఎప్పుడైనా చూసావా!’’

‘‘లేదు. ఎప్పుడూ నన్ను తీసుకెళ్లలేదు. చిన్నగా ఉన్నప్పుడు నేను వెళ్లలేదు. నా అంతట నేను వెళ్లగలిగే వయసు వచ్చాక ఆ ఇంటి వరకు వెళ్లాను, లోపలికి వెళ్లలేదు. అది అమ్మకి తెలిసింది, మరోసారి వెళ్తే చస్తానని అంది. ఆ విషయాన్ని నేను సీరియస్‌గా తీసుకోలేదు. కానీ వెళ్లాను. అప్పుడు కూడా గేటు వరకే. అలా వెళ్లినందుకు చెప్పిన మాట వినలేదని, అమ్మ ఆత్మహత్య చేసుకుంది. అనాథను అయి పోయాను. నన్ను చూసే వాళ్లు లేకపోయారు. అప్పుడు నాన్న వచ్చి మొదటిసారి వాళ్లింటికి తీసుకెళ్లాడు. అప్పటికి నాకు పద్నాలుగేళ్లు. ఆ ఇంట్లో నా వయసు వాళ్లు ఓ నలుగురు పిల్లలున్నారు. వాళ్లు నన్ను చాలా అవమానపరిచే వారు. అమ్మ ఉన్నప్పుడు అప్పుడప్పుడు ఏడ్చాను. అమ్మ పోయాక రోజూ ఏడ్చాను. వాళ్లింట్లో నా మూలంగా గొడవలు ఎక్కువవడంతో వెతికి ఇతనికిచ్చి పెళ్లి చేసారు.’’

‘‘అప్పుడు నీకు చెప్పలేదా పెళ్లికొడుకు సంగతి’’

‘‘ఆ ఇంట్లోని ఆడవాళ్లు నన్ను కూచోపెట్టి చెప్పారు, నువ్వు ఓ లేచిపోయినదాని కూతురివి, నీకు సమా జంలో ఏమాత్రం గౌరవం ఉండదు.’’ అంటూంటే దుర్గ గొంతు పూడుకుపోయింది. ఆగిపోయింది. ఆమె కళ్లు నీటితో మెరవడం సుధీర కనిపెట్టింది.

సుధీర ఎప్పుడూ ఇలాంటి జీవితం అనుభవించిన మనిషిని, ఇంత దగ్గరగా, ఎదురుగా చూళ్లేదు. సినిమాల్లో మాత్రమే చూసింది.

దుర్గ తన గొంతు సవరించుకుని తిరిగి చెప్పడం మొదలెట్టింది.

‘‘పెద్దగా చదువు లేనిదానివి, నీకు పెళ్లి అవడం కష్టం. మీ కులంలో అతనే స్వయంగా వచ్చి అడిగాడు. కాకపోతే కాస్త పెద్ద. వయసు ముప్ఫై నాలుగు. పెళ్లాం పోయింది. ఇద్దరు పిల్లలున్నారు. వృత్తి పౌరోహిత్యం. పెద్దగా రాబడి అదీ లేదు. పురోహితుడిని చేసుకోడా నికి ఆడపిల్లలు ఎవరూ ముందుకి రావడం లేదు. అందుకని ఇంత దూరం వచ్చాడు. వెంటనే చేసుకోనని అన్నాను. చదువుకుంటానని అన్నాను. ఏడ్చాను. నా ఏడుపులు అక్కడ ఎవర్నీ కదిలించ లేదు. ఓ రోజు పొద్దున్నే నన్ను పెళ్లిచేసుకుంటానన్న మనిషి వచ్చాడు. నన్ను ఈ ఊరు తీసుకొచ్చి, ఈ ఇంట్లో దిగపెట్టాడు. అప్పటికే వినోదక్క పెళ్లి అయిపోయింది. వినీలక్క నాకు తోడుగా ఉండి కొంచెం చదువు చెప్పింది. మరో పదిరోజులకి మామ్మగారే దగ్గరుండి నాకు పెళ్లి చేయించారు. నన్ను వాళ్లల్లో కలుపుకున్నారు. ఈ ఇల్లు నా ఇల్లు. నేను పుట్టినప్పుడు నేనొక్కదాన్నే. ఇప్పుడు మాత్రం ఈ ఇంట్లో వాళ్లందరూ నా వాళ్లు. ఈ సమాజంలో నాకు ఓ గౌరవమైన స్థానం ఇచ్చారు.’’

 సుధీరకి చాలా ఆశ్చర్యం వేసింది. జరిగినది సామాన్యమైన విషయం కాదు. కాని ఎంతో సామాన్య మైన విషయంలా చెప్పింది. ఆ ఇద్దరు పిల్లలు ఈమెని అమ్మగా అంగీకరించారా. లేకపోతే సినిమాల్లో చూపించినట్లుగా అవమాన పరుస్తున్నారా, తరవాత ఈమెకి పిల్లలు ఎందుకు పుట్టలేదు. ఇంకా ఎన్నో అడగాలని ఉన్నా సమయం కాదని ఊరుకుంది..

 మామ్మగారి అంత్యక్రియలు పూర్తయ్యాయి. ఆమె ఆత్మని వైతరిణి దాటించారు. స్వర్గానికి దారి చూపే మంత్రాలు ఉచ్చరించారు. ఇంటికొచ్చాక సుధీర మళ్లీ అత్తగారి చీర కట్టింది. ఈసారి కట్టడంలో మళ్లీ దుర్గ సాయం చేసింది. బట్టలు మార్చుకుని అందరూ ఉన్న చోటుకి వచ్చేసరికి, ఇల్లంతా కడిగేస్తున్నారు. వంటిల్లు, పెరటి అరుగులూ పొయ్యిలు అన్నీ కడిగేసారు.

సీతమ్మ సుధీర దగ్గరికి వచ్చి, ఓ సారి ఇలా వస్తారా అని పిలిచింది. సుధీర కాస్త భయంగానే ఆమె వెనకాల వెళ్లింది. పెరటి అరుగుల పక్కనే ఓ పెద్ద సావిడి ఉంది. నిజానికి ఆమె పరీక్షగా ఆ ఇంటిని చూడలేదు. ఆరోజు ఉదయం నుంచి ఇల్లంతా కొత్తగా చూడనివి ఎన్నో చూస్తోంది. అందులో ఈ సావిడి ఒకటి. అక్కడ అప్పటికే ఇద్దరు వంట వాళ్లున్నారు. కత్తిపీటలు, పెద్ద పెద్ద గిన్నెలు, పరిచీ ఉన్నాయి. గోడకి దగ్గరగా పొడుగ్గా ఉన్న పొయ్యిలో కొబ్బరిమట్టలు, డొక్కలు, డొలకలు వేస్తున్నారు. కూరలూ, అరిటాకులూ, అరిటికాయలూ, చిన్న, చిన్న సూర్య గుమ్మడిపళ్లూ, చింతకాయలూ, కంద దుంపలూ ఇంకా చాలా కూరగాయలున్నాయి.

‘‘ ఏం వండమంటారు?’’

సుధీర తెల్లబోయింది. తనకేం తెలుసు, ఏం వండాలో, ఏం వండించాలో…అదే మాట సీతమ్మతో అంది.

‘‘అది నిజమే. కానీ కామాక్షమ్మ గారు ఇంకా ఇంటికి రాలేదు. ఒకవేళ ఆవిడ వచ్చినా ఈరోజున ఇలాంటి వాటిల్లో కలగచేసుకోకూడదు కదా. ఆవిడ తరవాత మీరే కదా, అందుకని, ఓ మాట మీకు చెప్దామని..’’

హైయ్యరార్కీ, కానీ తను రాంగ్‌ ‌పర్సన్‌.

అం‌తలోనే దుర్గ వచ్చింది.

‘‘సీతమ్మగారూ ఆవిడ కొత్త, ఆవిడ కేం తెలుస్తాయి ఈ వంటలూ అవీ. అయినా మీకు ఇది మొదటిసారి కాదు, ఏం చేయాలో, ఏం వండాలో అన్నీ మీకు తెలుసు. మీరు చేసెయండి.’’ అని ఆమె అనగానే సుధీర అక్కడి నుంచి వచ్చేసింది.

తను ఈ ఇంటికి కొత్త కానీ, వీళ్లకి ఈ ఇల్లు కొత్త కాదు. అందుకే ఏ విధమైన కన్ఫ్యూజన్‌ ‌లేకుండా ఏం చేయాలో వీళ్లకి బాగా తెలుసు. ఆ ఇల్లు ఓ వంద ఏళ్లనాటిది. పడిపోయిన గోడలు మళ్లీలేచాయి. పెంకులు మార్చారు. అడపా దడపా రిపేర్లు కూడా చేయించారు. ఆ ఇంటి గోడలకి అన్నీ తెలుసు. ఆ గోడల మధ్య ఆ ముసలమ్మ ఓ డెబ్భై ఏళ్లు నడిచారు. ఆ గోడల మధ్య ఎన్నో జరిగాయి. కాని ఏం జరగనట్లే ఉంటాయి. ఎన్నింటికో నిశ్శబ్ద సాక్షులు. ఆ ఇంట్లో, ఆ కుటుంబంలో తరతరాలుగా వస్తున్న ఆచార వ్యవహారాలని, సాంప్రదాయాలని ఈ తరానికి అందించింది.

ఓ నాలుగు రోజులు గడిచిపోయాయి. వచ్చిన చుట్టాలలో చాలా మంది వెళ్లిపోయారు. కొంత మంది ఉండిపోయారు. మళ్లీ పదో రోజుకి వస్తామన్నారు.

సుధీరకి తమ సొసైటీలోని ఘటన గుర్తుకొచ్చింది. సీ బ్లాక్‌ ‌నాలుగు వందల మూడులో ఉండే ధరణీధర్‌సింగ్‌ ‌తోమర్‌ ఓ ‌రాత్రి పోతే ఎవరికీ తెలీలేదు. మర్నాడు తెల్లారే వరకూ ఆయన భార్య ఒక్కత్తి ఆ శవంతో జాగారం చేసింది.

బాగా తెల్లారాక ఘాజియాబాద్‌ ‌నుంచి ఓ పది మంది వచ్చారు. సొసైటీ వాళ్లు అన్ని విధాలా సాయం చేసారు. ఓ అంబులెన్స్‌లో తీసుకెళ్లిపోయారు. వాళ్ల వాళ్లు అందరూ జోధ్‌పూర్‌, ‌సవాయ్‌ ‌మాధవ్‌పూర్‌లో, బియావర్‌లో ఉంటున్నారుట. వెంటనే ఎవరూ రాలేదు. తరవాత చౌతాకి అందరూ వచ్చారు. ఆ మర్నాడే అంతా వెళ్లిపోయారు. మళ్లీ ఆమె ఒక్కత్తి మిగిలిపోయింది. కాని ఇక్కడ మామ్మగారు పోతే సాగనంపడానికి ఊరు ఊరంతా తరలి వచ్చింది. ఇదేనా కుటుంబ పరిధిని పెంచుకోడం అంటే?

(ఇంకా ఉంది)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Twitter
Instagram